భావికెరి కుప్పన్న భట్ట, సెబినకరి అప్పన్న భట్ట ఒక చోట ఉంటే పామూ ముంగిసా ఎదురుపడినట్టే.
ఇద్దరూ శ్రీ నరసింహస్వామి మఠం ఆస్తుల్లోని వక్క తోటల్ని కౌలుకి తీసుకుని సాగుచేస్తున్నారు. ఇళ్ళు కూడా కొండ మీద అరమైలు దూరంలో విసిరేసినట్టు ఉంటాయి. ఇద్దరి తోటల్నీ వేరు చేస్తూ కంచె. ఒకప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేనిస్థితిలో రాగి చెంబు పుచ్చుకుని వక్క తోటల్లో పని కోసం వచ్చి ఇప్పుడు కౌలుదారులయ్యారు. అక్కడికి ఆరుమైళ్ళ దూరంలో ఉన్న గోపాల కామత్ సరుకుల దుకాణంలో ఇద్దరికీ ఇపుడు ఖాతాలున్నాయి.
ఇద్దరిలో కుప్పన్న భట్ట పెద్దవాడు. ఎండిపోయిన మాగాయ ముక్క మీద మొహం బొమ్మ గీసినట్టు ఉంటాడు చూడ్డానికి. రెండేళ్ళ క్రితం వరకూ కుండపగలేసినట్టు మాట్లాడే తత్వానికి పెట్టింది పేరు కుప్పన్న. ఇప్పుడు అతని పరిస్థితి పెద్దగా బాగాలేకపోయినా, మనిషి తత్వం మాత్రం మారలేదు. అదే మెరిసే నున్నటి బట్టతల, బండ ముక్కు, వొంపు తిరిగిన దవడ వల్ల మామిడి కాయలా కనపడే మొహం. చురుకైన చిన్న కళ్ళు ఇప్పుడు పొరేదో అడ్డంపడ్డట్టు తెల్లగా మారాయి. కట్టుకున్న ధోవతి మీద, భుజాన వేసుకున్న ఉత్తరీయం మీద పడ్డ అరటి బోదెల మరకలు, అతన్ని ఎప్పటికీ వదలని అప్పులల్లే! ఇప్పటికీ బుగ్గలో పొగాకు దాస్తాడు. ఇదివరలో అయితే, అతనికి కోపం వచ్చినపుడు, అవతలి వ్యక్తి మాట్లాడ్డం అయ్యేదాకా ఆగి, ఒక మూలకు పోయి నోట్లోని పొగాకు ఉమ్మేసి వచ్చి, మొహం పగిలేలా మాట్లాడితే, అవతలి మనిషి నోట్లో నుంచి మాట వచ్చేదా అసలు? ఎందుకో ఈ మధ్య అతని మొహం తాళం వేసిన తలుపులాగా బిగుసుకుపోయి ఉంటోంది. ఎవరన్నా అతనితో గొడవపడాలని వచ్చినా ‘నీకూ నాకూ మధ్య ఏమీ లేదు ఫో’ అన్నట్టు చూస్తాడు.
ఇహ అప్పన్న భట్ట, అందరితో కలిసి మెలిసి మెలిగే మనిషి. అప్పుడే తీసిన వెన్నలోంచి వెంట్రుక ఎంత మృదువుగా జారిపోతుందో, అంత మృదువుగా మాట్లాడతాడు. దగ్గరలోని బుక్లాపుర అగ్రహారం బ్రాహ్మల్లో కూడా అతనికి స్నేహితులున్నారు, నిజం చెప్పాలంటే వాళ్ళకీ కుప్పన్న భట్టకీ పడకపోవడమే అప్పన్న భట్టతో స్నేహానికి కారణం. అప్పన్న భట్ట ఇల్లూ, ఎస్టేటూ కూడా చూడ్డానికి శుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. గుమ్మం పక్కనే విరబూసిన చామంతులు, ఒక పక్కగా దుంగలతో చేసిన తెప్ప అందంగా కనిపిస్తాయి. వచ్చినవాళ్ళు కూచోడానికి రంగు రంగుల చాపలు పరిచి ఉంటాయి. ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ ఇవ్వకుండా పంపరు.
కుప్పన్న భట్ట ఇల్లు ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. ఎక్కడబడితే అక్కడ ఆవు పేడకళ్ళు, ఇంటి బయటే మలవిసర్జన చేసే పిల్లలు, చుట్టూ మూగే ఈగలు, తడికి పాక్కుంటూ వచ్చి కాలి వేళ్ళ మధ్య పట్టుకునే సన్నటి జలగలు. వీధులూడ్చే వాడి ఇల్లు ఇంతకంటే శుభ్రంగా ఉంటుందంటాడు అప్పన్న భట్ట.
గోపాల కామత్ కొట్లో కుప్పన్న బాకీ ఏటికేడాదీ పెరుగుతూ పోయి వెయ్యి దాటేసింది. అప్పుడప్పుడు గోపాల కామత్ పంపే మనిషి కుప్పన్న ఇంటికి పోయి డబ్బు కట్టమని అడగటం అందరికీ తెలుసు. అప్పన్న భట్ట గోపాల్ కొట్లోనే కాదు, మఠం కౌలు కూడా ఏడాది చివర్లో పైసా కూడా బాకీ లేకుండా తీర్చేస్తాడు. మఠం నుంచి కౌలు వసూలుకు వచ్చే మనిషికి అప్పన్న భట్ట ఇంట్లో సకల మర్యాదలూ దక్కుతాయి కూడా.
కుప్పన్న ప్రకారం అతను మఠానికి ఐదువేల రూపాయల వరకూ బాకీ ఉన్నాడు. ప్రతి యేటా పది పన్నెండు బస్తాల వక్కలు తక్కువ పడతాయి (బస్తాకి 37 కిలోలు). బాకీ మొత్తం చెల్లించాలని, లేకపోతే కౌలు రద్దు చేస్తామని మఠం అతన్ని హెచ్చరించింది కూడా. మఠాధిపతి స్వామీజీ కాశీ వెళ్ళక ముందు అప్పన్న భట్ట ఆయన్ని తన ఇంటికి ఆహ్వానించాడు. ఒక వెండి పళ్ళెంలో 50 వెండి నాణాలు పెట్టి స్వామి పాదపద్మాలకు సమర్పించుకున్నాడు భక్తిగా.
కుప్పన్న పరిస్థితి దిగజారడానికి కారణం అతనే అని అతని సొంత బావమరిది కూడా విసుక్కున్నాడు.
“నా నీడన్నా అతనికి పడదు, సరే, మీరందరూ అతనికేం చేశారు? తన పెద్ద కొడుకు ఒడుగు అంత డబ్బు ఖర్చుపెట్టి బస్సులో అంత దూరం పోయి ఆగుంబెలో చేయకపోతే, అదేదో ఇక్కడే చేసి మీ అందరినీ భోజనానికి పిలవొచ్చుగా? మంచం ఉన్నంత వరకే కాళ్ళు జాపుకోవాలి” అని అప్పన్న భట్ట అంటే అగ్రహారం బ్రాహ్మలంతా అవునని తలాడించినవాళ్ళే.
