ముష్టి పలురకములు

ఇప్పుడెలా ఉందో తెలియదు కానీ ఒకప్పుడు దేశం పల్లెటూర్లలో సాధారణంగా భోజన సమయానికి ‘మాదాకవళం తల్లీ’ అనే మాట వినిపించేది. వీలుంటే ఉన్నంతలో ఏదో ఒకటి పెట్టేవారు అడిగిన వారికి లేదా ‘పైకెళ్ళు’అనడం రివాజు. మాదాకవళం అంటే నిఘంటువు ప్రకారం మధుకరము – లేదా యాచించి అడుకున్న భిక్షాన్నం. సర్వసంగ పరిత్యాగులకైతే ఇలా యాచించడం సాధారణం. ఎవరైనా భిక్ష ఇచ్చినా ఇవ్వకపోయినా శాపనార్ధాలు పెట్టకుండా ఉండేవారు ఈ సన్యాసులు. ఉత్తరోత్తరా ఈ భిక్ష అనేది ముష్టిగా, అలవాటుగా మారింది కొంతమందికి, ఏ పనీ చేయకుండా జీవితం సుఖంగా వెళ్ళిపోవడానికి. గట్టిగా అడిగితే ‘ముష్టి ఎత్తడం మాత్రం ఓ పని కాదా?’ అనో ‘అది మా వృత్తి’ అనో ఎదురు సమాధానం వస్తోంది. దాంతో ముష్టిలో అనేక రకాలు బయల్దేరాయి. ఏ సన్యాసో వచ్చి భోజనం పెట్టమంటే అది గౌరవ ముష్టి, ఎందుకంటే ఆయన రోజూ రాడు. ఆయనకో ఊరూ సంసారం అంటూ ఏమీ ఉండదు కనక. వోట్ల కోసం, డబ్బు కోసం, పరపతి కోసం అలా దేనికైనా ముష్టి ఎత్తడానికి సిద్ధంగా ఉన్న జాతి అంతా అగౌరవ ముష్టి ఖాతాలోకి వచ్చేది. ఈ అగౌరవ ముష్టిలో పైవాడు కిందవాడి నుంచి ఎత్తే ముష్టి, మొగుడు పెళ్ళాన్ని ఎత్తే (లేదా వైస్ వెర్సా) ముష్టి, కిందన ఉద్యోగి, పై ఉద్యోగి బూట్లు నాకి ఎత్తే ముష్టి, మార్కులకోసం కుర్రాళ్ళు మేష్టర్లని ఎత్తే ముష్టి ఇలా రకరకాలు.

ఇలా చెప్పుకుంటూ పోతే ముష్టి వర్గీకరణ అనంతంగా కొనసాగుతుంది. భిక్షాటన, ముష్టి అనే ఈ రెండింటికి తేడా ఉంది. ప్రపంచంలో ఉన్నవన్నీ నాకొద్దు మొర్రో అని వదులుకుని, బతకడానికి కావాల్సినది మాత్రమే తీసుకునేది భిక్షాటన. ముష్టి అనేది ‘నాకింకా కావాలి’ అనుకుంటూ ఎంత ఉన్నా కూడబెట్టుకునేది. ముష్టివాడికి తన దగ్గిర డబ్బు ఉందా లేదా, అనేవన్నీ అనవసరం. ఆవురావుమని ఇచ్చినదంతా తీసుకోవడమే పని. ఆశ్చర్యంగా ఈ ముష్టి ఎత్తేవాళ్ళు అత్యంత ధనవంతుల నుంచి అతి బీదవారి వరకూ ఉన్నారు. ముష్టి ఎత్తే సరుకు ఒకటే తేడా.

సాధారణ ముష్టి: ఇది గుడి మెట్ల దగ్గిర, ఇంటికి వచ్చే బిచ్చగాడి దగ్గిరా చూడొచ్చు. నిజంగా ఏమీ లేక, లేదా అందర్నీ పోగొట్టుకుని ఏం చేయాలో తెలియక లేదా మరోదారి లేక అడుక్కునే వారి జీవితం. కొంతమందికే తెల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి వీళ్ళలో. వీరికున్న ఒక సుగుణం ఏమిటంటే ఒకరికొకరు బాగా సహాయం చేసుకోగలరు, చేసుకుంటారు కూడా. వీరికో సంఘం, నాయకుడూ కూడా ఉంటారు. ఉదాహరణకి అన్నవరం కొండమీదకి మెట్లదారిలో వెళ్తున్నప్పుడు కనిపించే వారు. ఎక్కడా మారని పాత ఐదుపైసల బిళ్ళలూ వగైరా వీళ్ళ దగ్గిర మారతాయి. అంటే ముందు వరసలో కూర్చున్నవారికి రెండువందల రూపాయలిచ్చి ఆ అయిదు పైసల (లేదా మరో) చెల్లని నాణాలు కొనుక్కోవచ్చు. అవి మెట్లమీద వీళ్ళకి ఇస్తే అవి వాళ్ళు ఈ నాయకుడికి ఇచ్చి ప్రస్తుత రోజుల్లో చెల్లే రూపాయలుగా/నాణేలుగా మార్చుకుంటారు. ఆ లీడర్ ఇవి మరొక దాతకి అమ్మితే మళ్ళీ వీళ్ళ దగ్గిరకి జేరతాయి. ఇంకో వింత ఆచారం ఉంది. ఇలా ఒక్కొక్కరికీ ఇవ్వడం మీకు కష్టం అయితే మొదట కూర్చున్న ఆయన్ని, మీ నాయకుడు ఎవరు అని కనుక్కుని మొత్తం ఎంతమంది మెట్లమీద ఉన్నారో కనుక్కుని ఒకే మొత్తం (ఉదాహరణకి నలభై మందికి నాలుగువేలు, లేదా మనిషికో వంద) ఆయనకి ఇచ్చేస్తే వాళ్ళూ వాళ్ళూ పంచుకుంటారు. నాయకుడు మోసం చేయడు, ఎందుకంటే ఆయన కూడా వాళ్ళలో ఒకడు కనక. మెట్లు బాగా పైకి ఎక్కాక ఎవరైనా అడిగితే ‘మీ నాయకుడికి ఇచ్చేశాం’ అని చెప్తే చాలు. ఊర్లో ఉచిత సంతర్పణ జరుగుతూంటే కూడా ఈ నాయకుడికి చెప్తే చాలు. ఆయనే మిగతావార్ని – ఎంతమంది కావాలిస్తే అంతమందిని తీసుకొస్తాడు.

