1950ల చివరలో ప్రముఖ జీవసాంఖ్య శాస్తవేత్త సర్ జె. బి. ఎస్. హాల్డేన్ అప్పట్లో కలకత్తా నుండి వెలువడుతుండిన ప్రముఖ ఆంగ్లపత్రిక స్టేట్స్‌మన్‌లో ఒక ఉత్తరం రాశాడు. ఆయన తన ఉత్తరంలో తెలుగుభాషకు ఇతర భాషలతో ఒదిగే అద్భుతగుణం వుందని విపరీతంగా పొగిడాడు. అక్కడితో ఆగక తెలుగు భాషకు భారతదేశంలో జాతీయభాష కావటానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని రాశాడు.
మన రాష్ట్రంలోని పత్రికలు వేలం వెర్రిగా ఆ ఉత్తరం వెంట పడ్డాయి. నిజానికి సరిగ్గా అప్పుడే దక్షిణ భారతదేశంలో హిందీని జాతీయభాషగా అంగీకరించేందుకు నిరసనలు, వాడి వేడి వాగ్వివాదాలు జరుగుతున్నాయి. హిందీ కాక ఏ ఇతర భాష మీద ఎట్లాంటి చిన్న ప్రశంస వచ్చినా దాన్ని పత్రికలు సంచలనం చేసేవి. హిందీని వ్యతిరేకిస్తున్న ప్రజలు కూడా విపరీతంగా స్పందించేవారు. అదలా ఉంచితే హాల్డేన్‌కు ఒక్క ముక్క తెలుగు రాదు, తెలియదు. అతని దగ్గర పనిచేస్తున్న ఇద్దరు తెలుగువాళ్ళు తరచూ తెలుగులో మాట్లాడుకున్నప్పుడు విన్నదే తప్ప అతనికి తెలుగు గురించి తెలియదు. అసలు విషయమేమిటంటే, ఆ ఇద్దరు తెలుగువాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మధ్యమధ్యలో కొన్ని ఇంగ్లీషు పదాలు రావడం, అవి కూడా మామూలు తెలుగు పదాలే అన్నంత సహజంగా వాళ్ళు వాడటం గమనించి హాల్డేన్ ఈ నిర్ధారణ కొచ్చాడు. అప్పట్లో కొంచెం చదువుకున్న వాళ్ళక్కూడా ఇంగ్లీషులో మాట్లాడటం, కనీసం మాటల్లో ఒకట్రెండు ఇంగ్లీషు పదాలు దొర్లించటం మోజుగా వుండేది. బడిలో తెలుగు బోధన కూడా ఆ కాలంలో ఇదే ఫక్కీలో సాగేది. దాంతో తెలుగు నుడికారం మర్చిపోయి, సరైన పదాలు తోచక, తెలియక చాలా మంది ఇంగ్లీషు పదాలను మధ్యలో ఇరికించేవారు. కేవలం దీన్ని పట్టుకుని తెలుగుని అంత స్థాయికి ఎత్తేయటం సరైనది కాదు. పైగా హాల్డేన్‌కు తెలుగు భాషలోని అంతర్గత సమస్యలు, పరిమితులు తెలియవు. ఏమైతేనేం, కొంతమంది విలేకరులు మాత్రం తెలుగును జాతీయ భాష చెయ్యాలని ప్రతిపాదిస్తున్న వాళ్ళలో ఒకడిగా హాల్డేన్ పేరుని బాగా వాడుకున్నారు.
ఇంతకీ ఈ కథంతా ఎందుకు చెబుతున్నానంటే మనకొక దురలవాటు ఉంది. మన గురించి ఏ పాశ్చాత్యుడు ఏం మాట్లాడినా దాన్ని పట్టుకుని తిరిగే ఊరేగే అలవాటుంది. మన భాష, మన సంస్కృతి, తత్వశాస్త్రం, మన దేవతలు – ఇలా దేనిమీదైనా, వాళ్ళు ఏం చెప్పినా సరే దాన్ని కొంచెం కూడా హేతుబద్ధంగా ప్రశ్నించుకోకుండా, దాన్ని ప్రదర్శించుకునే మనస్తత్వం మనలో బాగా నాటుకుపోయి వుంది. ఎవరు చెపుతున్నారు, ఆ చెపుతున్న వారి అర్హతలేమిటి, వారి పరిజ్ఞానమేమిటి అన్న ప్రశ్నలు వేసుకోకుండా, వాళ్ళు కేవలం గాల్లో నిలబడి మాట్లాడుతున్నారని తెలిసి కూడా చాలాసార్లు మనం వాటినే నమ్ముతాం, నమ్మబలుకుతాం, ప్రచారం చేస్తాం. పాశ్చాత్యుల నుంచి గుర్తింపు కోసం ఇంత తహతహ లాడడం నిజంగా ఎంత దురదృష్టకరం! ఈ ధోరణి ఈనాటికి ఉండటం మరింత దురదృష్టకరం!
కానీ, సీరందాసు వెంకట రామారావు (S. V. Rama Rao) ఇందుకు పూర్తిగా భిన్నమైన ఉదాహరణ.
ఎస్. వీ. రామారావు
న్యూయార్క్ టైమ్స్, హెరాల్డ్ ట్రిబ్యూన్, వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికల్లో మాక్స్ వైక్స్-జోయ్స్, షెల్డన్ విలియమ్స్, లాంటి అతిరథ మహారథులు, కామన్‌వెల్త్ ఇన్స్టిట్యూట్ ఆర్ట్ గ్యాలరీకి క్యురేటర్‌గా వ్యవహరించిన రొనాల్డ్ బోనెన్, ది క్రిస్టియన్ సైన్స్ మానిటర్ నుంచి పాట్రీసియా బోయ్డ్ విల్డన్, ఇంకా విలియం టౌన్‌సెండ్, మేరీ కామోట్ లాంటి మహామహులెందరో యస్. వీ. రామారావు కళాఖండాల గురించి పుంఖానుపుంఖాలుగా ప్రశంసల వర్షం కురిపించారు. వీళ్ళంతా కూడా చిత్రకళా రంగంలో ఉద్దండులే!
కేవలం పాశ్చాత్యులే కాక, ప్రపంచ కళా విమర్శకులందరి దగ్గరా ప్రశంసలందుకున్న ఎస్. వి. రామారావుని చూసి మనమంతా కచ్చితంగా గర్వపడాలి. నిస్సందేహంగా అమితంగా గర్వపడాలి.
ఎందుకు? అని మీరడగవచ్చు. రామారావు ఎంచుకున్న మాధ్యమం, ఎక్కడో గుడివాడ నుండి వచ్చిన ఒక తెలుగువాడికి, పూర్తిగా పరాయిది కావటం మొదటి కారణం.