భర్త అలా నీరసంగా ఎందుకు కూచుండిపోయాడో కుప్పన్న భట్ట భార్య గౌరమ్మకు అంతు పట్టలేదు. ఎప్పుడూ ఉబ్బసంతో బాధపడుతూ ఒక మూల పడుండే గౌరమ్మకి కంగారు ఎక్కువైంది.
పొద్దు వాలింది. పక్షులన్నీ ఇళ్ళు చేరాయి. ఆవులు ఇల్లు చేరడం, వాటి పాలు పితకడం కూడా అయింది. కుప్పన్న కూతురు భాగీరథి పూజగదిలో దీపం పెట్టింది. కొడుకు లాంతరు గ్లాసు తుడిచి, వరండా గట్టు మీద వెలిగించి పెట్టాడు.
గౌరమ్మకి బాగా గుర్తుంది. రెండేళ్ళ నాడు ఎన్నడూ రాని అన్న సుబ్రహ్మణ్య తన ఇంటికి వచ్చాడు. ఇద్దరన్నదమ్ముల్లో ఒకడైనా బాగుపడి, వ్యవసాయం చేస్తూ ఇంత సంపాదించుకుంటున్నాడు. తన భర్త అలా ఎందుకు సంపాదించలేకపోతున్నాడు? నిజానికి అప్పన్న కూడా తన భర్త లాగే అదృష్టాన్ని పరీక్షించుకునేందుకే ఇక్కడికి వచ్చాడు. అతను బాగా సంపాదిస్తున్నాడు. మఠం స్వామీజీని ఇంటికి ఆహ్వానించేంతగా ఎదిగాడు.
భోజనాలయ్యాక స్వామీజీ తన శిష్యుల్లో ఒకరిని పంపారు కుప్పన్నని తీసుకురమ్మని. 30 ఏళ్ళుగా ఆ గడపలో అడుగు పెట్టని మనిషి, ఇపుడు మాత్రం ఎలా వెళతాడు? కుప్పన్న లోపలి గదిలోకి వెళ్ళి ‘నేను లేను, బయటికి వెళ్ళానని చెప్పు’ అని భాగీరథిని పంపాడు. ఇదంతా ఆయన ఖర్మ. లేకపోతే నిత్యం ఉబ్బసంతో నీలిగే తనను అతనికెందుకు కట్టబెడతారు పెద్దవాళ్ళు? అంతా తన దురదృష్టమే.
అవతల అప్పన్న భట్ట తోటల్లో వక్క విరగపండుతుంటే, కుప్పన్న పొలంలో తోటంతా తెగుళ్ళ పాలై కాయలు రాలిపోతున్నాయి. పనివాళ్ళెవరూ స్థిరంగా అతని దగ్గర పనిచెయ్యరు. అందరితోనూ గొడవలేనాయె. అతను గొడవపడని రెండు కాళ్ళ ప్రాణి ఆ చుట్టుపక్కల కనపడితే ఒట్టు. ఎవరినీ అలుసుగా తీసుకోడు, ఎవరికీ చెడు చేయడు. కానీ ఆ కోపమో! అతని జాతకమే అంత. చావబోయేలోగా ఇదంతా తను పడాల్సిందే.
తెప్పరిల్లింది గౌరమ్మ. ఆఁ, అదే… సుబ్రహ్మణ్య వచ్చాడు కాదూ అప్పుడు. ఎంత గౌరవించాడు!
“బావా, ఇక్కడ నీకు స్నేహితులు లేరు. మఠం వాళ్ళేమో తోట ఇచ్చెయ్యమని అడుగుతున్నారు. భాగీరథి చూడబోతే అరటి చెట్టులాగ ఎదిగి కూచుంది. ఆ తీర్థహళ్ళి వాళ్ళతో మాట్లాడబోతే అప్పన్న అడ్డుపడనే పడ్డాడాయె. ఎప్పుడూ కత్తి నూరుతూనే ఉంటాడు గదా. నిజం చెప్పాలంటే, ఈ తోట వ్యవసాయం నీకు అచ్చిరావడం లేదు. హలసూరులో నాకున్న ఐదు వందల ఎకరాల వక్క తోటలో నీకు కావలసినంత తీసుకుని చేసుకో, ఎవరొద్దన్నారు? మిగతాదే నేను చూసుకుంటాను.”
ఇంతకంటే మంచిమాట ఎవరైనా చెప్తారా?
కుప్పన్న పరశురాముడల్లే లేచాడు. “నేను చచ్చాక నీ చెల్లెల్నీ పిల్లలనూ తీసుకుపోయి చూసుకుందువులే. అప్పటిదాకా నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో!” అని మండిపడ్డాడు.
ఇప్పుడు ఆ కోపమంతా ఏమై పోయిందో! గోపాల్ కొట్టు నుంచి వసూలు గుమాస్తా, మఠం నుంచి ఏజెంటూ డబ్బుల కోసం పీడిస్తుంటే తట్టుకోలేక సగమైపోయాడు మనిషి. ఏనాడూ ఏదీ అడగని మనిషి తన దగ్గరికి వచ్చి ‘నీ నగలు ఇస్తావా? ఆర్నెల్లలో విడిపించి ఇస్తాను’ అన్నాడు.
అతని గొంతులో దైన్యం ఆమె గుండెలో కత్తిలా దిగబడింది. పెట్టె తీసి అందులోనుంచి నాలుగు పేటల చంద్రహారం, మరో గొలుసు, వడ్డాణం, జడ బిళ్ళ తీసి భర్త చేతికి ఇచ్చింది. అవన్నీ ఆమె పెళ్ళినాటి నగలు. భాగీరథి పెళ్ళి కోసం దాచి ఉంచింది.
‘నా భర్తను చల్లగా చూడు తండ్రీ! భాగీరథిని మంచి ఇంటికి పంపించు.’ మనసులోనే చేతులెత్తి మొక్కింది. ‘నా భర్త ఆత్మగౌరవం ముఖ్యం నాకు. ఈ నగలేం చేసుకోను?’
కానీ బంగారం లేకుండా పిల్లనెవరు చేసుకుంటారు? రోగాల పాలైన ఈ దేహానికి నగలతో పనేముంది? భర్తలో వచ్చిన ఈ మార్పు చూసి, తన అన్న ఒకసారి వస్తే బాగుండనిపించింది గౌరమ్మకి. అన్నయ్య వస్తే, చెప్పుకుని ఏడ్చి, కాస్తయినా బాధని దింపుకోవచ్చు.
వంటింట్లో తడి కట్టెలతో మండని పొయ్యిని వూది మంట తెప్పించే ప్రయత్నం చేస్తోంది భాగీరథి. మరి కొద్ది క్షణాలకు పొగతో మండుతున్న కళ్ళు తుడుచుకుంటూ, రేగిపోయిన జుట్టుతో, పాపం – ఇవతలికి వచ్చింది.
“అమ్మా, కూర వండటానికేమీ లేదు.”
“మరైతే, దోసగింజల చారు పెట్టు.”
