హేతు చింతనను ఆధునికతకు పర్యాయపదంగా మేధావులు భావిస్తారు. అదే సమయంలో ఆధునికతను కాలవాచకంగా కూడా వాడతారు. కొన్ని దేశాలు, ప్రాంతాలు మిగిలిన దేశాలతో పోలిస్తే హేతు చింతనలో వెనుకబడిపోయాయని అభిప్రాయం కూడా ఉంది. యూరప్‌తో పోలిస్తే తృతీయ ప్రపంచ దేశాలు హేతువుకి దూరం జరిగాయనే దృక్పథానికి సమర్ధన ఉంది. అలాగే హేతుచింతనకు పరాకాష్టగా సైన్స్‌కు స్థానం దక్కింది. ఈ క్రమంలో భారతీయులకి హేతుచింతన ఉందా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రెండు సమాధానాలు వచ్చాయి. ఒకటి, భారతీయుల దృష్టి కోణం గ్రీకు, పాశ్చాత్య దృక్పథంతో పోలిస్తే వెనుకబడినది అనే అభిప్రాయం. రెండు, భారతీయులు సుదూర గతంలో గొప్ప హేతుబుద్ధి కలిగి ఉండేవారు, దాన్ని క్రమేపీ కోల్పోయారు. ఇటువంటి వైఖరి కమ్యూనిస్టులు, దళితవాదులు, హేతువాదులు, నవ బౌద్ధులు అందరిలో కనిపిస్తుంది. నిజానికి హిందూ వాదుల ఆలోచన కూడా ఇలాగే ఉంటుంది. మొత్తంగా ఆధునిక ఆలోచన ధోరణి ఇది.
నా దృష్టిలో భారతీయ హేతు చింతన గురించి కమ్యూనిస్టులు, దళితవాదులు, హిందూ వాదులు అందరూ పొరబడ్డారు. దానికి కారణం వారి ఆలోచనలు ఏమాత్రం స్వతంత్రమైనవి కావు, వలసవాద దృక్పథం నుంచి ఏర్పడ్డాయి. అసలు హేతువు అంటే ఏమిటి? హేతువు గురించి ప్రాచ్య, పాశ్చాత్య భేదాలు ఏమిటి? అసలు భారతీయులకు హేతు చింతన ఉందా లేదా అనే విషయాన్ని ఎలా నిర్ధారించాలి అనే విషయంపై ఈ వ్యాసంలో చర్చిస్తాను.
కాజ్ అండ్ ఎఫెక్ట్ (కార్య కారణ సంబంధం)
భారతీయుల ప్రాచీన దృక్పథం కార్యకారణ సంబంధం అనవచ్చు. బుద్ధుడు దానినే కార్య కారణ శృంఖల అన్నాడు. ప్రాచ్య దృక్పథం కాజ్ అండ్ ఎఫెక్ట్‌పై ఆధారపడి ఉంది, అంటే కారణం కంటే ముందే కార్యముంది. అతి ప్రాచీనమైన సాంఖ్య దర్శనం, బౌద్ధం కూడా ఇదే క్రమంలో పదబంధాన్ని కూర్చాయి – కార్య కారణ అంటూ. కానీ ఇంగ్లీషులో కాజ్ అండ్ ఎఫెక్ట్ అనడంలో స్పష్టమైన క్రమం ఉంది. అలాగే కారణం, కార్యం మధ్య వారికి భాషాపరంగానే విభజన ఉంది. మన భాషలలో ద్వంద్వ పదాల మధ్య ఎక్కడా స్పష్టమైన విభజన కనబడదు – పగలు రాత్రి, దివారాత్రులు, మంచీ చెడు, పాప పుణ్యాలు వీటిలో ఎక్కడా విభజన కనబడదు. డే అండ్ నైట్, గుడ్ అండ్ బాడ్ అన్న ఇంగ్లీషు పదాలలోలా స్పష్టమైన విభజన కనబడదు. ఇదే పద్ధతి కార్య కారణ సంబంధం అన్న చోట కనబడటమే కాదు, ఇక్కడ హేతువు తలకిందులైంది అంటే కారణం కంటే కార్యం ముందుకు వచ్చి కూర్చుంది.
గ్రీకు తత్వశాస్త్రంలో అతి ప్రాచుర్యం పొందిన పదం టెలియాలజీ అంటే అంతిమ ఫలితం, లక్ష్యం. టెలోస్ అంటే అంతం, లోగోస్ అంటే కారణం, అధ్యయనం అని అర్థం. ఒక వస్తువు లేదా ప్రక్రియ యొక్క ఉద్దేశ్యం, లక్ష్యం లేదా అంతిమ ఫలితాన్ని వివరించే పద్ధతి. ఆధునిక విజ్ఞాన శాస్త్రం దీనికి భిన్నంగా ఎదిగింది అంటారు. సైన్స్ యాంత్రిక వివరణలపై దృష్టి పెడుతుంది. అయితే భారతీయ భాషా నిర్మాణంలోనే టెలియలాజికల్ దృక్పథం ఉందా? అది ప్రపంచపు యాదృచ్ఛికత, యాంత్రిక వివరణలను అసాధ్యం చేసిందా? అది నేడు పాశ్చాత్యులు ప్రాచుర్యంలోకి తెచ్చిన సైంటిఫిక్ దృక్పథాన్ని అసాధ్యం చేసిందా అనే ప్రశ్నలు వస్తాయి. ప్రాచుర్యంలో ఉన్న ఆధునిక పాశ్చాత్య సైన్సు దృక్పథం ప్రకారం సాంఖ్య దర్శనం మోస్ట్ అన్ సైంటిఫిక్ అని చెప్పాలి, పూర్తి హేతు విరుద్ధమైన సిద్ధాంతం కావాలి. కొందరు ఆధునికులు భావిస్తున్నట్లు అది సైంటిఫిక్ కాదు. దేవుడి ప్రసక్తి లేకపోవడం, స్వతస్సిద్ధంగా జగత్తు పరిణామం చెందుతుంది అన్నంత మాత్రాన ఏ సిద్ధాంతము ఆధునిక పాశ్చాత్య దృష్టిలో సైంటిఫిక్ కాలేదు. సాంఖ్యం ఏం చెప్తుంది? కారణం లోనే కార్యం దాగి ఉంది. సత్వ, రజస్తమో గుణాలు అనే వివిధ లక్షణాలు సృష్టికి ముందు పూర్తి సమతుల్యత కలిగి ఉంటాయి. ఆ సమతుల్యత చెదరడం వల్ల సృష్టి, జగత్తు ఏర్పడుతుంది. విత్తులోనే చెట్టు ఉంది, చెట్టు సూక్ష్మ రూపంలో ఉంది, అది స్థూలంగా వ్యక్తమైనప్పుడు కనబడుతుంది. అలాగే అవ్యక్తంగా ఉన్న జగత్తు వ్యక్తం అవుతుంది. అందువల్ల దేవుడు అనే కర్త అవసరం లేదు ఎందుకంటే కొత్తగా ఏదీ రావడం లేదు, ఉన్నదే వ్యక్తం అవుతోంది.
ఆధునిక సైన్సు చెప్పేది వేరు. జగత్తు ఆవిర్భావానికి ముందు బిగ్‌బ్యాంగ్‌కి ముందు ఏముందో మనకు ఏమీ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి పనికి వచ్చే భౌతిక సూత్రాలు ఏవీ బిగ్ బ్యాంగ్ ముందు స్థితికి అన్వయించవు. అంటే ముందే ఉన్నది వస్తోంది అని చెప్పలేం. అలాగే జీవపరిణామం కూడా చాలా కొత్తది, ముందు ఉన్నది కాదు. జడ పదార్ధంలో జీవం లేదు, జడ పదార్థంలోనూ జీవం ఉంది అని వాదించే శాస్త్రవేత్తలు ఉండేవారు, దాన్ని వైటలిజం అంటారు. భారతీయ తత్వవేత్త జగదీష్ చంద్రబోస్ వాదం అదే. ఆయన భారతీయుడు కావడం వల్ల సాంఖ్య పద్ధతిలో వాదించి ఉండొచ్చు, జీవము కూడా ప్రకృతిలో అంతర్భాగంగా ముందే ఉంది అని భావించి ఉండొచ్చు. పాశ్చాత్య శాస్త్రవేత్తలు భౌతిక పదార్ధం నుంచి జీవాన్ని పూర్తి వేరుగా చూస్తారు. నేటి సైన్సుకు చార్వాక దర్శనం కొంతవరకు దగ్గర అనవచ్చు. (పంచ భూతములు) వివిధ పదార్థాల మేళనం వల్ల, అంతకు ముందు లేని ఒక కొత్త లక్షణం వచ్చింది, అదే జీవం అని చార్వాకులు వాదించారు.
