సంకేతాలు – చిహ్నాలు

మామూలు మనిషి కావడానికి ఏమాత్రం అవకాశం లేని తమ మతితప్పిన కొడుక్కి పుట్టినరోజు కానుక ఏమివ్వాలా అన్న సమస్యని వాళ్ళు మళ్ళీ ఎదుర్కున్నారు. ఈ సమస్యను గత నాలుగేళ్ళుగా ఎదుర్కుంటూనే ఉన్నారు వాళ్ళు. అతనికి ఏ రకమైన కోరికలూ లేవు. మనిషి చేతిలో తయారైన ఏ వస్తువైనా అతని దృష్టిలో ఐతే హానికరం (అదేమిటో అతనికి మాత్రమే అర్థం అవాలి) లేదూ విలాసార్థం. ప్రత్యేకించి పరికరాలు, యాంత్రికమైన బొమ్మలు వంటివి అతను అసలు సహించలేడు. అతను భయపడేవీ, హాని చేసుకోగలిగేవీ వడపోసి వడపోసి చివరికి కాస్త నాజూకుగా ఉన్న ఒక కానుకను–బుజ్జి బుజ్జి జాడీలలో పదిరకాల జెల్లీలు ఉన్న ఒక చిన్న బుట్ట– ఎంచుకున్నారు వాళ్ళు.

అతను పుట్టేసరికే వాళ్ళకు వివాహమై ఇరవైయేళ్ళు దాటింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ బాగా వయసు మీరిపోయారు. ఆమెకు అలంకరణ మీద శ్రద్ధ పోయింది. తెల్లబడిన జుత్తుని నిర్లక్ష్యంగా తలమీద ముడి వేసుకుంటుంది. చౌకరకం నల్లరంగు దుస్తులు ధరిస్తుంది. చలికాలం తర్వాత ఏప్రిల్ నెలలో వచ్చే తెలియెండ వెలుగులో ఆమె, తన సాటివయసువాళ్ళ లాగా కాకుండా (ఉదా. పక్కింట్లో ఉండే మిసెస్ సోల్ ముఖం మేకప్ సామాగ్రి ముస్తాబుతో లేత ఎరుపురంగులోనూ, ఆమె టోపీ అప్పుడే విచ్చుకున్న పూలతోనూ ఉంటుంది), తెల్లగా పాలిపోయి కనిపిస్తుంది. ఆమె భర్త ఒకప్పుడు వాళ్ళ ఊళ్ళో వ్యాపారం చేసి ఒక మోస్తరుగా బాగా రాణించినవాడే. కానీ, ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంటూ, పూర్తిగా తన సోదరుడు ఐజాక్ అందించే సహకారం మీదే ఆధారపడి ఉన్నాడు. ఐజాక్ నలభై యేళ్ళనుంచీ ఇక్కడే ఉంటూ అసలు సిసలు అమెరికనుగా మారిపోయాడు. అతన్ని ఎప్పుడో తప్ప చూడరు వీళ్ళు. అందుకే అతన్ని యువరాజుగారని పిల్చుకుంటారు.


