పుస్తక పరిచయాలు

గూడెంలోని పిల్లలకు పాఠాలు చెప్పడానికి వెళ్ళిన ఒక నిజాయితీ గల టీచరు అనుభవాలు, చిన్న కథలుగా మారిన సంపుటి ఇది. ఒక తరాన్ని బాధ్యతగా తయారు చెయ్యడమంటే, ఇప్పటికీ ఎన్నో ప్రాంతాల్లో ప్రధాన పాత్ర కుటుంబానిది కాక పాఠశాలలదీ, పంతుళ్ళదీ కావడం ఆలోచించాల్సిన విషయం. రోజుకి ఏడెనిమిది గంటలు బడిలో గడిపే పిల్లలను, వాళ్ళ మనస్తత్వాలను, దగ్గరగా, జాగ్రత్తగా గమనించుకునే ఉపాధ్యాయులు మనకు ఉన్నారా? పిల్లల కుటుంబ నేపథ్యాలు, వాళ్ళ స్నేహితులు, తోటివారి ప్రభావాలు, తల్లిదండ్రులు పిల్లలకు తమ జీవన ప్రాధాన్యతలను తెలిసో తెలియకో చెబుతున్న తీరు, పిల్లల నడవడిక మీద ఎంత బలమైన ముద్ర వేస్తాయో చిన్న చిన్న సంఘటనల్లో చెప్పుకొచ్చిన తీరు చదివించేలా ఉంది. కథలన్నింటిలోనూ ఒకే నేపథ్యం, ఒకే మనిషి అనుభవాలు కనపడటం వల్ల, అనవసర వాక్యాలు తగ్గిపోయి ఘటన నేరుగా మనసుకు తాకేలా సూటిగా చెప్పే వీలు చిక్కింది. అందరు తల్లిదండ్రులకూ, అందరు ఉపాధ్యాయులకూ పిల్లలను ఇంతలా కనిపెట్టుకు ఉండటం సాధ్యపడకపోవచ్చు, కానీ, పిల్లల ఆలోచనల తీరెలా సాగుతుందో, ఎందాకా ఓపిక పట్టచ్చో, ఎక్కడ హద్దు గీయచ్చో, ఇలాంటి అనుభవాలు లీలామాత్రంగా సూచననిస్తాయి. పిల్లలు తన నుండి ఏమీ నేర్చుకోపోయినా, నవ్వుతూ ఖాళీ పలకను చూపించినా, అసహనం కూడదనీ, చిరునవ్వు చెదరకుండా చదువు చెప్పడమే అవసరమనీ నమ్మిన టీచర్లు కథల్లోనైనా ఉండటం పెద్ద ఊరట. ఉపన్యాసాలూ, ఊయలబల్ల తీర్పులూ లేకుండా, సమస్య మీద చిన్న లాంతరు వెలుగు వేసి సాగిపోయే ఈ సంపుటి వివరాలు:

రచయిత : నాదెళ్ళ అనూరాధ
ప్రచురణ: చినుకు ప్రచురణలు
వెల: 150 రూ.
ప్రతులకు: చినుకు ప్రచురణలు, గాంధీనగర్, విజయవాడ.


కవుల్లో సృజనాత్మకత కొత్త పుంతలు తొక్కినప్పుడల్లా, కొత్త కవిత్వరీతులు కూడా పుట్టుకురావడం కద్దు. పద్యాలు, వచన కవితలు, దీర్ఘ కవితలు, నానీలు, హైకూలు, ఇలా కవిత్వం ఎన్నో రూపాల్లో పాఠకుల ముందుకొచ్చింది. ‘మొగ్గలు’ అనే ఒక ప్రత్యేకమైన కవితారూపమిది అని ప్రకటించుకుని వెలువరించిన ఈ పుస్తకం, ముందు ఏ విధంగా ఇతర కవిత్వ రీతులకు శిల్పపరంగా భిన్నమనే ప్రశ్న వస్తుంది. మూడు పాదాలు: సరళమైన, క్లుప్తమైన భావాలు ఈ మొగ్గల రూపు. ఐతే, ఈ పాదాల్లో ఎక్కడా లోతు కాని, కొత్తదనం కాని, కనీసం కొసమెరుపు కానీ కనపడదు. ఎన్నో మొగ్గల్లో మూడో పాదం పునరుక్తిగానే మిగిలిపోయింది. మూడు పాదాల్లో కవిత్వమంటే పాఠకులు ఆశించే క్లుప్తత మచ్చుకైనా కనపడని పుస్తకమిది.