ప్రధానంగా నైరూప్య కళ అన్నది పూర్తిగా యూరప్ దేశాలకు సంబంధించినది. ఇంకా కచ్చితంగా చెబితే అది ఆంగ్లేతరులైన యూరప్ దేశస్థుల స్వంతం. సాధారణంగా ఆధునిక కళ ఎక్కడైనా రాజకీయ నేపథ్యం నుండే పునీతమౌతుందని నా అభిప్రాయం. పైగా తూర్పు, పశ్చిమదేశాల మధ్య సాంస్కృతికంగా, రాజకీయంగా చాలా తారతమ్యాలున్నాయి. ప్రత్యేకించి, పశ్చిమ దేశాల్లో వచ్చినన్ని రాజకీయ సాంస్కృతిక ఉద్యమాలు మనకు రాలేదు. ఒకవేళ చెదురుమదురుగా వున్నా పోలిక అసలే లేదు. ఇరుశైలుల మధ్యా చెప్పలేనంత అగాధముంది. ఈనాటికీ, ఆధునిక భారత చిత్రకారులని మనం ఎవరినైతే పిలుస్తున్నామో వాళ్ళందరూ ప్రధానమైన ప్రతిమారూపకళ (Figurative form) నుంచి కొంచెం పక్కకు వచ్చేందుకు కూడా చాలా జంకుతుంటారు.
కానీ, రామారావు తనలోని భావాలను దేశీయ మార్మికతతో రంగరించి దాన్ని పాశ్చాత్య నైరూప్య చిత్రకాళా శైలులతో సమ్మిళితం చేయగల ఒక అద్భుతమైన మార్గాన్ని కనుక్కున్నాడు. ఆ క్రమంలోనే తన స్వంత శైలినీ నిర్మించుకున్నాడు. అతని శైలి అతనికే ప్రత్యేకమైన నైరూప్య భావప్రకాశతను (Abstract expressionism) సంతరించుకుందని నా అభిప్రాయం. నైరూప్య కళలో ఇంత భిన్నధోరణిని ఆ కళలో నిష్ణాతులైన వారెవరైనా ఒప్పుకొని తీరవలసిందే. ఒప్పుకున్నారు కూడా. రామారావు గొప్పతనమంతా ఇక్కడే ఉంది. ఇందుకే మనం రామారావుని చూసి గర్వపడాలి.
రామారావు ప్రముఖ నైరూప్య భావప్రకాశ చిత్రకారుడిగా రాత్రికి రాత్రే ఎదగలేదు. అదంతా ఒక క్రమంలో జరిగింది. చిన్న చిన్న అడుగులతో మొదలై ఇంతింతగా పెరిగాడు రామారావు. అతని లోలోపల అంతః సంఘర్షణతో పాటు అద్వితీయమైన శ్రద్ధాసక్తులు, విభిన్న మతాల గురించీ, తత్వ శాస్త్రాన్ని గురించిన నిరంతర తులనాత్మక పఠనం అతనికి దోహదం చేశాయి. రంగులతో, వన్నెలతో, రేఖలతో, విభిన్నమైన కుంచెలతో, చివరికి మామూలు కేన్వాసు, బోర్డులతో సహా నిరంతరం ప్రయోగాలు చేస్తూ వచ్చాడు రామారావు.
నా ఈ వ్యాఖ్యానమంతా కూడా రామారావు భావప్రకాశత నుంచి నైరూప్యతకు సాగించిన యాత్రను అర్థం చేసుకునేందుకు చేసిన ప్రయత్నమే కానీ విమర్శనాత్మకమైనది కాదు. గుడివాడ నుండి మొదలిన అతని యాత్ర లండన్‌కు, ఇంగ్లండ్ నుంచి బౌలింగ్ గ్రీన్‌కూ, కెంటకీ నుంచి షికాగో వరకూ సాగింది. ఈ సుదీర్ఘ యాత్రలో బాస్టన్, సిన్సినాటి, టాలహాసీ, లాంటి చిరు మజిలీలు లేకపోలేదు. ఎన్నో మెలికలూ మలుపులూ ఉన్నా అదొక గర్వకారణమైన సుదీర్ఘ ప్రశాంత యాత్ర.
వాసిలీ కాండిన్‌స్కీ (Wassily Kandinsky) “చిత్రకళాసృజన అంతా కూడా కళాకారుడి అంతరంగంలోని అవసరానికి బహిర్‌వ్యక్తీకరణే” అంటాడు. ప్రస్ఫుటంగా వ్యక్తం చేసేందుకు రామారావు అంతరంగంలో తీవ్రమైన అవసరం ఉంది. పన్నెండేళ్ళ వయసులో తొలిసారి రామారావుకు చిత్రకళపైన ఆసక్తి పెరిగింది. అతని హైస్కూలులో డ్రాయింగ్ టీచరుగా పనిచేస్తున్న కె. వేణుగోపాల్ తొలి గురువు. వేణుగోపాల్ అప్పటికప్పుడు బొమ్మను గీసేవారు. రామారావుని ఇదెంతగానో ఆకట్టుకుంది. ప్రముఖ ఆంగ్ల చిత్రకారుడు అగస్టస్ జాన్ (Augustus John) పుస్తకాన్ని చూడమని వేణుగోపాల్ తరచూ చెప్పేవారట. ఒక పదమూడేళ్ళ పిల్లవాడికి ఆ పుస్తకాన్ని చూడమని చెప్పటం నిజంగా అమితానందాన్ని కలిగించి వుంటుంది. రామారావు తన హైస్కూలు ముగిసిన తర్వాత వేణుగోపాల్ వద్ద చిత్రకళలో ప్రైవేటు చెప్పించుకున్నాడు. ఆ క్రమంలో మద్రాసు ప్రభుత్వం నిర్వహించే డిప్లొమా ఇన్ ఆర్ట్స్ పాసయ్యాడు. అప్పట్లో ఎవరైనా డ్రాయింగ్ మాస్టర్ కాదలచుకున్నా, ఒక చిత్రకారుడు కాదలచుకున్నా ఈ డిప్లొమా తప్పని సరి.
తన కాలేజీ రోజుల్లో ఇలస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చే రంగు రంగుల చిత్రాలు, వాటి పక్కనే కళాకారుడి పరిచయం రామారావుని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అప్పుడు అతని మనసులో ఆరు నూరైనా పెయింటర్ అవ్వాలన్న కోరిక బలంగా నాటుకుంది. దానికోసం రోజూ శ్రమించాడు. కాలీజీలో చదువు అయిపోయిన తర్వాత శాంతినికేతన్‌లో చదువుకోవాలనుకున్నాడు కానీ తలిదండ్రులు వద్దన్నారు.
అయితేనేం, అదృష్టం ఇంకో రూపంలో వరించింది. మద్రాసులో సినీ రంగంతో పరిచయమున్న కొంతమంది స్నేహితుల సహకారంతో ప్రముఖ కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలేతో పరిచయమయింది. గోఖలే దగ్గర సహాయకుడుగా చేరదామనుకున్నాడు రామారావు. అప్పుడు గోఖలే “ఈ రంగంలో మాకు కొంచెం చదువుకున్న వాళ్ళు కావాలి. చిత్రకళలో శిక్షణకి ఏదైనా కళాశాలలో చేరు. అప్పటికీ నాదగ్గరే పనిచేయాలనిపిస్తే తీసుకుంటాను” అని సలహా ఇవ్వటమే కాకుండా తానే స్వయంగా వెళ్ళి, రామారావు తండ్రి గంగయ్యగారితో మాట్లాడి ఒప్పించారు. మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరకముందే గోఖలే రామారావును కళాక్షేత్రలోని ప్రముఖ జానపద శైలి చిత్రకారుడు కె. శ్రీనివాసులుకి పరిచయం చేసి, అతనితోనే ఉండి చిత్రకళకు సంబంధించిన మెళకువలు నేర్చుకుని రమ్మన్నారు.
