తెలుగు లేఖా సాహిత్యం సమృద్ధమూ, సంపన్నమూ అయినా ఈ విలక్షణ సాహిత్య ప్రక్రియ మీద ఇంతవరకూ రెండు పిహెచ్.డి. పరిశోధనలూ అచ్చయినా, ఎన్నో వ్యాసాలు వెలువడ్డా, కందుకూరి, గురజాడ, వేటూరి, రాళ్ళపల్లి, చలం, మధునాపంతుల, కవికోకిల దువ్వూరి, ఆర్. ఎస్. సుదర్శనం, కె. వి. ఆర్., రా. రా. మొదలైన మహనీయుల లేఖల్ని లోతుగా పరిశీలించి, వాటి వివిధ ముఖాల్ని అవలోకించి లోనారసి రాసిన విమర్శకులు తక్కువే అని చెప్పాలి. మేధావులైన ఆంధ్రరత్న దుగ్గిరాల, కట్టమంచి, నార్లగార్ల లేఖలు అమితంగా ఇంగ్లీషులోనే తొంగిచూసినందువల్ల, వీటివైపు మన తెలుగు విద్వాంసుల కడగంటి చూపు పడినా కడుపావనమే అయి ఉండేది. ప్చ్!
‘గాలి నాసరరెడ్డికి లేఖలు’ పుస్తకంలో 56మంది కవులు, పండితులు, కవితాప్రియులు రాసిన 84 ఉత్తరాలు సంకలింపబడ్డాయి. గాలి నాసరరెడ్డికి లేఖలు రాసిన వాళ్ళల్లో పెద్దలూ–పిన్నలూ, సుపరిచితులూ–అపరిచితులూ ఉన్నారు. ఇంగ్లీషులోనూ, హిందీలోనూ ఉత్తరాలు రాసిన ఒడియా, గుజరాతీ, హిందీ కవులూ కనపడతారు. మధురకవి గాలి నాసరరెడ్డికి ఉత్తరాలు రాసిన వారిలో నగర, మహానగర జీవులు మాత్రమే కాదు మారుమూల పల్లెల్లో ఊపిరి పీలుస్తున్న సన్నజీవాలు కూడా పాఠకులకు తారసపడతారు. మొత్తం మీద ఈ లేఖా సంకలనంలోని బడాబాబుల పొడి మాటలూ, సన్నజీవాల తడి తలపులూ పాఠకుల హృదయాల్ని కదిలిస్తాయి; కొండొకచో కలవరపరుస్తాయి కూడా.
పాతిక ముప్పై ఏళ్ళ తర్వాత విశిష్ట కథారచయితగా ప్రసిద్ధులైన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి — ఉదయోన్ముఖ రచయిత –- మాటలు వినండి, గుండెల్ని ఎలా తాకుతాయో!
‘‘మజీద్, నేను, ఇస్మాయిల్… యీ మారుమూల గ్రామంలో, పత్రికలు సరిగ్గా చేరలేని ప్రాంతంలో మీ కవితల్ని పట్టుకొని, మిమ్మల్ని ఆవాహన చేసికొని చర్చల్లోకి దింపుతుంటాం. మీరూ మాలో ఒకరుగా – మేము దర్శించని, మీ మేధాసంపత్తికి అందిన ఎన్నో నూతన విషయాలు చెబుతుంటారు. మాకు జీర్ణం కాని ముక్కల మీద మా చర్చలే నిఘంటువులుగా మిమ్మల్ని దర్శించుకుంటాము. మీరు కవితల్లోనే కాకుండా స్వహస్తాక్షరాల ఉత్తరాల నెక్కి, మమ్మల్ని దర్శించినపుడు ఎన్నెన్నో భవిష్యత్కాలలకు సరిపడా విజ్ఞానాన్ని చేదుకుంటాము.’’ (పేజి:16)
ఈ మాటల్లో మొగ్గలు తొడుగుతున్న ఈ ముగ్గురి పాఠకుల జిజ్ఞాస, కవితా పిపాస, రచయిత పట్ల ఆరాధనాభావం వ్యక్తమవుతాయి.
