రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

వలస పాలన, సంస్కృతి: నారాయణ రావు గారి ఆలోచనలు కొన్ని

రచన: వకుళాభరణం రాజగోపాల్
జనవరి 2013

[వకుళాభరణం రాజగోపాల్ (V Rajagopal) ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ షికాగో, సౌత్ ఏషియన్ లాంగ్వేజెస్ అండ్ సివిలిజేషన్స్ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ నుంచి 2004 లో పిహెచ్.డీ పొందిన రాజగోపాల్, 2012 దాకా హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేశారు. తమ పరిశోధనలలో భాగంగా దక్షిణ భారతదేశపు వర్తమానంలో జరుగుతున్న మార్పులను విశ్లేషిస్తుంటారు.]


అసలు విషయానికి వచ్చేముందు నా పూర్వాపరాల గురించి ప్రస్తావించవలసిన అవసరం ఉంది. 1960ల దశకంలో నెల్లూరు జిల్లా కావలిలో పుట్టిన నామీద చిన్నప్పటి నుండీ కమ్యూనిస్టు భావాల ప్రభావం — ఊరి పరంగా, కుటుంబ పరంగా — బలంగా ఉంది. అయితే, ఇక్కడొక చిన్న చిక్కొచ్చి పడింది. మా అమ్మ కూడా ఉద్యోగం చేసినందువల్ల నన్ను పెంచే బాధ్యత మా అమ్మమ్మ వయసున్న విమలమ్మ పంచుకుంది. ఆమెను నేను అమ్మమ్మ అనే పిలిచేవాడిని. రక్త సంబంధం, బంధుత్వం కాకపోయినా ఆమె నన్ను కన్నతల్లి కన్నా ఎక్కువగా సాకింది. ఆమెకు సాంప్రదాయకమైన ఆలోచనలుండేవి. రామాయణ మహాభారతాల్లోని చాలా కథలు ఆమె నాకు ఓపికగా చెప్పేది. మా కుటుంబపు భావాలకి, ఆమె భావాలకి వైరుధ్యం ఉండేది. బాల్యంలో నా చెవిలో పడిన ఒక వైరుధ్యం (ఆంధ్ర?) దేశంలో ప్రధాన రాజకీయ శక్తులు రెండు. ఒకటి కాంగ్రెసు, రెండవది కమ్యూనిస్టులు. వీరిలో ఒకరంటే ఒకరికి పడదు. అమ్మమ్మ కాంగ్రెసుని సమర్ధించేది. (ఆమె నూలు వడికి స్వయంగా తన చేతుల మీదగా గాంధీ గారికి అందజేసింది కూడా.) రెండవ వైరుధ్యం సాహిత్యానికి సంబంధించినది. కమ్యూనిస్టులు శ్రీశ్రీనే మహాకవిగా భావిస్తారని, విశ్వనాథ సత్యనారాయణ అంటే వారికి గిట్టదని. అమ్మమ్మకి విశ్వనాథ అంటే చాలా అభిమానంగా ఉండేది.

ఆరో తరగతిలో చేరేటప్పటికి కమ్యూనిస్టు ప్రభావమే నా మీద స్థిరపడింది. సంప్రదాయులకు వేదాలంటే ఉన్న ప్రామాణికత కన్నా ఎక్కువ ప్రామాణికత కమ్యూనిస్టులకు ‘కాపిటల్’ అంటే ఉండేది. అలా నేనూ నమ్మాను. ప్రపంచం లోని అన్ని సాంఘిక రాజకీయ సమస్యల విశ్లేషణకు కీలకాలు ఆ గ్రంథం లోనే ఉన్నాయని భావించిన రోజులవి.

కావలిలో ఉన్నన్ని రోజులు మార్క్సిౙపు మోహం లోనే ఉన్నాను. అయితే, బి.ఏ. చదవడానికి మద్రాసు వెళ్తే కొత్త ఆలోచనలు పోకడలు పరిచయమయ్యాయి. మార్క్సిౙమ్ ప్రత్యక్షసత్యంగా భావించని అధ్యాపకులతో పరిచయం ఏర్పడింది. వాళ్ళు తెలివితేటలున్న అధ్యాపకులే. మనుషులుగా కూడా మంచివాళ్ళే. మార్క్సిస్టులు కానివాళ్ళలో కూడా మంచివాళ్ళు తెలివి గలవాళ్ళు ఉండొచ్చని తెలుసుకున్నాను. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చాలా రకాల ఆలోచనలుంటాయని, వాటిలో మార్క్సిౙమ్ ఒక స్రవంతి మాత్రమే నని గ్రహించాను.

