అబ్బా! చురుక్కున కుట్టింది చీమ. గ్యాంగ్‌రేప్ కేసులో దొరికినవారిని ఎన్‌కౌంటర్ చేయించిన పోలీస్ ఆఫీసర్ గురించి శ్రద్ధగా చదువుతున్న రుక్కు తనని కుట్టి పారిపోతున్న చీమను ఎడమచేతి చూపుడువేలు, బొటనవేలు మధ్య పట్టుకుని నలిపింది. కాళ్ళు, తల, దేహం అన్నీ విడిపొయ్యి, ముక్కలైపొయ్యాయి. ఆ గండుచీమ చచ్చింది. చేతులు దులుపుకుని, ఒడిలోని లాప్టాప్‌ని దివాన్ మీద పెట్టి, లేచి షార్ట్స్ సరిచేసుకుని ఇంట్లోకి వెళ్ళింది.
“పాపా, ఇక్కడ సంచి కనబడటంలేదు? నువ్వు తీశావా?”
“లేదు నాన్నా! ఇప్పుడు సంచి దేనికి?”
“అమ్మ ఉల్లిపాయలు అయిపోయినవంటోంది. తీసుకువస్తాను. ఇంకా ఏవో వెచ్చాలు, అవీ ఇవీ కావాలంటోంది. అన్నీ తీసుకువస్తాను” అన్నాడాయన మాస్క్ తగిలించుకుంటూ.
“ఇప్పుడు హడావుడిగా ఎందుకు? రేపు నేను వెళ్ళి తీసుకువస్తాను” అంది ప్రేమగా.
“ఇదిగో ఇలా నన్ను మరీ పెద్దవాడిని చేసి ఒక మూల కూర్చోపెట్టకు! ఏవో నాకు చేతనైనంత చెయ్యనీ!”
“నేనేం అలా అనటంలేదు…” అంటూ బుంగమూతి పెట్టింది.
“నువ్వు మట్టుకు చిన్నదానివా మరి? నీ ప్రాజెక్టులు చేసుకో, నీ చదువులు చదువుకో. తుఫాను అంటున్నారు కదమ్మా! రేపటిదాకా ఆగితే తుఫాను మొదలైతే కష్టం కదమ్మా?” అన్నాడాయన. నవ్వుతూనే తండ్రికి సంచి అందించింది పాప. ఆయన స్కూటర్ ఎక్కగానే, ‘జాగ్రత్త నాన్నారు’ అంటూ హెచ్చరించి ఆయన వీధి మలుపు తిరిగేవరకు చూసి ఇంట్లోకి వెళ్ళిపోయింది.
సూపర్ మార్కెట్‌లో కావలసినవి అన్నీ తీసుకుని చివరికి కోడిగుడ్లు ఉన్న అరవైపుకి వెళ్ళాడాయన. అక్కడ ఇద్దరు యువకులు అడ్డంగా నిలబడి వాళ్ళల్లోవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు కదిలితే తనకి కావలసినవి తీసుకుందామని ఒక రెండు నిముషాలు ఆగి చిన్నగా దగ్గాడు. వాళ్ళు కదల్లేదు. కాసేపాగి వెళ్ళిపోయారు.
కొనుక్కున్నవాటన్నింటికి బిల్లు వేయించుకుని, డబ్బులిచ్చి, సరుకులన్నింటిని తాను తెచ్చుకున్న సంచులలోకి మార్చుకుని బయటికి వచ్చేటప్పడికి చీకటిగా ఉంది. ఆకాశంలోకి చూస్తే నల్లటి మబ్బులు ఎవరో వెమ్మటపడ్డట్టు పరిగెడుతున్నాయి. సెల్లార్ పార్కింగులోనుండి స్కూటర్‌ని తీసుకుని బయటికి వచ్చేటప్పుడు రేర్ వ్యూ అద్దం మీద ఠప్పుమని ఒక చినుకు రాలింది. ఒక్క క్షణం ఆగాడాయన. తలెత్తి పైకి చూశాడు. మబ్బులు దట్టంగా అలుముకున్నాయి. వర్షం పెరిగి పెద్దదయ్యేలోపు ఇంటికి చేరుకోవచ్చనుకున్నాడాయన. కొంచెం వేగం పెంచి స్కూటర్ని ముందుకు దూకించాడు. సూపర్ మార్కెట్ ప్రహరీ గోడ దాటి రోడ్డు మీదకి వెళ్ళేటప్పడికి తుప్పర కాస్త చిన్న జల్లయ్యింది. లాభంలేదు, తడిచిపోతాననుకున్నాడు. స్కూటర్‌ని వెనక్కి తిప్పాడు. ఆ తిప్పేటప్పుడు కుడి కాలుని నేలమీద ఆనించి తిప్పాడు.
సరిగ్గా అప్పుడే వెనక నుంచి వచ్చిన ఎర్రని ఎరుపురంగులో ఉన్న స్కూటర్ ధడ్‌మని సరాసరి ఆయన కుడికాలుని గుద్దింది. స్కూటర్ ఒకవైపు పడిపోతే, అబ్బా! ఆంటూ ఆయన బాధతో అరుస్తూ డాష్ కొట్టిన ఎర్ర స్కూటర్ ముందు చక్రం దగ్గిర పడిపొయ్యాడు. ఆయన స్కూటర్ ఫుట్‌రెస్ట్ మీద ఉన్న వెచ్చాల సంచులు రెండూ కిందపడిపోయి సరుకులన్నీ చెల్లాచెదురైపోయాయి. ఎర్ర స్కూటర్ మీదున్న ఆ ఇద్దరు యువకులు ఆయన వైపు కూడా చూడకుండా నిర్లక్ష్యంగా స్కూటర్‌ని పక్కకి తప్పించి, ఆయన్ని దాటుకుని వేగంగా రోడ్డుమీదకి వెళ్ళి ట్రాఫిక్‌లో కలిసిపొయ్యారు.
