అణంజి అవ్వ ఒక గోనెసంచిని చంకన పెట్టుకుని వచ్చినప్పుడు నేను పాడుపడిన గుడి వాకిట్లో అరుగు మీద కూర్చుని మామిడిపండు తింటూ ఉన్నాను.
“అబ్బాయ్, ఇక్కడ నానీయమ్మ వాళ్ళ ఇల్లెక్కడుందీ?” అడిగింది ఆమె.
ఆ వచ్చిన ముసలామెవరో అప్పుడు నాకు తెలియదు. చెవులు సాగిపోయి భుజాలను తాకుతున్నాయి. రొమ్ములు రెండూ పొడవాటి సంచుల్లా సాగిపోయున్నాయి. చనుమొనలు ఆవు పొదుగుల్లా నేలకేసి చూస్తున్నాయి. నడుముకు తెల్లటి పంచెగుడ్డను చుట్టుకుని ఉంది. ముఖం ముడతలుపడి సాలెగూడులా ఉంది. తెల్లబారిన కళ్ళు. నోరే కనపడ్డంలేదు. దారంతో లాగి బిగించిన తిత్తిలా పెదవులు లోపలి ముడుచుకుపోయున్నాయి.
“నానీయమ్మ మా అత్తే. నేను తీసుకుపోతారా” అని చీకుతున్న మామిడి టెంకను విసిరి పక్కన పడేశాను.
నేను ముందుగా నడుస్తుంటే ముసలామె ఊగుతూ వెంట నడిచింది. నీళ్ళల్లో ఈతకొట్టేవాళ్ళు చేతులతో నీళ్ళను తోసినట్టు ఈమె గాలిని తోసుకుంటూ నడుస్తున్నట్టు ఉంది.
“అబ్బాయ్, ఓ మంచి నిక్కరు వేసుకోకూడదా? ఎలుక తొంగి చూస్తోంది చూడు!” అని చేయెత్తి చూపించింది.
మంచి నిక్కరే. నేను ఇందాక పాస్ పోసుకున్నప్పుడు లోపల వేసుకోవడం మరిచిపోయాను. గబగబా లోపల సర్ది గుండీ పెట్టుకున్నాను. తాకగానే మళ్ళీ పాస్ వస్తుందేమో అనిపించింది.
“సరేలే, గాలి, వెలుతురు అన్నీ ఇప్పుడు తగిల్తేనేలే… అప్పుడే ఏవైంది… ముందు ముందు కదా ఉంది దాని పనంతా! అదేం అంత చిన్న పనా! ఇంకో అరవై ఏళ్ళు అదే కదా, చేయి పట్టుకుని నడిపించుకు పోద్ది!” అంది ముసలామె.
“ఎవరు?” అని అడిగాను.
“అబ్బాయ్, కొంగ ఎగరడం చూశావూ?”
“చూశాను.”
“దాని ముక్కే దాన్ని ఆకాశంలో ముందుకు ఈడ్చుకుపోయేది… అలాంటిదే! మగాళ్ళను ఈ ముక్కు ఈడ్చుకుపోతుంది.”
నేను ముక్కుని తడిమి చూసుకున్నాను. వాడిగా లేదు. అదా నన్ను ఈడ్చుకుపోతోంది?
“ఆ ముక్కు కాదబ్బాయ్, కిందున్న ముక్కు.”
నేను “అదెక్కడుంది?” అని అడిగాను.
“ఇప్పుడు దాని పాటికి దాన్నొదిలెయ్యి. తర్వాత అదే ఆడోళ్ళ దగ్గరకు తీసుకెళ్తుంది, నన్ను పట్టకపొమ్మని పోరుతూ… నానా రబసా చేస్తూ ఉంటుందిలే… పసి పిల్లోడి మాదిరి చూస్కోవాలిగా?” ముసలామె తనలో తానే మాట్లాడుకుంటూ వస్తోంది. “గేనమిచ్చే అయ్యోరు అదేగా! అత్తారుమారయితే ఇంక బాగుపడే తోవే లేదు.”
నాని అత్త ఇంటి ముందు సుకుమార్ నిల్చోనున్నాడు. వాడుకూడా మామిడిపండు తిన్నట్టున్నాడు. వాళ్ళ ఇంటిముందు ఇంకా పెళ్ళి పందిరి అట్టానే ఉంది. పెరటివైపు వేసిన పందిరిని ఊడబీకుతున్నారు.