అతి ముష్టి: అడిగితే ఇచ్చాక ‘ఇదేంటండి ఇంత తక్కువ ఇచ్చారు?’ అని దబాయించి ఎక్కువగా అడిగే ముష్టి. వీళ్ళకి ఏదో సంపాదించాలనే యావ పోదు ఇంకా. అహంకారం చావక, తనని తక్కువ చేసి తక్కువ డబ్బో, మరోటో ఇచ్చారని కోపం. వీళ్ళకి వంద రూపాయలిచ్చి, వాళ్ళపక్కనే ఉన్న అవిటి వాడికి నూట యాభై ఇస్తే మీదకి వచ్చి ఇద్దరికీ సమానంగా ఇవ్వలేదని దెబ్బలాడతారు. వీళ్ళు కొండొకచో పొద్దున్నా సాయంత్రం కూడా వచ్చి అడుగుతారు. ఇదేమిటయ్యా పొద్దున్న వచ్చావుగా అంటే, ఇప్పుడు రాత్రి భోజనం కోసం వచ్చానని సమర్ధించుకోగలరు. గుడి దగ్గిర లోపలకి వెళ్ళేటప్పుడు మీరు డబ్బులిస్తే, బయటకొచ్చేటప్పుడు మరోసారి అడుగుతారు.

విశిష్ట ముష్టి: ఇది లోభిత్వం కప్పుకోవడానికి చేసే దబాయింపు వల్ల కలిగేది. ఇద్దరు స్నేహితులో తెల్సున్నవాళ్ళో హోటల్‌కి వెళ్తే అవతలివాడు పూర్తిగా ఇద్దరికీ బిల్లు ఇవ్వడానికి డబ్బులిచ్చేదాకా జేబులోంచి పైసా తీయకుండా ఉండడం. కొండొకచో ‘నీ దగ్గిరో డాలర్ ఉందా? నా దగ్గిర చిల్లరలేదు’ అని అడిగి దాంతో తనకి కావాల్సినది కొనుక్కుని (కోక్, డోనట్ వగైరా) తర్వాత ఈ డాలర్ గురించి మర్చిపోవడం. ఒక్క డాలరే కదా అని మీరు అడగలేరు. ఆయన ఇవ్వడు కూడా. అంతంత మాత్రం స్కాలర్‌షిప్ వచ్చే స్టూడెంట్స్ నుంచి పై లెవెల్లో మేనేజర్ల వరకూ ఈ రకం ముష్టి ఎత్తడం సర్వసాధారణం. ఇటువంటి లేకి బుద్ధులు రావడానికి కారణాలు అనేకం. వీళ్ళలో మరో గుణం ఉంది – ఏదో విధంగా మీరు అవతలవారు తీసుకున్న డాలర్ గురించి గుర్తు చేశారా, ఇంతే సంగతులు. అందరి ముందూ మిమ్మల్ని ‘ఒక్క డాలర్‌కి నన్ను ఎంత అవమానించాడో, తీసుకోవయ్యా నీ ముష్టి డాలర్’ అని అవమానించి డబ్బు మన మొహం మీద కొడతారు. అడక్కపోతే వారికి గుర్తే లేనట్టు ఎంతకాలమైనా నాటకం ఆడడంలో సిద్ధహస్తులు. ఇది కొంత నీతిమంతులకి ఒక డాలర్. మరికొంతమందికి వంద రూపాయలో/డాలర్లో, ఆ పైన ఎంతైనా సరే.

అతి విశిష్ట ముష్టి: హైదరాబాద్, ముంబయి, చెన్నై వంటి నగరాల్లో ట్రాఫిక్ లైట్ దగ్గిర కార్లు ఆగినప్పుడు అటూ ఇటూ తిరుగుతూ ముష్టి ఎత్తే జనం కనిపిస్తారు. వీళ్ళలో కొంత మంది డబ్బున్న వారికిందే లెక్క. ఇళ్ళూ, స్థలాలు ఉంటాయి, పెళ్ళాం పిల్లలూ కూడా అందరూ మంచి స్థాయిలో ఉన్నవారే. కానీ ఒకప్పుడు ముష్టి ఎత్తడం ప్రారంభించాక ఈ పని లాభసాటి అని తెల్సిపోయుంటుంది. ఇంక ఏ పరిస్థితుల్లోనూ వీళ్ళు ముష్టి ఎత్తడం ఆపరు. వీళ్ళలో కొంతమంది సినిమా ప్రొడ్యూసర్లకి అప్పులిస్తారుట కూడా. ఈ విషయం యండమూరి వీరేంద్రనాథ్ ఒక పుస్తకంలో రాశారు. వీళ్ళకి కోట్ల రూపాయలు లేదా మిలియన్ డాలర్లు ఇచ్చినా మర్నాడు బట్టలు మార్చుని ముష్టి ఎత్తడానికి సిద్ధం. ఈ అలవాటు ఎప్పటికీ మార్చుకోలేరు. అమెరికాలో అయితే ‘ఇక్కడ నిలబడి అడిగిన వారికి ముష్టి ఇవ్వకండి, దగ్గిరలో ఉన్న సూప్ కిచెన్‌కి ఇవ్వండి’ అని రాసిన బోర్డు దగ్గిరే నిలబడి ముష్టి ఎత్తడం ఒక వింత. పోనీలే అని మీరు ఇచ్చినా ఈ డబ్బులు తాగుడు మీద తగలేస్తారని ఒక నానుడి ఉంది. వీళ్ళ దగ్గిర తుపాకీలు ఉండొచ్చు అనే కధలు కూడా వింటూంటాం; మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు గన్ తీసి కాలుస్తారేమో కూడా అనే సందేహాలు ఉన్నాయి. అందువల్ల ఇస్తారో లేదో మీ ఇష్టం.

మిగతా పై స్థాయిలో ముష్టి గురించి చెప్పుకునే ముందు ఆ మధ్యన ఈనాడులో శ్రీధర్ వేసిన కార్టూన్ గురించి చెప్పనీయండి. ఓ దొంగ గళ్ళలుంగీ, బనియన్ వేసుకుని నల్ల కళ్ళద్దాలతో కత్తి చేత్తో పట్టుకుని బేంక్ లూటీ చేయడానికి వెళ్తూంటే ఎదురుగా ఒకాయన సూటూ బూటూ వేసుకుని సూట్‌కేస్ చేత్తో పట్టుకుని బేంక్ లోపలనుంచి బయటకి వస్తూ కనిపించాడు. ఆ సూటు మనిషి, దొంగతో చెప్తున్నాడు – “అలా ‘దొంగ వేషం’ వేసుకుంటే పోలీసులని పిలుస్తారు. ఇలా సూట్ వేసుకుని వెళ్ళి అడుగు. ఎ.సి రూమ్‌లో కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ఎంతకావాలిస్తే అంత ఇస్తారు.” ఎంత వ్యంగ్యం అయినా పచ్చి నిజం ఇది. విజయ్ మాల్యా వంటివారు చేసే పని ఇదే.

