సెక్రెటరీ

మోకాళ్ళ వరకూ ఉన్న బూట్లు, పొడుగాటి ఉన్ని కోటు, మెడలో వేలాడే పొడుగు ఉన్ని స్కార్ఫ్, నెత్తిమీది ఊలు టోపీ, చేతిలో లెదర్ ఎటాషే. దాని మీద మెరిసే చిన్న పొడి అక్షరాలు, N. S. అని. నిసి షామల్ హాస్పిటల్ పక్క ద్వారం గుండా లోనికి వచ్చి కారిడార్‌లో నడిచి, రేడియేషన్ ఆంకాలజీ అన్న బోర్డ్ పెట్టి ఉన్న గుమ్మం ముందు ఆగింది. గట్టిగా శ్వాస తీసుకుని, టోపీ తీస్తూ, గుమ్మం ముందున్న పట్టా మీద కోటు విదిలించి, పట్టామీద బూట్లతో గట్టిగా కాళ్ళు దులుపుకుంది. కోటుకూ బూట్లకూ ఇంకా అంటి ఉన్న మంచు జలజలా రాలింది. జుట్టు నుండి టోపీ నుండి మంచు నీటిచుక్కలు జారాయి. బాగ్ ఒక్క క్షణం కింద ఉంచి, టోపీ, గ్లవ్స్ దానిమీద వదిలి, రెండు చేతులతో, తలలోకి వేళ్ళు పోనిస్తూ స్కాల్ప్ రుద్దుకుని తన పొట్టి జుట్టు సవరించుకుంది. తల రెండుసార్లు ఎగరేసింది. చెంపలు కొంచెం రక్త ప్రసారం జరిగేలా రుద్దుకుంది. రెండుసార్లు ఊపిరి బలంగా పీల్చి వదిలి, వస్తువులన్నీ తీసుకుని, లోనికి వెళ్ళి నిసి షామల్, ఎం. డి. చీఫ్, రేడియేషన్ ఆంకాలజీ, అని చిన్న బోర్డు తగిలించి ఉన్న ఆఫీసులోకి నడిచింది.

కోటు, కాళ్ళకున్న పొడుగాటి లెగింగ్స్ అన్నీ తీసివేసి, నిసి తన బల్లముందు కూర్చుని, నేప్కిన్‌తో చేతికి తగలకుండా గ్లేజెడ్ డోనట్ తింటూ, కార్టన్ నుండి స్కిమ్‌డ్ మిల్క్ స్ట్రాతో తాగుతుంది. రోజూ ఆమె చీఫ్ టెక్నాలజిస్టు పెందలాడే, వేరే ఊరునుండి కారు నడుపుకుని వస్తాడు. హాస్పిటల్ కెఫెటేరియాలో తను బ్రేక్‌ఫాస్ట్ తిని వస్తూ వస్తూ నిసికి రోజూ ఓ డోనట్, పాలూ తెస్తాడు.

డోనట్ ఒక్క ముక్క ఇంకా గొంతులోకి దిగిందో లేదో, తలుపు మీద వేళ్ళతో టకటక శబ్దం. గుటక మింగి, “కమిన్, కమిన్,” అంది నిసి.

గుమ్మం దగ్గర ఒకళ్ళు కాదు. ఒకరి వెనక ఒకరు దాదాపు, తన డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే వాళ్ళంతా ఉన్నట్లున్నారు. అందరి ముఖాల్లో ఆందోళన. కొందరి ముఖాల్లో కోపం కనిపిస్తూంది. ఏమి మూడింది పొద్దున్నే?

“రండి. రండి. ఏదో విశేషమున్నట్లుంది. లెట్ అజ్ హియర్ ఇట్.”

జూలీ మరీనో పళ్ళు పటపటలాడించింది. జూలీ ఇటాలియన్ పిల్ల. బహు చక్కనిది. చాలా చురుగ్గా పనిచేస్తుంది. ధాటీగా మాట్లాడుతుంది. డిపార్ట్‌మెంట్‌లో చీఫ్ నర్సు. హాస్పిటల్లో కొంత శాతం డాక్టర్లు ఆమెతో ఎప్పుడూ ప్రేమలో ఉంటారు. అందులో ఆమె తప్పేం లేదు. ఆమె అందం అటువంటిది.

“ఏముంది! మళ్ళీ బండ భూతంగాడు, మన డిపార్ట్‌మెంట్ మీద దాడి చేశాడు.” అంది జూలీ. కొంతమంది కోపం మర్చిపోయి కిసుక్కున నవ్వారు. అందరూ లోపలికి వచ్చి, కొంతమంది చుట్టూ కుర్చీల్లో చనువుగా కూర్చుంటే, కొంతమంది గోడకు చేరగిలబడ్డారు.

