రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

వెల్చేరు నారాయణరావు తెలుగుదారి

రచన: కె. వి. ఎస్. రామారావు
జనవరి 2024

చివరికి ఇంతకాలానికి వ్యావహారిక తెలుగు భాషకి ఒక నిర్దిష్టమైన వ్యాకరణం వెలువడింది. విచిత్రం కాని విచిత్రం ఏమిటంటే దీన్ని రాయటానికి ఒక ప్రత్యేకమైన అనుభవం, అర్హత వున్న వ్యక్తి కావలసి రావటం.

వెల్చేరు నారాయణరావు యాభై ఏళ్ళకి పైగా తెలుగు రాని, తెలుగు మాతృభాష కాని, అసలు తెలుగంటే ఏమిటో కూడ తెలియని పిల్లలకి తెలుగు బోధించే అధ్యాపకుడిగా ప్రత్యేకమైన అనుభవం వున్నవాడు. అదీ ఇంగ్లీష్ మాధ్యమంలో తెలుగు బోధించినవాడు. కఠినమైన ప్రశ్నలు అడగలేని చిన్న పిల్లలకి కాదు, అధ్యాపకులని లోతైన ప్రశ్నలతో మట్టిగరిపించగల అమెరికన్ కళాశాల విద్యార్థులకి. అందునా ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మేడిసన్‌లో. అంతేకాదు, తెలుగు సాహిత్యాన్ని విస్తృతావలోనకంతో మథించి వందలకొద్ది పరిశోధనాపత్రాల్ని, ఎన్నో కొత్తపుంతల్ని వేసే గ్రంథాల్ని ప్రపంచప్రఖ్యాత ప్రచురణసంస్థల ద్వారా ప్రచురించి తులనాత్మక ప్రపంచసాహిత్య (Comparative Literature) పరిశోధకుడిగా విశ్వవిఖ్యాతి గడించినవాడు. తన యాభై ఏళ్ళ పైబడిన తెలుగు బోధనానుభవాన్ని రంగరించి నారాయణరావు తయారుచేసిన ఏకైక వ్యావహారిక తెలుగు వ్యాకరణగ్రంథం తెలుగుదారి.

తెలుగుదారి పూర్వోత్తరాల గురించి చర్చించే ముందు తెలుగుభాష స్వభావాన్ని గురించి నారాయణరావు వెలువరించిన విస్మయకరమైన ఒక లోచూపు గురించి చెప్పుకుతీరాలి. అది తెలుగుభాష ‘క్రియాపద కేంద్రక’ మైందన్నది. అంటే తెలుగుభాషా వాక్యాల్ల్లో ప్రముఖస్థానం క్రియాపదానిది. ఇందుకు ఒక ప్రబల నిదర్శనం విశేషణాల నుంచి వస్తుంది – ఆంగ్లం లాటి భాషల్లో నామవాచకానికి బలం చేకూర్చుతూ ఎన్నో విశేషణాలుంటాయి (adjectives) కాని తెలుగులో అత్యధికంగా వున్నవి క్రియావిశేషణాలు (adverbs), నామవాచక విశేషణాలు కావు.

ఆంగ్లం లాటి భాషల్లో వాక్యస్వరూపం ‘నామవాచకం’ చుట్టూ తిరుగుతుంది. అంటే ఒకే క్రియాపదం ఏ నామవాచకానికైనా అలాగే వుంటే సహాయక క్రియాపదం (auxiliary verb) ఆ నామవాచకం తాలూకు కాలం, మనస్థితి, లేదా స్వరాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకు He is walking, You are walking, I am walking అన్న వాక్యాలు చూస్తే అన్నింటిలోనూ క్రియ ఒక్కటే. సహాయకక్రియ మాత్రమే నామవాచకాన్ని సూచిస్తుంది, అనుసరిస్తుంది (is, are, am). ఇదే విషయం తెలుగులో చెప్పాలంటే – అతను నడుస్తున్నాడు, మీరు నడుస్తున్నారు, నేను నడుస్తున్నాను, అంటాం. ఇక్కడ క్రియాపదమే రూపాంతరం చెందుతుంది. సహాయకక్రియతో పనేలేదు.