ఆక్సిడెంట్ శబ్దానికి సెక్యూరిటీ గార్డు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన రెండు చంకల కింద చెయ్యివేసి నెమ్మదిగా ఆయన్ని సూపర్ మార్కెట్ మెట్ల మీదకి నడిపించాడు. వర్షం పడుతుందని సూపర్ మార్కెట్ వరండాలో తడవకుండా నిలబడినవారిలో ఇద్దరు యువకులు, వాళ్ళ చేతుల్లో సంచులు అక్కడే వదిలేసి పడిపోయిన స్కూటర్ దగ్గిరకు పరుగెత్తుకుంటూ వెళ్ళారు. వారిలో ఒకరు కిందపడిపోయిన వాటిని సంచులలోకి సర్ది, అక్కడే వర్షంలో తడుస్తున్న మొబైల్ ఫోన్ తీసుకుని ఆయనకి అందించి, సరుకుల సంచులను ఆయన పక్కనే పెట్టారు. మరొకరు స్కూటర్ ఇంజన్‌ని ఆపి, దాన్ని తీసుకువెళ్ళి మెట్ల పక్కనే స్టాండ్ వేసి నిలబెట్టారు. ఈ లోపు అక్కడే ఉన్న మరొకరెవరో మంచినీళ్ళ సీసా ఇచ్చారు. రెండు గుక్కలు తాగి, వారికి ‘థాంక్స్’ చెప్పాడాయన.
ఫోను చేద్దామని ప్రయత్నిస్తే డిస్‌ప్లే కూడా రావడంలేదు అందులో. తలని ముందుకి వంచి భారంగా అలా కూర్చుండిపొయ్యాడు. సరిగ్గా అప్పుడే ఆయన పక్కింట్లో ఉండే వైశాలి బయటికి వచ్చి ఆయన్ని చూసి, “అయ్యో! అంకుల్ ఏమయ్యింది?” అని ఆదుర్దాగా అడుగుతూ ఆయన పక్కనే కూర్చుండిపోయింది. పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఆమెకు జరిగింది వివరించాడు. “రండి అంకుల్, నేను మిమ్మల్ని తీసుకువెడతాను” అంటూ సెల్లార్ లోకి వెళ్ళి తన కారుని తీసుకొచ్చి మెట్ల దగ్గిర ఆపింది. వర్షం పడుతూనే ఉంది. పక్కనున్నవాళ్ళ సహాయంతో ఆయన్ని లేపి కారు వెనక సీట్లో కూర్చోబెట్టింది. ఆయన వెచ్చాల సంచులు, తను కొనుక్కున్నవన్నింటిని కారు ముందు సీట్లో తనపక్కనే పెట్టుకుంది. “స్కూటర్…” అని ఆయన సగంలో ఆగిపోయాడు. అది విని, ‘మావాళ్ళు వచ్చి స్కూటర్‌ని తీసుకెళ్తారు. అప్పటిదాకా కాస్త చూసుకోండి’ అని సెక్యూరిటీ గార్డుకి అప్పజెప్పింది.
“రుక్కూ! రుక్కూ!” కారు దిగి, గేటు తీసి అరుస్తూ లోపలికి వెళ్ళింది వైశాలి. “ఏమిటి కంగారు?” అంటూ రుక్కు బయటికి వచ్చింది. తన వెనకే వాళ్ళమ్మ కూడా. రుక్కు గేటు బయట ఉన్న కారులోకి చూసింది. వెనక సీట్లో అలసిన ముఖంతో తండ్రి. గబగబా ఆయన వైపుకి వెళ్ళింది. ఆయన బట్టలు వర్షపు నీటితో పూర్తిగా తడిచిపొయ్యాయి. తడిచిన తలనుండి వర్షపు నీరు నెమ్మదిగా కిందకి జారి కారు సీటు కూడా తడుస్తోంది. వైశాలి పిలుపు విని గుమ్మంలోకి వచ్చిన రుక్కు తల్లికి ఏదో జరిగిందన్నది అర్థమై, వంగి కారులోకి చూసింది. అలసట, ఆందోళన నిండిన మొహం, తడిచిన బట్టలతో అచేతనంగా కూర్చున్న ఆయన కనబడ్డాడు. జరగరానిదేదో జరిగిందన్న ఆలోచన ఆమెని ఆక్రమించుకుంటూ ఉంటే, “కంగారు పడాల్సిందేమి లేదు ఆంటీ” అంటూ అప్రమత్తంగా ఉన్న వైశాలి ఆమెని పొదివిపట్టుకుని నెమ్మదిగా దివాను మీద గోడకానించి కూర్చోబెట్టింది.
వైశాలి, రుక్కు ఇద్దరూ కలిసి నెమ్మదిగా ఆయన్ని వరండాలోకి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోపెట్టారు. ఈ లోపు ఆవిడ లోపలికి హడావుడిగా వెళ్ళి పొడితువ్వాలు తీసుకువచ్చి ఏడుస్తూ ఆయన వంటిమీదున్న తడిని తుడవడం మొదలుపెట్టింది. “ఏడవకే! ఏం జరగలేదు, కిందపడ్డాను అంతే!” అంటూ ఆవిడకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాడు ఆయన. లోపల వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టే ప్రయత్నంలో పడింది రుక్కు. వైశాలి కారులో నుంచి సరుకులు, సంచులు అన్నీ తీసుకుని తిన్నగా వంటగదిలోకి వచ్చి వాటన్నింటిని గట్టుమీద సర్దింది.
