సంఘర్షణల పళ్ళచక్రం మధ్య నిలిచిన ‘అనుపమ’

స్త్రీకి సాధికారత రావాలంటే ఆర్థిక స్వావలంబన ఉండాలి. పెళ్ళి కావాలంటే అందం, చదువు, ఆస్తిపాస్తులు, ఆరోగ్యం ఉండాలి. ఇది నేను చెప్తున్నది కాదు. చిన్నప్పటినుండి విన్న జనవాక్యం. ఇవన్నీ లేనివాళ్ళు ఏంకావాలి? చస్తూ బతకటమా? బతుకుతూ చావటమా? కాకుంటే జీవచ్ఛవంలా బతకాల్సిందే అని సమాజం స్త్రీ నుదుటను రాసింది. దానిని మోసుకుంటూ గతకాలం నుండి నేటికాలం వరకూ స్త్రీ జీవిస్తుంది. ఆ బరువు నేను మోయలేను అని విసిరి పారేసి సమాజాన్ని ధిక్కరిస్తే గయ్యాళి అనో, పొగరుబోతు అనో ముద్ర వేసుకోవాలి.

అలా అన్నింటికీ తల వంచుకొని బతికే ఒక అభాగిని పెంచుకున్న ఆత్మవిశ్వాసం గురించి రాసినదే ఇల్లిందల సరస్వతీదేవి అనుపమ నవల. 1978లో ఎమ్.శేషాచలం&కో వారు బాపూ ముఖచిత్రంతో ప్రచురించారు.

పూర్తి కథలోకి వెళ్ళకుండా సూచనప్రాయంగా నవల కథాంశం గురించి తెలియజేస్తాను.

అనుపమకు స్కూల్ ఫైనల్ చదువుతుండగా కళ్ళు మండుతుంటే వేడి చేసిందేమో అనుకుంటే ఒక కన్ను పోయి, మరో కన్ను కూడా మసకేసి క్రమంగా పోయే పరిస్థితి వస్తుంది అని తెలుస్తుంది. అన్నీ సక్రమంగా అమరివున్న వాళ్ళకే పెళ్ళిళ్ళు జరగటం కష్టమైన రోజుల్లో ఒక లోపం ఉన్నప్పుడు పెళ్ళికావటం కష్టం అనే పరిస్థితులు ఆనాడు. సహజంగానే అనుపమని చూసుకునేందుకు పెళ్ళిచూపులకు వచ్చిన పెళ్ళికొడుకులు ఆమె చెల్లిని చేసుకుంటాననే రోజులు కూడా ఆనాడు.

అయితే అసలు దుర్మార్గం ఏమిటంటే ‘పెద్దపిల్లకు పెళ్ళి కాకుండా చెల్లికి చేస్తే కుటుంబానికి అరిష్టం అంటారు’ ఆనాటి కాకుల్లాంటి లోకులు. ఆ దోషం పోగొట్టుకోటానికి ఆ పెళ్ళికొడుకుతోనే అక్క అనుపమ మెడలో గుళ్ళోనే మూడుముళ్ళు వేయించి, తర్వాత చెల్లెలు అనసూయతో పెళ్ళిచేయటం. నిజానికి ఇవి కూడా ఆనాడు సహజాతిసహజమే. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆడపిల్లని గుండెల మీద కుంపటిగా భావించే రోజులు కదా అందులోనూ మధ్యతరగతి చిరుద్యోగుల కుటుంబాలకి. అందుకే మధ్యేమార్గంగా ఆ పెళ్ళికొడుక్కి మరో రెండువేలు అదనంగా కట్నం సమర్పించి అనుపమ మెళ్ళో మూడుముళ్ళు వేయించి తర్వాత రోజు ఘనంగా అనుపమ చెల్లెలు అనసూయతో వివాహం జరిపించడానికి నిర్ణయిస్తారు ఆమె తల్లిదండ్రులు. ఇందులో కూడా ఒక మతలబు చేయటం మరో దుర్మార్గం – తర్వాత ఎపుడైనా పెళ్ళికొడుకు మీదగాని, వాళ్ళ ఆస్తిపాస్తుల మీదగానీ అనుపమ హక్కులు కోరకుండా స్టాంపు పేపరు మీద షరతులు రాయించి సంతకాలతో రికార్డు చేయించడం.