“డాక్టర్ షామల్! మీరు నమ్మలేరు జరిగింది వింటే.” టామ్ కల్లిన్ సన్నగా పొడుగ్గా ఉంటాడు. ఆవేశంతో అతనికి కొంచెం వీజింగ్ వచ్చింది. అతనికి బ్రోంకియల్ ఆస్థమా ఉంది. పని చేస్తూ, మధ్య మధ్య ముక్కులోకీ, గొంతులోకీ మందుల స్ప్రేలు కొట్టుకుంటూ, అప్పుడప్పుడూ ఏంటీబయాటిక్స్ మింగుతూ పని చేసుకు పోతుంటాడు. ఎంతో మంచి మనిషి. అతని వీజింగ్ చూసి, పక్క ఉన్న ఎమిలీ కథ అందుకుంది.

“జాక్ హింకిల్ వచ్చి రెయిడ్ చేశాడు పొద్దున్నే. జాకాస్! మేము ముందు వెయిటింగ్ రూమ్‌లో నుంచుని కొంతమందిమి కబుర్లు చెప్పుకుంటున్నాం. పేషెంట్లు ఇంకా ఎవరూ రాలేదు అప్పటికి ఇంకా నయం. పిచ్చి వెధవ! వాడు వచ్చి, మార్లా డెస్క్ ముందు నుంచుని ‘నీ వస్తువులు మాత్రమే తీసుకుని, నువ్వింక ఇంటికి వెళ్ళవచ్చు. నీ ఉద్యోగం తీసేశాను’అన్నాడు” అని చెప్పింది ఎమిలీ.

నిసీ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. “మార్లానా? ఎందుకని?” అంది.

ఎమిలీ పీపర్ ఆవేశంతో, “ఎందుకనా? ఆ హిట్లరు హింకిల్ – ఇంకా ఇంత లావుగా ఉబ్బి, మార్లాని హాస్పిటల్ డబ్బు తీసుకుంటూ, అసలు ఉద్యోగం మానేసి, కంప్యూటర్ వాడటం మహా బాగా వచ్చు కదా అని ఆ ప్రోగ్రాములూ ఈ ప్రోగ్రాములూ ఎక్కించుకుని, వేరే పనులు చేసుకుంటున్నావా, హాస్పిటల్ టైమ్‌లో. ఎకౌంటెంట్ పని కూడా చేస్తున్నావు కదా. ఇదేం ఎచ్ అండ్ ఆర్ బ్లాక్ గాదు. ఇవిగో కాగితాలు, ప్రూఫ్. నీ కంప్యూటర్ నుంచి ప్రింట్ చేసినవి. అబ్బా! ఐ.ఆర్.ఎస్. టాక్సులు, వ్యవహారాలు కూడా నీకు తెలుసన్నమాట. అంత సమర్థురాలికి నీకీ సెక్రెటరీ డొక్కు ఉద్యోగం ఎందుకు. వెళ్ళిరా’ అన్నాడు, ఆ బండ హింకిల్ గాడు, డాక్టర్ షామల్!” అంది.

పక్కన జాకీ సాగించింది కథ. “అక్కడికీ మన జూలీ అడగబోయింది. నోటీసు ఇవ్వకుండా ఉన్న పళంగా ఇప్పటికిప్పుడు ఎలా పంపగలవు? అని. హింకిల్ – మా అందరి వైపూ వేలు చూపిస్తూ – ‘ఎవరి పని వారు వెళ్ళి చేసుకుంటే మంచిది. మీరెవరూ ఈ ముందు వెయిటింగ్ ఏరియాలో ఉంటానికి నాకేమీ కారణం కనబడటం లేదు’ అని మామీది మీదికి వచ్చాడు.”

జాకీ ఒక చిన్న పిట్టంత నల్ల నర్సు. జూలీకి ఉన్న పేరుప్రఖ్యాతులు లేకపోయినా, నిజానికి చాలా అందమైనది. ఆమె నేరేడు చాయ, ఆల్చిప్పల్లాంటి కళ్ళు, పగ్ నోస్, కొంచెం మోటు పెదాలూ – అబ్బో చాలా అందగత్తె.

నిసీకి లోలోపల కోపం వచ్చింది. ఆల్బర్ట్ హింకిల్ నిజంగా పెద్ద ట్రక్ అంత ఉంటాడు. ఈ చిన్నపిల్ల మీద మీదకి వెళ్ళటమేంటి, మర్యాదా మంచీ ఉండద్దూ?

