వర్షంలో పిల్లికూన

ఆ హోటలులో విడిదిచేస్తున్న అమెరికన్లు వారిద్దరే. వాళ్ళ గదినుండి క్రిందకీ మీదకీ మెట్లమీదనుండి ఎక్కుతున్నప్పుడుగాని దిగుతున్నప్పుడుగాని తెలిసిన ముఖం ఒకటీ ఎదురు పడలేదు. రెండవ అంతస్తులో ఉన్న వాళ్ళగదికి ఎదురుగా దూరంగా సముద్రం కనిపిస్తూ ఉంది. దానికి ముందు ఒక ఉద్యానవనం, అందులో ఒక యుద్ధ స్మారక చిహ్నం ఉన్నాయి. ఉద్యానవనంలో పచ్చని చెట్లూ, ఎత్తయిన పామ్ వృక్షాలూ ఉన్నాయి. వాన పడకుండా ఎండగా పొడిగా ఉన్నట్టయితే అందులో ఒకళ్ళో ఇద్దరో ఆర్టిస్టులండేవారు ఆ పామ్ చెట్ల బొమ్మలు వేస్తూ. పచ్చటి చెట్లు, ఆ హోటల్, ఆ సముద్రతీరం వారికి నచ్చే దృశ్యం. ఇటాలియన్లు ఆ స్మారక చిహ్నం చూడటానికి చాలా దూరం నుండి వస్తుంటారు. కంచుతో చేసిన ఆ స్మారక చిహ్నం వర్షంలో తడుస్తూ మెరుస్తోంది. సన్నగా వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. పామ్ చెట్లమీంచి చినుకులు ఒకటొకటిగా రాలుతున్నాయి. కంకర వేసిన కాలిబాటమీద అక్కడక్కడ నీటిగుంటలు ఏర్పడి నీళ్ళు నిలిచాయి. వర్షంలో, విశాలమైన తీరం పొడవునా సముద్రం ఒక్కసారి ఉవ్వెత్తుగా లేచి, విరిగిపడి, పాకురుతూపోయి తీరాన్ని తాకి, తిరిగి వెనక్కి పోయింది. స్మారక చిహ్నానికి దగ్గరలో అప్పటి వరకు ఆగి ఉన్న వాహనాలన్నీ వెళ్ళిపోయాయి. దానికి ప్రక్కనే ఉన్న నాలుగురోడ్ల కూడలిలో ఎదురుగా ఉన్న ఒక కఫేలో సేవకుడు తలుపు తెరిచి పట్టుకుని శూన్యంగా ఉన్న వీధిలోకి చూస్తున్నాడు.

ఆ అమెరికను యువతి గదిలోని కిటికీ దగ్గరకి పోయి బయటకి చూసింది. బయట, తమ కిటికీకి ఎదురుగా, నీళ్ళోడుతున్న ఆకుపచ్చని మేజా బల్లల క్రింద, ఒక పిల్లికూన ముడుచుకు కూర్చుని కనిపించింది. అది తనమీదకి చినుకులు తుళ్ళకుండా ఉండే చోటు చూసుకుని ఒద్దికగా కాళ్ళు మునగదీసుకుని మరీ కూచుంది.

“క్రిందకి పోయి ఆ పిల్లికూనని ఎలాగైనా తీసుకువస్తాను,” అంది ఆమె తన భర్తతో.

“నే వెళ్ళి తీసుకురానా?” అంటూ భర్త జార్జి పరుపుమీదనుండి లేవబోయాడు.

“ఫర్వాలేదు. నేను వెళతాను. పాపం, ఆ పిల్లికూన ఆ మేజా క్రింద పొడిగా ఉండడానికి నానా తంటాలు పడుతోంది.”

భర్త తిరిగి పుస్తకం చదవడంలో లీనమైపోయాడు, కాళ్ళక్రింద రెండు తలగడాలు ఎత్తు పెట్టుకుని. “తడవకుండా చూసుకో!” అన్నాడు.

ఆమె క్రిందకి మెట్లు దిగి వెళ్ళింది. ఆఫీసుగది ముందునుండి ఆమె వెళ్ళడం చూసి హోటలు యజమాని గౌరవపూర్వకంగా లేచి నిలుచున్నాడు. అతని మేజాబల్ల ఆఫీసు గదిలో ఓ మూలకి ఉంది. బాగా పొడుగ్గా, వయసు పైబడినట్టు ఉంటాడు అతను.

“ఇల్ పియోవె. వర్షం” అంది ఆమె అతన్ని చూసి పొడి ఇటాలియన్‌లో. ఆమెకి అతను నచ్చేడు.

“సి, సి, సిన్యోరా. అవునవును. బ్రూత్తో తెంపో. ముసురు పట్టింది” అన్నాడు అతను.

