పుడమి నెల్ల లవలేశము విడువక తిరగాలి.
అడుగడుగున ఆగి ఆగి అరసి అరసి చూడాలి
చిన్నప్పటి నుండి, విన్నప్పటి నుండి పాడుకుంటున్నప్పుడల్లా ఇలానే అనుకునేదాన్ని. ఈ విధంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో అన్ని ప్రదేశాలనూ వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందో అని. అదంతా ఎప్పుడైనా వెళ్తానేమోననే ఆశ. తీరా పెళ్ళయ్యి వెళ్ళేలోపున విజయనగరంలో పుట్టిపెరిగిన నేను, విజయనగరం చుట్టుపట్ల ఏప్రాంతం చూడలేదు. ఆఖరికి విశాఖసముద్రాన్ని, బీచిని కూడా నేటికీ చూడలేదు. ఆపక్కగా రోడ్డుమీదుగా వాహనంలో వెళ్తునే చూడటమే తప్ప.
వివాహానంతరం హైదరాబాదు వచ్చాక భువనేశ్వర్‌లో వున్న ఆడబడుచు ఇంటి కెళ్ళినపుడు కోణార్క్, తర్వాత మరో పది పదిహేనేళ్ళకి మద్రాస్ చూసాను. కాని ఆ అనుభవాలు రాయనే లేదు. నేను ఆర్టీసీ హైస్కూలులో ఉపాధ్యాయినిగా చేరిన తర్వాత ఆర్టీసీ యాజమాన్యంగా నడిచే పాఠశాల కనుక ప్రతి ఏడాదీ మా పాఠశాల పిల్లలని టూరుకి తీసుకు వెళ్ళమని రెండు బస్సులు, నలుగురు డ్రైవర్లను ఉచితంగా ఏర్పాటు చేసేవారు. ఇక అప్పుడు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు స్కూలు పిల్లలతో బాటూ వెళ్ళాను. విద్యార్థులు బాధ్యత వలన చూడటం అయితే చూసాను. ఆ అనుభూతులూ రికార్డు చేసుకోలేదు.
పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మంచి మెడిటేటర్ ఐన స్నేహితురాలు ఉమ తరుచూ దేశ విదేశాల్లోని ప్రధానంగా బౌద్ధ కేంద్రాలకు వాళ్ళకు చెందిన టూర్ నిర్వాహకులతో వెళ్తుంటుంది. ఈ సారి ఎప్పుడైనా కుదిరినప్పుడు నేనూ వస్తానన్నందుకు మార్చిలో నిర్ణయించిన భూటాన్ పర్యాటనకు పావులు కదిలాయి. హైదరాబాద్ నుండి కలకత్తాకు ఉమ మా ఇద్దరికీ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించింది. అయితే నా పాస్పోర్ట్ ఎక్‌స్పైర్ అయ్యింది. ఎట్లా అని ప్రశ్నిస్తే ఓటర్ ఐడీఅయినాపర్వాలేదని ట్రావెల్స్ వారన్నారు. అయినా అది కుదరకపోతే నాకు ఇబ్బంది అవుతుందని మా అమ్మాయి పాస్పోర్ట్ రెన్యువల్‌కి అప్లై చేసింది. అనుకోకుండా నెలలోనే నాకు పాస్పోర్ట్ కూడా వచ్చేసరికి హాయిగా వూపిరి పీల్చుకున్నాను.