కుప్పన్న హలసూర్ వెళ్ళొచ్చు గదా? ఇక్కడ అప్పన్న భట్ట యమదూత లాగ వెంటబడుతున్నాడు. వరద నీళ్ళు పొలంలోకి రాకుండా పెద్ద కట్ట కట్టగలిగినవాడు, పశువులు రాకుండా కంచె వేయించలేడా? కనీసం బయటికి తోలి ఊర్కోవచ్చు కదా? నాలుగు మైళ్ళ దూరాన ఉన్న బందెల దొడ్డికి తోలించాడు వాటిని. అవి తిరిగి వస్తాయని చూసి చూసి కుప్పన్న భట్ట చివరికి బందెల దొడ్డిలో రుసుం చెల్లించి వాటిని ఇంటికి తోలుకురావల్సివచ్చింది.
ఉబ్బిన పొట్టతో రోగిష్టిమల్లే ఉండే అయిదేళ్ళ కొడుకు గణపడు ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చాడు. “ఆ బియ్యం కడిగిన నీళ్ళుంటే వీడికివ్వు భాగీరథీ!” అన్నది గౌరమ్మ. తాము బతికున్నామో లేదో కూడా చుట్టుపక్కల ఎవరికీ పట్టదు. వయసులో ఉన్న పిల్ల కదా, ఎలా ఉన్నావమ్మా అని అడిగి ఒక మూర పూలైనా ఎవరూ ఆ పిల్ల భాగీరథి చేతిలో పెట్టరు.
నిట్టూర్చింది.
భార్య ఏ మాత్రం వెనకాడినా ఆ నగల్ని ముట్టుకోకూడదనుకున్నాడు కుప్పన్న భట్ట. కానీ ఆమె మారుమాటాడకుండా ఇచ్చింది. ‘అప్పులన్నీ తీర్చేయడానికి ఇదే చివరి అవకాశం.’ కుప్పన్న నగల్ని రెండువేల ఐదువందలకు బ్యాంకులో తాకట్టుపెట్టాడు. ఆర్నెల్లలో వాటిని విడిపించి తీరాలని నిశ్చయించుకున్నాడు.
తరవాత వందా రెండొందల వక్క చెట్లు ఉన్న చిన్న తోటల్ని ఎంచుకుని, రైతులకు బస్తాకు 25 రూపాయల చొప్పున అడ్వాన్స్ చెల్లించాడు. పంట అమ్మాక మిగతా 25 రూపాయలూ ఇచ్చేట్టు ఒప్పందం. నిజానికి అప్పన్న భట్ట కూడా బస్తాకి 47 రూపాయలకంటే పెట్టనూ లేదు, 15 రూపాయలకంటే అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు.
“పంట రేటు కాస్త పెరగ్గానే చెప్పండి, మార్కెట్‌కి పంట తోలిస్తాను.” షిమోగా వ్యాపారులకు చెప్పాడు. అప్పన్న ఇదంతా తెలిసి రగిలిపోయాడు. కుప్పన్న దగ్గర డబ్బుండీ కౌలు కట్టకుండా మార్కెట్లో ఆ డబ్బుతో బేరాలు సాగిస్తున్నాడని ప్రచారం చేశాడు.
కూచుని, అప్పులు ఎలా తీర్చాలో జాగ్రత్తగా లెక్క వేశాడు కుప్పన్న.
ఐదు వేల రూపాయలు మఠానికి, వెయ్యి రూపాయలు చిల్లర కొట్టుకి బాకీ ఉన్నాడు.
భార్య మందులకు ఐన అప్పు మరో మూడొందలు.
బాంకు నుంచి తెచ్చిన అప్పు మీద కట్టాల్సిన వడ్డీ.
భాగీరథి పెళ్ళికి కావలసిన మొత్తం.
నగలు ముందు విడిపించాలి. వచ్చే ఏడాది కుదువ పెట్టడానికి పనికొస్తాయి. వక్క ఈ ఏడాది బస్తా 60 రూపాయలకైనా పోతుందని అంచనా. ఆ లెక్కన వెయ్యి రూపాయలు లాభం మిగులుతుంది. 50 రూపాయలు గౌరమ్మ మందులకు వంద రూపాయలు గోపాల్ కామత్‌కి, 250 మఠానికి ఇస్తే సరి. మిగతా డబ్బుల్తో నగలు వెనక్కి తెస్తే, వచ్చే ఏడు పెట్టుబడికి ఉంటుంది.
మడమ మీద దోమ కుట్టిన చోట గోక్కుంటూ లేచాడు. వాకిట్లో ఉన్న కలబంద కొమ్మలు పీకి తెచ్చి వసారాలో కట్టాడు దోమలు పోయేందుకు. దూరం నుంచి గౌరమ్మ గురక, పిల్లి కూతలు, రంపంతో చెక్కని కోస్తున్న శబ్దంతో వినపడుతున్నాయి.
“అమ్మకి ఏదైనా మందివ్వు భాగీరథీ!” అని జగలి (వరండా అరుగు) మీద జారగిలబడ్డాడు. వచ్చే వేసవిలో నేల మీద బండలు పరిపించాలి. వానాకాలంలో ఇంట్లో కురవని చోటంటూ లేదు. తేమ నిండిన గోడల నిండా గొంగళి పురుగులు. ఇంట్లో ఎక్కడ చూసినా తేమవల్ల పట్టుకున్న తెల్లటి బూజు, చివరికి దేవుడి పటాల వెనక కూడా.
లేచి నిలబడి బయటకు చూశాడు. కనుచూపు మేరలో అన్నీ పొలాలు, ఆ పైన అడవి. ఎవరో నడుస్తూ పోతున్నారు.
“ఎవరది?”
“అయ్యా, నేను మంజయ్యని.”
“నువ్వా? కట్టెలు కొట్టడానికి రాలేదేం?”
“సెబినకెరి అయ్యగారింట్లో ఆ పని అయ్యాక వస్తానయ్యా.”
నిస్సహాయంగా చూస్తూ, అరిటాకులు కోసుకు రావడానికి నడిచాడు. తిరిగొచ్చేసరికి కొడుకులు ముగ్గురూ బడి నుంచి వచ్చారు. భాగీరథి ఆవుల కోసం ఎదురు చూస్తోంది. మందేమీ పనిచేస్తున్నట్టు లేదు, గౌరమ్మ దగ్గు ఇంకా ఎక్కువైంది. గణపడు నోటి నిండా అటుకులూ బెల్లం కుక్కుకుంటూ ఒక మూల కూచున్నాడు.
వక్కలు బస్తా ధర 52, 53 రూపాయలు దాటి 55 వరకూ చేరింది. 60 వరకూ చేరాలని కుప్పన్న ఎదురు చూడటం ప్రారంభించాడు.
“మీ డబ్బంతా బూడిదలో పోసినట్టే!” అప్పన్న రైతులను ఎగదోశాడు. ఇంకా ఆగితే రేట్లు పడిపోతాయని భయం పట్టుకుంది వాళ్ళకి. ప్రతి రోజూ కుప్పన్న ఇంటికి వచ్చి, వెంటనే డబ్బు ఇచ్చెయ్యమని గొడవపెట్టడం ప్రారంభించారు. ఒక్క నెల ఆగమంటే ఆగేలా లేరు. తప్పనిసరి పరిస్థితుల్లో కుప్పన్న షిమోగా వెళ్ళి 15 రూపాయల వడ్డీకి రెండువేల ఐదువందల రూపాయలు అప్పుగా తెచ్చి రైతులకు బస్తాకి పది రూపాయల చొప్పున చెల్లించి, మిగతాది పంట అమ్మిన తర్వాత ఇస్తానన్నాడు.