“అబ్బాయ్, ఇదేనా ఇల్లు?” అడిగింది ముసలామె.
“అవును లోపలే ఉంటుంది అత్త.”
“మా ఇంటికా?” అడిగాడు సుకుమార్. “మా ఇంట్లో పెళ్ళి జరిగింది… పెద్దగా” అని ముసలామెకేసి చూస్తూ చెప్పాడు.
“అబ్బులూ, పెళ్ళి అప్పచ్చులన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలి… సరేనా?” అంటూ “లోపలికెళ్ళి అణంజి వచ్చింది అని చెప్పు. వైద్దిగం చేసే అణంజి…”
వాడు “అణంజీ వచ్చిందీ!” అని అరుస్తూ లోపలికి వెళ్ళాడు.
నేను “వాడు పిచ్చోడు, మావిడికాయిను నాకుతుంటాడు” అని అన్నాను.
అణంజి “ప్రభో, తండ్రీ, అళప్పంగోడు శాస్తా, నన్నెప్పుడు పైకి తీసుకుపోతావో!” అంటూ మోకాలిమీద చేయి ఊనుకుంటూ పైకి ఎక్కింది.
ఇంటిముందు వెదురుకర్రలు నాటి కొబ్బరాకులతో వేసిన పందిరి. కింద నేలమీద పేడతో అలికి చక్కగా చదును చేసుంది. పందిటిమీద కప్పిన తెల్లగుడ్డలు తీసేసినట్టున్నారు. తెల్లవారి నీరెండ కొబ్బరాకుల పందిటి సందుల్లోంచి నేల మీద చల్లిన చిల్లరపైసల్లా పడుతోంది. దానికి అవతల ఇంటి అరుగు, గుమ్మం.
పందిటి గుంజకు ఒక దూడను కట్టేసి ఉన్నారు. అది గుంజ చుట్టూతా చక్కర్లు కొట్టి కొట్టి పలుపు తాడు బిగుసుకుపోయి అటూ ఇటూ కదల్లేక అక్కడే నిల్చుని గుంజను నాకుతూ ఉంది. ముసలామెను చూడగానే ‘అంబా’ అని అరిచింది. అరటి పువ్వు రంగులో వేలాడుతోంది దాని నాలుక.
“కోడె దూడలా ఉంది. ఎట్టా నాకుతోందీ… నాలుకే దానికిప్పుడు అన్నిటికంటే బలమైంది” అంది అణంజి.
పందిట్లో ఒక బెంచీమీద తాణప్పన్న లుంగీ మాత్రమే కట్టుకుని వెల్లకిలా పడుకుని నిద్రపోతున్నాడు. తెరిచిన నోట్లో నుంచి గారకట్టిన పళ్ళు కనిపిస్తున్నాయి. కంఠమణి పైకి కిందకి కదులుతోంది. కొత్త బంగారం గొలుసు గుండెల మీద పొర్లుతోంది. వేలికి కొత్త ఉంగరం. నుదుటన పసుపు గంధంబొట్టు.
తెల్లవార్నే తాణప్పన్న, లీలక్క ఇద్దరూ ఇప్పతోట యక్షిణి గుడికి వెళ్ళి వచ్చారు. లీలక్కని తాణప్పన్న పెళ్ళి చేసుకుని రెండు రోజులే అయింది. నాలుగు రకాల పాయసాలు చేశారు – అడై, శనగలు, పప్పు, సేమియా. నాకు శనగల పాయసం బాగా నచ్చింది.
తాణప్పన్న, లీలక్కతో మాట్లాడుతున్నప్పుడు లీలక్క నాలుగు దిక్కులూ చూడ్డం, అప్పుడప్పుడు ఫక్కుమని నవ్వడం, తలొంచుకోడం నిన్న వాళ్ళు గుడికి వెళ్ళేప్పుడు చూశాను. కప్పకళ్ళోడు “తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజా…” అని పాడుకుంటూ కొబ్బరి చెట్టెక్కాడు. నన్ను చూసి కన్నుకొట్టాడు.
అణంజి వంగి తాణప్ప అన్నను పరీక్షగా చూసింది. చేత్తో అతని లుంగీ పక్కకు తీసి చూసింది. నేను చేతులడ్డం పెట్టుకుని నవ్వాను.