జాకీ చెప్పుకుపోతున్నది. “మార్లా, పాకెట్ బుక్ తీసి తనే ఆమె చేతిలోకి తోసి, ఆమెను తలుపు తీసి బైటికి నెట్టాడు.”

నిసీకి కోపం రాజుకుంటున్నది. కాని ఆమె బైటికి కనిపించనివ్వలేదు. అందరి వంక చూస్తూ, “మరి డేనా కదా ఎడ్మినిస్ట్రేటివ్ అథారిటీ సెక్రెటరీల మీద. ఆమె మాట్లాడలేదా? మార్లా తరుఫున” అని అడిగింది.

అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కొందరు చిన్నగా నవ్వుతూ, తలకాయలూపుతూ బైటికి నడిచారు. వాళ్ళకు పేషెంట్ల వ్యవహారం చూసుకునే టైమ్ అయింది. జూలీ ఒక్కతే గదిలో మిగిలింది.

“నిసీ, నీ కసలు లోపలి వ్యవహారాలు, లోకవ్యవహారాలు తెలియవు. నువ్వు ఎక్కడుంటావో ఏమో?!” ఒక్కసారి ఆమె వంక విచిత్రంగా చూసి పెదవి, ముక్కు తమాషాగా విరిచింది. కుర్చీలో కొంచెం ముందుకు వంగి, “మన డేనాగారికి ఓ అంటే ఢం రాదని అందరికీ తెలుసు గదా! నీ ముందున్న చీఫ్‌గారు, ఆమె మగ బాస్‌గారు వెళ్ళిపోయారు. ఆమె నీకింద పని చెయ్యటానికి మంట మండుతున్నది. నువ్వంటే ఎప్పుడూ ఇష్టం లేదు కదా.”

నిసి నవ్వి” అది తెలుసనుకో, ఐనా” అన్నది.

“నీ టైపింగ్, స్కెడ్యూలు వ్యవహారం అంతా మార్లాకి అప్పజెప్పావు. క్లినిక్ మేనేజ్‌మెంటు, పేషెంట్లతో మాట్లాడే అథారిటీ అంతా నర్సులకిచ్చావు. ఎప్పుడో పదిహేను రోజులకో నెలకో, నువ్వెళ్ళే చీఫ్‌ల మీటింగులు కమిటీల మీటింగులు ఎంతసేపు రాస్తుంది కేలెండర్లో? అక్కడికీ గోళ్ళు రంగులేసుకుంటుంది. ఫ్రెండ్సుని పిలిచి, డేట్లు దొరుకుతారేమో అని కనుక్కుంటుంది. ఐనా ఎనిమిది గంటలు గడవాలిగా. సరిపడా పని లేదయ్యే.”

“పని చెయ్యటం ఎలాగూ రాదుగా, నువ్వన్నట్లు. ఐనా ఉద్యోగం ఉంచాముగా” అంది నిసి.

“అవుననుకో” నవ్వింది జూలీ. ఆ బొండాంగాడు అప్పుడప్పుడూ వస్తాడు. వాడితో మన డిపార్ట్‌మెంట్ వ్యవహారమంతా చెపుతుంది. వాడేమో, వేరే డివిజన్‌లలో ఎవరేం చేస్తున్నారో వాడికి అంతా తెలిసినట్లు ఆమెతో పోజులు కొడుతుంటాడు. ఈ మధ్య మార్లా మన జేనిటర్ లేరీతో కొంచెం వ్యవహారం నడుపుతూ ఉంది” చేతి బ్రేస్‌లెట్లను కొద్దిగా అటూ ఇటూ కదుపుతూ అంది.

“ఎలాంటి వ్యవహారం?”

“అబ్బా! ఇదెక్కడి గోల? అన్ని విడమర్చి చెప్పాలి మీకు. సాయంత్రప్పూట అందరూ వెళ్ళేసరికి గదా క్లీనింగ్ వాళ్ళూ వస్తారు. మార్లా కొన్నిరోజులు తను ఆలస్యంగా వచ్చి, అందరికంటే ఆలస్యంగా వెళ్ళే ఒప్పందం చేసుకుందా మీతో.”

“అవును మరి. ఆమె మొగుడు సుందరలింగం, ముగ్గురు పిల్లలను ఆమెకు ప్రసాదించి మళ్ళీ సిలోన్ వెళ్ళిపోయాడు. వాళ్ళను పొద్దున్నే తయారుచేసి, స్కూలుకు పంపాలా! వాళ్ళను పోషించటానికి తను ఉద్యోగం చేసి, మళ్ళీ ఇంటికి పోయి వాళ్ళకింత తిండి పెట్టాలా!”

