డిసెంబర్ 1
ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత బరువవుతుంది చేయబోయే పని. ఎమోషనల్ కాకుండా పని చేసుకోగలగాలి. ఇది నా అవసరం. ఇక ఇప్పుడు భరణి గురించి ఆలోచనెందుకు? అదొక గతం, అంతే.
సంజీవరెడ్డి నగర్లో ఇండిపెండెంట్ ఇల్లు. గేట్ తీసుకొని లోపలికి నడిచా.
లోపల నుంచి స్టీల్ గ్లాస్ ఎగిరొచ్చి కాళ్ళముందు పడింది, ‘పనికిమాలినదానా! ఎన్నిసార్లు పిలవాలే నిన్ను!’ అనే అరుపును మోసుకుంటూ. ఒక్క అడుగు వెనక్కి వేశా. అక్కడ్నుంచి వెళ్ళిపోవాలనిపించింది. సందిగ్ధంగా కాలింగ్ బెల్ నొక్కా. ఆరేళ్ళ పాప పరిగెత్తుకుంటా తలుపు దగ్గరికి వచ్చి, తలుపు పట్టుకొని నిలబడింది. పాప కళ్ళు అమాయకంగా లేవు, షార్ప్‌గా ఉన్నాయి. కొద్దిగా ఉలికిపాటు, సర్దుకొని ‘లోపలికి రావచ్చా?’ అన్నా నవ్వుతూ.
పాప ఏమీ మాట్లాడకుండా లోపలికి పరిగెత్తింది.
మణి చూడగానే అందంగా లేదనిపించింది. ఆమె నాకన్నా అందంగా లేదనిపించింది. భరణికి నేనే ఎక్కువ నచ్చుతానేమో అనిపిస్తే ఎందుకూ నాకు గర్వంగా అనిపించింది?
మణి మంచంపైన దీనంగా ఉంది. సహాయం కోసం అరుస్తున్న కళ్ళు. ఆఖరి ఆశ లోపల దాచుకొని పోరాడుతున్న సైనికుడిలా ఉంది. అలసిపోయిన రాత్రిలా ఉంది.
ఈ మనిషి అందరి జీవితాల్ని అశాంతి పాలుచేసిన మనిషి కదా. మరి నాకెందుకు ఇలాంటి ఆలోచనలు.
ఆ గదిలో ఏదో వాసన. చూడటానికి మామూలుగానే ఉంది. ఏ వస్తువునూ ఎవరూ ముట్టుకున్న దాఖలాలు కనిపించలేదు. సన్నటి దుమ్ము అన్నిటి పైన. పక్కగా డ్రెస్సింగ్ టేబుల్. దానిపక్కనే అలమారా. దాన్లో కుక్కిన బట్టలు బయటికి వేలాడుతున్నాయ్.
మణి నావైపు చూసింది. “నిన్నెవరు పంపారు?” సూటి ప్రశ్న. సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడ్డా.
“తెలుసు కదా ఏం చేయాలో?”
“మీ మందులెక్కడున్నాయి?”
తను కళ్ళెత్తి చూపిన వైపు వెళ్ళి మందులు తెచ్చుకున్నా. ప్రిస్క్రిప్షన్ చూస్తూ, “దీనిలో ఈ మందు లేదు కదా…” అన్నా, ట్రయజొలామ్ని చూపిస్తూ.
“అది వేసుకోవాల్సిందే. లేకుంటే నాకు నిద్రపట్టదు.”
“ప్రిస్క్రిప్షన్‌లో లేకపోతే ఎలా ఇస్తారు మందు?”
“నువ్వొచ్చిన పని చూడు, ఆరాలు తీయకు.” మణి గొంతులో నిర్లక్ష్యం.
అక్కడినుంచి వెళ్ళిపోవాలనిపించింది. అనిపించినవన్నీ చేయలేం అన్నిసార్లూ. చేయొద్దు అనుకున్నవి చేస్తాం కొన్నిసార్లు. ఏ పని ఎప్పుడు చేయాలో నోట్ చేసుకున్నా.
“స్నానం అయ్యిందా?”
మణి ఏమీ మాట్లాడలేదు. స్నానానికి అన్నీ రెడీ చేసి మణిని లేపి వీల్‌చెయిర్‌లో కూర్చోపెట్టా. చాలా కష్టమైంది అలా లేపి కూర్చోపెట్టడం. మణి తన మొత్తం బరువు నాపై వేసి అరిచేతిల్లో నా భుజాలను గట్టిగా బిగించి పట్టుకొని లేచింది, చర్మంలోకి గోళ్ళు దిగుతాయేమో అన్నంత బలంగా. తనంతట తను లేచే ప్రయత్నం ఏమీ కనిపించకపోగా అలా పట్టుకోవడంలో విపరీతమైన బలం, భయం మణిలో.
సాయంత్రం ఐదున్నరకి అలసిపోయి హాస్టల్‌కి బయలుదేరా. మనసంతా ఆలోచనలు.
అక్కడ ఎందుకు అడుగుపెట్టానా అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాను. ఇష్టం లేని పని చేయడానికి, అదీ ఒక రోగికి సపర్యలు చేయడానికి, చాలా నిగ్రహం కావాలి. అక్కడ మణి నాకొక శిథిల ప్రశ్నలా ఎదురైంది. తను ఆనందంగా లేదు. ఆ ఇంట్లో స్తబ్దత. అది నాకు నచ్చింది. నన్ను పోగొట్టుకొని, భరణి బాగాలేడనే ఫీలింగ్ క్షణకాలం నాకు ఊరటనిచ్చింది. నన్ను నేను గొప్పదానిలా, ప్రేమమయిగా అనుకునేట్లు చేసింది. కేవలం క్షణకాలం వచ్చిన భావానికి ఆ వెంటనే విపరీతమైన గిల్ట్ కమ్మేసింది. నా భరణి నా సహాయం కోసం వచ్చాడు వెతుక్కుంటూ. పాప కళ్ళలో కనపడని అమాయకత్వం. అదే మా పాపై ఉంటే ఇలా ఉండేదా.
మణి, గది ఒకేలా ఉన్నారు. తనలో ప్రేమ లేదు. అందం లేదు. ఇంకా ఏమీ లేవు. మనుషులు ప్రేమ లేకుండా ఉంటారా? ప్రేమిస్తే ప్రేమించరా ఎవరైనా? అలా ఏమీ జరగదు. అయినా భరణి వల్లే ఆమె ఇలాగై ఉండొచ్చు కదా! మణి మాటల్లో నిర్లక్ష్యం. ప్రతి దానికి అనుమానంగా చూసే ఆమె చూపు అంత కరుకుగా ఉందేంటి. రోజంతా ఆమె మాట్లాడిన మాటలు పది కంటే ఎక్కువ లేవు.