“ఏందా నవ్వు? విత్తనం సత్తువ చూడాలిగా!” అంది అణంజి. “గట్టి శరీరమే… ఏం ఉజ్జోగం చేస్తాడూ?”
“అన్నయ్య మిలిటిరీలో పని చేస్తాడు. తుపాకీ కూడా ఉంది” అన్నాను.
“చూశాలే. పెద్ద తుపాకేమీ కాదు. మామూలు తుపాకే అబ్బులూ!”
వెళ్ళి బెంచీ మీద కూర్చున్నాను. అలా బెంచీ మీద కూర్చోగానే పెద్దవాడినైపోయానని, ఆకూవక్కలవీ వేసుకోవచ్చు అనీ అనిపిస్తుంది ఎప్పుడూ. తాంబూలంపెట్టెలో గిల్లిపడేసిన కాడలు మాత్రమే ఉన్నాయి. ఒకటి రెండు తీసి నోట్లో వేసుకుని నమిలాను.
మసక చీకట్లో గోడకు తగిలించి ఉన్న ఫోటోల్లోని ఆడా-మగా జంటలు నన్ను ఉరిమి చూశారు. సుకుమార్ వాళ్ళ అమ్మా నాన్నల పెళ్ళి ఫోటో! అందులో వాళ్ళ అమ్మ జుట్టు నున్నగా దువ్వుకుని చెవులమీదకు పడేలా పూలు తురుముకుని, దట్టంగా ఉన్న కనుబొమ్మలకు కాటుక రాసుకుని, కనుకొలకుల్లో చేప తోకలా కాటుకని దిద్దుకుని, భుజాలమీద పూరీల్లా ఉబ్బిన జాకెట్ వేసుకుని ఉంది. పక్కన నాని అత్తవాళ్ళ పెళ్ళి ఫోటో. అందులో అత్త మలయాళపు జరిగంచున్న చందనపు రంగు ముండును నడుముకు కిందా, మరొక గుడ్డను పైనా కట్టుకుని తలవంచుకుని ఉంది. మాధవన్ మామ కళ్ళు పిల్లికళ్ళ మాదిరి రెండు తెల్లటి చుక్కల్లాగా కనబడుతున్నాయి.
శాంతక్క పెళ్ళప్పటిది కలర్ ఫోటో. అయినా అది వెలిసిపోయి కాషాయం రంగులో ఉంది. అక్క జుట్టు బూడిద పూసినట్టుగా కనపడుతోంది ఫోటోలో. ఆమె భర్త అచ్చుదన్ మామ మీద ఏదో కారి పూర్తిగా వెలిసిపోయుంది. అయితే అక్క కళ్ళు మాత్రం చక్కగా మెరుస్తున్నాయి. పక్కనే లీలక్క పదకొండో తరగతి పాసయినప్పుడు తీసుకున్న ఫోటో. అందులో లంగా-వోణీ వేసుకుని చేతిలో పుస్తకాలు పట్టుకుని ఉంది.
నాని అత్త బయటకు వచ్చి “వచ్చావా అణంజీ… రా… రా…” అంటూ “నీ గురించి చాకలి మాధవి చెప్పింది” అని అంది.
“కాస్తంత గంజి, ఉప్పేసుకుని తాగాలమ్మాయ్! అలిసిపొయ్యాను” అంది అణంజి.
“ఇస్తానుండు” అంటూ నాని అత్త లోపలకి వెళ్ళింది.
“గంజి నీళ్ళల్లో కొంచం అన్నం మెతుకులు వెయ్యమ్మా… పిందెమావిడి పచ్చడుందా?”
“పచ్చిమావిడికాయుంది.”
“పట్టకరా… ఒక గరిటెడు వేపుడున్నా తీసుకురా” అంది అణంజి.
మావిడికాయిను ముక్కలు చేసుకుని దాన్ని వేపుడుతో కలుపుకుని నంజుకుంటూ చద్దినీళ్ళు తాగింది అణంజి. “మరింత” అంటూ ఇంకా కావాలని అడిగింది. నాని అత్త మళ్ళీ తీసుకొచ్చి పోసింది. బ్రేవ్‌మని త్రేపి “చద్దినీళ్ళు తాగాక ఇంతముక్క తాటిబెల్లం తినాల్సిందే… అదొక అలవాటయిపోయింది నాకు” అంది.