“అదే! నీ లాగానే లేరీ గుండె కూడా కరిగింది. అప్పుడప్పుడూ ఆమెకు ఆ సహాయం, ఈ సహాయం చేస్తున్నాడు. కొంచెం రొమాంటిక్ ఇంటెరెస్ట్ మొదలయ్యిందనుకుంటా” అంది జూలీ గమ్మత్తుగా నవ్వుతూ.

“శివ శివా!” అంది నిసీ షామల్.

“ఏమిటి అంటున్నావు?” అంది జూలీ.

“జీసస్ క్రైస్ట్!” అంది సర్దుకుని నిసి.

“యా! ఈ ప్రేమ వ్యవహారం డేనా చూసింది. ఆమెకు గిట్టలేదు. మార్లాకి ఇట్లాంటివి కుదరవని చెప్పింది. ఆమేమో, ఇది నా పర్సనల్ విషయం, అని మర్యాదగానే చెప్పింది. ఐనా డేనా గిట్టక, హింకెల్ బాస్టర్డ్‌కు చెవిలో బోధ చేసింది. వాడికి కాలేజీ చదువు కూడా లేదని, ఏ పనీ చేతకాదనీ హాస్పిటల్లో అందరికీ తెలుసు. ఎట్లా వైస్ ప్రెసిడెంటు టైటిల్ పట్టాడో.”

“ఆ మధ్య క్వాలిటీ ఎస్స్యూరెన్స్ విప్లవం వచ్చినప్పుడు, పై లెవెల్ ఎడ్మినిస్ట్రేషన్ వారు చాలా తెలివిగా, డాక్టర్లను అదుపులో ఉంచడానికి, వాళ్ళు కర్రపెత్తనం చేస్తూ కాళ్ళు బార్లా చాపుకుని కులాసాగా మీటింగుల్లో కూర్చుని జల్సా చెయ్యటానికి, చదువు సంధ్యా లేని చాలామందిని, గబుక్కున ఘరానా టైటిల్స్ ఇచ్చి, ఒక్కొక్కరిని కొన్ని డిపార్ట్‌మెంట్లకు గూఢచారులుగా నియమించారు. వీళ్ళకు ఉత్త టైటిల్సే. వీళ్ళ పైవాళ్ళకు ఇంకా పెద్ద గౌరవ చిహ్నాలూ, బోనస్సులూ.

ఓకే జూలీ! పోయి పేషెంట్లను రెడీ చెయ్యి. మార్లా విషయం నేను ఆలోచిస్తాను.”

జూలీ వెళ్ళిపోయింది. నిసి, ఒక్క నిమిషం ఆలోచించుకుని, మార్లా ఇంటికి ఫోన్ చేసి ఆమె ద్వారా విషయం విన్నది, తర్వాత హాస్పిటల్ ఎంప్లాయీ డివిజన్ అధికారితో అపాయింట్‌మెంట్ తీసుకుంది, ఆ సాయంత్రానికి.

ఆ అధికారి థామస్ జాక్సన్ నల్లాయన. ఎంతో మర్యాదగా నిసిని ఆహ్వనించి “ఏం ఇలా వచ్చారు?” అన్నాడాయన.

“హాస్పిటల్ మీద లా సూట్ పడే అవకాశం ఉంది. మీకు చెపితే ఆ ఉపద్రవం తప్పిస్తారేమోనని.”

“చెప్పండి డాక్టర్!”

“నా సెక్రెటరీ ఒకామెని నోటీసు ఇవ్వకుండా తీసేశారు. మీరు ఆమె కాంట్రాక్టు చూడాలి. ఒప్పందం ప్రకారం ఆమెకు రెండు వారాల నోటీసు ఇవ్వాలి. పని ఎందుకు పోయిందో రాతపూర్వకంగా కారణం చెప్పాలి. కాని ఇదేమీ జరగలేదు. నా స్టాఫ్ నాతో, వైస్ ప్రెసిడెంట్ హింకిల్ వచ్చి ఆమెను అప్పటికప్పుడు పనిలోంచి తీసేసినట్లు చెప్పి ఆమెను బైటకు వెళ్ళగొట్టినట్లు తెలిపారు.”

“మీరు అతనితో మాట్లాడారా?”