“ఇంతకీ ఏమయ్యింది?” వైశాలిని అడిగింది రుక్కు.
“ముందు వాళ్ళిద్దరికి కాఫీ ఇచ్చిరా. మనం మాట్లాడుకుందాం” అంటే కప్పుల్లో కాఫీ పోసి, వరండాలోకి వెళ్ళి వాళ్ళిద్దరికీ ఇచ్చి వచ్చి వైశాలి ముందు కూర్చుంది రుక్కు. నెమ్మదిగా ఊదుకుంటూ కాఫీని సిప్‌చేస్తూ సూపర్ మార్కెట్ దగ్గిర సెక్యూరిటీ గార్డు తనకి వివరించింది రుక్కుకి చెప్పింది వైశాలి. “మరి ఆ ఇద్దరు ఇడియట్స్‌ని వాళ్ళెవరూ ఆపలేదా?” అని అడుగుతున్నప్పుడు రుక్కు పెదవులు కోపంతో వణకడం వైశాలి గుర్తించలేదు.
“లేదు. ఒకవైపు అక్కడ ఏమయిందో అర్థం అయేలోపే వాళ్ళు స్కూటర్ మీద వెళ్ళిపోయ్యారుగా! పైగా నేను అక్కడ లేను. షాప్ లోపలున్నాను.”
“ఔను, నువ్వు లేవుగా! సమయానికి అక్కడుండి చాలా హెల్ప్ చేశావ్ వైశాలి! థాంక్ యూ సోమచ్!”
“వర్షం తగ్గిందిగా! నేను ఇక ఇంటికి వెళ్తాను,” అంటూ వైశాలి బయలుదేరింది.
“థాంక్స్ తల్లీ!” అంటూ ఆయన చెయ్యిజాచి షేక్‌హాండ్ ఇచ్చాడు.
“నువ్వు లేకపోతే ఏమైపొయ్యేవారో ఆయన!” అంటూ రుక్కువాళ్ళమ్మ వైశాలి భుజాల్ని పట్టుకుని కన్నీరుతో అడుగుతుంటే, “అదేమిటి ఆంటీ, అలాగంటారు? అంకుల్ బాగానే ఉన్నారుగా! నేను అక్కడ ఉన్నాను కాబట్టి తీసుకువచ్చాను!” అంటూ నవ్వుతూ జవాబిచ్చింది. కారు వెళ్ళేదాకా గేటు దగ్గిరే నిలబడి వెనక్కి ఇంట్లోకి వచ్చింది పాప.
వరండాలో కూర్చున్న ఆయన్ని తల్లీకూతుళ్ళిద్దరు తమ భుజాల ఆసరాతో బెడ్‌రూమ్‌లోకి తీసుకువెళ్ళారు. ఆయన కుంటడం గమనించిన పాప ఆయన కాళ్ళని పరిశీలిస్తే కుడికాలు మడమ దగ్గిర వాపు కనపడింది. “కొంచెం బెణికినట్టుందమ్మ! తగ్గిపోతుందిలే,” అన్నాడాయన. “నేను చెప్తే వినరు నాన్నారు మీరు! మిమ్మల్ని వెళ్ళొద్దన్నాను కదా!” అని ఏడుపు గొంతుతో గుణిసింది. “నేనే పాపిష్ఠిదాన్ని. అనవసరంగా పంపాను!” అని తల్లి నిష్టూరంగా అంటూ, చీర కొంగుతో ముక్కు తుడుచుకుంటూ వెళ్ళి వేడినీళ్ళు తీసుకువచ్చి ఆ మడమకి కాపడంపెట్టటం మొదలుపెట్టింది.
“ఏమిటి ఆలోచిస్తున్నారు?” అడిగింది పాప.
“స్కూటర్ అక్కడే ఉందమ్మా, తీసుకురావాలి కదా!”
“ఫరవాలేదు. నేను రేపు వెళ్ళి తీసుకొస్తానులెండి! మీరు కాస్త రెస్ట్ తీసుకోండి!” అంటూ “ముందు మీరు పడుకోండి. తరువాత మిగతా సంగతులు చూద్దాం,” అని ఆయన పడుకున్న తరువాత భుజాలవరకు దుప్పటి కప్పి ఇద్దరూ ఆ గది నుండి బయటికి వచ్చి హాల్లో కూర్చున్నారు.
“రేపు పొద్దుటికి ఆ కాలు వాపు తగ్గకపోతే డాక్టర దగ్గిరకు తీసుకువెళ్దామమ్మా.” తల్లి సరే అన్నట్టుగా తల ఊపింది. ఇద్దరూ ఎవరి ఆలోచనలోకి వారు జారుకున్నారు. ఆ రాత్రి ఇద్దరికి బరువుగానే గడిచింది. కూతురు ముందు భార్య ముందు వాళ్ళు భయపడతారని తన కాలి నొప్పిని భరించాడు కానీ నొప్పి ఎక్కువగానే ఉంది. దానితో ఆయనకూ సరిగ్గా నిద్రపట్టలేదు.