చీకటిగా ఉన్న ఆఫీసుగదిలో ఆ చివర తన మేజా దగ్గర నిలబడి ఉన్నాడతను. ఆమెకి అతని పద్ధతి నచ్చింది. ఎవరు ఎంత చిన్న ఫిర్యాదు ఇచ్చినా తీవ్రంగా పరిగణించి వెంటనే స్పందించే అతని తీరు నచ్చింది. ఆమెకి అతను సేవ చెయ్యడానికి చూపించే ఉత్సాహం నచ్చింది. హోటలు యజమానిగా అతను కనబరిచే తీరు నచ్చింది. ముసలివాడైనా, పుష్టిగా ఉండే అతని ముఖం, పెద్ద చేతులూ ఆమెకి నచ్చాయి.

అతని వంక అలా ఇష్టంగా చూస్తూనే, తలుపు తెరిచి, బయటకి చూసింది. వర్షం గట్టిగా కురుస్తోంది. చేతులు లేని గోనెపట్టా తొడుక్కున్న ఒక వ్యక్తి ఖాళీ రోడ్డు దాటి కఫే వైపు వస్తున్నాడు. ఆ చుట్టుప్రక్కలే ఎక్కడో కుడివైపున పిల్లికూన ఉండాలి.

ముంజూరు క్రిందనుండి వెళ్ళి చూద్దునా అని ఇంకా మనసులో అనుకుంటోంది. ఆమె అలా తలుపు దగ్గర బయట నిలబడి ఆలోచిస్తూంటే, ఆమె వెనక ఎవరో గొడుగు తెరిచి పట్టుకున్నారు. మరెవరో కాదు, ఆ హోటల్‌లో పనిచేసే మెయిడ్.

“మీరు తడిసిపోకూడదని…” అన్నది ఆమె ఇటాలియన్‌లో. ఆ హోటల్ యజమానే పంపివుంటాడు ఆమెని.

“దేనికోసమో వెతుకుతున్నట్టున్నారు, ఏమైనా పోయిందా అమ్మా?” అని మర్యాదగా అడిగిందామె.

“ఇక్కడో పిల్లికూన ఉండాలి,” అంది ఆ అమెరికను యువతి సమాధానంగా.

“పిల్లికూనా?”

“అవును, పిల్లికూనే! ఇల్ గాత్తో” అంది అమెరికను స్త్రీ మరొకసారి.

“పిల్లి?” అని, సేవకురాలు నవ్వుతూ, “అందులోనూ ఈ వర్షంలో?” అంది.

“అవును.” అంది అమెరికను, “ఇక్కడే మేజా క్రింద ఉండాలి.” అని, మళ్ళీ తనే, “ఓహ్! అదెంత బాగుందో! అది కావాలనుకున్నాను. అలాంటి పిల్లిపిల్ల కోసమే చూస్తున్నాను.” ఆమె ఇంగ్లీషులో అనగానే మెయిడ్ ఇక ఏమీ అనలేదు.

“రండి, లోపలికి పోదాం” అంది, “మనం లోపలికి వెళ్ళిపోదాం. లేకపోతే మీరు తడిసిపోతారు.”

“నేనూ అదే అనుకుంటున్నాను” అంది అమెరికను యువతి.

అలా కంకరబాట మీద నడుచుకుంటూ వెళ్ళి, తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళిపోయింది. సేవకురాలు గొడుగు ముడవడానికి బయట ఆగింది. అమెరికను యువతి మళ్ళీ ఆఫీసు గది ముందునుండి వెళుతుంటే, యజమాని అభివాదం చేశాడు. ఆమెకి మనసు పట్టేసినట్టూ, తనేదో కోల్పోయినట్టూ అనిపించింది. హోటలు యజమానిని చూసి ఏదో న్యూనతాభావం కలిగినా, దానితోబాటు అతను ఆమెను ఒక ముఖ్యమైన వ్యక్తిని చూస్తున్నట్టు చూస్తున్నాడన్న సంతృప్తికూడా కలిగింది. క్షణకాలం ప్రపంచంలో తను తప్ప మరొక ముఖ్యమైన వ్యక్తి లేనట్టు ఆమెకు అనిపించింది. మేడమెట్లు ఎక్కి తన గదికి చేరుకుంది. తలుపు తెరిచి చూస్తే, జార్జి ఇంకా పక్కమీద పడుక్కుని చదువులో లీనమై ఉన్నాడు.

“ఇంతకీ పిల్లికూన దొరికిందా?” అని అడిగాడతను, పుస్తకం పక్కబెడుతూ.

“ఎటో పోయింది” అంది ఆమె దిగులుగా.

“ఎటు పోయి ఉంటుందబ్బా?” అన్నాడు, పుస్తకం కాస్త పక్కనబెట్టి.

ఆమె పరుపుమీద కూచుంది.