మణి గట్టిగా అరుస్తుంది. తను చేసే శబ్దాలు ఆ గదిలో తిరిగి తిరిగి ఊపిరాడక బయటపడతాయి. తను మంచంపై ఒక అంచునుంచి ఇంకొక అంచుకి యాభైసార్లు జరుగుతుంది. తన పక్కన ఉన్న కిటికీ వైపు చూస్తుంది. తన చేతివేళ్ళు పొడవుగా నీటి పాముల్లా, తిత్తుల్లా వేలాడుతున్నట్లుంటాయి. ఆ గదిలోకి వెలుతురూ ఎక్కువ రాదు, అలాని చీకటీ ఉండదు. వెలుతురుకి చీకటికి మధ్య కట్టిన గదిలా ఉంది. అక్కడున్న బూడిద రంగు కర్టెన్స్ పేలవంగా ఉంటాయి.
అప్పుడప్పుడూ తన చేతిని నుదుటిపై పెట్టుకొని రుద్దుకుంటుంది ఏదో బాధతో వేసారిపోతున్నట్టు. భరణి చాలా విసిగిపోయి ఉంటాడు మణితో. తన పాప ఆ గదిలోకి ఇష్టంగా రాదు.
మణికి స్నానం చేయించేప్పుడు తన దేహపు స్పర్శ, చర్మం లోపల ఎముకలు గరుకుగా తగిలినప్పుడు నా లోపల ఎవరో గుండుసూదితో గుచ్చిన బాధ. తన కళ్ళలోకి చూడటానికి సందేహించాను. తనకి నిద్ర కరవైన ఎన్నో రాత్రులను బహుమతిగా ఇచ్చింది ఎవరని కలవరపడ్డాను. బెడ్‌పాన్ పెడుతుంటే, యూరిన్ ఎత్తిపోస్తుంటే ప్రాయశ్చిత్తం చేసుకుంటున్న భావన ఎందుకు కలిగిందో నాకు. ఆ భావనని అనుభవించినందుకు నామీద నాకు అసహ్యంగా అనిపించింది. నేను చేసిందేమీ లేదు.
ఇదంతా మణి చేసుకున్నదే. ఎవరూ ఇష్టపడని మణి. ఎవరినీ ఇష్టపడని మణి.
తనని బాగుచెయ్యమని నన్ను అడిగాడు భరణి. పిచ్చివాడు, నేనే పాడైపోయి చాలా కాలమైందని తెలీదు. ఎక్స్పైర్ అయిన మందునని, ఈ మందు వికటిస్తుందని, దీనివల్ల ఆమె బాగవ్వదని చెప్పలేకపోయాను.
మణి ఎంత స్వచ్ఛమైంది. తన బాగులేనితనమంతా ప్రపంచానికి చూపిస్తుంది. లోపల కుళ్ళిపోయి పైకి అందంగా కనబడే మనుషులకు ధీటుగా నిలబడి వెక్కిరిస్తుంది.
ఇక్కడ నెల రోజులు పనిచేయడం చాలా కష్టం.
డిసెంబర్ 2
అయిష్టంగానే వెళ్ళాను. మణి ఏదో అనీజీగా ఉంది. పదేపదే బెడ్‌పాన్ ఉపయోగించాల్సి వచ్చింది. ముందురోజు రాత్రి ఏమి తిన్నదో. విరోచనాలు. నేను మాట్లాడకుండా శుభ్రం చేస్తూనే ఉన్నాను. ఐదవసారి శుభ్రం చేస్తున్నప్పుడు తన కళ్ళలో నీళ్ళు ఆపి బిగపట్టుకుంది. ఎంత అడిగినా కనీసం బ్రెడ్ ముక్క కూడా తినలేదు. మళ్ళీ నాతో శుభ్రం చేయించుకోవడం కష్టంగా ఉన్నట్లుంది. తనని చూసి అలా బాధపడొద్దని చెప్పాలనుకున్నాను. కానీ తన కళ్ళల్లో ఎలాంటి సానుభూతిని తీసుకోలేని కఠినత్వం భయపెట్టింది.
నిస్సహాయతలో ఉన్నప్పుడు ఇంకా కఠినంగా ఉంటారేమో మనుషులు. అందుకే మణి అంత కఠినంగా ఉందా? అందుకే మణి మనుషుల్ని భయపెట్టి తరిమికొడుతుందా? తనలోనుంచి విరోచనాల్లా మనుషుల ప్రేమలు విసర్జించబడుతున్నాయా?
విరోచనాలు కాకుండా మందు ఇచ్చాను. మెంతులు వేసి ప్రత్యేకమైన సగ్గుబియ్యం జావ చేసి తాపించాను. మధ్యమధ్యలో పాప వచ్చి చూసి వెళ్తూ ఉంది. మణి చాలా నీరసపడిపోయింది. తన శరీరంలో నీరు మొత్తం పోయింది. రెండుమూడుసార్లు ఒ.ఆర్.ఎస్. ఇచ్చాను. ఈ రోజు పెద్దగా మంచంపైన అటు ఇటు జరగలేదు. మధ్యలో కిటికీ వైపు చూస్తుంది. రెండుసార్లు నీళ్ళు, మూడుసార్లు మాత్రం ఫ్యాన్ తీసేయమని, ఉంచమని అడిగింది.
నావైపు కోపంగా చూడలేదు. చాలాసేపు నిద్రపోతూనే ఉంది. తనకి స్పంజ్బాత్ ఇచ్చే క్రమంలో గమనించాను. తన గుండెలపైనా తొడల పైనా నల్లని మచ్చలు. అవెందుకు అయ్యాయి అని ఆలోచించటానికి భయం వేసింది ఒక్కక్షణం.
ఈ రోజు మణి గట్టిగా చేసిన శబ్దాలు ఏమీ లేవు. గాలి మారింది లేదు. అంతా అలానే ఉంది.
బహుశా పెద్ద కష్టం కాకపోవచ్చు నెలరోజులు అక్కడ పనిచేయడం.
