“నీ పేరేంటి?”
“మైత్రేయి.”
“నీ పేరేంటి?”
“లక్ష్మీబాయి, ఝాన్సీ రాణి.”
“నీ పేరు?”
“పద్మిని, చిత్తూరు రాణి.”
“నీ పేరు?”
“ప్లారెన్స్ నైటింగేల్.”
అన్నీ ప్రసిద్ధి చెందిన స్త్రీల పేర్లే. వేద కాలం నుంచి శాంతా రంగస్వామి దాకా అన్నీ నా పేర్లే. అందుకే చిన్న వయస్సులో ఎస్. మీనాక్షి అని పిలిచి నప్పుడు బదులు పలకడం మరిచి పోయి, హాజరు తీసుకుంటున్న క్లాసు టీచర్ దగ్గర చీవాట్లు తిన్న సందర్బాలు ఎన్నో.
ఎవరబ్బా ఈ మీనాక్షి? ఆమెకి నా ముఖం ఉంది. నా రూపం ఉంది. కాని వట్టి ఆమె కాదు నేను. రాబోయే కాలంలో నా పేరు మారు మ్రోగబోతుంది. చిన్నప్పటి నుంచీ అదే నా కల. అదే నా లక్ష్యం. ఎంతో మంది మీనాక్షిలలో నేను కూడా ఒక మీనాక్షినా? కానే కాదు. నేను వాణిని. చదువుల తల్లిని. పూలమాలతో దేవేరుని అలంకరించిన ఆండాళ్ నేనే.
“మీనా!”
అమ్మ మంద్రమైన పిలుపు మీనా ఆలోచనలకి అంతరాయం కలిగించింది. ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఊగుతున్న మీనా లేచి లోపలికి వెళ్ళింది. వంటింట్లో గాస్ పొయ్యి దగ్గర నిలబడి కూర కలియబెడుతున్న అమ్మ ఆమెను చూసి చిన్నగా నవ్వింది.
“నాన్న నీతో చెప్పే వుంటారు కదే. మంచి కబురు వచ్చింది.”
“దేని గురించి?”
“ఏం పిల్లవే నీవు? అంతా నీ పెళ్ళి గురించే. పోయిన వారం నిన్ను చూసి వెళ్ళిన వాళ్ళు, పిల్ల నచ్చిందని చెప్తూ ఉత్తరం రాశారు. కానీ నేనప్పుడే అనుకున్నాను. ఆ అబ్బాయి నీ మీది నుంచి చూపులు తిప్పనే లేదు. ఏదో కనికట్టు మంత్రం వేసినట్లున్నావు.”
సంతోషం, గర్వం తొణికిస లాడుతున్న కళ్ళతో అమ్మ చేతిలో పని ఆపకుండానే ఎడమ చేతిని చాపి మీనా చెంపను పుణికింది. మీనాకు సంతోషంగా అనిపించింది. ఆ అబ్బాయి అందమైన రూపం కళ్ళ ముందు కదలాడింది. ఆమెను అతను అధీనం చేసుకుంటాడు, క్లియో పాత్ర లాగా, నూర్జహాన్ లాగా.
“నాన్న చెప్పలేదా నీకు?”
“లేదమ్మా.”
“ఏం చెప్పలేదంట తనకి నేను?” అడుగుతూ నాన్న అక్కడికి వచ్చారు.
“అమ్మాయి నచ్చిందని బెంగళూరు సంబంధం వాళ్ళు ఉత్తరం రాసారుగా. దాని గురించి.”
“ఆ విషయాన్ని నువ్వు తగుదునమ్మా అంటూ దానికి చెప్పేశావా? ఇప్పుడే చెప్పాలని నేను వస్తున్నాను. ఈ ఇంట్లో ఏ ముఖ్యమైన విషయం అయినా మిగిలిన వాళ్ళకి చెప్పాల్సింది నేనేనని నీకు తెలియదూ?”
అమ్మ ముఖంలోని సంతొషం అలాగే ఆవిరైపోయింది. “కోప్పడకండీ. ఇంత మంచి విషయాన్ని మీరు దానితో ఈ పాటికి చెప్పేసి ఉంటారనుకున్నాను. అందుకే నేనూ అడిగాను”
“అధిక ప్రసంగి.. ప్రతిదానికీ తొందరే నీకు. అదేంటీ? చిక్కుడు కాయలా కూరా? అది వద్దు. నాకు ఈ రోజు పొట్లకాయ కూర తినాలని ఉంది. అది చేయి. సరేనా?”
