మనుషుల్లో అధికభాగం మంది తమ తమ శక్తి సామర్థ్యాలు ఉన్న సరుకు కంటే ఎంతో ఎక్కువగా ఉన్నాయని ఎదుటివారు అనుకోవాలని కోరుకుంటూ జీవితాలు గడిపేస్తారు. క్రమేపీ వారికీ కోరిక పెరుగుతూపోతుంది, కోరికకి సరిపడ ప్రయత్నం చేసే ఓపిక తగ్గుతూపోతుంది. కొద్దిమంది బుద్ధిమంతులు తమల్ని చవటలుగా సమాజం లెక్కించకుంటే చాలనుకుని అంతమాత్రం జాగ్రత్తపడుతూ, నెత్తి మీదకి ఏళ్ళు పోగుచేసుకుంటూపోతారు. బుద్ధిరామయ్య మూడో కోవకి చెందినవాడు. నిజానికి నలభై ఏళ్ళు వచ్చాక తనని తానే మూడో కోవలో చేర్చుకున్నాడు. ఇతరులు తనని ఎన్నో నెంబరు మెట్టు మీద కూర్చోబెట్టారో అనుకుంటూ మథనపడటం మానుకునున్నాడు.
అలా అని బుద్ధిరామయ్య స్థితప్రజ్ఞుడు అనుకునేరు, అతనికంత దినుసు లేదు! ‘ఇంకొకళ్ళ ఊసు నాకక్కర లేనప్పుడు నా ఊసు వాళ్ళకెందుకు? ఎవరితోనూ స్నేహమూ వద్దు, వైరమూ వద్దు’ అనే సిద్ధాంతం కూర్చుకున్న మనిషి; తన బుద్ధిని క్రమేపీ ఈ సిద్ధాంతపు మూసలో ఘనీభూతం చేసుకొన్నాడు. ఈ వైఖరి చివరికి తన కుటుంబ సభ్యులకి తనకి మధ్య కూడా ఇదమిత్థం అని నిర్వచించగలిగేంత దూరాన్ని నిలబెట్టింది: ‘కొడుకైనా భార్యయినా వాళ్ళ వ్యక్తిత్వాలు వారివే. నాకంటూ ఓ మానసిక వృత్తం ఉంది. ప్రత్యేక ఉనికితో పాటు దానికో వైశాల్యం, విశిష్టత, నిబద్ధత ఉన్నాయి. నేను ఎదుట వ్యక్తి మానసిక పరిధిని గుర్తించి, గౌరవించి దురాక్రమణ ప్రయత్నాలు చేయనప్పుడు, నేనూ అదే దృక్పథం ఎదుటి వ్యక్తి నుంచి ఆశిస్తాను. అదే నా వ్యక్తిత్వానికి ముఖ్య ప్రాతిపదిక.’
రామ, కృష్ణ, శివ, వెంకట – పదాలలో ఒకటో రెండో పదాలు ఎన్నుకుని ముందో వెనకో ఇంకో విశేషణ పదం కలిపితే తెలుగు మగశిశువుకి నికార్సయిన పేరు తయారవుతుంది. ముప్ఫై ఏళ్ళు దాటిన సగం ముప్పావు తెలుగువారికి అటువంటి పేరే ఉంటుంది. బుద్ధిరామయ్య పేరు అలాగే వాళ్ళ నాన్న రూపకృతి చేశాడు. పూర్వ పదాన్ని ఆయన బుద్ధ అనబోయి బుద్ధి అని బియ్యంలో రాశాడేమో మనకి తెలియదు కానీ మనకి ఏ అర్థం స్ఫురించినా బుద్ధిరామయ్య సార్థక నామధేయుడు.
ప్రభుత్వాలు రూపకల్పన చేసిన, ప్రజలు ఆమోదించిన ప్రస్తుత విద్యావిధానమనే భవసాగరాన్ని పాతిక సంవత్సరాలుగా ఈది ఓ కొలికినపడ్డాడు మన ప్రబుద్ధుడు. ప్రతి తరగతిలోనూ అత్తెసరు మార్కులు తెచ్చుకోవడం, పై తరగతికి విద్యావిధానం ఓ తోపు తొయ్యడం యథాలాపంగా జరిగిపోయింది చాలామంది తోటి విద్యార్థుల లాగా. (ఈ తరంలో అత్తెసరు మార్కులంటే తొంభై నుంచి తొంభై అయిదు శాతం అనేది నిర్వివాదాంశం.) షరా మామూలుగా ఇంజనీరింగ్, ఆ తర్వాత గంతకి తగ్గ అమెరికన్ యూనివర్సిటీలో ఎమ్.ఎస్. పట్టా పుచ్చుకోవడం జరిగిపోయాయి మరీ షరా మామూలుగా. తెలుగుదేశంలో మనిషి పుట్టింది పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనడం కోసమని, పిమ్మట ఆ పుట్టుకొచ్చిన వాళ్ళని సర్వశక్తులూ ఒగ్గి అమెరికా బట్వాడా చెయ్యడం కోసమని, అదే జీవిత పరమార్థమనిన్నీ మనసా కర్మణా నమ్మిన బుద్ధిరామయ్య తండ్రి తన సుపుత్రుడు ఎమ్.ఎస్. అవంగానే ‘యావత్ఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు’ అని ఉత్తరాపోసన పట్టి ఊపిరి పీల్చుకున్నాడు. అనతికాలంలోనే బుద్ధిరామయ్యకి పెళ్ళి కుదిరింది, తండ్రి పెద్దగా తచ్చాడే అవసరం లేకుండానే.
“ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా సంబంధాలు చూడటానికి కులం, గోత్రం, శాఖలు, ఋషులు పట్టించుకోవటమేమిటి నాన్నా, ఇది అభివృద్ధి కాదు తిరోగమనం!” అనేశాడు బుద్ధి తండ్రితో ఏదో తను కూడా అనాలిగా అనే ధోరణిలో. సమాధానంగా ఆయన “మాట్రిమొనీ.కామ్‌లో మీ కులం, మీ ఉపశాఖ, నాన్ భారద్వాజస, కుండలినీ మాచింగ్, ఎన్ని మెనూలు, ఎన్ని సబ్ మెనూలు, ఎన్ని డ్రాప్‌డౌన్ మెనూలు, ఎలా తామరతంపరగా రోజురోజూ పెరిగిపోతున్నాయో గమనించావా?” అని బుద్ధి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. బుద్ధిరామయ్య ఈ విషయం ఎప్పుడో గమనించడమే కాక, ఈ మాట్రిమొనీ వ్యాపారం ఎంత నిస్సిగ్గుగా బజారునపడిందో అని వాపోయి కూడా ఉన్నాడు కనుక తండ్రి కళ్ళల్లోకి చూడలేదు సరికదా నువ్వే రైటు అన్నట్లుగా ఆయన కాళ్ళ చుట్టూరా నేలని వృత్తాలుగా పరికించి మాత్రం చూశాడు.