ఆ శుక్రవారం వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు. అయితే ఆ రోజు ఏ ఒక్కపనీ సజావుగా జరగలేదు. వాళ్ళు ప్రయాణం చేసిన సబ్‌వే రైలు కరెంటు పోయి రెండు స్టేషన్ల మధ్య పావుగంటసేపు ఆగిపోయింది. ఆ చిమ్మచీకటిలో క్రమం తప్పకుండా కొట్టుకుంటున్న తమ గుండె చప్పుడు, వార్తాపత్రికల పేజీల రెపరెపలూ తప్ప మరేమీ వినిపించలేదు. తర్వాత వాళ్ళు ఎక్కవలసిన బస్సు ఆలస్యమై చాలాసేపు దానికోసం ఎదురుచూడవలసి వచ్చింది. తీరా అది వచ్చిన తర్వాత, దాన్నిండా బడిపిల్లలు కిక్కిరిసివుండి, వాళ్ళ అరుపులూ కేకలతో వీళ్ళకు ప్రశాంతత లేకుండా పోయింది. వాళ్ళ అబ్బాయి ఉన్న ఆసుపత్రికి వెళ్ళే దారిలో నడుస్తుండగా చినుకులు మొదలయ్యాయి. చివరికి ఎలాగోలా ఆసుపత్రికి చేరిన తర్వాత కూడా, అతనికోసం వెయిటింగ్‌ రూములో చాలాసేపు ఎదురుచూడవలసి వచ్చింది. అలా ఎదురుచూసిన తర్వాత–ఎప్పటిలా మాసిన గడ్డంతో, ముఖంనిండా మొటిమలతో, చికాకుగా ముఖంపెట్టి నెమ్మదిగా అడుగులేసుకుంటూ వచ్చే వాళ్ళబ్బాయి కాకుండా–ఒక నర్స్ ఆ గదిలోకి అడుగుపెట్టింది. ఆ నర్స్ మొఖం వారికి తెలుసు, కానీ ఆమెను వారెప్పుడూ పట్టించుకోలేదు. ఆమె వచ్చీరాగానే అతను ఆత్మహత్య చేసుకుందుకు మళ్ళీ ప్రయత్నించాడని అదేదో ఘనకార్యం అన్నట్టుగా చెప్పింది. ఇప్పుడు అతను బాగానే ఉన్నాడు కానీ ఈ సమయంలో తల్లిదండ్రులను చూస్తే అతను మళ్ళీ స్థిమితం తప్పవచ్చని చెప్పింది. ఆ ఆసుపత్రిలో ఎప్పుడూ ఉద్యోగుల కొరత ఉండడంతో వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడుంటాయి. అలాంటిచోట ఏది అప్పచెప్పినా పోగొడతారన్న భయంవల్ల తాము తెచ్చిన పుట్టినరోజు కానుకని అక్కడ ఆఫీసులో విడిచిపెట్టి వెళ్ళడానికి వాళ్ళకు మనస్కరించలేదు. మరోసారి కొడుకుని చూసేందుకు వచ్చినప్పుడు దాన్ని తీసుకురావాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు.

ఆసుపత్రి నుంచి బయటకి వచ్చాక ఆమె, భర్త గొడుగు తెరిచేదాకా ఆగి, తర్వాత అతని ముంజేతిలో చేయి కలిపి నడవసాగింది. అతను మాటిమాటికీ గొంతు సవరించుకోవడం మొదలెట్టాడు. మనసు వికలం అయినప్పుడల్లా అలా చెయ్యడం అతని అలవాటు. వాళ్ళిద్దరూ వీధికి ఆవలివైపున్న బస్‌స్టాండ్ కిందకు చేరాక అతను గొడుగు ముడిచాడు. ఎదురుగా కొద్దిదూరంలో, గాలికి ఊగుతూ ఆకులనుండి నీళ్ళు రాలుతున్న చెట్టు క్రింద వున్న చిన్న బురదగుంటలో, ఇంకా రెక్కలురాని పక్షిపిల్ల ఒకటి బైటకు రాలేక అటూ ఇటూ పొర్లుతోంది.

సబ్‌వే స్టేషన్ దాకా చేసిన సుదీర్ఘ ప్రయాణంలో భార్యాభర్తలిద్దరూ ఒక్కమాట కూడా మాటాడుకోలేదు. పిడికిలి బిగించి గొడుగు గట్టిగా పట్టుకుని, పిడిని అటూ ఇటూ తిప్పుతున్న అతని చేతులు చూసిన ప్రతిసారీ, ఉబ్బిపోయిన రక్తనాళాలు, చర్మంమీద ఏర్పడుతున్న గోధుమరంగు మచ్చలమీద దృష్టిపడి, మనసు వికలమై కన్నీళ్ళు ఆపుకుందుకు ఆమె చాలా ప్రయత్నం చెయ్యవలసి వచ్చింది. తన ఆలోచనలను మళ్ళించడానికి ఆమె బస్సులో అటూ ఇటూ కలయజూసింది. నల్లనిజుట్టు, కందిపోయిన కాలివేళ్ళతో మొద్దుగా ఉన్న ఒక అమ్మాయి ఒక ముసలామె భుజంమీద వాలి ఏడుస్తుండడం కనిపించింది. ఆమెకు ఒక వంక ఆశ్చర్యం, మరొక వంక ఆ పిల్లమీద జాలీ కలిగాయి. ఆ ముసలామెలో ఎవరివో తెలిసినవాళ్ళ పోలికలు కనిపించాయి.