డిసెంబర్ 3
ఈ రోజు కొంచం ఉత్సాహంగా వెళ్ళాను. నిన్న అంత సేవ చేశాక తను మారి ఉంటుందని నా అంచనా. కానీ అనుకున్నదానికంటే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. నన్ను తన కింద పనిచేసే ఆయాలాగా ట్రీట్ చేసింది. భరణి అడిగినప్పుడు కొంచం గౌరవంగా చూడాలని షరతు పెట్టాను. దాన్ని మీరింది మణి. చాలా దారుణంగా ప్రవర్తించింది. ప్రతిదానికి అరిచింది. అనుకున్న దానికంటే ఎక్కువ అరిచింది. ఈ రోజు కిటికి తలుపు తెరవలేదు. పాప ఆ ఛాయలకి కూడా రాలేదు. మంచినీళ్ళు విసిరికొట్టి నా ముఖంలోకి చూసింది. తన ముఖంలో చిన్నపాటి క్రూరత్వం కనిపించింది. ఏది మాట్లాడినా తప్పుపట్టింది. స్నానం చేయించుకోకుండా వెళ్ళిపొమ్మంది.
ఏమై ఉంటుంది, భరణి ఏమైనా చెప్పాడా నా గురించి? అర్థం కాలేదు. నా మామూలు ప్రవర్తనకంటే తగ్గి ఉన్నాను. మధ్యలో నాకు కాల్ వస్తే మొబైల్ తీసేసుకుంటా అని బెదిరించింది. అన్నం తినకుండా మందులు వేసుకోకుండా హిస్టీరిక్‌గా ప్రవర్తించింది. నన్ను శత్రువును చూసినట్లు చూసింది.
ఛ! ఎందుకు ఈ పనికి ఒప్పుకున్నాను. అనవసరంగా వెళ్ళి మాటలు పడాల్సొచ్చింది.
ఆమె ప్రవర్తన ఒక రిమోర్స్ ఏమో. నిస్సహాయతలో ఉన్నప్పుడు సహాయం చేసినవాళ్ళమీద, అందులోను తనక్రింద పనిచేసే వ్యక్తులపైన పవర్ చూపించడానికి ప్రయత్నిస్తారేమో. ఏదేమైనా మణి నాతో అలా ప్రవర్తించడానికి ఎలాంటి రైట్ లేదు. అయినా ఇప్పుడు ఒప్పుకున్నాక తప్పదు కదా!
“నువ్వో సగటు మనిషివి భరణీ. ఇంత సగటుగా బతికేవాళ్ళ మీద ఎవరికీ ఏ మాత్రమూ ఆసక్తి ఉండదు. నీకిప్పుడొక రొమాంటిక్ సైడ్ కావాలి. నీగురించి చెప్పుకోడానికి, అందరూ నిన్ను ప్రత్యేకంగా గుర్తించడానికి. అందుకే ఇప్పుడు నేను గుర్తొచ్చాను. నన్ను వెతుక్కుంటూ వచ్చావ్.”
“ఎందుకు అనూ, ఇంత కర్కశంగా మాట్లాడతావ్?”
“ఇందులో కర్కశత్వం ఏముంది, ఇదే వాస్తవం. వీటన్నిటిని మించి నీకొక రహస్య జీవితం కావాలి. అదో కిక్కు నీకిప్పుడు. నువ్వూ ఏదో ఒకటి చేస్తున్నావని చెప్పుకొనే ఒక థ్రిల్ కావాలి. అందుకే ఇక్కడికి వచ్చావ్, ఏదో ఒక అవకాశం ఉంటుందని.”
“నేను వచ్చింది నీ సహాయానికి అనూ.”
“నేను సహాయాలు చేయడం మానేశాను.”
“సహాయం అంటే ఊరికే కాదు.”
“ఊరికే కాకపోతే అది సహాయం అవ్వదు. పోన్లే ఏంటో చెప్పు.”
“నా భార్య మణికి వెన్నుపూసలో గడ్డ వచ్చింది. ఈ మధ్యనే ఆపరేషన్ చేశారు. లేచి తిరగడానికి కనీసం మూడు నాలుగు నెలలు పడుతుంది. ఒక్క నెల పూర్తిగా బెడ్ పైనే ఉండాలి. తనని చూసుకోడానికి నమ్మకమైన నర్స్ కావాలి.”
“నర్స్లెవ్వరూ దొరకలేదా?”
“ఎవరొచ్చినా రెండురోజులకి మించి ఉండట్లేదు. మణి నోటికి మానేస్తున్నారు. అందులోనూ తనెవ్వరినీ నమ్మట్లేదు.”
“మరి మీ ఇంట్లోవాళ్ళు?”
“వాళ్ళెవరినీ మణి దగ్గరికి రానివ్వట్లేదు, వాళ్ళూ ఇష్టపడట్లేదు రావడానికి.”
“నువ్వు నమ్ముతావా, అయినా నీ భార్య నన్నెలా నమ్ముతుందనుకున్నావ్? అసలు నేనెవరో తెలిస్తే!” గట్టిగా నవ్వా.
“నువ్వెవరో తెలియనక్కర్లేదు. తెలియదు.”
“అసలు నువ్వు నన్నెలా నమ్ముతున్నావ్, అదీ నీ భార్య విషయంలో!”
“నిన్ను నమ్మకపోతే ప్రపంచంలో ఎవరినీ నమ్మలేను అనూ.”
“నేనేమి చేయలేను భరణీ, ఈ విషయంలో.”
“అనూ, ఒక స్నేహితుడిగా అడుగుతున్నా, నీ సహాయం అవసరం.”
ఈ సారి నేను నవ్వలేదు.
“స్నేహం అనే ట్రంప్ కార్డు వాడుతున్నావ్. సరే, సహాయం చేస్తాను ఒక షరతుతో.”
“ఏంటి చెప్పు, ఏదైనా ఒ.కె.”
“నా డ్యూటీ నువ్వు ఆఫీస్‌కి వెళ్ళాక మొదలవుతుంది నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేసరికి వెళ్ళిపోతాను. నన్ను నువ్వు కలవాలని, మాట్లాడాలని ప్రయత్నం చేసిన మరుక్షణం వెళ్ళిపోతాను. నెలకి కనీసం 25000 ఇవ్వాలి.”
“తప్పకుండా అనూ!” భరణి ముఖంలో ఆనందం. “ఒక్క చిన్న విషయం, నువ్వు ఎవరో నేను మణికి చెప్పలేదు.”
“నేను ఎవరో నీకు తెలుసా భరణీ?”