బుద్ధికి పెళ్ళయింది. సందర్భశుద్ధిగా చెప్పాలంటే పెళ్ళయిపోయింది. నేను సైతం అనుకుంటూ నాలుగైదు వసంతాలు కోడింగో తత్తుల్యమో చేసుకుంటూ తెలుగువారు పుష్కలంగా ఉన్న జార్జియాలో, వాషింగ్టన్లో నౌకరీ చేశాడు. తనకంటే ఎంతో మేధోసామర్థ్యాలున్న వారు భారతదేశంలో తనతో పోలిస్తే డాలరు-రూపాయి లెక్కల్లో సగం కూడా సంపాదించటం లేదు కదా అని విచారించాడు. అమెరికా శుభ్రతా సౌఖ్యతా ప్రమాణాల్లో మూడోవంతు కూడా ముంబయిలోనూ బెజవాడలోనూ లేవు కదా, ఇంకో ముప్ఫై ఏళ్ళ దాకా వస్తాయనే ఆశ కూడా లేదు కదా అని మరీ వాపోయాడు. అప్పుడే ఒక చారిత్రాత్మక తప్పిదం జరిగింది బుద్ధిరామయ్య జీవితంలో.
ఇదే బాటలో నిర్విరామంగా పయనిస్తూ పోతే రెండు మూడేళ్ళలో రెండు మూడిళ్ళు తను, తన సంపాదనకి వేణ్ణీళ్ళకి చన్నీళ్ళుగా మానసి మిగిల్చే డాలర్లు కలుపుకుంటే పోగుచెయ్యగలనని విశదమయింది. మానసి బుద్ధి భార్య పేరు, మీరు గమనించే ఉంటారు. ఇద్దరికీ కలిపి పదివేల డాలర్లు నెల తిరిగేటప్పటికి వస్తాయి కదా, ఆరువేలు నెల కిస్తీకి పోతే పోయింది. వచ్చే అద్దెలు, కట్టే బిల్లులూ హళ్ళికి హళ్ళి సున్నకి సున్న. డాలరు రాక పోక సంచారం మొగుడూ పెళ్ళాలకి క్షుణ్ణంగా వచ్చు, ఆ పాఠం నిద్రపోయినా కలల్లో మరీ సువిదితమౌతుంది. దినదినగండం నూరేళ్ళ అమెరికాయుష్షు.
ఇక్కడే బుద్ధిరామయ్య బుద్ధి చారిత్రాత్మక మలుపు తిరిగింది. చెప్పడం మరిచాను, బుద్ధిమానసి దంపతులకి జార్జియాలో జలజ నామ పుత్రిక, వాషింగ్టన్లో వాసుదేవ నామ పుత్రుడూ కలిగారు. కలిగారు అనటంలో నా అప్రకటిత ఉద్దేశం మేధావులైన మీకు బోధపడే ఉంటుంది. దాంపత్యరీత్యా బుద్ధిరామయ్య భార్య మానసితో గాని, మానసి బుద్ధితో గానీ నందనవనాలు, ఇంద్రధనస్సులు దర్శించలేదు. అలా అని వాళ్ళిద్దరి మధ్య నిత్యం కీచులాటలూ లేవు. పరమశివుని దాంపత్యం కానే కాదు, పావురాల దాంపత్యం కంటే కొంచెం బెటరు.
‘వ్యక్తిత్వం లేని వ్యక్తీ ఒక వ్యక్తేనా? నాకంటూ నాకు ఒక వ్యక్తి స్వాతంత్ర్యం ఉండాలి, ఉన్న స్వాతంత్ర్యం వినియోగంలోకి తెచ్చుకోవాలి, మనిషన్న తర్వాత. కలో గంజో తిని తెలుగునాట బతుకుతాను, నా పిల్లలకి సంస్కృతి, స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియజేస్తాను, నేను జీవితంలో కోల్పోయింది వాళ్ళు కోల్పోకుండా జాగ్రత్త పడతాను!’ – ఈ ఆలోచనలు రూపుదిద్దుకున్న రెండు నెలల్లో బుద్ధిరామయ్య అయినకాడికి అమెరికాతో తెగతెంపులు చేసుకుని హైదరాబాదులో పిల్లా పిల్లల్తో హుటాహుటిన దిగాడు, తర్వాత సంగతి తర్వాత అనే మనో నిబ్బరంతో. మానసి నీవెంటే నేను అనలేదు, నీమాట నేనెందుకు వినాలి అని ఎదురు తిరగనూ లేదు. ఎలా అయితే అలా అనే దృక్పథం ఆవిడది.
ఇక్కడ ఈ కథకి కీలకమయిన ఆయువుపట్టు. వ్యక్తిత్వం లేని వ్యక్తీ ఒక వ్యక్తేనా? అన్న భారీ డైలాగు తన బుఱ్ఱలో స్ఫురించగానే బుద్ధిరామయ్య తన జీవితపు స్టీరింగుని తిప్పటమయితే అమాంతంగా తిప్పాడు కాని, ఆ డైలాగుని, ఆ డైలాగులో పదాల్ని మరో ఇంకొంచెం తార్కికంగా విశ్లేషించే నిశితత్వం అతనిలో లోపించింది. కారణం: అతని మనోఫలకంపై అప్పటికింకా ‘ఆత్మకాకి’ దర్శనం కాలేదు.
అయిదేళ్ళు గడిచాయి.
బుద్ధిరామయ్య జలజని, వాసుదేవుణ్ణీ బళ్ళల్లో చేర్చాడు – వానాకాలం బళ్ళకెక్కువ, వామ్మో బళ్ళకి తక్కువ. మానసి అమెరికా హోషులు మరిచిపోయి సగటు తెలుగు గృహిణిలా పిల్లలికి కావలిసినవి అమరుస్తూ సామాన్య, నసలేని, సంతృప్తజీవితం అనుభవిస్తోంది; వడియాలు, ఊరగాయలు క్రమం తప్పకుండా పెట్టుకుంటూ. కొనుక్కున్న ఇంటికి దగ్గర్లోనే బుద్ధిరామయ్య ఉద్యోగం. యజమాని తగినంత జీతంతో పాటు అక్కర్లేనంత మర్యాద కూడా ఇస్తాడు. ఉదయం పదికి వెళ్ళటం, సాయంత్రం అయిదుకి నడుచుకుంటూ ఇంటికి రావటం. సంతానాన్ని ఐఐటీలో చేర్పించలేనిది, అమెరికా పంపలేనిది అయిన బ్రతుకు వ్యర్థం లాటి మూస మనస్తత్వంలోంచి బయటపడ్డానని బుద్ధిరామయ్యకి అనిర్వచనీయమైన గర్వం. చదువులు, ఉద్యోగాలు, వ్యక్తిత్వం అని భ్రమింపచేసే ఇనప కవచాలు తొడుగుతాయి కాని, వ్యక్తికి సిసలైన వ్యక్తిత్వాన్ని సంపాదించలేవని అతను స్థిరపడ్డాడు. జీవితంలో ఎన్ని అవకాశాలుండగలవో, ఎన్నికోణాలలో ఎన్నెన్ని వెలుగులున్నాయో తెలియపరచటం ఒకటే పిల్లల పట్ల పెద్దల బాధ్యత అని విశ్వసించాడు.