ఆ తర్వాత, ఆరు సంవత్సరాల ఆ కోర్సులో రామారావును నేరుగా మూడో సంవత్సరంలో చేర్చుకున్నారు. స్వయంగా పాశ్చాత్యదేశాల ఇంప్రెషనిస్టిక్ (Impressionistic) ధోరణితో సమ్మోహితుడైన ఆ కాలేజి ప్రిన్సిపల్ పణిక్కర్ గురువుగా లభించడం నిజంగా రామారావు అదృష్టం. తైలవర్ణాలతోనూ, బొగ్గుతోనూ కూడా రూప చిత్రాలను, స్టిల్ లైఫ్, లైవ్ స్కెచింగ్, లాండ్‌స్కేప్‌లనూ సాధన చేశాడు. ఈ చిత్రాలన్నిటిలో రంగు అద్దిన తీరు మాత్రం పాల్ చెజాఁ (Paul Cezzane), జార్జెస్ సిరా (Georges Seurat) లాంటి ఇంప్రెషనిస్ట్ చిత్రకారుల పనితీరును తలపింపచేస్తుంది.
ప్రొసెషన్ అనే చిత్రాన్ని తైలవర్ణాలతో, ఇంప్రెషనిస్ట్ ధోరణిలోనే పాయింటిలిజం (Pointillism) అనే ప్రత్యేక పద్ధతిలో రామారావు 1959లో వేశాడు. ఇప్పుడు ఈ చిత్రం న్యూయార్క్‌లో ఒక వ్యక్తి వద్ద వుంది. ఈ పాయింటిలిజం అనే పద్ధతిని ముందుగా సిరా ప్రవేశపెట్టాడు. ఇందులో చిత్రకారుడు ప్రకృతిలోని రంగులను వాటి శుద్ధ, మౌలిక స్థితిలోకి రూపాంతరం చేసి చిత్రంలో ఉపయోగిస్తాడు. చిత్రం అంతా కూడా బిందువులు గానీ లేదా, చిన్న బ్రష్‌తో గీసిన గీతల సముదాయంగానో కనిపించడం ఈ పద్ధతిలో ప్రత్యేకత. చిత్రం పూర్తయిన తర్వాత అందులోని వర్ణాలను పునర్నిర్మించుకొనే పనిని చిత్రకారుడు చూపరులకే ఒదిలి వేస్తాడు. ఈ చిత్రానికి రామారావు తెలుగులో ‘ఆర్యదేవ’ అని సంతకం చేయడం ఆసక్తి కొలిపే విషయం. ఆర్యదేవుడు బౌద్ధ భిక్షువు అయిన నాగార్జునుని ప్రముఖ శిష్యుడు. ఇతడు తనదైన ఒక ప్రత్యేక తరహా బౌద్ధాన్ని ప్రచారం చేశాడని వినికిడి.
రామారావు తన తొలినాళ్ళలో ఆర్యదేవ, పద్మనాయకి తదితరాలైన కలంపేర్లతో కవిత్వం రాశాడని చెప్పడం ఇక్కడ సబబుగా ఉంటుందనుకుంటాను. ఎంత సారూప్యత!
రామారావు తన తొలిదశలో వేసిన చిత్రాలన్నీ ఇప్పుడు కేవలం ఫోటోగ్రాఫుల రూపంలోనే లభ్యం. పైగా అవన్నీ కూడా ప్రతిమారూపశైలిలో ఉన్నప్పటికీ, సాంప్రదాయ భారతీయ శైలి నుంచి రామారావు మెలిమెల్లిగా నిర్గమిస్తున్న క్రమాన్ని స్పష్టంగా పట్టిచూపుతాయి. మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులు సాంప్రదాయ భారతీయ పద్ధతిలోనే చిత్రాలు వేయడం పరిపాటి. అయినప్పటికీ రామారావు అందులోంచి బయటపడ్డాడు. ఏడాది తిరక్కముందే రామారావు చిత్రాలకు కలకత్తా, బొంబాయి, ఢిల్లీలలో జరిగిన పలు పోటీల్లో అవార్డులు వచ్చాయి. కలకత్తానుంచి వెలువడే కళాసంచిక ‘రిథమ్’లో రామారావు చిత్రాలను ప్రముఖంగా ముద్రించి అతని గురించి ప్రత్యేకంగా రాశారు. ఇటు కృష్ణవేణి, అటు భారత చిత్రకళకే పుట్టినిల్లయిన అమరావతి, మధ్యలో రామారావు జన్మస్థలమైన గుడివాడలో వేణుగోపాల్ వద్ద ఓనమాలు దిద్దుకున్న రామారావు, తర్వాత తన ఉపాధ్యాయులు దేవీప్రసాద్ రాయ్ చౌదరి, కేసీయెస్ పణిక్కర్, హెచ్ వీ రాంగోపాల్ వద్ద చిత్రకళలోనీ సూక్ష్మాలనూ, తీరులనూ, రంగుల్లోని ఐంద్రజాలిక రమ్యతనూ పరిశీలించి పట్టుకునే నైపుణ్యాన్ని సాధించుకున్నాడు. ఈ నేపథ్యమంతా అతని ప్రతి చిత్రంలోనూ లీలగా కనిపిస్తూనే వుంటుంది.
ఈ ముగ్గురి గురువుల్లోకీ పణిక్కర్ ప్రభావం రామారావు పైన ఎక్కువగా కనిపిస్తుంది. పణిక్కర్ తన యూరప్ పర్యటనలో అక్కడి ఇంప్రెషనిస్ట్ ధోరణి పట్ల విపరితంగా ఆకర్షితుడయ్యాడు. కేవలం భారతీయ చిత్రకళను మాత్రమే అధ్యయనం చేయడానికి తమని తాము పరిమితం చేసుకోవద్దనీ, ఇతర ధోరణులనూ అంతే శ్రద్ధతో తెలుసుకోవాలనీ పణిక్కర్ తన విద్యార్థులకు సూచించేవాడు. రామారావు మీద ఆ ప్రభావం చాలా బలంగా ఉంది.
ఎ గర్ల్ విత్ లిలీస్ అండ్ పిచర్, 1960.