ఢిల్లీలో నెహ్రూ విశ్వవిద్యాలయంలో చరిత్రలో ఎం.ఏ. చదవడానికి వెళ్ళి నేను మళ్ళా మార్క్సిస్టు ప్రపంచంలో అడుగుపెట్టాను. జాతీయోద్యమంలో కాంగ్రెసు సంస్థ భూస్వాములకు, పెట్టుబడిదారులకు కొమ్ము కాసి పేద ప్రజానీకానికి ద్రోహం చేసిందా? వలస పాలనలో భారతీయ ఆర్థిక వ్యవస్థకు ఏ స్థాయిలో నష్టం వాటిల్లింది? మధ్యతరగతి నాయకత్వం లేకుండా నిరక్షరులైన కింది స్థాయి ప్రజలు వలస పాలనని ప్రతిఘటించగలిగారా? ఇలాంటి ప్రశ్నల మీద వేడిగా వాగ్యుద్ధాలు, చర్చలు జరుగుతున్న రోజులవి. ఉదహరించిన ప్రశ్నలు ముఖ్యమైనవే అయినా వాటి గురించిన చర్చ ఒక దశ తరవాత పేలవంగా నిరుపయోగంగా మారింది.

ఎడ్వర్డ్ సయీద్ (Edward Said) రాసిన ‘ఓరియంటలిౙమ్‘ 1978లోనే మొదటి ప్రచురణకు నోచినా భారతదేశంలో ఉన్న చరిత్రకారులు దాని ప్రాముఖ్యాన్ని గుర్తించడానికి దాదాపు ఒక దశాబ్దం పట్టింది. ఈ పరిస్థితుల్లో 1990వ దశకపు తొలి సంవత్సరాలలో నేను నారాయణ రావు గారిని మొదటిసారి కలవడమూ, ఆయనతో పరిచయం పెరగడమూ, పిహెచ్.డీ. చెయ్యడానికి మాడిసన్ వెళ్ళడమూ జరిగాయి. ఇంకా కమ్యూనిస్టు సానుభూతిపరుడిగానే ఉన్నా, చరిత్ర రచనలో మార్క్సిస్టు పద్ధతి ఉపయోగాన్ని గుర్తిస్తున్నా, ఆలోచన ఇతర విషయాల మీదకు మళ్ళింది. భారతదేశ చరిత్రలో కొత్త రకపు ప్రశ్నలు వెయ్యాలని, భారతీయ సమాజం మీద వలస పాలన ప్రభావాన్ని గురించి కొత్త కోణాలలో ఆలోచించాలని, ప్రయత్నం మొదలైంది. వలస పాలన వల్ల జరిగిన హాని ఆర్థిక రాజకీయ రంగాలలో కన్నా, అస్తిత్వ సాంస్కృతిక రంగాలలోనే ఎక్కువగా ఉందన్న నారాయణ రావు గారి ప్రతిపాదన నాలో ఆలోచనను రేకెత్తించింది.

వలసానంతర ఆలోచనా స్రవంతిలో (Post colonial thought) నారాయణ రావు గారి అభిప్రాయాలు అంతర్భాగమే అనుకోవడానికి అభ్యంతరం ఏమీ లేదు గాని, కొన్ని ముఖ్యమైన తేడాలను పేర్కొనాలి. వలసానంతర మేధావులు వలస పాలనలో, వలస పాలన తరవాత, జరిగిన అంశాలనే పరిశీలిస్తారు గాని వలస పూర్వ సామాజిక పరిస్థితుల జోలికి పోరు. రెండవది, ఆంగ్లంలో జరిగిన రచనలనే ప్రధానంగా విశ్లేషిస్తారు. ఈ ప్రవృత్తికి భిన్నంగా నారాయణ రావు గారు భారతీయ సాహిత్యం మీద దృష్టి పెడతారు. వలసానంతర దృష్టి కోణంతో వలసపూర్వ సమాజాన్ని చదవరు. సమకాలీన ప్రాపంచిక దృక్పథాన్ని, సాధ్యమైనంతలో, బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తారు. తెలుగు సాహిత్యం, చరిత్ర ఆధారంగా ఆయన చేసిన సూచనలు, ప్రతిపాదించిన దృక్కోణాలు క్లుప్తంగా వివరిస్తాను.