క్రమేపీ సమాజం పట్ల అతనికి సుముఖత, విముఖత కూడా తగ్గిపోవడం మొదలయి దూరం ఎక్కువ కాసాగింది. అతని వృత్తంలోని ప్రతి మనిషీ తాను ఇతరులకంటే ఎందుకు ఉన్నతుడో నిరూపించటం, ఇతరులలో ఎన్ని లోపాలున్నయో ఏకరువు పెట్టటమే జీవిత పరమోద్దేశం అనే అకుంఠిత లక్ష్యంతో జీవిత చదరంగం ఆడుతున్నాడని గమనించి, ఆ భాష నచ్చక, ఆ భాషలో మాట్లాడలేక, ఎవరితోనూ ఏ సంభాషణ, ఏదో ఒక ముసుగు తొడుక్కోకుండా చేయలేని స్థితికి వచ్చాడు. ఏ వ్యక్తితోనైనా నాలుగు మాటలతో ఉభయావసరాలు తీరిపోతే అయిదో మాట మాట్లాడడు. పెళ్ళాం పిల్లలయినా సరే. ఈ నిర్ధారణ బలపడ్డకొద్దీ అతని మనోసామ్రాజ్యంలో అతనితో అతనే సంభాషించుకుని సంతృప్తి పొందసాగాడు.
ప్రతిరోజూ ఒంటరిగా ఉదయం రెండుగంటలు, సాయంత్రం రెండుగంటలు నిదానంగా నడుచుకుంటూ తనతో తనే మాట్లాడుకునే దినచర్య అతని జీవితంలో అత్యంత ఆనంద హేతువుగా పరిణమించింది. చిరెక్ స్కూల్ దగ్గర్లో ఉన్న తన ఫ్లాట్ నుంచి బొటానికల్ గార్డెన్స్ కిలోమీటరు దూరం. లోపల రెండు రౌండ్లు ఏడున్నర కిలోమీటర్లు. సుమారుగా పది కిలోమీటర్ల నడకకి రెండు గంటలు సరిపోతుంది. ఒకరోజు సెంట్రల్ యూనివర్సిటీ, ఒక రోజు హఫీజ్ పేట వైపైతే ఒకరోజు గచ్చిబౌలీ వైపు.
బుద్ధిరామయ్యకి మానసికంగా, ఆధ్యాత్మికంగా పయనించవలసిన అనేక బాటలున్నాయి, దాటవలసిన ఎన్నో మజిలీలున్నాయి, వెలుగు ప్రసరించవలసిన లెక్కలేనన్ని చీకటి గదులున్నాయి అతని అంతరాకాశంలో. అది ప్రస్ఫుటం. టీవీ గురువులు, గూగుల్ గురువులు, వావిళ్ళ గురువులనించి తనకి దారి చూపించగలిగిన బావుటాలు ఆశించటం రూపాయి లాటరీ టికెట్ కొని, కోటి రూపాయలు బహుమతి మనకే రావచ్చు కదా అని ఎదురుచూడటమన్నంత అవివేకం అన్నది అతనికి సుస్పష్టం. ధ్యేయం, మార్గం, పయనం తనే నిర్దేశించుకోవాలి. బాధ్యతా తనదే, కష్టనష్టాలూ తనవే, సొరంగం చివర కనబడే వెలుగూ తనదే – అసలంటూ కనబడితే.
ఈ ప్రక్రియ మొదలైన తొలి రోజుల్లో తన బుఱ్ఱలో ఉద్భవించిన ప్రతి ఆలోచన అక్షర రూపంలో తనకోసం ఎవరో డిక్టేషన్ తీసుకుని తెల్లకాగితం మీద రాసి ‘సరిగానే రాశానా, స్పెల్లింగ్ తప్పులున్నాయా?’ అని అడిగినట్లనిపించేది. ఉత్తర క్షణం ఇంకో ప్రతివాదం, ఎవరో మాట్లాడుతున్నట్లుగా దృశ్యరూపేణా అక్షరాలు కనిపించేవి, శబ్దరూపేణా వినిపించేవి.
‘ఉదయం ఆరింటికి కారువాడికి అంత వేగం దేనికి, ట్రాఫిక్ లేని సమయంలో బొయ్యిమంటూ హారన్ దేనికి? సామాజిక బాధ్యత ఇసుమంతైనా లేదా? ఇటువంటివాళ్ళని చూస్తే నాకు చెడ్డ చిరాకు. దేశమెట్లు ప్రగతి చెందు?’
‘చిరాకు నీకు హారన్ మూలాన వచ్చిందా, లేక చిరాకు మూలాలు నీలోనే ఉన్నాయా?’
‘అంటే లోకంలో ఉన్న అన్యాయాలు, దౌర్జన్యాలు సహిస్తూ ఊరుకోవాలా? పౌరుడుగా నాకూ సామాజిక స్పృహ అంటూ ఒకటి ఏడిసింది. చెయ్యగలిగినవాళ్ళు చెయ్యవలసిన కార్యం సరయిన సమయంలో చెయ్యకపోతే అపచారం జరిగినట్లే. సమాజం భ్రష్టుపడితే నేనూ బాధ్యత వహించాలి.’
‘నువ్వు చెయ్యదగిన, చెయ్యవలసిన కార్యానికి కావలసిన స్పృహ చికాకులోంచి రావాలా? చికాకులోంచి వస్తే అది సరయిన కార్యం ఎలా అవుతుంది? మానసిక సమతుల్యతలోంచి కదా సరయిన ప్రతిచర్య ఉద్భవించేది?’
‘నేను సగం మర్చిపోయిన భావాలు నా భాషలో నాకే కొడతావా? అయినా, ఈ నడుస్తున్నవాళ్ళల్లో, జాగింగ్ చేసేవాళ్ళల్లో సగంమంది ఒళ్ళు ఊరిన శాల్తీలే ఎందుకుంటారో? కొంచెం కొలతలు పద్థతిగా ఉన్నాయి అనిపించగానే నడక మానేస్తారు కాబోలు. నడక ఏమైనా రోగమొచ్చినప్పుడు గుర్తొచ్చే ఆస్పత్రిలాటిదా? ఎందుకొచ్చిందిరా అనుకుంటూ నడిచేదీ ఒక నడకేనా?’
‘నీ పరిశీలన బాగానే ఉంది ఒప్పుకున్నాం. నువ్వు గమనిస్తున్న ప్రతి సన్నివేశం నించీ సూత్రాలు, సిద్ధాంతాలు కూర్చే కుతి కొంత తగ్గించుకో. నీ సిద్ధాంతాలు నీలో కాలంచెల్లేవే తప్ప ఎవరి దగ్గరా బయటపెట్టేవి కాదుకదా!’
‘నా ప్రతి ఆలోచనా సాగనీయకుండా బ్రేకులేస్తే నీకు అదేం ఆనందం?’
‘ఆ ఆనందం నీదేనేమో చూసుకో!’
మార్గశిర మాసం, సూర్యుడు ఉదయించి గంట కూడా కాలేదు. ఎండ ఒంటిమీద ఆగి ఆగి తాకుతుంటే ఆహ్లాదం అనిపించేంత తాపమానం. బొటానికల్ పార్కులో పచ్చగడ్డి మీద కోట్లకొద్దీ తుషారబిందువులు కొలువు తీరాయి. చిరుగాలికి గడ్డిపరకలు నృత్యం చేస్తున్నాయి. ఆ నృత్యంలో లయ లేదు, లాస్యం ఉంది. గీతం లేదు, సంగీతం ఉంది. నటన లేదు. నాట్యం ఉంది.