పరమ విశిష్ట ముష్టి: ఈ పరమ విశిష్టులు కార్లలో, జీపుల్లో, లిమో అనేటువంటి బండి మీదా వస్తారు మందీ మార్బలం వెంటబెట్టుకుని. ఎక్కడా సంతకాలు చేయరు. అన్నీ కాయితాలు మరొకరి పేరుమీదో మరోచోటో ఉంటాయి. వోట్లు ముష్టి ఎత్తడానికో, బేంకులోంచి డబ్బులు తీసుకోవడానికో వస్తారు. ఈ ముష్టిని ‘అబ్బే నేను తీసుకున్నది అప్పు’ అంటూ బుకాయిస్తారు. ఉదాహరణ కావాలంటే ఇదిగో. ఓ చిన్న ఊర్లో పెద్దాయన ఒక కంపెనీ పెట్టాడు – వేరుశెనగ నూనె తీయడానికి. గింజలు అక్కడే చుట్టుపక్కల చవగ్గా దొరుకుతాయి. అయితే ఊరు మరీ చిన్నది కావడం వల్ల పెద్దాయన పక్కనే ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న టౌన్ లాంటి చోట ఉంటాడు. ఈ కంపెనీ పెట్టడానికి డబ్బులు ఇంట్లో బీరువాలో ఉన్నై కానీ అవి తీయరు. అవి అమ్మగారివి. స్త్రీ ధనం అంటరాదు. అందువల్ల స్టేట్ బేంక్ దగ్గిర అప్పు – అదే ముష్టి ఎత్తారు. ఎంతోనా? యాభై లక్షలు మాత్రమే. పదేళ్ళలో నూనెకి గిరాకీ పెరిగి అప్పుతీర్చేసే స్థాయికి ఎదిగాడు పెద్దాయన. వచ్చిన లాభాలతో ఇంటి మీద మరో అంతస్తు కట్టడమా, బేంక్ అప్పు తీర్చడమా? దీనికి సమాధానం సులువు. దానం ఇచ్చేవాడు ముష్టివాడికి ఇవ్వాలి గానీ ముష్టివాడెప్పుడైనా దాతకి ఇవ్వడం అనేది ఉందా? అందువల్ల ఈసారి వచ్చిన లాభాలతో కొన్న కొత్త మెర్సెడెస్ కారులో బేంక్‌కి వచ్చి మేనేజర్‌ని కదుపుతాడు – ఇదిగో ఇలా రెండో ప్లాంట్ పెట్టాలి, మరో పాతిక లక్షలు అప్పు కావాలి అంటూ. అలా ముష్టి లకారాలకి పైన లకారాలకి, ఆ పైన కకారాలకీ పెరుగుతూ ఉంటే ఈయన నివాస భవనం, ప్లాంట్‌లూ పైపైకి పెరుగుతూ ఉంటై. బేంక్‌కి కావాల్సింది కూడా అదే. ఇప్పుడు బేంక్ వారు ఈ పల్లెటూర్లో ఫలానా వేరుశెనగ నూనె కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తుల కోసం కొత్త బ్రాంచ్ పెడతారు. నిజానికి ఈ బ్రాంచ్ పెద్దాయన కోసం, ఆయన తీసుకున్న అప్పు కోసం పెట్టారు, పనిలో పనిగా ఉద్యోగస్తులు వారి డబ్బులు అందులో దాచుకుంటారు. అర్ధమైంది కదా? ఈయన ఉద్యోగస్థులకి ఇచ్చే జీతాలు బేంక్‌లో దాచుకుంటే, వాటికి మరికొంచెం మిగతా పొదుపర్ల డబ్బు చేర్చి బేంక్ ఈయనకి అప్పు ఇస్తుంది. అలా బేంక్‌కీ ఈయనకీ ఏమీ పోయింది లేదు. ఉద్యోగస్థులకి కూడా బేంక్‌వారు ఏడాదికి యాభై రూపాయలు వడ్డీ ఇస్తారు. వాటీజ్ ద ప్రాబ్లమ్?

ఇప్పుడో ఇహనో ఈ పెద్దాయన నష్టం చవిచూసినా లా ప్రకారం బేంక్‌రప్ట్ అని చెప్పేసి చేతులెత్తేస్తారు. అప్పుడు పోయిన డబ్బులకోసం బేంక్ కాస్త కష్టపడతారు. రెండు మూడు లకారాలు వచ్చాక ఇంక ఏమీ రావని తెలుస్తుంది ఎందుకంటే పెద్దాయన ఎప్పుడో బేంక్‌రప్ట్ అనేముందే ఆయన ఆస్తులన్నీ తరలించాడు కదా? అయినా ఆయన సంతకం ఎక్కడ పెట్టాడు? అలా బేంక్‌వారు ఇదంతా ‘పారుబాకీ’ అని రాసుకుని ఉద్యోగస్తుల మామూలు డిపాజిట్ల మీద ఇంటెరెస్ట్ రేట్లు తగ్గించీ, మిగతా అప్పుల మీద ఇంటెరెస్టులు పెంచేసీ మరో విధంగా రాబట్టుకుంటారు డబ్బులు ఎప్పటికో. ఇటువంటి అతి విశిష్టుడైన విజయ్ మాల్యా లండన్ పారిపోయి ఏళ్ళూ పూళ్ళూ గడిచాయి. మోడీ గాని, గాంధీగారు బతికి వచ్చినా గానీ ఆయన మీద ఈగ వాలదు. అలగా జనం ఏదో అంటారు, ఆర్నెల్లు పోతే ఎవరికీ ఏమీ గుర్తుండదు కదా?

బహిరంగ లేదా పబ్లిక్ ముష్టి: ఇదో రకం సరదా ఆట. ఆ మధ్యన అమెరికాలో వచ్చిన సై‌న్‌ఫెల్డ్ అనే టివి ప్రోగ్రాంలో ఉన్న జార్జ్ కోస్టంజా అనే ఆయన కనిపెట్టిన హ్యూమన్ ఫండ్ టైపు. ఆయన సరదాకి అని ఆఫీసులో మేనేజర్‌కి చెప్తాడు ఇలా హ్యూమన్ ఫండ్ అనే దానికి విరాళం ఇవ్వండి అని. నిజంగా ఆ మేనేజర్ చెక్కు రాసి ఇస్తాడు. ఆ మధ్యన జార్జియా అనే రాష్ట్రంలో ఒకావిడ కూడా ఆడింది ఈ ఆట – గో ఫండ్ మి అనే వెబ్‌సైట్‌తో. ఎవరో రోడ్డు మీద అడుక్కుంటున్నాడు ఇల్లూ అదీ లేదు (హోమ్‌లెస్), ఆయనకోసం డబ్బులివ్వండహో అంటూ మొదలుపెట్టారు. వేలమీద డాలర్లు వచ్చి పడ్డాయి. వచ్చిన డబ్బుల్లో చేతివాటం చూపించారు. తర్వాత కోర్టు గొడవలూ అవీ అయ్యాయనుకోండి. కానీ ఇటువంటి వెబ్‌సైట్‌లలో ఏది నిజమో తెలుసుకోవడం చాలా కష్టం – ఆ సైట్‌లో అడిగినది ఎవరో మనకి సరిగ్గా తెలియకపోతే. ధనవంతులైన మారాజులు హాస్పిటళ్ళు కట్టి ఇన్స్యూరెన్స్ కంపెనీల నుంచి, పేషెంట్స్‌ని పీల్చి పిప్పి చేసీ డబ్బులు లాగుతూ, ‘అబ్బే ఓనర్లమైన మేము లాభాపేక్ష లేని సంస్థ పెట్టాం, వచ్చి మీరు డొనేషన్ ఇవ్వాలండోయ్’ అని ఊపిరితిత్తులు తెగేవరకూ అరవడం కూడా ఈ కోవలోకే వస్తుంది. దీనికోసం వీళ్ళు ఏడాదికోసారి ‘ఉచిత పార్టీలు’ ఇస్తారు కూడా ఊరందరికీ. ఈ ధనవంతుల జీతాలు మిలియన్లలో ఉంటాయి. ఎప్పుడైనా గొడవలు వచ్చి ఈ ఓనర్లలో కొంతమందిని ఉద్యోగంలోంచి పీకాలంటే కూడా కష్టం. ఎందుకంటే దానికి ‘ఇన్ని మిలియన్ల డాలర్లు’ అంటూ ‘పీకు పెనాల్టీ’ ఇచ్చుకోవాల్సి ఉంటుంది – వాళ్ళు రాసుకున్న కాంట్రాక్ట్‌ల ప్రకారం. ఇంత చేసినా వాళ్ళు లాభాపేక్ష లేని సంస్థ కిందే లెక్క రూల్స్ ప్రకారం. లా, రూల్స్, మోరల్స్ అనేవి పూర్తిగా వేరు వేరని గమనించగలరు. కొన్నిచోట్ల యూనివర్సిటీలు ఇలా పబ్లిక్ ముష్టి తీసుకుని బాస్కెట్‌బాల్ కోచ్‌కి ఏడాదికి ఇన్ని మిలియన్లు అంటూ జీతం ఇస్తారు కానీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఉద్యోగస్తులకీ స్టూడెంట్స్‌కీ డబ్బులివ్వడానికి వాళ్ళ దగ్గిర ఏమీ లేదంటారు. బాస్కెట్‌బాల్‌కి ఇచ్చే డబ్బులూ ఉద్యోగస్తులకి ఇచ్చే డబ్బులూ వేరు వేరు ఖాతాలలోవి. అవి ఎన్నడూ కలవరాదు అనే రూల్ ఉండనే ఉంది. లేదా కొత్త రూల్ పెట్టుకోగలరు, కోర్టు కేసు పడుతుంది అని తెల్సిన మరుక్షణంలో.