‘ఆంధ్రభూమి’ దినపత్రికలో ఉపసంపాదకుడిగా పని చేస్తూ, సాహిత్యవేదిక శీర్షికను పర్యవేక్షించే నాసరరెడ్డిగారిని అప్పుడప్పుడే ఉదయిస్తున్న కవి సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఇలా ప్రశ్నిస్తున్నారు —
‘‘నేనో ప్రశ్న అడుగుతానండీ నాసరరెడ్డిగారూ! నాకన్పిస్తోంది, ఈనాటి కవితల్లో ముఖ్యంగా నూతన రచయితల్లో అస్పష్టత అధికంగా వుంది. ఎందుకంటారు? అలాంటి కవితల్ని పత్రికలు ప్రోత్సహిస్తున్నాయా? సూటిగా చెబితే అది కవిత కాదా? సూటిగా వినిపించే శబ్దాన్ని రెండు గంతులు వేయించి, మెదడుకు పదును పెడితేనేగాని అర్థంగాని స్థితికి దాని స్వరూపాన్ని మార్చి, అర్థమైన తర్వాత బావుందనే బహుమతిని కొట్టేయటం సబబే కాని మరీ — ఒక విషయం చెబుతో కప్పలా మరో విషయంలోకి గెంతి, రెండు విషయాలకు సంధానత లోపించేట్లు చేయటం బావుంటుందా చెప్పండి? ఈనాటి కవితల్లో చాలావరకు అలాగే వ్రాస్తున్నారు మరి. చాలావరకు పత్రికల పోకడ చూస్తే అస్పష్టంగా వ్రాస్తేనే ప్రింటయ్యేటట్లు వున్నాయేమో అన్పిస్తోంది.’’ (పేజి:17)
ముప్పయి ఐదేళ్ళ కిందట (7-10-89) పైలా పచ్చీసులోని ఓ పల్లీయ పాఠకుడైన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఓ పాత్రికేయుని నిగ్గుదీసే దొమ్మబలం ఈనాటి పత్రికలకు కవితలు, కథలు, వ్యాసాలు వగైరా ఏవైనా రాసే రచయితలు పాత్రికేయుల్ని ఇలా నిలదీసి అడిగే సాహసం చేస్తారా? ఒకవేళ అలా చేస్తే, మరి వాళ్ళ రచనలు వెలుగు చూడగలవా? కాని అ నిఖార్సయిన బడుగు బడిపండితుడే తెలుగు కథాసాహిత్యంలో వేళ్ళూనుకొని, విదేశాల దాకా వ్యాపించగలిగాడంటే అచ్చెరువు కలగదూ మరి!
మంచి కవిత్వాన్ని ప్రేమించే, మంచి మనుషుల్ని మరింతగా ప్రేమించే త్రిపురనేని శ్రీనివాస్ గాలి నాసరరెడ్డిని ఇంకెంతగానో ప్రేమిస్తాడు. అతని కవిత్వం అంటే ఎంతో ఇష్టపడే, ప్రేమించే త్రిశ్రీ ‘‘నీ ఉత్తరం కోసం ఎదురుచూడటం లేదు. నీ కోసమే ఎదురుచూస్తుంటాను,’’ (పేజి: 25) అన్న మాటలు ఎవరికైనా ‘మనసున మల్లెల మాల’లూగిస్తాయి. త్రిపురనేని శ్రీనివాస్ కవిత్వం పట్ల పిచ్చి ప్రేమ, ఇతరకవుల మంచి కవిత్వాన్ని విశాల పాఠకప్రపంచానికి పరిచయం చేయాలనే తహతహ ఎవరి గుండెలనైనా తడుతుంది, పులకరింప చేస్తుంది.
ఉత్తరం రాసిన వ్యక్తికి, అందుకున్న మనిషికి పరమానందం కలిగించే ఇలాంటి లేఖా స్నేహపరిమళం పాఠకుల్ని ఎంతగానో అలరింపచేస్తుంది; గుండెకు హత్తుకుపోతుంది.