దృష్టాంతం: తాంబూలం అనేది తమలపాకు, సున్నం, వక్క వంటి వివిధ భౌతిక పదార్థాల కలయిక. ఈ పదార్థాలను ఒక్కొక్కటిగా తీసుకుంటే, అవి ఎలాంటి రుచిని లేదా రంగును ఉత్పత్తి చేయవు. కానీ, అవి కలిసినప్పుడు, ఒక కొత్త గుణం—ఎరుపు రంగు మరియు విశిష్టమైన రుచి—ఉద్భవిస్తాయి.
చార్వాకులు ఈ దృష్టాంతం ద్వారా ఇలా వాదించారు:
- జీవసృష్టిలో చైతన్యం (Consciousness) కూడా ఇలాంటి భౌతిక మూలకాల (భూమి, నీరు, అగ్ని, వాయువు) సంయోగం వల్ల ఉద్భవిస్తుంది.
- తాంబూలం యొక్క ఎరుపు రంగు లేదా రుచి ఎలా ఒక స్వతంత్ర శక్తి లేకుండా సహజంగా ఏర్పడుతుందో, అదేవిధంగా చైతన్యం కూడా శరీరంలోని భౌతిక అవయవాల సంక్లిష్ట సంయోగం ఫలితంగా ఉత్పన్నమవుతుంది.
- ఈ ప్రక్రియలో ఆత్మ, దేవుడు లేదా ఏదైనా అతీంద్రియ శక్తి అవసరం లేదు. పైగా అంతకు ముందు లేని గుణం (జీవం) ఉనికి లోకి వస్తోంది అన్నారు చార్వాకులు.
- ఐతే క్వాంటమ్ ఫిజిక్స్ అభివృద్ధి తర్వాత ప్రాచ్య దర్శనాలు, బౌద్ధ వేదాంతాల వైపు దృష్టి మళ్ళింది. సాంఖ్య తత్వం వైపు సైన్సు వెళ్ళింది. ఇదంతా తర్వాత వివరిస్తాను.
దేవుడు, సైన్సు.
వేలాది సంవత్సరాల క్రితం దేవుడు “వెలుగు కలుగుగాక” అని పలికినప్పుడు జరిగిన సృష్టి యొక్క మొదటి క్షణానికి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం సరిపోలుతుంది అని కేథలిక్ పండితులు వాదిస్తారు. నిజానికి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఒక రోమన్ క్యాథలిక్ మతాధికారి జార్జెస్ లెమైట్రే, ఆయన ఖగోళ గణిత శాస్త్రవేత్త. ” భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ విశ్వాన్ని సృష్టించడంలో దేవుడికి ఇంకా వేరే అవకాశాలు ఉన్నాయని ఐన్స్టీన్ సుప్రసిద్ధ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించాడు, హాకింగ్ దేవుడి మస్తిష్కాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు” అంటాడు శాస్త్రవేత్త కార్ల్ సాగన్. విజ్ఞాన శాస్త్రవేత్త కోలిన్ ప్రైజ్ అంటాడు “బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం బైబిల్ నుంచి పుట్టిందా? అవును. బైబిల్లో దేవుని సృష్టి కథను రాసిన వాళ్లే బిగ్ బ్యాంగ్ కథను నమ్ముతారు. ఇది పూర్తి అవైజ్ఞానికం.” అంటాడు. “బైబిల్ లోని సృష్టి, చివరి తీర్పు కథలతో బిగ్ బ్యాంగ్, బిగ్ క్రంచ్ ముడిపడి ఉన్నాయి” అంటారు, తత్వవేత్తలు అలెన్ ఉడ్స్, టెడ్ గ్రాంట్. ఒక క్షణంలో విస్పోటం ద్వారా సృష్టి మొదలైంది, అలాగే పదార్థం కుంచించుకుపోయి విశ్వం అంతరిస్తుంది అని చెప్పే సైన్సు సిద్ధాంతాలు ఇవి. దీనికి ప్రముఖ శాస్త్రవేత్తల మాటల్ని ప్రమాణంగా చూపుతారు ఈరచయితలు.
ఇంత చర్చ ఎందుకు జరుగుతోందంటే చర్చి పెద్దలకు సైన్సుతో, సైన్సు వ్యతిరేకతతో కూడా తీవ్ర సంబంధం ఉంది. ఎందుకు ఉందంటే దేవుడికి పాశ్చాత్య హేతు చింతనకు స్పష్టమైన సంబంధం ఉంది. దేవుడు జగ త్తును సృష్టించాడు అనే వాక్యంలో దేవుడు కారణం, సృష్టి కార్యం. అలాగే కారణ-కార్యాలలో ఒక క్రమం ఉంది. బైబిల్లో కాలం కూడా నిర్దిష్టంగా చెప్పబడింది — ఏడు రోజులు అంటూ. అలాగే బిబ్లికల్ జెనెసిస్ లోనైనా, సైంటిఫిక్ కాస్మాలజీ లోనైనా కారణానికి కార్యానికి పూర్తి అవినాభావ సంబంధం లేదు. కానీ అతి ప్రాచీన భారతీయ సాంఖ్య దర్శనం కార్య కారణ అభేదం చెప్పింది, కారణం కార్యం రెండు ఒకటే అంది. దీనితో పాశ్చాత్య క్రమబద్ధత సాధ్యం కాలేదు. ఇది చారిత్రక దృష్టిని, చారిత్రక పరిణామాన్ని అసాధ్యం చేసింది. కానీ పాశ్చాత్య హేతుచింతన చారిత్రకతపై ఆధారపడి ఉంది. అందుకే గొప్ప కాస్మాలజిస్ట్ స్టీఫెన్ హాకింగ్ పుస్తకం పేరు “బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్”.
కాలాన్ని చంపేసిన భారతీయ చింతన — అనంతం
భారతీయుల కాలదృష్టి చక్రాకృతిలో ఉంటుంది, పునరావృతమవుతుంది, ముందుకు కదలదు. ఇది చరిత్రకారుడు కోశాంబితో సహా అనేకమంది వాదన. మనం భూత, భవిష్యత్తు, వర్తమానాలు అంటాం. దీనిలో కాలం మొత్తం తలకిందులైంది. వర్తమానం కంటే భవిష్యత్తు ముందుకు వచ్చింది. అంటే గింజలోనే చెట్టు పళ్ళు ఉన్నాయి. కారణంలోనే కార్యం ఉంది. వర్తమానం కంటే ముందే భవిష్యత్తు వస్తుంది. ఇలా భాషలోనే పాశ్చాత్య వైఖరి కన్నా భారతీయ దృక్పథం భిన్నం. జన్మ పరంపర కానీ, దైవ అవతార భావన కానీ చక్రాకృతిలో తిరిగి పునరావృతమవుతాయి. ఇది పాశ్చాత్య క్రైస్తవ యుగభావానికి పూర్తి విరుద్ధం. బైబిల్లో కూడా కాలం పునరావృతం కాదు. అందువల్ల కాలక్రమం అనే భావన లేకపోవడం భారతీయుల చింతనలోని ప్రధాన అంశం. ఇది మార్క్సిస్టు చరిత్రకారుడు కోశాంబి భూస్వామ్య లక్షణం, వ్యవసాయ సమాజ లక్షణం అంటాడు. కానీ పాశ్చాత్యంలో ఎప్పటినుంచో కాలం ముందుకే కదులుతుంది అనే భావన బలంగా ఉంది. అది వారి మత భావన, ప్రాపంచిక దృక్పథాలలో కలిసి కనిపిస్తుంది.
యుగ భావన
నిజానికి పీరియడు అనే గ్రీకు పదానికి చక్ర ఆకృతి కలిగిన మార్గం అని అర్థం. యూరప్‌లో 14, 18 శతాబ్దాల మధ్య యుగ భావనలోకి మారింది, ముందుకే కదిలే కాలం అనే భావన బలపడింది. 20వ శతాబ్దంలో పీరియడైజేషన్ చరిత్రరచనలో బలపడింది. మొదటి నుంచి యూరోపియన్ క్రైస్తవులు కాలాన్ని ఒక రేఖీయ పురోగతిగా చూశారు అనేది గుర్తించదగిన విషయం. సెయింట్ ఆగస్టు లాంటి క్రైస్తవ తాత్వికులు చరిత్రను ఆరు యుగాలుగా విభజించారు. ఇవి సృష్టి నుండి, దేవుడు తీర్పు దినం వరకు వ్యాపించాయి. కానీ భారతీయ యుగ భావన పునరావృత్తిలో చక్రాకృతితో కూడినది, దానికి మొదలు లేదు, తుది లేదు, అనంతం. కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు చక్రీయంగా పునరావృతం అవుతాయి. అలాగే సంవత్సరాలు కూడా పునరావృతం అవుతాయి. మనకి విష్ణువు తిరిగి తిరిగి అవతరిస్తాడు, మళ్ళీ యుగ ధర్మ అనుసారం రామ కృష్ణ ఆది అవతారాలు పునరావృతం అవుతాయి అని పురాణాలు చెపుతాయి.
క్రైస్తవులకు ఆది అంతాలు చాలా ప్రధానమైనవి. వాళ్ళకి కాలం లీనియర్. ముందుకే కదులుతుంది.