ప్రైవేట్ ముష్టి: ఇది కొంచెం తనకి చేతకాక, లేక అసూయతో చేసేది. ఇంట్లో ఏదో అవసరం వచ్చింది – పెళ్ళో, పెటాకులో లేకపోతే చావో. అన్నీ తానొక్కడే చేయాలంటే ఏడుపు, లేదా తానొక్కడే ఎందుకు చేయాలి మిగతా బంధుమిత్రులందరి దగ్గిరా కూడా డబ్బు మూలుగుతూ ఉంటే? ఈ ముష్టిలో దాత తెలుసుకోవల్సిన విషయం ఏమిటంటే ఇచ్చిన డబ్బు తిరిగి రాదు గాక రాదు సరే కానీ తీసుకున్నాయన ఆ (అ)శుభకార్యం అయిపోయాక మొహం చాటేస్తాడు. మీరు పోనీలే అవసరంలో ఉన్నాడు ఆయన అని ఇచ్చి ఇంక ఆ డబ్బులు అడగరు కూడా. ఆ విషయం మీకూ ఆయనకీ కూడా తెలుసు. అయినా ఆయన మొహం ఎందుకు చాటేశాడో మీకు ఏనాటికీ అర్ధం కాదు.

ఈ ప్రైవేట్ ముష్టి అతిగా జరిగేది అమెరికా ఇండియాల మధ్య కూడా. ఒక కుటుంబంలోంచి ఒకడు అమెరికా వచ్చాడు. ఇంక మొత్తం కుటుంబం అంతా వీడిమీదే ఆధారం. చెల్లెలు పెళ్ళికి, కొత్త బావగారి స్కూటర్‌కి, తమ్ముడి చదువుకి, అత్తారింట్లో శుభాశుభకార్యాలకీ, దూరపు చుట్టం పెట్టే బిజినెస్‌లో పెట్టుబడికి అలా ఒకటేమిటి అందరూ కల్సికట్టుగా, ఒకరి తర్వాత ఒకరు అడుగుతారు. లేవు అంటే, పీకలదాకా కోపం వచ్చేస్తుంది; ‘అమెరికా వెళ్ళగానే మారిపోయాడ్రా’ అంటారు. పోనీ మీరు వాళ్ళు అడిగిన బిజినెస్‌లో పెట్టుబడి పెట్టారనుకుందాం, ఆ బిజినెస్ పోతే మీ డబ్బులు రావు. ఆ బిజినెస్ పుంజుకున్నా మీ డబ్బులు రావు. కధ ఇంకా ఉంది. మీ తమ్ముడికో, అక్కకో, బావగారికో డబ్బులు పంపారు, అవి ఎలా ఖర్చుపెట్టారు, అసలు నష్టం ఎందుకొచ్చింది అనేవి అడుగుదామని మీరు ఫోన్ చేశారు. ఇంక చూసుకోండి, ‘నేను నీ డబ్బులు తినేస్తాననుకున్నావా, నేనంటే అంత నమ్మకం లేనివాడిని ఎందుకు డబ్బిచ్చావ్, నేను నీ బావ/తమ్ముడు/చెల్లి/అక్క అయితే నీకు లెక్కలు చెప్పాలా?’ అనేవి మొహం మీదే అని తిట్టిపోస్తారు. గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే అమెరికా నుండి ఇండియాకి డాలర్ల పైపు వేసింది మీరే. ఆ పైపులో ఎక్కువ ప్రెషర్ అమెరికాలో, తక్కువ ప్రెషర్ ఇండియాలోనే ఉంటుంది ఎన్నాళ్ళైనా. అందువల్ల డబ్బుల దారి ఎప్పుడూ ఎక్కువ ప్రెషర్ నుంచి తక్కువ ప్రెషర్‌కి మాత్రమే. ఒకసారి ఈ డబ్బులు మీ చేతిలోంచి వెళ్ళాక అవి ఏనాటికీ ఎన్ని తరాలైనా సరే వెనక్కి రావు గాక రావు. అటువైపు నుంచి పాపం వీడు ఒక్కడే ఎంతమందిని సపోర్ట్ చేయగలడు, అమెరికాలో వాడెలా బతుకు బండి లాగుతున్నాడో అనే కనీసపు ఆలోచన కూడా వారికి తట్టదు. వాడు అమెరికాలో ఉన్నాడు కనక వాడికి కష్టం అంటేనే తెలియదని వారి ఉద్దేశ్యం. అమెరికాలో ఉన్నవాడికి పెళ్ళైయ్యాక ఖర్చులు పెరిగి ఆయనకి ఇండియా డబ్బులు పంపడం కష్టం అయితే, వాళ్ళావిడ వీణ్ణి మార్చేసింది, పెళ్ళైతే అందరూ అంతే అని మరో వాయింపు; ఇందులో పాపం ఆవిడకి ఏ ప్రమేయం లేకపోయినా సరే. ఇది అతి చిత్రాతివిచిత్రం. ఒక్కొక్కప్పుడు వీళ్ళలో బంధుత్వాలు, స్నేహాలూ పూర్తిగా తెగిపోవడానికి కారణం కూడా ఇదే.

