“కొందరు పబ్లిసిటీ కోసం సాధన చేసి దాన్ని సంపాదించుకుంటారు. నా వంటివాళ్ళు సంగీతాన్ని సాధించే ప్రయత్నంలోనే మునిగితేలుతూంటారు. నాకు పబ్లిసిటీ అంతగా రాకపోవడంలో ఆశ్చర్యం లేదు” అంటారు ఉస్తాద్ ఇమ్రత్‌ఖాన్. సితార్, సుర్‌బహార్ వాయిద్యాలు రెండింటినీ గొప్పగా వాయించగలిగే ఈ విద్వాంసుడు ప్రస్తుతం అమెరికాలో మిసోరీ రాష్ట్రంలో సెయింట్ లూయిస్ పట్టణంలోని వాషింగ్‌టన్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
సుర్‌బహార్ సితార్‌కన్నా మంద్రస్థాయిలో గంభీరంగా మోగే వాయిద్యం. దాదాపు సితార్ లాగే కనబడే ఈ వాయిద్యాన్ని ఇమ్రత్‌ఖాన్ ముత్తాత సాహబ్‌దాద్‌ఖాన్‌గారు మొదటగా తయారు చేశారట. దీనికీ సితార్‌కీ ఉండే తేడా పాశ్చాత్య వాయిద్యాలైన వయొలిన్, చెల్లోలకు ఉన్నటువంటిదే. రాగాలాపన ధ్రుపద్ శైలిలో వినిపించడానికి ఇది ఉత్తమసాధనం. సితార్‌లో ఒక మెట్టు మీద అయిదు స్వరాల వరకూ (షడ్జమం మీద పంచమం దాకా) తీగను గుంజి పలికించగలిగితే సుర్‌బహార్ మీద ఒకే మెట్టు మీద ఏడు స్వరాలు (షడ్జమంమీద నిషాదం దాకా) పలుకుతాయి. ఈ కారణంగా గమకాలూ, జారుడు స్వరాలూ సుర్‌బహార్ మీద అద్భుతంగా వినిపిస్తాయి.
ఇటీవల ముంబాయిలో కచేరీలలో పాల్గొనడానికై ప్రత్యేకంగా అమెరికానుంచి వచ్చిన సితార్ విద్వాంసుడు ఉస్తాద్ ఇమ్రత్‌ఖాన్ తన సంగీతంతో శ్రోతలను అలరించారు. ఒక కచేరీలో ఆయన పెద్ద కుమారుడు నిషాత్‌ఖాన్ కూడా సితార్ వాయించాడు.
కర్ణాటక పద్ధతిలాగా కాకుండా హిందూస్తానీ పద్ధతిలో గాత్రసంగీతానికీ, వాద్యసంగీతానికీ చాలా తేడా ఉంటుంది. పాటలకు బదులుగా సాహిత్యం లేని గత్‌లు సితార్ మీద వాయించడం పరిపాటి. అంతే కాకుండా ఆలాపన, తానం (జోడ్) సితార్‌మీద ఎక్కువసేపు ఒకప్పుడు తాన్‌సేన్ పాడిన ధ్రుపద్ శైలిలో వాయిస్తారు. తరవాతనే తబలా తాళ సహకారంతో గత్ మొదలవుతుంది. ఈ ప్రక్రియలన్నిటిలోనూ ఇమ్రత్‌ఖాన్‌కు గొప్ప ప్రతిభ ఉంది. అతినింపాదిగా మొదలయే విలంబిత కాలంలో రాగవిస్తారం నుంచి అతివేగంగా ముగిసే ద్రుత్‌గత్, ఝాలా వరకూ అద్భుతమైన విన్యాసాలతో సాగుతుంది ఆయన కచేరీ. అందులో అడుగడుగునా సితార్‌మీద ఆయనకు ఉన్న అధికారమూ, రాగం మీద పట్టూ, అద్భుతమైన సృజనాత్మకతా వినేవారిని ఆకట్టుకుంటాయి.