రామారావు చిత్రకళనూ, జీవిత తత్వాన్నీ అత్యంత ప్రయోగాత్మకంగా, సాహసోపేతంగా ప్రదర్శిస్తాడు. 1960లో అతను వేసిన ‘గర్ల్ విత్ లిలీస్ అండ్ పిచర్’ చిత్రం టెంపెరా (Tempera) పద్ధతికి చెందినది. అజంతా గుహల్లో చిత్రాలు ఈ పద్ధతిలోనే వేయబడ్డాయి. ఈ పద్ధతిలో చిత్రాలను తైలవర్ణాల్లోనూ, నీటి రంగుల్లోనూ వేయవచ్చు. ఈ చిత్రం వేసిన కాలంలో రామారావు కళాక్షేత్రంలో కే. శ్రీనివాసులు వద్ద చదువుకుంటున్నాడు. రామారావు వేసిన ఈ చిత్రంలో జానపద చిత్రశైలిలోని గొప్పదనమూ, వర్ణ విస్తృతిలోని సామాన్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఒక్క జైమినీ రాయ్ తప్ప తక్కిన భారతీయ చిత్రకారులు ఈ చిత్రంలోని జీవాన్ని పట్టుకోడంలో విఫలమయ్యారు. బెంగాల్‌కు చెందిన జైమినీ రాయ్ జానపద చిత్రకళలో అద్వితీయుడు. ఇతను జానపద చిత్రకళలో పట్ (pat) పద్ధతిని ప్రవేశపెట్టాడు. పనిలో పనిగా ఈ చిత్రంలో రామారావు జానపద శైలిని ఆధునిక పరిభాషలోకి మలిచాడు. ఈ ప్రయోగం చేయగలిగిందీ, చేసి విజయం సాధించగలిగిందీ కేవలం రామారావు మాత్రమే. చిత్రంలో అమ్మాయి శరీరం పసుపుపచ్చగా ఉంటుంది. అందులో లీలామాత్రంగా నారింజరంగు దిద్ది వుంతుంది. చిత్రం చూసిన వారెవరికైనా ఉత్తరాంధ్రలో పసుపు అప్పుడే ముఖానికి రాసుకున్న ఒక పల్లె పడచు జ్ఞాపకం రాక మానదు. ఆమె ఒకచేతిలో పొడుగాటి కాడల కలువలు పట్టుకుని, ఏదో అలికిడై తల తిప్పి హొయలుగా నిలబడి వుంటుంది. ఇదీ ఇందులోని జానపద అంశ. శైలి మాత్రం పూర్తిగా ఆధునికం.
1961లో త్రివేండ్రంలోని రాజా రవివర్మ మ్యూజియానికి అప్పటి క్యురేటర్ అయిన ప్రముఖ చిత్రకళా విమర్శకుడు పద్మనాభన్ థంపి రామారావుని ఆహ్వానించాడు. కేరళ పర్యటనలో రామారావు అక్కడి అందాలను పూర్తిగా మమేకం చేసుకున్నాడు. దాని ఫలితమే, అదే సంవత్సరం రామారావు వేసిన ఎ సీన్ ఫ్రం కేరళ అనే తైలవర్ణ చిత్రం. మామూలు గ్రామసీమకు సంబంధించిన చిత్రాలనుంచి స్పష్టంగా ఈ చిత్రం విడిపడిన విషయాన్ని ఇట్టే పసి గట్టేయవచ్చు. ఈ చిత్రాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో వకీల్ అండ్ సన్స్ వాళ్ళు ఒక గ్రీటింగ్‌కార్డుగా ముద్రించారు. అది అప్పట్లో బ్రహ్మాండంగా అమ్ముడు పోయింది. మళయాళ మనోరమ పత్రిక రామారావు జీవితరేఖతో పాటు పదకొండు చిత్రాలను, ఒక పెద్ద వ్యాసాన్ని వరుసగా రెండు సంచికలలో ప్రచురించింది. రామారావు చిత్రాలను కేరళ ప్రభుత్వం అధికారికంగా కొని రాష్ట్ర పురావస్తు ప్రదర్శన శాలలో భద్రపరచి సత్కరించింది.
మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో విద్యార్థిగా ఉన్న మూడేళ్ళూ రామారావు జాతీయ స్థాయిలో జరిగిన పోటీలన్నింటిలోనూ ప్రథమ స్థానం పొందాడు. తర్వాత భారత ప్రభుత్వం ఇచ్చిన ఫెలోషిప్‌తో మద్రాసు లోనే ఉంటూ నిరంతరం విభిన్నశైలులతో ప్రయోగాలు చేస్తూ, రూపాన్ని, రంగులని, కుంచెలని మారుస్తూ అద్భుతమైన చిత్రవిన్యాసాలు చేశాడు.
రామారావు చిత్రాలను చూసిన ప్రముఖ చిత్రకళా విమర్శకుడు జి. వెంకటాచలం ప్రశంసలు, విమర్శలు, సూచనలు చేసి పైచదువు కోసం అమెరికా గానీ, బ్రిటన్‌గానీ తప్పకుండా వెళ్ళాలని సలహా ఇచ్చాడు. రామారావు అప్పట్లో క్షణం తీరిక లేకుండా శ్రమించేవాడు, ఒక పక్క రంగులతో ప్రయోగాలు చేస్తూ, ఇంకోవైపు తన చిత్రాల ఆకృతులలో సాంప్రదాయక ధోరణి నుండి ఆధునికతకు మారుతూ. అంతమార్పులోనూ చిత్రాలలో అతనిదైన ముద్ర ప్రధానంగా కనపడుతూనే ఉండేది. 1960ల్లో మద్రాసు మ్యూజియం రామారావు చిత్రాలను కొన్నిటిని కొనుగోలు చేసింది. తర్వాత ఢిల్లీ లోని ఫోర్డ్ ఫౌండేషన్ ఐదు చిత్రాలను కొనింది. హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంలోనూ, రాజ్‌భవన్‌లోనూ రామారావు చిత్రాలు కొన్నున్నాయి. కొడవటిగంటి కుటుంబరావు, నార్ల వెంకటేశ్వర రావు, ఆచంట జానకీరాం తదితర రచయితలతో రామారావుకు సాన్నిహిత్యం ఉంది. అప్పటి భారతి పత్రికలో రామారావు కళ పైన కొన్ని మంచి వ్యాసాలు రాశాడు. (ఈమాట పాఠకులకు ఇవి త్వరలో అందించే ప్రయత్నం చేస్తున్నాం – సం.) హవాయీ విశ్వవిద్యాలయంలో ఈస్ట్-వెస్ట్ ఫెలోషిప్ కోసం, లండన్ విశ్వవిద్యాలయం, స్లేడ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ వారి కామన్వెల్త్ స్కాలర్‌షిప్ కోసం ప్రయత్నించాడు. ఈ రెండు ఒకేసారి రావడంతో 1962లో లండన్ వెళ్ళడానికే రామారావు నిశ్చయించుకున్నాడు.
రామారావు లండన్‌కి కనీసం కుంచెలు కూడా తీసుకొని పోకుండా ఉట్టి చేతులతోనే వెళ్ళాడు. పాశ్చాత్య చిత్రకళారీతులను అక్కడి గురువుల నుండి మళ్ళీ కొత్తగా మొదటినుండీ నేర్చుకోడానికే నిర్ణయించుకోడం ఇందుకు కారణం. అతని ప్రయత్నమంతా అక్కడ ఒక ఆధునిక చిత్రకారుడిగా ఎదగడమే.
