ఎవరీ వివిన మూర్తి?!

1948లో తూర్పుగోదావరి జిల్లా సఖుమళ్ళ తిమ్మాపురం అన్న యేలేరు ఒడ్డున ఉన్న చిన్న ఊర్లో మూర్తి పుట్టారు. నాన్న కరణీకపు కుటుంబానికు చెందినా ఆ పని మీద ఇష్టంలేని మనిషి, కాంగ్రెసువాది. పేదల పక్షపాతి. ఇంట్లో చెప్పుకోదగ్గ సాహితీ వాతావరణం లేకపోయినా నాన్న తేలికపాటి పుస్తకాలు విరివిగా చదివేవారు. వివినమూర్తి ఆలోచనా జీవితానికి కేటలిస్టులా పనిచేశారాయన.

మూర్తి ప్రాథమిక విద్య – 1, 2, 3 క్లాసులు – స్వగ్రామంలోనే సాగింది. నాలుగు నుంచి ఎస్సెస్సెల్సీ దాకా కాకినాడ. ఆరో క్లాసులో ఉన్నప్పుడు కాకినాడ లైబ్రరీలో ఆ లైబ్రేరియన్ ఇచ్చిన ప్రతి పుస్తకాన్ని ఆబగా చదివాను అంటారు మూర్తి. ఎస్సెస్సెల్సీ రోజుల్లో తన దగ్గరి మిత్రుడు శ్రీమూర్తి రచనలు చేయడం చూశాక తనకూ రాయాలనిపించిందట. కథలు, నవల, పద్యాలు లాంటివి రాశారట. అవన్నీ ప్రేమ చుట్టూ తిరిగినవి. అలాగే ఆ రోజుల్లో ఆయన భావ కవిత్వం ప్రభావంలోనూ మునిగిపోయారట. శ్రీమూర్తి కృష్ణశాస్త్రి వహీదా శంకర్ జైకిషన్‌లని ఇష్టపడితే వివిన వేదుల, నందా, రవిని. ఆ శ్రీమూర్తి చెయ్యని మరో పని అప్పట్లో మూర్తి చేశారట: వయోజన విద్య, హరిజనోద్ధరణ అనే నాటకాల్లాంటివి రాసి, పిల్లల్ని చేర్చి వేయించి, తానూ నటించి ఇంటి అరుగుల మీద కరెంటు దీపాల క్రింద ప్రదర్శించారట.

కాకినాడలో ఎస్సెస్సెల్సీ ముగించాక పీయూసీ రాజమండ్రిలో చదివారు మూర్తి. అన్ని రకాల భావజాలాలతోనూ పరిచయమైన సమయమది. పీయూసీ ముగించాక రెండేళ్ళ పాలిటెక్నిక్ కాకినాడలో చేశారు. 1967 నాటికి చదువు ముగిసింది. నిరుద్యోగం, పేదరికం, పస్తులు, ఆకలి. ఆ గందరగోళం నుంచి బయట పడటానికి బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలలో రకరకాల పనులతో బతుకు పోరాటం. ‘ఆ కాలమంతా నాతో సహవాసం చేసింది నా రచనే’ అంటారు మూర్తి.

అలా నాలుగేళ్ళు ఊరుగాని ఊళ్ళల్లో దొరికిన పనల్లా చేశాక 1971లో విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో కొలువు కుదిరింది. అక్కడ నాలుగేళ్ళు. 1975లో కేంద్ర ప్రభుత్వపు రక్షణ మంత్రిత్వ శాఖ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఉద్యోగం. పదేళ్ళు ఆ ఉద్యోగం విశాఖపట్నంలో చేశాక బదిలీ మీద బెంగుళూరు వెళ్ళి అక్కడ మరో పదేళ్ళు. 1995-97లలో అదే ఉద్యోగం హైదరాబాద్‌లో, అక్కడ ఇమడలేక మళ్ళా బెంగుళూరు వెళ్ళి మరో పదేళ్ళు అధికార బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి మొత్తం 32 యేళ్ళు ఉద్యోగం చేసి 2007లో పదవీ విరమణ.


మూర్తి సాహితీయానం ఎప్పుడు మొదలయిందీ! ఎలా ఎలా పరిణమించిందీ? 1970 ముందటికే మూర్తికి శ్రీమూర్తితో స్పర్ధ పుణ్యమా అని కథలతో పాటు ఛందోబద్ధమైన కవిత్వం రాయడం కూడా అలవడింది. పుంఖానుపుంఖాలుగా పద్యాలూ, కావ్యాలు రాశారట. వచన కవిత్వం రాశారు. కానీ తృప్తి ఏమాత్రం కలగలేదు. ‘నేను వృత్తాల్లో రాసిన పద్యాలు పద్యాలే గానీ కవిత్వమనిపించలేదు. వచన పద్యాలు కొంత తృప్తి ఇచ్చాయి’ అంటారు మూర్తి.

1970 నాటికే ఆయనకు మార్క్సిజంతో పరిచయం అయింది. వాస్తవికతకూ కల్పనకూ మధ్య అంతరం అర్థమవసాగింది. తన సమస్యల నుంచి ఇతరుల సమస్యలనూ, ఇతరుల సమస్యల నుంచి తన సమస్యలనూ అర్థం చేసుకోవడం, వాటి మధ్య సంబంధ బాంధవ్యాలు పట్టుకోవడం అలవాటవసాగింది. వ్యక్తుల సమస్యలకూ సామాజిక సమస్యలకూ మధ్య ఉన్న సంబంధం తెలియసాగింది.

సాహిత్యం సామాజిక ఉత్పత్తి అన్న స్పష్టత ఏర్పడినా దానికి సామాజిక పరిణామాలు తీసుకువచ్చే శక్తి లేదని ఆయన ఆ దశలో నమ్మారు. సాహిత్యమన్నది ఊహల్లో బ్రతికేవారి ఊరట వ్యాసంగమనీ, కార్యవాదులు సమాజంలో మార్పు తేవడం కోసం సాహిత్యం వైపు మొగ్గనే మొగ్గరనీ బలంగా నమ్మారు. 1967-68లలో చదివిన దొస్తాయేవోస్కీ ‘నేరము శిక్ష’ నవల ఆయన్ని విపరీతంగా కుదిపివేసింది. 1970-71లలో చేతికందిన కాళీపట్నం రామారావు కథలపుస్తకం జీవితం పట్ల నిర్మాణాత్మకమైన, ఆశావహమైన దృష్టి కలగడానికి సాయపడింది.


