పుస్తక పరిచయాలు

అదే నేల

అదే నేల పేరిట ముకుందరామారావు వెలువరించిన కవిత్వ సంకలనం, ఈశాన్య తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ భారతీయ భాషలతో పాటు సంస్కృత, ప్రాకృత భాషలను కూడా కలిపి, ఆయా భాషల కవిత్వోద్యమాల గురించీ, వైభవాల గురించీ క్లుప్తంగా చర్చిస్తూ ప్రతీ విభాగంలోనూ మచ్చుకి కొన్ని కవితలను కూడా కలుపుకుంటూ సాహిత్యపరంగానూ అధ్యయనపరంగానూ విస్తృతమైన పరిధితో పాఠకుల ముందుకొచ్చింది.

ఇదే నేల మీద ఇప్పుడూ ఇంతకు ముందూ ఉన్న కవులు వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ అస్తిత్వాలను, మానవోద్వేగాలను, సమాజం పట్లా జీవితం పట్లా తమకున్న ఫిర్యాదులను, అభిమానాలను, సమస్యలను, సర్దుబాట్లనూ ఎంత నాజూకుగా కవిత్వంలోకి ఒంపారో తెలుసుకోవడానికి ఈ పుస్తకం సాయపడుతుంది. మన తోటి రాష్ట్రాల్లోని సామాజిక సాహిత్య విప్లవాల రేఖాస్వరూపాలు కనపడతాయి. సాంఘిక వాతావరణం, సాంస్కృతిక మూలాలు, సమకాలీన సమాజపు యదార్థస్థితీ ఒక్కో భాషలో ఎంత వైవిధ్యంతో ప్రకటితమయ్యాయో గమనింపుకొస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం మిగిలిన భాషలు, కొందరు మిగుల్చుకోలేకపోయిన భాషలు చర్చలోకొస్తాయి. ఎన్నో సమూహాల హృదయధ్వనులుగా వినపడే కవితలిందులో ఉన్నాయి. ఎంపిక చేయబడ్డ ప్రతీ కవితలోనూ స్పష్టంగా కనపడే లక్షణం మాత్రం, సునిశితమైన ఆలోచనతో సరళంగా, లోతుగా కవిత్వం చెప్పగల శక్తి. తెలుగులో ప్రస్తుతం భరించలేని స్థాయికి చేరుకున్న బిగ్గరతనం ఈ కవితల్లో కనపడదు. వస్తువు ఎలాంటిదైనా వ్యక్తీకరణలో నవ్యత కవితకు గొప్ప శోభనిస్తుంది. నాగాలాండ్ కవయిత్రి టెంసూలా ఆఓ (Temsula Ao) కవిత చూడండి:

పాటలెందుకు బతుకుతాయి
పాటగాళ్ళు
పోయిన మరచిన
చాన్నాళ్ళ తరువాతైనా
పాటలెందుకు బతుకుతాయి
పరదేశీ గొంతుతో
అపరిచిత స్వరంలో పాడినా
పాటలెందుకు మాటాడతాయి
ముక్కచెక్కలైన పాటని
వణికే గొంతుతో
పిల్లలు కీచుమని పాడినా
పాటలెందుకు సానుభూతి పొందుతాయి