“లేదు. ఈ పని చేసినట్లు నాకు చెప్పవలసిన బాధ్యత అతనిదే. చేసేముందే చెప్పాలి అసలు. అలా జరగలేదు. ఈ సెక్రెటరీ ఎంతో బాగా పని చేస్తుంది. ఆమె చేసేదంతా నేను ఆమెకు ఒప్పచెప్పే పనులే. మరి ఆ పని బాగున్నదో లేదో నాకు గదా తెలిసేది. నా దగ్గరినుండి ఏమీ ఫిర్యాదు లేకుండానే ఆమెను తీసివేశారు. మా డిపార్ట్‌మెంటులో ఆమెకు నేను అప్పజెప్పిన పనులు ఏమీ వెనకబడి లేవు. పైగా ఆమెకు పనిలో వేరేవాళ్ళకన్నా కంప్యూటర్ వాడటంలో ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి. నా కాన్ఫరెన్స్ స్పీచ్‌లకు కావాలిసిన మెటీరియల్, స్లైడ్ తయారీలు ఆమె ఎంతో చక్కగా చేస్తుంది. వేరే వాళ్ళకు నేర్పడానికి ప్రయత్నిస్తుంది కూడా. నిజంగా ఐతే ఆమెకు ఇంకా ఎక్కువ హోదా, ఎక్కువ జీతం ఉండాలి.”

నిసి మధ్యలో చెప్పేది ఆపి తనతో పాటు తెచ్చిన అటాషే తెరిచింది.

కాగితాలు వరసనే తీసి ఇస్తూ, “ఇదిగో నేను మూడు నెలలకోసారి చేసిన పని ఇవాల్యుయేషన్ రిపోర్ట్‌లు చూడండి. మీకు తెలుస్తుంది ఆమెను గురించి నేనేమి రాశానో. మీరు వచ్చి మా ఛార్టులు అవీ చూసి, ఆమె పని బాగుందో లేదో తనిఖీ చెయ్యవచ్చు. ఆమె మిమ్మల్ని కోర్ట్‌కు తీసుకు వెళ్ళవచ్చు. అలా జరిగితే, నేనామె తరుఫునే మాట్లాడుతాను. మీరు ఆమెకు సంవత్సరం అంతా ఇచ్చే జీతం కన్నా ఎక్కువ ఇవ్వాల్సి రావచ్చు.”

“నన్ను మిస్టర్ హింకిల్‌తో మాట్లాడనివ్వండి. నేను ఈ విషయం వెంటనే పరిశీలిస్తాను. దీన్ని నా గమనింపులోకి తెచ్చారు. సంతోషం.”

“మీరు చెప్పమంటే, నేను మార్లాతో మాట్లాడి ఆమె తొందరపడి కేస్ ఫైలు చెయ్యకుండా ఉండేట్లు చూస్తాను. నేను చెప్పినట్లు ఆమె చెయ్యక్కర్లేదు. అసలు నేను అలా చెప్పకూడదు కూడా. నా ఉద్దేశంలో ఆమె పనిలో పొరపాటు లేదని. ఈ కాగితాలు చూడండి. ఆమెకు తన డెస్కు దగ్గరే ఉండి, హాస్పిటల్ కంప్యూటర్ మీద ఎడిషనల్ పని చేసుకోటానికి ఆమెకు పర్మిషన్ ఇవ్వబడింది. ఇవిగో అంతకు ముందున్న చీఫ్, ఒక వైస్ ప్రెసిడెంటు సంతకాలు పెట్టిన కాగితాలు. ఈ కాగితాలు ఇప్పటికీ చెల్లుతాయి. వీటి గడువు దాటిపోలేదు. ఇవి కాపీలు. మీదగ్గరే ఉండనివ్వండి. వెంటనే మిమ్మల్ని కలవనిచ్చిందుకు మీకు ధన్యవాదాలు.”

జాక్సన్‌తో కరచాలనం చేసి నిసి వెళ్ళిపోయింది.

రెండు రోజుల తర్వాత మెడికల్ స్టాఫ్ మీటింగ్ అయ్యాక, అసలు వైస్ ప్రెసిడెంటులందరి బాస్, ఎక్సెక్యుటివ్ వి.పి., ఆల్బర్ట్‌ షార్పినొవ్ నిసి భుజం మీద చనువుగా చెయ్యేసి, “నిసీ ఇంకొంచెం సేపు ఉండు. నీతో మాట్లాడాలి.” అన్నాడు. నిసి టీ కలుపుకు తెచ్చుకోటానికి వెళ్ళింది. ఈ లోపల ఆయనతో మాటలు ముగించుకుని కొందరు ఇతర విభాగాల ఛైర్మన్లు, హాస్పిటల్ లాయర్లు, తదితరులు వెళ్ళిపోయారు.

టీ తెచ్చుకు కూర్చుంది నిసి. ఒకసారి సాభిప్రాయంగా వాచ్ చూసుకుంది. ఆల్బర్ట్ షార్పినోవ్ వెంటనే విషయంలోకి వచ్చాడు.

