త్సు యెఁ కవితలు

1. మూడు వేసవి నెలలు

ఈదురు గాలులతో
వడగళ్ళ వానతో
చలికాలపు ఆకాశం చల్లగా
కిందకి దిగింది.

కానీ ఈ మెత్తని బొంత కింద
మేము మా రతికేళితో –
మూడు వేసవి నెలల వేడి పుట్టిస్తాము.

2. మందలింపు

తను రద్దీగా ఉన్న ఆ వీధిలో
నీ వద్దకు వచ్చినప్పుడు
బహుశా వద్దని చెప్పలేవు.

కానీ నువ్వు నన్ను
నిర్లక్ష్యం చేయడం కొత్తేం కాదు.

వాడకపోతే తలుపుల మొలలు కూడా
సాగి వదులైపోతాయి
ఒకప్పటి బిగువును పోగొట్టుకొని.

3. వసంతంలో ఒంటరిగా

చెట్ల మధ్యనుంచి వేడిగా వెన్నెల
పల్చటి పట్టుబట్టపై
పూలు వెలుగులీనుతున్నాయి.

ఒంటరిగా ఏకాంతంగా
మగ్గం పని చేసుకుంటూ

నీ గురించి ఆలోచించకుండా
ఎలా ఉండగలను?

4. చెప్పగలవా?

మరలా రాత్రయింది.
నా కురులను
భుజాల మీదుగా ఆరబోసి
ప్రియునికెదురుగా
ఊరువులు బారచాపి
“నాలో ప్రేమాస్పదం కాని భాగం
ఏదో చెప్పగలవా?” అంటాను.

5. యవ్వన సౌందర్యం

అదాటున వీచిన గాలికి
ఎండుకొమ్మలు సవ్వడి చేస్తాయి.
సంధ్య చిక్కబడుతుంది.
నా ప్రియుడు నన్ను ప్రేమిస్తాడు.
అతడు ప్రేమించేలా చేసిన
నా యవ్వన సౌందర్యం పట్ల
నేను గర్వపడతాను.

6. ఉత్తర దక్షిణాలు

వేల సంవత్సరాలుగా
స్థిరంగా వున్న ఉత్తర ధ్రువాన్ని నేను.
నువ్వు సూర్యుడిలా చంచల మనస్కుడవు.
ఉదయం తూర్పున ఉంటావు.
సాయంత్రం పడమరన కుంగుతావు.

7. వాసంత సమీరం

తెరచిన కిటికీ దగ్గర
ఎదురు చూస్తూ వుంటాను
నడికట్టు కట్టుకోకుండా,
దుస్తులు వదులుగా.
ఆ చిరుగాలులు తేలిగ్గా ఈ
పల్చని బట్టలు ఎగరగొట్టగలవు.

నా వలువలు లేచిపోతే…
ఆ వాసంత సమీరాన్ని నిందించు.


చీనీ కవయిత్రులలో పేరొందిన కవయిత్రి త్సు యెఁ (Tzŭ-Yeh). ఈమె క్రీ. శ. 3-4 శతాబ్దాలకు చెందినదిగా భావిస్తున్నారు. ఈమె ఒక పానశాలలో మద్యం విక్రయించే వృత్తిలో పని చేసిందని ఒక అంచనా. ఆమె కవిత్వంలో ఉత్సాహం, విరహం, ఎడబాటు, ఆశనిపాతం, నిరాశ, శృంగారం కనిపిస్తూ వుంటాయి. ఆమె రాసిన కవితలు, గీతాలు వందకు పైగా లభ్యమవుతున్నాయి. ఆమె కవితలను పిన్యిన్ (Pinyin) లేదా అర్థరాత్రి కవిత్వం (Midnight songs poetry) అని అంటారు. అయితే ఆమె వ్రాసిందని చెప్పుకునే కవితలు అన్నీ ఆమే వ్రాసిందని ఆధారాలు లేవు. ఎందరో వ్రాసి ఆమెకు ఆపాదించి ఉంటారన్న వాదన కూడా ఉంది. కెనెత్ రెక్స్‌రాత్ (Kenneth Rexroth) సంకలనం చేసిన చైనా స్త్రీ కవయిత్రులులోనూ (Women Poets of China), శామ్ హామిల్ (Sam Hamill) సంకలనాలలోనూ (Crossing the Yellow River, The Lotus Lover) త్సు యెఁ కవితలు చోటు చేసుకున్నాయి. 1972లో లెనోర్ మేహ్యూ, విలియమ్ మెక్‌నాటన్ (Lenore Mayhew & William McNaughton) చైనీస్‌ నుంచి ఇంగ్లిషు లోకి అనువదించిన పుస్తకం (The Love Poems of Tzu Yeh – The Gold Orchid) త్సు యెఁ కవిత్వం లభ్యమవుతున్నది. చీనీ కవిత్వంలో మరో సుప్రసిద్ధ కవయిత్రి లి చింగ్ చావోతో సరిసమానంగా త్సు యెఁను పరిశోధకులు భావిస్తున్నారు.