
సమాజంలో ఏ ఇద్దరి ఆలోచనలూ ఒకేలా ఉండనక్కరలేదు. భిన్నాభిప్రాయాలు ఉండటం, విభేదించడం మానవ సహజం. ఒకప్పుడు భారతదేశపు శాస్త్రసంవాదాల్లో తమ సాటివారితో విభేదించే ముందు, వారి వాదనలో తాము అంగీకరిస్తున్న విషయాలతోనే మొదలుపెట్టేవారు. ఎక్కడ అంగీకారం ఉందో, ఎక్కడనుంచి లేదో స్పష్టంగా చెప్పేవారు. ఇరువురి దృష్టి భిన్నమైనా, వారి అంతిమ ఉద్దేశ్యం ఒక్కటే — సత్యాన్వేషణ, ఈ ప్రపంచాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడం. అప్పటి ఆ చర్చల్లో అద్భుతమైన హుందాతనం ఉండేది.
కానీ నేటి సమాజంలో క్రమంగా ఆ సంస్కారం కనుమరుగవుతున్న జాడలు కనిపిస్తున్నాయి. సనాతనుడా? ఆధునికుడా?; మూమిన్నా? కాఫీరా?; ఆస్తికుడా? నాస్తికుడా?; సంప్రదాయవాదియా? సెక్యులర్వాదియా?; కన్జర్వేటివా? లిబరలా?; లెఫ్టా? రైటా? అంటూ మొత్తం ప్రపంచాన్ని స్వపక్షం, పరపక్షం అనే రెండు ప్రపంచాలుగా విడదీసి చూసే ద్వంద్వ ప్రవృత్తి పెరిగిపోయింది. స్వపక్షపు అభిప్రాయం మాత్రమే సంపూర్ణ సత్యమనే పిడివాదం ఎప్పుడైతే ప్రబలుతుందో, అప్పుడే ఎదుటివారి పట్ల గౌరవం నశిస్తుంది. అక్కడ ఇక ఆరోగ్యకరమైన చర్చలు ఉండవు, కేవలం దూషణలే మిగులుతాయి. దురదృష్టవశాత్తూ, నేటి సామాజిక ముఖచిత్రం ఇదే. రాజకీయ నాయకులు — అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా — సమాజ శ్రేయస్సు, దేశపాలన తమ సమిష్టి బాధ్యత అన్న కనీస స్పృహను కోల్పోతున్నారు. మీసాలు తిప్పుతూ, తొడలు కొడుతూ ఒకరినొకరు కించపరచుకునే స్థాయికి భాష దిగజారిపోయింది. ఇక సినిమాల విషయానికొస్తే, విలువల పతనాన్ని విమర్శిస్తూనే, ఆ చౌకబారు వినోదాన్నే అపురూపమైనదిగా ఆరాధించేంత దారుణంగా మన ప్రమాణాలు దిగజారిపోయాయి. ఈ రాజకీయనాయకుల అనుయాయులు, సినీకథానాయకుల అభిమానులు కోట్లాదిగా ఉన్నారు. వారి నాయకులే స్ఫూర్తిగా సోషల్మీడియాలో ఈ నిర్భృత సైనికులంతా (unpaid soldiers) ఇదే రకమైన స్వపక్ష, పరపక్ష సందేశాలతో నిత్యం విద్వేషాగ్నిని మరింత రాజేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నదే.
రాజకీయ నాయకులనూ, సినిమాలనూ ఏదో ఒక రకంగా క్షమించేద్దాం. వారికి భాషకున్న శక్తి, పదును తెలియవు అని సరిపెట్టుకుని మన దారిన మనం పోవచ్చు. కానీ, భాషే ప్రాణంగా, ఆయుధంగా బతికే కవులు, రచయితలు సైతం ఇదే స్థాయికి దిగజారి, ఒకరినొకరు దూషించుకోవడం తీవ్రంగా కలచివేసే అంశం. సృజనకారుల దారులు వేరైనా వారి గమ్యం ఒకటే కదా! ఆ ఎరుక వారిలో ఎందుకు కరువవుతోంది? సమాజంలో చర్చలు ఎలా జరగాలో, భిన్నాభిప్రాయాలను ఎంత సంస్కారవంతంగా గౌరవించాలో నేర్పాల్సిన ప్రాథమిక బాధ్యత సాహిత్యం, ఇతర కళలదే. సద్విమర్శకు మారుగా వ్యక్తిగత దూషణలకు దిగడం ఆలోచనారాహిత్యానికీ, అజ్ఞానానికీ నిదర్శనం. ఎదుటివారిని నిందిస్తూ, వారి స్థాయిని తగ్గించి ఆనందపడే ఉడుకుమోతుతనంనుంచి, దౌర్జన్యపూరితమైన ఆలోచనాధోరణినుంచి సాహిత్యలోకం బయటపడాలి.
భిన్నాభిప్రాయాలను ద్వేషంగా కాకుండా, కొత్త ఆలోచనలకు పునాదిగా మార్చుకున్ననాడే ఏ సాహిత్యానికైనా సార్థకత. ఆ దిశగా సహేతుకమైన, సంస్కారవంతమైన చర్చలకు మన వేదికలు, పత్రికలు ప్రాణం పోయాలని ఆశిస్తూ…