మార్చి మూడు తెల్లవారుజామున మూడు గంటలకు ఉమా నన్ను పికప్ చేసుకోగా ఎయిర్ పోర్ట్‌కి బయల్దేరాను. చెన్నైలో దిగి మరో ఫ్లైట్ ఎక్కి మధ్యాహ్నం రెండింటికి బాగ్ డోగ్రా ఎయిర్పోర్ట్ చేరాము. వేర్వేరు ఫ్లైట్ లలో మొత్తం మా బేచ్ నలభయ్యారు మందినీ కలిసాము. అందులో ఇద్దరు పదిపన్నెండేళ్ళ పిల్లలు. అక్కా ఇద్దరుతమ్ముళ్ళు 18-20 ఏళ్ళ వాళ్ళు. మిగతా అందరూ 40-75 మధ్యవయస్కులే. ఎయిర్పోర్ట్ దగ్గర బస్ ఏర్పాటు చేసి ఆరుగంటలకు పైగా ప్రయాణం చేసి భూటాన్ బోర్డర్ టౌన్ ఫుట్షిలోంగ్ తీసుకువచ్చారు. Tara Phendeyling Hotelలో మా బస. ఈ టౌన్ పశ్చిమ బెంగాల్ లోని జైగాం పట్టణాన్ని ఆనుకొని ఉంటుంది. అక్కడికి వచ్చేటప్పటికే కొంచెం చీకటి పడుతూ ఉంది హోటల్ అయితే చాలా నీట్‌గా క్లీన్‌గా ఉంది. మేము పెద్దవాళ్ళమని మాకు క్రింద రూములే కేటాయించారు.
భూటాన్ కౌన్సిలేట్ సమయం అయిపోవటం వల్ల మా పాస్పోర్ట్‌లు చెక్ చేసి మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి స్టాంపింగ్ చేసుకోవాలన్నారు. బోర్డర్లో పాస్పోర్ట్ గాని, మన ఇండియన్ ఓటర్ ఐడి గాని చూపిస్తే సరిపోతుంది. ఆ కౌన్సిలేట్ లోకి అడుగు పెట్టగానే నాకు కళ్ళు చెదిరాయి. స్థంభాలూ, వాసాలూ, ద్వారాలూ అన్నీ చెక్కతో చేసినవి. వాటికి ఎరుపురంగుపై తెలుపు, పసుపూ, నీలి రంగులతో అందంగా చిత్రాతి చిత్రంగా వేసిన డిజైన్లు చూపుల్ని కట్టి పడేసాయి. వాటిని ఫోటోలో బంధించాలని ఆశతో చీకటిలోనే ఫొటోలుతీసాను. ఆ తర్వాత అన్ని హొటల్స్ లోనూ, దారి పొడవునా ఇళ్ళు గోడలమీదా, ఘాట్ రోడ్డులో గల కొండగోడలమీదా భూటాన్ సాంప్రదాయ చిత్రాలు కనువిందు చేస్తూనే వున్నాయి. అవి భూటానీయుల సాంప్రదాయ కళని నేటికీ కాపాడుకోవటం ఆనందం కలిగించింది.
మా యోగీ ట్రావెల్స్ గణేష్, నవకాంత్ డిన్నర్‌కి ముందు పరిచయ సమావేశం ఏర్పాటు చేసారు. అందరూ పిరమిడ్ ధ్యానం పట్ల ఎలా ఆకర్షితులయ్యారో వారివారి అనుభవాలు తెలియజేసారు. “నాకు సంగీతం, సాహిత్యం మాత్రమే ఒత్తిడి నుండి విశ్రాంతిని ఇస్తాయి. నేనూ ఉమా నలభై ఏళ్ళుగా స్నేహితులం, సహోద్యోగులం. నేను మెడిటేడర్ని కాదు.” అని మాత్రమే చెప్పాను. ఉమా నన్ను కోప్పడి నా గురించి వివరాలన్నీ చెప్పి “గూగుల్‌లో శీలా సుభద్రాదేవి పేరుతో సెర్చ్ చేస్తే ఈమె గురించి తెలుస్తాయి. నిజానికి సుభద్ర నిత్యమూ ధ్యానంలో వున్నట్లు సంగీతం, సాహిత్యాలతోనే వుంటుంది” అని పరిచయం చేసింది. అందరూ నా విశేషాలు తెలుసుకోవాలని నాతో కబుర్లు చెప్పారు. తర్వాత డిన్నర్ చేసి నిద్రకి వుపక్రమించాము.
