నైరూప్యచిత్ర కళాయాత్రికుడు

1950ల చివరలో ప్రముఖ జీవసాంఖ్య శాస్తవేత్త సర్ జె. బి. ఎస్. హాల్డేన్ అప్పట్లో కలకత్తా నుండి వెలువడుతుండిన ప్రముఖ ఆంగ్లపత్రిక స్టేట్స్‌మన్‌లో ఒక ఉత్తరం రాశాడు. ఆయన తన ఉత్తరంలో తెలుగుభాషకు ఇతర భాషలతో ఒదిగే అద్భుతగుణం వుందని విపరీతంగా పొగిడాడు. అక్కడితో ఆగక తెలుగు భాషకు భారతదేశంలో జాతీయభాష కావటానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని రాశాడు.

మన రాష్ట్రంలోని పత్రికలు వేలం వెర్రిగా ఆ ఉత్తరం వెంట పడ్డాయి. నిజానికి సరిగ్గా అప్పుడే దక్షిణ భారతదేశంలో హిందీని జాతీయభాషగా అంగీకరించేందుకు నిరసనలు, వాడి వేడి వాగ్వివాదాలు జరుగుతున్నాయి. హిందీ కాక ఏ ఇతర భాష మీద ఎట్లాంటి చిన్న ప్రశంస వచ్చినా దాన్ని పత్రికలు సంచలనం చేసేవి. హిందీని వ్యతిరేకిస్తున్న ప్రజలు కూడా విపరీతంగా స్పందించేవారు. అదలా ఉంచితే హాల్డేన్‌కు ఒక్క ముక్క తెలుగు రాదు, తెలియదు. అతని దగ్గర పనిచేస్తున్న ఇద్దరు తెలుగువాళ్ళు తరచూ తెలుగులో మాట్లాడుకున్నప్పుడు విన్నదే తప్ప అతనికి తెలుగు గురించి తెలియదు. అసలు విషయమేమిటంటే, ఆ ఇద్దరు తెలుగువాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మధ్యమధ్యలో కొన్ని ఇంగ్లీషు పదాలు రావడం, అవి కూడా మామూలు తెలుగు పదాలే అన్నంత సహజంగా వాళ్ళు వాడటం గమనించి హాల్డేన్ ఈ నిర్ధారణ కొచ్చాడు. అప్పట్లో కొంచెం చదువుకున్న వాళ్ళక్కూడా ఇంగ్లీషులో మాట్లాడటం, కనీసం మాటల్లో ఒకట్రెండు ఇంగ్లీషు పదాలు దొర్లించటం మోజుగా వుండేది. బడిలో తెలుగు బోధన కూడా ఆ కాలంలో ఇదే ఫక్కీలో సాగేది. దాంతో తెలుగు నుడికారం మర్చిపోయి, సరైన పదాలు తోచక, తెలియక చాలా మంది ఇంగ్లీషు పదాలను మధ్యలో ఇరికించేవారు. కేవలం దీన్ని పట్టుకుని తెలుగుని అంత స్థాయికి ఎత్తేయటం సరైనది కాదు. పైగా హాల్డేన్‌కు తెలుగు భాషలోని అంతర్గత సమస్యలు, పరిమితులు తెలియవు. ఏమైతేనేం, కొంతమంది విలేకరులు మాత్రం తెలుగును జాతీయ భాష చెయ్యాలని ప్రతిపాదిస్తున్న వాళ్ళలో ఒకడిగా హాల్డేన్ పేరుని బాగా వాడుకున్నారు.