భరణి మాట్లాడకుండా లేచి డబ్బులు, అడ్రస్ అక్కడ పెట్టి వెళ్ళాడు. నాకు తెలుసు, ఇప్పుడు డబ్బులు ఎంత అవసరమో. ఎంత అవసరమైనా భరణి దగ్గరికి వెళ్ళడమా? ఇప్పుడు నిజంగా తనకి నా అవసరమై వచ్చాడా లేకా నాకు అవసరమని వచ్చాడా? ఐ డోన్ట్ కేర్. హి ఈజ్ జస్ట్ ఎ సెల్ఫిష్ బ్రాట్.
డిసెంబర్ 4
ఆదివారం, ఈ రోజు భరణి ఎదురుపడతాడనే కుతూహలం ఉంది లోపల. కొంచం జంకుగానే వెళ్ళా. కానీ నిశ్శబ్దంగా ఉంది ఇల్లు. పాప కూడా లేనట్లుంది. మణి నా వైపు చూసింది. మొదటిసారి అలా తను నన్ను పరికించి చూడడం.
ఈ నాలుగు రోజుల్లో నేను మాట్లాడిన మాటలు నాలుగే. తింటారా? స్నానం చేస్తారా? మందులు వేసుకోండి. పక్కకి తిరగండి. ఇవే మాటలు. అంతకు మించి మా మధ్య సంభాషణ జరగలేదు.
ఈ రోజు తలస్నానం చేయించమని అడిగింది. పెద్దగా బరువు వేయలేదు నా పైన. తన బరువుని తనే మోయడానికి ప్రయత్నిస్తుందని అర్థమైంది. పర్వాలేదు, నా భుజంపై చేయి వేసి బరువు మోపమని చెప్పా. ఆమె ముఖం కొంచం ప్రశాంతంగా ఉందనిపించింది. ‘చీరకట్టుకుంటా’ అని అడిగింది. కష్టపడి తనకి చీర కట్టి, జుట్టు దువ్వాను. తను ప్రత్యేకంగా అనిపించింది.
మణి కళ్ళు సోగకళ్ళు. చాలా పొడువుగా ఉన్నాయి. తన పెదాలు ముడుచుకుపోయినట్లు ఉన్నాయి. ఈ రోజు మణి పుట్టినరోజట. అతడు పాపని తీసుకొని బయటికి వెళ్ళాడని అంది.
ఈ రోజు చాలా భిన్నంగా ప్రవర్తించింది. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్లనా లేక నాపైన నమ్మకం ఏమైనా కలిగిందా అర్థంకాలేదు. భోంచేశావా? అని అడిగింది. పెళ్ళయిందా? అంది కొంచం కుతూహలంగా.
చాలా వరకు ‘ఆ’ అనో ‘లేదు’ అనో ముక్తసరిగా జవాబులిచ్చి సరిపెట్టుకున్నా. ఎవరితోనైనా డీల్ చేయాలి అనుకున్నపుడు తక్కువ మాట్లాడటం ఎక్కువ మాట్లాడనివ్వడం అవసరం అనిపించింది. మణి ఈ రోజు మంచం ఆ చివరి నుంచి ఈ చివరకు ఎక్కువగా జరగలేదు. కిటికీ వైపు ఎక్కువసార్లు చూడలేదు. నేను వచ్చేలోపు అతను రాలేదు.
రేపటి రోజు మణి ఎలా ఉంటుందో చూడాలి.
డిసెంబర్ 5
వెళ్ళేసరికి నాకోసం ఎదురుచూస్తున్నట్లు ఉంది. నేనేమి మాట్లాడకుండానే తనే మాట్లాడింది. ఈరోజు మణి ఎవరితోనైనా మాట్లాడాలని ఆరాటపడుతోంది. తను మాట్లాడటానికి ఎవరూ మౌనంగా తన ఎదురుగా పదినిమిషాలు లేకుండాపోయారు. నాకర్థమైంది. మణికి వినడానికి ఒక మనిషి కావాలని.
పాప కనబడలేదు. భరణి రాసిన చిన్న స్లిప్ మందుల డబ్బాలో కనిపించింది. ‘థాంక్యూ.’ నాకు ఏదో సాధించిన భావన కలిగింది. ఆ రోజు మణి చేతుల్లో సత్తువ వచ్చింది. బెడ్‌పాన్ అవసరం లేదని బాత్రూమ్కి తీసుకెళ్ళమని అడిగింది. సొంతంగా మొదటిసారి చిన్న పనులు చేసుకుంది. నన్ను అనూ అని పేరుపెట్టి పిలిచింది. నిన్నటికంటే ప్రసన్నంగా ఉన్నట్లనిపించింది. తనకి వర్జీనియా ఉల్ఫ్ రచనలు ఇష్టమని చెప్పింది. ఆశ్చర్యపోయాను. ఏమి చదువుకుందో అనిపించింది. అయినా నాకెందుకు తన విషయాలు. కానీ లోపల ఒక కుతూహలం తొలుస్తుంది. కుతూహలం కలగనే కూడదు, కలిగాక అది పెరగకుండానే ఆపేసేయాలి.
“ఏం చదువుకున్నారు?”
ఆమె సమాధానం చెప్పలేదు. నాకు అర్థమైంది. మరి, అలాంటప్పుడు తన ప్రశ్నలకు నేనెందుకు సమాధానాలు చెప్పాలి? నేను చెప్పాలి, ఎందుకంటే తనదగ్గర డబ్బులకి పనిచేస్తున్నా కాబట్టి. నాకిక ఆమెతో మాట్లాడాలనిపించలేదు. ఆపైన పెద్దగా ఆమె నన్ను ఇబ్బంది పెట్టకపోవడం మంచిగానే అనిపించింది. అయినా తన గాయం నయమయ్యేంత వరకే నా బాధ్యత. ఈ ఒక్క నెల… కాదు ఇంకొక 25రోజులు మాత్రమే.
డిసెంబర్ 6
ఆరురోజుల తరువాత సూర్యోదయం చూడటం ఇదే మొదటిసారి. ఈ రోజు వెళ్ళడానికి ఇబ్బందిగా అనిపించలేదు. మణి నుంచి వచ్చిన మెసేజ్‌తో త్వరగా బయల్దేరాను. వెళ్ళేసరికి మణి అరుపులు బయటికి వినిపిస్తున్నాయి. పాపని తిడుతోంది, ‘ఇటురావే నీపని చెపుతా, పాపిష్టిదానా!’ అని. మణి బెడ్ మొత్తం యూరిన్‌తో తడిసిపోయింది. భరించలేని వాసన. మణి కళ్ళల్లో నీళ్ళు, అసహనం, నిస్సహాయత.