తెలుగుభాషలో క్రియకు అత్యంత ప్రాధాన్యం వున్నదని, మనం వ్యక్తీకరించదలుచుకున్న భావాలు చాలావరకు క్రియారూపాన్ని మార్చటం ద్వారా సాధిస్తామనేది నారాయణరావు గమనించి విస్తృతంగా విశ్లేషించిన అంశం. ఒకసారి ఈ కీలకాన్ని పట్టుకుంటే తెలుగు నేర్పటం, నేర్చుకోవటం చాలా తేలికౌతుందన్న ప్రతిపాదన, అదెలా సాధ్యమో సహేతుకంగా, సవిస్తరంగా, సోదాహరణంగా, సాధికారంగా వివరించటం ఈ గ్రంథం తెలుగుభాషకు చేసిన ఒక మహోపకారం. జిజ్ఞాసువులకు ఆలోచనామృతం.

ఇంతవరకు తెలుగు విద్యావంతులు తెలుగుభాష క్రియాత్మకం అన్న విషయాన్ని గమనించకపోవటం, ఆంగ్లం లాగా నామవాచకాత్మకం అని భ్రమించటం అనేక దురదృష్టకర పరిణామాలకు దారితీసింది. ఇందుకు ఒక ప్రబల ఉదాహరణ వార్తాపత్రికలు: వీరు ఆంగ్లభాషాపత్రికల్ని అనుసరిస్తూ కృత్రిమమైన తెలుగుని తయారు చేసి భాషకు విపరీతమైన అపకారం చేశారు. ఉదాహరణకు ఆంగ్లంలో Thief caught అన్న శీర్షిక ఉందనుకోండి. ఇదే భావాన్ని తెలుగులో చెప్పాలంటే ‘దొంగ పట్టివేత’ అని తయారు చేశారు, ‘దొంగ దొరికాడు’ అనే సహజ, సరళ వాక్యాన్ని వదిలేసి. ఇప్పుడు ఎక్కడ చూసినా నామవాచకాంత శీర్షికలే! రహస్యం వెలికితీత, దుష్టశక్తుల ఏరివేత – ఇలా కొత్తకొత్త పదజాలాన్ని సృష్టించి మరీ శీర్షికలని తయారుచేశారు వీరు. ఎందాకో అక్కర్లేదు, ఈ మధ్య వచ్చిన శీర్షికలు కొన్ని గమనించండి: సహాయం కోసం జనం ఎదురుచూపులు, గంట కురిసిన వర్షానికే మునిగిన సెక్రటేరియట్, స్కూళ్ళకు సెలవు, బాంబ్ పేల్చిన రఘురామ, బొక్కబోర్లాపడ్డ నేతలు, మరో 4 గంటల్లో ముంచుకొస్తున్న ముప్పు, ఆ ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జాం, పొంగుతున్న నాలాలు కొట్టుకుపోతున్న కార్లు, హైదరాబాద్‌లో కుండపోత వర్షం.

ఇవన్నీ కృత్రిమ శీర్షికలే. తెలుగుభాష స్వరూపాన్ని అర్థం చేసుకోకుండా దున్నపోతు ఈనిందంటే దూడని కట్టెయ్యమన్న సామెతగా ఒకరిని చూసి ఒకరు అర్థంపర్థం లేని నామవాచకరూపాల్ని తయారుచేసి జనం మీదికి వదుల్తున్నారు. కొందరు టీవీ యాంకర్లు ఏకంగా ‘నేను సుబ్బారావు’ వంటి తలాతోకా లేని వాక్యాల్ని తయారుచేసి ప్రేక్షకులు అంతకుముందు తమకు తెలిసిన తెలుగుని కూడ మర్చిపోయేలా చేస్తున్నారు. బుద్ధున్న ఎవడైనా ‘నేను సుబ్బారావుని’ అంటాడా లేక ‘నేను సుబ్బారావు’ అంటాడా? కనీసం మన పత్రికలు, టీవీల వారు ఈ పుస్తకాన్ని చదివి తెలుగు స్వరూపస్వభావాల్ని గ్రహించి భాషకు, జాతికి ఇప్పటివరకు చేసిన అపచారాన్ని, అపకారాన్ని సరిదిద్దుకుంటారని ఆశిద్దాం.