మరుసటి ఉదయం పాప లేవగానే వసారాలోకి వెళ్ళింది. చక్కగా దివాను మీద కూర్చుని చిన్న ముక్కాలి పీటమీద కుడిపాదం మోపి పేపర్ చదువుకుంటున్నాడాయన. అటుపక్కన ట్రేలో కాఫీ. ఆయన కాళ్ళ దగ్గిర కూర్చుని పజామా పైకి లాగి మడమ దగ్గిర వాపు ఎలాగుందో చూసింది. కాస్త తగ్గినట్టు కనపడింది.
“నొప్పి తగ్గిందా నాన్నారు?”
“తగ్గిందమ్మా. అమ్మని నిద్ర లేపకుండా నేనే వచ్చేశా ఇక్కడకి!” నవ్వుతూ అన్నాడాయన.
“పోనిలే! సాయంత్రం వరకు చూద్దాం! మీరు మరీ అటూ ఇటూ తిరగొద్దు. మళ్ళీ ఆ కాలుకి ఏమైనా అయితే కష్టం!” అంది.
“అలాగేరా!” అంటూ తన కూతూరు తల నిమిరాడాయన.
“నిన్న హడావుడిలో స్కూటర్ కీస్ చూడలేదు. అవి తీసుకుని సూపర్ మార్కెట్‌కి వెళ్ళి స్కూటర్ తీసుకుని వస్తాను.”
“రాత్రి బట్టలు మార్చుకుంటునప్పుడు ఆ కీస్ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను తల్లీ! చూసుకుని తీసుకో.”
“అస్సలు ఎలా జరిగింది నాన్నారు ఆక్సిడెంట్?”
వర్షం పడటం, తడిచిపోతానేమోనని మళ్ళీ వెనక్కి తిరగటం, ఈ లోపు ఆ ఇద్దరూ ఉన్న స్కూటర్ తనని గుద్దడం, తను పడిపోవడం చెప్పాడాయన.
“స్కూటర్ నెంబరు చూశారా నాన్నారు? గుర్తుందా?”
“లేదమ్మా చూడలేదు. చూసేంత టైమ్ ఏది? నా వెనక చూసుకునే స్కూటర్ తిప్పాను. వాళ్ళు వచ్చి నామీద పడ్డారు. కింద పడిపొయ్యాను! చూసి గుర్తుపెట్టుకునేంత వ్యవధి ఏది?” అంటూ ఆయన పేపర్లో మునిగిపొయ్యాడు.
వెంటనే స్కూటర్ తాళాలు తీసుకుని, ముఖానికి మాస్క్ తగిలించుకుని సూపర్ మార్కెట్‌కి వెళ్ళింది రుక్కు. సెక్యూరిటి గార్డ్ తలుపు దగ్గిర లేడు. అతను ఉండే బల్లమీద చిన్న నోట్ బుక్, కాప్ లేని బాల్‌పెన్ వున్నాయి. ఇంతలో డెలివరీ వాన్ నుండి పెట్టెలు దింపుతూ కనబడ్డాడు సెక్యూరిటీ గార్డు. అతని వైపుకి అడుగులు వేసేలోపే అతనే ఆమె దగ్గిరకి వచ్చాడు.
“నిన్న సాయంత్రం డ్యూటీలో ఉన్నది మీరేనా?” అడిగింది నవ్వుతూ.
“ఔను మేడమ్! ఎందుకని అడుగుతున్నారు?”
“నిన్న సాయంత్రం మా నాన్నారు స్కూటర్ మీదనుంచి పడిపోతే హెల్ప్ చేశారంట, మీకు థాంక్స్ చెబుదామని అడుగుతున్నా!”
“ఔనా మేడమ్! ఆయన మీ నాన్నగారా?”
“ఔనండి. మా స్కూటర్ ఇక్కడే ఉండిపోయింది! ఎక్కడుంది అది?”
“కింద సెల్లార్‌లో పెట్టారు మేడమ్. కీస్ ఇవ్వండి, తెచ్చిపెడతాను.”
స్కూటర్ కీస్ అతనికిచ్చింది. రెండు నిముషాలలో స్కూటర్ తీసుకొచ్చి పెట్టాడతను.
“అవునూ, మీరు ఆ ఎర్ర స్కూటర్ నంబర్ చూశారా? పోనీ ఆ నడిపేవాళ్ళను?”
“లేదు మేడమ్! కానీ గుర్తుపడతాను. ఈసారి రాగానే నంబర్ నోట్ చేసుకుంటాను.”
“థాంక్ యూ. మీ పేరు?”
“జోసెఫ్, మేడమ్.”
అతనికి థాంక్స్ చెబుతూ తన ఫోన్ నంబర్‌తో పాటు యాభై రూపాయల నోటు ఇవ్వబోయింది. అతను వద్దన్నాడు. ‘ఫరవాలేదు’ అంటూ బలవంతంగా చేతిలోపెట్టింది. మొహమాటంగానే తీసుకున్నాడు.
పార్కింగ్ లాట్‌లో ఉన్న స్కూటర్ ఎక్కి స్నేహితురాలు లావణ్య దగ్గిరకి బయలుదేరింది. లావణ్య వాళ్ళ అపార్ట్‌మెంట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీగోడకి ఆనుకునే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో ఒక స్కూటర్ సర్వీసింగ్ సెంటర్ కూడా ఉంది. స్కూటర్ చూపించి ఎస్టిమేట్ వేయించుకుంటే ఒక పని ఐపోతుంది. నాన్నారితో మాట్లాడి స్కూటర్ రిపేర్ల మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. తన ముందు ఆటో. కదలదు. మెదలదు. రెండుసార్లు హార్న్ మోగించింది. కదలటంలేదు. కుడిచేతి వైపు నుంచి దాన్ని ఓవర్‌టేక్ చేస్తూ ఆటో లోపలికి చూసింది. ఆటో డ్రైవర్ పాసింజర్‌తో గొడవపడుతున్నాడు. అసలే విసుగ్గా ఉందేమో ఆక్సిలేటర్‌ని పెంచి స్కూటర్‌ని రాష్‌గా ముందుకు దూకించింది.