కాల భావన -చారిత్రక దృక్పథం
దేవుని సృష్టి ఆదికాండంతో మొదలై, చివరి తీర్పుతో ముగుస్తుందని పాశ్చాత్య క్రైస్తవ దృక్పథం భావిస్తుంది. అందువల్ల, వారికి కాలక్రమం స్పష్టంగా ఉంది. ఈ రేఖీయ కాల భావన చారిత్రక దృక్పథానికి, పరిణామ దృష్టికి దారితీసింది, ఇది సైన్స్ అభివృద్ధికి మూలమైంది. కానీ, భారతీయ యుగ భావనలో సంవత్సరాలు క్రమబద్ధంగా కాక, చక్రీయంగా తిరుగుతాయి. అందుకే, యూరోపియన్లు భారతదేశానికి వచ్చి చరిత్ర రచన, యుగ విభజన చేయవలసి వచ్చింది.
జేమ్స్ మిల్ యొక్క యుగ విభజన
పాశ్చాత్య చరిత్రకారుడు జేమ్స్ మిల్ భారతీయ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా విభజించాడు. అతని దృష్టిలో, హిందూ – ముస్లిం పాలకులు మతపరమైన పక్షపాతం, నిరంకుశత్వంతో పాలించారు. బ్రిటిష్ పాలన మాత్రం భారతదేశానికి పురోగతి, నాగరికత, హేతుబుద్ధిని తెచ్చిందని భావించాడు. ఈ దృక్పథాన్ని గురజాడ వంటి మేధావులు సమర్థించారు, బ్రిటిష్ కాలాన్ని “వచ్చేనిదె బంగారు కాలం” అని పేర్కొన్నారు. ఇదే దృక్పథం కార్ల్ మార్క్స్, అంబేద్కర్ వంటి మేధావులలో కూడా కనిపిస్తుంది.
వర్గీకరణ – హేతు చింతన
పాశ్చాత్య దృక్పథంలో విభజన, వర్గీకరణలకు తీవ్ర ప్రాధాన్యం ఉంది. అరిస్టాటిల్‌ను విజ్ఞాన శాస్త్రానికి పితామహుడిగా భావిస్తారు. అతని జంతువుల వర్గీకరణ, శరీర భాగాల విభజన, తులనాత్మక శరీర నిర్మాణ శాస్త్రం వంటివి పాశ్చాత్య ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేశాయి. అరిస్టాటిల్ తత్వశాస్త్రం క్రైస్తవ చర్చిని కూడా ప్రభావితం చేసింది, అతని వర్గీకరణ, నిర్వచన పద్ధతులు క్రైస్తవ సిద్ధాంతాన్ని క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడ్డాయి. ఈ వర్గీకరణ భావన సైన్స్ దృక్పథానికి మూలంగా నిలిచి, హేతు చింతనను పెంచింది. మొదట్లో హేతు చింతన ఈ క్రమబద్ధమైన బాటలో నడిచింది, కానీ తర్వాత క్వాంటం ఫిజిక్స్ రూపంలో పెద్ద ఉత్పరివర్తనం సంభవించింది.
భారతీయ తాత్వికతలో సమన్వయ దృష్టి
భారతీయ తాత్వికత వర్గీకరణ లేదా క్రమబద్ధీకరణ కంటే సమన్వయ దృష్టికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది, అంటే విశ్లేషణ కంటే సంశ్లేషణ ప్రధానం. సాంఖ్య దర్శనం యొక్క కార్యకారణాభేద సిద్ధాంతం ఇదే చెబుతుంది. భారతీయులు పరస్పర విరుద్ధమైన హేతు వైఖరులను కలిపేస్తారు. ఉదాహరణకు, నిమిత్త కారణం – ఉపాదాన కారణం. 1)నిమిత్త కారణం అంటే ఒక పనికి ఉపకారకంగా ఉండేది, ఉదాహరణకు, కుండ చేయడంలో చక్రం. 2)ఉపాదాన కారణం అంటే కార్యం లేదా వస్తువు పుట్టడానికి మూల కారణం, ఉదాహరణకు, కుండకు మట్టి. ఈ రెండు రకాల కారణాలను కలిపి “నిమిత్తోపాదాన కారణం” అని ఒకే హేతువుగా సృష్టించారు.
వేదాంత తాత్వికులు ఈ ప్రపంచానికి ఈశ్వరుడు నిమిత్తోపాదాన కారణమని చెబుతారు, అంటే సృష్టించేవాడు భగవంతుడు, సృష్టించబడే జగత్తు కూడా భగవంతుడే. ఇది థామస్ ఆక్వినాస్ యొక్క అరిస్టాటిల్ నుంచి గ్రహించిన “చలింపచేసే నిశ్చలుడు” (Unmoved Mover) భావనకు పూర్తి భిన్నం. పాశ్చాత్య క్రైస్తవ తత్వంలో భగవంతుడు శాశ్వతుడు, పరిపూర్ణుడు, భౌతిక జగత్తుతో సంబంధం లేనివాడు, స్వయం సంపూర్ణుడు. దేవుడు జగత్తుతో పూర్తిగా వేరు. ఎక్కడికక్కడ విభజన, వర్గీకరణ క్రమబద్ధీకరణలు గ్రీకు పాశ్చాత్య తత్వంలో ప్రధానమైనవి.
భారతీయ హేతు చింతన యొక్క ప్రత్యేకత
భారతీయ హేతు చింతన దీనికంటే పూర్తిగా భిన్నమైనది. అందుకే భావవాదం, భౌతికవాదం, ఆస్తికత, నాస్తికత వంటి ద్వంద్వ విరుద్ధాలతో (binary opposites) భారతీయ తాత్విక ధోరణిని విశ్లేషించడం అసాధ్యం. కానీ, కమ్యూనిస్టులు, దళితవాదులు, హేతువాదులు, హిందూ వాదులు—అందరూ ఆధునికులు కూడా—ఈ తప్పు చేస్తారు.
పురాణాలు -కార్యకారణ సంబంధం
అనేక పురాణాలలోని సృష్టి వర్ణనల ప్రకారం, జీవులు తమ కర్మల ప్రకారం అంతులేని జన్మలు ఎత్తుతారు. ప్రళయ కాలంలో జీవుల కర్మలు సూక్ష్మ రూపంలోకి మారతాయి. మళ్లీ సృష్టి మొదలైనప్పుడు, ఆ కర్మల ప్రకారం జీవులు వివిధ రూపాలలో ఆవిర్భవిస్తాయి, అంటే కర్మలే జీవులుగా పుడతాయి. అంటే క్రియలే కర్తలుగా మారుతాయి. ఇక్కడ కూడా సాంఖ్య తత్వంలోని కార్యకారణాభేదం కనిపిస్తుంది.
పూర్వ మీమాంస శాస్త్రం ప్రకారం కర్త క్రియా విశేషణం మాత్రమే. అంటే కర్త, క్రియ ఒకటే. నిజానికి క్రియ ఒక్కటే వాస్తవం.
పాశ్చాత్య తత్వశాస్త్రం వ్యక్తి ఆవిర్భావానికి మూలమైంది. అక్కడ కారణం వేరు, కర్త, కర్మ పూర్తిగా వేరు. ఈ వర్గీకరణ ఏజెన్సీకి, కొత్తతనానికి, ప్రత్యేకతకు దారితీసింది. ఇదే దేవుడు సృష్టికర్త అనే భావనకు మూలం. అలాగే, కర్త, కర్తవ్యం, ఏజెన్సీ, ఎన్నిక, స్వేచ్ఛ వంటి భావనలు వ్యక్తివాదానికి దారితీసాయి.
మనిషి యొక్క ప్రత్యేకత
క్రైస్తవంలో, మనిషి దేవుని ప్రతిరూపంగా సృష్టించబడ్డాడు. ఈ ఆధారంతో, 19వ శతాబ్దపు ప్రొటెస్టంట్‌లు దేవునికి మానవ లక్షణాలు ఆపాదించారు. ఇది, విలోమంగా, “మనిషే దైవాన్ని సృష్టించాడు” అనే నాస్తిక ధోరణికి దారితీసి ఉండవచ్చు. ఏదేమైనా, వ్యక్తివాదానికి బీజాలు పాశ్చాత్య క్రైస్తవ భావనలలో ఉన్నాయి.
స్వయం సంపూర్ణత, అంటే స్వతంత్ర నిర్ణయం తీసుకునే వ్యక్తి అనే భావనకు మూలాలు థియాలజీలో ఉన్నాయి. మొదట్లో, “పర్సన్” అనే పదం గ్రీకు, రోమన్ రంగస్థలంలో నటులు ధరించే ముసుగును సూచించేది. తర్వాత, ఆ నటులనే “పర్సన్” అనడం మొదలైంది. కానీ, భారతదేశంలో ముసుగు (వేషం, పాత్ర )నటుడు ప్రేక్షకుడు ఒకటే. రస సిద్ధాంతం ప్రకారం, సాధారణీకరణ వలన నాటకంలోని పాత్రతో, ఆ పాత్ర యొక్క అనుభవాలతో ప్రేక్షకుడు ఐక్యత పొందుతాడు. “రసో వై స: ” అంటే, రాముడిని చూసేవాడు రాముడిగా మారిపోతాడు. వాడే రాముడు. ఈ ప్రపంచాన్నే నాటక రంగంగా చూడడం భారతీయ తాత్వికతలో ప్రధానం. సాంఖ్యం ప్రకృతిని, పురుషుణ్ని (చైతన్యం) బద్ధుణ్ని, వివశుణ్ని చేసే నర్తకిగా పోలుస్తుంది.