ఇంతకీ ఈ కథంతా ఎందుకు చెబుతున్నానంటే మనకొక దురలవాటు ఉంది. మన గురించి ఏ పాశ్చాత్యుడు ఏం మాట్లాడినా దాన్ని పట్టుకుని తిరిగే ఊరేగే అలవాటుంది. మన భాష, మన సంస్కృతి, తత్వశాస్త్రం, మన దేవతలు – ఇలా దేనిమీదైనా, వాళ్ళు ఏం చెప్పినా సరే దాన్ని కొంచెం కూడా హేతుబద్ధంగా ప్రశ్నించుకోకుండా, దాన్ని ప్రదర్శించుకునే మనస్తత్వం మనలో బాగా నాటుకుపోయి వుంది. ఎవరు చెపుతున్నారు, ఆ చెపుతున్న వారి అర్హతలేమిటి, వారి పరిజ్ఞానమేమిటి అన్న ప్రశ్నలు వేసుకోకుండా, వాళ్ళు కేవలం గాల్లో నిలబడి మాట్లాడుతున్నారని తెలిసి కూడా చాలాసార్లు మనం వాటినే నమ్ముతాం, నమ్మబలుకుతాం, ప్రచారం చేస్తాం. పాశ్చాత్యుల నుంచి గుర్తింపు కోసం ఇంత తహతహ లాడడం నిజంగా ఎంత దురదృష్టకరం! ఈ ధోరణి ఈనాటికి ఉండటం మరింత దురదృష్టకరం!

కానీ, సీరందాసు వెంకట రామారావు (S. V. Rama Rao) ఇందుకు పూర్తిగా భిన్నమైన ఉదాహరణ.


ఎస్. వీ. రామారావు

న్యూయార్క్ టైమ్స్, హెరాల్డ్ ట్రిబ్యూన్, వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికల్లో మాక్స్ వైక్స్-జోయ్స్, షెల్డన్ విలియమ్స్, లాంటి అతిరథ మహారథులు, కామన్‌వెల్త్ ఇన్స్టిట్యూట్ ఆర్ట్ గ్యాలరీకి క్యురేటర్‌గా వ్యవహరించిన రొనాల్డ్ బోనెన్, ది క్రిస్టియన్ సైన్స్ మానిటర్ నుంచి పాట్రీసియా బోయ్డ్ విల్డన్, ఇంకా విలియం టౌన్‌సెండ్, మేరీ కామోట్ లాంటి మహామహులెందరో యస్. వీ. రామారావు కళాఖండాల గురించి పుంఖానుపుంఖాలుగా ప్రశంసల వర్షం కురిపించారు. వీళ్ళంతా కూడా చిత్రకళా రంగంలో ఉద్దండులే!

కేవలం పాశ్చాత్యులే కాక, ప్రపంచ కళా విమర్శకులందరి దగ్గరా ప్రశంసలందుకున్న ఎస్. వి. రామారావుని చూసి మనమంతా కచ్చితంగా గర్వపడాలి. నిస్సందేహంగా అమితంగా గర్వపడాలి.

ఎందుకు? అని మీరడగవచ్చు. రామారావు ఎంచుకున్న మాధ్యమం, ఎక్కడో గుడివాడ నుండి వచ్చిన ఒక తెలుగువాడికి, పూర్తిగా పరాయిది కావటం మొదటి కారణం.

ప్రధానంగా నైరూప్య కళ అన్నది పూర్తిగా యూరప్ దేశాలకు సంబంధించినది. ఇంకా కచ్చితంగా చెబితే అది ఆంగ్లేతరులైన యూరప్ దేశస్థుల స్వంతం. సాధారణంగా ఆధునిక కళ ఎక్కడైనా రాజకీయ నేపథ్యం నుండే పునీతమౌతుందని నా అభిప్రాయం. పైగా తూర్పు, పశ్చిమదేశాల మధ్య సాంస్కృతికంగా, రాజకీయంగా చాలా తారతమ్యాలున్నాయి. ప్రత్యేకించి, పశ్చిమ దేశాల్లో వచ్చినన్ని రాజకీయ సాంస్కృతిక ఉద్యమాలు మనకు రాలేదు. ఒకవేళ చెదురుమదురుగా వున్నా పోలిక అసలే లేదు. ఇరుశైలుల మధ్యా చెప్పలేనంత అగాధముంది. ఈనాటికీ, ఆధునిక భారత చిత్రకారులని మనం ఎవరినైతే పిలుస్తున్నామో వాళ్ళందరూ ప్రధానమైన ప్రతిమారూపకళ (Figurative form) నుంచి కొంచెం పక్కకు వచ్చేందుకు కూడా చాలా జంకుతుంటారు.


