భాగవతావతరణము

పంచభూతంబు లేపంచఁ గావించుచుం
         డును రామకీర్తనంబును సతంబు,
జిలిబిలిపలుకులం జిలుకలు రామనా
         మంబె పల్కుచు నెందు మనుచునుండు,
గౌతమీభంగముల్ గానంబు గావించు
         నెచ్చోట రాముని సచ్చరిత్ర,
భద్రాద్రికందరవ్యావర్తివాతముల్
         స్మరియించు నెట రామమంత్ర మహిమ,

ధరణిజాస్నానపుణ్యాంబుధార లెచట
క్షాళనము సేయు భక్తజనాళిపాప
పంకముల క్షణమంద, తత్పరమపూత
ధాత్రి భద్రాచలం బనం దనరుచుండు.

మోక్షము నిచ్చు చాత్మజలపూరమునందునఁ గ్రుంకువారికిన్
దక్షిణగంగనాఁ దనరి, దక్షునియల్లుని మందిరంబుతో
దక్షిణకాశినాఁ బరగు త్ర్యంబకమందు జనించి పాఱుచున్
వీక్షణపర్వమౌ నచట ద్వీపిని గౌతమి విస్తృతంబునై.

పొంగి, అభ్రంకషోత్తుంగభంగయగుచు
వర్షయందు వాఃపూర్ణయై పర్వువెట్టు
అమ్మహానది యది చైత్ర మగుటవలన
సన్నగిలి పాఱుచుం దోఁచెఁ గృశాంగివోలె.

ఒక్కచోగభీరోదకం బొనరుచుండ,
నొక్కచో సైకతస్థలు లుబికి తేల,
స్వమతిగాఢత కతులగర్వంబు దాల్చు
తరుణిచందము దోఁచెఁ దత్తటిని యపుడు.

అన్నదీవేణు లొకయింత సన్నగిల్లెఁ
గాని, మెండయ్యె నప్పుడే కాననములఁ
బూవుదేనియవాకలు; పొడమఁబోవు
కలిమిలేము లెల్లరి కొక్కకరణి ధరణి.

సౌరభ్యసంపూర్ణచామ్పేయసుమగుచ్ఛ
         కనకచ్ఛవీకృతకాననములు,
సప్తలామల్లికాసంజాతసుమజాత
         విశదచ్ఛవీకృతవిపినతటులు,
వంజులరంజితమంజులమంజరీ
         రక్తచ్ఛవీకృతరమ్యవనులు,
నీలినీజాలకోన్మిషితప్రసవజాల
         నీలచ్ఛవీకృతనిష్కుటములు,

సుందరోజ్జ్వలకిమ్మీరసుమకదంబ
సుందరీకృతవనభూమిబృందములును,
చెలువుమీరంగ భద్రాద్రిసీమయందు
వ్యాప్తమయ్యెను చైత్రంబు భవ్య మగుచు.

పరభృతరమ్యగానములు బంభరబృందమనోజ్ఞనాదముల్
హరిణసమూహగాత్రరుతు లన్యమృగావళిరావము ల్గడుం
దఱచుగ మ్రోఁగుచు న్వనికి నవ్యమనోజ్ఞతఁ గూర్చినట్టి య
వ్విరితఱిఱేనికై పొనరు విశ్రుతిగీతము లయ్యె నయ్యెడన్.

భద్రమహీధ్రముఖ్యసముపాంతమునందున సీతతోడ ని
ర్ణిద్రపరాక్రముండు నళినీధవవంశ్యుఁడు రామభద్రుఁడున్
భద్రగుణుండు లక్ష్మణుఁడు వాసముఁ జేసినపర్ణశాల నా
నాద్రుమవేష్టితంబయి కనంబడుచుండును గౌతమీతటిన్.

ఓలిగట్టుచుఁ దత్పర్ణశాలముందు
గలుగు మావుల నెలవైన చిలుకగములు
నాటినుండియు స్మరియించు నేటివఱకు
రామనామంబె నిత్యంబు రమ్యఫణితి.