ఇంక అక్కడనుండి పుట్టింట్లోనే దిగబడిపోయింది అనుపమ. అసహాయస్త్రీ పట్ల చేసే దాష్టికాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. అసహాయంగా ఒకరిమీద ఆధారపడినప్పుడు జరిగే అవమానాలు, చేసిన చాకిరీకి గుర్తింపు లేకపోవటమూ కూడా ఎప్పుడూ ఒకేలా ఉంటాయి కదా. వితంతువైనా, భర్తచే విడిచిపెట్టబడినదైనా స్త్రీ పరిస్థితులు ఎప్పుడైనా ఒకేలా వుంటాయి. తండ్రి చనిపోవడంతో తల్లితో పాటు అనుపమ అన్న చెంతనే చేరుతుంది. అప్పటినుండీ అనుపమకి కష్టాలు మొదలు. ఇటువంటి అసహాయ స్త్రీల పరిస్థితి యాభై ఏళ్ళక్రితం మరింత దారుణంగా వుండేది. అందుకే ఎవరికి ఏ చాకిరీ అవసరమైతే అక్కడకి వారు ప్రేమనొలకబోస్తూ పిలిపించుకోవటం, అవసరం తీరాక బయటకు నెట్టయగల మనస్తత్యం గల స్వార్థపరులైన మనుషుల చేతులలో కీలుబొమ్మగా మారుతుంది అనుపమ.

ఆవిధంగా పెళ్ళికి షరతుల పత్రం రిజిష్టరు చేయించిన భర్త ఇంటిలోనే మంచం పట్టిన భర్త మేనత్త సేవకు నియమించబడుతుంది. తర్వాత చిన్న అన్న ఇంటికి వదిన పురిటి సేవకొరకు, ఆ తర్వాత హాస్పిటల్లో విడాకుల భర్త తాలూకు చెల్లెలైన టీబీ రోగికి సేవ చేసేందుకు, ఇలా ఎక్కడ ఏ అవసరం వస్తే అక్కడ పక్షిలా వాలవలసి వస్తుంది అనుపమకు. అక్కడ డాక్టరు త్రివేణి ఆమె సౌందర్యానికి, సేవాతత్పరతకు ఆకర్షితుడౌతాడు. ఆమె కంటిచూపు గురించి ఆరా తీసి తన స్నేహితుడైన కంటి డాక్టరు చేత పరీక్ష చేయిస్తాడు.

ఆ హాస్పిటల్ లోనే తన కొడుకు చికిత్సకోసం వచ్చిన భారతమ్మ అనుపమని చూసి ముచ్చటపడి ఆమె గురించిన వివరాలు తెలుసుకుంటుంది. అనుపమ తండ్రివాళ్ళు తమకి బాగా తెలిసినవారేనని, ఇరుగు పొరుగులుగా ఉండేవారమని అనుపమ చిన్నతనంలో తమ యింట్లోనే ఎక్కువగా తిరిగేదని చెప్పుకొస్తుంది. భారతమ్మ భర్త రామబ్రహ్మం కూడా అనుపమ తండ్రివలనే తన కొడుకులు బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చారని చెప్పి అనుపమ కంటిచికిత్స కోసమే కాక త్రివేణి, అనుపమల వివాహం వరకూ స్వంత తండ్రిలా తోడ్పడతాడు. అందుకే ముగింపులో అనుపమ, త్రివేణీలను ఫ్లైట్ ఎక్కించిన తర్వాత కణ్వుడిలా దిగులు పడుతున్నాడని రచయిత్రి ముగింపులో ముక్తాయింపుని ఇస్తారు.

-ఇది క్లుప్తంగా చెప్పుకోవాల్సిన కథాంశం.

కథ మొదలు పెట్టటం అనుపమ తన ఆడబడుచు సేవకోసం హైదరాబాద్ లోని టీబి హాస్పటల్‌లో ఉండటంతో ప్రారంభించి మొదటి సన్నివేశంలోనే అక్కడి డాక్టర్ త్రివేణిని మెట్ల మీద ఢీకొనటం అతను ‘ఆమెను కళ్ళు కనబడటం లేదా’ అని అరవటంతో మొదలౌతుంది. అప్పటికీ అయిదు నెలలుగా ఆడబడుచు అనబడే ఆమెతో చీత్కారాలు, అవమానాలతో అనుపమ మనసు వ్యధతో కృంగి పోయివుంటుంది. ఏడుస్తూ నిద్రలోకి అనుపమ జారుకోవడం – ఫ్లాష్‌బాక్‌గా అనుపమ బాల్యం నుండి కథ చెప్పటం ఆసక్తికరంగా నడిపింది రచయిత్రి.