ఇవన్నీ చూసి అప్పన్న భట్టకి ఇంకా మండిపోయింది. ‘కుప్పన్న దగ్గర డబ్బుంది. మీ బాకీ వసూలు చేసుకోడానికి ఇదే సమయం’ అని గోపాల కామత్‌ని, మఠం ప్రతినిధినీ ఎగదోశాడు. గోపాల కామత్ గుమాస్తా వచ్చి వరండా అరుగు మీద మఠమేసుక్కూచున్నాడు. కనీసం ఐదువందలైనా ఇవ్వకపోతే కదిలేది లేదని కేకలేశాడు. కుప్పన్న గట్టివాడు కాబట్టి సరిపోయింది గానీ ఇంకెవరైనా అయితే ఏడ్చేవాళ్ళే. అతని అరుపులకు గౌరమ్మకి భయంతో ఆయాసం ఎక్కువైంది. కుప్పన్న పరువు తీయాలన్నట్టు, ఆ దారి వెంట ఎవరైనా వెళ్ళడం ఆలస్యం, వాళ్ళు కనుమరుగయ్యే వరకూ గుమాస్తా అరుపులు కొనసాగాయి.
తప్పనిసరై కుప్పన్న లోపలికి వెళ్ళి వందరూపాయల నోట్లు నాలుగు తెచ్చి గుమాస్తాకిచ్చాడు. ఆ డబ్బు తీసుకుని పోతూ పోతూ అతడు అప్పన్న భట్టు ఇంటి దగ్గర ఆగి జరిగింది చెప్పి, ఒక గ్లాసు కాఫీ సేవించి మరీ వెళ్ళాడు. గుమాస్తా వెళ్ళీ వెళ్ళకుండానే డాక్టర్ తాలూకు కాంపౌండర్ వచ్చి వంద రూపాయలతో శాంతించి వెళ్ళాడు.
ఇంకో వెయ్యి రూపాయలు మిగిలాయి. మరుసటి రోజు మఠం మనిషి రానే వచ్చాడు. “కాలు వాచి బాధపడుతున్నా కూడా ఇంతదూరం వచ్చాను. మేము కాక ఇంకెవరైనా అయితే మీతో చాలా కఠినంగా ఉండేవాళ్ళు. మఠానికి మీరు ఎన్నాళ్ళు మొహంచాటేస్తారు? స్వామీజీ అప్పన్న భట్ట ఇంటికి వచ్చినపుడు కబురంపినా రాలేదు. శ్రీ మఠం నరసింహుడిని మోసంచేసినవాళ్ళు బాగుపడరు, మర్యాదగా బాకీ కట్టండి.”
చిల్లర కొట్టు గుమాస్తాకి 400 దక్కాయని తెలిసే వచ్చాడతను. కుప్పన్న నచ్చజెప్తున్న కొద్దీ అతను రెచ్చిపోయాడు. “రేపు సెర్చ్ వారంట్ తెచ్చి ఇల్లంతా వెదికిస్తాను. ఆస్తుల్ని జప్తు చేయిస్తా ఏమనుకున్నారో!”
ఎనిమిదివందలు అతని చేతిలోకి వెళ్ళిపోయాయి. నోట్లు లెక్క పెట్టుకుంటూ “మళ్ళీ వచ్చే గడువు తేదీకి బాకీ మొత్తం కట్టాలి. లేదంటే గుర్తుంచుకోండి, పంట వదులుకోవాల్సిందే!” అని హెచ్చరించాడు.
ఆ మర్నాడే కుప్పన్నకి పంట అమ్మిన రైతులు వచ్చి వాకిట్లో నిల్చుకున్నారు. “భట్టగారూ, డబ్బుకి ఇబ్బందిగా ఉంది. వర్షాకాలం వచ్చేస్తోంది. ఇంట్లోకి సామాన్లు కొనిపెట్టుకోవాలి.”
కుప్పన్న చేతిలో కాస్త డబ్బు ఉన్న సంగతి లోకమంతా పాకిపోయినట్టుంది చూడబోతే. ఆ ప్రాంతంలో బస్తా వక్క రేటు 55 దాటలేదు. నిజానికి అది 50కి పడిపోయేలా ఉంది. కుప్పన్న బస్సులో షిమోగా వెళ్ళి కొంత సరుకు అమ్మి, వడ్డీతో సహా చేబదుళ్ళు తీర్చాడు. రైతుల బాకీ కూడా పూర్తిగా తీర్చేశాడు. ఇక బాంకులో నగలు విడిపిస్తే చాలు.
వర్షాకాలం వస్తుందనగా బావమరిది సుబ్రహ్మణ్య వచ్చాడు హలసూరు నుంచి. “బావా, అలా వెళదాం రా” అని బయటికి తీసుకెళ్ళాడు. “భాగీరథికి సంబంధం చూస్తాను. అక్క ఆరోగ్యం చూస్తే మరీ దిగజారిపోతోంది. ఆ గణపడు చూడు, పుల్లలా ఎలా తయారయ్యాడో!”
తర్వాత గౌరమ్మతో అన్నాడు “అక్కా, నా భార్య కడుపుతో ఉంది. భాగీరథిని పంపితే సహాయంగా ఉంటుంది. దానికి మంచి కుర్రాడిని నేను చూస్తాను. హలసూరు వచ్చేయ్ నువ్వు కూడా. అసలు నగలన్నీ బావకెందుకు ఇచ్చావ్? ఆ మనిషి ఎంత మొండివాడంటే, తన పంతమూ గౌరవమే ముఖ్యం గానీ పెళ్ళాం, పిల్లలూ ఇదంతా అనవసరం.”
“ఈ పరిస్థితిలో ఆయన్ని వదిలేసి ఎలా వస్తాను?”
“కొద్ది నెలలే కదక్కా రమ్మంటున్నాను?”
కుప్పన్న అవుననలేదు, కాదనీ అనలేదు. ‘గౌరమ్మ ఇష్టం’ అన్నాడంతే. గౌరమ్మ వెళ్ళాలా వద్దా అని ఊగిసలాడింది. భాగీరథికి పెళ్ళి చేయడం ముఖ్యం. దానికి సంబంధం ఎవరు చూస్తారు?
కుప్పన్న మినహా అందరూ హలసూరు వెళ్ళిపోయారు, సుబ్రహ్మణ్యతో.
వర్షాకాలమంతా కుప్పన్న ఒక్కడే కాస్త గంజి కాచుకుంటూ ఒంటరిగా గడిపాడు. వర్షపు శబ్దాన్ని వింటూ నిద్రరాని కళ్ళతో పైకప్పు చూస్తూ రాత్రుళ్ళు గడిపాడు. గౌరమ్మ దగ్గు, గురకలు లేని ఆ ఇల్లుని నిశ్శబ్దం మింగేసినట్టు ఉంది.