ఇమ్రత్‌ఖాన్ వంశం అక్బర్‌పాదుషా కాలంనుంచీ ఎన్నోతరాలుగా సంగీతానికి పేరు పొందినది. 1936లో కోల్‌కతాలో జన్మించిన ఇమ్రత్‌ఖాన్ రెండున్నరేళ్ళ వయసులోనే ఆనాటి ప్రసిద్ధ సితార్ నిపుణుడైన తన తండ్రిని కోల్పోవడంతో అన్నగారైన ఉస్తాద్ విలాయత్‌ఖాన్ ఆయనకు సితార్ నేర్పే గురువుగా బాధ్యతను చేపట్టవలసివచ్చింది. అలాగే బాబాయి ఉస్తాద్ వహీద్‌ఖాన్ “సుర్‌బహార్” నేర్పారు. తన తాతగారూ, ముత్తాతగారూ దీన్ని కచ్ఛపవీణ అనే పేరుతో వాయించి ప్రఖ్యాతి గడించారు. అయిదారేళ్ళ లేతవయసునుంచీ చేసిన రాక్షస సాధన ఫలితంగా ఇమ్రత్ చేతి వేళ్ళకూ, పాదాలకూ కూడా గాయాలవుతూ ఉండేవి. మామూలు కుటుంబాల్లో అటువంటిది జరుగుతుందని ఊహించడం కూడా అసంభవం. నాలుగు శతాబ్దాలుగా సంగీతానికి పేరుమోసిన వంశానికి అప్రతిష్ఠ రాకూడదనే పట్టుదలతో ఆ అభ్యాసం కొనసాగింది. అంతేకాదు. అతని నైపుణ్యం కేవలం నేర్చుకోవడం ద్వారా వచ్చినదే అనలేము. స్వయంగా ఉన్న ప్రతిభకు ఆ శిక్షణ మెరుగులు పెట్టిందనడమే సబబు. ఈనాడు సితార్, సుర్‌బహార్ రెండింటిలోనూ అద్వితీయమైన విద్వత్తు ఉన్నది ఒక్క ఇమ్రత్‌ఖాన్‌కు మాత్రమే అంటే అతిశయోక్తికాదు. ఇమ్రత్‌ఖాన్ ఒకే కచేరీలో రెండింటినీ వాయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. విలాయత్‌ఖాన్ సితార్, ఇమ్రత్‌ఖాన్ సుర్‌బహార్ జుగల్‌బందీ కచేరీలు నాలుగైదు దశాబ్దాల క్రితమే శ్రోతలను ఉర్రూతలూగించాయి.
వాద్యసంగీతంకాక చిన్నవయసులోనే తల్లి బషీరన్‌బేగమ్, మాతామహుడైన బందేహసన్ ఖాన్‌లవద్ద ఇమ్రత్ గాత్రసంగీతం కూడా అభ్యసించారు. అందుచేతనే తనకు సంగీతం తల్లి పాలతోనే సంక్రమించిందంటారాయన. గాత్రసాధన కారణంగా ఆయన వాద్యసంగీతంలో అసామాన్యమూ, అనితరసాధ్యమూ అనిపించే “గాయకశైలి” వినిపిస్తుంది. మెట్లూ, మీటే పద్ధతీ వగైరాల వల్ల సితార్ వంటి తంత్రీవాయిద్యాల శబ్దానికి సామాన్యంగా పరిమితులు ఉంటాయి. వాటిని అధిగమించి గాత్రానికి ఉండే సౌలభ్యాన్ని వాయిద్యంపై పలికించడమనేది చాలా కష్టం. ఈ “గాయక శైలి” కూడా సామాన్యమైనది కాదు. మన దేశపు అత్యుత్తమ హిందూస్తానీ గాయకులైన అబ్దుల్ కరీంఖాన్, ఫయ్యాజ్‌ఖాన్, బడేగులాం అలీఖాన్, అమీర్‌ఖాన్ తదితరుల బాణీలపై ఆధారపడినది. దానిని తొలి సారిగా సితార్‌పై పలికించగలిగిన ఘనత విలాయత్, ఇమ్రత్‌ఖాన్‌లదే. సితార్‌ను కేవలం జంత్రవాద్యంగా కాక దానిమీద ఖయాల్,ఠుమ్రీవంటి గాత్ర విశేషాలను వినిపించడంవల్ల వీరి బాణీకి ఎనలేని ఖ్యాతి లభించింది.