రస సిద్ధాంతం vs కథార్సిస్
అరిస్టాటిల్ యొక్క కథార్సిస్ సిద్ధాంతంతో రస సిద్ధాంతానికి తేడా ఉంది. విషాదాంత నాటకం ప్రేక్షకుడిలో జాలినీ భయాన్ని కలిగిస్తుంది. కథలోని పాత్రలు ఎదుర్కొనే దురదృష్ట పరిస్థితులు, వారి బాధలు ప్రేక్షకులను జాలిపడేలా చేస్తాయి. అదే సమయంలో, పాత్రలు చేసే తప్పులు, క్రూరత్వం ప్రేక్షకులలో భయాన్ని కలిగిస్తాయి. ఈ భావోద్వేగాల ద్వారా ప్రేక్షకులు మానసిక ప్రక్షాళన లేదా విమోచన పొందుతారు, అంటే ప్రేక్షకుడు వ్యక్తిగా వేరుగా మిగిలి, తనను వేరుగా నిలుపుకొని కళానుభూతి చెందుతాడు. భారతీయ రస సిద్ధాంతంలో మాత్రం వ్యక్తి అనుభవంలో కరిగిపోతాడు.
ఆధునిక నాటకం -భారతీయ దృక్పథం
20వ శతాబ్దంలో, జర్మన్ నాటక రచయిత, కమ్యూనిస్ట్ బెర్టోల్ట్ బ్రెహ్ట్ నాటకానికి పరాయీకరణ సిద్ధాంతాన్ని అన్వయించాడు. ఆధునిక నాటకం భావోద్వేగాలలో ముంచెత్తకుండా, వేదికపై జరిగేది కేవలం కథ మాత్రమేనని భావించేలా, విశ్లేషణాత్మకంగా ఉండాలని వాదించాడు. అంటే ప్రేక్షకుడు పూర్తి విడిగా ఉండాలి. వ్యక్తిత్వాన్ని నిలుపు కొని కళను ఆస్వాదించాలి, విశ్లేషించాలి. కళలో లీనం కాకూడదు. దీనివల్ల ప్రేక్షకులు సామాజిక-రాజకీయ సమస్యలపై దృష్టి పెట్టగలరని చెప్పాడు. కానీ, భారతీయులు ఇప్పటికీ కళలో లీనమై, అదే పరమార్థమని భావిస్తారు.
ఆధునిక తెలుగు కవి జాషువా తన ఆత్మకథలో ఈ భావాన్ని వ్యక్తం చేశారు. శ్రీశ్రీ కవిత్వాన్ని దివ్యానుభవం, బ్రహ్మానుభవంగా వర్ణిస్తాడు. తాను వర్ణించే వస్తువుతో తాదాత్మ్యం చెందినప్పుడే రచన రసస్ఫూర్తిదాయకంగా సాగుతుందని జాషువ చెబుతారు. ఒక పండితుడు యువకుడైన జాషువకు కావ్య రచన గురించి సలహా ఇస్తూ, వస్తువుతో తాదాత్మ్యం చెందినపుడే, వర్ణనీయ వస్తువుగా కవి పరివర్తన చెందినపుడే కావ్య రచన సాధ్యం అని చెపుతాడు. ఆ అభిప్రాయాన్ని జాషువ మొదట వెటకారం చేస్తాడు. గాడిదను వర్ణించాలి అంటే గాడిదగా మారాలా అని భావిస్తాడు. తర్వాతి కాలంలో జాషువ తాను పొరపడ్డాను అని, ఆపండితుడు చెప్పిన రస సిద్ధాంతమే పూర్తి సత్యం అని నిర్ధారణకు వస్తాడు. ఈ తాదాత్మ్య భావన, అద్వైత భావన, అభేద భావన భారతీయులలో ప్రధానమైనవి.
పురాణ పురుషుల ప్రభావం
సోషలిస్ట్ రామ్ మనోహర్ లోహియా ప్రకారం, స్థల-కాలాలలోని చారిత్రక వ్యక్తుల కంటే పురాణ పురుషులే మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు. చారిత్రక పురుషుల కంటే పురాణ పురుషులు ఎక్కువ ప్రభావశీలులని అంటారు. అందుకే, హిందూ వాదుల నుండి దళితవాదుల వరకు, రాముడు, కృష్ణుడు, ఏకలవ్యుడు, శంబూకుడు వంటి పురాణ పురుషులను ఆదర్శంగా తీసుకుంటారు. వ్యక్తి అనే భావనకు తాత్విక మూలాలు లేకపోవడమే దీనికి కారణం.
భారతీయ హేతు చింతనలో అభేద భావన
భారతీయ తాత్వికతలో హేతు చింతన, అద్వైత వేదాంత దర్శనంలో ద్రష్ట మరియు దృశ్యం ఒకటేనని, వాటి మధ్య అభేదం ఉందని చెబుతుంది. దీనివల్ల దృశ్య జగత్తు మాయగా మారి, ద్రష్ట మాత్రమే మిగులుతాడు. ఈ వాదాన్ని మహాయాన బౌద్ధం అభివృద్ధి చేసింది. ఈ బౌద్ధ మిథ్యావాదాన్ని ఖండించినవాడు పూర్వ మీమాంసా దర్శన వేత్త కుమారిల భట్టు.
కుమారిల భట్టు ఇలా వాదిస్తాడు:
వేలు తనను తానే తాకలేదు,
వంట తనని తానే స్వయంగా వండుకోలేదు,
సూది తనలోకి తాను చొచ్చుకుపోలేదు.
జ్ఞానం తనను తాను స్వయంగా తెలుసుకోవడం అసంభవం.
ఆత్మ జ్ఞానం అంటూ ఏమీ లేదు.
వస్తు జ్ఞానం మాత్రమే ఉంది.
అతను మరింత వివరిస్తూ, “జ్ఞానం తనను తాను మాత్రమే తెలుసుకుంటుంది, జ్ఞానానికి బయట ఏమీ లేదన్నట్లయితే, ‘నేనే నీలి రంగుని’ అనే జ్ఞానం కలుగుతుంది తప్ప, ‘ఇది నీలిరంగు’ అనే జ్ఞానం ఎప్పుడూ కలగదు. అందువల్ల బాహిర వస్తు జగత్తు పూర్తిగా సత్యం. జ్ఞానం ఎప్పుడూ బయటికే ప్రసరిస్తుంది.”
ఈ విధంగా, సబ్జెక్ట్ మరియు ఆబ్జెక్ట్ విభజనను నిరాకరించే బౌద్ధతర్కాన్ని తిరస్కరించాడు కుమారిల భట్టు.
ఈ పూర్వ మీమాంసకులు జగత్తు స్వతఃప్రమాణం అంటారు. అంటే అనాదిగా ఉంది ఎవరూ సృష్టించలేదు. ఎవరైనా సృష్టి కర్త ఉంటే అతడికి మరొక కర్త ఉండాలి ఇది అనవస్థకు దారి తీస్తుంది. ఇదే తర్కాన్ని సాంఖ్యులు అనుసరించారు. ఖగోళ శాస్త్రవేత్త భాస్కరాచార్యులు (11వ శతాబ్దం) ‘సిద్ధాంత శిరోమణి’లో ఇదే తర్కం ఆధారంగా భూమి ఏ ఆధారం లేకుండా శూన్యంలో నిలిచిఉంది అని చెప్పాడు. భూమికి ఒక ఆధారం ఉంటే దానికి మరొక ఆధారం ఉండాలి కదా. స్వతఃప్రమాణం, స్వభావం వంటివి భారతీయ ఆస్తిక దర్శనాలలో ప్రధానమైన భావన.
కుమారిల భట్టు యొక్క సనాతన వాదం
ఈ చర్చ శంకరాచార్యునికి చాలా ముందుది. చరిత్రకారులు రోమిలా థాపర్ రేషనలిస్టులు అయిన బౌద్ధులు దేవుడిని, వేదాలకు దైవ అధికారాన్ని బోధించే బ్రాహ్మణుల తత్వాన్ని వ్యతిరేకించారు అని రాశారు. నిజానికి, యోగాచార బౌద్ధుల మాయావాదాన్ని ఖండించి, జగత్తు సత్యమని బోధించినవాడు సనాతన బ్రాహ్మణుడు, వేద ప్రమాణవాది అయిన కుమారిల భట్టు. ఏడవ శతాబ్దంలో, అతను వేదిక్ రిచ్యూవలిస్ట్‌గా ఉండి ఈ వాదాన్ని స్థాపించాడు. పైగా కర్మ పునర్జన్మ ముక్తి లాంటి భావాలకు చాలాకాలం దూరంగా వున్నాడు. పూర్వమీమాంసా సూత్రాలకు భాష్యం రాసిన శబరుడు (5వ శ.) కూడా ఎక్కడా కర్మ ,పునర్జన్మ, ముక్తి ప్రసక్తి తీసుకు రాడు. అలాగే పూర్వ మీమాంసకుడు ప్రభాకరుడు(7వ శ.)కూడా వాటిని ప్రస్తావించడు.