ఒక నిశ్చయానికి వచ్చాడు. ఎవరు ఏమైనా అననీ, గౌరమ్మ నగల్ని విడిపించాల్సిందే!
వంద బస్తాలు వక్క వస్తుందనుకుంటే ఆ ఏడాది 50 బస్తాలే దిగాయి కుప్పన్న కౌలు తోటలో.
ఆ సమయంలో మఠం స్వామీజీ కాశీలో ఉండటంతో కుప్పన్న భట్ట, ఇంకొక్క అవకాశమివ్వమని, వచ్చే ఏడాది బాకీ తీర్చలేకపోతే పొలం స్వాధీనం చేస్తాననీ వేడుకుంటూ లేఖ రాశాడు. రెండు వారాలైనా జవాబు రాలేదు.
అప్పులవాళ్ళు వచ్చి పంట మీద హక్కు ప్రకటించుకునే లోపు దాన్ని మార్కెట్‌కి తరలించాలి. లేదంటే నగలు విడిపించలేడు సరికదా, వాటి మీద వడ్డీ కూడా తడిసి మోపెడైతే, ఇక వాటి మొహం కూడా ఎన్నడూ చూడలేడు. టౌనుకి పోయి, పంటను తరలించేందుకు లారీ మాట్లాడాలని చూస్తే, ఉన్న ఒక్క లారీ గోపాల కామత్ బంధువుదై కూచుంది. ఏమైతే అదైందని దాన్నే మాట్లాడాడు. మర్నాడే గోపాల్ గుమస్తా వచ్చి వాకిట్లో కూచున్నాడు. సేటు 600లకు చిల్లి గవ్వ తక్కువ తీసుకురావద్దన్నాడని అరుపులు. అతని అరుపులు అప్పన్న భట్ట పనివాళ్ళు విని ఇంట్లోకి విషయాన్ని చేరవేశారు. ఎద్దుల బండి కట్టి అప్పన్న మఠం వైపు నడిపించాడు.
మధ్యాహ్నానికల్లా కామత్ గుమాస్తా, ఖాళీ గోతాలు, తూకం రాళ్ళు, త్రాసుతో సహా ప్రత్యక్షం! “బస్తా 45 రూపాయల చొప్పున 15 బస్తాలు మాకు అమ్మెయ్. అప్పుడు ఇంకా మేము నీకు పాతిక రూపాయలు బాకీ ఉంటాం.”
షిమోగాలో రేటు 55 రూపాయలుంది. అదీ కాక ఇతను తెచ్చిన తూకం రాళ్ళు సరైనవి కాదు. కుప్పన్న కుదరదనేశాడు. గుమాస్తా ధైర్యంచేసి ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఒక ముసల్మాను తన గడప దాటి ఇంట్లో అడుగు పెట్టడం అనేది సహించరాని విషయం కుప్పన్నకి.
వక్క బస్తాలున్న గది వైపు చూస్తూ అరిచాడు కుప్పన్న. “ఇంకొక్క అడుగు ముందుకేశావా, నా శవాన్ని దాటి పోవాల్సిందే!”
గుమస్తా కాస్త జడిసి, మొహం తుడుచుకుంటూ కూలబడ్డాడు గొణుగుతూ. కుప్పన్న పెదవులు అదురుతున్నాయి, ఆవేశంతో మొహం ఎర్రబడిపోయింది. మరి కాసేపటికి ఇంటి ముందు ఎద్దుల బండి చప్పుడు. ఆ శబ్దం మఠం బండిదని కుప్పన్నకు అర్థమైంది. ఒక్క క్షణం శరీరం వణికింది. కళ్ళు మూతలుపడ్డాయి. వెంటనే తేరుకున్నాడు.
మఠం ప్రతినిధి మరో గుమాస్తాతో, తూకం రాళ్ళతో లోపలికి ప్రవేశించి, “ఏం జరుగుతోందిక్కడ?” అన్నాడు. గోపాల్ గుమాస్తా మొత్తం వివరించాడు.
“చూడూ, అతను మా కౌలుదారు. దేవుడి బాకీ ముందు తీర్చాలి. పోయి మీ సేటుకి చెప్పు” అన్నాడు మఠం గుమాస్తా.
కుప్పన్న రహస్యంగా వక్క బస్తాలన్నీ షిమోగాకి తరలించే ప్రయత్నంలో ఉన్నాడని గోపాల్ గుమాస్తా వివరించడంతో మఠం ప్రతినిధి విస్తుపోయాడు. “చివరికి ఇంతకు దిగజారారా భట్టగారూ? నరసింహుడి సొమ్ము ఎగ్గొడితే అది మీకు వొంటబడుతుందా?”
ఎన్నడూ ఎరగని నిస్సత్తువ ఆవహించింది కుప్పన్నని. స్వామీజీకి రాసిన లేఖ గురించి చెప్పాడు గొంతు పెగిల్చి.
“ఏ మొహం పెట్టుకుని ఆ ఉత్తరం రాశావు? మార్కెట్లో బేరాలాడటానికి నీ దగ్గర డబ్బుంటుంది కానీ స్వామి బాకీ తీర్చడానికి మాత్రం ఉండదేం? నీకెంత అహంకారమంటే స్వయంగా స్వామీజీ రమ్మని కబురంపితే కూడా కదలవు. నువ్వు తినేది దేవుడి సొమ్ము కుప్పన్నా! అసలు ఈ ఇల్లు చూడు, ఎంత పెంటగా ఉంచావో. ఇదసలు బ్రాహ్మల ఇల్లేనా? ఛీ, ఏ నీచజాతివాడి కొంపో అన్నట్టుంది. సరే ఇదంతా అనవసరం. ఇది స్వామివారి ఆజ్ఞ!” అని జేబులోంచి ఒక కాయితం ముక్క తీసి చదివాడు. కుప్పన్న వెంటనే బాకీ తీర్చకపోతే భూములు స్వాధీనం చేసుకుని అప్పన్న భట్టకి అప్పగించబడతాయని ఆ ముక్క సారాంశం.
గ్రామ లెక్కల గుమాస్తా అతని బాకీలు, కౌలు, వడ్డీలు మొత్తం కలిపి లెక్కేసి ‘ఆరువేలు’ అన్నాడు.
“వెళ్ళి ఆ గదిలో ఎన్ని వక్క బస్తాలున్నాయో చూసి తూకమేయండి.”
బలిష్టంగా ఉన్న గోదాం గుమాస్తా “జరగండి జరగండి” అంటూ దూసుకుపోయాడు.
“ఓయ్, అందులో 15 బస్తాలు మా సేటువి” గుర్తు చేశాడు చిల్లర కొట్టు గుమాస్తా.
“నువ్వు ఇక్కడి నుంచి పోతావా లేక నీ సంగతి చూడమంటావా?” గోదాం గుమాస్తా అరుపుకు హడలిపోయి తుర్రుమన్నాడు గోపాల్ మనిషి.
గోదాం గుమాస్తా అడుగు ముందుకు వేయబోయే లోపు గర్జించాడు కుప్పన్న తలుపుకి అడ్డంగా కూచుంటూ “ఒక్క వక్కను నువ్వు ముట్టుకున్నా, నా శవాన్నే చూస్తావ్!”