1970ల తొలి సంవత్సరాలలో అటు పద్యాలు ఇటు కథలూ రాయడం కొనసాగించారు మూర్తి, కానీ ప్రచురణకు ప్రయత్నాలు చెయ్యలేదు. రాత వైఫల్య చిహ్నమన్న భావన ఒక పక్కన, ప్రచురణ అన్నది నా వంటి పల్లెటూరి మనిషికి చెందదన్న భావన మరోపక్కన – మొత్తానికి ఆయన ప్రచురణ గురించి పట్టించుకోలేదు.

1975లో ఆయన ఒకే ఒక వారపు వ్యవధిలో రాసిన తొమ్మిది ఋక్కుల కథలు సహచరి రామలక్ష్మి కంటబడగా ఆమె అందులోని ‘రొట్టెముక్క’ కథను ప్రచురణకు పంపారు. 1975లో ప్రచురితమైన ఆ కథ పాఠకుల దృష్టికి వెళ్ళింది. కాళీపట్నం రామారావుగారి దృష్టిని ఆకట్టుకుంది. అది వివినమూర్తి విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తోన్న సమయం. ఆ కథ పుణ్యమా అని అక్కడే ఉన్న కాళీపట్నంగారితో పరిచయం, స్నేహం, సాన్నిహిత్యం ఏర్పడ్డాయి. వివినమూర్తికి మార్క్సిజం పట్ల నమ్మకం ఉన్నా సందేహాలూ చుట్టుముట్టిన సమయమది. వ్యక్తి స్వభావానికీ వర్గ స్వభావానికీ మధ్య కనిపించే అంతరాన్ని ఎలా వివరించుకోవాలో తెలిసేది గాదు. అలాంటి సందిగ్ధ సమయంలో తన సందేహాలూ, ఆలోచనలూ కాళీపట్నంగారితో పంచుకొనే అవకాశం మూర్తికి వచ్చింది. ‘ఆ ఆలోచనలను, ఆలోచనా లక్షణాన్ని ఎదగనిచ్చారు కాళీపట్నం’ అంటారు మూర్తి. ‘అప్పట్లో విశాఖలో ఉత్తేజకరమైన వాతావరణం ఉండేది. దానికి రెండు కేంద్రాలు: ఒకటి కాళీపట్నంగారి ఇల్లు, రెండవది కృష్ణాబాయిగారి ఇల్లు. ఒకటి నా జీవితానికి లక్ష్యం ఇస్తే ఇంకొకటి ఆ లక్ష్యసాధనకు మార్గాన్ని నిశ్చయించుకొనేటట్టు చేసింది’ అని చెపుతారు మూర్తి. క్రమంగా సాహిత్యం మీద చిన్నచూపు తగ్గటం, సాహితీ సృజనను ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవడం ఈ దశలో మూర్తిలో వచ్చిన పరిణామాలు. ఇంత చేసినా జీవిత లక్ష్యానికి సాధనంగా సాహిత్యాన్ని స్వీకరించడం అంతరాంతరాల్లో గిల్ట్ – అపరాధభావన – కలిగిస్తూనే ఉండేది. ఎన్నో ఏళ్ళ తర్వాత నగరి బాబయ్య బెంగుళూరులో ‘నా ఆచరణకు ఎంత విలువ ఉందో నీ ఆలోచనా ప్రయత్నాలకూ అంతే విలువ ఉంది’ అని చెప్పి ఆ భావనను పోగొట్టారట.


రచనను బాధ్యతగా తీసుకొన్నాక మూర్తి రెండు నియమాలు పెట్టుకున్నారు: యాదృచ్ఛిక సంఘటనలను కథలు రాయడానికి వాడుకోకపోవడం. సామాజిక అంశాలు లేకుండా ఏదీ రాయకపోవడం.

అయినా సాహితీ సృజనకు మూలధాతువు ఏదీ – ఆలోచనా, ఆ ఆలోచన నుంచి చేరుకొనే నిర్ణయమా? మానవ అవసరాల కోసం ఏర్పడ్డ సమాజమే మానవ అసమానతల కల్పనకూ మూలకారణం అయినపుడు, వాటిని తొలగించడానికి మానవుడు చేసే ప్రయత్నాలు క్రమక్రమంగా ఫలితాలు ఇస్తున్నపుడు – ఆ ప్రయత్నాలను సమర్థిస్తూ, వాటికి ఊతమిస్తూ రాయడమే నా సాహిత్య ధర్మమా? ఇలాంటి ప్రశ్నలు మూర్తిని వెంటాడాయి. ‘ఆలోచించి చేరుకొనే నిర్ణయమే సాహిత్యంలో వస్తువు. అసమానతలు తొలగించడానికి చేసే ప్రయత్నాలను సమర్థిస్తూ రాయడమే సాహిత్య ధర్మం’ అని నమ్మి ఆయన 1987-88 దాకా కథలు రాశారు. అయినా అనుమానాలు వీడలేదు. ఆ సాహిత్యధర్మాన్ని స్వీకరించిన సంస్థల కార్యక్రమాలూ, ఆయా రచయితల రచనలూ ఆయనకు తృప్తి కలిగించలేదు. ‘సదరు సంస్థల్లో నేను చేరకపోవడం వల్ల కలుగుతోన్న అసంతృప్తా ఇదీ?’ అంటూ ఆత్మ విమర్శతో ఉండిపోయారు. ఎన్ని కథలూ నవలలూ రాసినా తనను తాను రచయితగా అనుకోలేకపోయారు.

1986లో సంధి అన్న కథ రాసినపుడు వివినమూర్తికి ‘నేను రచయితనేమో’ అనిపించింది. అప్పటిదాకా ప్రధాన పాత్రలు ‘నిర్ణయానికి’ రావడం, అది ‘పరిష్కారం’ అవడం, ఆ పరిష్కారం ఎందరికో ఉత్తేజం కలిగించడం, అలా ఒక కథలో ‘అభ్యుదయాంశం’ ఏర్పడటం అన్న బాణీకి భిన్నంగా సంధి కథలో ‘మానవుని వేదన’ చిత్రితమయింది అంటారు వివినమూర్తి, ‘పరిష్కారం సూచించని కథలు మీద నా చిన్నచూపు అసమంజసమేమో అన్న అనుమానం కలిగింది. ఆ సంధి కథను పరిష్కారం చూపించకుండా వదిలెయ్యడానికి సాహసం అవసరం అయింది’ అనీ అంటారాయన. తాను నమ్మిన సాహిత్య ధర్మం పట్ల అనుమానాలు గూడు కట్టుకొన్న సమయమది.