నిజానికి నాటి బ్రాహ్మణ మీమాంసకులు దేవుడు అనే భావాన్ని తిరస్కరించారు. జగత్తు సత్యం అన్నారు. అదే సమయంలో జగత్తు మిథ్య, బుద్ధుడు అవతరించి ఉద్ధరిస్తాడు అనే భావనలు మహాయాన బౌద్ధులు ప్రచారంలోకి తెచ్చారు. బౌద్ధులు మొదటి నుంచి కర్మ పునర్జన్మ సిద్ధాంతాలు వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ సిద్ధాంతాలు కులవ్యవస్థకు సమర్థనగా పని చేశాయి. అందుకే చరిత్ర కారులు ఇర్ఫాన్ హాబీబ్ కులవ్యవస్థను సమర్థించే మౌలిక భావనలు బౌద్ధంలో ఉన్నాయి అన్నారు. బౌద్ధులు యోగి ప్రత్యక్షం లాంటి అతీంద్రియ మహిమలను కూడా నమ్మడం మొదలెట్టారు. కానీ ఆ మహిమలను బ్రాహ్మణ మీమాంసకులు ఖండించారు. బౌద్ధుల అనాత్మ వాదం ఆనాటి బ్రాహ్మణుల ఆత్మవాదం కంటే హేతుబద్ధం అని చెప్పడం కష్టం. ఎందుకంటే బుద్ధ ఆరాధన, అవతార భావన, పునర్జన్మ లాంటి నమ్మకాలను బౌద్ధులు ప్రచారంలోకి తెచ్చారు ఇదే పురాణాలకు విష్ణు అవతార భావనకు మూలం అనే వాదం ఉంది. పెద్దఎత్తున స్థూపాలు విగ్రహాలు స్థాపించి విగ్రహారాధనకు బీజాలు నాటింది మొదట్లో బౌద్ధులే. పైగా బౌద్ధులు జగత్తు అసత్యం అన్నారు. మీమాంసకులు జగత్తు సత్యం అన్నారు. మహాయాన బౌద్ధులు జగత్తు మిథ్య చైతన్యం మాత్రమే సత్యం అంటే, మీమాంసకులు ఇంద్రియ అనుభవాన్ని ప్రత్యక్ష ప్రమాణాన్ని బలపరిచారు. మీమాంసకులు కుల వ్యవస్థను సమర్థించిన మాట నిజమే, అది ప్రకృతి సిద్ధం సహజం అన్నారు కానీ దానికి దైవిక కారణాలు చెప్పలేదు. జాతి స్వచ్ఛతకు సంబంధించిన భావాలు బౌద్ధ గ్రంథాలలో ఉన్నాయి. చరిత్ర కారులు ఇర్ఫాన్ హాబీబ్ కూడా ప్రస్తావిస్తారు (అంబట్ట సూత్త).
వలసవాద ప్రభావం
గొప్ప చరిత్రకారులైన రోమిలా థాపర్ వలసవాద చారిత్రక పద్ధతులను విమర్శించినప్పటికీ, ఆ ప్రభావాల నుంచి పూర్తిగా బయటపడలేకపోయారు. బౌద్ధులను హేతుబద్ధతకు సింబల్‌గా చూసారు. ఆవిడ తన వ్యాసాలలో బౌద్ధ తార్కికుల ప్రస్తావన ఉంటుంది కానీ కుమారిలుని గురించి గానీ, న్యాయవైశేషికాది వైదిక దార్శనికుల గురించిగానీ, వారు ఎటువంటి నిశిత తర్కాన్ని వ్యాపింపజేశారు అనే విషయాలపై చర్చ కనిపించదు. ఆ విధంగా విష్ణువును మయామోహునిగా చూపే పురాణ కథల ప్రసక్తి తెచ్చారు కానీ బ్రాహ్మణ తాత్వికుల తార్కికుల వాదనలను పక్కనబెట్టారు. వాళ్లను హేతువిరుద్ధమైన వాళ్లుగా చూసే మోడర్న్ బయాస్ కారణం. ఈ పక్షపాతబుద్ధికి కారణం బౌద్ధాన్ని భారతీయ ప్రొటెస్టెంట్ సంస్కరణ మతంగా భావించే వలసవాద ఆలోచన.
రిచ్యువలిస్ట్ అయినప్పటికీ చార్వాకులతో సమానంగా జగత్తు సత్యం అన్న కుమారిలుడు పేరు కూడా రోమిలా థాపర్ ఎందుకు తలవలేదు? నిజానికి జైనుల వంటి వారు కూడా మీమాంసకుల నాస్తికతకు దైవ నిరాకరణకు విస్తుపోయారు. వేదాంతులు మీమాంసకులను నాస్తికులు అన్నారు. గోవిందానంద శంకరాచార్య విరచిత బ్రహ్మ సూత్ర భాష్యానికి రాసిన రత్నప్రభ వ్యాఖ్యానంలో మీమాంసకులను బ్రహ్మ ‘నాస్తికులు’ అని విమర్శించారు. కానీ థాపర్ ఆ సంగతులు ప్రస్తావించరు. పైగా బ్రాహ్మణ సంస్కృతినీ, తత్వాన్ని పూర్తి హేతువిరుద్ధమైనదిగా చూపారు. అందుకు పతంజలి చెప్పినట్లుగా ప్రసిద్ధిలో ఉన్న పాము ముంగిస వైర ఉదాహరణ చూపుతారు. అందువల్ల రోమిలా థాపర్ ఆలోచనలు హేతుచింతన వలసవాద ప్రభావాలను తప్పించుకోలేకపోయింది. హేతువుకు గల విస్తృత అర్థాన్ని వ్యాప్తిని గుర్తించడంలో విఫలం అయ్యారు నిజానికి, యోగాచార బౌద్ధుల మాయావాదాన్ని ఖండించి, జగత్తు సత్యమని బోధించినవాడు సనాతన బ్రాహ్మణుడు, వేద ప్రమాణవాది అయిన కుమారిల భట్టు. ఏడవ శతాబ్దంలో, అతను వేదిక్ రిచ్యూవలిస్ట్‌గా ఉండి ఈ వాదాన్ని స్థాపించాడు. అందువల్ల బౌద్ధులు వైదిక బ్రాహ్మణుల గురించి ప్రాచుర్యంలో ఉన్న స్టీరియో టైప్స్ వదిలిపెట్టి ఆలోచిస్తేనే, సత్యం బోధ పడుతుంది.
బౌద్ధులు-బ్రాహ్మణులను ద్వంద్వ విరుద్ధాలుగా (binary opposites) చూడడం, బ్రాహ్మణులను భావ వాదులుగా కేవల మిథ్యా వాదులుగా. స్టీరియో టైప్ చేయడం ఈ పద్ధతిలో భాగం. అయితే, ఇటువంటి విభజనలు భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడవు.
శంకరాచార్యుల అద్వైత దర్శనం
కుమారిల భట్టు బౌద్ధ మాయావాదాన్ని ఖండించిన 100 సంవత్సరాల తర్వాత, శంకరాచార్యులు “జగత్తు మిథ్య” అనే బౌద్ధ మాయావాదాన్ని తమ అద్వైత దర్శనంలో సమన్వయం చేశారు. పరస్పరం కొట్లాడుకున్నట్టు కనిపించే భిన్న దృక్పథాలు ఇలా స్నేహపూర్వకంగా కలిసిపోవడం భారతీయ సంస్కృతిలోని ప్రత్యేకత. కొందరు ఆధునికులు దీనిని వెనుకబాటుగా భావిస్తారు, మరికొందరు ఒకే దృక్పథం, సిద్ధాంతం లేదా మతం ఆధిపత్యం లోకి వచ్చి ప్రత్యేకతలను నీరసింప చేయడంగా విమర్శిస్తారు. ముఖ్యంగా, ఆధునిక కాలంలో ఇలా స్వాభావికంగా జరిగే సమన్వయాలను, సంగమాలను అజ్ఞానంగా పరిగణిస్తారు. మితిమీరిన విభజన మరియు విశ్లేషణలు విజ్ఞానంగా స్థిరపడ్డాయి, దీనికి ప్రొటెస్టంట్ క్రైస్తవం మరియు గ్రీకు తాత్వికత కారణమయ్యాయి. అస్తిత్వాలు ఎప్పుడూ ఎక్కడా కలవని ద్వీపాలుగా మిగిలిపోవడానికి ఈ దృక్పథాలు కారణం.