కంపెనీ ముష్టి: జెనరల్ మోటార్స్, మారుతీ సుజుకీ అనే కార్ల కంపెనీలు చూడండి. లేదా 9/11 తర్వాత విమాన సంస్థలు వాషింగ్టన్‌లో కూడి అడిగిన డబ్బులు చూడండి. అవన్నీ వాళ్ళకి వచ్చిన నష్టాలకి అడిగారుట. డిట్రాయిట్‌లో ఉన్న కార్ల కంపెనీల ముగ్గురు పెద్దాయనలూ వేరు వేరు ప్రైవేట్ జెట్‌లలో వెళ్ళి సెనేట్‌లో కూర్చున్నప్పుడు ఒక సెనేటర్ అడిగాడు – “ఏమయ్యా మీ కంపెనీలు కూడబలుక్కుని, డబ్బు ఆదా చేయడానికి ముగ్గురికీ ఒకే విమానం కూర్చితే డబ్బులు మిగిలేవి కదా? ఇలా వేరువేరుగా వచ్చి డబ్బులు తగలేశారు, ఆ మాత్రం జ్ఞానం లేకే మీ కంపెనీలు ఇలా ఉన్నాయి” అని. దానికో చవట నవ్వు నవ్వేసి డబ్బులు తీసుకుని వెళ్ళారు. కొన్ని కంపెనీలు తీసుకున్న ముష్టి వెనక్కి ఇచ్చాయిట. మిగతావి అదే పోవడం. ‘విమాన కంపెనీలన్నీ ప్రైవేట్ కంపెనీలు. వాటికి ప్రభుత్వం ఎందుకివ్వాలి డబ్బులు?’ అనేదానికి ఏవో కారణాలు చెప్తారు – ఉద్యోగస్తులకి జీతాలు, ఎకానమీ ఇదీ, అదీ అంటూ. ఇప్పుడు లాభాల్లో నడుస్తున్న కంపెనీలన్నీ వెనక్కి ఎందుకివ్వరు ఆ తీసుకున్న డబ్బు? అదంతే. ముష్టిది ఎప్పుడూ వన్ వే ట్రాఫిక్. ఇది గోల్డెన్ రూల్.

రాజకీయ ముష్టి: ఈ ముష్టి వోట్ల కోసం కాదు. జనం మీద డబ్బులు దండుకోవడానికి వాడేది. కొత్తగా వెబ్‌సైట్‌లు పెట్టీ, ఈమెయిల్ మీదా, మీ ఇంటికి ఉత్తరాలు రాసీ లేదా రెండు డాలర్ల ఖరీదు చేసే టోపీ ముప్ఫై డాలర్లకి అమ్మి మీకు కుచ్చు టోపీ పెట్టీ, బంద్‌లూ, రైల్ రోకోలు చేసి జనాలమీద పడి దోచుకునే డబ్బులు ఇవి. ఇలా సేకరించిన డబ్బులని ఫలానా ఫలానా విషయాలకోసమే వాడాలి అనే రూల్స్ ఉన్నా అవి ఎంతమంది పాటిస్తారనేది జగమెరిగిన సత్యం. వీటిని రాజకీయనాయకులు స్వంత విమానాల ఖర్చులకీ, వార్ని జైల్లో పెట్టడానికి రమ్మంటే ఆ జైల్‌కి ఆయనకున్న ప్రైవేట్ విమానం మీద వెళ్ళడానికీ వగైరా ఖర్చులకి వినియోగిస్తారు. ఈ ముష్టి ఏనాడూ వెనక్కి ఎటువంటి పరిస్థితుల్లోనూ రాదు. ఈ ముష్టికోసం రాజకీయనాయకులు అబద్ధాలు ఆడడం ఒక వింత అయితే వాళ్ళు చెప్పేవి అబద్ధాలని తెలిసీ విని, ఊరుకుని వారికే వోటు వేసే చవట దద్దమ్మలు ఉన్నంతకాలం ఈ రాజకీయ ముష్టి అప్రతిహతంగా సాగుతుంది. ఇలా ఇవ్వడానికి కొంతమంది ధనవంతులు సిద్ధంగా ఉంటారు కూడా ఎప్పుడూను. ఇలా రాజకీయ నాయకులు చెప్పే అబద్ధాలు నమ్మి వాళ్ళకి వోట్లు వేసే చచ్చు దద్దమ్మలు సమాజంలో ఉండడమే అతి పెద్ద ట్రాజెడీ.

ప్రభుత్వ ముష్టి: మీరు పనిచేసే ఆఫీసులో మీ జీతంలోంచి పన్నుల కోత పడుతుంది. కేంద్ర ప్రభుత్వం వారిది, రాష్ట్ర ప్రభుత్వం వారిది, సోషల్ సెక్యూరిటీ వారిది, మరోటి, అంటూ. దీనికి బదులు కొన్ని నగరాల్లో సిటీ టేక్స్ కట్టాలి. మేరీలేండ్ రాష్ట్రంలో అయితే కొన్ని కౌంటీలలో మరో వాయింపు ఉంది – లోకల్ టేక్స్ అంటూ. ఇవన్నీ అయ్యాక మీకు ‘కడిగిన’ జీతం ఇస్తారు. ఆ జీతంలోంచి మీరు పేంటో, షర్టో, లేదా మీ ఆవిడకి నగో నట్రో చేయిస్తే దానిమీద సేల్స్ టేక్స్ కట్టాలి. గ్రోసరీస్, మందుల లాంటి వాటికి కొన్నింటికి మినహాయింపు ఉన్నా మిగతా ఏది కొన్నా పన్ను కట్టాల్సిందే. ఈ డబ్బులన్నీ ప్రభుత్వం వారు తీసుకుని ‘సరైన దారిలో’ వినియోగిస్తారు – అంటే రోడ్లు నిర్మించడానికీ, ఆరోగ్య సంస్థలకీ, దేశరక్షణకీ వగైరా. మనం పన్నులు కట్టి ఇంత చేసినా ప్రభుత్వానికి మన దగ్గిర తీసుకున ‘టేక్స్ డాలర్స్’ సరిపోవడం లేదు. అందువల్ల ప్రభుత్వం వెళ్ళి మరో ప్రభుత్వం దగ్గిర ముష్టి ఎత్తాలి. చైనా లాంటి దేశాలు ఇలా అప్పు – అదే ముష్టి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి, ఇప్పట్లో మనం ఈ ముష్టి వెనక్కి ఇవ్వలేం అని తెల్సినా. ఎందుకో తెలుసా అంటే సమాధానం అతి సులభంగా చెప్పొచ్చు. మన మార్కెట్లో అమ్మే సరుకులు ఏవి చూసినా దాదాపు ముప్పాతిక మూడొంతులు ‘మేడ్ ఇన్ చైనా’. చైనా ఇచ్చే ముష్టితో మన ప్రభుత్వం ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి వాడినా, మరోదానికి వాడినా చివరకి మళ్ళీ ఆ డబ్బుతో మేడ్ ఇన్ చైనా సరుకులే కదా కొనేది మనందరం? అలా చైనావాడికి మూడు రకాల లాభం – వాళ్ళిచ్చిన ముష్టితో వాళ్ళ వస్తువులే కొనిపించడం, ఇచ్చిన ముష్టి మీద ఇంటెరెస్ట్, ఇచ్చిన ముష్టి ఏనాటికైనా వెనక్కి రాబట్టుకోవడం. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, ముష్టి అడిగితే ‘అలా పైకెళ్ళు, చేయి ఖాళీలేదు’ అని ఎప్పుడూ అనరు. కొన్ని బీద దేశాలకైతే ఎవరూ ఇవ్వకపోయినా ‘ప్రపంచ బేంక్’ దగ్గిర ముష్టి దొరుకుతుంది.

