ఓసారి వెళ్ళి పరామర్శించి రావాలనుకున్నాను. ప్రపంచంలో ఎందరో కొంచం కొంచంగా రోజూ పరువుని అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వాళ్ళలాంటిదే రోహిణి కూడా. అయితే మాత్రం? పరామర్శించడం అన్న సంప్రదాయపు అవసరం ఆమెకూ ఉండదా?
సముద్రం ఒడ్డున నులక మంచం మీద కూర్చున్నాను. అలల హోరు చెవులకు వినసొంపుగా ఉంది. కన్నులకు కనిపించినంత దూరం విస్తరించి ఉన్న సముద్రాన్ని చూస్తూ ఆగకుండా వినిపిస్తున్న అలల హోరుని వింటుంటే ఎన్ని సుఖదుఃఖాలనైనా మరిచిపోతాం. అంతులేని ఆ విస్తీర్ణం ముందు నేను అన్న స్పృహలేని స్థితిని చేరుకుంటాం. అలలు ఒడ్డుని తాకడం, వెనక్కెళ్ళడం అనే ఆట ఆడుకుంటున్నాయి. దూరంగా ఆకాశంలో కొన్ని నిముషాలపాటు వ్యాపించిన ఎర్రటి వెలుగు నల్లబడసాగింది. ఏదో అరుదైనదాన్ని చూసినట్టు ఒక ఈగ దర్జాగా వచ్చి నా ముక్కుమీద కూర్చుంది. చేత్తో తోలాను. నామీదెందుకో తనివితీరని ప్రేమ ఉన్నదానిలా ఆ ఈగ నా తల చుట్టూ ఎగురుతూ చెవి మీద వాలింది. తల ఊపాను. చెవిమీద నుండి లేచి తలమీద కూర్చుంది. తల గోక్కున్నాను. మళ్ళీ నా ముందుకొచ్చి చక్కర్లు కొట్టింది. సెకనుకొక్కసారి కొట్టుకుంటుంది మనుషుల హృదయం. మరి ఈగ హృదయం ఎన్నిసార్లు కొట్టుకుంటుందో! ఇంకాసేపట్లో చీకటిపడిపోతుంది. పరామర్శకు వెళ్ళాలి.
ఉన్నట్టుండి ఊది ఆర్పేసిన కొవ్వొత్తిలా రోహిణి చనిపోయింది. నెమ్మదస్తురాలు. మాట తీరు కూడా చాలా మెత్తగా ఉంటుంది. ఒకసారి ఎవరితోనో ఉంది. నేను వచ్చానని తెలిసి వచ్చి నచ్చజెప్పి వెళ్ళింది. ‘ఇది నా తలరాతండి’ అని చెప్పి నవ్వి మరీ తిరిగెళ్ళిపోయింది. తను తిరిగి వచ్చేంతవరకు నేను కాచుకుని ఉంటాననుకుంది. నేను మళ్ళీ రెండు రోజుల తర్వాతే ఆమెకోసం వెళ్ళాను. అప్పుడు, ‘అక్కకున్న అప్పులన్నీ తీర్చేసి కన్యకా స్త్రీ అయిపోతాను’ అంది. ‘లేదంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను’ అని చెప్పింది. ‘ఆత్మహత్య చేసుకోవడంలో అర్థంలేదు’ అన్నాను. ‘ఇంకెందులో మాత్రం అర్థం ఉందనీ?’ అని అడుగుతూ నా బుగ్గల మీద ముద్దులు పెట్టింది. ఆ పదీ పదిహేను ఇవ్వడం తప్ప రోహిణికంటూ నేను చేసిందేమీలేదు. ఆమెకు తెలుసో ఏమో నేను తన గురించి చాలాసార్లు తలచుకుంటూ ఉంటానని. ఒకరి గురించి తలచుకోవడం అన్నది అంత గొప్పా? మరి కాదా? చనిపోయినవారి గురించో, బ్రతికున్నవారి గురించో అప్పుడప్పుడూ తలచుకోవడం గొప్ప కాదా? రోహిణిని కలిసిన తొలిరోజు ‘నిన్ను మళ్ళీ ఎక్కడ చూడొచ్చు?’ అనడిగాను. ‘ఎనిమిదింటికి తిరవనంతపురం ఎక్స్‌ప్రెస్‌లో అక్క వస్తోంది. ఆమెను కలవడానికి స్టేషన్‌కి వెళ్తాను.’ అంది. పొద్దున ఏడుమ్ముప్పావుకే స్టేషన్‌కి వెళ్ళిపోయాను నేను. రైలు ఇరవై నిముషాలు ఆలస్యంగా వచ్చింది. రైలు మొత్తం, ప్లాట్‌ఫామ్ మొత్తం వెతికాను. రోహిణి కనిపించలేదు. వాళ్ళ అక్క జయ కూడా కనిపించలేదు. తర్వాత ఒకసారి జయని చూశాను. బ్రాందీ తాగి, వక్కాకు నములుతూ ఉంది. లావుపాటి తెల్లటి దేహం. రోహిణిలో ఉన్న నాజూకుతనం ఆమెలో లేదు. కొందరు మగవాళ్ళకు నచ్చే మొరటుతనం ఆమెలో మెండుగానే ఉందనిపించింది.
రోహిణి చనిపోయి ఇరవై రోజులు దాటింది. పత్రికలో చదివి సమాచారం తెలుసుకున్నాను. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పట్లాగే ఇంటి తలుపు బిగించి ఉంది. నేను తలుపు తట్టగానే పక్కనున్న కిటికీ సగం తీసి చూసి ‘మీరా?’ అని అడిగి తలుపు తీసింది జయ. నేను లోపలికి వెళ్ళగానే తలుపు, కిటికీ మూసింది.