“ఆ పిల్లికూన కావాలని ఎంతగానో కోరుకున్నాను” అందామె దిగులుగా, “ఎందుకో చెప్పలేను, అది ఎలాగైనా కావాలని గట్టిగా అనుకున్నాను. ఇంత వర్షంలో పిల్లికూన బతకడం చాలా కష్టం.”

జార్జి మళ్ళీ పుస్తకం తీశాడు చదవడానికి ఉపక్రమిస్తూ.

ఆమె వెళ్ళి డ్రెస్సింగ్ టేబిలు ముందు కూర్చుంది చేతి అద్దంలో తనని చూసుకుంటూ. అద్దంలో తన రూపం ఒకసారి ఇటువైపునుండీ, ఒకసారి అటువైపునుండీ ఎలా కనిపిస్తున్నదో చూసుకుంది. తర్వాత తన మెడనీ, తలవెనకా ఎలా కనిపిస్తున్నదో పరీక్షించుకుంది.

మరొకసారి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ, “నేను జుత్తు పెంచుకుంటే బాగుండదూ?” అని అడిగింది.

జార్జి తలెత్తి, ఆమె మెడ వెనుక భాగం అబ్బాయిలా దగ్గరగా కత్తిరించి ఉండడం గమనించి, “ఇప్పుడున్నదే బాగుంది” అన్నాడు.

“ఇలా ఉంటే నాకు విసుగ్గా ఉంది” అంది. “మగపిల్లల్లా కనిపించి కనిపించి బోరు కొడుతోంది.”

జార్జి ప్రక్కమీద ఇటునుండి అటు దొర్లాడు. మాట్లాడుతున్నప్పుడు ఆమెనుండి అతను దృష్టి మరల్చలేదు.

“ఇలా చూస్తుంటే నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా?” అన్నాడు.

అద్దాన్ని అక్కడే పెట్టి బయటకి చూడటానికి మళ్ళీ కిటికీ దగ్గరకి వెళ్ళింది. అప్పుడే చీకటి పడుతోంది.

“నా మెత్తని జుత్తుని వెనక్కి గట్టిగా లాగి పెద్దముడి వేసుకోవాలనీ, ఓ పిల్లికూనని ఒళ్ళో పెట్టుకుని లాలనగా తడుతుంటే, అది గారాలు పోతుంటే ఎంతో ముచ్చటపడుతూ ఆనందించాలనీ ఉంది.”

“అవును కదా” అన్నాడు జార్జి పక్కమీదనుండే.

“నాకు టేబిలు మీద స్వంత వస్తువుల్లో భోజనం చెయ్యాలి. స్వంత కొవ్వొత్తులు కొనుక్కోవాలి. వసంతం వచ్చే వేళకి అద్దం ముందు కూచుని నా జుత్తు దువ్వుకోవాలి. నాకో పిల్లికూన కావాలి. కొత్త బట్టలు కావాలి. …కావాలి …కావాలి.”

“ఒహో! ఆపు నీ సొద. కాసేపు నన్ను చదువుకోనీ!” అన్నాడు జార్జి విసుగ్గా. అతను మళ్ళీ పుస్తకంలో లీనమయిపోయాడు.

అతని భార్య కిటికీలోంచి బయటకి చూడసాగింది. అప్పటికి బాగా చీకటి పడింది. పామ్ చెట్లమీద చినుకులు చేస్తున్న చప్పుడు వినవస్తోంది.

“ఏమైనా సరే, నాకో పిల్లికూన కావాలి” అందామె నిశ్చయంగా. “ఓ పిల్లికూన కావలసిందే. అదీ ఇప్పుడే కావాలి. నా పొడవాటి జుట్టు సంగతీ, తక్కిన సరదాలూ తీరినా తీరకపోయినా, పిల్లికూన మాత్రం కావలసిందే!”

జార్జి ఆమె మాటలు వినడం లేదు. పుస్తకం చదువుతూనే ఉన్నాడు. అతని భార్య కిటికీలోంచి బయటకి చూస్తోంది. అప్పుడే కరెంటు వచ్చి నాలుగురోడ్ల కూడలిని వెలుగులతో ముంచెత్తింది.

తలుపు మీద చప్పుడు.

“కమిన్” అన్నాడతను. పుస్తకంలోంచి తలతిప్పి అటు చూస్తూ.

తలుపు దగ్గర సేవకురాలు నిలబడి ఉంది. ఆమె తాబేటి చిప్పలా రెండు రంగుల్లో అందంగా ముద్దుగా ఉన్న ఒక పిల్లిని పొదువుకుని ఉంది. అది విడిపించుకుందికి ప్రయత్నిస్తోంది.

“మా యజమాని… అమ్మగారికి… ఇమ్మని పంపించారు” అందామె.

(మూలం: A cat in the rain.)