“హింకిల్ ఒక మామూలు టైపిస్టుని పంపించేస్తే, నువ్వు పోయి ఎంప్లాయ్‌మెంట్ రిక్రూటింగ్‌లో రిపోర్ట్ ఇచ్చావంట. ఆ అమ్మాయి వ్యవహారం ఏం బాగా లేదని అతను నాకు వివరించి చెప్పాడు. అసలిది నాన్ మెడికల్ విషయం. నీకు ఇంకో అమ్మాయిని రెండు మూడు రోజుల్లో అతనే యేర్పాటు చేస్తాడు.”

“అలాగే చెయ్యండి. హాస్పిటల్లో ఉన్న ఇతర టైపిస్టులు ఏమీ కనుక్కోకుండా వచ్చి ఆ ఆమ్మాయి సీట్లో కూర్చుంటారా? అంతకు ముందున్న అమ్మాయిని ఉన్నపళంగా పంపించిన విషయం వాళ్ళకు పట్టదా?”

షార్పినోవ్‌కి కోపం వస్తున్నది.”సర్లే! బైటినించి తెస్తాడు. బోలెడు సర్వీసులున్నాయి ఊళ్ళో.”

“ఏదీ. ఇంతమట్టుకు మీరు ఎవరినీ ఇంటర్‌వ్యూకి పిలిచినట్లు ఆ ఆఫీసులో నాకు చెప్పందే. వాళ్ళకి తెలియకుండా టెంపరరీగా ఐనా ఎలా తెస్తారు? నా రిపోర్ట్‌లు టైమ్‌కి వేరే డాక్టర్లకు చేరకపోతే పేషెంట్లకు ఇబ్బంది కాదా? మామీద కంపైంట్లు వస్తాయి. నా ఉద్దేశంలో ఆ అమ్మాయి చేసేది చాలా ముఖ్యమైన పని. మీరు ఫైర్ చెయ్యదలిస్తే ముందు ఇంకో అమ్మాయినో, అబ్బాయినో, అక్కడ కూర్చోపెట్టి అప్పుడు ఈమెను తీసెయ్యాలి. ఏదో రేడియేషన్ హాజర్డ్ వచ్చినట్లు అంత ప్రమాదం ఏం వచ్చింది ఆమెతో? ఈ విషయం నేనే టైపు చేసి మెడికల్ డైరెక్టర్‌కి పంపుతాను. వచ్చేవారం మీటింగులోనే మాట్లాడుకోవచ్చు. మీటింగు ఐపోయాక ఎందుకూ?”

కుర్చీలో వెనక్కు వాలాడు షార్పినోవ్. రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు. జుట్టు సర్దుకున్నాడు.

“నిసీ! నువ్వూ నేనూ మంచి స్నేహితులం అవునా!”

“అవును. నిజం.”

“ఎన్నోసార్లు నేను మూర్ఖంగా ప్రవర్తించబోతే నువ్వు నన్ను మందలించేదానివి. అవునా?”

“నిజమే. నా సలహా నువ్వెప్పుడూ గౌరవించేవాడివి. యూ ఆర్ ఎ స్మార్ట్ గయ్.”

“నీ ఉద్యోగం రిస్కులో ఉంది. పోయి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తో మాట్లాడుకో అని చెప్పానా, లేదా? నీ ఉద్యోగం గురించి ఏం బాధ లేదన్నావ్. ఈ అమ్మాయ్ ఉద్యోగం సంగతి నీకెందుకు దురద?”

నిసికి నవ్వొచ్చింది. “ఎందుకా? మార్లా బాగా పని చేస్తుంది కనక. హాస్పి‌టల్లో అలాటి వాళ్ళుంటం మంచిది కనక. అడ్మినిస్ట్రేషన్‌కి కూడా మంచి డాక్టర్లుండాలని తపన ఉండాలి. అది మీ ఆరోగ్యానికి మంచిది. షేర్ హోల్డర్లూ, కొంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లూ కలిసి, హాస్పిటల్ని ముంచుతున్నారు. మంచి డాక్టర్లు వెళ్ళిపోతున్నారు. కొత్తవారు వస్తారని మీరు ఆశపడుతున్నారు.”

“నిసీ! నువ్వు చిన్న విషయాల్లో తలదూర్చటం మానేస్తే ఎంతో పైకి వెడతావు.”