గాలి నాసరరెడ్డి కవితలు చదివి పులకించి, అతని ప్రేమాదరాలకు సన్నిహితం కావాలని కుర్రకారు తపించేది. నాసరరెడ్డి ’19 కవితలు’ అందుకొన్న డిగ్రీ పట్టాదారు షేక్ అమీనుద్దీన్ 20-7-94 నాడు రాసిన లేఖలోని ఈ పులకరింత గమనించండి –
‘‘మీ దగ్గర్నుంచి రిప్లయ్ రాగానే సంతోషంతో మీకు వెంటనే రిప్లయ్ వ్రాసాను. నాకెంతో ఆప్తంగా కవిత్వ లక్ష్యాన్నీ పరిమితుల్నీ పసిపిల్లాడిని ఒడిలో కూర్చోబెట్టుకొని తల నిమురుతూ చెప్పినట్లు లాలనగా తెలిపారు. అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. ’19 కవితలు’లో ఏ కవిత నాకు నచ్చిందో తెలపాలంటే మరో కవితని చిన్నదిగా చేసినట్టు అవుతుంది. పిల్లకాకినైన నన్ను ‘శ్రీ’ అని మీ అంతటివారు సంబోధించడం… నన్ను అమీన్ అని పిలవండి చాలు.’’(పేజి:50)
ఈ మాటల్లో షేక్ అమీనుద్దీన్ ఆనందానుభూతి, వినమ్రత, కృతజ్ఞతాభారం వెల్లడవుతాయి. అంతేకాదు; అతనికి లేఖ రాసిన నాసరరెడ్డి సాహిత్యప్రీతీ, ఆప్యాయతా, యువ సాహిత్యప్రియుల్ని అధ్యయనం, ఆస్వాదన, అనుశీలనల వైపు మళ్ళించడమనే సుగుణమూ, మహద్గుణమూ కనువిందు కలిగిస్తాయి.
‘‘అయినా, మనసులోని ఆలోచనల్ని స్వేచ్ఛగా వ్రాయడానికి మీరు అనుమతిస్తారనే ఆశతో వ్రాసాను,’’ (పేజి: 5) అంటూ బిక్కుబిక్కుమంటూ షేక్ అమీనుద్దీన్ రాసిన ఈ మాటల్లో అతని స్వేచ్ఛాకాంక్ష వ్యక్తమవుతుంది. అలాగే అతనితో మనస్సు విప్పి మాట్లాడిన మర్యాదాపురుషోత్తముడైన గాలి నాసరరెడ్డి ప్రేమాస్పద వ్యక్తిత్వమూ కళ్ళముందు నిలుస్తుంది.
గాలి నాసరరెడ్డి కవిత్వ పాఠకమిత్రుల్లో, కలం స్నేహితుల్లో ఎన్నదగిన మనస్వి ఎం. ఎస్. నాయుడు. నిరుద్యోగం, వైఫల్యం, విషాదం, గూడుకట్టుకొన్న నిరాశ, నిస్పృహ, ఒంటరితనం చుట్టూ ఆవరించి నిర్వేదంలో దిక్కుతోచని బాటసారిగా సానుభూతిని, సాంత్వనను అపేక్షించని వ్యక్తిగా తన వ్యథల గాథను అక్షర బద్ధం చేస్తాడు ఈ మాటల్లో –
‘‘బాధ్యతలు, ఇబ్బందులు కన్నీళ్ళు. ఆనందంలేని ఒంటరితనం నాది. నాచే ఏం చేయనివ్వని ఒంటరితనం, ప్రేమించుకోడం, ప్రేమించడం ఎంత కష్టమో తారీఖులు మారుతున్న కొద్దీ తెలుస్తోంది. స్నేహితులకి ఉత్తరాలు రాయటం మాటల్లో మాటల్తో కానిపని. ఏం చేస్తాం. ఇంతే ఇంతవరకే రాసుకోగలం.