నాన్నగారు అక్కడి నుంచి వెళ్ళగానే మీనా తల్లి వైపు జాలిగా చూసింది. అమ్మ మౌనంగా తరిగిన చిక్కుడుకాయలని ఫ్రిజ్ లో పెట్టేసి పొట్లకాయను కోయడం మొదలు పెట్టింది. నాన్నగారి మాటలకి అమ్మ ఏనాడు ఎదురు చెప్పింది లేదు. ఆయనగారి సేవలతోనే ఆమె చేతులు ఇప్పటికీ అరిగి పోతూనే ఉన్నాయి. ఐదుగురు పిల్లల్ని కనటంతో ఒళ్ళు గుల్ల అయిపోయింది. అయినా కూడా ఒకప్పుడు ఆమె ఎంతో అందంగా ఉండేదన్నదానికి నిదర్శనంగా విశాలమైన కళ్ళు, తీర్చి దిద్ధినట్లు ఉన్న ముఖం, సన్నగా రివటలా ఉన్న ఆకృతి, ఒయ్యారంగా నిలబడే తీరు చాటి చెప్తూ ఉంటాయి. మీనా అందం గురించి ఎవరైనా ప్రశంసించే టప్పుడు “అచ్చు అమ్మ పోలిక” అని చెప్పకుండా ఉండరు.
అమ్మ అందం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఐదుగురు పిల్లల పెంపకంలో, వంటింటి వ్యవహారాలను చక్క బెట్టుకోవడంలో, నాన్నగారి అదుపు ఆజ్ఞలకి భయపడి ఒదిగి ఒదిగి బ్రతకడంలో కరిగి ఆవిరై పోయిందా? అగరుబత్తి కాలిన తర్వాత అదే ఆకారంలో క్రింద పడే బూడిద అగరుబత్తి ఎలా అవుతుంది? అది వట్టి బూడిద. అంతే.
ఆ తరువాత రోజుల్లో ఇంట్లో పెళ్ళి గురించిన మాటలు చాలా జరిగాయి. మీనాకి ఆ కబుర్లు తియ్యగా అనిపించాయి. ఎం. యే. చదివి, బ్యాంకులో ఉద్యోగం చేస్తూ, ఎన్నెన్నో పుస్తకాలని చదివేసిన తనను కూడా పెళ్ళి కబుర్లు విని తియ్యని ఊహల్లో తేలిపోవడం మీనాకి ఆశ్చర్యంగా అనిపించింది. మళ్ళీ తనకి తనే సమాధానం చెప్పుకుంది. పెళ్ళి విషయం విని సంతోషించడంలో తప్పేముంది? ఝాన్సీ రాణి పెళ్ళి చేసుకోలేదా? స్వతహాగా ఉన్న ప్రత్యేకతలూ, అర్హతలూ పెళ్ళి వలన అణగారి పోవు. దీపపు వెలుగును దుప్పటితో మూసి ఉంచడం సాధ్యమేనా? మేడం క్యూరి భర్తతో కలిసి నోబల్ బహుమతి పొంది, దాంపత్యం అంటే ఇలా ఉండాలని నిరూపించింది కదా.
లైబ్రరీ నుంచి రెండు చేతుల నిండా పట్టుకొని వచ్చిన పుస్తకాలను ఉయ్యాల బల్ల మీద పెడుతూ మీనా అమ్మయ్య! అని నిట్టూర్పు విడిచింది. తెచ్చిన పుస్తకాలలో ఒకటి మేడం మాంటిసోరి జీవిత చరిత్ర. ఇంకోటి మథర్ తెరెసా గురించి.
తను కూడా అలా బ్రతక గలిగితే! ఒక చిన్నారికి కొత్తగా అక్షరాలు నేర్పిస్తే! దేవుడి పేరిట అనాధుల కన్నీటిని తుడిచే వ్యక్తిగా!
“ఇదిగో! కాఫీ తాగి మళ్ళీ చదువుకుందువు గానీ.”
“సారీ అమ్మా. పిలిస్తే నేనే వంటింట్లోకి వస్తాను కదే. నీకెందుకే శ్రమ” అంటూ మీనా కాఫీ గ్లాసు తీసుకుంది.
“పుస్తకంలో పడితే నీకేం వినిపిస్తుందే పిలిచినా”
“అవుననుకో…”
“ఒకప్పుడు నేనూ నీ లాగా అలాగే చదివేదాన్ని. సంస్కృతంలో ఉన్న పుస్తకాలను అస్సలు వదిలేదాన్ని కాదు.”