“ఆల్! నేను నా డిపార్ట్‌మెంట్ చీఫ్‌ని. నేను పైనే ఉన్నా. పైకి రావటం అంటే ఏమిటి? ఇంకా ఎంత పైకి వస్తే నేను వృద్ధిలోకి వచ్చినట్లు నీకు తెలుస్తుందోయ్ మిత్రమా!” అంది నిసి లేవటానికి సిద్ధమౌతూ.

“నిసీ! నువ్వంటే, హాస్పిటల్లో ఎంత గౌరవం ఉందీ?” అన్నాడు జాలిగా షార్పినోవ్.

“అదెక్కడికి పోదులే. హాస్పిటల్ మూతపడకుండా ఉండేట్లు చూసుకో,” అని వెళ్ళిపోయింది.

మరుసటి రోజు ఊళ్ళో పాథాలజీ సమావేశంలో, స్నేహితుడు రాబర్ట్ లిప్స్‌టైన్ పారిస్ నుంచి వచ్చి, నాలుకకి వచ్చే కార్సినోమా గురించి మాట్లాడబోతూ, ఆమెను వింటానికి పిలిచాడు. స్పీచ్ అయ్యాక ఇద్దరూ లంచ్‌కి వెళ్ళి అంతకు ముందు వాళ్ళు ఆల్బర్ట్ ఐన్‌స్టయిన్ హాస్పిటల్లో పని చేసినప్పటి సంగతులు గుర్తు చేసుకున్నారు. అక్కడే వాళ్ళకు విజిటింగ్ ఫ్రెంచ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్‌లతో పరిచయం కలిగింది. రాబర్ట్‌ హెడ్ ఎండ్ నెక్ కాన్సర్ మీద ఇంట్రెస్టుతో వారితో కలిసి ట్రైనింగ్‌కు పారిస్ వెళ్ళాడు.

“బాగా మాట్లాడేవోయ్ సన్నాసీ! వెధవ ఫ్రెంచ్ యాస తప్పించి. ఆ ముక్కుతో మాట్లాడుతుంటే నీకు గానీ నాలుక ప్రాబ్లమ్ ఉందనుకుంటారేమో అని నా గుండెలు తటతటలాడిపొయ్యాయి.” అంది ఏడిపిస్తూ నిసి.

“సోది చెపుతావ్. కుళ్ళు నేను పారిస్‌లో ఉన్నానని. సర్లే గాని, మద్రాసులో మొట్టమొదటి ఇంటర్‌నేషనల్ కాన్సర్ సమావేశం జరగబోతున్నది. బ్రెస్ట్ కార్సినోమా గురించి మాట్లాడటానికి నీ పేరిచ్చాను. వాళ్ళు పిలుస్తారు నిన్ను. డబ్బేం ఇవ్వలేరు. దారి ఖర్చులు కూడా నువ్వే పెట్టుకోవాలి మరి.”

“తెలిసిందిలే. ఇకనేం. అందుకే నా పేరిచ్చావ్.”

“మదామ్. ఎక్కడో అక్కడ పని మొదలవ్వాలిగదా. ముందు ఎవరో నీలాంటి కొందరు ఉదారత చూపిస్తే, అప్పటికి ఈ రేడియేషన్ మెడిసిన్‌లో వచ్చిన ప్రోగ్రెస్ చూపిస్తే, ఇండియాలో ఉన్న డాక్టర్లకు వేరే దేశాల్లో సంగతి సమాచారాలు తెలుస్తాయి. ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు. అంతే గదా! తర్వాత వెళ్ళే డాక్టర్లకు వారు డబ్బివ్వగలుగుతారు. అయినా, ఎంత డబ్బున్నా పాతరేసుకుంటారా! పన్నెండు సార్లు తింటారా రోజుకి. నాలుక మీద…”

“వద్దు నాయనా. వద్దు. ఇప్పుడేగా నీ ప్రెజెంటేషన్ విని ఆ ఘోరమైన స్లయిడ్లన్నీ చూసింది. లంచ్ తిననీవోయ్.”

మళ్ళీ నిసి హాస్పిటల్‌కి తిరిగి వచ్చేసరికి, హింకిల్ గుమ్మం ముందు ఉన్నాడు. విష్ చేసి లోపలికి పోబోయింది.

“కొంచెం మీతో మాట్లాడాలి” అన్నాడు గుండ్రాయిలా గుమ్మం ముందు నించొని.

టైమ్ వేస్ట్ అని లోపల అనుకుని, “ఇద్దరు పేషెంట్లు గదుల్లో ఉన్నారు. వాళ్ళను చూశాక” అని వెళ్ళిపోయింది.

వాళ్ళని చూసి వచ్చేసరికి మళ్ళీ గుమ్మం ముందు అతనే.