మెట్రిక్ పాసై, సంగీతం నేర్చిన అనుపమ అనుకోని పరిస్థితులలో కంటి జబ్బుతో పాక్షికంగా అంధురాలు కావటం, చెల్లెలి భర్తతో పెళ్ళి కావటం, విడిచివేయబడటంతో అసహాయ పరిస్థితుల్లోని స్త్రీ ఏ విధంగా బంతి ఎటు తంతే అటు కొట్టబడినట్లుగా స్వంతవారి చేతే ఎన్ని రకాలుగా అవమానాలు పొందిందో గుండెలు చెమ్మగిల్లేలా రాసి అనుపమ దురదృష్టానికి పాఠకులు కూడా సానుభూతి చెందేలా సంఘటనలను చిత్రీకరించారు రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి.

సాహిత్యంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఇజం, ఒక్కొక్క దృక్పథం ప్రాధాన్యం వహిస్తూ ఉండటం చూస్తున్నాం: కానీ మానవ నైజంలో మార్పు ఉండదనీ, హృదయ స్పందనకు దేశకాలపాత్రలు అనే అవధులు లేవనీ, సార్వజనీనమైన భావాలను ఏ రాజకీయ సూత్రాలూ బంధించలేవనీ నమ్మేవాళ్ళలో నేనొకదాన్ని” అని నలభై ఏళ్ళ కిందటే తన సాహిత్య దృక్పథాన్ని నిర్భయంగా ప్రకటించిన రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి. సుదీర్ఘ సాహితీ యాత్రలో సమాజ స్వభావాన్ని, సాహిత్య పరిణామ క్రమాన్ని గమనిస్తూ, అనుసరిస్తూ పాత్రల మనోభావాల్ని, మానవ సంబంధాల్నీ తీర్చిదిద్దారు. మధ్యతరగతి జీవితాలలోంచి సమకాలీన సమస్యల్ని తీసుకుని సమాజ పరిణాక్రమంలోనే ఇతివృత్తానికి తగినట్లుగా పాత్రల్ని, సంఘటనల్ని, సంభాషణల్నీ సమకూర్చారు. నవలని చివరి వరకూ కథనంలో ఎక్కడా తడబాటు లేకుండా ఆర్ద్రంగా నడిపించటంలో రచయిత్రి కథాకథన నిర్మాణానికి, కథానిర్మాణంలో రచయిత్రికి గల రచనాకౌశలాన్ని వ్యక్తం చేస్తుంది.

చదువుకున్న, ఆలోచించగల అనుపమ తన పెళ్లి కోసం తల్లిదండ్రులు బాధపడుతుంటే తనకు పెళ్ళి చేసుకోవాలని లేదని, చెల్లెలికి చేయమని కూడా చెప్తుంది. సమాజానికి వెరచి తండ్రి చెల్లెలి భర్తతోనే ముందు మూడుముళ్ళూ అనుపమ మెడలో వేయించాలని ఒప్పించబోతాడు. ఆ సందర్భంలో ‘కంటిచూపు లేకపోవటం నా జీవితానికి దెబ్బే. కానీ ఈ మూడుముళ్ళ వల్ల వరుడు నన్ను అవమానపరిచినట్లు కాదా? అనసూయకు నామీద ఏం గౌరవముంటుంది? నేను వివాహానికి పనికిరానిదాన్నన్న చీటీ నాముఖానికి కట్టించుకున్నట్లే కదా? ఇంత అవమానం చేస్తారా?‘ అని తండ్రిని ప్రశ్నిస్తుంది అనుపమ.ఇక్కడే అనుపమ వ్యక్తిత్వాన్ని రచయిత్రి చాలా స్పష్టంగా ప్రకటిస్తుంది. తర్వాత పరిస్థితులకు, తల్లిదండ్రుల మాటలకు తలవొగ్గి అనుపమ తనను కాదన్న తన వారికే పరిచారికలా చాకిరీ చేయవలసి వచ్చినా తనలో తాను మథనపడుతుందే కానీ పల్లెత్తు మాట మాట్లాడదు. అది ఆనాటి కుటుంబపరిస్థితులకు అసహాయులు రాజీ పడటాన్నే సూచిస్తుంది.

