[వకుళాభరణం రాజగోపాల్ (V Rajagopal) ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ షికాగో, సౌత్ ఏషియన్ లాంగ్వేజెస్ అండ్ సివిలిజేషన్స్ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ నుంచి 2004 లో పిహెచ్.డీ పొందిన రాజగోపాల్, 2012 దాకా హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేశారు. తమ పరిశోధనలలో భాగంగా దక్షిణ భారతదేశపు వర్తమానంలో జరుగుతున్న మార్పులను విశ్లేషిస్తుంటారు.]
అసలు విషయానికి వచ్చేముందు నా పూర్వాపరాల గురించి ప్రస్తావించవలసిన అవసరం ఉంది. 1960ల దశకంలో నెల్లూరు జిల్లా కావలిలో పుట్టిన నామీద చిన్నప్పటి నుండీ కమ్యూనిస్టు భావాల ప్రభావం — ఊరి పరంగా, కుటుంబ పరంగా — బలంగా ఉంది. అయితే, ఇక్కడొక చిన్న చిక్కొచ్చి పడింది. మా అమ్మ కూడా ఉద్యోగం చేసినందువల్ల నన్ను పెంచే బాధ్యత మా అమ్మమ్మ వయసున్న విమలమ్మ పంచుకుంది. ఆమెను నేను అమ్మమ్మ అనే పిలిచేవాడిని. రక్త సంబంధం, బంధుత్వం కాకపోయినా ఆమె నన్ను కన్నతల్లి కన్నా ఎక్కువగా సాకింది. ఆమెకు సాంప్రదాయకమైన ఆలోచనలుండేవి. రామాయణ మహాభారతాల్లోని చాలా కథలు ఆమె నాకు ఓపికగా చెప్పేది. మా కుటుంబపు భావాలకి, ఆమె భావాలకి వైరుధ్యం ఉండేది. బాల్యంలో నా చెవిలో పడిన ఒక వైరుధ్యం (ఆంధ్ర?) దేశంలో ప్రధాన రాజకీయ శక్తులు రెండు. ఒకటి కాంగ్రెసు, రెండవది కమ్యూనిస్టులు. వీరిలో ఒకరంటే ఒకరికి పడదు. అమ్మమ్మ కాంగ్రెసుని సమర్ధించేది. (ఆమె నూలు వడికి స్వయంగా తన చేతుల మీదగా గాంధీ గారికి అందజేసింది కూడా.) రెండవ వైరుధ్యం సాహిత్యానికి సంబంధించినది. కమ్యూనిస్టులు శ్రీశ్రీనే మహాకవిగా భావిస్తారని, విశ్వనాథ సత్యనారాయణ అంటే వారికి గిట్టదని. అమ్మమ్మకి విశ్వనాథ అంటే చాలా అభిమానంగా ఉండేది.
ఆరో తరగతిలో చేరేటప్పటికి కమ్యూనిస్టు ప్రభావమే నా మీద స్థిరపడింది. సంప్రదాయులకు వేదాలంటే ఉన్న ప్రామాణికత కన్నా ఎక్కువ ప్రామాణికత కమ్యూనిస్టులకు ‘కాపిటల్’ అంటే ఉండేది. అలా నేనూ నమ్మాను. ప్రపంచం లోని అన్ని సాంఘిక రాజకీయ సమస్యల విశ్లేషణకు కీలకాలు ఆ గ్రంథం లోనే ఉన్నాయని భావించిన రోజులవి.
కావలిలో ఉన్నన్ని రోజులు మార్క్సిౙపు మోహం లోనే ఉన్నాను. అయితే, బి.ఏ. చదవడానికి మద్రాసు వెళ్తే కొత్త ఆలోచనలు పోకడలు పరిచయమయ్యాయి. మార్క్సిౙమ్ ప్రత్యక్షసత్యంగా భావించని అధ్యాపకులతో పరిచయం ఏర్పడింది. వాళ్ళు తెలివితేటలున్న అధ్యాపకులే. మనుషులుగా కూడా మంచివాళ్ళే. మార్క్సిస్టులు కానివాళ్ళలో కూడా మంచివాళ్ళు తెలివి గలవాళ్ళు ఉండొచ్చని తెలుసుకున్నాను. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చాలా రకాల ఆలోచనలుంటాయని, వాటిలో మార్క్సిౙమ్ ఒక స్రవంతి మాత్రమే నని గ్రహించాను.