1990-91లో అతివేగంగా జరిగిన సోవియట్ యూనియన్ పతనం నన్ను దాదాపు పిచ్చివాడిని చేసింది, అంటారు మూర్తి. మొదట్లో అది బయటశక్తుల కుట్ర ఫలితం అని ఆయన భావించినా ‘ఏ వ్యవస్థ అయినా ఏదో ఒక బలమైన బలహీనత లేకుండా కుప్పకూలిపోదు… ఏమిటి ఆ బలహీనత?’ అన్న విషయం మీద తీవ్రంగా ఆలోచించారాయన. ‘స్వంత ఆస్తిని నియంత్రించిన కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఇతరుల మీద ఆధిపత్యం సాధించడం అన్న మానవ స్వభావాన్ని నియంత్రించలేకపోయాయి. ఇది నిర్వాహక స్థానాల్లో ఉండేవారు ఎంతో జాగ్రత్తగా నిర్వహించవలసిన విషయం. అలాగే వ్యక్తిగత లక్ష్యాలకూ సామాజిక లక్ష్యాలకూ, వ్యక్తికీ సమూహానికీ మధ్య ఉండే వైరుధ్యం శత్రువైరుధ్యమా మిత్రవైరుధ్యమా అన్న విషయంలో కూడా ఆయా అధినేతలు పరిణితితో వ్యవహరించలేదనిపించింది. వ్యక్తికీ గుంపుకీ మధ్య ఉండే సమస్యలో – వ్యక్తిసమస్యే మౌలికం అని నాకు అనిపించింది. ఈ వ్యక్తిసమస్య పరిష్కారానికి మానవజాతి చేసిన ప్రయత్నమేమిటి అని ఆలోచించినపుడు మందికోసం వ్యక్తిమీద బరువు పెంచడం మార్క్స్ ముందటి ఆలోచన అయితే వ్యక్తి కోసం మంది మీద బరువు పెంచడం మార్క్స్ కడపటి ఆలోచన అనిపించింది. మనిషి ఆలోచన నుంచే వ్యక్తిగత స్వార్థమూ సామాజిక లక్ష్యమూ పుడతాయనీ, అవి పరస్పరం నియంత్రించుకొంటాయనీ అనిపించింది. కమ్యూనిస్టు వ్యవస్థలు ఇంత కాలమూ వ్యక్తుల ఆలోచనా స్వభావాన్ని నియంత్రించినట్టు కనిపించింది. అదే ఆ వ్యవస్థలోని బలమైన బలహీనత అని స్ఫురించింది. మానవుడి కమ్యూనిస్టు ప్రస్థానానికి అతని ఆలోచనా స్వభావమే ఉపకరించ గలదనిపించింది. అలా అనిపించాక నా రచన నా బాధ్యత మరింత పెరిగింది,’ అంటారు వివినమూర్తి. ఇది ఆయన రచనా ప్రస్థానంలో అతి ముఖ్యమైన మజిలీ.

ఈ దశలో ఆలోచననుంచి చేరుకున్న నిర్ణయమే కథ కావాలి అన్న ధోరణి వదిలిపెట్టి ఆలోచననే కథలుగా చెప్పడం ఆరంభించారాయన. అలా వచ్చిన కథ, అద్వైతం. నేను తృప్తి పడిన కథల్లో అది మొదటిది, అంటారు మూర్తి. ‘జీవితాన్ని ఒక దృక్పథంతో చిత్రించడం వేరు. జీవిత వివరాలు ఆధారంగా ఆలోచనలు రేకెత్తించే కథలు అల్లడం వేరు’ అనే వివినమూర్తికి ఆలోచనలను వస్తువుగా చేసుకొని కథలు రాయడంలో ఆర్ద్రత తగ్గే ప్రమాదం ఉందని తెలుసు. ‘అయినా ఆ పని చేయడానికి గట్టిగా పూనుకోవడమే నా రచనల్లో ముఖ్య పరిణామం’ అంటారాయన. ‘ముగింపును బట్టి కథను లెక్కగట్టే శిక్షణ నాది. ఇప్పటికీ నన్ను నడిపించేది మార్క్సిజమే అయినా ఆ పేరుతో వ్యక్తిగత వివేచన మీదా విలువల మీదా నియంత్రణను అంగీకరించలేని స్థితికి చేరుకొన్నాను’ అని వివరిస్తారాయన. ‘ఈ పరిణామం తర్వాత రాసిన సంధి, పాడుకాలం, స్పర్శ లాంటి కథలు కొన్ని ప్రమాణాలతో చూస్తే పోరాటాన్ని ఆశను చూపించవు. అయినా అలా ముగియడమే ఉచితమని అలోచించి నిర్ణయించుకొన్నాను’ అంటారు మూర్తి. ‘నా పాత్రల బలహీనతలను నేనే చెయ్యిపట్టుకొని అధిగమింపచెయ్యను. స్పర్శ కథలో సునీత ఊగిసలాట నాకు ఇష్టం లేదు. కానీ దానిని నేను ఆపలేను’ అని వివరిస్తారు మూర్తి,

సోవియట్ పతనం తర్వాత పోలరైజేషన్ జరిగి ఏకధృవ ప్రపంచం ఏర్పడ్డాక ఆ పరిణామాల అమానవీయ సంబంధాల పట్ల ప్రతిస్పందన మొదలైన దేశాల్లో అంతర్గత పోరాటాలు ఎక్కువవడం గమనించారు మూర్తి. ‘ఈ పోరాటాలు మానవ మహా విముక్తి పోరాట దిశకు ఎంతవరకూ సానుకూలమో ఎంత వరకూ వ్యతిరేకమో తెలియటంలేదు. అది గ్రహించే శక్తి నాకు లేదు. కానీ ప్రపంచ పరిణామాలు నాలో కలిగిస్తోన్న అలజడి ఆలోచనలను ఇతర మానవులతో పంచుకోవడం ద్వారా ఆ అవాంఛనీయ పరిణామాలు అరికట్టడానికి అవసరమైన చైతన్యానికి దోహదం చెయ్యడం నాకు నేను విధించుకున్న బాధ్యత, ఇది సాహిత్య ధర్మంగా భావిస్తున్నాను’ అంటారు. ఈ మాట అన్నది 1994లో. ‘మీ బాధ్యతలో, సాహిత్య ధర్మం విషయంలో ఈ ఇరవై ఎనిమిదేళ్ళలో ఏమన్న మార్పులూ చేర్పులూ వచ్చాయా?’ అని ఈ వ్యాసం రాస్తూ 2022లో అడిగితే, ‘లేదు. ఏ మార్పులేదు’ అని నిర్ధారించాయన…


వివినమూర్తి సాహితీ మిత్రులెవరు? ఆయన మీద వారి వారి ప్రభావం ఎటువంటిదీ?!

1962 నాటి శ్రీమూర్తి నుంచి 2022లో పరిచయమయిన బందా శ్రీనివాస్ వరకూ వివినమూర్తి సాహితీమిత్రులు అపారం. అందులో ఆయనమీదా ఆయన రచనల మీదా ప్రభావం చూపించిన వాళ్ళూ తక్కువేం కాదు. అందులో మొదటి వ్యక్తి శ్రీశ్రీ.