క్రియాత్మకమైన తెలుగు స్వభావాన్ని తేటతెల్లం చేయటానికి ఈ గ్రంథం నాలుగింట మూడువంతులు క్రియ గురించే కావటం విశేషం. క్రియ, అది వివిధ భావాల్ని ప్రత్యక్షీకరించటానికి ఎలా రూపాంతరం చెందుతుంది అనేది తెలుగు గురించి ఏమాత్రం కుతూహలం వున్నవారైనా ఈ గ్రంథం చదివి తెలుసుకోవాలి.


మన పిల్లలకు ఇంగ్లీష్ ఎలా నేర్పాలో మనకు బాగానే తెలుసు. ఇందులో వందేళ్ళకు పైగా అనుభవం వుంది. ఇంగ్లీష్ వ్యాకరణం (గ్రామర్) ఇందులో ఓ ముఖ్యాంశం. ఆ వ్యాకరణంలో గట్టిపట్టు వున్న అధ్యాపకులు మనకు చాలామందే వున్నారు. బహుశః ఇప్పుడు బ్రిటన్‌లో కన్నా ఇండియాలోనే ఇంగ్లీష్ వ్యాకరణంలో దిట్టలు ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అదే తెలుగు విషయానికి వచ్చేసరికి మనం చాలా వెనకబడి వున్నాం. తెలుగు మాతృభాషగా వున్న పిల్లలకు వాడుక తెలుగు ఎలా నేర్పాలో మనం నేర్చుకోలేదు. పెద్దలకే తెలియని విషయం పిల్లలకు ఎలాగూ బోధించలేం కదా!

20వ శతాబ్దం తొలినాళ్ళలో గ్రాంథిక తెలుగు, వ్యావహారిక తెలుగు గురించి పెద్ద ఎత్తునే చర్చలు జరిగాయి. గ్రంథాల్లో వుండే తెలుగు వాడుకలో రాయటానికి, మాట్లాడటానికి పనికిరాదని గిడుగు రామమూర్తి వంటి వారు గట్టి పట్టుదలగా వాదించారు, నిరూపించారు కూడ. ఐతే వాళ్ళ వాదాలు గ్రాంథిక తెలుగు పనికిరాదని తేల్చటానికి తప్ప వ్యావహారిక తెలుగు స్వరూపం ఏమిటో నిర్దేశించటం మీద ధ్యాస చూపించలేదు. ‘అదేమిటో అందరికీ తెలిసిందే, వేరే చెప్పాల్సిన పనిలేదు’ అన్నట్టు వ్యవహరించారు వారు. మహా ఐతే కొందరు గురజాడ కన్యాశుల్కాన్ని చూపించి ‘దాన్లో వున్న తెలుగుని అనుసరించండి, చాలు’ అన్నారు. అక్కడే బోలెడంత గందరగోళానికి పునాదులు వేశారు.

కన్యాశుల్కంలో వున్నది పాత్రోచిత భాష కాని వ్యావహారిక భాష కాదు. అందులో పాత్రలు వారి వారి ప్రాంతం, కులం, ఆర్థిక సామాజిక నేపథ్యాలని ప్రతిబింబించే భాషలో మాట్లాడతారు, అంతే. ఆ భాషని అనుసరించమంటే, ఏ పాత్ర భాషని అనుసరించాలి అన్న మీమాంస వచ్చి కూర్చుంటుంది. గిరీశం మాట్లాడే భాష, రామప్పంతులు మాట్లాడే భాష ఒకటి కాదు; మధురవాణి మిగిలిన పాత్రల్లా మాట్లాడదు. పూటకూళ్ళమ్మ పట్టే వేరు. ఇలా ఏ పాత్రకి ఆ పాత్రే. ఎవరి భాష వారిదే. పిల్లలకి నేర్పాలంటే వీటిలో ఏది సరైంది? నిజానికి ఏదీ కాదు.