“ట్యూమర్ బోర్డుకి టైమయింది. సాయంత్రం అయిదింటికి?” అంది నిసి.

“ఎలివేటర్ దాకా మీతో కలిసి వచ్చి మాట్లాడతా” అన్నాడు హింకిల్.

“ఓ! జూలీ ఊరుకోదు. ఆ సమయంలోనే ఆమె నాకు రేపు చూడాల్సిన వారి విషయాలు చెపుతుంది.”

సాయంత్రం ఐదింటికి మళ్ళీ హింకిల్.

“మర్చేపోయా! ఈ రోజు ఊళ్ళో మెడికల్ సొసైటీ మీటింగ్. కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంటు గురించి నేను నాలుగు మాటలు చెప్పాలి” అంది నిసి.

“మిమ్మల్ని నేను నా కార్లో డ్రాప్ చెయ్యనా? బైట అసలే స్నో పడుతున్నది. మళ్ళీ మీరు ఫోన్ చేసినప్పుడు వచ్చి ఎక్కించుకుంటా” అన్నాడు హింకిల్.

“కాని జాన్ ఊరుకోడే. అతను ఒక పేపర్ ప్రెజెంట్ చేస్తున్నాడు. అది సరిగ్గా ఉందో లేదో, కార్లోనే నేను సరిచూడాలి. ఇద్దరం కలిసి వెళ్ళి, మీటింగ్ అయ్యాక నన్ను ఇంటి దగ్గర దించి రేపు మళ్ళీ ఎక్కించుకునేట్లు ఒప్పందం. అతని అవసరం మరి.”

హింకిల్‌తో మాట్లాడనే లేదు నిసి. రెండు రోజుల తర్వాత ఆమె ఆఫీసుకి థామస్ జాక్సన్ వచ్చి కలిశాడు.

“డాక్టర్ షామల్! మార్లా రేపటినుంచి పనిలోకి రావటానికి ఒప్పుకున్నది. మేము ఆమెతో పొరపాటు జరిగిందని రాతపూర్వకంగా క్షమాపణ చెప్పుకున్నాము. ఆమె పని తనిఖీ చేశాము. ఏమీ తప్పు లేదు. మీరు ఇమ్మన్నట్లుగా ఇంక్రిమెంటు ఇస్తున్నాము.”

“చాలా సంతోషం” అంది నిసి ఉషారుగా.

“మీకు టైపిస్టు లేకుండా ఇన్నాళ్ళూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. మీరు ఎంతో బిజీగా ఉండి కూడా, వెంటనే మమ్మల్ని వార్న్ చేశారు. మీనుంచి ఫీడ్‌బేక్ లేకపోతే కొంతమంది అడ్మినిస్ట్రేటర్లు ఏం చేస్తున్నారనేది మాకు తెలిసే అవకాశం ఉండదు. హాస్పిటల్‌కి మంచి పనివాళ్ళూ దొరకరు” అన్నాడు.

అతను కొంచెంసేపు ఆ కబురూ ఈ కబురూ చెప్పాడు. వెళ్ళేముందు దగ్గరగా వచ్చి నుంచుని కొంచెం తటపటాయిస్తూ “ఇన్ని సంవత్సరాలు పనిచేశాను. నా సర్వీసులో ఒక డాక్టరు, ఒక చీఫ్ ఆఫ్ సర్వీస్, ఒక మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్టు తరుఫున నా ఆఫీసుకి రావటం, అదీ కావలిసిన కాగితాలన్నీ కాపీలు తీసుకు రావటం – ఇదే మొదటి సారి. అమెరికన్ లా, ఉద్యోగుల హక్కులు గురించి చక్కగా అర్థం చేసుకుని అమలు జరిపారు. గాడ్ బ్లెస్” అని వెళ్ళిపోయాడు.

అతని కళ్ళలో నీటి పొర, కంఠంలో వణుకు నిసికి స్పష్టంగా తెలిశాయి. రోజువారీ చెయ్యాల్సిన చిన్న పనులకు మనుషులు ఎందుకు ఉద్రేకపడతారో, కంగారుపడతారో ఆమెకు అర్థం కాదు. ఆమె బల్ల మీద, ఆమె స్నేహితుడు ఆల్బర్ట్ షార్పినావ్ సంతకంతో వచ్చిన ఒక ఉత్తరం మీద ఆమె కళ్ళు నిలిచాయి. అందులో ఆమె పేరు, షార్పినావ్ పేరు, హాస్పిటల్ పేరూ అన్నీ తప్పులే.

(ప్రథమ ప్రచురణ: తెలుగునాడి, ఏప్రిల్ 2008)