ఇమ్రత్‌ఖాన్ భారతదేశమంతటా పర్యటించి అనేక కచేరీలు చేశారు. రికార్డ్‌ల, కేసెట్ల ద్వారానూ, రేడియో, టీవీలలోనూ ఆయన వాద్యం విన్న అసంఖ్యాక శ్రోతలకు ఆయన ప్రతిభ తెలియవచ్చింది. ఆయన ఖ్యాతి త్వరలోనే ప్రపంచంలోని దేశాలన్నిటికీ వ్యాపించింది. 1956లో సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాల పర్యటనతో మొదలైన విదేశ యాత్రలు ఆయన అంతర్జాతీయ ఖ్యాతికి నాంది పలికాయి. అమెరికా, కెనడా, బ్రిటన్, దక్షిణ అమెరికా, యూరప్, హాంకాంగ్ వగైరా ప్రదేశాల్లో ఎన్నో సంగీతోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సంగీతకచేరీలే కాక ఇమ్రత్‌ఖాన్ అనేక దేశాల్లో భారతీయ సంగీతానికి ఉపాధ్యాయుడుగా,ఉపన్యాసకుడుగా పనిచేశారు. 1960లలో ప్రారంభించి ఇంగ్లండ్‌లోని డార్టింగ్‌టన్ కాలేజ్‌లో, బీబీసీ రేడియో, టెలివిజన్‌లో, హాలండ్, స్వీడన్, ఇటలీ, జర్మనీ మొదలైన దేశాలలో ఎన్నో ప్రతిష్ఠాకరమైన సమావేశాలూ, యూనివర్సిటీల్లో, అమెరికాలో సియాటల్‌లో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్‌టన్, హార్వర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెలిస్ ఇలా ప్రపంచమంతటా ఎన్నో కోర్సులు నిర్వహించి, విదేేశీయులకు మన సంగీతంపట్ల అవగాహనను పెంచారు. ఉత్తమ సంగీతకారుడై ఉండి విషయాలను చక్కగా వివరించగలిగిన నేర్పు ఉండడంతో ఆయనకు ఇటువంటి ఆహ్వానాలు ఎన్నో వచ్చాయి. ప్రస్తుతం ఆయనకు ఎందరో అమెరికన్ శిష్యులున్నారు. వారిచేత ఆయన “ఇమ్రత్ వయొలిన్”, “ఇమ్రత్ గిటార్” అనే కొత్తరకాల వాయిద్యాలను సాధన చేయిస్తున్నారు.
ఇమ్రత్‌ఖాన్ కొన్నేళ్ళు బొంబాయి సినీపరిశ్రమలో నేపథ్య సంగీతానికి సితార్ వాయించారు. గంగా జమునా చిత్రంలో నౌషాద్‌కు “ఢూంఢో ఢూంఢోరే సాజ్‌నా” అనే పాటకు ట్యూను ఆయనే నేర్పారట. మదన్‌మోహన్‌వంటి పాత స్వరకర్తలతో కూడా ఆయన పనిచేశారు. కాని త్వరలోనే సినీ వాతావరణంతో విసుగెత్తి శాస్త్రీయ విద్వాంసుడుగా కొనసాగారు. తరవాత సత్యజిత్‌రాయి తీసిన “జల్‌సా ఘర్”, 1968లో జేమ్స్ ఐవరీ చిత్రం “గురు”, 1976లో షబానా నటీంచిన “కాదంబరి”, “విల్‌బీ కాన్స్పిరసీ” అనే హాలీవుడ్ సినిమా వగైరా చిత్రాలకు వాయించారు.