డాక్టరు మాటల్లో చెప్పాలంటే, క్రిందటిసారి ఆ కుర్రాడు ఆత్మహత్య చేసుకోవడానికి పన్నిన పథకం భలే తెలివైనది. అతనితోపాటే చికిత్స పొందుతున్న మరొక రోగి అతను ఎగరడం నేర్చేసుకుంటున్నాడన్న ఈర్ష్యతో చివరినిముషంలో వెనక్కి లాగి ఉండకపోతే అతని పథకం పారి ఉండేదే. వాస్తవానికి అతడనుకున్నది, ఈ ప్రపంచానికి కన్నంపెట్టి అందులోంచి బయటకి పారిపోవాలని.

మతిభ్రమించిన అతని లాంటివారికి వచ్చే ఆలోచనల తీరుతెన్నుల గురించి, ఒక ప్రముఖ మానసికశాస్త్ర పత్రికలోని ఒక వ్యాసంలో చాలా విపులంగా చర్చించబడింది. ఆ శానిటేరియమ్ డాక్టరు దాన్ని చదవమని పత్రికను వాళ్ళకి ఇచ్చేడు. కానీ అంతకు చాలా ముందే భార్యాభర్తలిద్దరూ ఆ విషయాన్ని స్వయంగానే గ్రహించారు. ఆ వ్యాసం ప్రకారం అతనికున్న జబ్బు పేరు రిఫరెన్షియల్ మేనియా. చాలా అరుదుగా వచ్చే ఈ వ్యాధిలో, రోగి తన చుట్టూ జరుగుతున్న ప్రతి సంఘటనా తన గురించే జరుగుతుంటుందని, తనను తప్పుదారి పట్టించడానికే జరుగుతుంటుందనే భ్రమలో ఉంటాడు. తనని తాను ఇతర మానవుల కంటే తెలివైనవాడు అనుకోవడంతో వారిని పట్టించుకోడు, వారి మాట వినడు. సహజ ఘటనలన్నీ అతన్ని ప్రభావితం చేయడానికే ఉంటాయి. అవి అతన్ని ఎక్కడికి వెళ్ళితే అక్కడకి వెంబడిస్తుంటాయి. ఆకాశం నిలకడగా అతన్నే తేరిపార చూస్తుంటుంది. మేఘాలు ఒకదానికొకటి సంకేతాలిచ్చుకుంటూ అతని గురించిన వివరాలన్నీ పంచుకుంటుంటాయి. తన మనసులోని ఆలోచనలను పసిగట్టిన చెట్లు రాత్రిపూట చీకట్లో తమ కొమ్మల చేతులు ఊపుకుంటూ తన గురించే చర్చించుకుంటాయి. గులకరాళ్ళు, డాగులు, సూర్యక్రిరణాలు, రకరకాల ఆకారాలూ ఆకృతులూ ధరిస్తూ, అతనికి అర్థంకాని రీతిలో సంభాషించుకుంటాయి. వాటిని ఎలాగైనా అడ్డుకుని నిలువరించడమే అతని ముందున్న లక్ష్యం. ప్రకృతిలో ప్రతీదీ ఒక సంకేతమే. వాటన్నిటి లక్ష్యమూ తనే. అతని చుట్టూ ఎన్నో శక్తులు గూఢచర్యం చేస్తుంటాయి. ఏమీ పట్టనట్టు కనిపిస్తున్నా, నిశితంగా గమనిస్తూనే ఉంటాయి. ఉదాహరణకి గాజు తలుపులు, నిశ్చలంగా ఉన్న మడుగులు, అంగళ్ళలో హేంగర్లకు వేలాడదీసివున్న కోట్లు, మొదలైనవి ఎప్పుడూ తనకి వ్యతిరేకంగా వాంఙ్మూలం ఇచ్చే సాక్షులు. అవి అతని మనసును చిత్రవధ చేస్తాయి. వేగంగా కదిలేది ఏదైనా క్రూరమైనదే. జడివాన, వరదనీళ్ళు, సుడిగాలి తుఫానుల వంటివి. వాటికి అతని మీద చాలా దురభిప్రాయం ఉంటుంది. అందుకే అవి అతన్ని తప్పుపడుతూ అలా భీకరంగా ప్రవర్తిస్తాయి. అతను తన జీవితంలో ప్రతిక్షణం తనచుట్టూ వున్న వస్తువుల్లో వచ్చే ప్రతి మార్పు వెనక ఉన్న రహస్యాన్ని జాగ్రత్తగా గమనించి ఛేదించడానికే వినియోగించాలి. తాను పీల్చి వొదిలే గాలిని సైతం అతను జాగ్రత్తగా గమనించి వివరాలు నమోదు చేసుకుంటూనే ఉండాలి. వాటిలో అతను రేకేత్తించే ఆసక్తి అతని పరిసరాలకే పరిమితమైతే బాగుండును కాని అలా జరగదు. కాలంతో పాటుగా అతని ఎర్రరక్తకణాల ఛాయ కొన్ని లక్షల రెట్లుగా పెరిగిపోయి మరింతగా విస్తరిస్తుంటుంది. అలా అతని గురించి ఎంతో దూరంగా అతని సమాచారం పాకిపోతుంటుంది. వేలమైళ్ళ ఆవల ఉండే మహాపర్వతాలూ, వాటిమీద ఉండే ఎత్తైన దేవదారు వృక్షాలూ కూడా అతన్ని ఎలా మార్చాలా అని అతని గురించే చర్చిస్తుంటాయి.