అగ్ని, 2012

కానీ, రామారావు తనలోని భావాలను దేశీయ మార్మికతతో రంగరించి దాన్ని పాశ్చాత్య నైరూప్య చిత్రకాళా శైలులతో సమ్మిళితం చేయగల ఒక అద్భుతమైన మార్గాన్ని కనుక్కున్నాడు. ఆ క్రమంలోనే తన స్వంత శైలినీ నిర్మించుకున్నాడు. అతని శైలి అతనికే ప్రత్యేకమైన నైరూప్య భావప్రకాశతను (Abstract expressionism) సంతరించుకుందని నా అభిప్రాయం. నైరూప్య కళలో ఇంత భిన్నధోరణిని ఆ కళలో నిష్ణాతులైన వారెవరైనా ఒప్పుకొని తీరవలసిందే. ఒప్పుకున్నారు కూడా. రామారావు గొప్పతనమంతా ఇక్కడే ఉంది. ఇందుకే మనం రామారావుని చూసి గర్వపడాలి.

రామారావు ప్రముఖ నైరూప్య భావప్రకాశ చిత్రకారుడిగా రాత్రికి రాత్రే ఎదగలేదు. అదంతా ఒక క్రమంలో జరిగింది. చిన్న చిన్న అడుగులతో మొదలై ఇంతింతగా పెరిగాడు రామారావు. అతని లోలోపల అంతః సంఘర్షణతో పాటు అద్వితీయమైన శ్రద్ధాసక్తులు, విభిన్న మతాల గురించీ, తత్వ శాస్త్రాన్ని గురించిన నిరంతర తులనాత్మక పఠనం అతనికి దోహదం చేశాయి. రంగులతో, వన్నెలతో, రేఖలతో, విభిన్నమైన కుంచెలతో, చివరికి మామూలు కేన్వాసు, బోర్డులతో సహా నిరంతరం ప్రయోగాలు చేస్తూ వచ్చాడు రామారావు.

నా ఈ వ్యాఖ్యానమంతా కూడా రామారావు భావప్రకాశత నుంచి నైరూప్యతకు సాగించిన యాత్రను అర్థం చేసుకునేందుకు చేసిన ప్రయత్నమే కానీ విమర్శనాత్మకమైనది కాదు. గుడివాడ నుండి మొదలిన అతని యాత్ర లండన్‌కు, ఇంగ్లండ్ నుంచి బౌలింగ్ గ్రీన్‌కూ, కెంటకీ నుంచి షికాగో వరకూ సాగింది. ఈ సుదీర్ఘ యాత్రలో బాస్టన్, సిన్సినాటి, టాలహాసీ, లాంటి చిరు మజిలీలు లేకపోలేదు. ఎన్నో మెలికలూ మలుపులూ ఉన్నా అదొక గర్వకారణమైన సుదీర్ఘ ప్రశాంత యాత్ర.

వాసిలీ కాండిన్‌స్కీ (Wassily Kandinsky) “చిత్రకళాసృజన అంతా కూడా కళాకారుడి అంతరంగంలోని అవసరానికి బహిర్‌వ్యక్తీకరణే” అంటాడు. ప్రస్ఫుటంగా వ్యక్తం చేసేందుకు రామారావు అంతరంగంలో తీవ్రమైన అవసరం ఉంది. పన్నెండేళ్ళ వయసులో తొలిసారి రామారావుకు చిత్రకళపైన ఆసక్తి పెరిగింది. అతని హైస్కూలులో డ్రాయింగ్ టీచరుగా పనిచేస్తున్న కె. వేణుగోపాల్‌ తొలి గురువు. వేణుగోపాల్ అప్పటికప్పుడు బొమ్మను గీసేవారు. రామారావుని ఇదెంతగానో ఆకట్టుకుంది. ప్రముఖ ఆంగ్ల చిత్రకారుడు అగస్టస్ జాన్‌ (Augustus John) పుస్తకాన్ని చూడమని వేణుగోపాల్ తరచూ చెప్పేవారట. ఒక పదమూడేళ్ళ పిల్లవాడికి ఆ పుస్తకాన్ని చూడమని చెప్పటం నిజంగా అమితానందాన్ని కలిగించి వుంటుంది. రామారావు తన హైస్కూలు ముగిసిన తర్వాత వేణుగోపాల్‌ వద్ద చిత్రకళలో ప్రైవేటు చెప్పించుకున్నాడు. ఆ క్రమంలో మద్రాసు ప్రభుత్వం నిర్వహించే డిప్లొమా ఇన్ ఆర్ట్స్ పాసయ్యాడు. అప్పట్లో ఎవరైనా డ్రాయింగ్ మాస్టర్ కాదలచుకున్నా, ఒక చిత్రకారుడు కాదలచుకున్నా ఈ డిప్లొమా తప్పని సరి.