“ఏమన్నావ్?” రెట్టించాడు మఠం ప్రతినిధి. మళ్ళీ అదే మాట చెప్పాడు భట్ట, శరీరమంతా అగ్నిలా దహించుకుపోతుండగా.
“బ్రాహ్మణ పుటక పుట్టి ఇంతగా దిగజారావన్నమాట. సరే. ఏం జరుగుతుందో నువ్వే చూస్తావుగా.” గుమాస్తా, అతనూ కదిలారు అక్కడి నుంచి. అతని ఇంటి మీద ఒక కన్నేసి ఉంచమని అప్పన్న భట్టకి చెప్పి మరీ వెళ్ళారు.
కాళ్ళు తిమ్మిరెక్కి స్పర్శ కోల్పోయేదాకా అలాగే కూచుండిపోయాడు కుప్పన్న భట్ట.
మధ్యాహ్నానికి లేచి ఒళ్ళు విరుచుకుని, వీధి వాకిలి తలుపు గడియ వేసొచ్చి, కాస్త గంజి కాచుకున్నాడు. సాయంత్రం తిరిగొచ్చిన ఆవుల్ని కట్టేసి మేత, కుడితి పెట్టి పాలు పితికాడు. లాంతరు వెలిగించి, పంచలో కూచున్నాడు. ఏమీ వండాలనిపించక పాలు కాచి తాగాడు. కాసేపు బయటికి వెళ్ళి ఆకాశంలో తారల్ని చూస్తూ గడిపాడు. ఎలా తెల్లవారిందో అతనికే తెలియాలి.
ఆవులు అంబా అని పిలుస్తుంటే మెలకువ వచ్చింది. లేచి వాటిని మేతకు వదిలాక బావిలోంచి నీళ్ళు తోడి తలస్నానం చేశాడు. పొయ్యి మీద నీళ్ళ గిన్నె పడేశాడు.
ఎవరో తలుపు దబదబా బాదుతున్నారు. “భట్టగారూ, నేను అమీన్‌ని తలుపు తెరవండి.”
కుప్పన్న జవాబు ఇవ్వలేదు. వెళ్ళి వక్కబస్తాలున్న గది తలుపుకి అడ్డంగా కూచున్నాడు. మరి కాసేపటికి సైకిల్ బెల్లు వినిపించింది. గోపాల కామత్ వచ్చాడు. “భట్టగారూ, పోనీ బస్తాకి 47 రూపాయలిస్తాంలెండి, తలుపు తీయండి.”
మళ్ళీ అతనే అన్నాడు” సరే, యాభై ఇస్తాను బస్తాకి, తలుపు తీయండి.”
లోపలి నుంచి జవాబు లేకపోయేసరికి తిట్లకు దిగాడు. “ఇంత సిగ్గులేని మనిషి అని తెలిస్తే నా కొట్టు గడప కూడా తొక్కనిచ్చేవాళ్ళం కాదు.”
పక్కనే ఉన్న తన గుమస్తాతో అన్నాడు “బుడాన్, హలసూర్‌లో ఇతని బావమరిది ఇంటికి పోయి బాకీ సంగతి తేల్చమని అడుగు. డబ్బు కట్టేదాకా అతని గడప ముందు నుంచి అంగుళం కూడా కదలొద్దు. అతను ఇంత సిగ్గులేని మనిషని నేను అనుకోను.”
ఇంతలో మఠం ప్రతినిధి రానేవచ్చాడు. ముగ్గురూ తలుపు తీయమని పిండం చుట్టూ మూగిన కాకులల్లే అరుస్తున్నారు. మఠం మనిషి ఆఖరి అస్త్రం తీశాడు. “పో, పోయి బుక్లాపుర అగ్రహారంలో చాటింపు వేయండి. కాసేపట్లో కుప్పన్న భట్ట చరాస్తులన్నీ వేలం వేస్తున్నామని.”
వెంటనే ఆ పని మొదలైంది.
“ఇలా అయితే నేను కోర్టుకు పోతాను.” బెదిరించాడు కామత్.
“పో!” ఈసడించాడు మఠం నుంచి వచ్చిన మనిషి.
“భట్టగారూ, ఆఖరిసారి అడుగుతున్నాను. తలుపు తీస్తారా లేదా?” గోదాం గుమస్తా అడిగాడు. జవాబు లేదు.
గుమాస్తా ఒక పెద్ద దుంగ తీసుకుని తలుపు మీద మోదటంతో తలుగు గొళ్ళెం కదిలిపోయింది. “ఇప్పుడైనా తలుపు తీయండి.” జవాబు లేదు.
మరో దెబ్బ మోదటంతో తలుపు వూడి వచ్చింది. గోదాం గుమాస్తా యమదూతల్లే కుప్పన్న భట్ట ముందు నిలబడ్డాడు. కుప్పన్న భట్ట కదల్లేదు. కళ్ళు మూసుకుని యోగ సమాధిలో ఉన్నవాడల్లే కదలకుండా కూచున్నాడు. లెమ్మని వాళ్ళు అరిచిన అరుపులు అతనికి చేరాయో లేదో తెలీదు. గోదాం గుమాస్తా, బక్క పల్చని కుప్పన్నని ఎత్తి బయట ఎర్రటి ఎండలో కూచోబెట్టాడు. ఒక్కొక్కటిగా వక్క బస్తాలన్నీ బయటికి తెచ్చి వరండాలో మరో మూల పేర్చాడు.
“ఈ వంట పాత్రలూ ఇవన్నీ కూడా బయట పడేయనా?” అనడిగాడు అత్యుత్సాహంగా. మఠం గుమాస్తా జేబులోంచి కాయితం తీసి పైకి చదివాడు “స్థిర చరాస్తులన్నీ…”
గోదాం గుమాస్తా వంటింట్లోకి చొరబడ్డాడు. పొయ్యి మీద ఉన్న పాలగిన్నె బయటికి తెచ్చి పాలు నేల మీద పారబోశాడు. దేవుడి గదిలోని తీర్థపు గిన్నెతో సహా, వంట పాత్రలు,కంచాలు, గరిటెలు, శంఖం, ఉద్ధరిణ మొదలైన పూజ సామానుతో సహా మొత్తం బయట వేశాడు.
కుప్పన్న భట్ట ఈ బుక్లాపురకి వస్తూ తెచ్చుకున్న నీళ్ళ తొట్లు, ఉయ్యాల, చెక్క బల్ల, చిరుగుల చాప, అతుకులేసిన బొంతలు, కృష్ణుడి ఫొటో, పట్టు పంచె, రెండు చీపుళ్ళు, సాలగ్రామం ఉన్న ఒక పెట్టె తప్ప మిగతా వస్తువులన్నీ వీధి మొహం చూశాయి.
నుదురు మీద చేయి ఆనించుకుని కళ్ళు దించుకుని కూచున్నాడు కుప్పన్న భట్ట.
“ఆవులు చరాస్తులేనా?” గోదాం గుమాస్తా అడిగాడు. “అందులో సందేహమేముంది?” అన్నాడు మఠం ఏజెంటు.