పోనీ మనకు ఇప్పటికే వున్న వ్యాకరణాల్ని పాటిద్దామా అంటే పిల్లలకి చెప్పటానికి మనకున్న ఒకే ఒక్క వ్యాకరణం చిన్నయసూరి బాలవ్యాకరణం. దాన్ని ఆయన చక్కగానే రాశాడు. ఐతే ఆ వ్యాకరణాన్ని వాడుతూ ఆయనే రాసిన పంచతంత్ర భాగాలయిన మిత్రలాభం, మిత్రభేదం చూస్తే ఇట్టే తేలిపోతుంది అది నిత్యవ్యవహారాల్లో రాయటానికి, మాట్లాడటానికి వాడగలిగే భాష కాదని. నిజానికి దాని గమ్యం మన పద్యగ్రంథాల్లో వాడిన భాష స్వరూపాన్ని వివరించటం, వ్యావహారికభాషని కాదు. అంచేత మనం నిత్యవ్యవహారాల్లో రాసే, మాట్లాడే భాషకి బాలవ్యాకరణం ప్రమాణం కాదు, కాలేదు.

ఇలా మనం రెంటికీ చెడ్డ రేవళ్ళం అయాం. గ్రాంథికభాష అందామా, అది అందరికీ అందని చందమామ. వ్యావహారిక తెలుగు అందామా అది ఎలా వుండాలో తెలుసుకుందామంటే అలాటి ప్రమాణగ్రంథాలే లేకుండా పోయాయి. దీంతో ఎవరికి తోచినట్టు వారు రాయటం, సినిమాల్లో టీవీల్లో మాట్లాడటం, పిల్లలూ పెద్దలూ వాటినుంచే ఎలా రాయాలో మాట్లాడాలో తెలుసుకోవలసి రావలసిన దుస్థితి తెలుగుకి తెచ్చిపెట్టుకున్నాం.


ఈ గ్రంథం తాలూకు ఒక ముఖ్యవిశేషం ఇది అవసరానికి అనుగుణంగా తెలుగు, ఇంగ్లీషుల మిశ్రమంగా వుండటం. దీనివల్ల తెలుగు చదవటం, మాట్లాడటం రాని (అంటే అక్షరాలు చదవటం కాదు, తప్పుల్లేని వాక్యాల్లో తమ భావాల్ని వ్యక్తీకరించ గలిగే కనీస పరిజ్ఞానం లేని) నేటితరాలకి వ్యావహారిక తెలుగుని ఇది అందుబాటులోకి తెస్తుంది.

దీని మరో ప్రధానపార్శ్వం తెలుగు భాషకీ ఆంగ్లానికీ వున్న మౌలికభేదాల్ని అత్యంత స్పష్టంగా సోదాహరణంగా వివరించటం. ఇది కూడ ఆంగ్లం తొలిభాషగా చదువుకుంటున్న కొత్తతరాల విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులు, గురువులకు ఎంతో ఉపకరించే అంశం. విద్యార్థులే కాకుండా జిజ్ఞాసువులైన పాత్రికేయులు, టీవీల్లో మాట్లాడే తలకాయలు (Talking Heads) కూడ దీన్నుంచి కొంతైనా నేర్చుకుని తెలుగుని నిరంతరంగా హత్యచేసే అలవాటుకి విశ్రాంతి ఇస్తారని ఆశించటం మరీ అత్యాశ కాదని ఆశ.

అలాగే, తెలుగు వ్యాకరణం గురించి పరిశోధన చేసే/ చెయ్యదలిచే వారికి ఇది అమూల్యనిధి. నారాయణరావు దీన్లో వివరించిన విశేషాల్ని ఎన్నో పార్శ్వాల్లో విశ్లేషించి, విశదీకరించి పరిశోధనలు సాగించవచ్చు.