సబ్‌వేలో వినిపించే ప్రతిధ్వనులనీ, కలుషితమైన గాలినీ తప్పించుకుని వాళ్ళిద్దరూ ఎలాగోలా బయటపడే వేళకి సూర్యాస్తమయ అవశేషంగా మిగిలిన చివరి వెలుగులు, అప్పుడే వెలిగించిన వీధిదీపాల వెలుతురులో కలిసిపోయాయి. రాత్రి భోజనంలోకి చేపలు కొందామనుకుందామె. అందుకని కుర్రాడి పుట్టినరోజు కానుకగా కొన్న బుట్ట అతని చేతికిచ్చి ఇంటికి పంపింది. ఆమె చెప్పినట్టుగా అతను మూడో అంతస్తులో ఉన్న తమ అద్దెయింటికి చేరుకున్నాక కానీ గుర్తుకు రాలేదు, ఇంటితాళాలు ఉదయమే తాను ఆమెకి ఇచ్చినట్టు.

చేసేదేమీ లేక మౌనంగా మెట్లమీద కూచున్నాడు. పదినిమిషాలు పోయేక ఆమె బరువుగా కాళ్ళీడ్చుకుంటూ మెట్లెక్కి వచ్చింది, తన తెలివితక్కువతనాన్ని నిందించుకుంటున్నట్టుగా తల అడ్దంగా తిప్పుతూ, నవ్వలేక నవ్వుతూ. ఆ రెండుగదుల అద్దెయింటిలోకి వెళ్ళడమే ఆలస్యం, అతను గబగబా అద్దం దగ్గరకి వెళ్ళి, బొటనవేళ్ళు నోట్లోకి జొప్పించి తనని అప్పటివరకూ ఇబ్బందిపెడుతున్న కట్టుడుపళ్ళను కష్టపడి ఎలాగో బయటకు తీసేశాడు. ఆమె భోజనానికి ఏర్పాట్లు చేస్తుంటే, కుర్చీలో కూర్చొని అలవాటుగా రష్యను దినపత్రిక తిరగేశాడు. చదువుతూనే భోజనం ముగించాడు. భోజనం మెత్తగా ఉండడంతో అతనికి తన కట్టుడుపళ్ళ అవసరం రాలేదు. అతని మానసిక స్థితి గ్రహించి, ఆమె కూడా ఏమీ మాటాడకుండా మౌనంగా ఊరుకుంది.

అతను నిద్రపోవడానికి పడకగదిలోకి వెళ్ళిపోయినాక, ఆమె తన పాత పేకముక్కలు, పాత ఫోటో ఆల్బమ్‌లు ముందేసుకుని భోజనాలబల్ల దగ్గరే కూర్చుంది. ఆ ఎపార్టుమెంటు బిల్డింగు ముందున్న చెత్తడబ్బాలమీద వర్షపుచినుకులు సన్నగా చప్పుడుచేస్తూ పడుతున్నాయి. బల్లకు పక్కనే ఉన్న కిటికీలోంచి పక్క బిల్డింగులలోని కిటికీలు వెలుగుతూ కనిపిస్తున్నాయి. ఒక కిటికీలోంచి నల్లని పేంటు తొడుక్కున్నవ్యక్తి రెండు చేతులూ తలక్రింద పెట్టుకుని, మాసిపోయిన పక్కమీద వెల్లకిలా పడుకుని ఉండటం కనిపిస్తోంది. ఆమె కిటికీ పరదా వేసేసి, ముందున్న ఫోటో ఆల్బమ్ చూడటంలో నిమగ్నమైంది. వాళ్ళబ్బాయి చిన్నకుర్రాడుగా ఉన్నప్పుడు, మిగతా పిల్లలతో పోలిస్తే ప్రతిదానికీ ఎక్కువ ఆశ్చర్యపోతున్నట్టుండేవాడు. జర్మనీలో ఉన్నప్పుడు వాళ్ళింట్లో పనిచేసిన బూరెబుగ్గల అమ్మాయి, ఆమెను పెళ్ళి చేసుకోబోయే అబ్బాయి వున్న ఫోటో ఒకటి ఆల్బంలోంచి జారిపడింది.