ఉదయమే తయారై క్రింద హాల్‌కి వెళ్ళేసరికి గణేష్ వేణువుతో భూపాల రాగాన్ని ఆలాపన చేసి తర్వాత అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు కీర్తనలు వాయించాడు. మంచు తెరలని చీల్చుకుంటూ లేత కిరణాలు భూమి తల్లిని ముద్దాడుతోన్న ఆ చలి వుదయాన శ్రుతి బద్ధమైన భూపాలరాగాన్ని వింటుంటే పారవశ్యంతో మనసు నిండిపోయింది. అందరూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే నాకు తెలియకుండానే కళ్ళు మూతలుపడి ఆ రాగ జలధిలో ఓలలాడాను. బ్రేక్ఫాస్ట్ తర్వాత భూటాన్ ఎంబసీలో అందరివీ స్టాంపింగ్ అయ్యేసరికి పది దాటింది. అందరి స్టాంపింగ్ అయ్యాక ఎంబసీ ఆయన వచ్చి మా నలభై ఆరుమందికీ ఒక్కొక్కరికి భూటాన్ సాంప్రదాయ షాల్ కప్పి భూటాన్‌కి స్వాగతించటం ఒక కొత్త సాంప్రదాయంగా, ఆత్మీయంగా అనిపించింది.
ఇక్కడ భూటాన్ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ రెండింటి విలువా ఒకటే కావటాన రెండూ నడుస్తాయి. అందుచేత మేము కరెన్సీ మార్చుకోలేదు గానీ నేను దాచుకోటానికని సేకరించుకున్నాను. మాకు ఏర్పాటు చేసిన మూడు వేనుల్లో నలభై ఆరు ముందే కాక ప్రతీ వేనుకు ఒక గైడ్‌ని కేటాయించారు. మా గైడ్ పేరు వాచ్య్సూ అంటే గ్రేట్ రివర్ అని తన పేరుకి అర్థం చెప్పాడు. థింపూలో తన పేరుతో నది వుందని చూపిస్తానని కూడా అన్నాడు. మన దేశంలో నదులపేర్లని ముఖ్యంగా ఆడపిల్లలకే పెడతాం కదా. నాకు ఆశ్చర్యం కలిగింది.
ఆ రాత్రి మా హొటల్ కిటికీలోంచి కనిపిస్తోన్న “వెల్కమ్ థింపూ” అన్న అక్షరాలతో వున్న ఎత్తైన స్వాగతద్వారం ఎంత కళాత్మకంగా వుందో దానిని పగలు వెల్తుర్లోనేకాక రాత్రి దీపాల వెల్తురులో కూడా ఎన్నో ఫొటోలు తీసుకున్నాను. తర్వాత గమనిస్తే ప్రతీ నగరం స్వాగతతోరణాలూ అంత అందంగానే వున్నాయి. భూటానీయులు మంచి కళాహృదయులు అనిపించింది. హొటల్స్‌లో అన్ని రకాల పనులూ చేసే అమ్మాయిలందరూ చాలా అందంగానే కాక చాలా చురుకుగా వున్నారు., గైడుల్లా, ఇతరేతర పనులు చేస్తున్న వారందరూ యువకులే. ఇక రోడ్డుమీద ఒక చిన్న కాగితం గాని, ఒక ఆకు గానీ లేకుండా శుభ్రపరుస్తున్న వాళ్ళు కూడా యువకులే. చదువుకుంటున్న పిల్లలే పార్ట్‌టైమ్‌లో పనులు చేస్తుంటారుట. వాటికి వాళ్ళకు క్రెడిట్ పాయింట్లు వుంటాయని మా గైడ్ చెప్పాడు. అర్థరాత్రి వరకూ యూట్యూబ్లూ, సినీమాలుచూస్తూ పగలు పొద్దెక్కేదాకా నిద్రపోయే బాధ్యత తెలియని మన పిల్లలు గుర్తు వచ్చారు.