ప్రస్తుతానికి వస్తే అమెరికా అప్పు ఇది రాసే సమయానికి ముప్ఫై నాలుగు ట్రిలియన్ డాలర్లకి పైనా, జపాన్ అప్పు అన్ని దేశాలకన్నా ఎక్కువగా ఉన్నాయిట. ఈ అప్పులు ఎక్కడనుంచి వస్తున్నాయంటే సగానికి సగం బాండ్స్, సెక్యురీటీలు వగైరాల నుంచి – అవి కొనే ప్రజల/దేశాల దగ్గిరనుంచి, మిగతాది వివిధ దేశాల నుంచి. ఇందులో మరో జోకు ఉంది. అమెరికాకి ఇంత అప్పు ఉన్నా ‘మేము సంపన్న దేశం’ అని చెప్పుకుంటూ మరో దేశానికి అప్పు – లేదా ముష్టి ఇస్తుంది. అంటే తీసుకునే ముష్టిలోంచి మరో దేశానికి వీరముష్టి. అయ్యో మనకి ఇంత ముష్టి ఉంది ఇది ఎలా తగ్గించాలి? ఏం చేస్తే ఈ ముష్టి తగ్గుతుందనేది ఎవరికీ పట్టినట్టు కనిపించదు. అలా ఏ ఏటికాయేడు ముష్టి ఎత్తుకుంటూ పోవడమే. కొన్ని ‘సంపన్న దేశాల’మని చెప్పుకునే వారికి ఇచ్చే అప్పు లేదా ముష్టి వెనక్కి వచ్చే ఆధారం ఉంటే ఉండొచ్చు కానీ దాదాపు తొంభై శాతం ఈ ముష్టికి నీళ్ళ ధారే. ఇందులో మరో విషయం. మీరు ఫలానా దేశానికి ముష్టి కానీ వేస్తే ఆ దేశం మీరిచ్చిన ముష్టి డబ్బులు ఎలా ఖర్చుపెడుతుందో మీరు అడగరాదు. ఆ డబ్బులో కొంత నాయకులు కొట్టేశారా? మరో దేశానికి ముష్టి ఇచ్చారా అనేవి అడగరాదు. ఇవ్వడం వరకే మీ బాధ్యత.

నియమిత ముష్టి: ఇది పైన చెప్పిన ప్రభుత్వ ముష్టికి ఎక్స్‌టెన్షన్ లాంటిది. ఈ ఏడు ఇంత తీసుకున్నాం, అయినా ఇన్‌ఫ్లేషన్ వల్ల మీరిచ్చినది కట్టలేం. మరి కాస్త ఇవ్వండి అని ముష్టి ఎత్తడం ఈ కోవకే చెందుతుంది. క్లింటన్‌గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా తనకున్న అప్పు పూర్తిగా తీర్చేసింది. అప్పట్లో ఇదో పెద్ద వార్త. ఆయన ఎనిమిదేళ్ళ పదవి అయ్యేసరికి అమెరికాకి బోల్డు మిగులు డబ్బు ఉంది ఖజానాలో. ఆ తర్వాత వచ్చిన వారి హయాంలో అది తరుగుతూ ఇప్పటికి మహాభూతంలా అయింది. ‘అలా ఎత్తుకెత్తు ముష్టి ఎత్తకండి; మీ దేశం క్రెడిట్ రేటింగ్ మారుతుంది’ అంటూ చెప్పినా ‘ఆ, సరేలే మాకు తెలీదా ఏవిటి?’ అనుకోవడం మరో సారి చిప్ప చేత్తో పట్టుకుని ముష్టికి బయల్దేరడం. ‘ప్రస్తుతం ఇలా పోనీయ్, వచ్చే ఏటి సంగతి అదొచ్చాక చూసుకోవచ్చు.’ ఇదే ఆలోచనాక్రమంగా కనబడుతోంది. ఇది ఎప్పుడు, ఎలా మారుతుందో అనేది ఇప్పట్లో ఎవరూ చెప్పలేరు.

ధాష్టీక ముష్టి: ఇదో రకం దండుకునే గోల. బయట హోటళ్ళలో భోజనం చేసి బిల్లు కట్టేటప్పుడు ఇచ్చేది లేదా టిప్. మీకు అడిగినవి వీలున్నంతలో తెచ్చిపెడితే, భోజనం బాగుంటే, అందమైన వెయిటర్ మిమ్మల్ని ‘హలో హనీ’ అని పిలిస్తే, మీరు సంతోషించి ఇచ్చేది. ఇది ఇవ్వక్కర్లేదు కానీ ఈ భోజనం పట్టుకొచ్చే వారికి జీతాలు తక్కువ కనక సరే బాగోదని ఇస్తారు. కానీ ఇది గంగవెర్రులు ఎత్తుతూ కనీసం పదిహేనుశాతం ఇవ్వాలి అనే స్థాయికి చేరింది. ఈ స్థాయి చేరాక ఈ వెయిటర్లకి ఇవ్వకపోతే బాగోదని మీరు ఇవ్వడం నేర్చుకున్నారు. అయితే ఈ స్థాయి వచ్చింది కనక ఈ వెయిటర్లకి కళ్ళు నెత్తిమీదకి వచ్చి, ఇవ్వకపోతే ఏడుస్తూ ‘ఇదేమిటి ఎందుకివ్వరు?’ అని మొహం మీదే అడిగే రోజులొచ్చాయి. రెస్టారెంట్లో ఎంత ఇవ్వాలి అనే చిన్న కూడికలు కూడా చేసుకోలేని పెద్దమనుషులకి ఎంత ఇవ్వాలో చెప్పే ఏప్‌లు కూడా ఉన్నాయంటే ఈ దరిద్రం ఎంతవరకూ విస్తరించిందో అర్ధం చేసుకోవచ్చు. మరో విశేష దరిద్రం ఉంది ఇందులో. 15% టిప్ ఇవ్వాలి అనేసరికి మీరు స్నేహితులతో వెళ్తే వంద డాలర్ల బిల్లు అయితే మొత్తం నూటపదిహేను ఇస్తున్నారు కదా ముష్టితోపాటు? కొన్ని చోట్ల హోటల్ లేదా రెస్టారంట్ ఓనర్లు ఈ ‘టిప్పు’ డబ్బులు కూడా వారే తీసుకుని ఈ వెయిటర్లకి ఇవ్వరు. ఇది నా స్నేహితులు కొంతమంది వేసవి సెలవుల్లో హోటళ్ళల్లో పనిచేసి ప్రత్యక్షంగా అనుభవించాక చెప్పిన మాట. మంచినీళ్ళు కావాలని అడిగినప్పుడు అరగంట చూసినా ఇవ్వకపోతే కోపం వచ్చి టిప్పు ఇవ్వకుండా వచ్చేసినందుకు నా మొహం మీదే వెక్కిరించడం స్వానుభవం. టిప్ అనేది ‘మంచి సర్వీస్ చేసినందుకు’ అనేదాని నుంచి ‘ఇస్తావా ఛస్తావా?’ అనేవరకు వచ్చింది. ఇందులో మరో విపరీతం ఈ మధ్య ఒక కాలిఫోర్నియా రెస్టారెంట్ ఓనర్‌గారు బిల్లు ఇంత, దీనికి మా వెయిటర్ల మెడికల్ ఇన్స్యూరెన్స్ ఇంతా అని వేసి ముక్కుపిండి వసూలు చేశార్ట. హతోస్మి.