ఉదాహరణకు tense (కాలం) అనే భావాన్ని తీసుకుందాం. ఆంగ్లంలో 12 రకాల tense లున్నాయి – భూత, వర్తమాన, భవిష్యత్‌లు, ఒక్కో దానిలో మళ్ళీ నాలుగు తరగతులు. ఇవి ఉన్నత విద్యావంతులకే చాలా తికమక కలిగించే అంశాలు, విద్యార్థుల గురించి చెప్పాలా? వీటికి తోడు, కర్త ప్రధానమైన యాక్టివ్ వాయిస్, కర్మ ప్రధానమైన పేసివ్ వాయిస్ వాక్యపద్ధతులు – కూడ కలిపితే ఇంక చెప్పనక్కర్లేదు. అందుకే ఇప్పటికీ చాలామంది భారతీయులు ఆంగ్లం మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఏ రకమైన tense వాడాలో తెలీక తప్పుల్లో కాళ్ళేస్తుంటారు. ఇక వీటికి వాక్యపద్ధతుల సంక్లిష్టత కూడ తోడయిందంటే గిలగిలలాడిపోతారు.

నారాయణరావు గుర్తించి వివరించిన మరో లోతైన అంశం నిజానికి ‘కాలం’ అన్నది ఆంగ్లంలోని tenseకి నిజమైన పర్యాయపదం కాదని, ఆంగ్ల tenseలో సార్వజనీనమైన కాలగమనం అనే ఒక అంశం, వ్యాకరణ సంబంధమైన భూత వర్తమాన భవిష్యత్‌లనే అంశం కలగాపులగంగా కలిసిపోయి వున్నాయని, తెలుగులో ఈ రెండు పార్శ్వాలు విడివిడిగా దేనికదే సమానస్థాయిలో ఉంటాయని. ఉదాహరణకు వర్తమానం అనేది తెలుగుభాషలో ఒక కాలం కాదు. సాగుతూ వుండటం (progression)) అనేది ఒక వర్గం (mode). దాన్ని ఏ కాలానికైనా అన్వయించవచ్చు. ఉదాహరణకు ‘నిఖిల్ నడుస్తున్నాడు’ అంటే అది వర్తమానాన్ని, ‘అప్పుడు నిఖిల్ నడుస్తున్నాడు’ అంటే అది భూతకాలాన్ని, ‘అప్పుడు నిఖిల్ నడుస్తూ ఉంటాడు’ అనేది భవిష్యత్‌ని సూచిస్తాయి. ఇక్కడ ‘నడుస్తూ’ అనేది ప్రోగ్రెసివ్ మోడ్. చూశారా, ఆంగ్లంతో పోలిస్తే తెలుగు tense లు ఎంత తేలికో !


తన యాభై ఏళ్ళ పైబడిన తెలుగు అధ్యాపకానుభవానికి అద్భుత పరిశీలన, అకుంఠిత పరిశోధనాకుశలతని రంగరించి నారాయణరావు నిర్మించిన ఈ గ్రంథం అజరామరం. తెలుగుభాష గురించి, దాని భవిష్యత్తు గురించి కొంచెమైనా ఆలోచన వున్న ఎవరికైనా అవశ్యపఠనీయం.

ఈ గ్రంధం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అన్ని ప్రముఖ పుస్తకకేంద్రాల్లోనూ దొరుకుతుంది. కొని చదవండి, చదివించండి, మీరు నేర్చుకోండి, పిల్లలకు నేర్పండి.

(ప్రథమ ప్రచురణ: వివిధ 9 అక్టోబర్ 2023, ఆంధ్రజ్యోతి దినపత్రిక. కొన్ని సవరింపులతో పునఃప్రచురణ.)


పేరు: తెలుగుదారి
రచన: వెల్చేరు నారాయణ రావు
ఆకృతి: అక్షర క్రియేటర్స్
ప్రచురణ: శ్రీ శ్రీ ప్రింటర్స్, 2022
పేజీలు: 474.
వెల: Rs.850, $95.
దొరుకుచోటు: లోగిలి, తెలుగుబుక్స్.ఇన్, నవోదయ, ఇతర ప్రముఖ పుస్తకాల దుకాణాలలో.

