ఊరి కథ

అనంతాకాశంలోని
పావురాల గుంపు
గూళ్ళో బిడ్డలకు
గాలిదారులు చెప్పేదెలా అని చర్చపెడతాయా?

సాయంసంధ్య
ఒళ్ళువిరుచుకుని లేచే కుక్కకి
వాసనలు చూడని
బతుకే లేదని అనిపిస్తుందా?

అస్తమానం హోరెత్తించే
సముద్రపు గాలుల్ని చూసి
వీధి బిచ్చగాడు విసుక్కుంటాడా?

రావిచెట్టు కింద
సాధువు ఒకడు
ఆకలికి నిద్రలేస్తే
నెల తప్పలేని
పౌర్ణమి సాయంత్రం
రాజమందిరం మీద
వెన్నెల కురవడం ఆపేస్తుందా?