ఎక్కడ చూసినా భూటానీయుల కంటే చూడటానికి వచ్చినవారే ఎక్కువ. భూటాన్ జనాభా మొత్తం కలిపినా ఎనిమిదిన్నర లక్షల కంటే మించరని తెలిసింది. మరొకటి చిన్నపిల్లల దగ్గరనుండి ప్రజలంతా బయటకు వస్తే వారి సాంప్రదాయ దుస్తులనే ధరించాలట. ఇంట్లో మాత్రమే ఫేంటూ టీషర్ట్ చేసుకుంటామని గైడ్ చెప్పాడు. విద్యా, వైద్యం వుచితమేనట. మరొకటి మనదేశంలో వీధికి పది రకాల క్లినిక్‌లు కనిపిస్తాయి. వారం రోజుల మా ప్రయాణంలో ఎక్కడా మందుల షాపు గానీ, క్లినిక్స్ గానీ కనిపించలేదు. ఒక దగ్గర మాత్రమే ప్రభుత్వ హాస్పిటల్ కనిపించింది. మరీ సీరియస్ జబ్బులైతే కలకత్తాకి తీసుకు వెళ్తారన్నాడు.
స్వచ్ఛమైన గాలీ, నీరు ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో చాలావరకూ ఆరోగ్యంగా వుంటారేమో. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి వాళ్ళు ఆనందంగా కూడా వుంటారనుకుంటాను. అందుకేనేమో భూటాన్‌ను ఆనందమయదేశం అంటారు.
థింఫూలో ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధ విగ్రహాలలో ఒకటైన బుద్ధ డోడన్మా మందిరాన్ని సందర్శించాం. మందిరం లోపల బుద్ధుడు, బుద్ధుడికి చెందిన ముఖ్య అనుయాయుల విగ్రహాలు ఉన్నాయి. మరో ముఖ్య విశేషం అందరం లోపలకి అడుగుపెట్టేసరికి అద్భుత స్వర్ణ దృశ్యం కళ్ళు మిరుమిట్లు గొలిపాయి!!!నాలుగు గోడల చుట్టూ లక్షా పాతిక వేలకు పైగా బుద్ధ విగ్రహాలున్నాయి. బంగారు బొమ్మలకొలువులా చిన్నచిన్న బుద్ధ విగ్రహాలు షోకేసుల్లో అమర్చి ఉంచారు. ఎనిమిది ఇంచుల బుద్ధ విగ్రహాలు లక్షా, పన్నెండు ఇంచ్‌ల బుద్ధ విగ్రహాలు పాతికవేలు వున్నాయన్నారు. ఇవి మిరుమిట్లు గొలిపే బంగారుపూత పూసిన కాంస్య విగ్రహాలు. కొందరు అక్కడ విగ్రహం పెడతామని మొక్కుకుంటారట.
ఈ మందిరం పైనగల 177 అడుగులు లేదా 54 మీటర్ల ఎత్తు ఉన్న భారీ బుద్ధ విగ్రహం చాలా దూరం నుండి కనిపిస్తూ హృదయాన్ని పట్టి దగ్గరకు ఆకర్షిస్తుంది. ఈ మందిరం భూటాన్ రాజు జిగ్మే సింగే వాంగ్ చుక్ తన 60వ జన్మదినం సందర్భంగా నిర్మించాలని 2006లో మొదలుపెట్టి 2017నాటికి పూర్తిచేసారట. ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ మహా బౌద్ధాలయం సొబగు ప్రత్యక్షంగా చూడవలసిందే తప్ప వర్ణించడం అసాధ్యం. మందిరం చుట్టూ ఆవరణలో కూడా బంగారురంగు నిలువెత్తు విగ్రహాలు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా వున్నాయి. ఒకటి రెండు విగ్రహాల దగ్గర నేనూ ఉమా ఫొటొలు దిగాం. మందిరం చుట్టూ తిరిగి అన్ని విగ్రహాలూ ఫొటో తీసుకోవాలనుకున్నాను. కానీ మా గైడ్ తొందరపెట్టటంతో కొన్నింటిని మాత్రమే గబగబా నడుస్తూ వాటిని వీడియోగా తీసాను.