ఒక గుండ్రం నడిచి బుద్ధిరామయ్య సిమెంటు బెంచి మీద కూర్చున్నాడు. ఆదాయపన్ను శాఖ భవనం మీంచి బద్ధకంగా సూర్యుడు పైకొచ్చాడు. బుద్ధి కూర్చున్న కోణంలో సూర్యకిరణాల్ని ఆలింగనం చేసుకుని తుషారాలు మేలుజాతి వజ్రాలుగా రూపాంతరం చెందాయి. బుద్ధికి ఈ దృశ్యం ఇంకొన్ని క్షణాలన్నా మిగల్చాలనే ఉద్దేశంతో కాబోలు సూర్యనారాయణ తన సహజ తీక్షణత ప్రదర్శించకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంద్రధనుస్సులో ఏడురంగులుంటాయని ఘంటాపథంగా శాస్త్రులు, శాస్త్రజ్ఞులు సిద్ధాంతీకరించారు; కానీ క్షణాల్లో ఆవిరయిపోయే ఈ అమూల్య వజ్రాల్లో అనంతవర్ణాలున్నాయి.
‘ఈ అంకానికి తెరపడింది. తెరపడేదానినే అంకం అంటారు. బ్రహ్మదేవుడి సృష్టిలో అంకం కానిదేమీ ఉండదు. బ్రహ్మ దేవుడూ ఓ అంకమే.’
బుద్ధిరామయ్య రెండో విడత నడకకి ఉపక్రమించాడు. ‘అపసవ్య వృత్తంలో వడిగా నడుస్తున్న ఈ భామ ఎంత చలాకీగా ఉంది? మోకాలుకి ఆరంగుళాలు పైదాకా తొడలు చూపించటానికన్నట్లు కట్టిన బిగుతు జీను లాగు, చివర్లో ఇంకో రెండంగుళాలు చింపికలు, ఎత్తుపల్లాలు పూర్తిగా అవగతమయేలా అతుక్కుపోయిన టీషర్టు. ఇరవై నుంచి ముప్ఫై దాకా వయస్సు ఎంతైనా ఉండవచ్చు. పెళ్ళి అయి ఉండవచ్చు, అయి ఉండకపోనూవచ్చు. పెద్దగా పెళ్ళి అనే వ్యవస్థని నమ్మి ఆ నమ్మికకి జీవితాన్ని సమిధచేసే వ్యక్తిలా కనబడదు. చామనచాయ. ఆమె గమనం కదనకుతూహల రాగాన్ని పోలి ఉంది. ఆమె వక్షోజాల నిమ్నోన్నత కదలికలు ఆదితాళానికి ప్రమాణాలు. తనే ప్రపంచం అయినప్పుడు ప్రపంచంతో తనకేం పని అన్నట్లున్న శరీర భాష. మూసినట్లున్న కళ్ళు, తను ఉన్న అక్షాంశ తులాంశాల నుంచి ప్రయాణిస్తున్న మార్గంలో ఎనిమిదడుగులు కనిపిస్తే చాలు, మిగతాది అప్రస్తుతం అన్న నిర్ధారణ. మూసిన కళ్ళనుంచే అంత తేజస్సు వెలువడుతుంటే కళ్ళు పూర్తిగా తెరిస్తే ఆమె కళ్ళలోకి ఎవరైనా సూటిగా చూడగలరా? భస్మమయిపోరూ!
‘ఒక దృష్టిలో ఆమె నగ్నంగా అగుపిస్తోంది. ఇంకో దృక్కోణంలో సృష్టి రహస్యాలన్నీ ఆమె వ్యక్తిత్వంలో పరమశివుడు భద్రపరచి యోని తాళం వేశాడని స్ఫుటమౌతోంది.
‘ఏమా పెదవులు? ఏనాడూ కృత్రిమ రంగులు పులమని, సహజకాంతి కణకణానా వెదజల్లే లేత కుసుమాలు. ఏమో! ఒక్కసారిగా ఈ కారణజన్మురాలు కళ్ళు పైకెత్తి తనను చూసి అపారంగా మోహించి, ప్రపంచాన్ని మరిచి, గాఢంగా హత్తుకుని పెదవులమీద సంపూర్ణరస సంగమమయేంతగా చుంబించవచ్చు కదా! ఉత్తర క్షణం ప్రాణం ఉంటేనేమి, పోతేనేమి?’
‘సిమెంటు బెంచి మీద పరమాత్మని దర్శించావు కదా, అప్పుడు ఉంటేనేమి పోతేనేమి అనుకున్నావా? ఇప్పుడెందుకీ అసహజ, అసాధ్య తలతిక్క ఆలోచన!‘
‘అందుకా పొద్దుట్నించి నీ గొంతు వినబడలేదు? నువ్వేమయినా నీతి శాస్త్రం పంతులువా! నా ఆనందలోకంలో నేను విహరిస్తాను. నీకేం? నీ మాటలు వింటున్నాను కదా అని పెట్రేగిపోతున్నావు. అసలు నువ్వెవరో నాకు తెలియదు. నీ కాకిగోల నాకేమయినా ఇంపుగా ఉందనుకుంటున్నావా? నిన్ను ఉంచుకోవాలో వదిలేయాలో తెలియని అసందిగ్ధత!’
‘నన్ను వదిలి నీవు పోలేవులే. పూవులేక తావి విలువ లేదులే.‘
‘పైత్యం పాటలు ఆపెయ్యి. సీరియస్. తెలుగులో చెప్పాలంటే హాస్యమొద్దు. అంతరాత్మ, అంతరాత్మ ప్రబోధం, ఇన్నర్ వాయిస్, ఆత్మగళం లాటి చేతకాని కథకుల ప్రయోగాలు నీ ఉనికినుద్దేశించి నేను ప్రయోగించను. ప్రయోగించి నిన్నవమానం చేయను. నువ్వు నా అంతర్గత, అవిభాజ్య స్నేహితుడవని నాకు తెలుసు. నీతో తప్ప ఇంకెవరితోనూ సంభాషించలేనని నీకూ తెలుసు, నాకూ తెలుసు.
‘నీకు తెలియనిది నాకూ తెలియకపోవచ్చు. కానీ నా ఉనికిని నువ్వు గౌరవిస్తే, నాతో ప్రయాణం నీకు ఉపకరిస్తుంది.‘
‘మనుషులు ఇరవైనాలుగు గంటలూ నిద్రపోతూ ఎలా బ్రతుకుతారో! ఏరోజయినా నూరుగురిలో ఒక్కరు మేలుకున్నవారు కనిపిస్తే ఆరోజు పండగే. నిద్రలోనే నడుస్తారు, నిద్రలో వాహనాలు నడుపుతారు, వ్యాపారాలు చేస్తారు, సంసారాలు చేస్తారు, సినిమాలు చూస్తారు, ముసలివాళ్ళవుతారు, మూటకట్టేస్తారు. ప్రతి వ్యక్తీ ఒక జీవమున్న మరయంత్రం. కార్యకలాపాలన్నీ తన ఇచ్ఛానుసారంగా చేస్తున్నానని భ్రమించే మరయంత్రం. కళ్ళల్లో నిద్ర కారుతూ ఉంటుంది. మనుషుల్ని భౌతిక నిద్ర నుంచి లేపటమే కొంచెం కష్టం. పశువులు నిద్రలో కూడా జాగరూకతతో ఉంటాయి. చిన్న కదలికకీ కళ్ళు తెరుస్తాయి. ఈ మనుషుల్ని మానసిక నిద్ర నుంచి లేపడం దాదాపు అసాధ్యం.