“సంస్కృతమా! అమ్మా నీకు సంస్కృతం తెలుసా? ఆశ్చర్యంగా ఉందే?’”
“మీ తాతగారు, అదే మా నాన్నగారు పెద్ద సంస్కృత పండితులు. దేవ భాష అని మా అందరికీ నేర్పించారు. నేను బాగా నేర్చుకున్నానని ఆయనకీ ఎంతో గర్వం. తన దగ్గిర ఉన్న కావ్యాలు, గ్రంధాలు, నాటకాలు, కవితలు, అన్ని సంస్కృత పుస్తకాలనూ నాకే ఇచ్చారు. పొద్దు ఎలా పోతుందో తెలియనంతగా ఆ పుస్తకాలను మళ్ళీ మళ్ళీ చదివే దాన్ని.”
మీనాకు ఊహ తెలిసిన తర్వాత అమ్మ ఒక్క సంస్కృత పుస్తకం కూడా చదవడం కంటపడలేదే? అస్సలు ఇంట్లో సంస్కృత పుస్తకాలు చూడనే లేదుగా? ఆ విషయం గురించి అడగాలని ఆమె నోరు తెరిచేటప్పటికి అప్పుడే బైటి నుంచి వచ్చిన ఆమె తండ్రి “ ఈ రోజు ఆ బెంగళూరు సంబంధం వాళ్ళ నుంచి ఇంకో ఉత్తరం వచ్చింది, మీనా” అంటూ లోపలి వచ్చారు.
ఆమెకి కుతూహలంగా అనిపించినా విషయం ఏమిటని అడగకుండా కళ్ళెత్తి చూసింది.
“అబ్బాయికి అన్ని విధాలుగా నువ్వు నచ్చావుట. కానీ నువ్వు ఉద్యోగం చేయడం మాత్రం నచ్చలేదట. పెళ్ళైన తర్వాత నువ్వు ఉద్యోగం మానేయాలని అడుగుతున్నారు.”
మీనాకి షాక్ తగిలినట్లయింది. “ఏంటి నాన్నా ఇది? నేను ఉద్యోగం మానేయడం కుదరదు.”
“పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఏదో సరదాకి చేస్తున్న ఉద్యోగమే కదా. నువ్వు సంపాదించి ఇప్పుడు ఎవరిని ఉద్ధరించాలి? ఇందుకోసం మంచి సంబంధం కాదనుకోకూడదు. అబ్బాయి అందంగా ఉన్నాడు. పెద్ద ఉద్యోగం. మంచి కుటుంబం. కట్న కానుకలు లేకుండా పెళ్ళి చేసుకుంటున్నారు. ఈ జోడీ కుదిరితే మనం అదృష్టవంతులం.”
మీనా చాలా సేపు గునుస్తూనే ఉంది. ఆఖరున మనసుకి సమాధానం చెప్పుకుంది. ఈ బ్యాంకు ఉద్యోగం ఆమె కూడా ఏమీ మనస్పూర్తిగా, పట్టుదలతో చేయడం లేదు. ఎం. ఏ. అయిపోగానే పేపరులో ప్రకటన చూసి పరీక్ష రాసింది. తెలివితేటలు ఉన్నందున వ్రాత పరీక్షలో, ఇంటర్వ్యూలో పాసయి ఉద్యోగంలో చేరింది. బల్ల ముందు కూర్చుని లెక్కలు వ్రాసే ఉద్యోగంలో మనసుకి కలిగే సంతృప్తి పెద్దగా ఏముంటుంది? ఇదేమైనా తనని తాను అర్పించుకొని సమాజానికి ముందుకు నడిపించే ఉద్యమం కాదు కదా? ఈ బ్యాంకు ఉద్యోగం మానెయ్యడం ఏమంత నష్టం కాదు. ఇంకా చెప్పాలంటే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఇంటి బాధ్యతలు మోస్తున్నవారికి ఉండాల్సిన ఉద్యోగాన్ని ఆమె ఊరికే కాలక్షేపం కోసం చేయడం, ఒక విధంగా చెప్పాలంటే, వారి అవకాశాన్ని దొంగలించడమే కదా. ఆమె ఉద్యోగం మానేయడానికి ఒప్పుకున్న విషయం మగ పెళ్ళి వారికి అందచేయబడింది. పెళ్ళి ఏర్పాట్లు మరింత జోరుగా కొనసాగాయి.