పీకులాట ముష్టి: – ఇది టాక్సీ, ఆటో డ్రైవర్లు ఎత్తేది. మీరు హైద్రాబాదులోనో మరో చోటో ఆటో ఎక్కుతారు. మీటరు పనిచేయదు, చేసినా దాని ప్రకారం డబ్బులు ఇవ్వడం కుదరదు అని ఆ డ్రైవర్ మీకు చెప్పాక, సరే ట్రిప్‌కి ఇంతా అని మీరు బేరం ఆడి ఎక్కారు. కానీ దిగేటప్పుడు ‘అది కాదు, పెట్రోల్ అంతా, అనుకున్నదానికంటే ఎక్కువదూరం అయింది’ అని ఏవో కాకమ్మ కబుర్లు చెప్పి దెబ్బలాటకి దిగి మరో పాతికో, యాభయ్యో ముష్టి ఎత్తడం. మద్రాసులో, అదీ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఆటో టాక్సీ డ్రైవర్లు ఎత్తే ఈ ముష్టి అతి దారుణం. ఆర్టిసి బస్సుల్లో చిల్లర ఇవ్వకపోవడం, అడిగితే లేదనడం, మర్చిపోయాననడం ఇందులోకే వస్తాయి. ఇందులో కొంచెం తేడాతో ఉన్నది ఇండియా ఎయిర్‌పోర్టులలో అడిగే ముష్టి. మీ బాగ్‌లు ఎవరో మోసినందుకు ఎలాగా ఇద్దాం అనుకుంటూనే ఉంటారు కానీ వాళ్ళే ముందు అడిగేసరికి మీకు పరమ చిరాకు వేస్తుంది. ఇప్పుడెలా ఉందో తెలియదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఎయిర్ ఇండియా గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు ఇది అతి దారుణంగా ఉండేది. వారి ఉద్యోగస్తులూ, మనుషులు కూడా విమాన ప్రయాణీకులని పశువుల్లా చూసేవారనేది జగమెరిగిన సత్యం.

పూజారి ముష్టి: అన్ని ముష్టిలలోనూ ఇది అతి దరిద్రం. చిన్న ఊర్లో ఉన్న గుడిలో పూజారి అడిగాడు అంటే సరే ఆ గుడికి సరైన కమిటీ, ఆయనకి జీతం సరిగ్గా లేవు అనుకోవచ్చు కానీ, ఈ ముష్టి తిరుపతి, అన్నవరం లాంటి చోట జరుగుతుంటే అసహ్యం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ పూజారులకి జీతాలు అన్నీ సరిగ్గా ఉన్నాయి. వాళ్ళు కూడా ఆ జీతానికి ఒప్పుకుని ఉద్యోగం మొదలుపెట్టారు. వీళ్ళు దండుకుంటున్నారు కనక నేను సైతం అంటూ మిగతావారు కూడా తయారు. ఉదాహరణకి పుస్తకాల షాపులో నూట ముప్ఫైరెండు రూపాయలకి ఏదో కొని నూటముప్ఫై ఐదు ఇచ్చారు. మిగిలిన మూడు రూపాయలు ఇవ్వక చేత్తో సరే సరే అని వెళ్ళమని చెప్పడం. ఇదేమిటి ఇక్కడ కూడానా అని మీకు ఆశ్చర్యం కలిగితే ఆ ఆపద మొక్కులవాడు కూడా విలాసంగా చూస్తాడు తప్ప ఏమీ చేయలేడు. ఇది గర్భగుడిలోంచి బయటకి విస్తరించి గుండు కొట్టించే (కేశఖండనం) చోట అతి దారుణంగా ఉంటుంది. ఎన్టీరామారావుగారు ఉచిత గుండు, ఒక్కొక్కరికీ కొత్త బ్లేడు అంటూ ఏదో పెట్టాడు కానీ టికెట్ కొన్నాక వీళ్ళందరూ ముష్టి ఎత్తకుండా కెమెరాలు పెట్టినా ఆ కెమెరాల ముందే ముష్టి అడిగి మరీ తీసుకుంటున్నారు. మీరు కానీ రిపోర్ట్ చేస్తే అక్కడి మేనేజర్‌గారు ‘ముష్టి పది రూపాయలకి ఏడుస్తున్నారేమిటండీ’ అని మొహంమీదే గింజుకుంటారు. ఇన్‌ఫ్లేషన్ అని ఈ ముష్టి రేట్లు కూడా ఎప్పటికప్పుడు సర్ది పెంచుతూ ఉంటారు. శ్రీనివాసుడి పెద్ద కళ్యాణం టికెట్ దొరకదు మనలాంటివారికి. దానికోసం ఎవర్నో పట్టుకుని ముష్టి వేయాలి. వీటి అన్నింటికీ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు విలాసంగా చూడ్డమే తప్ప ఏమీ చేయలేడు. ఆయన ఏమైనా చేద్దామన్నా సర్కారు వారు నియమించిన దేవస్థానం అధికార్లు ఆయన చేతులు కట్టేసి ఏమీ చేయనివ్వరు. మొత్తం తిరుపతి కొండ మీదనుంచి ముష్టివాళ్ళని తరిమేశాం అని చెప్పుకుంటారు కానీ ఆఫీసుల్లో, పుస్తకాలషాపుల్లో, కేశఖండనం ఉద్యోగస్తుల్లో ముష్టివాళ్ళు అప్రతిహతంగా సాగుతూనే ఉన్నారు. ఇది ఈ మధ్య అమెరికా పూజార్లకి కూడా విస్తరించింది. మీరు గుడిలోకి రాగానే మిమ్మల్ని పేరుతో పలకరించి ఏదో స్పెషల్ పూజ చేస్తాను అని చేయించి దండుకుంటున్నారు. కార్ పూజకి ఇంతా, మరోదానికి ఇంతా అని గుడి కమిటీ రేట్లు పెట్టినా పూజ అయ్యాక దక్షిణ ఇవ్వాలి. మీరిచ్చినది ఏనాటికీ చాలదు. వంద ఇచ్చినా ఇదేమిటండి ఇంతేనా అంటారు. వాళ్ళు అడిగిన డబ్బులిచ్చినా ఆ పూజారులంటే అసహ్యం కలగడం సహజం. ఏదైనా అంటే, నాకొచ్చే జీతం చాలడం లేదు, అంటూ కబుర్లు చెప్తారు.