లండన్‌లో ఒక సంవత్సరమంతా కూడా కేవలం అక్కడి ఆర్ట్ గ్యాలరీలను చూడడానికి, కళకు సంబంధించిన వ్యాసాలు, సమీక్షలు, విమర్శలు, సిద్ధాంతాలు చదవడానికి, తన ఆలోచనలను కళారంగంలో ద్రష్టలైన వారి ఆలోచనలతో పోల్చుకుంటూ, మెరుగులు దిద్దుకుంటూ గడిపాడు. తన చిత్రాల శైలినీ, చిత్రకారుడిగా తనెన్నుకున్న మార్గాన్నీ పునస్సమీక్షించుకోడానికి ఈ కృషి తోడ్పడింది. ఈ సమయంలోనే బొగ్గుముక్కతో లైఫ్ స్కెచెస్ గీయడాన్ని అధ్యయనం చేశాడు. 1962లో గీసిన ఎ లైఫ్ స్టడీ అనే చిత్రంలో గీతల్లోని దిటవుతనం, ముఖాన్ని మలచడంలో, తీర్చిదిద్దడంలో వడి చూస్తే 17వ శతాబ్దపు మహామహులైన వేర్మీర్ (Johannes Vermeer), రెంబ్రాంట్( Rembrandt van Rijn) శైలి గుర్తుకు వస్తుంది. ఈ చిత్రానికి పూర్తి భిన్నంగా కనిపించే చిత్రం ఎ సీటెడ్ వుమన్. ఇది పక్కా పాశ్చాత్య వాస్తవిక ధోరణిలో వేసింది. 17వ శతాబ్దపు స్పెయిన్ దేశపు చిత్రకారుడు డియేగో వెలాస్క్వెజ్ (Diego Velazquez) కు రామారావు విపరీతమైన అభిమాని. అతని ప్రభావం కూడా కొంతవరకు రామారావు చిత్రాల్లో కనిపిస్తుంది.
లండన్‌లో రెండవ ఏటినుంచీ రామారావు పాశ్చాత్య కళారంగాన్ని ఒక కుదుపు కుదిపాడు. ఆహ్వానం మేరకు లిస్బన్, పోర్చుగల్‌లో తన చిత్రాలు ప్రదర్శించాడు. పెయింటింగ్ మీద రామారావుకు మక్కువ ఉన్నప్పటికీ లితోగ్రఫీ పట్ల ఆకర్షితుడై, ఈ మాధ్యమంలో తనను తాను వ్యక్తపరచుకోడానికి ఎన్నో ప్రయోగాలు చేశాడు. తనదైన శైలితో లితోగ్రఫీలో అధ్బుతాలు సృష్టించి స్లేడ్ స్కూల్ అత్యుత్తమ లితోగ్రాఫర్ పురస్కారాన్ని అందుకున్నాడు.
ప్రముఖ సాహిత్య, కళా చారిత్రకుడు, విమర్శకుడు సర్ హెర్బర్ట్ రీడ్ రామారావు చిత్రాలను చూసి తన్మయుడై తన స్వంతానికి రెండు లితోగ్రాఫులను కొన్నాడు. అలా రామారావుకు రీడ్‌తో గాఢమైన సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ కాలంలోనే రామారావు సృష్టించిన లితోగ్రాఫులు విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం లాంటి ప్రముఖ ఆర్ట్ గ్యాలరీలను అలంకరిస్తూ వచ్చాయి. ఏ కళాకారుడైనా న్యూయార్క్ మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో తన చిత్రం ప్రదర్శించబడటం అత్యంత గర్వకారణంగా భావిస్తాడు. రామారావు తొలిసారి అమెరికా పర్యటించినప్పుడు, ఆ మ్యూజియం క్యురేటర్ రామారావుని తన చిత్రాలను కొన్నిటిని పంపమని అడిగాడు. అంతర్జాతీయ న్యాయమూర్తుల సమితి పరిశీలన కోసం రామారావు దాదాపు నలభై లితోగ్రాఫులను ప్రదర్శించాడు. సమితి పరిశీలనలో రామారావు లితోగ్రాఫు సహజంగానే ఎంపికయింది. మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో (MoMA) డాలి (Salvadore Dali), పికాసో (Pablo Picasso) లాంటి ఉద్దండుల చిత్రాల సరసన రామారావు చిత్రం సగర్వంగా చేరింది.
చాలామంది లితోగ్రాఫర్ల లాగా కాకుండా రామారావు లితోగ్రాఫు ప్లేటునుంచి ఒకే ఒక్క ప్రతిని ముద్రించి ప్లేటును పగలకొట్టేస్తాడు. ఒక ప్లేటు, ఒక చిత్రం – అంతే. అది అతని ప్రత్యేకత. తన ఒకే చిత్రం పదిమంది దగ్గరుండడం తనకు ఇష్టం వుండదు. అందుకే, తర్వాతి రోజుల్లో తన లితోగ్రాఫు నుంచి ప్రతులు అచ్చు వేసి అమ్మకానికి పెడితే, ఆ ప్రదర్శనలకు వెళ్ళేవాడు కాదు.
రామారావు ప్రత్యేక శైలి, పనితీరులో వెలువడిన లితోగ్రాఫులను అలా ఉంచినా, కర్రతో శిల్పాలను తీర్చిదిద్దడంలోనూ చూపిన ప్రావీణ్యత చూస్తే రామారావులోని నిరంతర ప్రయోగశీలి గోచరిస్తాడు. ప్రతి కర్రకు సహజ సిద్ధంగ ఒక ప్రత్యేకమైన గరుకుదనపు తలం ఉంటుంది. సాధారణంగా కర్రలతో చెక్కే సాంప్రదాయ కళాకారులు ఒక నున్నని చెక్కను తిసుకొని, దానిపైన ఆకృతులు చెక్కి అందులోంచి చిత్రప్రతిని ముద్రిస్తుంటారు. కానీ రామారావు సాంప్రదాయ పద్ధతిలో చిత్రాన్ని ఎన్నడూ చేయడు. అతను వేర్వేరు తలాలున్న చెక్కలను తనకనుగుణంగా ముక్కలుగా చేసుకుని, ఆ ముక్కలను అతికించి తను అనుకున్న చిత్రాన్ని తయారు చేసుకుంటాడు. అప్పుడు, వేర్వేరు చెక్కముక్కలపై విడిగా వేర్వేరు రంగులతో తన ఆలోచనల్లోని తాలూకు చిత్రం తాలూకు వివరాలను సృష్టిస్తాడు. ఫెట్టర్డ్ ఫ్లైట్ ఆఫ్ ఫిమేల్ అన్న చిత్రం వుడ్‌కట్ రామారావు నిపుణతకు సాక్ష్యం. ఈ చిత్రం లోని చెక్కముక్కలపైన వర్ణసమ్మేళనంలో ఖాళీతనాన్ని, చెక్కిన చెక్కల్లో నిండుదనాన్నీ గమనించవచ్చు. ఈ రెండింటి కలయిక వల్ల చిత్రంలోని అసలు అర్థం, చిత్రకారుడు చిత్రానికి పెట్టిన పేరులోని విషయం, ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చిత్రంలోని స్త్రీమూర్తి అంతరాంతరాలలో తీవ్రమైన స్వేచ్ఛాకాంక్ష, అదే సమయంలో సమాజం విధించిన అసంబద్ధపు సంకెలలు, అందువల్ల రెక్కలు తెగి ఎక్కడికీ ఎగర్లేని నిస్సహాయత ఈ చిత్రంలో అద్భుతంగా అవగతమౌతాయి.
ఎ సీటెడ్ వుమన్ (నైరూప్య చిత్రం).
