అక్టోబర్ 2020

మట్టిముద్దగాదు మహిత సత్కవి శక్తి మట్టుచున్న నణగిమణిగి యుండ/ రత్నఖచితమైన రబ్బరుబంతియై వెంటవెంట నంటి మింటికెక్కు అని ఎంత నమ్మినా, సామాజిక అసమానతలకు గురైన ఆవేదనలో, …ఎంత రత్నకాంతి యెంత శాంతి! ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో/ పుట్టరాని చోట బుట్టుకతన అని అతను వాపోయిన మాట కూడా నిజం. ఎవడారగించు నమృతభోజనంబున గలిసెనో ఈలేమ గంజిబువ్వ/ ఎవరు వాసముసేయు శృంగార సౌధాన మునిగెనో యిన్నారి పూరిగుడిసె? అని ప్రశ్నించిన మాటా నిజం. కాని, వీటికి అతీతంగా, గవ్వకుసాటిరాని పలుగాకులమూక లసూయచేత నన్నెవ్విధిదూరినన్ నను వరించిన శారదలేచిపోవునే? అంటూ ఎనలేని ప్రతిభతో ఇంతింతగా ఎదిగి, ఆలస్యంగానైనా అందుకు తగిన గుర్తింపూ సత్కారాలూ పొంది కులమతతారతమ్యాలన్నీ తన కవితాధారతో త్రోసిరాజని మహాకవుల సరసన నిలబడ్డాడు గుఱ్ఱం జాషువా. జాషువా నూటయిరవైఐదవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అందరూ ఆయన గురించి మాట్లాడుకుంటున్న ప్రస్తుత సందర్భంలో, ఆయనను కొంతకాలంగా దళితకవిగా మాత్రమే పేర్కొనడం, ఆయన సాహిత్యాన్ని ఆ దృక్పథంనుంచే పరిశీలించడం సాహిత్యాభిమానులు నిశితంగా చర్చించాల్సిన విషయం. విశ్వనరుడనని చెప్పుకున్న ఓ కవిని ఇలా ఒక కులానికీ వర్గానికీ ప్రాంతానికీ పరిమితం చేయడం వల్ల, ఆ రకమైన ముద్రలు ఆపాదించడం వల్ల అతని కవిత్వంలోని విశ్వజనీనత కుదించబడుతుంది. ఆ సాహిత్యపు సర్వకాలీనత చెరిగిపోతుంది. కళాకారుడి సృజనకు ఇదే అసలైన గుర్తింపు పత్రమై నిలిచిపోతుంది. తన ప్రమేయం లేకుండానే తగిలించబడ్డ అస్తిత్వాన్ని మోస్తున్న దుస్థితి కేవలం జాషువా ఒక్కడిదే కాదు. ఎందరో కవులు, రచయితలు, కళాకారులు కులమతలింగప్రాంతీయాది అస్తిత్వవాదముద్రలను తమ ప్రమేయం లేకుండానే మోస్తున్నారు. తమ సృజనకు వెలుపలగా ఈ చట్రాలలో బలవంతంగా ఇరికించబడుతూనే ఉన్నారు. ఇవి తప్ప సృజనను పరిశీలించేందుకు మరేమీ తూనికరాళ్ళుగా తెచ్చుకోలేని సంకుచితవాదులతో నిందించబడుతూనే ఉన్నారు, వివక్షకూ గురి అవుతున్నారు. అభిమానంతో కొందరిని తమవారిగా ప్రకటించుకోవడానికి, మరికొందరిని శత్రువులుగా భావించి తుడిపివేయడానికి, అవే ముద్రలను వాడుతున్నామన్న గ్రహింపు లేకపోవడం గొప్ప సాహిత్యవిపత్తు. ఏ ముద్రతో ఒక కళాకారుడిని పైకెత్తుతున్నారో, అదే ముద్రతో మరొక కళాకారుడిని పతనం చేస్తున్నారని సాటి కళాకారులతో సహా ఎవరూ గుర్తించట్లేదు. ఉద్దేశ్యం మంచిదైనా చెడుదైనా చివరికి నష్టపోయేది కళ మాత్రమే. ఏ కళయైనా ఆయా కళాకారుల లోతైన అధ్యయనం, లోకాతీతమైన తపన, నిర్విరామ కృషి ఫలితం. వాళ్ళ ఉనికి కులమతవర్గవాద పరిధులకు అతీతమైనది. వారి సృజనాత్మకత అస్తిత్వాలకు, సొంత వ్యక్తిత్వాలకు అందనంత ఎత్తులోది. వారి సృజనను ఆ స్థాయిలోనే ఆ పరిధిలోనే విశ్లేషించాలి, అభినందించాలి, విమర్శించాలి కూడా. అలా కాక, కళాకారులకు సాహిత్యేతర అస్తిత్వాన్ని అంటగట్టి వారిని, వారి కళను ఆ సంకుచితదృష్టితో వెల కడితే ఏ కొద్దిమందికో తాత్కాలిక ప్రయోజనం కలగడం వినా సాహిత్యానికి యావత్‌సమాజానికి శాశ్వతమైన నష్టమే మిగులుతుంది.