శ్రీశ్రీతో వివినమూర్తికి ఉన్నది అతి స్వల్ప పరిచయం కానీ ఆ పరిచయానికన్నా ముందే శ్రీశ్రీ వివినమూర్తి మీద బలమైన ముద్రవేశారు. 2011లో శ్రీశ్రీ సావెనీర్ కోసం రాసిన ‘నాపై సైతం శ్రీశ్రీ’ అన్న ఆర్టికల్లో వివినమూర్తి ఆ వివరాలు పంచుకున్నారు.

1967లో చదువు ముగిసి నిరుద్యోగం అలుముకున్న దశలో కడుపు చేతపట్టుకుని ఇల్లు వదిలి దేశాలు వెళ్ళిపోయినపుడు నా దగ్గర ఉన్నవి మూడు – వృత్త పద్యాలు, ప్రేమ-ఆకలి మధ్య సంఘర్షణ, శ్రీశ్రీ కవిత్వం అంటారు మూర్తి. ‘ఆ కవికీ నాలోని భావుకతకు ఘర్షణ జరుగుతోన్న దశలో నాలోని జీవునికి ఖచ్చితంగా అమరిన కవి శ్రీశ్రీ’ అంటారు మూర్తి. ‘లోకంలోని ఆకలిని వాస్తవంగా చూసి, తీవ్రమైన ఉద్వేగానికి లోనై, ఆ ఉద్వేగం అంతా తన పాఠకునిలో నింపగలిగిన శ్రీశ్రీ నా స్వాత్మ్యం అనాలనిపిస్తోంది. శ్రీశ్రీ చెప్పిన ‘బాటసారి’ ని నేనే అనిపించింది’ అనీ అంటారు మూర్తి,

తనకు నచ్చిన శ్రీశ్రీ పద్యాలు అన్న ప్రస్తావన వచ్చినపుడు కర్తవ్యం గురించి ఆలోచిస్తే జయభేరి, కవిత్వం గురించి ఆలోచిస్తే కవితా ఓ కవితా, కమ్యూనిజం గురించి ఆలోచిస్తే మహా ప్రస్థానం, జీవిత మౌలిక లక్ష్యాల గురించి వెదికితే శైశవగీతి, మానవ జాతి గురించి ఆలోచిస్తోంటే మానవుడా – ఇలా అనేకం నన్ను నడిపించాయి అన్నది వివినమూర్తి సోదాహరణ వివరణ. ‘సమాజం మార్పులకు సిద్ధమవుతున్న దశలో అది ‘కవి’ రూపంలో ‘కవిత్వంగా’ తనను తాను ఆవిష్కరించుకొంటుంది. వేమన, గురజాడ వేసిన కవి బాటల్ని రాజమార్గాలుగా మలచడంలో శ్రీశ్రీ కవిత్వం వహించిన పాత్ర ఆయన్ని యుగకవిగా నిలబెట్టింది. విశ్వ మానవ భావన తెలుగు సాహిత్యానికి శ్రీశ్రీ అందించిన మహత్తర కానుక. తానొక అణువును అన్న గ్రహింపు మానవుడిని అనంత విశ్వంలో భాగం చేస్తుంది. నాకు ఈ పెనుసత్యం రవ్వంత అయినా బోధపడటానికి కారకుడు శ్రీశ్రీ’ అని వివరిస్తారు మూర్తి.

1976లో కాశీపట్నం రామారావుగారితో పరిచయం వివినమూర్తి మీద చూపించిన ప్రభావం గురించి చూచాయగా ఇంతకు ముందు చెప్పుకున్నాం. తనలోని విభిన్నమైన ఆలోచనలను మూర్తి కారాగారితో పంచుకోవడం, ఆయన మూర్తిలోని ఆలోచనా లక్షణాన్ని ఎదగనివ్వడం చూశాం. జీవితానికి లక్ష్యం ఇవ్వడంలోనూ, ఆ లక్ష్య సాధనకు మార్గాన్ని చూపించడంలోనూ కారాగారు వహించిన పాత్ర గురించి చెప్పుకొన్నాం. నిజానికి అది ఒక్క ఏడాదిలోనో, కొద్ది సంవత్సరాలలోనో జరిగి ముగిసిపోయిన విషయం కాదు. దాదాపు నలభై అయిదేళ్ళపాటు కారాగారితో అతి సన్నిహితంగా మెలిగారు వివినమూర్తి, సాహితీ మార్గదర్శిగానే కాకుండా ఒక పరిపూర్ణ వ్యక్తిగా కారాగారు మూర్తి మీద చూపించిన ప్రభావం అపారం.

‘లక్ష్యసాధనకు ఆచరణలోకి దిగినపుడు ఆ ఆచరణను జ్ఞానం పురికొల్పితే ఆ ఆచరణతో నైశిత్యంతోపాటు కించిత్తు క్రూరత్వం కూడా ఉంటుంది. అందుకు ధర్మం పురిగొల్పితే ఈ రెండూ కాస్తంత తక్కువ పాళ్ళలో ఉంటాయి. కారా మాష్టారు నా అవగాహనమేరకు ధర్మప్రేరితులు’ అంటారు మూర్తి,

శ్రీశ్రీ కన్నా శ్రీశ్రీ మార్గం గొప్పది అంటూ 1980-81లో కారా ఒక వ్యాసం రాశారట. 2021లో కారా గురించి మాట్లాడవలసిన సందర్భం వచ్చినప్పుడు వివినమూర్తి ‘కారా మార్గం’ ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. మూర్తి చెప్పిన కారా మార్గపు వివరాలు ఏమంటే – “ఆయన వింటారు. తన భావాలతో ఏకీభవించని వారినీ విని అర్థం చేసుకొంటారు. విని నీతి వాక్యాలు చెప్పేవారు కాదు. ఆ మనిషి తనంతట తానే ఒక అడుగు వేసే మాటలు చెప్పేవారు. అలా తను విన్నవాటినీ చూసినవాటినీ మనసులో నింపుకొనేవారు. వాటిల్లోని patterns గ్రహించేవారు. అసమ న్యాయాలను హేతుబద్ధం చేసే వారి వాదనలు కలబోసుకోనేవారు. అన్నీ విని స్వవివేచనతో సామాజిక విశ్లేషణ చేసుకొంటూ కథలు రాశారు. పాత్రలను బలహీనంగా సృష్టించి తన రాజకీయ తాత్విక దృక్పథం చెప్పరు. అన్ని పాత్రలనూ అన్ని వాదనలనూ బలంగా చిత్రిస్తూనే మొత్తం విషయంలోని అన్యాయాన్ని ఎరుక చేస్తారు.