“ఆ దయ్యప్పిల్ల యూరిన్ పట్టి ఉన్న జార్ని నా మీద పోసి వెళ్ళింది. దాన్ని ఇక్కడ అడుగుపెట్టద్దని చెప్తా, అయినా వస్తుంది.”
నేను మాట్లాడకుండా అన్నీ తీసి శుభ్రం చేశా. స్నానం చేయించేటప్పుడు అంది మణి, “నన్ను కనీసం మా అమ్మ కూడా ముట్టుకోలేదు ఎప్పుడూ.”
తన బక్క పల్చటి శరీరం మీద నల్లటి మచ్చలు. అవి తన లోపల బాధ తగ్గడానికి అప్పుడప్పుడు కాల్చుకున్న మచ్చలని చెప్పింది మణి. తను మాసోకిస్టా? తనని తాను ఎవరైనా ఎందుకు అలా బాధ పెట్టుకుంటారు? తీరని కోరికలు ఉన్నప్పుడు కదా. ఎక్కువ తీరని కోరికలు ఉద్రేకంతో కూడినవి సెక్స్‌కి సంబంధించినవై ఉంటాయేమో. తీవ్రమైన భక్తిలో కూడా ఇలాంటివి ఉంటాయేమో. మరి వాళ్ళని వాళ్ళు మానసికంగా బాధ పెట్టుకొనేవాళ్ళని ఏమంటారో. దానికేమైనా పేరుందా?
ఈ రోజు నేను కాస్త ఎక్కువ సున్నితంగా స్నానం చేయించాను. ఎక్కువ శ్రద్ధ కనిపించింది నా పనుల్లో. మధ్యలో పాప దగ్గరికెళ్ళి మాట్లాడాలనుకున్నా. మణి వద్దని చెప్పడంతో ఆగిపోయా.
మందుల బాక్స్‌లో భరణి లెటర్ ఉంది. ‘ఒక వారానికి ఊరికి వెళ్తున్నాను. మణికి తోడుగా ఇక్కడే ఉండగలవా? ఎక్స్ట్రా మనీ ఇస్తాను. డబ్బులకోసం కాదు. మణి నువ్వుంటే ఉండగలనంది.’ అవును, నీ అవసరాలకు మనుషులు కావాలి. నా అవసరాలకు డబ్బులు కావాలి.
ఈ రోజు మణి కోపంగా ఉంది, మధ్యలో ‘ముండ… ముండ’ అని ఏదో గొణుగుతుంది.
ఇంటికి వచ్చే ముందు అడిగాను, ‘రేపటినుండి వారం రోజులు ఇక్కడే ఉండాలట కదా?’ అని. మణి ఏమీ మాట్లాడలేదు. మనుషుల కోపాలు, అసహనాలు పరిసరాలపై ఎంత ప్రభావాన్ని చూపుతాయో. మణి అరుస్తున్నప్పుడు కోపంగా ఉన్నప్పుడు ఆ ప్రదేశమంతా ఆక్రోశంతో, అశాంతితో ఉన్నట్లనిపిస్తుంది. ప్రతి వస్తువులో ఒక అసహనం, అశాంతి కనిపిస్తుంది. ఇలాంటి మనుషులతో ఎవరైనా జీవితాంతం ఎలా కలిసుండగలరు!
వచ్చే వారం రోజులు మణితో. ఏడు రాత్రులు ఎలా గడుస్తాయో…
భరణి నా జీవితంలోనుంచి వెళ్ళి ఏడేళ్ళయింది. నర్స్ అని కదా వాళ్ళ ఇంట్లోవాళ్ళు వద్దనుకుంది. నర్స్ ఉద్యోగం వదిలేయమని కదా తను అప్పుడు చెప్పింది. మరిప్పుడు అదే నర్స్ కావాల్సి వచ్చింది. నమ్మకంగా సేవ చేసే నర్స్ కావాలి. నిజంగా ఇంట్లోవాళ్ళా లేక అతనా వద్దనుకుంది. మరి గాఢంగా ప్రేమించినప్పుడు నర్స్ ఉద్యోగం ఎందుకు అడ్డు రాలేదో. ఈ విషయంలో భరణి తప్పేమి లేదా! ఏమో, ఇప్పుడు అంత ఆలోచించకూడదు. అతను మాత్రం ఏమి సంతోషంగా ఉన్నాడులే. ఎందుకు నా లోపల అతను అంత సంతోషంగా లేడన్న నిజం తెలియని ఉపశమనం ఇస్తుంది! అది కరెక్ట్ కాదు. నాకిప్పుడు కలిగే ఫీలింగ్‌కి బాధపడటంలో అర్థం లేదు.
ఆరోజు రాత్రి సరిగా నిద్రపట్టలేదు. నా అసలు ప్రవర్తన వదిలేసి, మణికి తగ్గట్టుగా ఉండగలనా, అదీ వరుసగా వారం రోజులు?
డిసెంబర్ 14
నిశ్శబ్దంలో అడుగు పెట్టడం, అందులో మునిగితేలడం ఎలా ఉంటుందో అని భయపడుతూ వెళ్ళాను. వెళ్ళిన రోజు పెద్దగా ఏమీ మాటలు సాగలేదు. మామూలుగా పాపని చూసుకొనే మనిషే వంట చేసేది. పాప లేకపోవడంతో వంటపని కూడా నా మీదే పడింది. 5 వేలు కాదు, ఎక్కువ అడగాలి.
మొదటి రోజు రాత్రి: మణి నిద్రపోతే పోదామని అలాగే కూర్చున్నా. మణి రాత్రుళ్ళు సరిగా నిద్రపోదని అర్థమైంది. పగలు కంటే ఉత్సాహంగా ఉంది. తన మంచం కింద ఉన్న చిన్నబాగ్ తీసింది. అందులోంచి పుస్తకం పెన్సిల్ తీసుకుంది. ఏదో గీస్తుంది. నాకు కొద్దిగా ఆశ్చర్యమేసింది. పగలు ఎప్పుడూ ఏమీ చేసినట్లు ఉండదు.
పన్నెండప్పుడు కాళ్ళు పట్టమని అడిగింది. నేను కాళ్ళు వత్తుతుంటే తానొక మాట అంది, రోజూ భరణి కూడా ఇలానే వత్తుతాడని. ఆ మాటెందుకో కష్టంగా అనిపించింది. మణిని భరణి ప్రేమిస్తున్నాడు. కాదు, తనకి సేవ చేస్తున్నాడు. అది మంచిదే కదా! అలా చేయకూడదని అనుకుంటున్నానా? అతను పూర్తిగా ఆమెని వదిలేశాడని అనుకున్నానా? ఇక మణి కాళ్ళు వత్తాలనిపించలేదు. నేనెందుకు చేయాలి? దుఃఖంగా అనిపించింది.