కడపటి లేదా చివరి ముష్టి: ఇది ఆఖరిది. అదృష్టం కొద్దీ ఇందులో సాధారణంగా ప్రత్యక్ష డబ్బుల మార్పిడి ఉండదు, ఉన్నా వెంఠనే కనిపించదు. జీవితంలో చేయగలిగినదంతా చేసి దేవుణ్ణి భగవంతుడా నాకు ఇది ఇయ్యి, అది ఇయ్యి అంటూ ఏడవడం. జీవితాంతం జనాలని ఏడిపించుకు తింటూ కేన్సర్ వస్తే, దేవుడా నన్ను బతికించు అంటూ ముష్టెత్తడం. లేదా బిజినెస్‌లో అన్నీ పోతే మరోసారి మనక్కనబడని శక్తికో నమస్కారం పారేసి ‘నన్ను రక్షించు’ అంటూ ముష్టెత్తడం. ఈ కడపటి ముష్టి ఒకరి కోసం మరొకరు చేయవచ్చు లేదా స్వంతంగా చేసుకోవచ్చు. ముష్టి ఇవ్వబడితే నేను భక్తుణ్ణి అనడం లేకపోతే నేను నిరీశ్వరవాదిని, లేదా నాస్తికుణ్ణి అంటూ చెప్పుకుంటూ తిరగడం ఇందులో జోకు.

ముగించేముందు కొసమెరుపు. అన్ని దేశాలలో, ప్రదేశాలలో, అన్నిచోట్లా ఇలా లేదు. ఆశ్చర్యంగా కొన్నిచోట్ల ముష్టి ఇవ్వరు. ఇచ్చినా తీసుకోరు. కొండొకచో నేరంగా పరిగణిస్తారు అంటారు. ఈ నేరం అనేది వదిలేసి మిగతాది చూద్దాం. జపాన్ దేశంలో నేను స్వయంగా చూసినది ఇది. టేక్సీ, రెస్టరంట్లలో ఎవరూ టిప్ ఇవ్వరు, ఇవ్వరాదు, తీసుకోరు. టేక్సీ డ్రైవర్ ‘నేను ఫలానా చోటికి రాను’ అని ఎప్పుడూ అనడు, మీటర్ ప్రకారం ‘మాత్రమే’ డబ్బు తీసుకుంటాడు. ఒక్క యెన్ పైన ఇచ్చినా, కింద ఇచ్చినా కుదరదు. మీ బరువైన సూట్‌కేస్ టేక్సీ ఎక్కేటప్పుడు లోపల పెట్టి, దిగేటప్పుడు బయటకి తీశాడు, సరే ఇంకో వంద యెన్‌లు (ఒక డాలర్ అంత) టిప్ ఇద్దాం అనుకుంటే మీకేసి అసహ్యంగా చూసి వద్దు అని చెప్తారు డ్రైవర్లు. వీళ్ళు కూడా టై కట్టుకుని అతి శుభ్రంగా ఉంటారు ఒక ప్రొఫెషనల్ డ్రెస్‌లో. రెస్టరెంట్‌లో కూడా అంతే. ఆఖరికి జపాన్‌లో ఉండే ఇండియన్ హోటళ్ళు కూడా టిప్ తీసుకోరు. ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వండి. థాంక్యూ మళ్ళీ రండి. ఇంతకు ముందు చెప్పినట్టూ జపాన్ గవర్నమెంట్ పబ్లిగ్గా, ధాటీగా ముష్టి ఎత్తుతుంది మిగతా దేశాలనుంచి కానీ జపాన్ ప్రజలు ముష్టి అడగరూ, తీసుకోరూ. బాగుంది కదా?

మరోటి నేను చూసినది, షిరిడి సాయి గుడిలో శుభ్రం చేసే మనుషులు. ఎవరైనా పిల్లలు కానీ వృద్ధులు కానీ ఉమ్మినా, డోకువచ్చినా కదలలేక ఉన్నచోటే డోకినా మలవిసర్జన చేసినా వీళ్ళు వెంఠనే వచ్చి శుభ్రం చేస్తారు. మీరు డబ్బు ఇవ్వకపోతే ‘వద్దు’ అని సున్నితంగా తిరస్కరిస్తారు. ఈ షిరిడీలో చెప్పుకోవాల్సింది మరోటి ఉంది – సంస్థానంలో ఉండే గుడి, హాస్పిటల్, భోజనశాల అనేచోట్ల ఎవరూ పైసా ఇవ్వక్కర్లేదు, ఇచ్చినా తీసుకోరు కానీ బయట రోడ్డుమీద టేక్సీ ఆటో మిగతా అందరూ యధాతధంగా తీసుకుంటారు. ఇది మరో వింత.

ఇలా రకరకాల ముష్టి గురించి చూశాం కానీ దీనిలో మరి కొన్ని రకాలు ఉన్నాయి, ఉండొచ్చు కూడా. ఒకదానికొకటి కలిపి మరిన్ని రకాల ముష్టి కూడా తయారు చేసుకోవచ్చు. కంపెనీ అతి ముష్టి, విశేష ప్రభుత్వ ముష్టి, వీర ప్రైవేట్ ముష్టి. డైలీ ముష్టి, నెలవారీ ముష్టి (ఇది నెలవారీ జీతంతో ఆఫీసుల్లో పనిచేసే వారికి బాగా తెలుస్తుంది), మేనేజర్ కాళ్ళు నాకుతూ ప్రమోషన్ కోసం ఎత్తే ముష్టి, సోషల్ మీడియాలో లైకులకు ముష్టి, తమ కథలకు, కవితలకు, పుస్తకాలకూ రివ్యూలు అడిగే ముష్టి – వగైరాలు. మీకు తెల్సిన మరోటి ఏదైనా ఉంటే అది కూడా చెప్పడానికి ప్రయత్నించండి. ఏదైనా ముష్టి మాత్రం ‘ఇందుగలదందులేదని’ చెప్పుకోలేని సర్వవ్యాపి.


ఈ వ్యాసానికి నేను చూసిన/వాడిన లింకులు:

  1. అమెరికా అప్పు గణాంకాలు.
  2. అమెరికా అప్పు ఎక్కడినుంచి?
  3. దేశానికెంత అప్పు?
  4. విజయానికి అయిదు మెట్లు, యండమూరి వీరేంద్రనాథ్.
  5. క్లింటన్ హయాంలో అప్పు, ఖజానా విషయాలు.
  6. https://en.wikipedia.org/wiki/Vijay_Mallya, విజయ్ మాల్యా విషయాలు.