వ్యక్తిగతంగా ఇమ్రత్‌ఖాన్ చాలా స్నేహపూర్వకంగా, ఛలోక్తులు వేస్తూ నవ్విస్తూ ఉంటారు. గొప్ప కళాకారులకు సామాన్యంగా ఉండే భేషజాలేవీ లేకుండా చక్కని కుటుంబవాతావరణంలో కాలం గడుపుతారాయన. 66 సంవత్సరాల వయసులో కూడా ఆరోగ్యం తొణికిసలాడే ఆయన వైఖరి ఆయన అభిమానులకు సంతోషం కలిగిస్తూఉంటుంది. ఆయన మనసు ఎంత నిర్మలంగా ఉంటుందో ఆయన సంగీతం విన్నవారికి ఇట్టే తెలిసిపోతుంది. ప్రతి స్వరమూ అందంగా, ప్రతి గమకమూ స్పష్టంగా, స్వరకల్పన తీర్చిదిద్దినట్టుగా వినిపిస్తుంది. ఏం వాయించాలో తోచక శ్రోతల సమయాన్ని వృథా చేసే ధోరణి ఎన్నడూ కనిపించదు. ఆయనకున్న పటిమ యావత్తూ ఒకే కచేరీలో తెలుసుకుని ఆనందించడం సాధ్యం కాదు. ఉన్న కాలపరిమితిలో కొన్ని అందాలే మనకు సాక్షాత్కరిస్తాయి. ఆయన కొడుకులందరూ ఉత్తమ కళాకారులుగా పేరు సంపాదించుకుంటున్నారు. లండన్‌లో ఉంటున్న పెద్దవాడు నిషాత్ సితార్‌నూ, కెనడాలో నివసిస్తున్న రెండోవాడు ఇర్షాద్ సితార్, సుర్‌బహార్ లనూ వాయిస్తారు. లండన్‌లోని మూడో అతను వజాహత్ సరోద్ నిపుణుడైతే నాలుగో కుమారుడు షఫాతుల్లా (ఫిలడెల్ఫియా)సితార్, సుర్‌బహార్, తబలా మూడూ వాయిస్తాడు.
రవిశంకర్‌వంటి విద్వాంసులు పబ్లిసిటీ మీద దృష్టి పెట్టినంతగా తాను ప్రయత్నించలేదని ఒప్పుకుంటూనే, అంగాంగ ప్రదర్శనతో సితార్ కళాకారిణులుగా పేరు సంపాదించడానికి ప్రయత్నిస్తున్న నేటి యువతులను ఇమ్రత్‌ఖాన్ ఎద్దేవా చేస్తారు. కర్ణాటక విద్వాంసులైన ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబుల మీద ఆయనకు చాలా గౌరవం ఉంది. మనదేశంలో ఉన్న ఆర్థిక, సామాజిక సమస్యలు నిరాశ కలిగించినా శాస్త్రీయ సంగీతం, లలితకళల రూపాల్లో మనకు ఉన్న సాంస్కృతిక వారసత్వమే కాపాడుకోదగిన మన సంపద అనేది మరిచిపోరాదనీ, ఆధునికత పేరుతో వెర్రితలలు వేస్తున్న నేటి సంగీతపు పోకడలు హాని కలిగిస్తాయనీ అంటారాయన. మనవాళ్ళు ఫ్యూజన్ అంటూ శాస్త్రీయ సంగీతాన్ని సంకరం చేస్తారనీ, పాశ్చాత్యులు తమ శాస్త్రీయ సంగీతాన్ని యథాతథంగా కాపాడుకుంటున్నారనీ ఆయన అన్నారు. బెఠోవెన్, మొజార్ట్‌ల సంగీతంతో రాక్,పాప్, జాజ్ వంటివాటిని కలపడం ఎప్పుడైనా చూశారా అని ఆయన సూటిగా ప్రశ్నిస్తారు. పశ్చిమదేశాల్లో జరిగే ఇటువంటి ఫ్యూజన్ కచేరీలకి హాజరయేది మనవాళ్ళేననీ, అక్కడివారు పట్టించుకోరనీ అన్నారాయన. డబ్బు, పేరు ప్రతిష్ఠల కోసం మన మేటి విద్వాంసులు కొందరు దేనికైనా రాజీ పడటానికి సిద్ధంగా ఉన్నారంటే దానికి కారణం పేదరికమా, పేదరికం గురించిన భయమా? ఇది నిజాయితీగా ఆలోచించుకోవలసిన విషయం.