‘ప్రభుత్వం అంటే మనుషులే కాబట్టి ప్రభుత్వాలూ మొద్దు నిద్రలోనే ఉంటాయి. అయిదు సంవత్సరాలుగా చూస్తున్నాను. బడికి వెళ్ళే చిన్నారులని పదిహేనుమందిని చిన్న ఆటోలో పిప్పళ్ళ బస్తా కుక్కినట్లు కుక్కుతారా? అయిదారు కిలోమీటర్లు హైదరాబాదు గతుకు రోడ్లల్లో, వెర్రిమొర్రి ట్రాఫిక్‌లో, ఆటో కడ్డీలు పట్టుకు వేళ్ళాడుతూ ప్రతిరోజు సర్కస్ చేస్తూ స్కూలుకి వెళ్ళాలా? ఏ పుస్తకమో టిఫిన్ డబ్బానో పోతే తల్లిదండ్రులు తిడతారు, టీచర్లు తిడతారు. చూస్తే నా మనసు క్షోభిస్తోందే, పంపించే తల్లిదండ్రులు, స్కూలు యాజమాన్యం, పోలీసులు, నగర పాలకులు ఏ ఒక్కరికీ చీమ కుట్టినట్లైనా ఉండదా?
‘వీళ్ళు నిద్ర లేవటానికి, అనేక ఆటో ప్రమాదాలు, దేశవ్యాప్తంగా పదులకొద్దీ పసిప్రాణాలు కావలిసివచ్చాయా? అప్పటికీ ఆటోకి ఇంతమంది అని నిబంధనలు పెట్టారు. పాటించబడతాయని నమ్మలేం కదా. యథేచ్ఛగా స్కూటర్లు, ఆటోలు, కార్లు, లారీలు రాంగ్ సైడ్‌లో హైవేల మీద కూడా, రూలు పాటిస్తూ నడుపుతున్నారా? చల్తాహై ధోరణి. అధికారులు నిద్ర లేవటానికి ఇంకెన్ని వేలమంది బలి అవ్వాలో. ప్రభుత్వాలే కాదు, దేశాలు కూడా నిద్రపోతున్నాయి. నిద్రలో దేశాలు ప్రగతి ఎట్లా సాధిస్తున్నాయంటావా, నిద్రలో మనుషులు లేస్తూనే ఉంటారు. దాహమేస్తేను, బాత్రూమ్ నిమిత్తం, వాట్సాప్ చూస్కోవడం కోసం, చెత్త కలలకి ఉలిక్కిపడుతూ, గతంలో అట్లా అయింది అన్న కుమిలిపోత ఆక్రోశంతో, రేపు ఊహించుకుని చెమటలు పట్టే భయంతో. వీళ్ళ నిద్ర నిద్ర కాదు; మెలకువ ఎలాగూ మెలకువ కాదు. భారతదేశం మగత నిద్రపోతుంటే పాకిస్తాన్ మొద్దు నిద్ర పోతోంది. ఎక్కడ ఉండాల్సిన భారతదేశం ఎక్కడ ఉంది? రిమోట్‌కి తగిలిన ఏ రెండు వార్తా చానళ్ళు పదినిముషాలు చూసినా భారతదేశంలో అత్యధిక ప్రజానీకం పెట్టే గుఱ్ఱు వినిపిస్తుంది.’
‘కొంచెం దూకుడు తగ్గించు. నువ్వు అనుకునేది పూర్తిగా నిజం కాదని నిరూపించే వాళ్ళు ఉండవచ్చు.‘
‘రమ్మను. వాళ్ళ వాదనని చీల్చి చెండాడతాను. మేధావులమనుకునే ఈ చల్తా హై గాళ్ళని ముందు నిద్ర లేపాలి. నాకసలే ఆవేశంగా ఉంది.’
‘ఆవేశం లోంచి పేలే వాదనలు ఆవేశంలో ఉన్న అర్ధనిమీలితుల వద్దే పనికొస్తాయి. విజ్ఞులతో ఆవేశం పక్కన పెట్టి మాట్లాడితే నీ దృక్కోణం లోకానికి పరిచితం అవటమే కాక నీ విజ్ఞతకి కూడా మేలు జరుగుతుంది. నువ్వు హిట్లరువి కాదు, తీవ్రవాద ప్రకోపకుడివి కాదు, చేతబడి బాబావి కాదు, తమలపాకు తంత్రం ఊదరకొట్టే బోగస్ బాబావి అంతకంటే కాదు.‘
‘అంటే నాకు సామాజిక బాధ్యత ఉండక్కరలేదా? జరుగుతున్న అన్యాయాలని సహిస్తూ ఊరుకోవాలా? నా వంతు ఓ సమిధని విశ్వయజ్ఞంలో వేయకూడదా? చాలామంది లాగా పుట్టాడు, సమయం వచ్చాక చచ్చాడు అనిపించుకోవాలా? భగవంతుడు నాకీమాత్రం ఆలోచనా పదును ఇచ్చాడు కదా, దానికేదో సార్థకత ఉండాలంటావా ఉండక్కరలేదంటావా?’
‘ముందు నువ్వు నిద్రలోంచి మెలకువలోకి లేచి నిలబడు. సమాజం నీతోపాటు అదే లేస్తుంది.‘
‘ఏ బాటపై నడిచినా అడుగడుగునా దర్శనమిచ్చేవి ప్లాస్టిక్ సీసాలు, ఏమాత్రం గాలి వచ్చినా రోడ్డు మధ్యలో ఎగిరెగిరిపడే ప్లాస్టిక్ సంచులు, సగం తిని పారేసిన చిప్స్ పాకెట్లు, తాగి ముక్కలు చేయబడ్డ విస్కీ బీరు సీసాలు, సిగరెట్ పాకెట్లు, పీకలు, ఇంకా అనేక విధాలయిన చెత్త – కొన్ని చెప్పగలిగినవీ కొన్ని చెప్పలేనివి. ఉదయసంధ్యలో ఆకాశాన్ని, పలకరిస్తున్న చిగురుటాకుల్ని, సంధ్యారాగపు కిలకిలారావాలనీ ఆస్వాదించగోరిన బాటసారికి ప్లాస్టిక్ తప్ప ఇంకేం గోచరమౌతుంది? చిగురుటాకు, చిరుమొగ్గ, చిందులు వేసే సీతాకోకచిలక క్షణభంగురాలు. ప్లాస్టిక్ చిరాయువు.
‘స్వచ్ఛ భారత్ బృహత్పథకంలో భాగంగా వందమీటర్లకో రెండు చెత్తడబ్బాలు అవశ్యం ఉన్నాయి. ఇరవై లీటర్ల ఆ డబ్బాలు ఎప్పుడూ పొంగి పొరలటమే కాక యాభై లీటర్ల చెత్త ఆ ప్రాంతంలో రోడ్డు మీద ఉంటుంది ఎల్లవేళలా.’
ఒక మధ్యవయస్కురాలు వంద లీటర్ల సామర్థ్యం ఉన్న సంచీలో చేతి తొడుగులు వేసుకొని బాటపై ఉన్న చెత్తను ఏరి నింపుతోంది. చూస్తూ ఉండగానే వందమీటర్లు ఇరువైపులా శుభ్రమయింది. గుర్తింపు కోరని సేవ ఆమెది. సేవ అన్న పదం కూడా సరయినది కాకపోవచ్చు.
‘గుడ్ జాబ్ మాడమ్!’