థింపూ నుంచి బయలుదేరి 17వ శతాబ్దంలో కట్టిన పునాఖ కోటకు వెళ్తూ మధ్యలో ఎత్తైన ప్రదేశం దోచులా పాస్‌కి వెళ్ళాము. కొండ దారి ఘాట్ రోడ్డుపై ప్రయాణంలో పరిగెత్తే రోడ్డునూ, భయపెట్టే లోయల్ని కెమేరాలో బంధించాను. అక్కడ చాలా స్తూపాలు కట్టారు. పైన ఎత్తుగా మధ్యలో ఉన్న పెద్ద స్థూపం చుట్టూ మూడు అంతస్తులలో 108 స్తూపాల్ని మూడు లేయర్లలో కట్టారు. దాని గురించి మా గైడ్ చెప్పిన కథనం ఏమిటంటే ఆ ప్రాంతం మీదకి పరాయి ప్రాంతం వారు ఎవరో దండయాత్రకు వచ్చేరనీ, పెద్ద ఎత్తున దాడులు జరిగేయనీ చెప్పాడు. వాళ్ళని ఎదుర్కోవటానికి బుద్ధిష్టు సన్యాసులు పోరాటం చేయగా 108 మంది బౌద్ధ భిక్షువులు చనిపోయారట. వాళ్ళ స్మృతి చిహ్నంగా భూటాన్ రాణి ఈ 108 స్తూపాలు కట్టించిందని గైడ్ వివరించాడు.
అక్కడ నుండి దూరంగా కనిపిస్తోన్నకొండలు హిమాలయాలని చెప్పాడు. ఎత్తైన పర్వతాలనో, విశాల సముద్రాన్ని ఓ చూసినప్పుడే మానవుడు ఎంత అల్పజీవో అర్థమౌతుంది. మబ్బుల మేలి ముసుగు వేసుకున్న అమ్మాయిల్లా ఆ కొండల వరుసలు భలేగా అనిపించాయి. చేతులు చాపి తిరగాలనిపించేంత అందంగా వుంది ఆ ప్రదేశమంతా. అది చాలా ఎత్తైన ప్రదేశం కావటం చేత మేము వేసుకున్న స్వెట్టర్, షాల్ చలిని ఆపలేదు. మాబేగ్స్ వేన్‌లో వదిలేసాము. దాంతో నేనూ ఉమా చలికి వణికి పోతూ కొంతదూరంలో కనిపించే ఇల్లు లాంటి ప్రదేశానికి కొందరు వెళ్తుంటే మేమూ వెళ్ళాం. అది ఒక చిన్న కేఫిటేరియా. టీ తాగుతుంటే చలిపోతుంది కాని పర్సులు ఆక్షణంలో మా దగ్గర లేవు. అంతలో అక్కడ మా గ్రూపుకు కోఆర్డినేటర్‌గా పని చేస్తున్న సప్న కనిపించి మేము చలికి వణుకుతుండటం చూసి మాకు టీ ఇప్పించింది. ఆ క్షణంలో ఆ అమ్మాయి దేవతలా కనిపించింది. తర్వాత మేము డబ్బు ఇవ్వబోతే “అమ్మ దగ్గర డబ్బు తీసుకోకూడదు” అని అంది. తర్వాత రూమ్‌కి వెళ్ళాక మేము తెచ్చుకున్న కరాచీ బిస్కెట్లు పేకెట్ ఆమెకి ఇవ్లబోతే సప్న మొగమాటపడుతుంటే ‘ అమ్మ ఇచ్చినప్పుడు వద్దనకూడదు’ అన్నాము. ఆ అమ్మాయి నవ్వి తీసుకుంది.