తాటిబెల్లంముక్క నోట్లో వేసుకోగానే కళ్ళు మూసుకుంది అణంజి. నిద్రమత్తు ఆవరించినట్టు ముఖం పెట్టింది.
నేను గుంజకు కట్టేసున్న దూడ తాడు విప్పేశాను. అది తోకను ఊపుకుంటూ తుళ్ళుతూ పరుగు తీసింది.
నాని అత్తయ్య “ఒరేయ్, అది పాలు తాగేసుద్దిరా! ముందు పట్టుకో దాన్ని” అని కేకేసింది. నేను దాని వెనకే పరిగెట్టుకెళ్ళి పట్టుకొచ్చి కట్టేశాను. ఆవూ “అంబా” అంటూ దూడను పిలిచింది.
“దానికెప్పుడూ దూడమీదే ధ్యాస” అంటూ అణంజీకేసి చూస్తూ “వచ్చి చూడవే అణంజీ… బిడ్డ విలవిల్లాడతావుంది” అంది.
అణంజి తాణప్పన్న వైపే చూస్తూ “బాగా ఇనప కడ్డీలా ఉన్నాడు…” అంటూ సంచి తీసుకుని లోపలికి వెళ్ళింది.
“నువ్వెళ్ళి ఆడుకో పో!” అంది నాని అత్త.
సుకుమార్ నా దగ్గరకొచ్చి “అక్కకు గుండె నొప్పి” అని అన్నాడు.
“ఎందుకు?” అని అడిగాను.
“ఆమెకు గుండెనొప్పి” మళ్ళీ అన్నాడు అర్థంకానివాడిలా చూస్తూ. వాడి దగ్గర పచ్చిమావిడికాయ వాసన వచ్చింది. నాకు పొద్దున తిన్న మావిడికాయ గుర్తొచ్చి పళ్ళు జిలపరించాయి.
“మీ ఇంట్లో మావిడి పళ్ళున్నాయా?” అని అడిగాను.
“అమ్మ లోపల దాచింది.”
“లోపలా?”
“వస్తావా?” అని గుసగుసగా పిలిచాడు.
మేము సద్దు చెయ్యకుండా లోపలికి వెళ్ళాము. అణంజి లోపల నెమ్మదిగా మూట విప్పుతోంది. నాని అత్తయ్య, శాంత అక్క పక్కన నిల్చుని ఉన్నారు. శాంతక్క చంకన ఉన్న శ్రీధర్ ఆమె జాకెట్ కిందకిలాగి చన్ను పట్టుకుని చప్పరిస్తున్నాడు.
“అయ్యో, ఏందే ఇది? చదువుకున్న పిల్లవేగా నువ్వు? బిడ్డకు వయసెంత?”
“ఎంతలే ఈ శ్రావణ మాసానికి మూడేళ్ళు!”
“రెండేళ్ళు దాటినా ఇప్పటికీ లాక్కుని తాగుతున్నాడు. ఆపించగూడదా?”
“అదే చూస్తున్నా… ఎక్కడ యింటాడీడు?”
“వేపనూనె రాయాలమ్మాయ్!”
“రాయడాలన్నీ అయ్యాయి, వేపనూనె, ముషిడికాయ రసం… ఏదీ పని చెయ్యలా. అదంతా చప్పరించి ఉమ్మేసి, మామూలుగా పాలు తాగుతున్నాడు.”
“రాత్రుల్లో నీ పక్కనే పండేసుకుంటున్నావా?”
“అవును, వాళ్ళ నాన్న ఈడ లేడుగా?”
“అమ్మాయ్, ఇది పద్ధతి కాదు. గడ్డసింధూరం రాయాలి. పదైదురోజులు చేదు పోదు. అమ్మ గుర్తుకొస్తేనే చేదనిపించేసిద్ది… ఆడదాని చేదు వోడికి తెలియాలి. ఆ తర్వాత తీపనిపించాలంటే ఓ పదైదు ఇరవై ఏళ్ళయినా పడుతుంది. నేనిస్తాలే.”
నేను అక్కడే నిల్చున్నాను. సుకుమార్ “వస్తావా?” అని అడిగాడు.
“నువ్వు పొయ్యి తీసుకురారా” అన్నా.