చాలా పాటలున్నాయి
నాకూ పాడాలనే ఉంది
చాలా తక్కువ సమయముంది
అవి పాడటానికి

సంప్రదాయక గిరిజన జీవితంలోని పార్శ్వాలను కవిత్వం చేసిన మమంగ్ దాయ్ (Mamang Dai) వంటి కవుల గురించీ, ఈశాన్యభారతం నుండి ఉబికిన ఉద్యమగళాల గురించీ చదవడం కొత్త కవిత్వానికి దగ్గరదారులు చూపెడుతుంది. ఆసక్తి ఉన్న కవిత్వం గురించి కొత్తగా వెదకడానికి కావలసిన తీగలను పుస్తకంలో అందుబాటులో ఉంచడం బాగుంది. ఈ పుస్తకం ఔత్సాహిక పాఠకులకు ఒక దిక్సూచి. దీనిని వాడుకుంటూ చెయ్యాల్సిన ప్రయాణం చాలా పెద్దది, అవసరమైనది. ఈ పుస్తక సాఫల్యం దీన్ని చదవడంతో పూర్తికాదు. ఇందులోని కవుల కవిత్వానికి మనం మరింత చేరువ కాగలగాలి. ఈ కొత్త పోకడల కవిత్వ రీతులను అధ్యయనం చెయ్యాలి. మూసలు బద్దలుకొట్టిన తీరును గమనించాలి. వస్తువుతో కవి ఎంత నిజాయితీగా మమేకమైతే కొత్త అభివ్యక్తి వస్తుందో అర్థంచేసుకోవాలి. అదే నేల అన్ని వేల పాటలని వేర్వేరు గొంతులతో పలికించడం వినాలి. చిత్రంగా వినిపించినా, ఈ సంకలనం కవిత్వ పాఠకుల కన్నా కవులకే ఎక్కువ అవసరం. ప్రస్తుతం తెలుగులో కవిత్వం రాస్తున్నవాళ్ళందరూ వాదాలకతీతంగా చదివి చూడాల్సిన పుస్తకమిది.

ఇందులో కనపడే కవితల్లోని భావాలేవీ అపరిచితంగా కనపడకపోవడం ఒక ప్రత్యేకత. ఎంత విడివిడిగా బతుకుతున్నా, అపరిచితమేనని అనుకుంటున్నా, వీటిలోని కవిసమయాలు, భావాలు చూసినప్పుడు ఈ దేశాన్నంతటినీ కలిపికుట్టే వాతావరణమేదో ఇంకా ఉందని నమ్మకుండా ఉండలేం.

మనం తాగే వర్షం ఎవరి సొంతం
మనం పీల్చే గాలి ఎవరిది?
ఒక కాంతికిరణాన్ని
సాయంత్రపు చల్లదనాన్ని
చంద్రకాంతి అద్భుతాన్ని
నువ్వైనా నేనైనా లేదా
ఆ కోటీశ్వరుడైనా కొనగలడా
ఎవరికి హక్కుంది
శిశువుని రోగగ్రస్తుని చేయడానికీ
మా పొరుగువాని పిల్లిమీద
రాయి విసరడానికీనూ?
నిని లుంగలంగ్ (Nini Lungalang). 

ఆదీవాసీ కవిత్వం కింద కొండరెడ్లు తూర్పు కనుమలలో పాడే పాటలు కొన్ని కలపడం గొప్ప చేర్పు.

ఆటమనదే పాటమనదే – అన్ని విద్యలు గల్లవారం
వేట మనదే వెట్టి మనదే – వేయి విద్యలు గల్లవారం
కొలువు మనదే కొలత మనదే- కోటి విద్యలు గల్లవారం
ఆడవాలే పాడవాలె- వేడుకలు చేయవాలె
అచ్చుకోడ లయ్యోకోడ – లా లచ్చిరి బాలకోడలా

గాలివచ్చె గాలి వచ్చె – దబ్బపూవు గాలివచ్చె
దబ్బపూవు గాలిరాగా – దాగిపోదామన్న మనసు

పర్యావరణ ప్రేమికులు బాల్యంలో ఒక చెట్టు కింద ఆడుకున్న జ్ఞాపకాన్ని కవిత్వం చెయ్యడం ఈ పుస్తకంలో కనపడుతుంది. మత విద్వేషాలు, స్త్రీపురుష సంబంధాల్లో మోసాలు, తమిళనాట భక్తి ఉద్యమాలు, అద్భుతమైన ఉర్దూ కవితలు ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ పుస్తకం స్పృశించని జీవనకోణం, సామాజిక కోణం లేనే లేదు. కానీ, ముకుందరామారావుగారి గొప్పతనమంతా అత్యంత జాగరూకతతో చేసిన ఎంపికలో ఉంది. ఈ ఎంపిక చేసిన గొంతుల్లోని నిజాయితీని అంతే సూటిగా తెలుగు పాఠకులకు అందివ్వడంలో ఉంది. క్లుప్తంగానే ఉన్నా, అవసరమైన వివరాలతో ఉన్న కవిపరిచయాలు చూస్తే, ఆ నిజాయితీకి కారణాలు మనకి అక్కడక్కడా అర్థమవుతూనే ఉంటాయి. మరొక ప్రత్యేకత, ఈ కవితల్లోని క్లుప్తత. పురుషుడి బుద్ధిని పట్టిచ్చే ఈ కవిత చూడండి.