కొంచం లేట్‌గా నిద్రపోయాను ఆ రాత్రి. మణి కలవరింతలు వినిపిస్తున్నాయి. టైమ్ మూడున్నర అయ్యింది. పిల్లి అరుపుల్లా అర్థం లేకుండా ఉన్నాయి. అలజడి ఆ అరుపుల్లో. చీకటిని చుట్టుకొనే అరుపులు అవి. చాలాసేపు ఉలికిపాటుతో నిద్రపట్టలేదు.
ఈ మణికి నాకు ఏం సంబంధం? నాది ఉద్యోగం మాత్రమే. ఈ పని అయిపోగానే వెళ్ళిపోవాలి.
పొద్దున లేచేసరికి మణి కొద్దిగా ముభావంగా అనిపించింది. కానీ నాకు తన మూడ్స్‌తో పనేంటి ఇక్కడ అనుకొని రోజు మొదలుపెట్టాను.
మణి వీల్చెయిర్ని గది బయటికి తీసుకెళ్ళమంది. గది దాటి హాల్లో నుంచి వరండాలోకి తీసుకువచ్చా. వెలుతురు. ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది. చిన్న పిచ్చుకలు లోపలికొచ్చి వాలి వెళ్తున్నాయి. కాసేపు మణి ఆకాశాన్ని చూసింది. కాసేపు ఏదీ పట్టనట్టు నిర్లిప్తంగా గేట్ వైపు చూసింది. తన లోపలికి పోయిన బుగ్గలు ఏదో చెప్తున్నట్లు అనిపించింది. బిగించి పట్టుకున్న దవడలు అలానే ఉన్నాయి. ఒక్క పదినిమిషాల కంటే ఎక్కువ ఉండలేదు.
“వెళ్ళిపోదాం.”
“పాటలు వింటారా?”
“నేను అడిగింది చెయ్, అంతకుమించి నాకు సలహాలు ఇవ్వకు!”
ప్రతిసారి నేను ఇలా పొరపాటుగా నా అంచనాలను ఎందుకు తప్పుతానో నాకు అర్థంకాదు. ఎప్పటికప్పుడు నా హద్దులు గుర్తు చేస్తూనే ఉంది మణి. నిజమే ఇలాంటి మనుషులు ఉండాలి జీవితంలో ఎవరో ఒకరు, నీకు నిన్ను వాస్తవంగా గుర్తుచేసి నిలిపేవాళ్ళు.
తను పెద్దగా ఏమీ తినలేదు. ‘నీ వంట బావుంది’ అని మెచ్చుకుంది. నేను ఎక్కువగా పొంగిపోలేదు ఆ మాటకి ఇక. ఆ రోజు రాత్రి కాళ్ళు పట్టమని అడిగితే పట్టకూడదు అనుకున్నా బలంగా.
రెండో రోజు రాత్రి: నేను అనుకున్నట్లు నన్ను కాళ్ళు పట్టమని అడగలేదు. నేనే అడిగాను, కాళ్ళు పట్టనా? నొప్పులుగా ఉన్నాయా? అని. తానేమి మాట్లాడలేదు. తన పుస్తకంలో పెన్సిల్‌తో ఏదో గీస్తూనే ఉంది. మణి నిద్రపోయేదాకా ఎదురు చూడాలనిపించలేదు. తనకి ఇవ్వాల్సిన మందులు ఇచ్చి వెళ్ళి పడుకున్నా.
అర్ధరాత్రి హఠాత్తుగా మణి అరుపులతో మెలుకువ వచ్చింది. లోపలికి గుడ్లు తేలేసి బాధగా అరుస్తుంది. అది ప్రీ ఎపిలెప్టిక్ స్టేజిలా ఉంది. గబాల్న వెళ్ళి నోట్లో గుడ్డలు పెట్టా. గట్టిగా పట్టుకున్నా. ఒక అర నిమిషంలో కంట్రోల్ లోకి వచ్చింది. రాగానే తిట్టడం మొదలు పెట్టింది, “నిన్నెవరు పిలిచారు? ఎందుకు వచ్చావు?” అని.
నాలో సహనం చచ్చిపోయింది ఆ క్షణం. గట్టిగా అరిచా మణి పైన, “ఇక మాట్లాడకు, పడుకో” అని. ఏ ఒక్కరి పెత్తనం సహించలేని మణి అప్పుడు ఒక క్షణం సైలెంట్ అయి చెప్పింది, “రేపొద్దున్నే వెళ్ళిపో, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు.” గుండెల్లో రాయి పడింది. ఒక బాధ్యత తీసుకొని, డబ్బులు తీసుకొని ఆమెని ఒంటరిగా వదిలి వెళ్ళడం నాకు నా ఓటమిలా అనిపించింది. ఏమీ మాట్లాడకుండా తిరిగి వచ్చి పడుకున్నా. నాకు ఎందుకు ఇంత అసహనం. ఇంత ఇగో. ఆమె చెప్పినట్లు వినాలి కదా నేను. ఈరోజుతో ఇది ముగిసిపోయిందనుకున్నా.
పొద్దున లేచేసరికి మణికి జ్వరం. కుట్ల దగ్గర ఇన్ఫెక్ట్ అయినట్లుంది. డాక్టర్‌కి ఫోన్ చేసి ప్రిస్క్రైబ్ చేసిన మందులు తెప్పించా.
“నిన్ను వెళ్ళమన్నా కదా ఎందుకు వెళ్ళలేదు?”
“రాత్రి జరిగినదానికి క్షమించండి.”
తరువాత మణి నాతో ఏమీ మాట్లాడలేదు. తన ప్రవర్తనలో మార్పు కనిపించింది ఆరోజు. ఎక్కువగా మాట్లాడకపోయినా నిర్లక్ష్యంగా చూసే చూపులు లేవు. ఉదాసీనంగా అనిపించింది.
“నీకు ఏ పాటలంటే ఇష్టం?”
“జానకి, రఫీ పాటలు ఇష్టం.”
“నాకు రోలింగ్ స్టోన్స్, అందులో జాగర్ రాసిన పాటలు ఇష్టం.”
తన అభిరుచులు ఆశ్చర్యపరిచినా ఏ ప్రశ్నలు వేయలేదు. మణికి ప్రశ్నలు వేయడం ఇష్టం ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు తనే చెప్తుంది అని అర్థమైంది. సాయంత్రంకల్లా జ్వరం తగ్గిపోయింది.