లావణ్య వాళ్ళ అపార్ట్‌మెంట్స్ గేట్ దగ్గిర ఆగినప్పుడు తన ఫోన్ రింగవుతున్నదని గ్రహించింది. జేబులోనుంచి ఫోను తీసి చూస్తే నాలుగు మిస్‌డ్ కాల్స్ ఉన్నవి. ట్రాఫిక్ రొదలో వినపడలేదు. స్కూటర్‌ని ఒక పక్కకు ఆపి జోసెఫ్‌కి ఫోన్ చేసింది.
“హల్లో!”
“మేడమ్, మీరు చూడలేదా?”
“ఏం చూడలేదు? మీరడిగింది నాకు అర్ధంకావటంలేదు!”
“మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీకు వాళ్ళు ఎదురొచ్చారుగా?”
“లేదే… నా ముందు ఆటో ఉందిగా…” అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది.
“అప్పుడే మేడమ్…”
బహుశ తను ఆటో దాటుకుని వచ్చేటప్పుడు అటోకి అటువైపు అంటే రాంగ్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళుంటారు. వెధవలు! వాళ్ళకి అది అలవాటేగా అనుకుంటూ ముఖం చిట్లించింది.
“సరే. వాళ్ళిప్పుడు ఎక్కడున్నారు?”
“పార్కింగులోకి వెళ్ళారు మేడమ్. మీరు వస్తారా?”
“ఆ వస్తాను. మీరు ఈ లోపు స్కూటర్ నెంబర్ నోట్ చేసుకోండి,” అంటూ గిర్రున స్కూటర్‌ని వెనక్కి తిప్పి సూపర్ మార్కెట్ దగ్గరకు బయలుదేరింది.
హడావుడిగా సెల్లార్ లోకి తన స్కూటర్‌ని తీసుకువెళ్ళి, ఎర్రరంగు స్కూటర్ కనబడుతుందేమోనని చూసింది. విశాలమైన సెల్లార్. కనబడలేదు. హడావిడిగా సెక్యూరిటి దగ్గిరకు పరిగెత్తింది. బారులుగా కష్టమర్లు జోసెఫ్ ముందు నిలబడి ఉన్నారు. ఒకొక్కళ్ళ బిల్లు అందుకుంటూ, సరుకుల బాగ్ చెక్ చేసి, బిల్లు పంచ్ చేసి ఇస్తున్నాడు. ఈ లోపు షాపులోకి వస్తున్నవాళ్ళకి గ్లొవ్స్ ఇచ్చి, టెంపరేచర్ చూసి, చేతులకి శానిటైజర్ అందిస్తున్నాడు. లోపలికి వెళ్ళి చూద్దామంటే వాళ్ళు ఎలా ఉంటారో రుక్కుకి తెలీదు. బయట నిలబడే బదులు లోపలికి వెళ్దామనుకుని షాపులోకి వెళ్ళింది. ఎడం చేతివైపునుంచి ఒకొక్క వరుస చూసుకుంటూ కుడివైపుకి వచ్చింది. బిల్లింగ్ కౌంటర్ దగ్గిర ఒక నిముషం ఆగి మళ్ళీ చూసింది. వాళ్ళెక్కడా కనపడలేదు. జారిన మాస్క్‌ని ఇంకొంచెం తప్పించి ఎడంచేతి చిటికెనవేలుని నోట్లో పెట్టుకుని గోరుని కొరుక్కోవడం మొదలుపెట్టింది. ఆలోచనలో ఉండి వేలి చిగురుని కూడా కొరికింది. నొప్పి!
దున్నపోతులు! స్టుపిడ్స్! ఇడియట్స్! కిందపడ్డ నాన్నారికి హెల్ప్ చేసుంటే అదో పద్ధతిగా ఉండేది. తప్పించుకుని వెళ్ళిపోతారా! వాళ్ళు అసలు మనుషులేనా? వాళ్ళని వదలకూడదు. ఒక నిర్ణయానికి వచ్చింది. అరకిలో పంచదార పాకెట్ కొనుక్కుని బయటపడింది.
జోసెఫ్‌కి కొంచెం ఖాళీ దొరికినట్టుంది. జోసెఫ్ దగ్గిరకు వెళ్ళి, “లోపలున్నట్టు లేరుగా?” అంది.
“మేడమ్, మీరు అటు లోపలికి వెళ్ళారు. వాళ్ళు ఇటు బయటికొచ్చారు. మిమ్మల్ని పిలవడానికి నాకు కుదర్లేదు! సారీ. కాని నంబర్ ఇదిగోండి మేడమ్” అంటూ తన షర్టు జేబులోనుంచి ఒక చిన్న పాకెట్ నోట్ బుక్ తీసి, అందులో ఒక పేజి రుక్కుకి చూపించాడు. బాల్‌పెన్‌తో ముద్దలుముద్దలుగా రాసిన స్కూటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అది.
“థాంక్యూ, థాంక్యూ సోఓఓ మచ్!” అంటూ జోసెఫ్ చేతిని అందుకుని ఊపేసింది. మొహం నిండా సంతోషం. తన స్మార్ట్‌ఫోన్‌తో ఆ పేజి ఫోటో తీసుకుంది.