ఆస్తుల వేలం చాటింపు ముగించి వచ్చాడు తలారి. “పో, పోయి పొలాల్లో మేస్తున్న ఆవుల్ని తోలుకురా పో.” చెప్పాడు గుమాస్తా. బుక్లాపుర అగ్రహారం నుంచి కొంతమంది ఆ ఇంటి ముందుకు వచ్చి చెట్ల వెనక నిలబడి ఈ తంతుని ఆసక్తిగా చూస్తున్నారు. ఏదో పని మీద వచ్చినట్టు నటిస్తూ అక్కడ జరిగేదంతా గమనిస్తున్నారు.
“పాపం భట్టకి ఎంత కష్టం వచ్చింది!” జాలిపడ్డారు కొందరు. “బాకీలు తీర్చకుండా ఇన్నాళ్ళుంటే అంతే మరి…” మరికొందరు. కాసేపటికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
గోదాం గుమాస్తా వక్క బస్తాలన్నిటినీ బండిలోకి ఎక్కించాడు. జప్తు చేసిన వస్తువుల జాబితా మొత్తం రాశాడు. బండిని కదిలించబోతూ అన్నాడు మఠం ప్రతినిధి. “నరసింహుడి సొమ్ముని తేరగా అనుభవిద్దాం అనుకున్న వాడెవడూ బాగుపడడు. వృద్ధిలోకి రాడు. ఇవాళ్టి నుంచీ ఈ ఇల్లూ కౌలు పొలమూ ఏవీ మీవి కావు. అప్పన్న భట్టకి రాసి ఇస్తున్నాం.”
బండిలో ఎక్కి కూచుంటూ చివరి మాట అన్నాడు. “అయినా ఎందుకు బాధపడతారు? ఇప్పటికే మీరు కూడబెట్టిందంతా మీ భార్యకి ఇచ్చి మీ బావమరిది ఇంటికి చేరేశారుగా?”
సీతక్క ఏనాడు పుట్టిందో బుక్లాపుర అగ్రహారంలో ఎవరికీ తెలియదు. ఎన్నేళ్ళుంటాయో తెలీని ముదిగువ్వ. ఒక్కతే చిన్న గుడిసెలో ఉంటుంది. భయమే తెలియని సీతక్క వూర్లో ఎంత హోదా ఉన్నవాళ్ళనైనా సరే, ‘ఏరా’ అని తప్ప పిలవదు. ఊహ తెలీకముందే మొగుడిని పోగొట్టుకుని విధవగా మారిన సీతక్కకి, పోతే పిండం పెట్టేందుకైనా ముందూ వెనకా ఎవరూ లేరు. సీతక్క నోరంటే అందరికీ హడలే ఆ వూర్లో. రోజూ ఎవరినో ఒకరిని అరంగంటైనా తిట్టిపోయందే నిద్రపోదు.
తలారి చాటింపు విన్నాక సీతక్క మనసాగలేదు. నదిలో శాస్త్రార్థం మూడు మునకలేసి, పరుగున కుప్పన్న భట్ట ఇంటికి వచ్చింది. ఏమి జరిగిందో ఎవరూ ఎంత అడిగినా చెప్పలేదు. చివరికి ఎవరో పనివాడు జరిగింది వివరించాడు. కుప్పన్న నాటిన నిశ్శబ్దంలోంచి సీతక్క గొంతు శాపనార్థాలతో ఖంగుమంది.
“ఏ లంజకొడుకు నీ ఇల్లు నాశనం చేశాడు? వాడి ఇల్లు కూలిపోనూ. వాడి ఆవుల్ని పులెత్తుకెళ్ళ. అది సరే, నీకేమైంది? పేదవాడి కోపం పెదవికి చేటని నువ్వూ నమ్ముతున్నావా? అలా కూచున్నావేంటి? నీ కోపం నీ నోరూ ఏమైపోయాయి?”
కుప్పన్న నుంచి జవాబు లేదు. కదలనూ లేదు. చుట్టూ చూసింది. చెట్టు కింద ఎవరో తచ్చాడుతున్నారు.
“ఎవరయ్యా అది దెయ్యంలాగ ఆ చెట్టు కింద? ఇట్రా నువ్వు” కేకేసింది. నరసింహ భట్ట అనే బుక్లాపుర బ్రాహ్మడు. తక్కుతూ తారుతూ ఆమెవైపు నడిచాడు. “పట్టు, వరండాలో అయినా కూచోబెడదాం.”
ఇద్దరూ కలిసి కుప్పన్న భట్టను లేపి జగలి మీద కూచోబెట్టారు. మఠం ఏజెంటు వదిలేసిపోయిన చిన్నాచితకా గిన్నెలన్నీ నేల మీద చిందరవందరగా పడున్నాయి. సీతక్క అవన్నీ తీసి ఇంట్లో పెట్టింది. “వాడిని పాము కరవా!” అని ఎవర్నో తిట్టింది.
అప్పన్న ఇంటి ముందు నిలబడి నానా శాపనార్థాలూ పెట్టి దుమ్మెత్తి పోసి, ఇంటికి వెళ్ళి కాసిని అటుకులు పెరుగులో కలిపి తెచ్చింది. ఎవరినో అడిగి ఇంత ఉప్పు, రెండు పచ్చి మిరపకాయలు అందులో కలిపి ముద్దచేసి అరిటాకులో పెట్టి కుప్పన్న ముందు పెట్టింది. “తిని చావు. ఆకలితో మాడకు బుద్ధి లేకుండా.”
సీతక్క వెళ్ళాక అప్పన్న భట్ట పనివాళ్ళని పిలిచి కుప్పన్న భట్ట అక్కడే ఉన్నాడా లేక భార్య దగ్గరికి వెళ్ళిపోయాడా చూసి రమ్మన్నాడు. వాళ్ళు తిరిగొచ్చి చూసింది చెప్పారు.
“చూశావా కుప్పన్న నాటకాలు? సాయంత్రానికల్లా కుప్పన్న హలసూరు వెళ్ళకపోతే నా పేరు అప్పన్న భట్ట కాదు చూస్తుండు.” భార్యతో అన్నాడు.
తెల్లవారింది. కట్టెలు తెచ్చిన మనిషి చెప్పాడు, “అయ్యా, ఆయన ఇంకా జగలి మీదే కూచోనున్నాడు.”
కుతూహలం పట్టలేక అప్పన్న భట్ట, మఠం ఏజెంటు ఇచ్చిన తాళంచెవి తీసుకుని కుప్పన్న ఇంటికేసి నడిచాడు. కుప్పన్న ఇంటిని సమీపిస్తుంటే, ఎందుకో గుండె దడదడలాడింది. చెట్టు దగ్గర ఆగాడు, ఏదో కోస్తున్నట్టు నటిస్తూ. కుప్పన్న జగలి మీద అలా కూచునే ఉన్నాడు. నల్లని బక్కపల్చని శరీరం గోడకు ఆనుకుని ఉంది. నెత్తి మీద గాలికి ఎగురుతున్న ఉత్తరీయం. ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టు అనిపించింది. తనలో తను చెప్పుకున్నాడు. ‘కుప్పన్న ఏదైనా గొడవకు దిగాడో, గట్టిగా నోరు మూయిస్తాను. పెళ్ళాంతో పంపించేసిన సొమ్ము గురించి అడిగితేనా, నోరు మూసుకుంటాడు’.