ఆమె ఒక్కటొక్కటిగా పేజీలు తిప్పసాగింది… మిన్‌స్క్ నగరం, మహావిప్లవం, జర్మనీలోని లీప్‌జిగ్ నగరం, బెర్లిన్, మళ్ళీ లీప్‌జిగ్, మసక మసకగా ఉన్న అక్కడి వాళ్ళ ఇంటి ముందుభాగం… అక్కడిదే, వాళ్ళ కుర్రాడికి నాలుగేళ్ళప్పుడు… పార్కులో, కొత్తవాళ్ళను చూసి ముఖం తిప్పుకున్నట్టు, అతన్నే చూస్తున్న ఉడుత నుండి ముఖం తిప్పుకుంటున్నాడు. ఇంకో ఫోటో వాళ్ళ ఆంట్ రోజాది. సన్నగా రివటలా ఉండి ప్రతిదానికీ సణుగుతూ ఉండేది, అందరి గురించి బెంగపడుతుండేది. ఉన్నంతకాలం ఎప్పుడూ బాధలూ, దివాలాలూ, రైలు ప్రమాదాలూ, కేన్సర్లతోనే బ్రతుకీడ్చింది.నాజీలు చివరికి ఆమెను, ఆమె బెంగపడినవాళ్ళందరినీ కూడా హతమార్చిపారేశారు. తర్వాతది వాళ్ళ అబ్బాయి ఆరేళ్ళవాడప్పుడు. మనిషి చేతులూ, మనుషుల కాళ్ళతో, చిత్రవిచిత్రమైన పక్షుల బొమ్మలు గీసేవాడు. వయసుమీరినవాళ్ళలా నిద్రలేమితో బాధపడేవాడు. తర్వాతది వాళ్ళ బంధువులబ్బాయి. గొప్ప చదరంగం ఆటగాడు. మళ్ళీ వాళ్ళబ్బాయి ఎనిమిదేళ్ళప్పుడు. అప్పటికే అర్థం కాకుండా ఉండేవాడు. నడవాలోని వాల్‌పేపర్ చూసి భయపడేవాడు. ఒక బొమ్మల పుస్తకం అంటే మరీ భయపడేవాడు. అందులో ఒక రాళ్ళునిండిన కొండ… అందమైన ప్రకృతి దృశ్యం, ఆకుల్లేని మొండి చెట్టుకొమ్మనుండి వేలాడుతున్న పాత బండి చక్రం… తప్ప మరేమీ లేవు. ఆ తర్వాతది వాడు పదేళ్ళవాడప్పుడు. ఆ ఏడే వాళ్ళు యూరప్ విడిచి అమెరికాకు వచ్చింది. ఆమెకు అన్నీ గుర్తుకు వస్తున్నాయి… యూరప్ విడిచి వెళ్ళవలసి వచ్చినందుకు అవమానం, వాళ్ళ మీద వాళ్ళకే జాలి, ప్రయాణంలో వాళ్ళు ఎదుర్కొన్న అవమానాలు, అమెరికా వచ్చిన తర్వాత వాడిని ప్రత్యేకమైన స్కూల్లో చేర్పించడం, అక్కడి పిల్లలు వాడిని పెట్టిన హింసలు, గురిచేసిన అవమానాలూ… తర్వాత వాడు న్యుమోనియా బారినపడి కోలుకుందుకు చాలాకాలం తీసుకోవడం; అదే సమయంలో, బాగా తెలివైన పిల్లవాడు కావడంతో కొన్ని అతిలక్షణాలు సహజం అని తాము అనుకుని పెద్దగా పట్టించుకోని అతని చిన్న చిన్న భయాలన్నీ క్రమంగా బలపడి, హేతుబద్ధంగా అల్లుకున్న భ్రమల వలయాలుగా స్థిరపడి, క్రమక్రమంగా సాధారణ మనుషుల అవగాహన పరిధి నుండి అతను దూరంగా జరిగిపోయాడు.