అణంజి సంచిలోనుండి వాడిపోయిన ఆకులను, కొన్ని ఎండు మొక్కల వేర్లను బయటకు తీసింది. “ఒక గిన్నెలో వేణ్ణీళ్ళు కావాల. బాగా మరిగినయి.”
“పొయ్యి మీద కాగుతున్నాయి.”
“దీన్ని ఏసి కాగపెట్టండి… ఇంతకీ నేను చూడాల్సిన అమ్మాయి ఎక్కడా?”
“లోపల ఉంది” అంటూ గదికేసి చూస్తూ “ఇటు రాయే” అని పిలిచింది నాని అత్త. లోపలనుండి ఏవో మాటలు వినిపించాయి.
“రామ్మా… పర్లేదు. అణంజి మందు ఎయ్యాలిగా?” అంది నాని అత్త. లోపల నుండి లీలక్క వదులైన బట్టలతో వచ్చింది, నిద్రనుండి లేచొచ్చినట్టున్న మొగమూ, కళ్ళేసుకుని. పైటేమో అలా ఊరికే మీదేసుకుని వచ్చినట్టుంది.
“అమ్మాయి బాగా వడలిపోయిందే!” అంది అణంజి.
“ఏం చేస్తాం, ఆడోళ్ళ తలరాత అంతేగా!” అంది నాని అత్త.
“అమ్మాయి, భయపడమాక. మంచి మందు తయారుచేసి నీళ్ళల్లో వేసి ఆవిరి పట్టుకుంటే రెండు రోజుల్లో నొప్పి మాయమయిపోద్ది” అంది అణంజి. లీల అక్క కళ్ళు మరోవైపు తిప్పుకుంది.
“ఎందుకని ఇలా సతాయిస్తారో మగోళ్ళు!” అంది నాని అత్త.
“నెగ్గాలిగా? నెగ్గి నిరూపించుకోవాల! కోట మీద జండా పాతితేనేగా ఇసయం కుదురుకునేది!”
నాని అత్తయ్య లోపలికి వెళ్ళి వచ్చి “నీళ్ళు మరుగుతున్నాయి అణంజీ” అంది.
“ఎవరి మీద నెగ్గాలో ఈళ్ళు!” నిట్టూర్చింది శాంత అక్క.
“కన్నతల్లి మీద… ఇంకెవరిని?”
సుకుమార్ వచ్చి “తెచ్చాన్రా” అని అన్నాడు. ఈలోపు ఒక మామిడిపండు కింద పడింది.
శాంత అక్క తిరిగి చూసి “ఏందిరా అది?” అంది.
“లగెత్తరా” అంటూ సుకుమార్ పరిగెత్తాడు. నేను వాడి వెనకే పరిగెత్తాను. మేము గడ్డివాము పక్కన దాక్కుని చెరో మామిడిపండును తీసుకున్నాము.
“రసాలు… జుర్రుకోవాలి” అన్నాడు సుకుమార్.
రసాలకు లోపల పీచు, రసం ఉంటుంది, అంతే. అయితే బాగా తియ్యగుంటాయి. సుకుమార్ మామిడిపండుని చేతులతో బాగా పిసికాడు. నేనూ అలానే పిసికాను. పిసికి పిసికి మెత్తగా అయినాక చివర కొరికి చిన్న రంధ్రం పెట్టుకున్నాం. జుర్రుకున్నప్పుడు తియ్యని రసం వచ్చింది.
జుర్రుకుంటూ జుర్రుకుంటూ, టెంకని చీకేసింతర్వాత గానీ తెలీలేదు. టెంక పారేసి అప్పుడే అయిపోయిందే అని మొగాలు వేలాడేశాం.
“ఒకటి అక్కడే కింద పడిపోయింది” అన్నాడు సుకుమార్.
“దాన్ని తెచ్చుకుని ఉంటే నువ్వేగా తినుంటావు!”
“అవును, మా చెట్టువి గదా? నాకు ఒక్కటన్నా ఎక్కువ ఉండాలిగా?”
“నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను నీకు మావిడిపండు ఇవ్వలే?”
“అంతకు ముందు నేను మూడు పళ్ళు ఇచ్చాగదా?”
“అవి పుల్లమావిడి!”