  • ఉద్గ్రంథాలలో లేదా ఉన్నత సామాజిక వార్గాల సామాజిక దృక్పథాన్ని ప్రతిఫలించే గ్రంథాలను ఆధారం చేసుకొని భారతీయ సమాజపు స్వరూపం గురించి సూత్రీకరించడం తప్పు. ఉదాహరణకు, భారతీయ సమాజ విశ్లేషణకు కుల/వర్ణ వ్యవస్థ పని చేసిన తీరు అర్థం చేసుకోవడానికి మను ధర్మశాస్త్రం ఆధారం చేసుకోవడం సరైన అంచనాకి దారి తీయదు. ఇది విలియమ్ జోన్స్ (William Jones) వంటి ప్రాక్వాదులు (Orientalists) ప్రవేశపెట్టిన తప్పుడు పద్ధతి.
  • ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి మనకు ఎక్కువ తెలియదు. తెలుసుకోవడానికి అవసరమైన ఆధారాలు తక్కువ. మధ్యయుగాల భారతదేశపు చరిత్రకు సంబంధించిన ఆధారాలే సులభంగా దొరుకుతాయి. ఈనాటి భారతీయ సమాజంలో ముస్లింలు అంతర్భాగమైనట్టుగా మధ్యయుగాల భారతీయ సమాజంలో వారి సంస్కృతి కూడా అంతర్భాగమే. ఈ సామ్యంతో పాటుగా మధ్యయుగ చరిత్రకు, ఇప్పటి మన సమాజానికి దగ్గర సంబంధం, కొనసాగింపు ఉన్నాయి. మధ్య యుగ చరిత్ర అధ్యయనం చెయ్యడంలో జరిగిన అలక్ష్యాన్ని తొలగించి, ఆ యుగాన్ని లోతుగా పరిశీలించాలి.
  • మధ్యయుగాల చరిత్ర, సంస్కృతి వీలున్నంత వరకు ఆ యుగపు అంతర్గత ప్రమాణాలలోనే వాళ్ళ సిద్ధాంతాలు, ఆలోచనా ధోరణికి అనుగుణంగానే అర్థం చేసుకోవాలి. ఇరవయ్యో శతాబ్దపు దృక్కోణం నుండో, పాశ్చాత్య సిద్ధాంతాల దృక్కోణం నుండో మధ్యయుగ చరిత్రను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది మనకు అర్థం కాదు.
  • మాతృభాష అన్న ఆలోచన మన మధ్యయుగ సంస్కృతిలో లేదు. అది వలసవాద భావాల సంపర్కం వల్ల వచ్చిన కొత్త ఆలోచన. మనకు దేశభాష, రాజభాషలు మాత్రమే ఉండేవి.
  • భాష ప్రాతిపదికగా ఏర్పడిన రాజకీయ అస్తిత్వం పంతొమ్మిదవ శతాబ్దంలో ఏర్పడినదే. ఆ శతాబ్దానికి ముందు తెలుగు అస్తిత్వాన్ని గురించి, తెలుగు రాజ్యాల గురించి, తెలుగు వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడడం పొరపాటు. ప్రాచీన మధ్యయుగాలలో తెలుగు వారి చరిత్ర రాయడానికి పూనుకోవడం, మన యుగపు ప్రమాణాలని, అభిప్రాయాలని పూర్వకాలాలకి తప్పుగా ఆపాదించడమే.
  • భారతీయ సంస్కృతి ప్రధాన లక్షణం ఆధ్యాత్మికం, పరమని, పాశ్చాత్య సంస్కృతి ప్రధాన లక్షణం విషయాత్మకం, ఐహికమని చేసే ప్రతిపాదన ఆమోదనీయం కాదు. మధ్యయుగాల భావస్రవంతి మత సంబంధమైన భాషలో వ్యక్తీకరించడం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఆధునిక సమాజపు తొలిదశలో ఈ భాషలో మార్పు వస్తుంది. భావాలు కూడా ప్రచ్ఛన్నంగా ఐహిక విషయాల మీద కేంద్రీకృతం అవుతాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ మార్పులు మనం పదహారు, పదిహేడు శతాబ్దాల భారతదేశ చరిత్రలో కూడా గమనించవచ్చు. ధనార్జన, రాజకీయాధికార కాంక్ష, శారీరక వస్తు సుఖ ప్రస్తావన, నూతన సాహిత్య రచనలో చోటు చేసుకున్నాయి.
  • ఆధునికత కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన యూరప్‌లో పుట్టి పెరిగి, తరవాత కాలంలో బయట ప్రాంతాలకు వ్యాపించిన ప్రవృత్తి కాదు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల మధ్య ఏర్పడిన ఆర్ధిక సామాజిక సంబంధాల నేపథ్యం లోనే ఆధునికత యూరప్‌తో పాటుగా కొన్ని ఇతర ప్రాంతాలలో కూడా దాదాపు ఒకే కాలంలో తలెత్తింది. అయితే వలస సామ్రాజ్య స్థాపన కారణంగా యూరోపేతర ప్రాతాల్లో తలెత్తిన ఆధునికత వీగిపోయింది.
  • వలసపాలనలో భారతీయ సమాజపు పూర్వ విజ్ఞానం, మేధో సంపద పూర్తిగా మరుగున పడిపోయాయి. ఇలా అవడానికి కారణాలు మూడు. మొదటిది, బాహ్యనేపథ్యం నుండి వచ్చినందువలన భారతీయ విజ్ఞానపు స్థితిగతులను అవగాహన చేసుకోవడంలో వలసవాదులు విఫలం కావడం. రెండవది, వలసపాలకుల ఆర్ధిక దోపిడికి, రాజకీయ పెత్తనానికి ఆ విజ్ఞానం అవసరం కాకపోవడం. మూడవది, వలసవాదులు తమది ఉత్తమ సంస్కృతి అని, భారతీయులది అధమ సంస్కృతి అని నమ్మడం, ఆ నమ్మకాన్ని ప్రచారం చెయ్యడం; ప్రచారం చేసి భారతీయులను కూడా ఆ విధంగా ఒప్పించగలిగితే వారు వలసపాలనకు విధేయులుగా ఉంటారని అంచనా వెయ్యటం.