సీటెడ్ వుమెన్ అన్న నైరూప్య చిత్రం, వాస్తవిక ధోరణిలో వేసిన లైఫ్ స్టడి వరుసలోని సీటెడ్ వుమెన్ చిత్రానికి భిన్నమైనది. ఈ నైరూప్య చిత్రం జర్మన్ కళాకారుల బృందమైన వైల్డ్‌బీస్ట్ గ్రూప్ తరహా భావప్రకాశ పంథాకు చెందినది. ఇదే తరహాలో నిష్ణాతుడైన ఫ్రాంజ్ మార్క్ (Franz Marc)ముతక మెరుపు రంగులతో కరుకు కుంచె గీతల్లో ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఈ నైరూప్య చిత్రం ఎంత వేగంగా తయారయిందో, అంత వేగంలోనూ చిత్రకారునికి విషయం పట్లా, వర్ణాల మిశ్రమం పట్లా ఎంత పట్టు ఉందో ఇట్టే గ్రహించవచ్చు. ఈ చిత్రం వాస్తవిక శకంలోని నాలుగు గోడల మధ్య స్టూడియోలో వేసే చిత్రాల నుంచి ఆరుబయట వేసే ఇంప్రెషనిస్ట్ తదితర ధోరణులలోకి రామారావు పరిణామం చెందిన క్రమానికి ఆనవాలుగా నిలిచింది. అందులో విజయం సాధించగలిగింది.
రామారావు చేసిన ఈ ప్రయోగాలన్నీ అతన్ని ఒక ప్రత్యేకమైన చిత్రకారుడిగా నిలబెట్టేందుకు భూమికగా నిలిచాయి. వీటి ద్వారా తన అంతరంగాన్ని బలంగా అభివ్యక్తీకరించడం, ఆ ప్రయత్నంలో తనని తాను కోల్పోకుండా ఉండడం, రామారావు ప్రత్యేకత, గొప్పతనం అని చెప్పాలి. ప్రముఖ చిత్రకారుడు కొకోష్క (Oscar kokoschka) “ఒక సృజనాత్మకుడైన వ్యక్తికి తన అంతరంగంలోని జ్ఞానిని ఏ విషయమైతే మరుగు పరుస్తుందో, మొదట దాన్ని అన్వేషించడం ప్రధాన లక్ష్యమౌతుంది. ఆ తరువాతే అతను తన మదిలోని శక్తిని కూడగట్టుకుంటాడు” అంటాడు. రామారావు చేస్తున్న ప్రయోగాలన్నింటిలోనూ ఈ అన్వేషణ కొనసాగుతూనే ఉండి, చిత్రకారుడిగా అతని ఎదుగుదలకు అద్దం పడుతున్నాయి.
రామారావుకు ప్రాతినిధ్య కళ నుండి నైరూప్య కళకు జరిగిన పరిణామం ఖచ్చితమైన రూపు తీసుకున్నది అతను స్లేడ్ స్కూల్‌లో వున్న చివరి సంవత్సరం (1964) లోనే. భారతీయ చిత్రకళపై మంచి పట్టు వున్న ఒక ప్రముఖుడు ఆఫ్రికా నుంచి లండన్‌కు రామారావు చిత్రాలను చూడటానికి వచ్చాడు. అప్పుడు రామారావును 4/6 అడుగుల నిడివి చిత్రాన్ని వేయమని అడిగాడు. రామారావు దీన్ని ఒక సవాలుగా తీసుకున్నాడు. ఎందుకంటే అతను అప్పటి దాకా అంత పెద్ద చిత్రాన్ని అతను వేయలేదు. అంత పెద్ద కేన్వాసే అతనికి కొత్త. “ఏదో వేశాను గానీ ఆ చిత్రం నాకు తృప్తినివ్వలేదు. నా భావం అందులో సరిగ్గా వ్యక్తం కాలేదు. అయితే ఈ విఫలమైన ఈ ప్రయోగం నుంచి కూడా నాకు కొత్త సంగతులు తెలిశాయి” అని తనే నిజాయితీగా చెప్పుకున్నాడు. అందుకే, అంతటితో ఆగిపోకుండా మళ్ళీ ప్రయత్నించాడు. తన చిత్రాల్లో కొత్త ఆకృతులను నిర్మించి స్థల తలంపై పట్టు సాధించాడు. ఇది రామారావు చిత్రశైలి రూపాంతరం జరిగిన క్రమంలో మొదటి మెట్టు. 1964లో వేసిన ఈ చిత్రం (పేరు లేదు) ప్రాతినిధ్య కళ నుంచి పూర్తిగా వైదొలగి తన అభివ్యక్తతకు ఒక రూపంగా రామారావు రూపరాహిత్యాన్ని ఎంచుకున్న తీరును తెలియజేస్తుంది.
పాశ్చాత్య దేశాల్లో బాగా పేరు గడించిన, స్థిరపడిన భారతీయ చిత్రకారుల్లో అవినాశ్ చంద్ర, ఎఫ్. ఎన్. సౌజాలు రామారావు సమకాలీనులని చెప్పవచ్చు. అవినాశ్ పూర్తి స్థాయి పాశ్చాత్య శైలితో చిత్రిస్తే, సౌజా మతసంబంధ ఆధునిక ధోరణిలో చిత్రాలు వేస్తుండేవాడు. రామారావు తనదైన శైలినీ, ముద్రనూ సృష్టించుకోవాల్సి వచ్చింది. ప్రాక్పశ్చిమాలను సమ్మేళనం చేయగలనన్న ధీమా ఉన్నా, ఎలా చేయాలి అనే ప్రశ్న అతన్ని వేధిస్తుండేది. అసలు ఈ సమ్మేళనాన్ని సమర్థవంతంగా ఏ మాధ్యమం చూపగలదు? బెంగాల్ తరహా నీటి రంగులా? రాజపుత్రశైలిలో టెంపెరా తరహాలోనా? ఎటూ పాలుపోని రామారావు అవి తన మాధ్యమాలు కావని మాత్రం నిశ్చయించుకున్నాడు. కేవలం తైలవర్ణ చిత్రాలు మాత్రమే తన ఆశయాన్ని పూర్తిచేయగలవని అనుకున్నాడు. వాటర్ కలర్స్‌లో కడిగినట్లుండే నునుపుదనాన్ని ఆయిల్ కలర్స్‌లో తేవడమే తన పనిగా, అది సాధించడమే తన లక్ష్యం, తన ముద్ర అని అనుకున్నాడు. నైరూప్య చిత్రకారుడిగా తాను సృజించిన చిత్రాల్లో దీన్ని సాధించాడు. ప్రపంచ కళారంగంలోనే రామారావుది ఇపుడు ప్రత్యేక ముద్ర.
నిజానికి నీటి రంగుల్లోని పట్టు లాంటి మృదుత్వాన్ని తైలవర్ణాల్లో సాధించడం, ప్రపంచ కళారంగంలోనే ఒక గొప్ప సాంకేతిక అద్భుతం. దీన్ని సాధించిన రామారావు నైపుణ్యాన్ని పాశ్చాత్య కళాప్రముఖులు బహుధా ప్రశంసించారు. ఈ విజయాన్ని ఒక సాంకేతిక అద్భుతం గానే కాకుండా, భావప్రకాశ ధోరణికి చెందిన నైరూప్య కళలో ఒక కొత్త అధ్యాయంగా, అభివ్యక్తిగా వర్ణించారు.