ఢిల్లీలో నెహ్రూ విశ్వవిద్యాలయంలో చరిత్రలో ఎం.ఏ. చదవడానికి వెళ్ళి నేను మళ్ళా మార్క్సిస్టు ప్రపంచంలో అడుగుపెట్టాను. జాతీయోద్యమంలో కాంగ్రెసు సంస్థ భూస్వాములకు, పెట్టుబడిదారులకు కొమ్ము కాసి పేద ప్రజానీకానికి ద్రోహం చేసిందా? వలస పాలనలో భారతీయ ఆర్థిక వ్యవస్థకు ఏ స్థాయిలో నష్టం వాటిల్లింది? మధ్యతరగతి నాయకత్వం లేకుండా నిరక్షరులైన కింది స్థాయి ప్రజలు వలస పాలనని ప్రతిఘటించగలిగారా? ఇలాంటి ప్రశ్నల మీద వేడిగా వాగ్యుద్ధాలు, చర్చలు జరుగుతున్న రోజులవి. ఉదహరించిన ప్రశ్నలు ముఖ్యమైనవే అయినా వాటి గురించిన చర్చ ఒక దశ తరవాత పేలవంగా నిరుపయోగంగా మారింది.
ఎడ్వర్డ్ సయీద్ (Edward Said) రాసిన ‘ఓరియంటలిౙమ్‘ 1978లోనే మొదటి ప్రచురణకు నోచినా భారతదేశంలో ఉన్న చరిత్రకారులు దాని ప్రాముఖ్యాన్ని గుర్తించడానికి దాదాపు ఒక దశాబ్దం పట్టింది. ఈ పరిస్థితుల్లో 1990వ దశకపు తొలి సంవత్సరాలలో నేను నారాయణ రావు గారిని మొదటిసారి కలవడమూ, ఆయనతో పరిచయం పెరగడమూ, పిహెచ్.డీ. చెయ్యడానికి మాడిసన్ వెళ్ళడమూ జరిగాయి. ఇంకా కమ్యూనిస్టు సానుభూతిపరుడిగానే ఉన్నా, చరిత్ర రచనలో మార్క్సిస్టు పద్ధతి ఉపయోగాన్ని గుర్తిస్తున్నా, ఆలోచన ఇతర విషయాల మీదకు మళ్ళింది. భారతదేశ చరిత్రలో కొత్త రకపు ప్రశ్నలు వెయ్యాలని, భారతీయ సమాజం మీద వలస పాలన ప్రభావాన్ని గురించి కొత్త కోణాలలో ఆలోచించాలని, ప్రయత్నం మొదలైంది. వలస పాలన వల్ల జరిగిన హాని ఆర్థిక రాజకీయ రంగాలలో కన్నా, అస్తిత్వ సాంస్కృతిక రంగాలలోనే ఎక్కువగా ఉందన్న నారాయణ రావు గారి ప్రతిపాదన నాలో ఆలోచనను రేకెత్తించింది.
వలసానంతర ఆలోచనా స్రవంతిలో (Post colonial thought) నారాయణ రావు గారి అభిప్రాయాలు అంతర్భాగమే అనుకోవడానికి అభ్యంతరం ఏమీ లేదు గాని, కొన్ని ముఖ్యమైన తేడాలను పేర్కొనాలి. వలసానంతర మేధావులు వలస పాలనలో, వలస పాలన తరవాత, జరిగిన అంశాలనే పరిశీలిస్తారు గాని వలస పూర్వ సామాజిక పరిస్థితుల జోలికి పోరు. రెండవది, ఆంగ్లంలో జరిగిన రచనలనే ప్రధానంగా విశ్లేషిస్తారు. ఈ ప్రవృత్తికి భిన్నంగా నారాయణ రావు గారు భారతీయ సాహిత్యం మీద దృష్టి పెడతారు. వలసానంతర దృష్టి కోణంతో వలసపూర్వ సమాజాన్ని చదవరు. సమకాలీన ప్రాపంచిక దృక్పథాన్ని, సాధ్యమైనంతలో, బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తారు. తెలుగు సాహిత్యం, చరిత్ర ఆధారంగా ఆయన చేసిన సూచనలు, ప్రతిపాదించిన దృక్కోణాలు క్లుప్తంగా వివరిస్తాను.
- ఉద్గ్రంథాలలో లేదా ఉన్నత సామాజిక వార్గాల సామాజిక దృక్పథాన్ని ప్రతిఫలించే గ్రంథాలను ఆధారం చేసుకొని భారతీయ సమాజపు స్వరూపం గురించి సూత్రీకరించడం తప్పు. ఉదాహరణకు, భారతీయ సమాజ విశ్లేషణకు కుల/వర్ణ వ్యవస్థ పని చేసిన తీరు అర్థం చేసుకోవడానికి మను ధర్మశాస్త్రం ఆధారం చేసుకోవడం సరైన అంచనాకి దారి తీయదు. ఇది విలియమ్ జోన్స్ (William Jones) వంటి ప్రాక్వాదులు (Orientalists) ప్రవేశపెట్టిన తప్పుడు పద్ధతి.
- ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి మనకు ఎక్కువ తెలియదు. తెలుసుకోవడానికి అవసరమైన ఆధారాలు తక్కువ. మధ్యయుగాల భారతదేశపు చరిత్రకు సంబంధించిన ఆధారాలే సులభంగా దొరుకుతాయి. ఈనాటి భారతీయ సమాజంలో ముస్లింలు అంతర్భాగమైనట్టుగా మధ్యయుగాల భారతీయ సమాజంలో వారి సంస్కృతి కూడా అంతర్భాగమే. ఈ సామ్యంతో పాటుగా మధ్యయుగ చరిత్రకు, ఇప్పటి మన సమాజానికి దగ్గర సంబంధం, కొనసాగింపు ఉన్నాయి. మధ్య యుగ చరిత్ర అధ్యయనం చెయ్యడంలో జరిగిన అలక్ష్యాన్ని తొలగించి, ఆ యుగాన్ని లోతుగా పరిశీలించాలి.
- మధ్యయుగాల చరిత్ర, సంస్కృతి వీలున్నంత వరకు ఆ యుగపు అంతర్గత ప్రమాణాలలోనే వాళ్ళ సిద్ధాంతాలు, ఆలోచనా ధోరణికి అనుగుణంగానే అర్థం చేసుకోవాలి. ఇరవయ్యో శతాబ్దపు దృక్కోణం నుండో, పాశ్చాత్య సిద్ధాంతాల దృక్కోణం నుండో మధ్యయుగ చరిత్రను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది మనకు అర్థం కాదు.
- మాతృభాష అన్న ఆలోచన మన మధ్యయుగ సంస్కృతిలో లేదు. అది వలసవాద భావాల సంపర్కం వల్ల వచ్చిన కొత్త ఆలోచన. మనకు దేశభాష, రాజభాషలు మాత్రమే ఉండేవి.
- భాష ప్రాతిపదికగా ఏర్పడిన రాజకీయ అస్తిత్వం పంతొమ్మిదవ శతాబ్దంలో ఏర్పడినదే. ఆ శతాబ్దానికి ముందు తెలుగు అస్తిత్వాన్ని గురించి, తెలుగు రాజ్యాల గురించి, తెలుగు వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడడం పొరపాటు. ప్రాచీన మధ్యయుగాలలో తెలుగు వారి చరిత్ర రాయడానికి పూనుకోవడం, మన యుగపు ప్రమాణాలని, అభిప్రాయాలని పూర్వకాలాలకి తప్పుగా ఆపాదించడమే.
- భారతీయ సంస్కృతి ప్రధాన లక్షణం ఆధ్యాత్మికం, పరమని, పాశ్చాత్య సంస్కృతి ప్రధాన లక్షణం విషయాత్మకం, ఐహికమని చేసే ప్రతిపాదన ఆమోదనీయం కాదు. మధ్యయుగాల భావస్రవంతి మత సంబంధమైన భాషలో వ్యక్తీకరించడం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఆధునిక సమాజపు తొలిదశలో ఈ భాషలో మార్పు వస్తుంది. భావాలు కూడా ప్రచ్ఛన్నంగా ఐహిక విషయాల మీద కేంద్రీకృతం అవుతాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ మార్పులు మనం పదహారు, పదిహేడు శతాబ్దాల భారతదేశ చరిత్రలో కూడా గమనించవచ్చు. ధనార్జన, రాజకీయాధికార కాంక్ష, శారీరక వస్తు సుఖ ప్రస్తావన, నూతన సాహిత్య రచనలో చోటు చేసుకున్నాయి.
- ఆధునికత కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన యూరప్‌లో పుట్టి పెరిగి, తరవాత కాలంలో బయట ప్రాంతాలకు వ్యాపించిన ప్రవృత్తి కాదు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల మధ్య ఏర్పడిన ఆర్ధిక సామాజిక సంబంధాల నేపథ్యం లోనే ఆధునికత యూరప్‌తో పాటుగా కొన్ని ఇతర ప్రాంతాలలో కూడా దాదాపు ఒకే కాలంలో తలెత్తింది. అయితే వలస సామ్రాజ్య స్థాపన కారణంగా యూరోపేతర ప్రాతాల్లో తలెత్తిన ఆధునికత వీగిపోయింది.
- వలసపాలనలో భారతీయ సమాజపు పూర్వ విజ్ఞానం, మేధో సంపద పూర్తిగా మరుగున పడిపోయాయి. ఇలా అవడానికి కారణాలు మూడు. మొదటిది, బాహ్యనేపథ్యం నుండి వచ్చినందువలన భారతీయ విజ్ఞానపు స్థితిగతులను అవగాహన చేసుకోవడంలో వలసవాదులు విఫలం కావడం. రెండవది, వలసపాలకుల ఆర్ధిక దోపిడికి, రాజకీయ పెత్తనానికి ఆ విజ్ఞానం అవసరం కాకపోవడం. మూడవది, వలసవాదులు తమది ఉత్తమ సంస్కృతి అని, భారతీయులది అధమ సంస్కృతి అని నమ్మడం, ఆ నమ్మకాన్ని ప్రచారం చెయ్యడం; ప్రచారం చేసి భారతీయులను కూడా ఆ విధంగా ఒప్పించగలిగితే వారు వలసపాలనకు విధేయులుగా ఉంటారని అంచనా వెయ్యటం.