“దేవుడు మరణించాడు”
తత్వవేత్త నీషే యొక్క “దేవుడు మరణించాడు” అనే ప్రకటన నిజానికి దేవుడు, మతం గురించి కాదు, ప్రధానంగా పాశ్చాత్య హేతువు యొక్క పరిమితుల గురించి. ఒక కర్త కేంద్ర స్థానంలో ఉన్న మనిషి ఇగోను బద్దలు చేసింది యీ ప్రకటన. పాశ్చాత్యంలో దేవుడు అనే భావన వ్యక్తివాదానికి మూలమైంది. బైబిల్ బోధ ప్రకారం, దేవుడు మనిషికి ప్రకృతిలో ప్రత్యేక స్థానాన్ని కల్పించాడు. ఇది మనిషిని ప్రకృతి నుంచి పూర్తిగా వేరు చేయడమే కాక, ప్రకృతి విధ్వంసకుడిగా, జీవజాతుల, మానవజాతుల వినాశకారుడిగా మార్చింది. చివరికి, యూరో-సెంట్రిక్ విస్తరణ వలసవాదానికి, సామ్రాజ్యవాదానికి దారితీసింది.
విజ్ఞాన శాస్త్రం, క్రైస్తవ ప్రభావం
విజ్ఞాన శాస్త్రం పేరుతో సూడో-సైన్స్ విజయం సాధించి, యూజెనిక్స్ వంటి ప్రమాదకర పరిశోధనలకు దారితీసింది. ఈ పరిణామాలను దేవుడు నిర్దేశించిన ప్రగతిగా ప్రొటెస్టంట్లు ప్రచారం చేశారు. నిజానికి, పాశ్చాత్య శాస్త్రవేత్తలు మత విశ్వాసాలకు అతీతులు కాదు; వారిపై క్రైస్తవ ప్రభావం బలంగా ఉంది. దీనికి ఉదాహరణ 19వ శతాబ్దపు స్థల-కాల భావన. న్యూటన్ ప్రకారం, స్థల-కాలాలు శాశ్వతమైనవి, దేవుని అనంత స్వభావాన్ని, ఉన్నతత్వాన్ని సర్వవ్యాప్తంగా సూచిస్తాయి, అందుకే అవి నిరపేక్షమైనవి.
న్యూటన్ vs బర్కిలీ
మన మేధావులు భావవాదాన్ని వెనుకబాటుగా, అజ్ఞానంగా నిందిస్తారు. కానీ, న్యూటన్ సమకాలీనుడైన భావవాద తత్వవేత్త బర్కిలీ న్యూటన్ యొక్క శాశ్వత స్థల-కాల భావనను తీవ్రంగా విమర్శించాడు. బర్కిలీ దృష్టిలో, స్థల-కాల భావనలు పూర్తిగా సాపేక్షమైనవి (subjective). న్యూటన్ స్థలాన్ని అనంతమైనదిగా, స్వతంత్రమైనదిగా, వస్తువులతో సంబంధం లేనిదిగా చూశాడు, అంటే పూర్తి నిరపేక్షం. కానీ, బర్కిలీ ప్రకారం, స్థలం అనేది స్వతంత్ర భౌతిక సత్తా కాదు, వస్తువుల మధ్య సంబంధాలను గ్రహించే మానవ అనుభవం యొక్క రూపం. అలాగే, న్యూటన్ కాలాన్ని స్థిరమైన, సంపూర్ణమైన ప్రవాహంగా చూశాడు, ఇది సంఘటనలతో సంబంధం లేకుండా ఉంటుంది. కానీ, బర్కిలీ దృష్టిలో కాలం కూడా సాపేక్షమైనది, మనస్సు యొక్క గ్రహణంపై ఆధారపడి ఉంటుంది.
శంకరాచార్యులు – ఐన్‌స్టీన్
తర్వాత కాలంలో, ఐన్‌స్టీన్ స్థల-కాలాలు అబ్జర్వర్ పై ఆధారపడి ఉంటాయని, సాపేక్షమైనవని స్థాపించాడు. శంకరాచార్యులు ఎప్పుడో “మాయా కల్పిత దేశకాల” అని దక్షిణామూర్తి స్తోత్రంలో ప్రకటించారు. అయితే, ఐన్‌స్టీన్ మానసిక అనుభవంగా కాక, కాంతి వేగం ఆధారంగా భౌతికంగా స్థల-కాల సాపేక్షతను నిరూపించాడు.
కార్లో రోవెల్లి అనే శాస్త్రవేత్త స్థల-కాలాన్ని పూర్తిగా తిరస్కరిస్తాడు. “మనం కాలంలో లేము, మనలో కాలం ఉంది” అని అంటాడు. ప్రపంచంలో సంఘటనలు (ఈవెంట్స్) మాత్రమే ఉన్నాయి, వస్తువులు లేవు. అలాంటప్పుడు, స్థల-కాలాలు మనోనిర్మితాలు, మానవ అనుభవాలు, జ్ఞాపకాలు, ఆశా-నిరాశలలో తప్ప, బయట ఉనికిలో లేవు. రోవెల్లి తన లూప్ క్వాంటం గ్రావిటీ సిద్ధాంతం ఆధారంగా స్థల-కాలాలు నిజంగా ఉనికిలో లేవని నిరూపిస్తాడు. (సైన్సు ప్రకారం, పదార్థం అనేది శక్తి, క్షేత్రాల ఫలితంగా ఏర్పడిన ఈవెంట్‌ల సమాహారం. క్వాంటం సిద్ధాంతం ప్రకారం, పరమాణువులు, కణాలు వంటివి నిరంతరం కదలికలో ఉంటాయి, వీటిని ఈవెంట్‌లుగా చూడవచ్చు. అన్నీ శక్తి మార్పిడి, పరస్పర చర్యల ఫలితాలే. స్థూలంగా పదార్థంగా కనిపించే వాటి మూలం ఈ ఈవెంట్‌లే).
బౌద్ధులు ప్రపంచం అనాత్మ అన్నారు. వివిధ భాగాల కలయిక వల్ల రథం అనే వస్తువు భాసిస్తోంది. అలాగే అన్ని వస్తువులు, నేను అనే ఎరుక, ఐడెంటిటీలు, నామరూపాలు ప్రపంచంలో సిద్ధిస్తున్నాయి అంటారు బౌద్ధులు. అంటే తాత్కాలికమైన క్షణికమైన సంఘటనలు, కూర్పులు మాత్రమే సత్యం. (మిలింద పన్హా)
శంకరాచార్యులు బౌద్ధుల సత్య సామీప్యత
ఈ ఆధునిక సిద్ధాంతాలను చూసినప్పుడు, కుమారిలభట్టు కంటే శంకరాచార్యులు, బౌద్ధులు సత్యానికి ఎక్కువగా దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది. కుమారిల భట్టు సిద్ధాంతం ప్రకారం, భౌతిక జగత్తు అనాదిగా ఉంది, దేవుడు లేడు, ఇంద్రియాలతో వస్తువుల సంయోగం వల్ల జ్ఞానం సంభవిస్తుంది, కలల వంటి భ్రమలు వాస్తవం వల్ల బాధించబడతాయి. ఈ సిద్ధాంతం చార్వాక సిద్ధాంతం లాగే ప్రత్యక్ష ప్రమాణంపై ఆధారపడి, తక్షణ ఆమోదం పొందుతుంది. అందుకే, మీమాంసకులను జైనులు “ప్రచ్ఛన్న చార్వాకులు” అని పిలిచారు. కానీ, బౌద్ధులు, శంకరాచార్యులు స్థల-కాలాలు మనోనిర్మితాలని, మనం చూసే దృశ్యాలు దేహ పరిమితుల నుంచి పుట్టాయని చెప్పారు. ఆధునిక విజ్ఞానవేత్తలు కూడా దాదాపు ఇటువంటి సిద్ధాంతాన్నే ప్రతిపాదించడం ఆబ్బురపరిచే విషయం.
సైన్స్ మాత్రమే కాదు, తత్వశాస్త్రం కూడా మానవ ఆలోచనను ప్రభావితం చేస్తూ వచ్చింది. రెండూ పరస్పర పూరకాలుగా ఉన్నాయి. భావవాదం మరియు భౌతికవాద విభజనతో కొన్నిటిని అంగీకరించడం లేదా తిరస్కరించడం కుదరదని న్యూటన్-బర్కిలీ వివాదం స్పష్టం చేస్తుంది.
నిజానికి తత్వ శాస్త్రం లోనే అన్ని శాస్త్రాలు కలిసి ఉండేవి ఒకప్పుడు. మితిమీరిన కంపార్టమెంటలైజేషన్ విభజన తర్వాతది కదా. ఇప్పటికీ అటువంటి వేర్పాటు అసాధ్యంగా ఉంది.