అవనిజాస్నానపుణ్యోదకాఢ్య యగుచు
పర్ణశాలకుఁ బ్రక్కగాఁ బాఱుచున్న
గౌతమీతరంగిణియందు గాహమంది
ముక్తి గాంచుచునుందురు భక్తవరులు.

ఆమధుమాసవేళ నతులామలశీతలభానుమంతుఁడై
సోముఁడు పూర్ణుఁడై వెలుగు సుందరయామిని వచ్చెఁ గాని, త
ద్యామినిలోని తొట్టతొలియామమునందె గ్రసించు రాహు వా
సోముని పూర్తిగా ననుచు జోస్యులు దెల్పిరి శాస్త్రరీతిగన్.

మంత్రజపం బిప్డు మహిమాన్వితం బంచు
         జపముల నిష్ఠతో సలుపువారు
మంత్రోపదేశంబు మంచి దిత్తఱి యంచు
         మంత్రముల్ నేర్వంగ మసలువారు,
అతిపుణ్యదం బంచు నాపగాస్నానంబు
         స్నానార్థ మేటికిం జనెడువారు,
అంతకంటెను శ్రేష్ఠ మర్ణవాప్లవమంచు
         నర్ణవంబునఁ దోఁగ నరుగువారు,

విహితహోమకార్యంబులు, వివిధవస్తు
దానముల్, దైవతార్చనల్,తర్పణములు
సల్పువారైరి జనులు తత్సమయమందు
గ్రహణగుణదోషవిదు లౌచుఁ గడఁకమీర.

అత్తఱిఁ గాననయ్యె నొక యద్భుతమూర్తి తదీయభద్రగి
ర్యుత్తమసన్నికర్షమున, ఉత్పలినీధవబింబమట్లు దో
షాత్తము గాని, రాహువదనాపహృతంబును గాని ఆననో
పాత్తవిభాన్వితుం డయిన బ్రాహ్మణముఖ్యుఁడు పోతనాఖ్యుఁడున్.

బ్రహ్మతేజము గల్గు ఫాలభాగమునందు
         భసితపుండ్రచ్ఛవి పరిఢవింప,
ప్రథితగీర్వాణాంధ్రపాండితీలతలట్టు
         లాజానుబాహువు లందగింప,
విద్యాంగనానృత్యవేదికచందంబు
         సువిశాలవక్షంబు సొంపు నింప,
మదిలోనిగుణరాశి కొదవురూపమొ నాఁగ
         పరిధానవిశదాభ తుఱఁగలింప,

సహజపండితుండు, పరమసాత్త్వికుండు,
భక్తిశీలుండు, భూతకృపాన్వితుండు,
సురగురూపముం, డత్యంతసుందరుండు,
కాననయ్యెను పోతనకవివరుండు.

యామినీశ్వరగ్రహణకాలార్హవిధులు
పూజ్యగోదావరీతీరభూములందు
సజ్జనానుమతంబున సల్పఁగాను
వచ్చె నాతండు తన్నదీప్రాంతమునకు.

జనకపుత్త్రికాలక్ష్మణసహితుఁ డగుచు
మున్ను రాముండు వసియించి యున్నయట్టి
పంచవట్యాశ్రమంబును గాంచి మున్నె
తానమాడంగ వచ్చెను తటిని కతఁడు.

వనతరువల్లికాకుసుమవారమనోహరతల్, ప్రశస్తబ
ర్హిణగణనాట్యలీలలు, విరించిగిరీంద్రజగౌతమీనదీ1
వనవినిగాహముల్ ముదముఁ బల్లవితంబొనరింప నాత్మలన్
మును పట నున్నరాఘవుని, భూమిజ, లక్ష్మణులన్ స్మరించుచున్.

గ్రహణారంభస్నానము
విహితంబగు శాస్త్రవిధిని వేదోక్తవచ
స్సహితంబుగ నొనరిచి, ని
ర్వహణమొనర్పంగ జపతపంబుల నటుపై.