పునాఖా కోట మధ్యలో ఉన్న బౌద్ధ మందిరాన్ని చూడడానికి లోపలికి వెళ్ళేసరికి అర్థనిమీలితనేత్రుడైన అతి పెద్ద బుద్ధ విగ్రహం అద్భుతంగా నన్ను ఆకట్టుకుంది. మనం ఎటు నుండి చూసినా మనపైనే శాంతి నిండిన దృక్కులను ప్రసరిస్తున్నట్లుగా వున్నాయి. ఆయనకు రెండువైపులా బౌద్ధ ప్రముఖుల విగ్రహాలు, ఆ విగ్రహాలకు ముందు బుద్ధుని ప్రముఖ శిష్యుల విగ్రహాలు ఉన్నాయి. మా గ్రూపులో అందరూ అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసారు. కానీ నేను మాత్రం లోపల ఫొటోలు తీయటం నిషేధం కనుక ఆ సౌందర్యమూర్తిని నా కళ్ళ నిండా నింపుకున్నాను. ఇక గోడలచుట్టూ అద్భుతమైన చిత్రాలు వున్నాయి. అయితే లైటింగ్ ఎక్కువగా లేదు. లైట్ వలన ఆ చిత్రాల రంగులు వెలిసి పోతాయని లైట్లు అమర్చలేదన్నారు గైడ్. మా సెల్ఫోన్ లైట్‌లో చూసే ఆ నైపుణ్యానికి మైమరచిపోయాను. ఇక్కడ ప్రతీ మందిరంలోనూ బౌద్ధ రూపాలు రెండు మూడు తలలతో భయంకరంగా కనిపిస్తాయి. అవి మనిషిలో నిక్షిప్తంగా వున్న చెడు ఆలోచనలకు ప్రతిరూపమని గైడ్ అన్నాడు. కోట మధ్యలో ఒక విశాలమైన బోధి వృక్షం ఉంది. ఈ Punakha Gzong అనే కోటను 17వ శతాబ్దంలో నిర్మించారుట.
గైడ్ కోటచరిత్ర గురించి చాలా విషయాలు తెలియజేసాడు పునాఖ-వాంగ్ డ్యూ రెండు నదులు కలిసే చోట భూటాన్‌లో రెండో అతిపెద్ద కోటగా నిర్మించారట. దీన్నే మేజెస్టిక్ ఫోర్ట్రెస్ అని అంటారనీ, ఇందులో బుద్ధ అవశేషం భద్రపరచారనీ, దానికోసం టిబెటన్లకి, భూటానీయులకీ మధ్య చాలా యుద్ధాలు జరిగాయని చెప్పాడు. మొదట్లో ఇదే రాజధానిగా వుండేదనీ, ఈ యుద్ధాల వలన సెక్యూరిటీ దృష్ట్యా రాజధానిని థింఫూకి మార్చారట.
ఇప్పుడు ఈ కోటలో ఎక్కడెక్కడ నుంచో బౌద్ధ గురువులు, భిక్షువులు ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంతకాలం ఏకాంత జీవనం సాగిస్తారు. కోట చుట్టూ పై అంతస్తులలో వారికి ప్రత్యేకమైన గదులు ఉన్నాయి. కొందరు పై అంతస్తుకు వెళ్ళబోతుంటే వాళ్ళని గైడ్ మందలించాడు. దగ్గరలో ఏదో ఫెస్టివల్ వుందంట అందుకోసం కొందరు బౌద్ధ భిక్షువులు ప్రాక్టీస్ చేస్తున్న సమూహ నృత్యం కాసేపు అక్కడే కూర్చుని చూసాము. ఆ నృత్యాన్ని వీడియో తీసాను.
ఆ తర్వాత భూటాన్ రాజధాని థెంపు పర్యాటన ముగించుకొని ఆ రాత్రికి మరో నగరం ‘పారో’ చేరాము. పారోలో మరో హోటల్లో వసతి ఏర్పాటైంది. ఆ చలి వాతావరణంలో రెండు రాత్రులు ఉన్నాం. ఒక రాత్రి కేంప్ ఫైర్ ఏర్పాటు చేసి అందరూ వాటి చుట్టూ కేరింతలు కొడుతూ తెలుగు, హింది పాటలకు నృత్యాలు చేసారు. మేమూ వాళ్ళతో కాసేపు అడుగులు కలిపాము.