బ్రాహ్మణ-బౌద్ధ ద్వంద్వాలు
బ్రాహ్మణ – బౌద్ధ ద్వంద్వాలలో ఒకటి గొప్పది లేదా ప్రగతిశీలమైనదని చెప్పడం కుమారిల భట్టును లేదా బౌద్ధాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి అవరోధం. నిజానికి, మొదటి భౌతికవాదం—ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే—అంటే, మనం చూసేది మాత్రమే సత్యమని భావించడం. కానీ మన ప్రత్యక్ష అనుభవాన్ని సందేహించడం నుంచే శాస్త్రం, సైన్స్, తత్వం వృద్ధి చెందాయి. నాసదీయ సూక్తంలో వేద ఋషి ఇలా అంటాడు: “ఈ సృష్టికి ముందు ఏముంది? అది దేవతలకు కూడా తెలియదు, ఎందుకంటే దేవతలు కూడా సృష్టి మొదలైన తర్వాతే ఆవిర్భవించారు. ” కనిపించే జగత్తును నిరాకరించి, దాని వెనుక చూడడం వల్లే అటువంటి ఊహా శక్తి వల్లే మానవ చింతన పదును తేలింది.
ఆధునికత — మౌలిక ప్రశ్నలు
గొప్ప ప్రశ్నలు ఉనికి గురించి మొదలయ్యాయి, కానీ ఆధునికత ఇటువంటి మౌలిక ప్రశ్నలను లేకుండాచేసిందని తత్వవేత్త హైడెగ్గర్ అంటాడు. ఉపనిషత్తులలో ప్రధానమైన ప్రశ్న మనిషి ఉనికి, దాని అంతరార్థం గురించి మాత్రమే.
ఆధునిక సైన్స్ మరియు భారతీయ తాత్వికత
మితిమీరిన విభజనలు, వర్గీకరణల నుంచి ఆధునిక సైన్స్ అభివృద్ధి చెందింది. నిజానికి, మనిషి “నేను”గా ఏర్పడి ప్రకృతితో వేరుపడటంలోనే అసంబద్ధత, దుఃఖం ఉన్నాయని ప్రాచీన తాత్వికులు చెప్పారు. ఈ తత్వంలో ఉనికిని శోధించడం ప్రధానమైంది. “నేను ఎవరు?” అనే మౌలిక ప్రశ్న ఉద్భవించింది. భారత తాత్వికుడు రమణ మహర్షి ఈ ప్రాచీన ప్రశ్నను మళ్లీ సంధించారు. ఉనికి యొక్క శోధన దేవుడిని రద్దు చేస్తుంది.
దేవుడు అనేది చేరుకోవలసిన కేంద్రం అది బాహిరం. అంతర్ముఖులకి దేవుడు రద్దు అవుతాడు. అందుకే ఎంత సంశయవాది అయినప్పటికీ, దేవుడిని తన తత్వంలో నిలిపాడు డెకార్టే. ఎందుకంటే సంకుచిత ‘హేతు బుద్ధి’ కొనసాగాలంటే దేవుడు అవసరం.
పాశ్చాత్య హేతువు — నీషే
ద్రష్ట మరియు దృశ్యాల మధ్య దూరం నిలిపివుంచడంలోనే ఆధునిక విజ్ఞానం ఎదిగింది. దాని విశ్లేషణాత్మక దృష్టి, వర్గీకరణ విధానం అభివృద్ధి చెందాయి. తనకంటే పూర్తిగా బయట వస్తుజాలం ఉందన్న దృష్టి దీనిలో ప్రధానం. పరం, పరలోకం, దేవుడు అనేవి అంతిమంగా ట్రాన్సెండెంటల్ సత్యాలుగా నిలిచాయి. నీషే ఈ ట్రాన్సెండెంటల్ స్థితిని, అతీత జ్ఞానాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. దీనిలో భాగమే “దేవుడు మరణించాడు” అనే ప్రకటన. దేవుడు, మనిషి, ప్రకృతి మధ్య విడదీయరాని దూరం నుంచి మతం మాత్రమే కాదు, ప్రకృతిపై మనిషి సార్వభౌమత్వం అనే హ్యూమనిజం, విజ్ఞాన శాస్త్ర దృక్పథం, ప్రొటెస్టంట్ క్రైస్తవ మతం కూడా అభివృద్ధి చెందాయి. ఇవి పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధికి దారితీసాయి.
పెట్టుబడిదారీ వ్యవస్థ — డెకార్ట్ డ్యూయలిజం
పెట్టుబడిదారీ వ్యవస్థను అభివృద్ధిగా భావించే దృక్పథం నుంచి అణచివేతగా నిరూపించే తత్వం ఎదిగింది. దేవుడు, సైన్స్ రెండూ కలిసిన దృక్పథాన్ని ప్రశ్నించే తత్వం మొదలైంది. పెట్టుబడిదారీ దృక్పథం, సైన్స్‌లకు మూలమైన డెకార్టే డ్యూయలిజం ప్రకృతిని మనిషికి ఉపయోగపడే వనరుగా చూసే యాంత్రిక ఆధిపత్యాన్ని పెంచింది. భావవాదానికి మూలపురుషుడైన ప్లేటో భావాలను ప్రకృతికి అతీత స్థితిలో నిలిపాడు. దాని నుంచే క్రైస్తవ దేవుడు, మనిషి, ప్రకృతి పూర్తిగా వేరుగా ఉన్నాయనే థియాలజీ పుట్టింది. నీషే దీనిని స్పష్టం చేస్తాడు.
డెకార్టే డ్యూయలిజం మాత్రమే కాదు, అసలు మొదట ప్లేటో భావ వాదం మతం సైన్సులలోని మితి మీరిన డ్యూయలిజంకు మూలం. ప్లేటో ప్రకారం భావములు వస్తువులకు మూలం. వస్తువులలో లేని స్వచ్ఛత భావాలలో ఉంటుంది. ఈ వాదం ప్రత్యేకతలను మింగేసే మితిమీరిన సాధారణీకరణలకు, అదే సమయంలో డ్యూయలిస్ట్ అగాధానికి కారణం అయింది.
క్వాంటం ఫిజిక్స్ — భారతీయ తాత్వికత
క్వాంటం ఫిజిక్స్ ద్రష్ట-దృశ్యం, సబ్జెక్ట్-ఆబ్జెక్ట్ విభజనను ప్రశ్నార్థకం చేసింది. దీనితో, నీల్స్ బోర్, డేవిడ్ బోమ్, కార్ల్ గుస్తావ్ జంగ్, ఎర్విన్ ష్రోడింగర్ వంటి క్వాంటం శాస్త్రవేత్తలు అందరూ ప్రీ-సోక్రటీస్ గ్రీకు ఫిలాసఫీ, ప్రాచ్య తత్వం, వివిధ బౌద్ధ దర్శనాలు, అద్వైతం, భారతీయ తాత్వికతల వైపు ప్రయాణించారు. ఇవి మితిమీరిన వర్గీకరణలు, వేర్పాటు దృక్పథాల నుంచి దూరం జరిగాయి. డేవిడ్ బోమ్ భారతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తితో జరిపిన సంభాషణలు సుప్రసిద్ధమైనవి.
దేవుడు పాచికలాడతాడా?
భారతీయ తాత్వికులు మరియు పౌరాణికులు జగత్తును లీలగా, క్రీడగా వర్ణించారు, అంటే భౌతిక వాస్తవికత ద్రష్ట -పరిశీలకుడు (అబ్జర్వర్)పై ఆధారపడి ఉంది. కోపెన్‌హాగన్ వివరణ ప్రకారం, క్వాంటం స్థితి యొక్క ఆబ్జెక్టివ్ రియాలిటీ కొలత లేకుండా నిర్వచించబడదు. అంటే, కొలత చేసే పరికరం, పరిశీలకుడు క్వాంటం సంఘటన ఫలితంలో ముఖ్యపాత్ర పోషిస్తారు. ఇక్కడ ఆబ్జెక్టుపై కంటే అబ్జర్వర్, అబ్జర్వేషన్ లపై దృష్టి ప్రధానమైంది. ఈ అంశం సోవియట్ శాస్త్రవేత్తలు మాత్రమే కాదు, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి వారి నుంచి విమర్శలను ఎదుర్కొంది. ఐన్‌స్టీన్ ఈ సందర్భంలోనే “దేవుడు పాచికలాడడు” అన్నాడు. దేవుడు అనేది కారణ-కార్య సిద్ధాంతానికి (cause and effect) ప్రాథమిక రూపం.
జైన అనేకాంతవాదం, అద్వైతం
సోవియట్ కమ్యూనిస్ట్ శాస్త్రవేత్తలు క్వాంటం ఫిజిక్స్‌ను ఆబ్జెక్టివిటీని, భౌతికవాదాన్ని దెబ్బతీసే సాపేక్ష భావవాదంగా (subjective idealism) విమర్శించారు. జైన అనేకాంతవాదం ప్రకారం, ఒకే వస్తువు వివిధ దృష్టికోణాల నుంచి వివిధ రీతులలో కనిపిస్తుంది. అద్వైత వేదాంతం ప్రకారం, “దృష్టే సృష్టి, ” అంటే భౌతిక జగత్తు మన దృష్టి కోణంపై ఆధారపడి ఉంది. మాయ అంటే కొలత అని అర్థం. ప్రమాణాలు అన్నీ వివిధ కొలతలు. వీటి ద్వారా అబ్జర్వర్ వస్తు స్థితిని నిర్ధారిస్తాడు. అంటే, అబ్జర్వర్ (చూసేవాడు) మరియు అబ్జర్వడ్ -చూడబడేది అనేది కృత్రిమ విభజన మాత్రమే.