మూడో రోజు రాత్రి: కొంచం ఉషారుగా ఉంది మణి. పాట పాడాతానని అడేల్ హలో పాడింది. ఆ పాట నేను అంతకుముందు వినలేదు. తన గొంతులో విషాదం పాటలో కలిసిపోయినట్లనిపించింది. చాలా బాగా పాడింది. బయటికి కనపడని ఇంకో మనిషి మణిలో ఉన్నట్లనిపించినది. ఆ మనిషిని ఎవరికి చూపకూడదనుకుందా? ఎవరికీ తెలీదా? ఎవరినీ లోపలికి రానివ్వదా? భరణి మణి లోపల చూడలేదా? ఏమో! నాకెందుకు, నాపని నేను చూసుకొని వెళ్ళాలి.
ఆ రోజు రాత్రి తన మంచం పక్కన చాప వేసుకొని పడుకున్నా. మధ్యలో మణి రెండుమూడుసార్లు కదిలినట్లు అనిపించింది. ఒకసారి తనే యూరిన్ పట్టుకొని పక్కన పెట్టుకుంది. తను సహాయం అడగంది నేను చేయకుడదనుకున్నా.
పరిస్థితులు ఎలా మారతాయో తెలీదు.
మరుసటి రోజు మణి బాగానే ఉంది. రాత్రుళ్ళు సరిగా నిద్రలేకపోవడం వల్లనేమో నాకు వళ్ళు వెచ్చబడ్డట్టుగా, నీరసంగా అనిపించింది. కాసేపు రెస్ట్ తీసుకోవాలనిపించింది. నేను కాసేపు పడుకుంటాను అని అడుగుదామనుకున్నా. కానీ వద్దనిపించింది. మణి నిద్రపోయే టైమ్‌లో పోదామనుకున్నా. మధ్యాన్నం మణి నిద్రపోలేదు. అలాగే సోఫాలో నిద్రపోయా. “నీకు డబ్బులిచ్చి పెట్టుకుంది నిద్రపోవడానికి కాదు!” మణి అరుపులతో నిద్రలేచా.
మనుషులు ఇలా ఎలా ఉంటారు! కాసేపు మంచిగా, కాసేపు వాళ్ళ అధికారం చూపిస్తూ. డబ్బులిస్తే ఇరవైనాలుగు గంటలు పనిచేయాలా? విసుగు వచ్చేసింది. ఇంకో రెండు రోజులు సహించాలి. ఆ రోజు రాత్రి సోఫాలో నిద్రపోయా. నాకు ఎవరి అరుపులూ వినపడలేదు. విపరీతంగా అలసిపోయా. మణి ఆ రాత్రి నన్ను కదిలించలేదు.
ఆ మర్నాడు మణిని పెద్దగా కదిలించుకోలేదు. అవసరం అయినప్పుడు తప్ప తన గదిలోకి కూడా వెళ్ళలేదు. ఎక్కువ సమయం హాల్లో సోఫాలో గడిపా.
ఆరో రోజు రాత్రి: నాకు అలవాటైనట్లనిపించింది మణి పద్ధతి. ఎలా డీల్ చేయాలో అర్థమైంది. తనని కదిలించకపోతే తనతో నాకు ఏ ఘర్షణా ఉండదు. తనతో స్నేహంగా కానీ ఇంకే రకమైన అనుబంధం కానీ ఉండకూడదు. అంతే, అనుకున్నా.
బహుశా రేపట్నుంచి ఇంకో 15 రోజులు, పెద్ద కష్టమేమీ కాదు.
ఆరు రోజుల తరువాత ఇంటికి వెళుతూ ఒక రోజు సెలవు కావాలని చెప్పా. మణి ఏమీ మాట్లాడలేదు. సరే అనలేదు. కాదు అనలేదు. తనంతే. భరణికి స్లిప్ రాసిపెట్టి వచ్చేశా. నేరుగా హాస్టల్కొచ్చా. బాగా అలసటగా అనిపించింది. ఆ రోజంతా రెస్ట్ తీసుకున్నా.
సాయంత్రం భరణి హాస్టల్‌కి వచ్చాడు.
“కలవొద్దని చెప్పాకదా!” అన్నా కోపంగా.
“మణి పంపింది. నీకు ఒంట్లో బావుందా లేదా అని కనుక్కొని రమ్మంది.”
“మణా?” ఆశ్చర్యంగా అడిగా.
“అవును.”
ఈ వారం ఎక్స్ట్రా పేమెంట్ అని డబ్బులు ఇచ్చాడు. పదివేలు. నర్స్లకి ఇంత డబ్బులు ఎవరిస్తారు. అవసరాలు గుర్తొచ్చాయి. అయినా కోపం వచ్చింది. నామీద జాలి పడక్కర్లేదు. ఐదువేలు వెనక్కి ఇచ్చేశా.
“మణి దగ్గర పనిచేయాలంటే ఎంత ఇచ్చినా తక్కువే!” అన్నాడు నవ్వుతూ.
భరణి ముఖంలో అంతకు ముందు కంటే వెలుగు ఉంది, కళ్ళలో నవ్వు కనిపిస్తుంది. పోనీలే అనుకున్నా.
డిసెంబర్ 22
హాస్టల్‌కి వచ్చేసరికి బాగా అలసిపోతున్నాను. ఏదీ రాయడానికి కుదరట్లేదు. మణి నాపైన ఇదివరకటంత ఆధారపడట్లేదు. చిన్నచిన్నపనులు తనే చేసుకుంటుంది. అప్పుడప్పుడు నా ముఖంలోకి లోతుగా చూస్తుంది ఎందుకో. పాప తరచూ గదిలోకి వస్తుంది. మణి పాపని ఏమనడం లేదు. అరుపులు లేవు. గదిలో బూడిద రంగు కర్టన్స్ మార్చి లేత వంగరంగుపైన పసుపు గాలిపటాలు ఎగురుతున్న కర్టన్స్ వేశాను. రూమ్ ఏదో వెలుగుతో నిండుతున్నట్లు అనిపించింది. మణి నన్ను తొందరగా ఇంటికి వెళ్ళమంటుంది.
ఈ రోజు అడిగింది “నువ్వు ఈ నెల తరువాత వెళ్ళిపోతావా?” అని. నేను తలూపాను.
“నువ్వు సరిగా తినడం లేదు. నేను గమనిస్తున్నా…” అంది. నేనేమీ మాట్లాడలేదు.