“వాళ్ళు ఎటు వెళ్ళారో చూశారా?”
“ఆఁ, వాళ్ళ స్కూటర్‌కి ఏదో ట్రబుల్ ఉందనుకుంటాను. ఈ దగ్గిర్లో ఏదైనా సర్వీస్ సెంటర్ ఉందా అని అడిగారు.”
“ఆ… వుందిగా! ఇక్కడికి దగ్గిర్లో అపార్ట్‌మెంట్స్ దగ్గిర అని చెప్పలేకపొయ్యారా?” ఆత్రంగా అంది.
జోసెఫ్ రుక్కు ఆత్రానికి నవ్వాడు. “చెప్పాను మేడం. బహుశా అక్కడికే వెళ్ళినట్టున్నారు. మీరు పోలిస్ కంప్లెయింట్ ఇవ్వండి మేడమ్! నేను సపోర్ట్ చేస్తాను.”
“కంప్లయింటా? చూద్దాం. వాళ్ళని ఒకసారి చూడనియ్యండి.” గబ గబా తన స్కూటర్ దగ్గిరకు వెళ్ళి, ఇందాక కొన్న పంచదార పాకెట్‌ని సీట్ కింద స్టొరేజ్‌లో పడేసి, స్కూటర్ స్టార్ట్ చేసి లావణ్యవాళ్ళ అపార్ట్‌మెంట్స్ దగ్గిరకు వెళ్ళింది.
స్కూటర్ సర్వీస్ సెంటర్ తెరిచే ఉంది. లోపల రెండు మూడు స్కూటర్స్ ఉన్నాయి. ఎర్రరంగు స్కూటర్ బయట స్టాండ్ వేసి నిలబెట్టి ఉంది. రుక్కు తన స్కూటర్‌ని దాని పక్కనే స్టాండ్ వేసి నిలబెట్టింది. దాని కీ దానికే ఉంది. దాని పక్కనే ఇద్దరు యువకులు నిలబడి ఉన్నారు. ఒకడి ముఖానికి మాస్క్ ఉంది. రెండోవాడు సిగరెట్ కాలుస్తున్నాడు. సర్వీస్ సెంటర్ సూపర్‌వైజర్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. “జస్ట్ ఎ మినిట్ మేడమ్!” అని రుక్కుతో అని మళ్ళీ మాటలు కొనసాగించాడు. ఇంతలో రుక్కు ఫోను మోగింది.
“హల్లో!”
“పాపా. ఎక్కడున్నావమ్మా?”
“ఇక్కడ స్కూటర్ సర్వీస్ సెంటర్‌కి వచ్చాను నాన్నారు.”
“వెళ్తేవెళ్ళావు కాని నాకో అమ్మకో చెప్పి వెళ్ళొచ్చు కదు తల్లీ! స్టవ్ మీద డికాక్షన్ అలా వదిలేశావు. ఫ్రిడ్జ్ తలుపు వెయ్యకుండా వెళ్ళిపొయ్యావు! అమ్మ కంగారుపడుతోంది, అదేదో అఘాయిత్యం చేసేటట్టుందని! నువ్వు వెంటనే ఇంటికి వచ్చెయ్. లేకపోతే నేనే బయలుదేరి వస్తానక్కడికి!” అని కొంత చిరాకుగానే అన్నాడాయన.
“కంగారువద్దు నాన్నారు. ఒక పది నిముషాలలో వచ్చేస్తాగా! వీళ్ళు ఎస్టిమేట్ ఇవ్వాలిగా. ఒక్క పది నిముషాలు, ప్లీజ్. వచ్చేస్తా. మీరు రానక్కర్లేదండి.”
“పది నిముషాలలో నువ్వు ఇంట్లో లేకపోతే నేను బయలుదేరి వస్తాను పాపా!” ఆయన ఫోన్ కట్ చేశాడు.
తనలో తను నవ్వుకుంది రుక్కు.
“రేయి శివా, లోపల పెట్రోలుందా? ఈ స్కూటర్‌కి పెట్రోల్ కావాలి!” అరిచేడు పెద్దగా సూపర్‌వైజర్.
“లేదన్నా! ఇందాకే నీతో చెప్పానుగా డబ్బా ఖాళీ అని?” అన్నాడు కుర్రాడు.
“అవును కదా! సరే, ఆ పక్కనే బాటిల్ పెట్రోల్ అమ్ముతారు. వీళ్ళకి చూపించు!”
“అరే శివా! ఈ వంద తీసుకొనెళ్ళి బాటిల్ తీసుకురా. ఈ లోపు మేం చాయ్ తాగి వస్తాం.” అంటూ వాళ్ళిద్దరూ వీధిలోకి నడిచారు.
“ఏమిటి మేడమ్ ట్రబుల్?” అని రుక్కుని అడిగాడు సూపర్‌వైజర్.
“మొన్న వర్షంలో కిందపడింది. అందుకని ఒకసారి చూపించి చెయ్యాల్సిన పనులేవన్నా ఉంటే చేయించేద్దామని.”
స్కూటర్ చుట్టూ ఒకసారి తిరిగి చూసి, “స్క్రాచెస్ పడ్డాయి మేడమ్. అంతే. పెయింట్ టచప్ చేస్తే సరిపోతుంది.”
“ఒకే. బట్, ఒకసారి ట్రయల్ చూడండి. మా నాన్నారు అప్పుడప్పుడు వాడతారు. ట్రబుల్ ఇవ్వకూడదు కదా! అందుకని.”