“ఒక నెల రోజులుగా ఊర్లో లేను. నిన్ననే తెలిసింది విషయం…” అబద్ధమాడాను.
“కూర్చోండి. అంతా నా తలరాత.” అంది జయ.
“డాక్టర్‌కి చూపించలేదా?” అన్నాను.
“మొదట్లో మూడు రోజులు తెల్లగా వస్తోంది అంది. బామ్మగారు చెప్పారని చందన లేపనం కొని రాశాను. అది పనిచెయ్యలేదు. ముల్లంగి రసం, వెల్లుల్లి రసం, జీలకర్ర-బెల్లం అన్నీ కలిపి మూడురోజులు తాగితే సరిపోతుంది అంది స్వర్ణ. అవన్నీ చేశాము.”
“వీటికంతా ఇప్పుడు ఇంగ్లీషు మందులున్నాయిగా? పెన్సిలిన్-జి అంటారు. ఆ ఇంజెక్షన్ వేస్తే చాలు.”
“అది డాక్టర్ దగ్గరకు రాను అని మొండిపట్టు పట్టింది. రెండు నెలల్లో అంతా నయం అయిపోయినట్టే అనిపించింది. అయితే అప్పుడప్పుడూ పొట్టనొప్పి అని ఏడ్చేది. తెల్లనాముకొమ్ము నూరి బొడ్డుచుట్టూ పట్టు వేసేదాన్ని. నొప్పి కాస్త తగ్గింది అని చెప్పిందది. ఆ రోజు నేను సినిమాకు వెళ్ళాను. బావ ఎప్పట్లాగే పేకాటకెళ్ళాడు. ఎవడో ఒక అడ్డగాడిద వచ్చి ‘ఏమే లంజాముండా, నాకు రోగం అంటిస్తావా?’ అని తిడుతూనే చెప్పు తీసుకుని బాగా కొట్టాడట. వాడు వెళ్ళిపోగానే రైలుపట్టాల దగ్గరకు వెళ్ళింది… అంతే…” జయకు మాటలు రాలేదు.
“ఈ పేకాటే బావని పాడు చేసింది.” అన్నాను నేను ఏదో ఆలోచిస్తూ.
గనేరియా గురించి నాకు కొంచం తెలుసు. మా మావయ్య ఒకతను దాని బారినపడి చూపు పోగొట్టుకున్నాడు. పెద్ద డాక్టర్. అయినప్పటికీ ఆ దశలో బాగుచేసుకోలేకపోయాడు. బ్రాందీ తాగితే జబ్బు తీవ్రత తగ్గుతుందని తాగడం మొదలుపెట్టాడు. ఆ తాగుడు ఎక్కువవ్వడంతో భరించలేక అతని పెద్ద కొడుకు ఇంటినుండి తరిమేశాడు. మరుసటి రోజే అతను చనిపోయాడు. వేయి గనేరియా క్రిములను ఒక్కచోట పోగుచేస్తే గుండుసూది తలకాయంతకూడా ఉండదని చెప్పాడు ఒకసారి. ఆ క్రిములు బాగా లగ్జరీగా మాత్రమే బతకగలవు. మనిషి శరీరమే వాటి స్థావరం. వేరే మృగాల శరీరంలో బతకలేవు. గాలి గాస్త వెచ్చబడినా, వేడెక్కినా కూడా తట్టుకోలేవవి. వాటికి అలాంటి తలరాత. మనిషికి ఇలాంటి తలరాత.
“ఆ మొరటు అడ్డగాడిద కొట్టడం, అలా బూతులు తిట్టడంతో రోహిణి బాగా నొచ్చుకున్నట్టుంది. వాడు వెళ్ళగానే రైలు పట్టాలు చూసుకుంది. మళ్ళీ…” అని మొదలుపెట్టి సగంలో ఆపేసింది జయ. అయితే ఆమె పైట జారిపోయి ఉండటం చూడగానే నాకు విషయం అర్థం అయింది. జేబులోంచి పది రూపాయలు తీసి ఆమె వైపుకు చాచాను. అప్పుడు జయ ముఖంలో వెలువడిన చిరునవ్వులో రోహిణి పోలికలు ఉన్నట్టు అనిపించింది. మూసున్న తలుపుకు గడియ పెట్టి, కిటికీ బిగించి, డబ్బు తీసుకుంటూ “పైకి వెళ్దామా? పరుపుంది.” అంది జయ.
(మూలం: దుఃఖ విసరణై – మే 1973.)
రచయిత గురించి: జి.నాగరాజన్ సెప్టెంబర్ 1, 1929లో మదురైలో జన్మించారు. ఉపాధ్యాయుడిగా కొన్నేళ్ళు, ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో కొన్నేళ్ళు ఉద్యోగం చేశారు. సాహిత్యంలో ఎక్కువగా రాయబడని అట్టడుగు వర్గాలవారైన సెక్స్ వర్కర్స్ జీవితాలను, కుంటెనగాళ్ళ జీవితాలను తొలిసారిగా తమిళ కథల్లో చూపించిన రచయిత. వందకు పైగా కథలూ, రెండు నవలలూ రాశారు. ‘కాలేజ్ ప్రిన్సిపాల్ మిస్ నిర్మల’ అన్న కథను ఇటీవలికాలంలో లఘుచిత్రంగా తీశారు. ఈయన రాసిన ‘నాళై మట్ఱుం ఒరు నాళే’ (రేపూ మరొక్క రోజే) అన్న నవల ఆంగ్లంలోకి అనువదించబడి మంచి గుర్తింపు పొందింది. నాగరాజన్ 1981 ఫిబ్రవరి నెలలో మరణించారు.