అజ్ఞానమనే చీకటిని తరిమితేనే కదా
విజ్ఞాన వెలుగులు లోకంలో ప్రసరించేది
విజ్ఞానం జగతికి వెలుగు నింపే కిరణం

అన్వయం అయోమయపరిచే మరొక ఉదాహరణలో, మొదటి పాదంలోని పూదోటలో మొగ్గలు, రెండవ పాదంలో మధురామృతమయ్యాయి. మూడవ పాదానికి ఆకాశంలో నక్షత్రాలయ్యాయి.

తెలుగు పూదోటలో మొగ్గలను పరిమళింపజేస్తానా
అవి మధురామృతమై సువాసనను వెదజల్లుతాయి
మొగ్గలు సాహితీ ఆకాశంలో వెలిగే నక్షత్రాలు.

‘అక్షర మొగ్గలు చిగురించి పరిమళిస్తేనే కదా కవితా సుగంధం అంతటా వ్యాపించేది’ అని ఈ కవే ఒక చోట అంటాడు. నిజానికి ఈ మొగ్గలింకా వికసించాల్సి ఉంది.

పుస్తకం వివరాలు:

రచయిత: డా. భీంపల్లి శ్రీకాంత్
వెల: 50 రూ.
ప్రతులకు: డా. భీంపల్లి శ్రీకాంత్, 9032844017


ప్రతి రచనా తనదైన పాఠకుణ్ణి వెదుక్కుంటుంది. ఎవరి దృష్టినైనా ఇప్పుడెంత సేపు పట్టి నిలపగలం అంటే, చూపుడువేలు పైపైకి తోసుకెళ్ళకుండా ఆపగల్గినంతకాలం. బహుశా, ఆ అంతర్జాల పాఠకుల చూపునీ, కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినవి, ఈ ముక్తకాలు. పేరుకు తగ్గట్టే ఇందులో మంచి మాటలు, ప్రోత్సాహకాలు, హాయి భావనలను సుతారంగా చెప్పినట్లుండే వాక్యాలున్నాయి. పాదాలు విడగొట్టిన పద్ధతిలోనూ, చెప్పిన తీరులోనూ రుబాయీలనూ గుర్తుకు తెచ్చినా, చమత్కారం, లోతు అన్నింట్లోనూ కనపడకపోవడం నిరాశపరుస్తుంది.

ఈ రాత్రి మరీ చీకటిదైపోయింది
గది మరీ నిశ్శబ్దమైపోయింది
కళ్ళు మూసుకుని మనసు తెరుచుకుని ఉండిపోయా
ఒంటరితనం మరీ ఒంటరిదైపోయింది

అందాన్ని ప్రతిఫలించలేక అద్దమే కిందపడింది
రూపంలో వెదికితే ఎట్లా, దాని చిరునామా హృదయం కదా

ఎన్ని పరదాలు ఎన్ని దర్వాజాలు దాటుకుంటూ వస్తే
నీ కనురెప్పల పరదా నిలిపేసింది, మనసును చేరే సమయమింకా రాలేదని

వర్షంలా కురిసినా ఉప్పెనలా ముంచినా
దుఃఖం నాకు ఆత్మీయురాలే నన్ను శుభ్రం చేసి మరీ పోతుంది

మొదలైన ముక్తకాలు చూడగానే ఆకట్టుకుంటాయి. ఈ పుస్తకం వివరాలు:

రచయిత: వారాల ఆనంద్
అనువాదం: అనురాధ బండ్ల
ప్రచురణ: ప్రోజ్ పోయట్రీ ఫారం, కరీంనగర్, తెలంగాణ
వెల: 125 రూ.
ప్రతులకు: anandvarala@gmail.com