    
   

6అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Venkateswararao VEMURI January 1, 2024 9:11 pm

    పుస్తకం నిజంగా ఎలా ఉంటుందో తెలియదు కానీ, మీ పరిచయ వాక్యాలు పుస్తకాన్ని కొనిపించేలా ఉన్నాయి.

  2. 2
    తః తః January 2, 2024 9:45 am

    “సాగుతూ వుండటం (progression)) అనేది ఒక వర్గం (mode). ” ఘోరం రామారావుగారూ ‘అది ఒక తీరు’ అనాలి.
    తః తః

  3. 3
    తః తః January 2, 2024 10:20 am

    1.’అప్పటికి అఖిల్ నడిచేసి ఉంటాడు -నడిచేసుంటాడు.’- సంగతేమిటి?
    2.తెలుగుకి passive voice is a stranger. ఈ పాసివ్ వాయిస్ ‘బడు’ ఇంగ్లిష్ లో సైన్స్ చదువుకున్న వాళ్ళు తెలుగుకి వేసిన ముష్టి – దీన్ని గురించి ఒక సందర్భమ్లో నేను వేమన పద్యంలోదిగా చెప్పబడ్డ “పిల్లి దిన్న కోడి పిలచిన పలుకునా?”ను ఉదాహరించాను.

    తః తః

  4. 4
    K.V.S. Ramarao January 3, 2024 7:06 pm

    తెలుగులో ఆలోచించి రాసే అలవాటు తప్పి చాలాకాలం ఐంది. కనుక తః తః వంటి ప్రాజ్ఞులు నా తెలుగుని దయచేసి క్షమించి నారాయణరావు గారి అద్వితీయ కృషిని జనసామాన్యం లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చెయ్యమని మనవి. అలాగే వ్యావహారిక తెలుగు గురించి వారి భావాల్ని క్రోడీకరించి ఒక వ్యాసరూపంలో ప్రచురిస్తే అందరికీ ఉపకరిస్తుంది.

    ఏది రాసినా ముచ్చటైన తెలుగు నుడికారంతో రాసే వేమూరి వారికి ఈ పరిచయం నచ్చినందుకు నెనర్లు.

  5. 5
    తః తః January 4, 2024 9:46 am

    రామారావు గారు: “మీరు కాల్చేసిన వ్యక్తి స్పందించుట లేదు” అని BSNL అన్నప్పుడు నవ్వో ఏడుపో రానివాళ్ళు తెలుగు దారికి ఎంతటి మహానుభావుడు ఎంత తేలిగ్గా చెప్పినా ఈ జన్మకు రాలేరు.
    నమస్కారాలతో- తఃతః

  6. 6
    చంద్ర మోహన్ January 29, 2024 12:53 pm

    పుస్తకం చదివితే గానీ నా అభిప్రాయాన్ని చెప్పలేను గానీ వ్యాకరణం యొక్క ప్రాధాన్యత గురించి తెలుగు కోరాలో నేను వ్రాసిన ఒక సమాధానాన్ని ఇక్కడ పంచుకోవడం ఉచితమనిపించింది:

    ******
    వ్యాకరణం యొక్క ప్రాముఖ్యాన్ని తెలిపే శ్లోకాలు ఒక రెండు ఉదహరిస్తాను:

    “యద్యపి బహునాధీషే తథాపి పఠ పుత్ర వ్యాకరణమ్
    స్వజనః శ్వజనోమాభూత్ సకలం శకలం సకృత్ శకృత్”

    ఒక తండ్రి కొడుకుతో అంటున్నాడు. ‘నాయనా నువ్వు పెద్ద చదువులు చదువుకోక పోయినా ఫరవాలేదు. కానీ వ్యాకరణం మాత్రం చదువుకో. ఎందుకంటే స్వజనం (బంధువులు) అనడానికి శ్వజనం (కుక్కలు) అనీ, సకలం (మొత్తం) అనడానికి శకలం (ముక్క) అనీ, సకృత్ (ఒకప్పుడు) అనడానికి శకృత్ (మలం) అనీ అనకుండా ఉంటావు.’