  • వలసపాలనకు క్రైస్తవ మత ప్రచారానికి ఎడతెగని సంబంధం ఉంది. క్రైస్తవ మతానికి భారతీయులు అధిక సంఖ్యలో మార్పిడి చెందితే అదే మతానికి చెందిన వలసపాలకుల పట్ల విధేయత ప్రదర్శిస్తారన్న అంచనా వలసపాలకులు క్రైస్తవ మతప్రచారకులని ప్రోత్సహించడానికి దారి తీసింది. వలస పాలకుల తరహాలోనే క్రైస్తవ ప్రచారకులు భారతీయులది అధమ సంస్కృతి అని, భారతీయ మతాలు అసత్యమైనవి అని, మూఢ నమ్మకాల పుట్టలని ప్రచారం చేశారు. మతమార్పిడి ప్రయత్నాలు విజయవంతం కాకపోతే, ఆటంకం కలిగిస్తున్నది కుల వ్యవస్థే అని నిర్ధారించి కులాన్ని రూపు మాపాలన్న వాదన మొదలు పెట్టిన వారయ్యారు.
  • వలసపాలన క్రమంలో భారతదేశానికి వచ్చి పని చేసిన ఉదారవాదుల (Liberals) జీవితాలని, పనిని వలసవాద భావజాలంలో భాగం గానే చూడాలి. వాళ్ళ వ్యక్తిగత జీవితాలలో ఒక్కోక్కసారి నిస్వార్థం, త్యాగం కనిపించినంత మాత్రాన వారి భావప్రపంచం గురించి తప్పు అంచనా వెయ్యకూడదు. భారతదేశానికి వచ్చి స్థిరపడి, ఇక్కడే మరణించిన క్రైస్తవ మత ప్రచారకుడు వ్యక్తిగతంగా నిస్వార్ధపరుడే అయినా వలసపాలనకు చేయూత ఇచ్చిన వాడే, వలసభావాల ప్రచారంలో పాలు పంచుకున్న వాడే. దక్షిణ భారతదేశంలో పని చేసి రాయలసీమలో మరణించిన మద్రాసు రాష్ట్రపు గవర్నరు థామన్ మన్రో రైతు పక్షపాతి కాదు, వలసపాలక వర్గ ప్రతినిధి. ఆనకట్టలు కట్టించిన ఆర్థర్ కాటన్ ప్రమేయం వలన కోస్తా ఆంధ్ర రైతాంగం బాగుపడి ఉండవచ్చును గాని ఆయన ఆనకట్టలు కట్టించింది రైతాంగాన్ని బాగు పరచటానికి కాదు. లాభపడింది రైతాంగం మాత్రమే కాదు. అంతరిస్తున్న భాషలని, సాహిత్యాన్ని ఒంటి చేత్తో పునరుద్ధరించామని గొప్పలు చెప్పుకున్న అధికారులు, మిషనరీలు చేసిన పనిని కూడా విమర్శనాత్మకంగా విశ్లేషించవలసిన అవసరం ఉంది. నిజంగానే వారు ఒంటరి పోరాటం చేసి పునరుద్ధరించారా? పునరుద్ధరణ పేరుతో వారు చేసిన ప్రయత్నం వల్ల ప్రయోజనం ఎంత కలిగింది? హాని ఎంత కలిగింది? అనే ప్రశ్నలను బేరీజు వెయ్యవలసిన అవసరం ఉంది.