విన్నట్లో విననట్లో తెలియని చిరునవ్వు నవ్వి తనపని తాను చేసుకుంటూ సాగిపోయింది.
‘జంతుప్రేమికులూ పక్షిప్రేమికులూ నిద్రా ప్రపంచంలో లేరని ఎవరు చెప్పారు? ఉదయం ఏడు గంటలకి క్రమం తప్పకుండా ఒక వ్యక్తి ట్రిపుల్ ఐటీ ప్రాంతంలో ఒక గట్టు మీద ఒక సంచీతో హాజరవుతాడు. ఆ సంచీలో అయిదు వందల రూపాయలకి కొన్న బిస్కెట్లు, ఇతర తినుబండారాలు ఉంటాయి. అతను రావటానికి పదినిమిషాల ముందే పది పదిహేను ఊరకుక్కలు అక్కడ పోగవుతాయి. ఏడు గంటలకి సందడే సందడి. తోకలూపుకుంటూ ఆరాధ్య భావంతో అతన్ని చూస్తూ, కాళ్ళు నాకుతూ అతను వేసే తిండి ఆవురావురుమని కడుపునిండా తింటాయి. ఒక సంవత్సరంలో ఊర కుక్కల సంఖ్య పది నుంచి ఏభై అయింది. నెల రోజులకొకసారి ఆ ప్రాంతంలో కుక్కల బండి వస్తుంది. ఊరకుక్కల్ని పట్టడంలో తర్ఫీదు పొందిన నిపుణులైన వ్యక్తులు సరయిన సామగ్రితో బండి నిండేన్ని కుక్కల్ని పట్టి తీసుకెల్తారు. బహుశా వాటిని నిర్దేశిత ప్రాంతంలో కాల్చి చంపుతారు.
‘కొండాపూరులో అనేక భవనాల్లో పక్షిప్రేమికులు మిద్దె మీదకి నిర్ణీత సమయంలో వెళ్ళి ఒక్కొక్కరూ రెండు కిలోలకి తక్కువ లేకుండా సజ్జలు, బియ్యం, రాగులు, గోధుమలు, జొన్నలు కలిపిన మిశ్రమాన్ని వెదజల్లటం అలవాటు చేసుకున్నారు. అదేం చిత్రమో పక్షుల్లో యాభైశాతం మాత్రమే ఉండే పావురాలు అయిదారు ఏళ్ళలో తొంభై శాతానికి పెరిగాయి. క్రమేపీ పిచ్చుకలు, చిలకలు, కాకులు, కొంగలు, నల్ల పిచ్చుకలు, అనేక ఇతర వలస పక్షులు కనుమరుగయిపోయాయి. మైక్రోవేవ్ మహోద్యమాన్ని, కాంక్రీటు ఉత్పాతాన్ని, పర్యావరణ కాలుష్యాన్ని, శబ్ద భీభత్సాన్ని, డీజిల్ పొగల్ని, ప్లాస్టిక్ విప్లవాన్ని తట్టుకోగల ఏకైక పక్షిజాతి పావురం. ముఖ్యంగా బూడిదరంగు జాతి పావురం.
‘పదిహేను సంవత్సరాలు అలాగ్గా మానవనిర్మిత కాలుష్యంలో గుడుర్ గుడుర్మంటూ బతికేసి వందలాది సంతానాన్ని భూమి మీదకి వదిలి, అన్యపక్షి జాతుల్ని క్రమేపీ అంతరింప చేయగల రౌడీ పక్షి పావురం. మిగతా పక్షులే కాదు, మీ మానవులు మాత్రం మమ్మేం చేయగలరు, మీ స్వయంకృతాపరాధం, అనుభవించండి – అని ఎలుగెత్తుతాయి పావురాలు. వాటి గాలి, శబ్దం, ఈకలు, విసర్జనలు మానవజాతిని అంతుపట్టని రోగగ్రస్తుల్ని చేయగల శక్తిశాలులు. ప్లాస్టిక్ సునామీనీ మైక్రోవేవ్ విశృంఖలత్వాన్నీ జీర్ణించుకుని పరిఢవిల్లగల ఒకే ఒక పక్షి జాతి పావురం. ఐదువందలమంది నివసించే నివాసభవనంలో రెండేళ్ళలో అయిదువేల పావురాలు దురాక్రమణ చేశాయి. చూరుచూరునా గడ్డి పెట్టుకున్నాయి, గుడ్లు పెడుతున్నాయి. నగరవాసులు ఇలాగే నిద్రపోతూ ఉంటే ఈ దురాక్రమణ గుణాత్మక శ్రేఢిలో పెరిగిపోతుంది.’
‘సరిగ్గా పది సంవత్సరాల క్రితం ‘ఒహో ఒహో పావురమా వయ్యారి పావురమా’ అని ఉల్లాసంగా పాడుకునేవాళ్ళం.‘
‘నా ఆలోచనా స్రవంతి నీకు నచ్చనప్పుడల్లా కావ్ కావ్ అని అరుస్తావు, అధవా మౌనంగా ఉంటావు. నేను నీలిదంతంలో కాశీశ్వర బిస్మిల్లాని, మంగళంపల్లిని, సుబ్బమ్మ తల్లిని జుర్రుకుంటున్నపుడు కుయ్ కయ్ అని కూడా అనవు. నిన్ను కాకి అని పిలవచ్చా?’
‘ఏమని పిలిచినా నేను నీలోని భాగాన్నే కదా!‘
‘నామట్టుకూ నేనొక గొప్ప ఆత్మయోగి ననుకుంటున్నానే?’
‘నేను అందుకే వచ్చాను రామాహరీ.‘
‘మరి నీమీద ఎందుకంత ఆధారపడుతున్నాను? ఎవరి పొడా ఎందుకు గిట్టటంలేదు? నిన్నేమని పిలవాలి? జనామోద భాషలో నాతో నేను మాట్లాడుకోవటాన్ని మనోవైకల్యం, స్కిజోఫ్రెనియా అంటారు.’
‘ఆత్మకాకి.‘
‘అదేం పేరు? ఆత్మకాకి దుష్ట సమాసం. సంస్కృత పదానికి పరపదంగా తెలుగు పదం చేర్చి సమాసం చేయకూడదు. ఆమాత్రం ప్రాథమిక వ్యాకరణం నాకూ తెలుసు. కాకిఆత్మ అను, ఒప్పుకుంటా.’
‘…”
‘ఆలోచించిన మీదట ఆత్మకాకి ఇంపుగానే వినిపిస్తోంది. వినాయకచవితి అన్న రూల్సొప్పని సమాసాన్నే తెలుగువారు అక్కున చేర్చుకున్నారు. ఎలాగూ నీ కాకిగోలతో నా అగాధాల్లో ఉన్న ఆత్మపిత్రులతో తపాలా నిర్వహిస్తూనే ఉన్నావు. చిన్న సందేహం. నాకు నువ్వున్నట్లు నీకూ ఓ ఆత్మకాకి ఉందా?’