జాగ్రత్తగా గమనిస్తే వివినమూర్తి కూడా తన కథల్లో ఈ మార్గం తీసుకోవడం కనిపిస్తుంది. ‘పాత్రల ఆలోచనలు వేరు, రచయిత మొత్తం ఆలోచనలు వేరు’ (నా గురించి నాలుగు మాటలు, ‘జగన్నాటకం’ కథాసంపుటికి ముందుమాట, 2006) అన్నా, ‘పాత్రల బలహీనతలను నేనే చెయ్యి పట్టుకొని అధిగమింపజెయ్యను’ (‘స్పర్శ’ కథా నేపథ్యం, 2012) అన్నా, సంప్రదాయానికీ దాని ఉల్లంఘనకీ మధ్య నలిగిన మానవుని బయటా లోపలి ప్రపంచాలే ఆధునిక సాహిత్యం’ (సవినయ శ్వేతపత్రం, ‘ప్రవాహం’ కథా సంపుటికి ముందుమాట, 1994) అన్నా, ఆ మాటల వెనకా, ఆ ఆలోచనల వెనుకా, వాటిని తన కథల్లో వివినమూర్తి పొందుపరచుకోవడం వెనుకా స్పష్టమైన కారా ప్రభావం కనిపిస్తుంది. అన్నట్టు కారా మీద వివిన మూర్తి ప్రభావం గురించి కూడా అధ్యయనం చేసి రాయొచ్చు – కానీ అది ప్రస్తుతానికి అప్రస్తుతం.


కాళీపట్నం గారితోపాటు 1976-77 ప్రాంతాల్లో పరిచయం అయిన రావిశాస్త్రి వివినమూర్తికి మరో ఆప్తులు – గురుతుల్యులు. 2007లో మనసు ఫౌండేషన్‌వాళ్ళు రావిశాస్త్రి రచనాసాగరం ప్రచురించినపుడు ఆ సంపాదకత్వ భారమంతా ఎంతో సంతోషంగా భుజాలకు ఎత్తుకున్నారు మూర్తి, సులభ్య రచనలు, దుర్లభ్య రచనలు, డైరీలు, ఉత్తరాలు, ఎన్నెన్నో సేకరించి 1375 పెద్ద పేజీల పుస్తకం తీసుకు వచ్చారు. చక్కని ముందుమాట రాశారు. రావిశాస్త్రి జీవితాన్ని ఆరు దశలుగా కూర్చి ప్రతి దశకూ సవివరమైన నేపథ్యం రాశారు. భగీరథుడు కూడా విస్తుపోయే ప్రయత్నమది. ఈ రచనా సాగరం సంపాదకీయంలో – మహా రచయితలు కలలు కంటారు, బాధపడతారు. బాధితులలో మమైక్యం చెందుతారు. ఆ బాధల్ని సమూలంగా పెకలించాలని ఆకాంక్షిస్తారు. తమ రచనలతో పాఠకుల్ని ఉత్తేజపరుస్తారు. పాలకుల్ని భయపెడతారు. మానవజాతి ప్రస్థానంలో క్రియాశీలమైన పాత్ర పోషిస్తారు. చివరికి మానవ జాతి సంపదగా పరిణమిస్తారు – అంటారు వివినమూర్తి.

అలా అంటూనే ‘మహా రచయితలు కూడా మనుషులే, పుట్టుకతోనే పూర్ణ పురుషులుకారు. తప్పటడుగులు వేసి, భావాలు అందిపుచ్చుకొని క్రమక్రమంగా ఎదుగుతారు. మన అభిమానం కొద్దీ వాళ్ళ తప్పటడుగులు కప్పిపెట్టి దివ్యమూర్తులుగా చూపించబోతాం. ఈ రచనా సాగరంలో అలాంటి మినహాయింపులూ కప్పివేతలూ లేకుండా జాగ్రత్త పడుతున్నాం’ అంటారు మూర్తి. అసలు రావిశాస్త్రిగారే ఇలాంటి విషయం తన గురించి తానే ఒకటికి పలుమార్లు చెప్పారు. ఆ నిబద్ధతనూ, నిస్సంకోచాన్నీ ఆయన్నించి అందిపుచ్చుకున్నారా అనిపిస్తుంది వివినమూర్తి సంపాదకీయం చూస్తే.

ఈ రచనాసాగరం ప్రాజెక్టును చేపట్టడానికి పాతికేళ్ళ క్రితమే, 1982లో రావిశాస్త్రి ‘రాజు మహిషి’ నవలను గురించి మూర్తి అతిచక్కని వ్యాసం రాశారు. రావిశాస్త్రి షష్టిపూర్తి సంచిక కోసం రాసిన వ్యాసమది. ఆ నవలలో తటస్థపడే వందను మించిన పాత్రల గురించీ, అందులో కొన్ని 1870 ప్రాంతంలో పుట్టినవనడం గురించీ, ఏడెనిమిది రోజుల వ్యవధిలో జరిగిన ముఖ్య కథకు ఉపకథలుగా చెప్పుకొచ్చిన యాభై అరవై సంవత్సరాల జీవితాలు గురించీ, ఆ ఉపకథలు సమాజంలోని నైచ్యాన్నీ, స్వార్థాన్నీ, దగానీ, పీడననూ వివరించే ఉపకరణాలుగా సాయపడటం గురించీ సాధికారంగా చెపుతారీ వ్యాసంలో మూర్తి. నవల సశేషంగా ముగియడం పట్ల పాఠకుల అసంతృప్తిని ప్రస్తావిస్తూ ‘మనకు అనాదిగా వంశాల పుట్టుకలూ, ప్రత్యేక వ్యక్తుల జీవిత చిత్రణా ప్రధానంగా ఉండే కథలు అలవాటయ్యాయి. ఆధునిక సాహిత్యంలో కూడా ఓ సమస్యను సృష్టించి దానిని పరిష్కరించడం దగ్గర ముగిసే రచనలకు మనం అలవాటుపడ్డాం. అంచేత రచన అంటే అలాగే ఉండాలి అన్న దృష్టి బలపడుతూ వచ్చింది. ‘రాజు, మహిషి’ దానికి భిన్నంగా నడిచింది. ఇలాంటి రచనల్లో చదువరి ముఖ్య కథలోంచి ఉపకథల్లో, ఉపకథల్లోంచి చుట్టూ ఉన్న సమాజంలోకి నడవాలేగానీ తిరిగి ముఖ్యకథలోకి నడిచి, చివరికి కథ ఏమవుతుందీ అని ఎదురు చూడడం అనుచితం అని నేను అనుకొంటాను’ అంటారు మూర్తి.