తత్వవేత్త లకాన్ – క్వాంటం శాస్త్రవేత్తలు
తత్వవేత్త లకాన్ ప్రకారం, “నేను”గా మనిషి వేరుపడే విధానం ఇమాజినరీ, సింబాలిక్ పద్ధతుల్లో జరుగుతుంది. నిజానికి, ప్రకృతిలో మమేకమైన మనిషిని కారణ-కార్య(కాజ్ అండ్ ఎఫెక్ట్) సిద్ధాంతం విడదీస్తుంది, ఇది సత్యస్థితి కాదు, మిథ్యాస్థితి. సైన్స్ పరిశోధనలో అబ్జర్వర్ (నేను) ప్రమేయం ఉందనడం ద్వారా, క్వాంటం శాస్త్రవేత్తలు మతాలు ప్రవేశపెట్టిన విభజనపై దెబ్బ కొట్టారు. “అది నువ్వే” అని చెబుతుంది తత్వం. ఫిలాసఫీ అంటే జ్ఞానం పట్ల ప్రేమ. ఫిలాసఫీ నుంచి తత్వంలోకి ప్రయాణించిన హేతువాదం, హేతుబుద్ధి పరిమితులను, దృష్టి పరిమితులను స్పష్టం చేసింది.
భారతీయ హేతు చింతన యొక్క ప్రయాణం
భారతీయ దర్శనాలలో, కుమారిల భట్టు కర్మ మీమాంస నుంచి శంకరాచార్య అద్వైత వేదాంతంలోకి ప్రయాణం ఇటువంటిదే. కారణం -కార్యం, ద్రష్ట-దృశ్యం, అబ్జర్వర్ -అబ్జర్వడ్ విభజనలు, వర్గీకరణలపై ఆధారపడిన ఫిలాసఫీ నుంచి అద్వైత స్థితిని, సమతుల స్థితిని బోధించే తత్వం వైపు భారతీయ హేతుబుద్ధి సాగింది. విలియం డాలరింపుల్ తన పుస్తకం గోల్డెన్ రోడ్‌లో భారతీయ తత్వం, విజ్ఞానం ప్రపంచాన్ని, పాశ్చాత్య దేశాలను ఎలా ప్రభావితం చేశాయో వివరించారు.
వలసవాద ప్రభావం, హిందుత్వ
కానీ, భారతీయులు మరోవైపు పాశ్చాత్య వలసవాదం, వారు తెచ్చిన ప్రొటెస్టంట్ క్రైస్తవం వల్ల ప్రభావితమై, మితిమీరిన ద్వంద్వవాదంలో (dualism) కూరుకుపోయారు. సాంఖ్య దర్శనం యొక్క కార్యకారణాభేద సిద్ధాంతాన్ని విస్మరించారు, అద్వైతాన్ని మరచిపోయారు. దాని ఫలితమే హిందుత్వ.
మోడర్న్ ‘హిందుత్వ’ కేంద్రీకృతమైన దేవుడు అన్న భావనను బలపరచింది. కాల క్రమం, (చరిత్ర భావనతో) పౌరాణిక చక్రీయ కాల భావన స్థానంలో రేఖీయ కాల భావనను ప్రవేశపెట్టింది. రాముడు(దేవుడును) పురాణ పురుషుడు స్థానం నుంచి చరిత్ర పురుషుడుగా దిగజార్చింది. ప్రకృతితో ఇతర జాతులు మతాలతో ద్వేషాన్ని బలపరచడం ద్వారా అద్వైత భావనను బలహీన పరచింది. మొత్తంగా కార్య కారణ దృష్టిని తలకిందులు చేయడం ద్వారా పాశ్చాత్య హేతుదృష్టిలోకి పతనమైంది.
ఉపసంహారం
తత్వ వేత్త జిజక్, సామాజిక శాస్త్ర వేత్త మీరానందా వంటి మేధావులు భారతీయ సమతుల దృక్పథం సమన్వయ తర్కం వస్తు గత దృష్టిని బలహీన పరుస్తోంది అంటారు నిజమైన వాస్తవిక మార్పు వేరుగా ఉండి విశ్లేషించి పరిష్కారాన్ని కనుగొనడంలో ఉంది అంటున్నారు. కానీ భారతీయ సమన్వయ దృష్టితో అశోకుడు, అక్బర్, శ్రీకృష్ణ దేవరాయలు వంటివారు సమాజంలో శాంతిని నెలకొల్పారు. పాశ్చాత్య దేశాలలో బ్రూనో లాంటి భిన్న దృక్పథం కలవారిని నిర్మూలిస్తున్న కాలంలోనే అక్బర్ అన్ని సిద్ధాంతాలు మతాల మధ్య సమన్వయం కోసం కృషి చేశారు అని వెండీ డోనిగర్ హిందువుల ప్రత్యామ్నాయ చరిత్ర పుస్తకంలో రాసారు. అలాగే బౌద్ధం, హిందూయిజం, భారతీయ తత్వ విజ్ఞానాలు శాంతియుతం గానే ప్రపంచమంతా విస్తరించిన తీరు గురించి డాల్ రింపుల్ రాశారు. ప్రజలు తరలివెళ్లి ప్రపంచమంతా అక్కడి ప్రజలతో ఎలా కలిసిపోయారు అనేది కూడా రాశారు. ప్రపంచమంతా హింసాత్మక విప్లవాలతో అట్టుడుకుతున్న కాలంలో గాంధీ అహింసాత్మక పోరాటం ప్రజలను కదిలించింది. చుట్టూ ఉన్న దేశాలు నియంతృత్వంలోకి వెళ్లినా భారత్ ప్రజాస్వామ్యదేశంగా ఇప్పటి వరకు నిలిచింది. దానికి నేడు ముప్పు ఉంది
భారతీయ హేతు చింతన విభజన కంటే సమన్వయ దృష్టిని ఆదరిస్తుంది. కార్యకారణాభేదం, అద్వైత భావన, చక్రీయ కాల దృష్టి వంటివి దీని ప్రత్యేకతలు. వలసవాద ప్రభావం వల్ల ఈ హేతు చింతన కొంతవరకు మరుగున పడింది, హిందుత్వం వంటి ద్వంద్వవాద ధోరణులు బలపడ్డాయి. అయితే, క్వాంటం ఫిజిక్స్ వంటి ఆధునిక సైన్స్ భారతీయ తాత్వికతలతో సమానత్వాన్ని చూపిస్తోంది. శంకరాచార్యులు, బౌద్ధులు సత్యానికి దగ్గరగా ఉన్నారని ఈ సందర్భంలో అనిపిస్తుంది. భారతీయ హేతు చింతన యొక్క ప్రత్యేకతను అర్థం చేసుకోవడం ద్వారా, మనం స్వతంత్ర దృక్పథాన్ని అలవర్చుకోవచ్చు
మూలాలు
- Epistemology Of The Bhatta School Of Purva Mimansa,. Govardhan P. Bhatt. chokhamba publication 1963
- Reason in Revolt: Dialectical Philosophy and Modern Science
Book by Alan Woods and Ted Grant.
Akar books 2007 - శ్రీ దక్షిణా మూర్తి స్తోత్రం శంకరాచార్య.
- Johannes Bronkhors,
Mimamsa and Vedanta: Interaction and Continuity (Papers of the 12th World Sanskrit Conference. Publisher: Motilal Banarsidass Publishing House 2007 - Physics and Philosophy: The Revolution in Modern Science
Book by Werner Heisenberg
Published: by George Allen and Unwin Edition, 1959. - Order of Time,
Carlo Rovelli
Penguin books 2017 - షట్ దర్శన సముచ్చ య: హరిభద్రసూరి
- సాంఖ్య కారిక, ఈశ్వరకృష్ణ
- Ways of Thinking of Eastern Peoples: India, China, Tibet, Japan
Book by Hajime Nakamura.
Route ledg 1997 - Must We Divide History Into Periods? Jacques Le Goff. Translated by Malcolm DeBevoise
Columbia University Press 2017 - Brahman & Person: Essays by Richard De Smet.
Motilal Banarasi das publications 2010 - Stephen Hawking,
A Brief History Of Time,
Banta mdel publishing group 2008 - Puranaparyalochanam पुराणपर्यालोचनम् by Krishnamani Tripathi,
Chaukhamba Surbharti Prakashan 2012 - Prophets Facing Backward: Postmodernism, Science, and Hindu Nationalism by Meera nanda, permanent black 2017
- s To Question or Not To That Is The Question: Romila Thapar,
Economic and political weekly, dec 2014