పుత్తడి బొమ్మలాగో
వెండి ముగ్గులాగో
అప్పుడప్పుడు
పుచ్చిపోయిన దంతాల్లాగో
చింపిరి కాన్‌వాసుల్లాగో
ఎప్పట్నించో కన్పిస్తున్న
ప్రకృతి శోభల్ని
చూసి చూసి
చూసి
ఇక లాభం లేదని
ఇక నష్టమూ లేదని
ఇక ప్రయోజనమూ లేదని
ఇంకా ఆలశ్యం ఎందుకని
ఇప్పుడే ఈ చీకట్లో కూచుని
వదిలేను నాలుగు రాక్షస గేదెల్ని
గజేంద్రుళ్ళలా గునగున మంటూ
ఒళ్ళంతా వూపుకుంటూ పరిగెత్తే గేదెల్ని
తిరగళ్ళలాంటి దవడల్తో కొమ్ముల్తో
కుమ్మమని కుప్పలుగా పోయమని
దొరికిందంతా దొరకపుచ్చుకుని
బజార్లమీద పడి
పొలాలమీద పడి
థుక థుక
థప థప
ఛరక్ ఛరస్ అంటూ
అంతట్నీ దవడల్తో పీకి లాగి లాగి
చరా చరా నమలమని
అది కాక
నాలుగు రాక్షస రైళ్ళని పిలిచి
తోలేను నాలుగు వైపులా
రాళ్ళనీ స్లీపర్లనీ పీకి పారేయించిన
పట్టాల మీంచి ఠక ఠక ఠకాల్మంటూ
దొర్లుకుంటూ పొర్లుకుంటూ వెళ్ళమని
పట్టాల్ని యిష్టమొచ్చినట్లుగా తిరగదోస్తూ
పక్కనున్న రాళ్ళు గాలిలో కొండల్లా
ఎగిరెగిరి పడుతూంటే
విరిగి ముక్కలయిన స్లీపర్లని… ..
ప్రస్తుతానికి యిది చాలని
తరవాత్సంగతి తరవాచ్చూసుకుందామని
ఎప్పుడో ఒకప్పుడు ముంచుకొస్తే
ప్రకృతినంతా మంచుతో మొత్తం కప్పి
మెరుపులు ఝళిపించి
మెరికల్లాంటి కొండల్ని నిలువుగా చీల్చి
ముదురు పాదాల వృక్షాలన్నిట్నీ
కూకటి వేళ్ళతో సహా
భూమ్మీదికి పడగొట్టి…
యింకా యింకా చాలా
ప్రణాళికలున్నాయి
ఆలోచిస్తే
జాగ్రత్తగా కలుగ జేసుకుంటే
అంతా మొత్తంగా మాడాలని
మనిషికూడా మారాలని
కలుగ జేసుకోక పోతే
మహా ముప్పు ముంచుకొస్తుందని….
కానీ …..
ఒక కావ్యం చదివిన కాఫ్కా తరువాత
త్రిపుర
ఒక గొప్ప కవితో కావ్యమో చదివినప్పుడు
విజృంభించిన ఒక మహా కెరటంలో కొట్టుకుపోవచ్చు
మనం మనకి నిప్పంటించుకుని
ఆ మంటలో మసైపోవచ్చు
ఎవరి ఏ ఆజ్ఞలూ లేకుండానే అన్నిట్నీ శిరసావహించవచ్చు
ఒక ఖాళీ గది మధ్యనున్న ఒకే ఒక కుర్చీలో
నేల వైపు చూస్తూ కూచోవచ్చు
“పదండి ముందుకు” అని అరుస్తూ
రెండు కొండల మధ్య నిలబడి
ప్రతిధ్వనిగా మన కేకే విని
లోయల్లొంచీ
గోర్జీల్లోంచీ
కొండల వాలుల్లోంచీ
పరిగెడుతూ వచ్చే
మనుషుల్తో కలిసి ముందుకు కదలొచ్చు
లేక ఆ కవితనో కావ్యాన్నో
మధ్యలో వదిలేసి పారేసి
యింట్లోంచి లేచి
పైకి పోవచ్చు
ఖాళీ కళ్ళతో
తలని అటూ ఇటూ వూపుకుంటూ