“సరే మేడమ్. కీస్ ఇవ్వండి.”
రుక్కు కీస్ అందించింది. అతను లోపల హెల్మెట్ కోసం వెళ్ళాడు. ఈ లోపు అతనికి కనబడకుండా అడ్డంగా నిలబడి, తన స్కూటర్ డిక్కీలోనుండి ఇందాక కొన్న పంచదార పాకెట్ తీసుకుని, తన షోల్డర్ బాగ్ లోకి జారేసింది.
“మీరు కూర్చోండి మేడమ్. శివా వచ్చేస్తాడు. ఐ విల్ బి బాక్.” స్కూటర్ కీస్ తీసుకుని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపొయ్యాడు.
రుక్కు అటూ ఇటూ చూసింది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఎర్రరంగు స్కూటర్ దగ్గిరకు వెళ్ళి చూసింది. వేలాడుతున్న తాళంచెవి తీసింది. సీట్ వెనక హాండ్ గ్రిప్‌కి ఎడంచేతివైపున వెనక వీల్ కవర్ పైనున్న పెట్రోల్ టాంక్ కీహోల్‌లో తాళంపెట్టి తిప్పింది. ‘క్లిక్’మన్న చప్పుడుతో లాక్ రిలీజ్ అయ్యింది. సీట్‌ని ఎత్తి పెట్రోల్ టాంక్ మూత తీసి బండిని ఊపి చూసింది. లోపలెక్కడో అడుగులో పెట్రోల్ ఉంది. షోల్డర్ బాగ్ లోనుండి పంచదార పాకెట్ బయటకుతీసి నోటితో కొరికి ఓపెన్ చేసి ఎవరికీ కనపడకుండా అడ్డం నిలబడి పెట్రోల్ టాంక్‌లోకి దాన్ని ఒంపింది. సీట్ దింపేసి కీస్ మళ్ళీ కీహోల్‌లో పెట్టేసింది.
“అక్కా, అన్నేడక్కా?” శివ గొంతు విని ఉలిక్కిపడింది.
“నా స్కూటర్ ట్రయల్ చూస్తానని తీసుకువెళ్ళాడు. నువ్వు వస్తే చెప్పమన్నాడు,” అంది తడబడుతూ.
ఇంతలో వాళ్ళిద్దరూ తిరిగొచ్చారు. “అక్కడ పెట్రోల్ దొరకలేదన్నా,” అన్నాడు శివ వాళ్ళతో.
“రేయ్ శివా, మీ అన్నకి మేము బంక్‌లో పెట్రోల్ పోయించుకుని మళ్ళీ వస్తామని చెప్పు!” అని చెప్పి స్కూటర్ తీసుకొని ఫుట్‌పాత్ మీదనుండే రోడ్ మీదకు తిప్పి వెళ్ళిపొయ్యారు. ‘వేస్ట్ ఫెలోస్’ అనుకుంటూ వాళ్ళు కనుమరుగయ్యేవరకు ఆ స్కూటర్‌నే చూస్తూ ఉండిపోయింది రుక్కు.
“ఇంజిన్ అండ్ ఎవ్విరిథింగ్ ఈజ్ గుడ్ మేడమ్. నో ప్రాబ్లమ్స్. ఒకసారి సర్విసింగ్ చేయించండి. పెయింట్ టచప్స్ చేస్తే సరిపోతుంది మేడమ్.” స్కూటర్ పార్క్ చేస్తూ అన్నాడు సూపర్‌వైజర్.
“ఓహ్! థాంక్యూ సోమచ్. మీ కార్డ్ ఇవ్వండి. నేను నాన్నగారితో కాల్ చేయిస్తాను.”
అతను ఇచ్చిన కార్డ్ తీసుకుని థాంక్స్ చెప్పి రుక్కు తన స్కూటరెక్కి ఇంటికి బయలుదేరింది. సిగ్నల్స్ దగ్గిర గ్రీన్ లైట్ పడగానే ముందున్న బస్ వెనకే వెళ్తుంటే క్రాస్‌రోడ్స్ మధ్యలో బస్సు ఆగిపోయింది. నాలుగువైపుల కార్లు, ఆటోలు, బైకులు, స్కూటర్లు, లారీలు, సైకిళ్ళు. బస్‌ని దాటుకుని ముందుకువచ్చి అది ఎందుకు ఆగిపోయిందా అని చూసింది. బస్సు ముందు ఎర్రరంగు స్కూటర్ స్టాండ్‌వేసి నిలబెట్టివుంది. కిక్‌కొట్టి స్టార్ట్ చేద్దామనుకుంటునట్టున్నారు. కిక్‌లు కొట్టీ కొట్టీ చెమటతో తడిచిపోయి ఉంది ఆ మాస్క్ వేసుకున్నవాడి షర్టు. అతని పక్కనే బిక్కమొహం వేసుకుని వాడి ఫ్రెండ్ నిలబడి ఉన్నాడు. ఇంతలో ట్రాఫిక్ కానిస్టేబుల్ విజిల్ ఊదుతూ స్కూటర్‌ని పక్కకు లాగమని దానిమీద లాఠీపెట్టి కొడుతూ వాళ్ళను బెదరగొడుతున్నాడు. పక్కకు తియ్యమని చుట్టూ ఉన్నవాళ్ళు, ఆ ఎర్రరంగు స్కూటర్‌వాళ్ళని నానా బూతులు తిడుతున్నారు. ఈ లోపు కారులో నుంచి ఒక డ్రైవర్ కిందకి దిగాడు. అతనితో పాటు మరొకరున్నారు. ఇద్దరూ కలిసి స్కూటర్‌ని రోడ్డు పక్కకి ఈడ్చి పారేశారు. రుక్కు పక్కనే నెమ్మదిగా కదులుతున్న కారు ఫ్రంట్ సీట్‌లో ఉన్న పెద్దాయనకి రుక్కు ఎందుకు అలా తెరలు తెరలుగా నవ్వుకుంటుందో అర్థంకాలేదు.