సావిట్లో అడుగుపెట్టాడు. బూడిదరంగు కుక్క ఒకటి కుప్పన్న ముందు తదేకంగా అతన్నే చూస్తూ కూచుంది. ఎండిపోయిన అటుకుల ముద్ద అతని ముందున్న అరిటాకులో పడుంది. తనకు తెలీకుండానే అప్పన్న నోటి నుంచి ‘భట్టగారూ!’ అనే పిలుపు వెలువడింది.
కుప్పన్నలో చలనం లేదు. వణుకుతున్న వేలితో విగ్రహంలా కూచున్న కుప్పన్నని కదిపి చూశాడు. కుప్పన్న ఒంట్లోని రక్తం అంతా పిండేసినట్టు మొహం పాలిపోయి ఉంది. కళ్ళు మూసుకుని ఉన్నాయి. అతని భుజాలు పట్టుకుని కుదిపాడు అప్పన్న భట్ట. కుప్పన్న కళ్ళు తెరిచాడు. అప్పన్న భట్టకి కాస్త ధైర్యం వచ్చింది.
“ఏంటి మీరు చేసిన పని భట్టగారూ? నా మీద మీ ద్వేషాన్ని అలాగే పోగేసుకుంటూ పోతున్నారు తప్ప మీ మీద నాకెలాటి కోపమూ లేదు. నా కంటే వయసులో పెద్దవారు. నేను బావుండాలని మీరు కోరుకోవాలి. అంతే నేను ఆశించింది. నా మీద ద్వేషంతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. అందుకే మీతో మాట్లాడాలని వచ్చాను. రండి, మా ఇంట్లో భోజనం చేయండి. మీ బావమరిది ఇంటికి బండిలో నేను పంపిస్తాను. 30 ఏళ్ళ ఈ పంతాల్ని ఇక మర్చిపోదాం మనం.”
అసలు ఇంత మాట్లాడాలని అప్పన్న అనుకోనేలేదు. ఒక మాట వెంట ఒకటి అలా మాటలు వచ్చేశాయంతే. అతనిదంతా వృథాప్రయాసే అయింది. అతని మాటలేవీ కుప్పన్న చెవులకు చేరినట్టు లేదు. కుప్పన్నలో చలనమే లేదు.
అతని మౌనం అప్పన్నను భయపెడుతోంది. జగిలి నుంచి దిగి సావిట్లో నిలబడి నెమ్మదిగా అన్నాడు. “30 ఏళ్ళుగా మీ కోపాన్ని భరిస్తూ వచ్చానే కానీ నేను మీకేం చేశాను? మీతో ఎపుడైనా కనీసం పోటీపడ్డానా? మఠానికి ఇవ్వాల్సిన భాగం చిల్లరకొట్టుకు పోతున్నదని మఠానికి నేను చేరేసిన సంగతి నిజమే. నేనే అబద్ధం చెప్తున్నట్టయితే నా నాలుక ముక్కలైపోవాలి. అగ్రహారం పెద్దల్ని పిలవండి. నా తప్పుందని తేలిస్తే మీ కాళ్ళ మీద పడతాను.”
అప్పన్న గొంతు కొంచెం పెరిగింది. “పోయినేడు, నాకు వక్క సరఫరా చేసే రైతుల్ని మీ వైపు తిప్పుకున్నారు. న్యాయమా అది? డబ్బుంచుకుని బాకీదారులకు ఎగ్గొట్టడం మాత్రం సరైందా? మీలాగే నాకూ కుటుంబముంది, పెళ్ళికెదిగిన కూతురూ ఉంది. నా కష్టాలు నాకున్నాయి. కడుపునొప్పితో ఏళ్ళ నుంచీ బాధపడుతున్నాను. కుండెడు పాలిచ్చే గేదె పోయిన నెలలో అకస్మాత్తుగా చచ్చిపోయింది. ఇదంతా మన ఖర్మ. భట్టగారూ, లేవండి, ఇంటికి వెళదాం రండి. చల్లబడే వేళకి మీరు వూరుచేరే ఏర్పాటు చేస్తాను.”
బూడిదరంగు కుక్క ఇద్దరినీ మార్చి మార్చి చూసింది. కుప్పన్న చూపులు అప్పన్నను దాటి దూరంగా అడవిని దాటి దిగంతాలను చూస్తున్నాయి.
అప్పన్న గొంతు తడారిపోతోంది. “భట్టగారూ, భట్టగారూ!” అతని గొంతు శ్రాద్ధసమయంలో పితృ దేవతల్ని పిలుస్తున్నట్టు ధ్వనిస్తోంది.
కుక్క లేచి ఒకసారి ఒళ్ళు విరుచుకుని మళ్ళీ పడుకుంది. ఎండ మండిపోతోంది. కుప్పన్న బాసింపట్టు వేసుకుని కూచుని ఉన్నాడు. మోకాళ్ళ మీద మోచేయి ఆనించి, చేతిని తల మీద పెట్టుక్కూర్చున్నాడు. అతన్ని మొదటిసారి చూస్తున్నట్టు చూశాడు అప్పన్న భట్ట. కడుపులో ఏదో కలవరం, తిప్పేస్తున్నట్టు.
ఎండిపోయిన అటుకుల మీద ఈగలు ముసురుతున్నాయి.
“భట్టగారూ, మీ ఆస్తి నాకేమీ వద్దు. మీ ఇంట్లో మీరే ఉండండి. వక్క తోటలు కూడా మీరే సాగు చేయించండి. ఏటా కౌలు మాత్రం ఇవ్వండి చాలు. నేనేం కసాయివాడిని కాదు. నేనూ మీలాగే ఒక ఖాళీ రాగి చెంబు పట్టుకుని వచ్చినవాడినే. నేను కోరుకునేదల్లా నేను మా నాన్నలాగా చేతిలో చిల్లిగవ్వ లేకుండా రోడ్డు మధ్యలో పడి దీనంగా చచ్చిపోకూడదని మాత్రమే. మా నాన్న అడవి మధ్యలో పడిపోయి ప్రాణం పోతుంటే, ఒక్కచుక్క నీళ్ళుపోసే దిక్కు కూడా లేకపోయింది. అలాటి చావు నాకు రాకూడనే ఒకే ఒక్క కోరిక నాది.
భట్టగారూ, ఇవిగో తాళాలు. తీసుకోండి!” అప్పన్న దుఃఖాన్ని ఆపుకోలేక భోరున ఏడ్చాడు. మొహం ఎర్రబడిపోయింది. చివరి శ్వాస కోసం ఎదురుచూస్తున్నట్టు శిలావిగ్రహంలా కూచున్న కుప్పన్న నుంచి మాత్రం జవాబు లేదు. అతని ఆకృతి అప్పన్న మెదడులో మంటలు రేకెత్తిస్తోంది. నోట మాట రాకుండాపోయింది.
తల చుట్టూ తువ్వాలు చుట్టుకుని, మౌనిలా కూచున్న కుప్పన్న భట్ట ఎదురుగా తనూ కూచుండిపోయాడు.
(కన్నడ మూలం. ఆంగ్లానువాదం: H. Y. Sharada Prasad)