న్యూ ఎక్స్‌పెరిమెంట్ విత్ హ్యూమన్ ఫామ్, 2011.
1967లో ప్రముఖ కళాపత్రిక ది స్టూడియో సంపాదకుడైన విలియం టౌన్‌సెండ్ లండన్‌లోని లైసెస్టర్ గ్యాలరీలో ఏర్పాటైన రామారావు ప్రదర్శనకు ముందుమాట రాస్తూ: “రామారావు చిత్రాలు ప్రపంచంలో మనకు ఎంతో ఆనందాన్నిచ్చే వాటి సరసన ఉంటాయి. ఈ చిత్రాల్లో ఉపయోగించిన రంగులు, వాటి క్రమమూ యూరోపియన్ చిత్రకారుల మాదిరిగా ఉండటం; ప్రత్యేకించి సదర్‌లాండ్, కాండిన్స్కీ లాంటి వారి తీరును గుర్తుకు తెచ్చేలా ఉండటం ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం. కానీ ఇవన్నీ ఒక భారతీయుడు వేసినవని మనకు తెలిసిపోతుంది. ఈ రంగులూ, ఈ వరస క్రమం, వాటి కలయిక, వాటి ప్రాశస్త్యం – ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కావు. ఇవన్నీ ఒక భారతీయ మహిళ మాత్రమే తన దైనందిన జీవితంలో ఎంతా దర్పంతో వేసుకునేవి. అవి ఆమెకే పరిమితం. రామారావు చిత్రాల్లో భారతీయత ఉంటుంది. తన దేశపు కోండలు, లోయలు, వాటి మధ్యగా పారే నదులు ఈ చిత్రాల్లో కనిపిస్తాయి. వీటిలో మైదానల గతి, వైశాల్యం ప్రస్ఫుటంగా ఉంటాయి. మనం గేయాతంకంగా, లయాత్మకంగా ఆ చిత్రాల్లోకి ప్రవేసించి ఒక ప్రతీకగా ఆ ప్రదేశాలన్నిటినీ స్పృశిస్తాం.” అంటాడు. ఇలా, పారిస్, లండన్, బోస్టన్, సిన్సినాటి తదితర ప్రాంతాల కళాప్రముఖులు, విమర్శకులు ఎస్.వి. రామారావు కళ గురించి అన్న మాటలను లెక్కకు మిక్కిలిగా ఉల్లేఖిస్తూ పోవచ్చు. ఆ మాటల సారాంశమంతా టౌన్‌సెండ్ వాక్యాల్లో నిక్షిప్తమై ఉందని చెప్పచ్చు.
నైరూప్యకళలో కామన్వెల్త్ దేశాల్లోకే ప్రముఖ కళాకారుడిగా గుర్తింపు పొంది, లార్డ్ క్రాఫ్ట్ పురస్కారాన్ని పొందిన తర్వాత, రామారావు వరుసగా ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్, అమెరికాలలో ఎన్నో వన్ మ్యాన్ షోలలో పాల్గొన్నాడు. అతని చిత్రాలను, పికాసో, మీరో, బ్రేక్, డాలి లాంటి మహామహుల చిత్రాల సరసన ప్రదర్శించేదుకు ప్రత్యేక ఆహ్వానాలు అందేవి. ఇంత ప్రతిష్ఠాత్మక అవకాశం లభించిన ఒకే ఒక భారతీయ కళాకారుడు రామారావు. ఒక చిత్రకారుడిగా ఇది రామారావుకు జీవితకాలపు అత్యున్నత పురస్కారం అని చెప్పవచ్చు.
అమెరికాలో అతి ప్రాచీన కళాసంస్థ అయిన కోప్లే సొసైటీ (బోస్టన్) ప్రతి యేటా ఏర్పాటు చేసే ప్రదర్శనలకు ఎంతో పేరు, ప్రతిష్ఠ ఉన్నాయి. ఈ ప్రదర్శనలో ఎంపిక అయేందుకు చాలా ముందుగానే చిత్రకారులు తమ చిత్రాలను పంపుతూ ఉంటారు. రామారావు చాలా ఆలస్యంగా ప్రదర్శనకు కొన్ని రోజుల ముందే తన చిత్రాలను పంపినా, కోప్లే సమితి ఆశ్చర్యంగా ఆ చిత్రాలను ప్రదర్శనకు ఎంపిక చేసింది. రామారావు కళకి ఇదొక మచ్చు తునక.
మేఘ సందేశం అనే వర్ణ చిత్రం, చీకటిలో వెలుగు రేఖలు అన్న చిత్రం – ఈ రెండూ కూడా వాటిలోని వర్ణ సమ్మేళనంలో, విషయంలో, గాంభీర్యంలో ఒకదానికొకటి సాటిగా నిలబడతాయని నా వ్యక్తిగత అభిప్రాయం. నైరూప్య చిత్రాల ద్వారా అంతరంగంలోని ప్రతిధ్వనులను వ్యక్తం చేయగలమన్న ఆత్మ స్థైర్యం రామారావులో కనిపిస్తుంది. అతను తన చిత్రాల ద్వారా ఈ విషయం సమర్థవంతంగా రుజువు చేశాడు కూడా. ఒక చిత్రకారుడు నైరూప్య చిత్రాన్ని వేయాలంటే అతను తన ఆత్మను విస్తృతం, ఉన్నతం చేసుకోవాల్సి ఉంటుందన్న సంగతి రామారావుకు కచ్చితంగా తెలుసు. అప్పుడు మాత్రమే, ఆ స్థితిలో మాత్రమే చిత్రకారుడు వర్ణాల మధ్య సమతౌల్యం పాటించగలడు. వాటిని సమర్థవంతంగా తూచగలడు. అప్పుడు మాత్రమే చిత్రకళలో అతనొక నిర్ణాయక శక్తిని పొందుపరచ గలుగుతాడు.
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడిగా ఎదిగిన ఒక భారతీయుడిగా, బహుముఖ ప్రతిభాశాలిగా పేరు పొందిన రామారావును వ్యక్తిగా చూస్తే ఎవరూ అతన్ని గురించి అలా అనుకోరు. ఒక సామాన్యమైన మనిషిగా నిరాడంబరమైన మనసుతో ఉండగలగడం, రామారావు అన్ని మతాల నుండీ గ్రహించిన సారాంశపు ఫలితమేమో అనిపిస్తుంది.
