కొట్టివేత

ఫ్లాట్‌ నంబర్‌ను పోల్చుకున్నట్టుగా అతడు అక్కడ ఆగాడు. తలుపులు తీసేవున్నాయి. కానీ ఎవరూ కనబడలేదు. ఆ నడవాలో కాసేపు అలాగే నిలబడ్డాడు. ఈ రెండో అంతస్తు నుంచి దూరంగా కనబడుతున్న గ్రౌండులో కుర్రాళ్ళు క్రికెట్‌ ఆడుతున్న కోలాహలం వినబడుతోంది. అటోసారి చూసి, మళ్ళీ ఇంట్లోకి చూశాడు. ఈసారీ ఎవరూ కనబడలేదు. బెల్‌ ఒత్తడానికి సంశయించాడు. అది అమర్యాదగా కనబడవచ్చు. మనం చేరలేని స్థాయివాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉండే బెరుకు. ఎదురు చూసినప్పుడు నడుము దగ్గర పుట్టే అసౌకర్యాన్ని కాళ్ళు కదల్చడం ద్వారా పోగొట్టుకునే ప్రయత్నం చేశాడు. లోపల ఏదో మనిషి అలికిడైంది. ఎవరైనా వచ్చేసరికి గడపలోంచి చూస్తూవున్నట్టుగా కనబడటం ఇబ్బందిగా ఉంటుందనిపించి కొంచెం పక్కకు జరిగాడు. ఎవరో ఒకామె మరో గదిలోకి వెళ్ళబోతూ, ఈ నీడను గ్రహించి ఇటో అడుగు వేసి, మాటలతో ఆహ్వానించాల్సినంతటి మనిషి కాదన్నట్టుగా తన సహజమైన తెలివిడితో గ్రహించేసి, ఏంటన్నట్టుగా కళ్ళెగరేసింది. ‘సార్‌ కోసం…’. లోపలికి చేయి చూపిస్తూ, ‘కూర్చోండి’ అంది. చెప్పులు విడిచి లోపలికి వెళ్ళాడు.

పెద్ద సోఫా అంతా ఖాళీగా ఉన్నా ఒద్దికగా ఒంటి పిర్రెడు జాగాలో కూర్చున్నాడు, చేతిలోని ప్యాకెట్‌ను ముందున్న టీపాయ్‌ మీద కూడా పెట్టకుండా అలాగే పట్టుకుని. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. గోడమీద ‘సార్‌’ పెళ్ళప్పటి ఫొటో కావొచ్చు, పాతది గోడకు వేలాడదీసి ఉంది. కొంచెం పక్కన నలుగురిది ఫ్యామిలీ ఫొటో. ఇంకా ఒకట్రెండు వాళ్ళ పిల్లలవి అయివుండాలి; అటూయిటుగా తన ఈడువాళ్ళు. అలమారా అద్దాల్లో ఏవో బొమ్మలు. అవన్నీ ఒక్క చూపులో చుట్టేశాక, తన గుండె బరువు మీద దృష్టి పెట్టాడు. గట్టిగా గాలి పీల్చుకున్నాడు.

అలవాటైన మర్యాదతో ఒక గ్లాసుడు నీళ్ళు పెట్టడానికి ఇందాకటి స్త్రీ (పనామె అయివుండాలి) వచ్చినప్పుడు, సోఫాలో పూర్తిగా ఆన్చని నడుమెత్తి, ‘సా…రు’ అన్నాడు. ‘వస్తారు’ అంది. ప్యాకెట్‌ను తొడల మీద ఉంచుకుని రెండు బుక్కలు నీళ్ళు తాగాడు, ఆ ప్రదేశానికి అలవాటు కావడం కోసమన్నట్టుగా. గాజుగ్లాసును ఎత్తి తాగడం వల్ల, కొన్ని చుక్కలు అంగి మీద పడ్డాయి. గ్లాసు అడుగు తాకి సడి కాకుండా మెత్తగా దాన్ని టీపాయ్‌ మీద పెట్టి, తడిని చేత్తో దులుపుకుని, మూతి తుడుచుకుని, మళ్ళీ అవే గోడల్ని ప్రత్యేకంగా చూపు నిలపకుండా చూడసాగాడు.