అలాగే రాజు మహిషిని ఏడు ప్రాకారాల కోటతో పోలుస్తారు మూర్తి. అలంకారాలు, చమత్కారాలు, పాత్రల బహిర్‌ రూపాలూ, వాటి అంతరంగాలూ, వాటి స్వభావాలను తీర్చిదిద్దే పరిస్థితులు, ఆ పరిస్థితులను కల్పించే సమాజగమనం, ఆ సమాజ గమనం వల్ల మానవుని సహజ మార్దవం ఛిన్నాభిన్నమవడం – ఇలా ఏడు పొరలుగా, ఏడు ప్రాకారాలుగా రూపకల్పన చేసిన నవల ఇది అంటారు. ఆసక్తికరమైన పోలిక ఇది.

ఈ నవల నేపథ్యంలో – చదువరిలో సమాజ క్షేమ చింతన కలిగిస్తూ ఆలోచనో ఆవేశమో కలిగించే రచనను నేను ఉన్నతంగా భావిస్తాను అంటారు మూర్తి. మూర్తి తన రచనల్లోని ఆలోచన వివేచన కాళీపట్నం నుంచీ, ఆవేశమూ ధర్మాగ్రహమూ రావిశాస్త్రినుంచీ అంది పుచ్చుకున్నారనుకోవడం సబబేమో!


ఎనభైలలో ఉద్యోరీత్యా బెంగుళూరు చేరాక వివినమూర్తికి కవనశర్మతోనూ, వల్లంపాటి వెంకటసుబ్బయ్యతోనూ సన్నిహిత సంబంధం ఏర్పడింది. అది కడదాకా కొనసాగింది. కవనశర్మ – వివినమూర్తి ద్వయాన్ని కాళీపట్నం ఎంతో ఆసక్తితో ఆశతో గమనిస్తూ ఉండేవారు. ‘ఇటు వీళ్ళిద్దర్ని, అటు అల్లం రాజయ్య తుమ్మేటి రఘోత్తమరెడ్డినీ నేను ఎప్పట్నించో గమనిస్తున్నా. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసే రచయితలు వీళ్ళు. రచనా పద్ధతిలోనూ, భావధోరణిలోనూ స్వల్ప బేధాలు ఉన్నా ఈ రెండు జంటలూ ఒకే కోవకు చెందినవి’ అన్నారు కాళీపట్నం 2012-13 ప్రాంతంలో. ‘నాకు నచ్చని విషయాల గురించి కూడా హృదయపూర్వకంగా ఆలోచించే ప్రజాస్వామిక లక్షణం కవనశర్మ నుంచి నేర్చుకున్నాను’ అంటారు వివినమూర్తి, ‘తెలుగు విమర్శకు రూపం ఇచ్చి సారం చేర్చి ఇంకొంత ఊపిరి పోసి ఇదిగో రచయితను ఇలా చదవాలి. ఇలా అంచనా వెయ్యాలి. ప్రమాణాలు ఏర్పడుతూ ఉండడమనేది సాహిత్య ఉన్నతీకరణకు మౌలిక అవసరంగానూ, సామాజిక అవసరంగానూ భావించాలి అని నచ్చచెప్పి బుజ్జగించేవారు వెంకటసుబ్బయ్య’ అంటారు వివినమూర్తి,


తనకు పరిచయం స్నేహం ఉండడం అటుంచి అసలు తన కాలానికే చెందని గురజాడ వివినమూర్తి ఆలోచనా ధోరణిని ప్రభావితం చేసినవాళ్ళల్లో ఒకరు.

సాహిత్యం సమాజంలో మార్పులకు దోహదం చెయ్యాలి అని ఆశించడం, ఆ సాహిత్యంలోనూ భాష, వాస్తవికతల పరంగా మౌలికమైన మార్పులు ఆశించడం, తీసుకురావడం – ఆ ప్రక్రియలో ఆధునిక సాహిత్యానికి గురజాడ మూల పురుషుడవడం వివినమూర్తిని బాగా ఆకట్టుకున్న విషయం, వాటికన్నా ఎక్కువగా మూర్తిని ఆకర్షించింది గురజాడలోని వివేచన; సమాజపు నియమాలను ధోరణిని వివేచించి తనను తాను నడుపుకొనే శక్తి, ఎవరి నియంత్రణలోనో ఉండి సాహితీ సృజన చేయడం కన్నా స్వీయ వివేచనతో బాధ్యతతో రాయడమే చైతన్యమున్న రచయిత కర్తవ్యం అని వివినమూర్తి నమ్మడం వెనుక గురజాడ ఆలోచనా ధోరణీ అతను వేసిన అడుగుజాడలూ. ఉన్నాయన్నది నా అభిప్రాయం..


సాహిత్యం గురించి వినినమూర్తి మౌలిక భావనలు ఏమిటీ?

ఈ విషయంలో తన ఆలోచనలను వివినమూర్తి తరచు అక్షర రూపంలో చెప్పారు. అందులో కొన్ని ఆకట్టుకొన్న వ్యాసాలు సృజన-విమర్శ (2022), సాహిత్యంలో మధ్యతరగతి (2016), రచయిత జీవితమూ రచనా (1994).

సృజన-విమర్శ అన్న చిన్న వ్యాసంలో మానవుని సృజనా ప్రక్రియ మౌలికతత్వాన్ని వివరించి, సృజనని వినియోగించుకొని దానిని మరింత వేగంగా అందరికీ అందేలా, క్రమబద్ధీకరణ చేయటమే విమర్శ. సృజనను వర్గీకరించి, క్రోడీకరించి, క్లుప్తీకరించి, సారాంశీకరించి ఒక సామాజిక ఒడంబడికని చేయటమే విమర్శ తత్వం’ అన్న ఆసక్తికరమైన ప్రతిపాదన చేస్తారు వినినమూర్తి. దానిని మరికాస్త వివరిస్తూ ‘వ్యక్తికి కలిగిన ఊహను సమాజం మెచ్చుతుంది. మెరుగుపరుస్తుంది. వాటితో పాటు ఖండిస్తుంది. వినకపోతే దండిస్తుంది. స్థిరీకరించటంతోబాటు నాశనమూ చేస్తుంది.ఈ బాహిర కార్యాలన్నీ విమర్శ అనే మౌలిక కార్యంలో భాగమే’ అంటారు. ‘సృజన వ్యక్తిగతమైతే విమర్శ సమాజానికి చెందినది. సృజన- విమర్శ ఒక అవిచ్ఛిన్న కార్యక్రమం’ అంటూ ముగిస్తారు.


సాహిత్యంలో మధ్యతరగతి అన్న 2016 నాటి వ్యాసానికి ‘పెంపకపు మమకారం’ అన్న తన 1948 నాటి కథ మీద 1964లో కాళీపట్నం రామారావు చేసిన వ్యాఖ్య, అదే కథమీద 2016లో ఎస్. జె. కల్యాణి చేసిన భిన్నమైన వ్యాఖ్యా ప్రేరకాలు.