    మరొక శ్లోకం–

    “అవ్యాకరణమధీతం భిన్న ద్రోణ్యా తరంగిణీ తరణమ్
    ఔషధమపథ్యయుక్తం త్రయమిదమకృతం వరం నకృతమ్”

    ‘వ్యాకరణం లేకుండా భాషను నేర్చుకోవడం, చిల్లులు పడిన పడవలో నదిని దాటడం, పథ్యం లేకుండా ఔషధం పుచ్చుకోవడం, ఈ మూడూ వృథా ప్రయాసలే. అవి చేయడం కన్నా చేయకపోవడమే మంచిది.’

    పై రెండు శ్లోకాలు వ్యాకరణం యొక్క ప్రముఖతను స్పష్టంగానే చెబుతున్నాయి. మనకు వ్యాకరణం అంటే ఏమిటో సరియైన అవగాహన లేక పోవడం, ముఖ్యంగా తెలుగులో సంస్కృతం నుండి పట్టుకొచ్చిన ముక్కలతో అతుకుల బొంతలాగా తయారు చేసిన వ్యాకరణాలు ఉండడం, ఇక మనకు తెలిసిన ఆంగ్ల భాష వ్యాకరణం దినదినమూ మారే ఆ భాషను ప్రామాణీకరించలేక పోవడం… ఇవన్నీ మనకు వ్యాకరణం పట్ల ఉన్న చిన్న చూపుకు కారణాలు.

    ఒక అక్షరం ఎన్ని రకాలుగా ఉచ్చరించవచ్చో, ఆ ఉచ్చారణ ఎప్పుడు ఎలా మారుతుందో అన్న దగ్గర ప్రారంభించి, భాషలో ప్రతి పదం యొక్క ఉత్పత్తిని, మార్పును ఖచ్చితంగా నిర్వచించే సంస్కృత వ్యాకరణాన్ని చదివినప్పుడు వ్యాకరణ శాస్త్రం యొక్క ఉపయోగం, ముఖ్యత్వం తెలుస్తాయి.
    ******

    వ్యావహారిక తెలుగు భాషకు ఒక వ్యాకరణం రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం. రచయితకు, పరిచయకర్తకూ కూడా ధన్యవాదాలు!

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం)
  • తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – మూడవ భాగం
  • తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – రెండవ భాగం
  • మార్చి 2003
  • కుట్ర

ఇటువంటివే…

  1. వెల్చేరు చేసిన విశ్వనాథ కథల ఆంగ్లానువాదం వెనుక
  2. నారాయణరావు మార్గదర్శక పరిశోధనా పద్ధతి
  3. వెల్చేరు నారాయణ రావు: కొన్ని పరిశోధనా గ్రంథాల పరిచయం
  4. కన్యాశుల్కానికి వెల్చేరు అనువాదం, వ్యాఖ్యానం
  5. వెల్చేరు నారాయణరావుతో ముఖాముఖీ

జనవరి 2024 సంచికలో ...

  • Endowed Chair In Telugu To Expand Language And Cultural Opportunities
  • అప్రతిహతం
  • ఆంగ్లసీమలో సోలో ప్రయాణం – 1
  • ఏరు
  • కొండచింత
  • కొన్ని జానపద పాటలు
  • గడినుడి – 87
  • గణానాం త్వా గణపతిం – తెలుగు అనువాదం
  • గొర్రె కాలి విందు
  • జనవరి 2024
  • దర్శనాల వేళ
  • నభూతో నభవిష్యతి
  • నా దైనిక సమస్యలు
  • పూలు చెరిగిన చీరలు
  • బొల్లి
  • మంచి రచయితలు, మంచి పాఠకులు
  • మూడు పిల్లులు
  • యూట్యూబ్‍లో ఈమాట: డిసెంబర్ 2023
  • విమర్శకుడు
  • వెల్చేరు నారాయణరావు తెలుగుదారి
  • స్క్రాప్ బుక్ మాటలు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

మంచి రచయితలు, మంచి పాఠకులు
విమర్శకుడు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.