ఇటుకలూ అటుకులూ

కమ్మంటే
నే రాను
రమ్మంటేనే
వస్తాను

“నాకే అర్థంగాదీపాట”
అన్నాడొక నిర్మాతా
త్రేయాచార్యులతో
“నీకే అర్థంగాదీపాట”
అన్నారు ఆచార్యులు [1]

అందమంటే వాళ్ళే అయినా
అందమంటే అందనివాళ్ళనీ
ఆగడాలెన్ని చేసినా
ఆగమంటే ఆగనివాళ్ళనీ
ఆడవాళ్ళంటాడు
వీడు

పాకిస్తాన్ ప్రధాని
ఫిరోజ్ ఖాన్ నూన్ – బారెట్లా
ముగ్గురు భార్యలనీ
ఫోర్ నూనూ, నూనూ
ఆఫ్టర్ నూన్లని అభివర్ణించిన
అసూయకూ అందం
ఉందని తెలియట్లా! [2]

తమిళానికి తెలుక్కీ
అందం విషయం లోనే
ఎంతో దూరాభిప్రాయం
తెలుగులో అందమన్నామా
తమిళంలో ప్రమాదమే

‘ళ’ పలకని వాళ్ళకు పె
ళ్ళవుతుందా? ళక్షణంగా!
ఒక విలేకరితో
‘రాస్కెల్లు’
అన్న అధికారికి
అయిందిగా బాగా [3]

సదుపాయం అంటే
అప్పుడు
శ్రుతి పేరున
ఇప్పుడు
కొత్త స్మృతి పేరున
రాజునీ, రాజ్యాన్నీ
రాజ్యాంగ సర్వస్వాన్నీ
అడుగడుగునా
కొల్ల గొట్టుకోటం
సహజీవన మంటే
అడుగునున్నవా
ళ్ళరుపులు లేకుండా
అడుక్కుంటూ
అడుక్కు, అడుక్కు
మరీ మరీ అడుక్కు
-మరీ మరీ అడక్కు-
ఉండిపోవటం

కవులకు కొద్దో గొప్పో
రసవిషయం తెలిస్తే
ఉద్దండ పండితులకు
కావసినంత
రభస విషయం తెలుసు [4]

తెలుగు భాష తెలివి జూసి
మురిసి ముద్దయి పోయి –
రండీ రండీ అని పిలుస్తూ
అతిథిని ఆదరిస్తూనే
రండీ రండీ అని అంటూ
అవమానం చేయగలదని
నవ్వుతూ అన్నాడు
పగలబడొక పంజాబీ [5]

ఒడియాకీ తెలుక్కీ
లెక్కల్లో తగాదాల్లేవ్
ఒడియాలో ‘గొట్టె’ అంటే
ఒకటి
తెలుగులో ‘విరగ్గొట్టె’ అంటే
రెండు

ఇంగ్లీష్ తెలుగూ
ఒకళ్ళకొకళ్ళు తోడు
ఇంగ్లీష్‌లో ప్రాప్
తెలుగులో ప్రాపు

అస్త్ర విద్యా ప్రదర్శన –
అతిరథ మహారథులు
ఆగ్నేయ వరుణాస్త్రాలతో
నాగాస్త్ర గరుడాస్త్రాలతో
దారుణ అణ్వాస్త్రాలతో
పోటీలు పడుతూ
ఫెళ ఫెళా మెరిసిపోతున్నారు
విలాసిని విజయలక్ష్మి
కులుకుతూ వెళ్ళి
కుసుమాస్త్రుణ్ణి
వరించింది [6]

అల నన్నయ్యకు లేదు
తిక్కనకూ లేదన్నట్టు
ఇల త్రిమతాచార్యులకే
లేదా భోగం
రైతైనా, రౌతైనా
మడేలైనా మరెవరైనా
తెలుగు వాడికి మాత్రమే
ఉన్న భాగ్య విశేషం
అన్నమయ కోశమే[7]
ఆనందమయకోశం

కనపడ్డా తొలి పుటల్లో పరిచయచయం
కవిదే నిజంగా ముందుమాట.
ఎంతటి శ్రోణీ గౌరవంతో వచ్చినా విమర్శ
పేరంటాన సృజనకే వేస్తారు పెద్ద పీట


  1. ఒక ‘పాడుతా తీయగా’ లో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ చెప్పింది విని.
  2. ఎన్నో ఏళ్ళుగా తలలో మెదులుతున్న సర్ తేజ్ బహదూర్ సప్రూ అందమైన అభివర్ణనని తెలుగులో చెపుదామని, ‘అసూయ’ అన్నది సరదాగా ఆపాదించి. (మంచి భోజనానికి సప్రూ నిర్వచనం ‘ముస్లిమ్ వంటకాలు హిందూ వంటింట్లో వండి వెస్ట్రన్ పధ్ధతిలో వడ్డించినది.’)
  3. ఒక జరిగిన సంఘటన వార్తాపత్రికల కనులారా చూసి, నవ్వటానికి దానిక్కొంత పూసి.
  4. మాయాబజార్‌లో పింగళి నిష్కర్షగా అన్న ” మీరు ఉద్దండ పండితులేగానీ…” నుంచి సౌమ్యంగా సారాంశం మాత్రం తీసుకుని…
  5. తిరుమల రామచంద్ర ‘హంపీ నుంచి హరప్పా దాకా’ చదివి.
  6. ఆస్కార్ వైల్డ్, People are either charming or tediousకి నా చేతనైన వాయూత ఇద్దామని.
  7. అన్ని మయ కోశాలలోనూ అన్నమయ కోశమే నని కూడా…