ఇలా రాసుకుంటూ పోతే ఇంకా ఎంతో రాయొచ్చు. స్థలకాలాభావాల వలన వీటితో సరిపెట్టుకుంటాను. ముగింపుగా కొన్ని విషయాలు చెబుతాను. వలసపాలకులకు భారతీయ విజ్ఞానం అంటే పట్టింపు లేదంటే అర్థం చేసుకోవచ్చు. ఆ కారణాలు కొన్ని వివరించాను. మన విజ్ఞానం అంటే మనకే పట్టింపు లేని పరిస్థితి స్వతంత్ర భారతదేశంలో మనకు కనపడుతుంది. ప్రతిరోజూ పూర్వచరిత్రకు సంబంధించిన దాఖలాలు ధ్వంసమవుతూనే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ బకాసురులకు చారిత్రక కట్టడాల ప్రాముఖ్యతతో పని లేదు. చారిత్రక కట్టడాల పరిరక్షణలో బెంగాల్ విభజన చేసిన లార్డ్ కర్జన్ కున్న శ్రద్ధ కూడా మనకు లేదు. తాళపత్ర గ్రంథాలు, ఇతర రాతప్రతులు, శాసనాలు, లౌక్యం తెలియని పరిశోధకులు కొందరు కొన్ని దశాబ్దాల క్రితం సేకరించారు గాని ఆ ముఖ్యమైన పని కొనసాగించాలన్న ఆలోచన మనకు లేదు. అచ్చుయంత్రం వచ్చిన తరవాత పంతొమ్మిదవ శతాబ్దం నుండి భారతీయ భాషలలో ప్రచురించిన లక్షల కొద్దీ పుస్తకాలు ఆర్కైవులలో పాత గ్రంధాలయాలలో శిథిలమై పోతున్నాయి. వాటిని కాపాడుకోవాలని, డిజిటైజ్ చేయాలని ఔత్సాహికులు కొందరు ప్రయత్నం చేస్తున్నా, వాళ్ళది వ్యక్తిగతమైన చొరవే కాబట్టి సాధించగలిగింది కొంతే. ఏమైనా అటువంటి పనుల వల్ల మన ఆస్తులు ఆదాయాలు వృద్ధి చెందవు.

ఆధునిక సంస్కృతి విస్తరణ వలన, ప్రపంచీకరణ వలన మన గ్రామాలలోని వివిధమైన వృత్తులు, జీవనశైలులు అంతరిస్తున్నాయి. అక్షరాస్యత లేని జనసమూహాలు ఏర్పరిచిన మౌఖిక సంప్రదాయాలు, కథలు, పాటలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మొక్కలు, ప్రాణులు అంతరించినందువలన పృధ్వి మీద పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందో, సాంస్కృతిక వైవిధ్యతలో జరుగుతున్న ఖననం వలన మానవ సమాజ భవిష్యత్తుకు అంతే హాని సంభవిస్తుంది.