భూటాన్ జాతీయ జంతువు టాకిన్‌ను చూపిస్తామని తీసుకువెళ్ళారు. హిమాలయన్ జంతువు టాకిన్ ముఖం మేకలా వుంటుంది మిగతా శరీరం బర్రెలా వుంటుంది. వాటి సంఖ్య తగ్గిపోతుండటంవలన సంరక్షణ చేస్తున్నారని గైడ్ అన్నాడు. సంరక్షణ స్థలంలో టాకిన్లు పది పదిహేను కన్నా ఎక్కువ లేవు. వీటిని చూడటానికి ఎంట్రెన్స్ ఫీజు మూడు వందలు. దాంతో చాలా మంది విసుక్కున్నారు. ఇక్కడ ప్రతీ టూరిస్ట్ స్థలం దగ్గరా ఎంట్రీ టికెట్ అయిదువందలకు తక్కువ లేదు. భూటాన్‌కు ప్రధాన ఆదాయ వనరు టూరిజమే. అదీకాక కొండ, ఘాట్ రోడ్లే కనుక కొన్ని నెలలు మాత్రమే టూరిస్టుల తాకిడి వుంటుంది. ఇక్కడ చిన్నవిమానాశ్రయం కూడా ఉంది. కానీ ఇది కొండల మధ్య ఉంది కాబట్టి అన్ని ప్రాంతాల నుండీ వచ్చే అవకాశం లేదు కేవలం ఢిల్లీకి మాత్రమే రాకపోకలకు విమానాలు ఉన్నాయిట.
మరో ముఖ్యమైన ప్రదేశం భూటాన్‌లో ప్రసిద్ధి చెందిన టైగర్స్ నెస్ట్ మొనాస్టరీ. సుమారు ఐదు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి అక్కడికి చేరుకోవాలి. భూటాన్‌లో పారోకి 3 వేల మీటర్లు ఎత్తునఈ టైగర్స్ నెస్ట్ మొనాస్టరీ ప్రత్యేక ఆకర్షణ. ఈ బుద్ధిష్టు మొనాస్టరీని 17వ శతాబ్దంలో కట్టారని చెప్తున్నారు. బౌద్ధ మొనాస్టరీని ఎంత ఇష్టమైనా ఆ పర్వత శ్రేణులను చేరుకోవడం చాలా కష్టమైన ఇష్టమైన పని. భూటాన్‌లో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆ బౌద్ధ విహారాన్ని చేరుకోవడానికి ట్రెకింగ్ చేయాలి.
నాకు బీపి వుంది. అందుకని అంత ఎత్తు ట్రెక్కింగ్ చేయటానికి సాహసించలేదు. ఉమాకూడా వద్దంది. అందుకనీ ఆ పర్వతం మొదలు వరకూ వెళ్ళి మిగతావారు పైకి ఎక్కడం కనిపించే వరకూ వున్నాము. అక్కడ చెట్లు పొడవుగా ఆకాశాన్ని ముద్దుపెట్టటానికి సాగుతున్నాయా అనిపించేలా వున్నాయి. అన్ని బౌద్ధ మొనాస్టరీలు కూడా ఎత్తుగా వుండే పెద్దపెద్ద మెట్లు ఎక్కి వెళ్ళాల్సినవే. అవి కూడా ట్రెక్కింగ్ చేసినంత పని అవుతోంది. గైడ్ గానీ, బౌద్దబిక్షువులుగానీ మాకు చేయందించటానికి చూసేవారు. నాకు యోగా, వాకింగ్ అలవాటు మీద బాగానే మెట్లు ఎక్కిదిగేదాన్ని. నా కన్నా చిన్నదే ఐనా ఉమ కొంచెం ఇబ్బంది పడేది. మరొక విశేషం ఇక్కడ హొటల్స్‌లో కానీ, ఇళ్ళల్లోగానీ లిఫ్టులు ఉండవట. గైడ్ చెప్పాడు. అంతేకాదు ఉమా వయసు అడిగి “మా అమ్మకి కూడా డెభ్భై ఏళ్ళు. ఇంటిపని పొలం పనీ అన్ని ఆమే చేస్తుంది. మీ లాగే డెభ్భై ఏళ్ళే కదా మేడం” అన్నాడు మా గైడ్. మేమిద్దరం ఆశ్చర్యపోయాం. అరవై ఏళ్ళు దాటి రిటైర్ కాగానే ఇంకేమీ చేయలేం అన్నట్లు కొందరు చతికిల పడిపోతారు. ఇతను ఎంత కేజువల్‌గా అన్నాడు అనుకున్నాం. తర్వాత ట్రెక్కింగ్ చేయని వారందరినీ ఒకే వేను ఎక్కించి ఒక మ్యూజియంకి తీసుకువెళ్ళారు. అక్కడ అన్ని మ్యూజియం లాగే భూటాన్ చరిత్ర, వస్తువులూ వున్నాయి.