‘పెంపకపు మమకారం’ ఏ ప్రయోజనమూ సాధించలేని కథ అని 64లో కారాగారు అన్నారు. ‘అరవైఏళ్ళ క్రితంలో పోల్చుకుంటే సమాజశాస్త్ర పరంగానూ, మానసికశాస్త్ర పరంగానూ ఈనాడు మనకు మరింత సమాచారం అందుబాటులో ఉంది. ఆ కారణం చేత, స్త్రీ వాదం-దళితవాదం వంటి సాధనాలచేత, జీవితపు సంక్లిష్టతలను అర్థంచేసుకోడంలో ఈ కథను ఆనాడు చదివిన వారికంటే ఈ తరం వారు మరింత సమర్థులవుతారని నా నమ్మకం’ అంటారు కల్యాణి 2016లో. ‘ఒక కథని గురించి అభిప్రాయంలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఈ మార్పును ఎలా అర్థం చేసుకోవాలీ?’ అన్న ప్రశ్న వేసుకొని దానికి సమాధానం వెదుకుతారు వినినమూర్తి.

కథానిలయం కోసం వేలాది కథలను చదివిన అనుభవంతో వివిన మూర్తి తెలుగు కథల్లో ఎక్కువ శాతం స్వీయానుభావాల మధ్యతరగతి కథలే అని చెపుతారు. అరవై ఏళ్ళ క్రితం కథకులూ పాఠకులూ ఒకే జీవితానికి చెందినవారవడం, అలాంటి పాఠకుల సంస్కారం పెంచడమే సాహిత్యం లక్ష్యం అని కొడవటిగంటి లాంటివారు భావించడం గురించి చెప్పి ఆ తరవాత రోజుల్లో తమ జీవితం గురించి తామే చెప్పుకోవడం ప్రయోజనరహితం అంటూ అలాంటి కథల్ని చులకనగా చూడటం జరిగిందంటారు వినినమూర్తి. ‘పెంపకపు మమకారం’ ఏ ప్రయోజనమూ సాధించలేదు అని కారాగారు అనడం వెనుక ‘మధ్య తరగతి జీవితాల్లో మార్పుకు దోహదం చేసే అంశాలు ఉండవు’ అన్న అరవైల నాటి భావనయొక్క ప్రభావం ఉంది అన్న విషయం పసిగట్టి ఎత్తి చెపుతారు మూర్తి.

కాలం మారి సమాజం మారి సామాజిక అంశాలు మారిన సందర్భంలో, అస్తిత్వ వాదాలు తలెత్తి స్థిరపడుతున్న నేపథ్యంలో ‘తమ గురించి తాము చెప్పుకోవడం’ సాహిత్యపు సాధారణ అంశం అయింది అంటారు వినినమూర్తి. వేలాది సంవత్సరాలుగా వివక్షకు గురి అయిన సామాజిక బృందాలు తమ స్థితిగతులను అంచనా వేసుకోడానికి కారాలాంటి రచయితలు తమ గురించి తాము రాసుకొన్న ‘పెంపకపు మమకారం’ లాంటి కథలు ఉపయోగపడతాయి అన్న కల్యాణిగారి అభిప్రాయం స్వాగతించదగినది అంటారు మూర్తి.

అనుభవజ్ఞులైన కథారచయిత స్వీయ విమర్శనూ, అదే విషయంమీద ఒక ఔత్సాహిక వ్యాసకర్త వ్యక్తపరచిన భిన్న అభిప్రాయాన్నీ, ఆ రెండు అభిప్రాయాల నడుమనున్న కాలమాన పరిస్థితుల్నీ పరిగణనలోకి తీసుకొని వివినమూర్తి వివరించిన విధానం అపురూపమనిపిస్తుంది.


రచయితనూ, అతని రచనలనూ కలగలపి చూడాలా లేక విడివిడిగా చూడాలా అన్నది ఏనాటినుంచో నలుగుతోన్న ప్రశ్న, ‘ఎప్పటికీ సమాధానం దొరకదు’ అని చాలామంది భావించే ప్రశ్న. ఆ ప్రశ్నకు తనకు బాగా పరిచయం ఉన్న కాళీపట్నం రామారావు జీవితాన్నీ ఆయన రచనల్నీ మేళవించి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు వినినమూర్తి తన 1994 నాటి ‘రచయిత జీవితమూ రచనా’ అన్న వ్యాసంలో.

శ్రీకాకుళం పరిసర గ్రామపు కరణంగారి పెద్ద కొడుకు… భూముల వివరాలు, ఆ మెలకువలు, కాస్తంత లౌక్యం అబ్బిన మనిషి … కుటుంబపు పెద్ద కొడుకుగా గౌరవం, బాధ్యత, సహనం- కించిత్ నిరంకుశత్వం.

ఆ పెద్దకొడుకు చదువుకొని ఉపాధి అవకాశాలకోసం పట్నం చేరడం, అక్కడి వేగాలు, (వ్యక్తుల మధ్య) దూరాల ఫలితంగా అంతర్ముఖుడవడం, కరణపు కులవృత్తి వదిలి టీచరు ట్రైనింగ్ అయ్యి లెక్కల మాస్టారుగా స్థిరపడటం… వృత్తిలో శ్రద్ధ, అందుబాటులో ఉన్న పుస్తకాలన్నీ చదవడం… రకరకాల పుస్తకాలు… విశ్వనాథ, టాగోర్-శరత్, చలం, కొడవటిగంటి – సమాజాన్ని సహేతుకంగా అర్థం చేసుకొనే అలవాటు నెలకొనడం, వీరందరి ప్రభావంతో చుట్టూ ఉన్న జీవితాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం, ఆలోచన, ఆ ఆలోచనలను ఇతరులతో పంచుకోవాలన్న ఆరాటం, తపన – అలా మొదలయిన కాళీపట్నం రామారావు రచనా వ్యాసంగం.

‘చదవగా చదవగా నాకూ రాయాలనిపించింది. నా రచనలు ఇతరుల మీద ప్రభావం చూపించినా చూపించకపోయినా అవి రాయడానికి నేను చేసిన ఆలోచనలవల్ల నేను మారాననడానికి నిదర్శనాలున్నాయి’ అంటారట కారా.

రచనలవల్ల మనుషులు మారడమూ అంటే ఏ వాటిల్లో ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఎవరికి చెప్పాలి? అన్న ప్రశ్నలు వస్తాయి.