“నిన్ను ఒకటి అడగుదామనుకుంటున్నా, సరైన సమాధానం చెప్తావా?”
లోపల ఏదో అలజడి. “అడగండి కానీ ఈరోజు కాదు.”
మణి ఏదో ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉంది. తనేమి అడుగుతుందో నేనేమి చెప్పాలో.
డిసెంబర్ 28
పాప మణి దగ్గరికి వస్తుంది. తనతో ఉంటుంది కాసేపు.
“ఈ పాప….” అన్నా ప్రశ్నార్థకంగా.
“భరణి కూతురు.”
మరి మీకు? అనాలనుకున్నా. ఆ లోపే “ఇప్పుడు నాక్కూడా!” అంది మణి. ఏదో అర్థమైనట్లుగా అనిపించింది.
విచిత్రంగా మణి గదిలో వాసన పోయింది. అక్కడి పరిసరాలు గాలికి కదులుతున్నట్లు సన్నటి చలనం. నాలో జీవశక్తి తగ్గుతున్నట్లు, ప్రేమ నశిస్తున్నట్లు, నిరాసక్తత ఆవరించినట్లు భారంగా ఉంది.
“నువ్వు భరణి ప్రేమించిన అనువి కదా!”
భయపడిందంతా జరిగింది. “అవును.”
“మీ మధ్య రిలేషన్…”
“నా పర్సనల్ విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు.”
మణి అడిగిన ప్రశ్నతో ఇక అక్కడ ఉండాలనిపించలేదు. “నాకు అలసటగా, జ్వరంగా ఉంది. నేను వెళ్తా” అని చెప్పి హాస్టల్‌కి బయల్దేరా.
వచ్చేటప్పుడు పాప నా చెయ్యి పట్టుకుంది. తన ముఖంలోకి చూశా. ఇదివరకటిలా లేవు తన కళ్ళు. నవ్వుతూ సంతోషంగా ఉన్నాయి.
ఏమవుతుంది నాకు? గిల్టీగా ఎందుకుంది, నా లోపల భయమెందుకు? మణి ఇదివరకటిలా లేదు. ప్రశ్నలు వేసినా నన్నేమి అనలేదు, నా వైపు చూసే అభావపు చూపు తట్టుకోలేకుండా ఉన్నా. ఉక్రోషంగా చెప్పాలనిపించింది భరణి నన్ను వెతుక్కుంటా వచ్చాడు నిన్ను చూసుకోమని అని. కాని చెప్పలేకపోయా. మనుషులు మన అవసరాలను చూసి, వాళ్ళ పనులు చేయించుకుంటారు. ప్రేమ స్నేహం ముసుగులో భరణి చేసిందేంటి?
అన్నీ తెలిసి మణి కావాలని నాతో కాళ్ళు పట్టించుకొని, తనకి ఎన్ని చేయాలో అన్ని… చాలా దుఃఖంగా, అశాంతిగా అనిపించింది ఆ క్షణం. మణి నాతో మంచిగా ఉన్నా, అదంతా ఫేక్. మణిని అవమానించాలనిపించింది. అందంగా లేవని హేళన చేయాలని, ఏ పని చేసుకోలేని బలహీనురాలివని చెప్పాలనిపించింది. కానీ ఏమీ అనలేకపోయా.
తను ఒక ప్రశ్నే అడిగింది. ఇంకేమీ అనలేదు. ఆ ప్రశ్ననే ఎంతో అవమానంగా అనిపించింది. అంతే, కొందరు మనుషులు ప్రశ్నలతో అవహేళన చేస్తారు. వాళ్ళకి సమాధానాలు తెలిసీ, కావాలని అవమానిస్తారు. బయట నగ్నంగా నిలబెడితే వచ్చే ఆనందం ఉంటుంది వాళ్ళకి. భరణి అలానే అవమానించాడు మణికి సేవ చేయించుకొని. మణి అవమానించింది.
దీనికన్నిటికీ మూలం నా అవసరం. అతనిపైన ఉన్న తెగని దయ. ఎందుకు ఉండాలి మనుషులపై దయ? వాళ్ళు చూపించే దయలో, ప్రేమలో హింసను దాచుకుంటారు. అవసరం తీరగానే నిలువునా నిలబెట్టి అవమానిస్తారు.
నేనెందుకు ఇలా ఉండాలి? ఎవరినీ బాధపెట్టి నిందించింది లేదు. ఇక ఈ పుస్తకంలో జరిగిన కాలానికి, దాటిపోయిన మనుషులకు చోటు…
నోట్‌బుక్ పక్కన పడేసి పడుకున్నా.
జనవరి 2
నాపై చల్లుతున్న ప్రతీరంగు బూడిదరంగులోకి మారిపోతుంది. నేను గాలిలో కొట్టుకుపోతున్నాను. కనబడ్డ ఒక్క తీగా చేతికందకుండా దూరమైపోతుంది. నేను పెద్దగా అరుస్తున్నాను.
కళ్ళు తెరిచా. హాస్పిటల్ బెడ్ పైన ఉన్నా. నర్స్ వచ్చింది నవ్వుతూ.
“నాకేమైంది, ఎక్కడున్నా?”
“హాస్పిటల్లో ఉన్నావ్. వైరల్ జాండిస్. అందరినీ హడలెత్తించావు. సరిగా స్పృహలో కూడా లేవు. కోమాలోకి వెళ్ళి వచ్చినంత పనిచేశావ్. ఇప్పుడెలా ఉంది?”
“ఇప్పుడు లోకం అంత పచ్చగా కనిపించడంలేదులే.”
“బైల్ పిగ్మెంట్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మీ లివర్ నార్మల్‌గా అయ్యేదాకా.”
“అవును, జాగ్రత్తగా ఉండాలి. మనుషులకి గుండే కాదు, లివర్ కూడా చాలా ముఖ్యం” అన్నా నవ్వుతూ.
“మీరు నర్స్ అని చెప్పారు వాళ్ళు” అంది నర్స్ మందిచ్చి వెళుతూ.
ఆలోచిస్తూ కిటికీ వైపు చూశా. కాకి కావ్ కావ్ అని అరుస్తూ ఎగిరెళుతుంది. హాస్పిటల్ బయట కూడా కాకులే ఉన్నాయి, కాకులు ఎక్కడైనా ఉంటాయి. నా పెదాలపై చిన్ననవ్వు.
హాస్పిటల్ బెడ్ పైన, కొత్త సంవత్సరం…