తన చిత్రాల్లో రామారావుకు బాగా ఇష్టమైనది రేస్ ఆఫ్ హోప్ ఇన్ డార్క్‌నెస్ (చీకటిలో వెలుగు రేఖలు) అన్న చిత్రం. నిస్సందేహంగా అది ఒక అద్భుత కళాఖండం. ఇందులో ఒక నైరూప్య భావప్రకాశ చిత్రకారుడిగా అతని ప్రగతినీ, పరిపక్వతనూ చూడవచ్చు. పారదర్శక వర్ణాలను వాడిన తీరు, కాన్వాస్‌పై అడుగడుగునా కుంచె కదిలిన తీరు, తారాస్థాయికి చేరుకున్న రామారావు ప్రతిభకు తార్కాణాలు. పరిణతి సాధిస్తున్న కొద్దీ మనిషిలో సత్వగుణం ఎలా అలవడుతుందో అదే తీరులో ఈ చిత్రంలో రంగుల వేగాన్ని అత్యంత నైపుణ్యంతో నియంత్రించగలిగాడు. ఇంతకు ముందటి చిత్రాల్లో రంగులు గుర్రాల్లా పరుగెడుతుండేవి. ఈ చిత్రం వేస్తున్న కాలం లోనే రామారావు జెన్ బౌద్ధం పట్ల ఆసక్తుడై ఆ తత్వాన్ని తీవ్రంగా చదువుతుండేవాడు. ఆ ప్రభావం ఈ చిత్రంలో లీలామాత్రంగా కనిపిస్తుంది. వివిధ మతాల గురించి చదవటం, తెలుసుకోవటం వల్లే తనలోని చిత్రకారుడికి సమగ్రత చేకూరి దృశ్యాదృశ్యాలను వ్యక్తం చేయగల శక్తి సమకూరిందని రామారావు నమ్మిక.
ఎంతటి చిత్రకారుడైనా తన చిత్రాల్లో నలుపుని నియంత్రించేటప్పుడు కొంచెం జంకుతారు. కానీ, అతి కష్టమైన ఈ పనిని రామారావు సమర్థవంతగా సాధించగలిగాడూ, ఇతర వర్ణాలతో మేళవించి నలుపుని అదుపులోకి తెచ్చుకోగలిగాడు. నలుపుని తన ప్రతిమారూప చిత్రాల్లో అదేపనిగా ఉపయోగించిన ఫ్రెంచ్ ఇంప్రెషనిస్ట్ చిత్రకారుడు డెగాను ఈ విషయంలో తరచూ జ్ఞాపకం చేసుకుంటుంటాడు.
రామారావు చిత్రాలు ఇప్పుడు ప్రపంచం నలు దిక్కులా వ్యాపించి ఉన్నాయి. న్యూఢిల్లీ లోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ మొదలుకొని లండన్ లోని విక్టోరియా అంద్ ఆల్బర్ట్ మ్యూజియం, టెట్ గ్యాలరీ, న్యూయార్క్ లోని మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్, ది నేషనల్ గ్యాలరీ ఆఫ్ న్యూజీలాండ్, న్యుఫీల్డ్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాలు, ఆంధ్ర, తమిళనాడు, కేరళ ప్రభుత్వా చిత్రకళా ప్రదర్శన శాలల్లోనూ, ఇంకా ఎన్నెన్నో చోట్ల రామారావు చిత్రాలు ప్రదర్శించబడుతున్నాయి.
ఆదిలో ఒక రూపం తరువాతి క్రమ పరిణామంలో ఒక విలోమ రూపమై, సంస్కరింపబడిన రూపమై క్రమంగా చివరికి రూపరాహిత్యాన్ని చేరుకోవడం నైరూప్యతకు అత్యున్నత దశ. ఇదే హిందూమతంలోని నిర్గుణుడూ, అనంతుడూ అయిన దేవుడికి అర్థం. విచిత్రమేమిటంటే, నైరూప్య భావన తాత్వికంగా భారతీయమైనదే అయినా, నైరూప్య కళ మాత్రం పూర్తిగా పాశ్చాత్యమైనది. కానీ ఈ తేడా ఇప్పుడు లేదు. రామారావు చిత్రాలలో ఈ ప్రాక్పశ్చిమాలు కలిసి ఒకటైపోయాయి.
రామారావు సుమారు 15 సంవత్సరాల పాటు ఒక్క బొమ్మ కూడా గీయలేదు. నిజమైన కళాకారులు ఇలా మారడం సాధారణమే! ఏదో ప్రేరణ, కొత్త సృజనకి ఉత్తేజం తోడు అవసరం. 2001లో రామారావుకి భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదాన్నిచ్చింది. మళ్ళీ కుంచె పట్టుకోవటానికి బహుశా నిజంగా అది నిజమైన ప్రేరణ కాదు. ఇండియా వెళ్ళడం, అక్కడి ప్రదర్శనాలు విరివిగా చూడటం, చాలా మంది కళా విమర్శకులతో మంతనాలు చెయ్యడం, షికాగో స్నేహితుల ప్రోద్బలం – తూర్పు పడమరలని మళ్ళీ మరికొన్ని కొత్త పద్ధతులలో కళాత్మకంగా కలపడానికి ప్రోత్సహించాయి.
రామారావు గత పది సంవత్సరాలుగా బొమ్మలు వెయ్యడం మొదలుపెట్టాడు. బోర్డులు వదిలిపెట్టి, పెద్ద పెద్ద కేన్వాసులపై నైరూప్య చిత్రాలు వేయడం మొదలు పెట్టాడు. నైరూప్యభావప్రకాశకతకు ఒక రకమైన సహజత్వం, లేదూ భారతీయ సహజత్వం అనండి, తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాడు. 2005లో మద్రాసులో ఒక ప్రదర్శన జరిగింది. అక్కడ 30 పైచిలుకు కొత్త తైలవర్ణచిత్రాలు ప్రదర్శించాడు. ఇది బహుశా రామారావు కళాజీవిత నాటకంలో రెండవ నాంది. తరువాత, ప్రతి సంవత్సరం కనీసం ఆరు నెలలపాటు ఇండియాలో ఉంటూ, నూతన ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఢెల్లీ లోను, కలకత్తా లోను, బెంగులూరు లోనూ, కళా ప్రదర్శనలు జరగనున్నాయి.
నైరూప్యం నుంచి సారూప్యానికి వస్తున్నాడా అన్న అనుమానం కలగక పోదు, అతను వేసిన కొన్ని వర్ణచిత్రాలు, ముఖ్యంగా స్త్రీ చిత్రం, స్టిల్ లైఫ్ చిత్రం చూస్తే. అయితే, ఇప్పటికీ నలుపు ఒక ముఖ్యమైన రంగుగా, ధైర్యం చేసి వాడగలిగిన వాడు రామారావే; కాన్‌డిన్‌స్కీ తరువాత!
(ఆధునిక చిత్రకళలో స్త్రీ చిత్రాలు అనే మరొక వ్యాసం కొద్దినెలల్లో ఈమాట ద్వారా మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. ఫిజిక్స్ డిగ్రీ వచ్చింతరువాత కొన్నాళ్ళపాటు నిరుద్యోగిగా ఉండవలసిన అవసరం వచ్చి, ఊసుపోక ఆడిట్ చేసిన మోడర్న్ ఆర్ట్ అప్రీషియేషన్ కోర్సులు బహుశా ఇప్పుడు నాకు పనికి రావచ్చు. – వీవీఆర్.)
[ఈ వ్యాసం Poems in Pigment అనే ఇంగ్లీషు వ్యాసం కొన్ని సవరణలతో అనువదించబడి మొదట 1995లో తానా తెలుగు వెలుగులో ప్రచురించబడింది. కొత్తగా మార్పులూ చేర్పులూ చేసిన వ్యాసం ఈమాటలో ఇప్పుడు ప్రచురించాము – సం]