రావిశాస్త్రి, ఆకెళ్ళ క్రిష్ణమూర్తి, వాసిరెడ్డి వెంకటప్పయ్య కాళీపట్నంగారి సన్నిహిత మిత్రులు. ప్రజల జీవితాలను వ్యక్తీకరించడానికి వారి భాషనూ, మాటతీరునూ, విషయ గ్రహణ విధానాలను పట్టుకోవడం, వాటిని రచనల్లో వాడటం రావిశాస్త్రిగారి రచనల్లో కాళీపట్నం గమనించారు… గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఆ మెలకువతో తాను చేసే ధర్మవిచారం పాలకవర్గాలకు రక్షణ ఇస్తుందేగానీ ‘మాయలో మాయనీ, ధర్మంలో అధర్మాన్ని గుర్తించే శక్తి ఇవ్వదని’ రావిశాస్త్రి తదితర మిత్రుల సాంగత్యంలో కాళీపట్నం గ్రహించారు.

కాశీపట్నం తొలి రచనల్లో ఒకటయిన అప్రజ్ఞాతం కథ రచయిత పెరిగిన వాతావరణాన్నీ, స్వభావాన్నీ, ఆలోచనా జీవితాన్ని సూచించే కథల్లో ముఖ్యమయినది అంటారు వివినమూర్తి. ‘కథా వస్తువులో ధర్మసూక్ష్మ పర్యావలోకనం ఉంది. పాత్ర స్వీకరణలో సమాజ పరిశీలనాసక్తి కనిపిస్తుంది. సుదర్శనం చేసిన వాదన ఎంత బలమయినదో సుదర్శనమూ సూరప్పడూ చేసిన ప్రార్థనా శపథమూ అంత సహజమయినది. సుదర్శనం పాక్షికబుద్ధినీ, అవగాహనా లోపాన్నీ సమర్థవంతంగా వివరించగలిగారు రచయిత’ అంటారు వినినమూర్తి. ఆ దశలో కాళీపట్నం రాసిన రాగమయి, పెంపుడు మమకారం లాంటి కథలు రచయిత లోనవుతున్న మార్పుల్నీ, ఆయనకు అందుబాటులోకి వస్తోన్న జీవన వైశాల్యాన్నీ పాఠకులూ పరిశీలకులూ తెలుసుకొనే అవకాశం ఇస్తాయి అంటారు వినినమూర్తి. ఈ రచనల్లో రచయిత కథారచనకు పాటించిన నియమాలు, చేస్తున్న ఆలోచనలూ మనకు కనిపిస్తాయి అంటారు. అలాగే ‘పలాయితుడు’ కథ ద్వారా కుటుంబ సమస్యలకు మూలం కేవలం వ్యక్తుల స్వభావాల సహజ సంఘర్షణలో లేదు. పైన ఎక్కడో ఉండే ఆర్థిక సంచనలమూ, సామాజిక సంక్షోభమూ కుటుంబ జీవితాలమీద గట్టిగా పనిచేస్తాయి అన్న విషయం కాళీపట్నం స్పష్టం చేసుకున్నట్టు అర్థమవుతుంది అంటారు వినినమూర్తి.

‘నెహ్రూ విధానాల ఫలితంగా గ్రామాల్లో దేశాభివృద్ధికి సంకేతంగా రోడ్లు స్కూళ్ళు ఏర్పడటం, అయినా ధనికులకూ పేదలకూ మధ్యనున్న తేడా తగ్గించడం కోసం చేసిన ప్రణాళికల వల్లనే ఆ అంతరాలు బాగా పెరగడం కారాగారి అవగాహనకు వచ్చాయి. వాటివెనక కారణాలూ సంబంధాలూ మనసుకు పట్టాయి. ఆ ఆలోచనల్లోంచి వచ్చిన ‘యజ్ఞం’ కథ ఈ విషయాలు చిత్రిస్తుంది. చర్చిస్తుంది. ఏం రాయాలి! ఎలా రాయాలి? అన్న ప్రశ్నలకు రామారావుగారు యజ్ఞం కథ ద్వారా సమాధానం ఇచ్చుకోగలిగారు. ఆ జవాబుతోనే రెండవ దశ కథలు కుట్ర, జీవధార లాంటివి రాశారు’ అంటారు మూర్తి.

ఇలా ఒక ముఖ్యమైన రచయితను ప్రధానంగా తీసుకొని, ఆయన జీవన ప్రస్థానాన్నీ సాహితీ పరిణామాన్నీ జమిలిగా పరిశీలించి, ఆయన చదువు, వృత్తి, నేపథ్యం, జీవన విధానం, స్నేహాలు, విలువలు, నియమాలు ఎలా అతని జీవితాన్ని ప్రభావితం చేస్తాయో, ఆ ప్రభావం అతని రచనల్లో ఎలా క్రమం తప్పకుండా ప్రతిఫలిస్తుందో నిర్ద్వంద్వంగా నిర్ధారిస్తారు ఈ ‘రచయిత జీవితమూ, రచనా’ అన్న వ్యాసంలో వివినమూర్తి, ఈ అరుదైన ప్రయత్నం ఒక అంతులేని ప్రశ్నకు సమర్థవంతంగా జవాబు చెప్పిందని నేను భావిస్తాను.


వివినమూర్తి కథారచయితగా, నవలా రచయితగా ఒక తరం వారికి సుపరిచితుడు, గత నలభై ఎనిమిదేళ్ళుగా తన రచనలను ప్రచురిస్తున్నవాడు. ఈ తరంలోనూ ఆలోచనాపరమైన పాఠకుల్ని చదివించే రచనలు చేస్తున్నారు. కథలూ నవలలతోపాటు సాహిత్యానికి చెందిన అనేకానేక విషయాలమీద ఎన్నెన్నో వ్యాసాలు రాసిన ఆలోచనాపరుడు వివినమూర్తి, ఆ వ్యాసాలలో కొన్నిటి ఆధారంతో ఆయన నేపథ్యాన్నీ, రచయితగా ఆయన పరిణమించడాన్నీ, ఆయన మీద ఇతరుల ప్రభావాన్నీ, సాహిత్యపు మౌలిక విషయాలమీద ఆయన ఆలోచనలనూ విహంగవీక్షణం – అవును, విహంగ వీక్షణమే చేశాను. ఆ విషయాలమీద మరింత పరిశీలన, పరిశోధన చేసి మరింత సమర్థవంతమైన ఎసెస్మెంట్ చెయ్యవలసిన అవసరం ఉంది. అంతకన్నా ముందుగా ఆయన ఎంపికచేసిన వ్యాసాలన్నిటినీ పుస్తక రూపంలో భద్రపరచుకోవలసిన అవసరం తెలుగు సాహిత్యానికి ఉంది. ఆ పని అతి త్వరలో జరగాలని నా ఆకాంక్ష.