‘నీకు పరిణతి పెరిగేకొద్దీ నేనే నీ లోతులు నీకు చూపిస్తాను.‘
బుద్ధిరామయ్య దినచర్యలో గత ఐదేళ్ళగా చెప్పుకోతగ్గ మార్పులేం లేవు. జలజ పదిహేను సంవత్సరాల వయస్సుకొచ్చింది. వాసుదేవుడు జలజ కంటే రెండేళ్ళు చిన్నవాడు. భావతరంగాల్లో పదును ఉంటే మూలకర్త ప్రమేయం లేకుండానే సమీప వృత్తాల్లోకి భావాలు చొచ్చుకుపోతాయేమో! బుద్ధిమానసిల సంతానం ఈనాటి పిల్లల జుగుప్సాకరమయిన ‘మీ నాన్నకంటే మా నాన్న గొప్ప, మీ కారుకంటే మా కారు లేటెస్టు, ఓ అదా అది నాకెప్పుడో తెలుసు’ ఒరవడిలో పడలేదు. పడలేదు సరికదా, సొంపైన నిగర్వ ఆత్మవిశ్వాసం అలవరచుకున్నారు. ఆ ఆత్మవిశ్వాసమే కుటుంబాన్ని డాక్టర్లకీ మందులకీ దూరంగా ఉంచింది. భీరుత్వం, మంకుతనం మచ్చుకైనా లేవు. ఒక శుభముహూర్తాన వాసుదేవుడు, ‘నాన్నా, నాకు ఐ.ఐ.టి. వద్దు. ఇంజనీరింగ్ కూడా వద్దు’ అనేశాడు. బుద్ధిరామయ్య ఆశ్చర్యపడలేదు, సంతోషపడలేదు. ఎందుకో నిర్వచించలేని రేఖామాత్రపు నిరుత్సాహం అంతరంగంలో కలిగినట్లనిపించింది.
‘నీ ప్రోద్బలం లేకుండానే, నీ మహోన్నత సిద్ధాంతాలు అనుసరిస్తూనే, పెద్దగా ఒళ్ళు విరుచుకోకుండా, ఆడుతూపాడుతూ వాడు ఐ.ఐ.టి. కావచ్చు కదా అని నీకు ఏ కోశానో దురాశ ఉందేమో?‘
‘అమ్మయ్య, సందేహ నివృత్తయింది. ధాంక్స్. ఈమధ్య ఎందుకో చాలా తక్కువ మాట్లాడుతున్నావు ఆత్మకాకీ, నా నడకా కొంచెం తగ్గిందనుకో.’
బుద్ధిరామయ్య వయస్సు రీత్యా నాలుగో దశకానికి ఉద్వాసన చెప్పబోతున్నాడు. అతని ఆస్త్యప్పుల సమతుల్యతా పట్టికలో (ఆంగ్లపదం అయితే అయింది బాలెన్స్ షీట్ అంటే చెప్పేవారికి, వినేవారికీ సుఖ నిట్టూర్పు) ఆదాయపు పన్ను శాఖవారిని ఆకర్షించే ఏ అంశమూ లేదు. అతనికి అప్పులు లేవు, కట్టవలసిన నెల కిస్తీలు లేవు, అవసరం కంటే ఎందుకు ఎక్కువ సంపాదించాలో తెలియని మానసిక వైఖరి; లేని, రాని భవిష్యత్తు కోసం ఉన్న వర్తమానంలో దర్శనమిచ్చే బ్రహ్మపదార్థాన్ని నిద్రపోకుండా ఆస్వాదించగలిగే సుకృతం, అతని భావజాలాన్ని అతనికంటే ఎన్నోరెట్లు విశ్లేషణారహితంగా జీర్ణించుకున్న కుటుంబసభ్యులు, వేళ్ళమీద లెక్కించగలిగిన బంధువులు, మిత్రులు; వారే అతని సంపదలు. భగవంతుడు కూడా పన్ను వేయలేని నిత్యాదాయాలు.
ప్రస్తుత బాసులకి, అతను మా సంస్ధలో చేరితే మాకెంత లాభమో అని ఎదురుచూస్తున్న పోటీదారులకి అతని సామర్థ్యం ప్రస్తుత ఆదాయం కంటే మూడు రెట్లు ఎక్కువని తెలుసు. ఆ నిజం బుద్ధిరామయ్యకీ తెలుసు. సంతానం కోసం, తన తదనంతరం (‘తదనంతరం’ను మించిన దుష్టసమాసం తెలుగులోనే కాదు, ప్రపంచంలోని ఏ భాషలోనూ లేదు) భార్య కోసం ఎంత సంపాదించి మిగిలిస్తే సబబుగా ఉంటుంది అనుకునే జీన్సు లేవు బుద్ధిలో. ఒకవేళ ఉంటే వాటికి ఏనాడో తిలోదకాలిచ్చేశాడు.
మీ భవిష్యత్తు కోసం ఇంత వెనకేశాను, తెలిసి మసులుకోండి అని పిల్లలతో అంటే ‘నాన్నగారూ, పద్ధినిమిదేళ్ళు మాకు వ్యక్తిత్వం నేర్పడమే కాక మూడు పూట్లా మేపారు కూడా. ఇకపైన కూడా మీకు కాలేజీ సీట్లు కొనిపెడతాను, ఉద్యోగాలు కొనిపెడతాను, మొగుడూ పెళ్ళాలని కొనిపెడతాను, మీ అంతట మీరు బతకలేరేమో అనుకుని డిపాజిట్లు రాస్తాను, అని ఒకవేళ మీరనుకంటే మాకు వ్యక్తిత్వం లేకపోవడమే కాదు, మీకు కూడా వ్యక్తిత్వం లేనట్లే. చెప్పులు కుట్టుకునైనా ఆత్మగౌరవంతో బతకగలం, రుణభారంతో జీవితం గడపలేం’ అనగలిగే మనోస్థైర్యం వాళ్ళకుందని అతనికి తెలుసు. అతనికి తెలుసని కుటుంబానికి తెలుసు. కొన్ని ప్రగాఢ సత్యాలు ప్రకటించకపోతేనే అందం.
బుద్ధిరామయ్య తన మానసికోల్లాసాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా ద్విగుణీకృతం చేసుకున్నాడు. ఏడాదికి రెండుమూడుసార్లు కుటుంబ సమేతంగా దేశాన్ని, కొన్ని విదేశాల్ని సందర్శించాడు. సంపాదించే డబ్బు సార్థకత సందర్శనలకే అన్నట్లుగా.
ఏ మిత్రుడయినా, బంధువైనా ప్రాణావసరానికి రెండు మూడు లక్షలు కావాలంటే నిస్సంకోచంగా ఇవ్వగలడు. తనకున్న ఒక్క డిపాజిట్ కరిగిపోతోందే అన్న పీకుడు లేకుండా. అయితే ఆ అవసరం ఇప్పటివరకూ రాలేదు.
హైదరాబాదు అన్ని ప్రపంచ నగరాలలానే దినదినాభివృద్ధి చెందుతోంది. ఎన్ని రకాల పరస్పర విభిన్న దృక్పథ రాజకీయ పాలకులు పీఠంలో ఉన్నా, మారుతున్నా – అభివృద్ధికి కొలమానం అపార్ట్మెంట్ ఖరీదు చదరపు అడుగు మూడువేల నించి పది సంవత్సరాల్లో తొమ్మిదివేల రూపాయలకి పెరగటమే అయితే. వ్యవసాయం గిట్టుబాటవక, పల్లె ప్రజలు పట్టణాలకి వలసపోగా పల్లెలు దాదాపు నిర్మానుష్యమయిపోతున్నాయి. విచ్చలవిడిగా నిర్భాగ్య రైతులు అవగాహన లేమితో జల్లే క్రిమి సంహారకాలు తమ ప్రతాపం క్రిముల మీద కంటే పశుపక్ష్యాదుల మీద, పంటల పైనా చూపిస్తున్నాయి. మితిమీరి వేయవలసి వస్తున్న రసాయన ఎరువులు తమ ప్రకోపాన్ని భూమిపైన, రైతు పైన, పర్యావరణం పైనే కాకుండా ప్రపంచంలో భోజనం చేసే ప్రతి వ్యక్తి పైన చూపిస్తున్నాయి. బడా పారిశ్రామికవేత్తలు, వారి నల్లధనం ఆధారంగా బతుకుతున్న చిన్న దేశాలు, చిన్న దేశాలమీద పరాన్నజీవులుగా బతుకుతున్న, నిద్రపోతున్న, అగ్ర రాజ్యాలు ఈ వినాశాన్ని ‘తథాస్తు’ అంటున్నాయి.