“మీవే పులుపు… పచ్చి పులుపు… తూ తూ…” వాడికి ఏడుపు వచ్చేసింది. “నా మావిడిపండు నాకివ్వరా” అన్నాడు వాడు.
“ఇదిగో పడుంది చూడు… తీసుకుని చీక్కో” అంటూ కింద పడున్న టెంకని చూపించాను.
వాడు కోపంతో నన్ను కొట్టాడు. నేను వాడ్ని కిందకు తోసేసి తన్నాను. ఇద్దరం గడ్డివాములో కిందా మీదా పడి కొట్టుకున్నాం.
వాడిని చాలా దెబ్బలు కొట్టాను. వాడు ఏడుస్తూ “నేను చచ్చిపోతే మా అమ్మ నిన్ను చంపేస్తుంది” అన్నాడు.
“నేనే మీ అమ్మను చంపేస్తాను.”
వాడు “మా అమ్మా…” అని ఏడ్చాడు.
“మీ నాన్ననీ చంపేస్తాను… మీ బామ్మనీ చంపేస్తాను” అన్నాను.
“మాకు దేవుళ్ళున్నారు!”
“మా దేవుడే పెద్ద దేవుడు తెలుసా?”
వాడు కింద పెదవిని ముందుకు విరిచి, ముక్కునించీ కళ్ళనించీ నీళ్ళు కార్చుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు.
“మావిడిపళ్ళు ఇంకా తెస్తావా?”
“తెస్తాను.”
“ఎన్ని?”
“రెండు.”
నేను వాడిని లాగిపెట్టి మళ్ళీ పీకాను.
“మూడు, మూడు మావిడిపళ్ళు!” అన్నాడు.
“అందులో నువ్వెన్ని తింటావు?”
వాడు కళ్ళనీళ్ళు కార్చుకుంటూ “ఒకటి” అన్నాడు.
నేను వాడి మీదనుండి లేచి “మీ అమ్మతో చెప్తావా?” అని అడిగాను.
“చెప్పను.”
“సరే పో” అన్నాను.
వాడు ఏడ్చుకుంటూ వెళ్ళాడు. వాడు చెప్పకుండా ఉండడు. పైగా శాంత అక్క చూసేసింది కూడా. ఇంటికెళ్ళిపోవాలి, అదే మంచిది. నేను గడ్డివాముకు అవతలనుండి కొట్టం దాటుకుని వెళ్ళాను. అక్కడ తాణప్పన్న కొట్టం గోడ చాటున నిల్చుని సిగరెట్ తాగుతూ ఉన్నాడు. లుంగీ మోకాళ్ళకు పైకి ఎగ్గట్టుకుని జుట్టున్న తొడను తడుముకుంటున్నాడు.
నిచ్చెన మోసుకుని కంచెకు అవతల వెళ్తున్న రాయప్ప “ఏంటి కొత్తపెళ్ళికొడుకు ఊదేస్తున్నాడు?” అని అడిగాడు.
“ఊదాలిగా?” అన్నాడు తాణప్పన్న నవ్వుతూ.
“అణంజి వస్తుండటం చూశాను! పొలం దున్ని మలేసుకున్నట్టున్నావు” అన్నాడు రాయప్ప. “మిలిటరీ బాబూ, మేకలు దున్నిన పొలాలూ ఉన్నాయి, ఏనుగులు దున్నిన పొలాలూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి!”
“ఈ ఏనుగు కథను అణంజి చెప్తుందిలే” అన్నాడు తాణప్పన్న నవ్వుతూ.
“మన పాలోడు పెళ్ళి చేసుకున్నప్పుడు ఆ వీధిలోకి పోలేకపొయ్యాం. అమ్మాయి పాపం విలవిలలాడిపోయింది… రాత్రుళ్ళు వీడు, పగటేళ అణంజి” అన్నాడు రాయప్ప.
“ఇప్పుడు అక్కడ అరుపులు కేకలు వినబడుతున్నాయిగా?” అని అన్నాడు తాణప్పన్న.
“హెహెహెహె” అని నవ్వుతూ “దమ్ము లాగడం అయిపోయినట్టయితే ఆ ముక్క ఇవ్వండి. మిలిటరీ సిగరెట్ కదా!” అన్నాడు రాయప్ప.