నేనూ ఆమె ఒప్పందానికి రెండు షరతులు విధించుకున్నాం
మొదటిది: ఆమె ఎప్పుడైనా దానిని తెంచుకోవచ్చు
రెండవది: ఎప్పుడూ నేను దానిని తెంచుకోకూడదు
మా వాగ్దానాలు మేము చేసుకున్నాం
కొండల్లో ప్రతిధ్వని మా సాక్షిగా
గాలిని పడకగా మార్చుకున్నాం
నక్షత్రాల దుప్పటిని మా మీద కప్పుకున్నాం
ఇంకా ఇంకా చాలా
కానీ ఇంతవరకూ
ఆమె తరఫు షరతు ఆమె నిలబెట్టుకోలేదు
రెండవ నిబంధనతో ఇప్పుడు నేనేమి చెయ్యాలి?
ఒప్పందం కేవలం ఒప్పందమేనా?
పురుషోత్తం శివరాం రేగె (Purushottam Shivaram Rege).

ఈ పుస్తకంలోని ప్రతీ కవితా స్పష్టంగా ఉంటుంది, కానీ నేరుగా, బిగ్గరగా ఏ కవితా ఏదీ చెప్పదు. ఏ గొంతులోనూ డొంకతిరుగుడు గుణం కనపడదు. ఈ కవులు చెప్పేది ఎంత బలంగా చెబుతున్నారో, అంత సున్నితంగానూ చెబుతున్నారు. ఈ కలయికే కవిత్వానికి గొప్ప శోభ. ఎంతో నిశితంగా ఎంతోకాలంపాటు శ్రమిస్తే తప్ప, ఎంతో జాగ్రత్తగా జల్లెడపడితే తప్ప, ఇన్ని వివరాలతో ఇంత చరిత్రతో ఇన్ని గొప్ప కవితలను ఒకే చోట కూర్చడం సాధ్యమయే విషయం కాదు. పైన చెప్పినట్లు, ఇది కవులు తప్పక చదవాల్సిన పుస్తకం. సాహిత్య అధ్యయనాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ఎలాంటి పాఠకుడికైనా సాయపడే పుస్తకం.

800 పైచిలుకు పేజీలున్న ఈ  పుస్తకం నుండి మరికొన్ని మెరుపుతునకలు:

వానొస్తున్నప్పుడు మృతులు దిగివస్తారు, నువ్వు కనిపిస్తావు

పైసలు లేని కవి దగ్గర ఏముంటాయి-అనేక వేదనలు, కాస్తంత ప్రేమ
కొన్ని చూడని కలలు-కొద్దిగా కరుణతో నిండిన పాటలు
 

రఘుపతి సహాయ్ (Raghupati Sahay), ఉర్దూ.

సొగసైన ప్రియతమా, నా కళ్ళల్లో నివసించు
వాటిని నేనిపుడు మూసేయగలను
ఇంకెవరూ నిన్నిక్కడ ఎప్పుడూ చూడలేరు
నేనూ ఇంక మరెవ్వరినీ చూడను

షా అబ్దుల్ లతీఫ్ భిట్టాయ్ (Shaw Abdul Latif Bhittai) సింధీ.

ఈ ప్రపంచం, ఈ జీవితం
పొయ్యి మీద కాలుతున్న పెనంలాంటిది
ముందు నీ చెయ్యి కాలుస్తుంది
ఆ తర్వాతే నీ కోరిక తీరుస్తుంది
               

బహినాబాయి చౌధరి (Bahinabai Chaudhuri), మరాఠీ.

మన కష్టాలు సుఖాలు
ఎంత వ్యక్తిగతమంటే
వాటిని కథలుగా మార్చితేనే
ఇతరులు నమ్మేది

పాల్య లంకేశ్ (Palya Lankesh) కన్నడ.


రచయిత: ముకుంద రామారావు
ప్రచురణ: సాహితీ ప్రచురణలు
వెల: రూ. 600
ప్రతులకు: 99083 47273