పిచ్చుకలు, కాకులు, చిలుకలు, తుమ్మెదలు, సీతాకోకచిలకలు, వానపాములు, శతాబ్దాలుగా మానవజాతితో మిత్ర సహజీవనం చేస్తున్న పక్షులు, క్రిమికీటకాలు నిర్వాణ దశకి చేరుకుంటున్నాయి. పశువులు తమ సహజ ఆహారం కంటే రసాయనాలు ఎక్కువ తింటున్నాయి. పావురాలు పట్టణాల్లో పట్టక పల్లెల్లో కూడా పరాక్రమం చూపిస్తున్నాయి.
పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలు అనూహ్యంగా పెరిగాయి. సైకిలు కొనటానికి ఎంతో ఆశపడి కూడా నలభై ఏళ్ళగా కొనలేకపోయిన తల్లిదండ్రులకి చినరామయపాలెంలో చినభద్రుడు కాలేజీలో ఇంజనీరింగ్ ప్యాసయి చింతామణి.కామ్‌లో నౌఖరీకి కుదిరిన కొడుకో, కూతురో, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, సాధ్యమైనంత త్వరలో కారు కొనిపెడుతున్నారు. అనతికాలంలో తరతరాలుగా ఉన్న నాలుగైదెకరాల భూమి, (ఒకప్పుడు పుష్టినిచ్చే గింజలు, శాకాలు పండించిన భూమి, ఇప్పుడు భూదందాకోరులు మదుపరులకి గజాలలెక్కలో అమ్మజూపుతున్న భూమి) ఇల్లు – అభిమానం చంపుకుని, అయినకాడికి అమ్ముకుని వృద్ధులు హైదరాబాదులో పిల్లల పంచన చేరుతున్నారు. నందో రాజా భవిష్యతి.
తన చుట్టూ ప్రపంచాన్ని పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ బుద్ధిరామయ్య రోజుకి పది కిలోమీటర్లు అలాగ్గా నడిచేవాడు, ఈమధ్య అయిదు కిలోమీటర్లు నడిచి చాల్లే అని ఇంటి దిక్కు పడుతున్నాడు. ఓపిక, అభిలాష లేక కాదు, కొండాపూర్‌లో ఇటీవల విజృంభించిన ధూళి కాలుష్య, శబ్ద కాలుష్యాలు భరించలేక. ఎన్ని కట్టడాలు, ఎన్ని ఫ్లై ఓవర్ల నిర్మాణాలు, దినరాత్రులు ఎన్ని టన్నుల కొండరాళ్ళు పగిలితే అయేటట్లు? ఏదో హిందీ సినిమాలో ప్రసిద్ధమైన డైలాగు: కుచ్ పానేకేలియే కుచ్ ఖోనా పడ్తాహై.
సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు, ప్రభుత్వ గణాంకాలని మనం నమ్మితే, రెట్టింపయ్యాయి గత ఐదేళ్ళలో. విలువ అంటే ఏమిటో తెలియలేని విలువలు. మేక్ మైన్ మెక్ డొనాల్డ్స్. దృశ్యానికి విలువ లేదు. ఐఫోన్లో అర్జంటుగా ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచురిస్తే ఎన్ని లైకులొచ్చాయా అన్న గణాంకానికే విలువ. ప్రజల బాంక్ బాలెన్సు గణనీయంగా పెరిగింది. మెంటల్ బాలెన్స్ అగణనీయంగా నశించింది.
నాన్ యార్? నేను ఎవరు? తాగే నీరు, పీల్చే గాలి, తినే తిండి.
బుద్ధిరామయ్య విధిగా ఉదయ సంధ్యావందనం, సాయం సంధ్యావందనం చేస్తాడు. వేద నిర్దేశిత విధికర్మలా కాదు. అతని సంధ్యావందనానికి పంచపాత్ర, హరివాణం, ఉద్ధరిణి, అంగవస్త్రం, అవసరం లేదు. విశ్వామిత్ర లిఖిత సంస్కృత మంత్రాలతోనూ పని లేదు. ఉదయంపూట పూర్వదిశగాను, సాయంసమయంలో పశ్చిమదిశగాను సూర్యభగవానుణ్ఢి దర్శించి మౌనంగా ధన్యవాదాలర్పించటమే అతని సంధ్యావందనం.
ఒక ధూళి సాయంత్రాన, సంధ్యావందనానంతరం మౌనంగా ఇల్లు చేరాడు. బాహ్యమౌనం, అంతర్మౌనం.
మసక వెలుతురు. ఎప్పటిలాగే భద్రతాధికారి గేటు తీసి, నమస్కారం చేసి గేటు మూశాడు.
నైరుతి వైపుండే రెండు అపార్ట్మెంట్ చెత్తకుండీలు పొంగి పొరలుతున్నాయి. ఈరోజు జీయెచ్చెమ్సీ వారు రాలేదు కాబోలు. డబ్బాలు నిండగా, ఇంకో రెండు డబ్బాల చెత్త నేలమీద కుప్పలుగా పోసి ఉంది. ముక్కులు మూసుకోవాల్సినంత దుర్గంధం. ఇరవై ముప్ఫై పావురాలు ఆ చెత్తలో వాటికి కావలిసినవి ఏరుకు తింటున్నాయి. మిగతా పావురాలు గుడుర్ గుడుర్ అంటూ రొదచేస్తున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి సొసైటీవారు భవనమంతా, ఫ్లాట్ యజమానులు వ్యక్తిగతంగా తమ తమ కిటికీలు, బాల్కనీలు పావురాల బారిన పడకుండా తెరలు కట్టించుకుని సురక్షితం చేసుకున్నాం అనుకున్నారు. కానీ ఎక్కడో అక్కడ రెండు మూడంగుళాల చిల్లులు చూసుకునో, చేసుకునో పావురాలు నిర్విఘ్నంగా భవనం నలువైపులా కాపురాలు చేస్తూనే ఉన్నాయి.
అకస్మాత్తుగా బుద్ధిరామయ్య చెత్తడబ్బా వద్ద ఒక చనిపోయిన కాకిని గమనించాడు. చనిపోయిన కాకి చుట్టూరా కావ్ కావ్ అంటూ వందల కాకులు తిరుగుతాయని బుద్ధిరామయ్య ఎక్కడో చదివాడు. కానీ ఈ కాకిని పట్టించుకున్న ఏ కాకీ లేదు.
బుద్ధిరామయ్య ఎందుకు దిగులు పడుతున్నాడో అతనికి తెలియలేదు.