తర్వాత రోజు మమ్మల్ని వాచ్యూ నది ఒడ్డుకు తీసుకు వెళ్ళారు. ఆసక్తి వున్న వాళ్ళంతా రివర్ రాఫ్టింగ్ చేయటానికి వెళ్ళారు. వాళ్ళంతా వచ్చేవరకూ మేము ఆ చుట్టుపట్ల మెల్లగా నడుస్తూ ఫొటోలు తీసుకుంటూ తిరిగాము. నీటి ప్రవాహం చాలా పారదర్శకంగా సూది పడినా కనిపించేలా వుంది. ఆ నీటి ప్రవాహం వలన నున్నగా అయిన తెల్లని గులకరాళ్ళను ఏరుకున్నాము. తర్వాత నది ఒడ్డునే ఏర్పాటు చేసిన చక్కని విందు చేసాక షాపింగ్‌కు తీసుకు వెళ్ళారు. మా ఇంట్లో నాలుగైదు రకాల బుద్ధ విగ్రహాలున్నా సరే జపానీస్ స్టైల్లో వుండే బుద్ధ విగ్రహం దొరుకుతే కొందామని చూసాను. చాలా పెద్దవే తప్ప చిన్నసైజులో దొరకలేదు. పాలరాతి ధ్యాన బుద్ధవిగ్రహం కొన్నాను. మనవరాలికోసం పూసలు దండలు, ష్టోల్, అమ్మాయికి చిన్న పర్స్ తప్ప ఏమీ తీసుకోలేదు. రూంకి వచ్చాక మా సామానులన్ని సర్దేసుకున్నాం.
ఆ మర్నాడు చీకటిలోనే లేచి తయారై పోయాము. మాకు బ్రేక్ఫాస్ట్‌గా పుచ్చకాయ ముక్కలూ, బ్రెడ్ ఫేక్ చేసి ప్రతి ఒక్కరికీ ఇచ్చారు. మేమువున్న హొటల్ నుండి ఫర్లాంగు దూరంలో బోర్డర్ వరకు నడిచాము. భూటాన్కి ఆత్మీయంగా బైబై చెప్పి బోర్డరు దాటి ఒక్కసారిగా వుసూరుమన్నాము. గిల్టీగా ఫీలయ్యాను. ఎందుకో తెలుసా బోర్డరు అవతల అద్దంలా పరిశుభ్రమైన అందమైన భూటాన్. బోర్డరు దాటగానే వరుసగా టిఫిన్ బండ్లూ, వాటి చుట్టూ తింటున్న మనుషులూ, తిని పడేసే పేపరుప్లేట్లలో మిగిలినవాటికోసం కుక్కలూ, పశువులూ అంతా అపరిశుభ్రమైన వాతావరణం.
బిస్కెట్లుతిని ఖాళీకవరు భద్రంగా హేండు బేగులో దాచుకున్న తోటి ప్రయాణికులు బోర్డర్ దాటగానే రోడ్డుపై విసిరేసారు. మన దేశం పరిశుభ్రంగా ఎప్పడౌతుందో కదా? అంతకన్నా ముందుగా మనమెప్పుడు శుభ్రత పాటిస్తామో కదా? ఆలోచనలతోనే బస్సులో బాగ్డోగ్రా చేరి హైదరాబాద్‌కి వెళ్ళే ఫ్లైట్ ఎక్కాము.