అంతే కాదు. ఒక వ్యక్తి అస్తిత్వ సాధనకు తనదైన ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకోవడం ద్వారా పొందే ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో, ఒక సమాజపు అస్తిత్వ వృద్ధికి కూడా ప్రత్యేక శైలి, ఆత్మవిశ్వాసం అవసరం. ఆ ఆత్మవిశ్వాసం వివిధంగా వెల్లి విరిసే భాషలు, సంస్కృతుల నుండే వస్తుంది. యూరప్‌లో ఆధునికత అభివృద్ధి చెందినా, ఆ క్రమంలో అనేక జీవనశైలులు అంతరించినా, ఆ సంస్కృతులకు సంబంధించిన విజ్ఞానం, ఎరుక, జ్ఞాపకాలను కాపాడుకొనే ప్రయత్నం అందుకేనేమో చేశారు. ప్రాచీనతను పాతర పెట్టలేదు. ఆధునికతలో మేళవించే ప్రయత్నం చేశారు. కొద్ది సంఖ్యలోనైనా విద్వాంసులు గ్రీక్, లాటిన్ లాంటి ప్రాచీన భాషలు, వాటిలో సాహిత్యం అధ్యయనం చెయ్యడానికి వనరులు ఏర్పాటు చేశారు.

ఆ స్పృహ మన సమాజంలో కనిపించదు. మన వైవిధ్యాన్ని చంపుకొని ఇతరుల సంస్కృతిని మనం అనుకరించుకుంటూ పోతే ఆ ఇతరులు మనలని గౌరవించరు. అనుకరిస్తున్నామని తెలుసు కాబట్టి మనలని మనం గౌరవించుకోలేం. అర్థ సంపాదనే మనిషికి సంతోషం కలగజేస్తుందనే అపోహ లోంచి మనలో కొందరమైనా బయటపడి ఉండాలి. మన సమాజానికి వైవిధ్యపు అవసరం మీద, మన భవిష్యత్తు మీద మనకు సరైన అవగాహన ఎందుకు లేకుండా పోయిందన్న ప్రశ్నకు, 2009లో నారాయణ రావు గారు, పరుచూరి శ్రీనివాస్, నేను మ్యూనిక్‌లో పెయింటింగ్ గాలరీలు చూసి వచ్చి బైట నిలబడి మాట్లాడుకుంటున్నప్పుడు, నారాయణ రావు గారు చెప్పిన సమాధానం — “వలసపాలన వలన మనకు జరిగిన కీడు ఆర్ధికంగా వెనుకబాటుదనం, రాజకీయ దాస్యం కాదు — మనం మన అభిరుచిని (taste) కోల్పోవడమే మనకు జరిగిన దౌర్భాగ్యం” — ఇప్పటికీ మనసులో మెదులుతూనే ఉంటుంది.

    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    K.V.S. Ramarao January 26, 2013 4:24 am

    నారాయణ రావు గారి ఆలోచనల్ని క్లుప్తీకరించి క్రమీకరించిన తీరు బాగుంది. ఒక చోట ఉన్నందువల్ల అన్నీ కలిసి పెద్ద వైశాల్యాన్ని, లోతునీ సాధించినయ్. ఐతే అప్పటివరకు నియమబద్ధంగా సాగిన వ్యాసం చివరిభాగంలో ఆలోచన తక్కువా ఆవేశం ఎక్కువా ఐనట్టనిపిస్తుంది. స్వతంత్ర భారతంలో సాగుతున్న భావదారిద్ర్యాన్ని ఏకరువు పెట్టటం కాదుకదా పరిశోధకుడి పని? అందుకు కారణాల్ని ప్రతిపాదించటం, వాటినుంచి ఎలా బయటపడాలోతార్కికంగా సూచించటం చేస్తే ఇంకా బాగుండేదేమో అని నా అనుమానం. వీటన్నిటికీ కారణం వలసపాలనే అనేదే ప్రదిపాదనైతే ఆమాట స్పష్టంగా లేదనుకుంటాను. ఒకవేళ అదే అనుకున్నా, ఏ విధంగా వలసపాలన దుష్టఫలితాల్ని వెకక్కితిప్పొచ్చునో (లేక అలాటి అవకాశమే లేదో) వివరిస్తే బాగుండేదనుకుంటాను. చివరగా, నాకో సందేహం – వలసపాలన కిందున్న ఇతర దేశాల్లో కూడ ఇలాటి ఫలితాలే వచ్చాయా లేక భారతదేశానికే ఇవి ప్రత్యేకమా? తెలిసిన వారు వివరిస్తే తెలుసుకోవాలని కుతూహలం. మొత్తం మీద చక్కటి ఆలోచనాత్మకమైన వ్యాసాన్ని అందించిన వ్యాసకర్తకి అభినందనలు.

