నాకు నచ్చిన పద్యం: ఒక మధురార్తిశీలి కురిపించిన వేదనాశ్రువులు

ఉ.
ఈ మృతమృత్తికాణువుల నీమసిరాసుల యంతరమ్మునం
దీ మధురార్తిశీలి కురియించిన శైశిర వేదనాశ్రు మా
లామిహికాంబుపూరము లలంకరణమ్ములుగా గ్రహింతువా
ప్రేమకు నోఁచుకోనివి దరిద్రములయ్యవి యారిపోవునో

ఒక్కోసారి వియోగమనే భావపు ఘాటు ముందర ప్రేమ వెలవెలబోతుందేమో అనిపిస్తుంది. విప్రలంభపు మహిమ ఎవరికీ ఎన్నతరం కాదు. కవిత్వంలో మనకు తెలిసిన ఎన్నో పొరలు దాని దయాభిక్షే. ఒక బలీయమైన అనుభూతిలో శుద్ధతతో కూడినవైన ఎత్తులలో విహారం చేస్తున్నపుడు ఒకవేళ మనస్సు మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఒక్కో పదమూ ఎంతో చిన్నదైనప్పటికీ బరువైన భావాలను మోసేదిగా ఉంటుంది. ఒక సంస్కృత మహాకవి అన్నట్లుగా, వియోగంలో ఉన్నపుడు శరీరమూ మనస్సూ రెండూ కృశించిపోతాయి. ప్రతీ అంగమూ జ్వరం వచ్చినట్లుగా హింసింపబడుతుంది. ఆ స్థితిలో, ఆ విరహవ్యథలో మనలను జన్మనిచ్చి పెంచి పోషించిన మన తల్లిదండ్రులైనా రక్షింపలేరు. అంతెందుకు, ఆ స్థితికి హేతువైన ప్రియురాలు కూడా రక్షింపలేదు.

ఈసారి నేను మీకు పరిచయం చేద్దామనుకుంటున్న పద్యం లోని నాయకుడి పరిస్థితి కూడా ఇదే. ఈ పద్యం వియోగి అనే కవితాఖండిక లోనిది. ఈ కవితను వ్రాసింది పద్యాన్నీ గద్యాన్నీ గుర్రం కదం త్రొక్కినట్లు పరిగెత్తించిన వేంకటకాళిదాస కవులు. 1931వ సంవత్సరం భారతిలో అచ్చైన ఈ కవితలో మొత్తం 11 పద్యాలున్నాయి. ఏ పద్యానికాపద్యం సుప్పాణి ముత్యమే అయినా, అలతి అలతి పదాలతో అల్లబడ్డ పై పద్యం పైకి కనిపించని ధ్వని ముద్దలను మూటకట్టుకుంది.

ఈ కవితలో కవులిద్దరూ విరహవేదనాస్థాయిలను చూపుతూ పద్యాలను వ్రాశారు. నాయకుడు నదీతీరం దగ్గర నడుస్తూ ఉంటాడు. ఇదివరలో తన ప్రియురాలితో తాను గడిపిన క్షణాలను గుర్తుతెచ్చుకుంటూ ఉంటాడు. ఆ తిన్నెలపై ప్రియురాలు శయనించినప్పటి మోహపు ప్రేమ, ఆమె ముగ్ధ మధురహాసము ఇత్యాదులు ఆతని మనస్సులో ముప్పిరిగొంటాయి. అప్పటి సుధాకౌముదులు, నక్షత్రాల తోరణపంక్తులూ అన్నీ అతనికి ఊపిరి సలుపనివ్వని విధంగా గుర్తుకొస్తాయి.

తరువాత ఆతనికి కేవలకాలమాత్రమైన క్షణం ఎంత బరువో తెలిసివస్తుంది. తాను ఒక్క నిమిషపు ప్రేమకు పరితృప్తి చెందడానికి మాత్రమే జీవితాన్ని నిల్పుకునేంత బాధను పొందుతాడు. తన ఎదుటగా తన్న ప్రియురాలి రూపు నుసైపోయి కనుగొనడానికి లేకుండా పోవడాన్ని అతడు జీర్ణించుకోలేకపోతాడు. కళ్ళు కన్నీటి చెలమలై, ధారాపాతంగా బాష్పస్రవంతి కారుతుంది. ఆ విరహాగ్నిలో తనను తానే చూసుకుంటాడు. తనకీ స్థితికి కారణమైన ప్రియురాలికే తన బాష్పాలను అర్పించాలన్న తలంపు కలుగుతుంది.