వీటన్నిటితోనూ ఆమె సమాధానపడింది… జీవితమంటే ఒకదాని తర్వాత ఒకటిగా సుఖాలని కోల్పోవడానికి రాజీపడటమే గదా అని; తన విషయంలో అవి సుఖాలు కూడా కావు, కేవలం తన బిడ్డ పరిస్థితి మెరుగుపడడానికి ఉన్న చిన్న అవకాశాలు. తనూ, తన భర్తా పదేపదే ఏదో ఒక కారణంగా వచ్చి మీదపడిన కష్టాలనీ బాధలనీ భరించవలసి రావడం గుర్తు చేసుకుంది. పాపం తమ బిడ్డని హింసిస్తున్న అగోచర రాక్షసాకారాలను తలుచుకుని బాధపడింది. ఈ ప్రపంచంలో మనం అర్థం చేసుకోలేని ఎంత సౌకుమార్యం ఉందో, విధి చేతిలో అందులో ఎంత మార్దవత్వం నలిగి వృధా అయిపోతోందో, లేక పిచ్చిగా పరిణమిస్తోందోనని వాపోయింది. పాపం, ఆ నలిగిపోయిన పిల్లలు తమలో తాము పాడుకుంటూ ఏ మురికి సందుల్లో దేవుళ్ళాడుతున్నారో; రైతు దృష్టిని తప్పించుకోలేని అందమైన కలుపుమొక్కల్లా అలమటిస్తున్నారో!

అర్ధరాత్రి అవుతుండగా పడకగదిలోంచి ఆమె భర్త మూలుగు పెద్దగా వినిపించింది. దాని వెనుకే ఊలు కాలరున్న పాత రష్యన్ ఓవర్ కోట్ వేసుకుని తడబడుతూ ముందుగదిలోకి వచ్చాడు.

“నాకు నిద్రపట్టడం లేదు,” అన్నాడతను.

“ఎందుకని? ఇవాళ నువ్వు బాగా అలసిపోయావు కూడా,” అందామె.

“చచ్చిపోతున్నాను అందుకే నిద్ర పట్టడం లేదు,” అంటూ సోఫాలో జారిపోయి కూర్చున్నాడు.

“మళ్ళీ కడుపులో ఇబ్బందా? డాక్టర్ సొలోవ్‌ని పిలవనా?”

“వద్దు. వద్దు. ఏ డాక్టర్నీ పిలవొద్దు,” అన్నాడు రొప్పుతూ. “డాక్టర్లు ఎలా పోతే పోనీ, ముందు మనం మనవాణ్ణి అక్కడనుండి ఎంత వీలయితే అంత త్వరగా బయటకు తీసుకొచ్చేయాలి. లేకపొతే, రేపు ఏమి జరిగినా మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మనమే!” మన ఖర్మ అన్నట్టు నెత్తిమీద పిడికిలితో కొట్టుకుంటూ, నేలకి కాళ్ళు ఆనించి కష్టపడి లేచి కూచున్నాడు.

“అలాగే, రేపు ఉదయమే వాణ్ణి ఇంటికి తెచ్చేద్దాం,” అందామె.

“నాకు కొంచెం టీ ఇవ్వు,” అని బాత్‌రూమ్‌లోకి వెళ్ళాడు అతను.

క్రిందపడిపోయిన పేకముక్కల్ని, ఫొటోలనీ క్రిందకు ఒంగి ఆపసోపాలుపడుతూ ఏరి తీసింది. ఆఠీను జాకీ, ఇస్పేటు తొమ్మిది, ఆసూ, వాళ్ళింట్లో పనిచేసిన ఎల్సా, అనాగరికంగా కనిపించే ఆమె కాబోయే భర్త ఫోటో.

బాత్‌రూమ్ లోంచి చాలా హుషారుగా బయటకి వచ్చి, “నేనంతా పక్కాగా ఆలోచించేను. మన పడకగది వాడికి ఇచ్చేద్దాం. వంతులవారీగా ఇద్దరం రాత్రి కొంత సమయం వాడి దగ్గరా, ఈ సోఫాలోనూ గడుపుదాం. వారానికి కనీసం రెండు రోజులు డాక్టరుకి చూపిద్దాం. యువరాజుగారు ఏమంటాడోనని ఆలోచించొద్దు. అయినా అతనేమీ అనడు. ఎందుకంటే, ఇప్పటికంటే మరింత తక్కువ ఖర్చులో తేలిపోతుంది,” అన్నాడు అతను.