తాణప్పన్న ఇచ్చిన సిగరెట్ ముక్కను గాఢంగా పీల్చుకుని “మంచి సరుకు… మల్లెల వాసన” అని అన్నాడు. సిగరెట్టులో మల్లెల వాసన ఏందో నాకు తెలవదు. కొంచం దగ్గరకెళ్ళాను. కాదు. ఇంకేదో వేరే వాసన.
“వస్తాను” అన్నాడు రాయప్ప.
తాణప్పన్న నన్ను చూసి “ఏంట్రా?” అంటూ ఆపాడు.
“అణంజి పిలుస్తోంది” ఎందుకట్టా అన్నానో నాకే తెలవదు.
“దేనికి?”
“తెలవదు.”
“సరే పోదాం పా” అంటూ తాణప్పన్న నడవడం మొదలుపెట్టాడు.
“అన్నా మిలిటిరీలో నీకు తుపాకీ ఉందా?”
“ఉంది.”
“పెద్దదా?”
“అవును.”
“దాన్ని పేల్చొచ్చా?”
“అవున్రా.”
“నేనూ పేల్చుతా… టో టో టో టో!”
పందిట్లో మళ్ళీ దూడ గుంజకు దగ్గరగా చుట్టుకుని తల పైకెత్తి నాకుతూ ఉంది. గోడకు అవతల లీల అక్క “అయ్యో అమ్మా… అమ్మా… అయ్యో!” అని ఏడుస్తున్న మూలుగులు, అరుపులు.
“అక్క ఏడుస్తోందా?”
“ఆమెకు కొంచం ఏడుపు ఎక్కువలే” అంటూ తాణప్పన్న కూర్చున్నాడు.
“అక్కకు నొప్పేమో.”
“నొప్పి తగిలితేనే దార్లోకొస్తార్రా” అంటూ తాణప్పన్న రేడియో అందుకుని మీట తిప్పాడు. అందులో ఏవో హిందీ పాటలు వచ్చాయి. అన్నీ పాటలూ హే హే అనే వినిపించాయి.
లోపలనుండి అణంజి కిందకు చూస్తూ వచ్చింది. “అబ్బీ! ఇక్కడ తైలం పెట్టాను… సీసా ఎక్కడయినా ఉందేమో చూడండి” అంది.
“ఇదిగో ఇక్కడ ఉంది.” తీసిచ్చాను.
“జారిపోయినట్టుంది” అంటూ తాణప్పన్నతో “చెయ్యూతం మంచిది. అయితే టేకు చెట్లను వేళ్ళతోబాటు పెకలించే ఏనుగే, పువ్వులను కూడా సుతిమెత్తగా కోస్తుంది… మిలిటరీ బాబుకు అర్థం అయిందా?” అని అడిగింది.
“లేదు.”
“టెక్కు చూస్తే ఏవో రాజ్యాలు గెలిచిన మారాజు మాదిరి!” అని అణంజి దెప్పుతూ నడుమ్మీద చేతులు పెట్టి “ఏంటో గెలుస్తూనే ఉండాలనుకుంటారు!” అంటూ లోపలికి పోయింది. ఇంకా లీలక్క ఏడుపు, మూలుగులు వినబడుతూనే ఉన్నాయి.
“నేను పోతున్నా” అన్నాను.
“మీ ఇంట్లో అప్పు అన్నయ్య ఉన్నాడ్రా?”
“ఉన్నాడు.”
“నేను చెప్పానని చెప్పు… నేను తోపుకు వెళ్తున్నాను. సరుకు ఉందని చెప్పానని చెప్పు.”
“సరుకా?”
“నీకు ఇప్పుడు తెలియనక్కర్లేదు. పొయ్యి చెప్పు చాలు.”
నేను “నాకు తెలుసు… మిలిటరీ సారా” అని అన్నాను.
“వెళ్ళరా.”
నేను లేచి నిల్చుని తలాడిస్తూ “నాకు తెలుసు” అని అన్నాను.
తాణప్పన్న జేబులోంచి యాభై పైసలు తీసి ఇచ్చి “ఇది ఉంచు… మిఠాయి తీసుకు తిను” అని అన్నాడు.
నేను డబ్బు తీసి జేబులో పెట్టుకుని ఇంటివైపుకు పరుగు తీశాను. దీంతో బీడీ కొని లాగి చూస్తేనేం అని అనిపించింది.
(మూలం: కోట్టై, మార్చ్, 2020.)