“నాన్నారు, నేను వచ్చేశా!” అంటూ పాప ఎగిరి వరండాలోకి దూకింది. దివాను మీద కూర్చునున్న ఆయన కోపంగా చూశాడు. ఆయన చేతిని లాక్కొని స్కూటర్ సర్వీస్ సెంటర్ బిజినెస్ కార్డ్ పెట్టింది. పెట్టి ఊరుకోలేదు. తన మొఖానికి ఉన్న మాస్క్ తప్పించి ఆయన గడ్డం పట్టుకుని మొహం తిప్పి ఆయన చెక్కిలి మీద గట్టిగా చప్పుడుచేస్తూ ముద్దుపెట్టింది.
“ఏమయ్యింది?”
అమాయకంగా మొహంపెట్టి, “ఏమవ్వడం ఏమిటి? ఏమి అవ్వలేదు నాన్నారు! సర్వీస్ సెంటర్‌కి వెళ్ళి ఎస్టిమేట్ వేయించాను మన స్కూటర్‌కి, అంతే.” అంటూ ఆయన మెడచుట్టూ చేతులువేసి తలని భుజంమీదకి వాల్చింది.
“నాకు తెలుసు నా కూతురు గురించి. చెప్పు! ఆ స్కూటర్‌వాళ్ళని ఏం చేసావ్?” అంటూ తన గారాలపట్టి వీపుని ప్రేమగా నిమురుతూ అడిగాడాయన.
ఆయన తన కళ్ళని చూడకుండా తన తలని తిప్పేసి, వివరాలలోకి వెళ్ళకుండా స్కూటర్ సర్వీస్ సెంటర్‌లో తను చేసినదాన్ని గురించి చెప్పింది. పాప వీపుని నిమురుతున్న ఆయన చెయ్యి ఆగింది.
“వాళ్ళు చేసింది తప్పు.”
“…కదా!”
“మరి నువ్వు చేసింది ఒప్పా?”
“కాదా మరి?”
“వాళ్ళకి తెలీదుగా, వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష పడిందని?”
“ఎందుకు తెలీదు? వాళ్ళ స్కూటర్ బాగు చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది కదా!”
“స్కూటర్ పాడైపోయిందని తెలుస్తుంది. కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా బండిని నడిపారని, ఏ మాత్రం సామాజిక బాధ్యత లేదని, అసలు ఆ అవగాహనే లేకుండా ఉన్నారని, అందుకనే… అని తెలీదు కదా?”
“వాళ్ళు చేసింది తప్పు. ఆ తప్పుకు శిక్ష పడాలి. పడింది…”
“సామాజిక బాధ్యత లేకపోవడం నేరంకాదు. అయినా, ఆ తప్పుకు ఇదే శిక్ష అని నీకెలా తెలుసు? అయినా ఆ శిక్ష వేయాల్సింది నువ్వు కాదుకదా పాపా?”
“మీ రోజుల్లో అయితే మీరు ఏ పోలీస్ కంప్లయింటో ఇచ్చి ఉండేవారేమో. న్యాయం జరిగేదా? తెలీదు! జరిగినా ఎంతకాలం పట్టేదో! అందుకే వెంటనే నాకు చేతనయ్యింది నేను చేశాను. వాళ్ళయినా ఇదే చేస్తున్నారు.”
“నువ్వే చేశావని ఆ కుర్రాళ్ళకు తెలిసిందనుకో. అదొక కొత్త ప్రమాదం. అది నువ్వు ఆలోచించలేదు. అసలు ఈ ఇన్‌స్టంట్ జస్టిస్ ఏమిటో దాని వల్ల సమాజానికి ఎంత ప్రమాదమో, దాని ఫలితాలు ఎంత దూరం వెళతాయో ఏమిటో నీకు అర్థంకావటంలేదు. అందరిలానే నువ్వూ…”
“నాన్నా ప్లీజ్! మీరు నన్ను ఆ చర్చల్లోకి లాగొద్దు. మీతో వాదించడం నాకు ఇష్టం లేదు” అంటూ సర్దుకుని ఇంకొంచెం దగ్గిరగా ఆయన్ని హత్తుకుంది.
వాళ్ళమ్మ అప్పుడే వచ్చి చూసి “చాల్లే… సంబడం,” అంటుంటే లేచి నిలబడి ఆవిడని కావలించుకుని మొహమంతా ముద్దులతో ముంచెత్తింది.
“ముందు లోపలికి వెళ్ళి, మొహమూ కాళ్ళూ చేతులూ కడుక్కో! అసలే కోవిడ్ రోజులు!”
“యెస్ మమ్మీ. నేను కేర్‌ఫుల్‌గానే ఉంటా!” అంటూ లోపలికి పరుగెత్తింది రుక్కు.
“తుఫాను మొదలయినట్టుందండీ” అంటూ ఆవిడ ఆయనవైపు చూసింది. ఆయన ఆకాశంలో దట్టంగా కమ్ముకుంటున్న మేఘాలవైపు చూస్తుండిపోయాడు.