వార ఫలం

సోమ వారం నాడు కడిగిన ముఖాన్ని తొడుక్కుని
డబ్బుల వేటకి వెళ్ళేను అక్కడ డొల్లలు వేలం పాడేను
తెలివిడి మాటలు అమ్మేను నిలబడి ఇచ్చే బేరం చెప్పేను
ఘల్లున లోహపు నవ్వులు నవ్వేను
వాళ్ళని కాళ్ళని పట్టుకు కిందికి దిగలాగి
గురిగా బాణం దెబ్బకి నాణెం రాలిన గిల గిల విన్నాను.

సరిగా మంగళ వారం పొద్దున్న
కడ్రాయర్ ఒక్కటి మాత్రం కట్టుకుని
వ్యాపారాలకి టోపీ ఆలోచనలను కొన్నాము
లోహావేశం పాళీ ఝళిపించి
దేహీ మేధాకవళం తల్లీ అన్నాము
జింకల కళ్ళూ వాగుల నీళ్ళూ ఊళ్ళో అమ్మించి
రాళ్ళకి పువ్వుల రంగులు వేయించి
పైకం గుళ్ళో పంచుకు తిన్నాము.

పద పద వేగం లెమ్మని బుధ వారము నాడు
చదువుల కోటూ పాగా తొడిగేరు
పదుగురు బతికిన పేటలు పాడు పడి
జడుసుకు నదిలో కూలిన సంగతి చెప్పేరు
మాడిన చెట్లని మళ్ళీ మొలిపించే శాస్త్రం వల్లించండని అడిగేరు
వాళ్ళకి డాబుల చిట్టా అట్టలు దులిపిచ్చి
ఊళ్ళో ఏమీ తోచక ఇక్కడికొచ్చేను.

లక్షింవారం నేనొక పక్షి వలె
టప టప రెక్కల సూటూ బూటూ వేసుకుని
అటు నిటు విమాన ప్రమాద ఘంటిక మోగిస్తూ
పులి కన్నుల నా గడసరి జాలీ మునుపెరుగని దూరపు స్నేహం
తెలి చూపులు కప్పిన దాహం వల కాచుకు లోపలి ఖాళీ
క్రీనీడల ఊదా రంగుల ఆ పరదాలన్నీ మూసుకుని
రెండో ఝామున చీకటి మండే దారుల వెంబడి ఈ
బరువులు చప్పట్లన్నీ బహుమతులేనని మోసుకుని.

సుక్కురువారం నక్కల ఊళలకి
వేకువ ఝామున భయపడి లేపేరు
గడ గడ బొక్కసమంతా ఎదపై హత్తుకుని
చివరికి ఇరవై శాతం తేలిన తేలికలో
లెక్కకు మిక్కిలి లాభం అని మా ఏలికలు
ఎక్కడికైనా ఆటకి పొమ్మనమన్నారు
తారామతి బారాదరి తడి మసకల సేదలు తీరి
జోరీగల వలె దినమూ దొలిచే పనులేమారి.

శనివారం తన కౌగిలి గర గర గుచ్చుకుని
కలలా మునుపటి ముచ్చటలేవో జ్ఞప్తికి తెచ్చుకుని
చిన్నది మామిడి పిందెల నెక్లెస్~ కొన్నాను
కన్నుల పోటీ నవ్వుల పెద్దల గుంపులతో
విధిగా మన్నన విందులు తిన్నాను
ముడుచుకుపోయిన ప్రేమలు పూతికలల్లే ఒరుసుకుని
ఆశా కామం అత్తరు అటు ఇటు ఒంటికి నలుచుకొని
అలసిన నా ప్రతిబింబంతోనే జతగా ఆవిరి స్నానం చేసేను.

ఆది వారం నాడు
ఇది రాసుకున్నాను.

(David Wagoner కవిత Diary స్ఫూర్తితోటి).