తన కాలేజీ రోజుల్లో ఇలస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చే రంగు రంగుల చిత్రాలు, వాటి పక్కనే కళాకారుడి పరిచయం రామారావుని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అప్పుడు అతని మనసులో ఆరు నూరైనా పెయింటర్ అవ్వాలన్న కోరిక బలంగా నాటుకుంది. దానికోసం రోజూ శ్రమించాడు. కాలీజీలో చదువు అయిపోయిన తర్వాత శాంతినికేతన్‌లో చదువుకోవాలనుకున్నాడు కానీ తలిదండ్రులు వద్దన్నారు.

అయితేనేం, అదృష్టం ఇంకో రూపంలో వరించింది. మద్రాసులో సినీ రంగంతో పరిచయమున్న కొంతమంది స్నేహితుల సహకారంతో ప్రముఖ కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలేతో పరిచయమయింది. గోఖలే దగ్గర సహాయకుడుగా చేరదామనుకున్నాడు రామారావు. అప్పుడు గోఖలే “ఈ రంగంలో మాకు కొంచెం చదువుకున్న వాళ్ళు కావాలి. చిత్రకళలో శిక్షణకి ఏదైనా కళాశాలలో చేరు. అప్పటికీ నాదగ్గరే పనిచేయాలనిపిస్తే తీసుకుంటాను” అని సలహా ఇవ్వటమే కాకుండా తానే స్వయంగా వెళ్ళి, రామారావు తండ్రి గంగయ్యగారితో మాట్లాడి ఒప్పించారు. మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరకముందే గోఖలే రామారావును కళాక్షేత్రలోని ప్రముఖ జానపద శైలి చిత్రకారుడు కె. శ్రీనివాసులుకి పరిచయం చేసి, అతనితోనే ఉండి చిత్రకళకు సంబంధించిన మెళకువలు నేర్చుకుని రమ్మన్నారు.

ఆ తర్వాత, ఆరు సంవత్సరాల ఆ కోర్సులో రామారావును నేరుగా మూడో సంవత్సరంలో చేర్చుకున్నారు. స్వయంగా పాశ్చాత్యదేశాల ఇంప్రెషనిస్టిక్ (Impressionistic) ధోరణితో సమ్మోహితుడైన ఆ కాలేజి ప్రిన్సిపల్ పణిక్కర్ గురువుగా లభించడం నిజంగా రామారావు అదృష్టం. తైలవర్ణాలతోనూ, బొగ్గుతోనూ కూడా రూప చిత్రాలను, స్టిల్ లైఫ్, లైవ్ స్కెచింగ్, లాండ్‌స్కేప్‌లనూ సాధన చేశాడు. ఈ చిత్రాలన్నిటిలో రంగు అద్దిన తీరు మాత్రం పాల్ చెజాఁ (Paul Cezzane), జార్జెస్ సిరా (Georges Seurat) లాంటి ఇంప్రెషనిస్ట్ చిత్రకారుల పనితీరును తలపింపచేస్తుంది.