  2. 2
    Halley February 6, 2013 11:22 am

    వలస పాలన సంస్కృతి అనే విషయం పై నారాయణ రావు గారి ఆలోచనలను మీరు పరిచయం చేసిన విధానం చాలా బాగుంది. మీ పూర్వపరాలను పాఠకులతో పంచుకున్నందున మీ పరిచయానికి ఒక రకమైన నిండుతనం వచ్చినట్టు అనిపించింది.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • వలస పాలన, సంస్కృతి: నారాయణ రావు గారి ఆలోచనలు కొన్ని

ఇటువంటివే…

  1. వెల్చేరు నారాయణ రావు: కొన్ని పరిశోధనా గ్రంథాల పరిచయం
  2. నారాయణ రావు విప్లవాత్మకత
  3. నారాయణ రావు భావవిప్లవం
  4. ఈమాట జనవరి 2013 వెల్చేరు నారాయణ రావు విశేష సంచికకు స్వాగతం!
  5. తెలుగు సాహిత్యావగాహన – నారాయణ రావు వేరు బాట

జనవరి 2013 సంచికలో ...

  • God on the Hill, Goddess on the Plain, and the Space In-Between: Tirupati, South India
  • Kāvali Brothers and the Origins of Modern Historiography in India
  • Narayana Rao on the Recorded Text and the Received Texts
  • Narayana Rao, My Guide
  • Velcheru Narayana Rao, Our Guide and Mentor
  • అంబఖండి నుంచి అట్లాంటా దాకా…
  • అయినా సరే…
  • ఇతిహాసాలు, ఆదర్శాలు: ఆరు జానపద వీరగాథలు
  • ఈ సంచిక గురించి…
  • ఈమాట జనవరి 2013 వెల్చేరు నారాయణ రావు విశేష సంచికకు స్వాగతం!
  • కొత్త మలుపు
  • గాడ్ ఆన్ ది హిల్ – టెంపుల్ పోయమ్స్ ఆఫ్ తిరుపతి: ఒక మెచ్చుకోలు
  • ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు
  • జన్మజన్మల స్పృహ
  • జీబ్రా క్రాసింగ్ దగ్గర ఒక మనిషి
  • తుఫాను ముగిసింది
  • తృప్తి – కథ నచ్చిన కారణం
  • తెలుగు సాహిత్యావగాహన – నారాయణ రావు వేరు బాట
  • నాకు నచ్చిన పద్యం: ఊయలూగే అమ్మాయిలు
  • నారాయణ రావు భావవిప్లవం
  • నారాయణ రావు విప్లవాత్మకత
  • నారాయణరావు మార్గదర్శక పరిశోధనా పద్ధతి
  • నీటి ఊహ
  • పులి వేట
  • భారతీయ చరిత్ర రచన: శైలీలక్షణం – ఉపసంహారం
  • భారతీయ చరిత్ర రచన: శైలీలక్షణం – ఉపోద్ఘాతం
  • మై యంగ్ ఫ్రెండ్ నారాయణ రావ్
  • వంశీవనము (హాలుని గాథాసప్తశతి నుండి కొన్ని పద్యములు)
  • వలస పాలన, సంస్కృతి: నారాయణ రావు గారి ఆలోచనలు కొన్ని
  • వాన ముసురు
  • వెల్చేరు నారాయణ రావు: కొన్ని పరిశోధనా గ్రంథాల పరిచయం
  • వేంకటంలో కొండలరాయడు
  • సార్థకప్రతీకలు – ముందుమాట
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

God on the Hill, Goddess on the Plain, and the Space In-Between: Tirupati, South India
నారాయణ రావు విప్లవాత్మకత

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.