ఇల్లిందల సరస్వతీదేవి సమాజంలోని పరిణామక్రమంలో జీవించిన సామాన్యజన జీవన విధానం, వారి ఆలోచనావిధానం, మానసిక సంఘర్షణలూ, ఆర్థిక సంక్షోభాలూ, అంతులేని ఆవేదనలు, ఆశనిరాశలు, ఆశావాదంతో కూడగట్టుకున్న ధృఢచిత్తాలు, అందుకున్న విజయపరంపరలూ – ఇలా ఎన్నో జీవన చిత్రాల్ని ఏమాత్రం భేషజం లేకుండా, భాషాపటాటోపం లేకుండా పాత్రోచిత సంభాషణలతో చాలావరకు హైదరాబాదు పరిసర నేపథ్యంగానే నవలను అక్షరీకరిస్తారు. రచన చదువుతుంటే దృశ్యం కళ్ళెదుట కనిపించేలా సన్నివేశ కల్పన, వాతావరణం ప్రతిభావంతంగా అక్షరీకరించారు.

అనుపమ మానసిక సంఘర్షణ, ఆలోచన, వివేచన, ఆనాటి చదువుకున్న యువతుల మనోభావనలకు ప్రతీకగా తీర్చిదిద్దారు. పరిస్థితులకు తలవంచాల్సివచ్చినా ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం,అస్తిత్వ ఆరాటం గల అభిమానవతి అయిన పాత్రగా అనుపమను తీర్చిదిద్దారు రచయిత్రి. నలభై ఏళ్ళ క్రిందట ఒక యువతి తన ధిక్కారాన్ని తెలియజేసే పరిస్థితులు సామాన్య మధ్యతరగతి కుటుంబాలలో చాలా అరుదుగా ఉంటాయనేది ఈ నవల తెలియజేస్తుంది.

అందుకే “నేను సృష్టించిన స్త్రీ పాత్రలన్నీ క్షమ, ఓరిమి, మంచితనం, ముందుచూపు కలిగి ప్రవర్తిస్తాయి. స్త్రీలలో వుండే ఓరిమిని చేతకానితనం కింద ఎప్పుడూ అనుకోకూడదు. నా రచనలో స్త్రీ పురుష సమైక్యతను చాటి చెప్పే విశ్వజనీన భావాన్ని పొందుపరచడానికే ప్రయత్నించాను” అంటూ తన స్త్రీ పాత్రల గురించి రచయిత్రి ఒక సందర్భంలో వివరించారు.

సరస్వతీదేవి సాహిత్యరంగంలోనే కాక సామాజిక సేవారంగంలో కూడా తనదైన ముద్రని సాధించినవారు. ఆంధ్రయువతీ పాలనా మండలిలో చాలా కాలం పని చేయడం వలన ఎందరో యువతుల వ్యధాభరిత గాథలను విని వారి సమస్యలను పరిష్కరించి మార్గదర్శనం చేసిన అనుభవం వుంది. బహుశా అందువలన ఆ ఛాయలు ఆమె రచనల్లోని పాత్రల్లో కూడా ప్రతిబింబిస్తూ ఉండవచ్చును. ఈ నవల లోని నాయిక పాత్ర కూడా ఆ విధంగా సృష్టింపబడినదే కావచ్చును.

దేశకాల పాత్రలకతీతమైనది మానవ మనస్తత్వం. ఈ మనస్తత్వ ధోరణులను, వివిధ వాతావరణాలలో అవి చెందే పరిణామక్రమాన్ని, విశ్లేషించడం నా మొదటి ఆశయం. అలాగే విశ్వజనీనమైన భావాలను దృష్టిలో పెట్టుకుని రచన చెయ్యడానికే నా కలం మొగ్గు చూపుతుంది” అనేది తన సాహిత్య దృక్పథంగా చెప్పుకున్న ఇల్లిందల సరస్వతీదేవి స్వాతంత్ర్యానికి పూర్వమే సాహిత్య రంగంలోకి అడుగు పెట్టి దాదాపు అన్ని ప్రక్రియలనూ స్పృశించి మూడు వందలకు పైగా కథలూ, నవలలూ, వ్యాసాలూ, రేడియో నాటికలతో తెలుగు సాహిత్యరంగాన్ని పరిపుష్టం చేశారు.