టెలిఫోను మ్రోగింది. టెలిఫోను మ్రోగడానికి అది వేళకాని వేళ. గది మధ్యలో నిల్చుని, ఊడిపోయిన కాలి స్లిప్పరు కోసం నేలమీద కాలుతో వెతుక్కుంటూ, పిల్లవాడిలా బోసినోటితో భార్యవంక ఆశ్చర్యంగా చూశాడు. అతనికంటే ఇంగ్లీషు ఆమెకే బాగా వచ్చు కనుక ఎప్పుడు ఫోను వచ్చినా ఆమే సమాధానం చెబుతుంటుంది.

“చార్లీ ఉన్నారా?” ఎవరో చిన్నపిల్ల గొంతు నీరసంగా వినిపించింది ఆమెకు.

“మీకు ఏ నంబరు కావాలి?… లేదు. ఆ నంబరు ఇది కాదు.”

క్రాడిల్ మీద ఫోను నెమ్మదిగా పెట్టిందామె. గుండె మీద చెయ్యి వేసుకుని “నాకు గొప్ప గాభరా వేసింది,” అందామె.

అతను ఒక నవ్వు నవ్వి, మళ్ళీ ఆవేశంగా తన ప్రణాళిక వివరించసాగాడు: తెల్లవారడమే ఆలస్యం. వాళ్ళు అబ్బాయిని ఇంటికి తీసుకువచ్చేస్తారు. జాగ్రత్తకోసం కత్తులూ, కటారులూ వంటి పదునైన వస్తువులేవీ వాడికి అందుబాటులో లేకుండా డ్రాయరులో ఉంచి దానికి తాళం వేస్తారు. వాడి పరిస్థితి ఎంత బాగులేకపోయినా, వాడి వల్ల ఇతరులకి ఎటువంటి హానీ ఉండదన్నది నిశ్చయం.

టెలిఫోను మళ్ళీ మ్రోగింది.

అదే చిన్నపిల్లగొంతు ఎంతో ఆతృతతో చార్లీ గురించి అడుగుతోంది మళ్ళీ.

“నీ దగ్గరున్న నంబరు తప్పు. నువ్వు చేస్తున్న తప్పేమిటో చెబుతాను విను. నువ్వు సున్నా నొక్కడానికి బదులు ఓ అన్న అక్షరం నొక్కుతున్నావు,” అని చెప్పి పెట్టేసిందామె.

అసంకల్పితంగా వచ్చిన ఆ అర్ధరాత్రి టీ తాగే అవకాశాన్ని వాళ్ళిద్దరూ ఆస్వాదించసాగారు. టీలో చక్కెర కరగడానికి వీలుగా అప్పుడప్పుడు అతను గ్లాసు పైకెత్తి గుండ్రంగా తిప్పుతూ, చప్పుడు చేస్తూ టీ పీలుస్తున్నాడు. అతని బట్టతలకి ఒక వైపు రక్తనాళం ఉబ్బి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అతని గడ్డంమీద వెండి తీగెల్లా వెంట్రుకలు మొలుచుకొచ్చున్నాయి. అబ్బాయి పుట్టినరోజుకి కొన్న బహుమతి టేబిలుమీద అలానే ఉంది. అతని కప్పులో మరికొంచెం టీ పోసే ప్రయత్నం చేస్తుంటే, అతను కళ్ళజోడు పెట్టుకుని బుట్టలో పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో మెరుస్తున్న జెల్లీలున్న సీసాలను మరింత పరీక్షగా చూసి ఆనందిస్తున్నాడు. వాటిమీద రాసి ఉన్న అక్షరాలని ఒకటొకటే తడబడుతూ, పెదాలు నాలికతో తడుపుకుంటూ చదువుతున్నాడు: ఏప్రికాట్, గ్రేప్, బీచ్ ప్లమ్, క్విన్స్. అతను క్రాబ్ ఆపిల్ దగ్గరకు వచ్చేసరికి టెలిఫోను మళ్ళీ మ్రోగింది.

(మూలం: Symbols and Signs)