వేదనాశ్రువులు రాల్చుతున్న తానెవరు? ఒక మధురార్తిశీలి. ఎల్లప్పుడూ ఒక తీపికోసం కాంక్షపడే శీలమున్న ఒక మనస్వి. అటువంటి సత్త్వవంతునికి మనస్సును దహించే బాధను కూడా రసాత్మకంగా మలచుకోవడం తెలుసు. ఈ కవితలోని సందేశమదే – జీవితంలో ఓర్చుకోలేని బాధ మనకు అంతకు ముందు పరిచయం లేని లోతులలో మనలను పడద్రోసినప్పుడు, ఆ కొద్దిసమయంలో మనతో మనం ఏ విధంగా వినిమయం చేసుకుంటామో అన్నది ఎంతో ముఖ్యం. ఆ స్థితిని ఏ అఘాయిత్యానికో ప్రేరేపించేదిగా కాకుండా, కొత్తచిగుళ్ళు తొడగటానికి ముందు వచ్చే శిశిరంగా చూడగలిగి, దాన్ని దాటగలిగితే, ఆ తరువాత వసంతం మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అదే ఇక్కడ ‘శైశిర వేదనాశ్రు’ అన్న పదబంధం లోని ధ్వని. శిశిర సంబంధమైనది శైశిరము. శిశిరమంటే, శశతి – ఇతస్తతో గచ్ఛతి ఇతి శిశిరః అని శబ్దకల్పద్రుమం. కుందేలు వలే అటూ ఇటూ కదలాడేదని. అది శిశిర ఋతువైనా చంచలత్వం దాని స్వభావం. శాశ్వతగుణం అందులో లేదు. దాని అంచున వాసంతం దాగి ఉంటుంది.

అతను కార్చుతున్న అశ్రువులు చెక్కిళ్ళపై ధారగా కట్టడాన్ని దాటి, జీవంలేని మృత్తికాణువుల, అంటే మసిరాసుల అంతరాలలో కలిసిపోతున్నవి. అంత దుఃఖం అతనిలో పేరుకుని ఉంది. అయినా అతడు బలహీనుడు కాడు. మూగవోయి ఏ అఖాతాలలోనో పడిపోలేదు. అచ్యుతుడై ఉన్నాడు. ఆ బాధను ఒక వ్యతిరేకభావనగా, అయిష్టభావగనా అతను అనుకోలేదు. అతను ప్రస్తుతం సంచారం చేసేది చల్లని సాయంసమయంలో నదీతీరంలో కనుక శైశిరాలైనా ఆ వేదనాశ్రుమాలలలకు చల్లదనమబ్బింది. అందుకే ‘మిహికా’ అన్న ప్రయోగం. మంచు అని అర్థం ఆ పదానికి. ఆ మిహికాంబుపూరాలను అలంకరణాలుగా గ్రహిస్తుందేమో అని తన ప్రియురాలిని అడుగుతున్నాడు. అంబు అంటే నీరు. పూరము అంటే, జలప్రవాహమని అర్థం. శైశిరవేదనాశ్రుమాలా మిహికాంబుపూరములు – ఈ పద్యానికి ఎంతో వన్నె తెచ్చిన పదబంధమిది. పద్యం హృదయమంతా ఇక్కడే ఉన్నది.

ఆమెకు కాకపోతే, ఆ ప్రేమకు నోచుకోనివి దరిద్రములు కాకమరేమవుతాయి? అటువంటి అవి నేలరాలి ఆరిపోతాయేమో! అని నాయకుడు ఆఖరి పాదంలో అంటున్న మాటలు. దరిద్రమన్న పదానికి ధనహీనమని, లేమిలో ఉన్నదని, స్తిమితం లేనిదనీ ఇత్యాది అర్థాలు. ప్రతీ అర్థమూ ఇక్కడ అన్వయం కాగలదు. అలా జరుగకుండా భూషణాలుగా గ్రహింపమని ప్రియురాలిని అడుగుతున్నాడు. ప్రేమవేదన కదూ!

ఇంతటి భారాన్ని మూగగా మోస్తున్న అతని గుండె ఊరికే మ్రోగేదే తప్ప ఆగిపోయేది కాదు. ఆతనిలో ప్రాయపు చిన్నిపూవులవంటి ఆశ చిగురిస్తుంది. తరువాతి పద్యం ఆ సంగతినే వర్ణిస్తుంది. ఆశావంతమైన ఆ పద్యం కంటే, కట్టలు త్రెంచుకుని దుఃఖం తన్నుకొస్తున్నపుడు తనను తాను ఏవిధంగా సంబాళించుకున్నాడో వర్ణించే ఈ పద్యం మరింత ఆదర్శప్రాయమైనదని నా ఊహ.

అప్పుడు ఉద్ధరించడమే కదా కవిత్వప్రయోజనం!