ప్రస్తుతం ఎవర్నీ ప్రేమించలేక పోతున్నాననే దిగులు. ఆఖరికి, నన్ను నేను. (పేజి : 59–60)
ఇవి ఎం. ఎస్. నాయుడు 7-10-95 న రాసిన లేఖలోని పంక్తులు. మరో 23 రోజులకు ఆయన గుండెలోని గుబులు ఘనీభవించింది. ఆయన 30-10-95 నాడు రాసిన లేఖల్లో ఆ వేదన, ఆవేదన ద్రవీభవించి మెల్లమెల్లగా ప్రవహించిందిలా –-
‘‘ఇంకా మారాలి నా కవిత్వం, నేను. నేను రాసేదంతా నాకు నచ్చని నా వ్యక్తిగతంగా నేను గురించే Definitions లోకి ఈ Poetryని తీసుకెళ్ళలేను. నాకీ Poetry వ్యభిచారం నచ్చదు. అయినా, దాంట్లోని ఆనందం వదులుకోలేకపోతున్నా. నేను రాసేవి నాకింకా అర్థం కావట్లేదు……….. ఒక్క మరణంకోసం ఎన్నిసార్లు దుఃఖపడినా మనమే ఒంటరిగా శవంగా కూర్చోవాలి లేదా అశాశ్వత నిద్రలోకి విడిపోవాలి.’’ (పేజి:61)
ఎం. ఎస్. నాయుడి ఈ మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి.
కొందరు లేఖకులు ఒకటి, రెండు వాక్యాల్లో నాసరరెడ్డి కవితామాధుర్యాన్ని అంచనా వెయ్యడం చేతోహారి.
“రాజకీయ స్పర్శ లేకుండా మీ మనస్సులోని అనుభూతుల్ని మీరు గానం చేస్తున్నారు,” అని అభినందించిన కడియాల రామమోహనరాయ్ అభిప్రాయం (పేజి: 28) “కవిత్వాన్ని ఏ వాదాల గుంజకీ కట్టిపడేయకుండా స్వేచ్ఛగా పచ్చికబయళ్ళలోకి వదిలేసిన తోటమాలి మీరు. ఏ ఆంక్షలూ లేని కవిత్వమే ఆంక్షల్ని బద్దలు కొడుతుందనీ, ఆశల్ని పూయిస్తుందనీ నమ్మకం నాకు,” (పేజి: 75) అన్న పసునూరి శ్రీధర్ బాబు అభిమతం, ‘‘మనం మరింత హృదయపూర్వకంగా, ప్రశాంతంగా సంభాషించుకొనే సందర్భాలు వస్తే బావుంటుంది,” (పేజి: 80) అంటూ స్వాతిముత్యం కోసం ఎదురుచూసే చాతకపక్షిలాంటి సన్మిత్రుడు బి. వి. వి. ప్రసాద్ ఆత్మీయమైన, హార్దికమైన పలకరింపులు ఈ పుస్తకపాఠకులకు హృదయాహ్లాదకరాలు.
కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారిలాంటి పూజ్యులు గాలి నాసరరెడ్డిని ‘సౌహార్దమయ హృదయుడు, సాహితీ హర్షవర్ధనుడు’ (పేజి: 10) అని ప్రేమతో సంబోధించడం, ‘చిరకాలమిత్రులు’ అని స్నేహపరిమళం వెదజల్లిన ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావుగారి ‘జీవుని వేదన’ బహుభాషా పాండిత్యం (పేజి: 82–84) స్మరించతగ్గవే.
‘‘రచయితల్ని స్థూలంగా నాలుగు వర్గాలుగా విభజించవచ్చు. చీకటి గుణాల్ని కలిగి వుండి వెన్నెల రచనలు చేసేవారూ, వెన్నెల గుణాల్ని కలిగివుండి చీకటి రచనల్ని చేసేవారూ, చీకటి గుణాల్ని కలిగివుండి చీకటి రచనలు చేసేవారూ, వెన్నెల గుణాల్ని కలిగివుండి వెన్నెల రచనలు చేసేవారూ.’’ (రూపారూపాలు,పేజి:117)
రససిద్ధులైన సంజీవదేవ్ చెప్పినట్లు‘సాహితీ హర్షవర్ధను’డైన గాలి నాసరరెడ్డి పాఠకుల గుండెలపై వెన్నెల చల్లదనం కురిపించే వెన్నెలరాజు.
పుస్తకం: గాలినాసరరెడ్డికి లేఖలు, 1982-2012
సంపాదకుడు: అనిల్ బత్తుల
ప్రచురణ: బోధి ఫౌండేషన్
పుటలు: 103
వెల: ₹100
ప్రతులకు:
- నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, హైదరాబాద్ (navodayabookhouse@gmail.com)
- అమెజాన్లి>
- తెలుగు బుక్స్ డాట్ ఇన్
- లోగిలి డాట్ ఇన్