ఎ ప్రొసెషన్

ప్రొసెషన్ అనే చిత్రాన్ని తైలవర్ణాలతో, ఇంప్రెషనిస్ట్ ధోరణిలోనే పాయింటిలిజం (Pointillism) అనే ప్రత్యేక పద్ధతిలో రామారావు 1959లో వేశాడు. ఇప్పుడు ఈ చిత్రం న్యూయార్క్‌లో ఒక వ్యక్తి వద్ద వుంది. ఈ పాయింటిలిజం అనే పద్ధతిని ముందుగా సిరా ప్రవేశపెట్టాడు. ఇందులో చిత్రకారుడు ప్రకృతిలోని రంగులను వాటి శుద్ధ, మౌలిక స్థితిలోకి రూపాంతరం చేసి చిత్రంలో ఉపయోగిస్తాడు. చిత్రం అంతా కూడా బిందువులు గానీ లేదా, చిన్న బ్రష్‌తో గీసిన గీతల సముదాయంగానో కనిపించడం ఈ పద్ధతిలో ప్రత్యేకత. చిత్రం పూర్తయిన తర్వాత అందులోని వర్ణాలను పునర్నిర్మించుకొనే పనిని చిత్రకారుడు చూపరులకే ఒదిలి వేస్తాడు. ఈ చిత్రానికి రామారావు తెలుగులో ‘ఆర్యదేవ’ అని సంతకం చేయడం ఆసక్తి కొలిపే విషయం. ఆర్యదేవుడు బౌద్ధ భిక్షువు అయిన నాగార్జునుని ప్రముఖ శిష్యుడు. ఇతడు తనదైన ఒక ప్రత్యేక తరహా బౌద్ధాన్ని ప్రచారం చేశాడని వినికిడి.

రామారావు తన తొలినాళ్ళలో ఆర్యదేవ, పద్మనాయకి తదితరాలైన కలంపేర్లతో కవిత్వం రాశాడని చెప్పడం ఇక్కడ సబబుగా ఉంటుందనుకుంటాను. ఎంత సారూప్యత!

రామారావు తన తొలిదశలో వేసిన చిత్రాలన్నీ ఇప్పుడు కేవలం ఫోటోగ్రాఫుల రూపంలోనే లభ్యం. పైగా అవన్నీ కూడా ప్రతిమారూపశైలిలో ఉన్నప్పటికీ, సాంప్రదాయ భారతీయ శైలి నుంచి రామారావు మెలిమెల్లిగా నిర్గమిస్తున్న క్రమాన్ని స్పష్టంగా పట్టిచూపుతాయి. మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులు సాంప్రదాయ భారతీయ పద్ధతిలోనే చిత్రాలు వేయడం పరిపాటి. అయినప్పటికీ రామారావు అందులోంచి బయటపడ్డాడు. ఏడాది తిరక్కముందే రామారావు చిత్రాలకు కలకత్తా, బొంబాయి, ఢిల్లీలలో జరిగిన పలు పోటీల్లో అవార్డులు వచ్చాయి. కలకత్తానుంచి వెలువడే కళాసంచిక ‘రిథమ్’లో రామారావు చిత్రాలను ప్రముఖంగా ముద్రించి అతని గురించి ప్రత్యేకంగా రాశారు. ఇటు కృష్ణవేణి, అటు భారత చిత్రకళకే పుట్టినిల్లయిన అమరావతి, మధ్యలో రామారావు జన్మస్థలమైన గుడివాడలో వేణుగోపాల్ వద్ద ఓనమాలు దిద్దుకున్న రామారావు, తర్వాత తన ఉపాధ్యాయులు దేవీప్రసాద్ రాయ్ చౌదరి, కేసీయెస్ పణిక్కర్, హెచ్ వీ రాంగోపాల్ వద్ద చిత్రకళలోనీ సూక్ష్మాలనూ, తీరులనూ, రంగుల్లోని ఐంద్రజాలిక రమ్యతనూ పరిశీలించి పట్టుకునే నైపుణ్యాన్ని సాధించుకున్నాడు. ఈ నేపథ్యమంతా అతని ప్రతి చిత్రంలోనూ లీలగా కనిపిస్తూనే వుంటుంది.