ఉన్నట్టుండి ఆఫీసులో అతడికి మూడు నెలల నోటీసు ఇచ్చారు. ముందైతే గాబరా పడ్డాడు. ఊరెళ్ళిపోయి ఏదో ఒకటి చేసుకుని బతికేంతదూరం ఆలోచించాడు. కానీ ఇంకా టైముంది. ఉన్నట్టుండి తెలిసిన షాక్‌ నుంచి రెండు మూడు రోజులకల్లా క్రమంగా తెరిపిన పడ్డాడు. తనకున్న ఆప్షన్స్‌ ఏమిటో కాగితం మీద రాసుకున్నాడు. ఈ మూడు నెలల తర్వాత, తన సేవింగ్స్‌తో మరో మూడు నెలలు తన కుటుంబం ఈజీగా బతుకుతుంది. తర్వాత అవసరమైతే పీఎఫ్‌కు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈలోగా పాత ఆఫీసులో ప్రయత్నించొచ్చు. కానీ చేసినచోట చేయడం ఎందుకో బాగుండదనిపించింది. ఏదో సందర్భంలో కరుణ, ‘నేనుండగా మీకేంటండీ’ అన్నాడు. ఆ భరోసాతోనే ఫోన్‌ చేస్తే, అవి బోలుమాటలు కాదని నిరూపిస్తూ, ఓ వారం తర్వాత ఒక రిఫరెన్స్‌ ఇచ్చాడు. ఇంప్రెస్‌ అయ్యి ఆయనో మాట చెబితే కచ్చితంగా పనవుతుందనీ, ఆఫీసుకు వెళ్ళకుండా ఇంటికెళ్ళి కలవడం మంచిదనీ సలహా కూడా ఇచ్చాడు. కానీ తనకే తెలియని భయం లోపల. ఉద్యోగం పోయిన భయానికి అలవాటు పడ్డట్టుగానే ఈ ఆఫీసరు దగ్గరకు రావడానికి తగిన మానసిక స్థితిని కూడగట్టుకోవడానికి ఇవ్వాళ్టి సాయంత్రమైంది. మళ్ళీ బస్సులో వచ్చి ముడతలు పడిన చొక్కాలో కనబడకుండా ఆటో మాట్లాడుకుని వచ్చాడు. అప్‌డేట్‌ చేసిన రెస్యూమేతో పాటు, భార్య సలహా మేరకు మర్యాద కోసం పుల్లారెడ్డిలో ఓ అరకేజీ కాజూపాక్‌ కూడా ప్యాక్‌ చేయించాడు. అపార్ట్‌మెంటు ముందు ఆటో దిగేదాకా ఉన్న మామూలుతనం ఇంటి గడప దాకా రాగానే మాయమైంది.

ఆఫీసరు అనగానే తెలియని భయం ఎందుకు కలుగుతుంది? పెళ్ళి ఫొటోలో ఆయన మామూలుగానే ఉన్నాడు. కానీ పాత ఫొటోల్లోని మనుషులకూ, కొత్త ఫొటోల్లోని మనుషులకూ కొట్టొచ్చినట్టు తేడా ఎందుకు కనబడుతుంది? తాను వెయిట్‌ చేస్తున్నట్టుగా చెప్పివుంటుందా? అసలు తెలియని మనిషిని ఎదుర్కోవడమే పెద్ద భయం. ‘ఉ ఊఊ’. ఇందాకటి స్త్రీ కూరగిన్నెతో బయటికి వెళ్ళబోతూ, గ్లాసు తీయలేదని చప్పున స్ఫురించినట్టుగా టీపాయ్‌ మీది గ్లాసు తీసుకెళ్ళి, మళ్ళీ తిరిగివస్తూ, అతడికో జవాబు బాకీ ఉన్నట్టుగా, ‘వస్తున్నా’రన్నట్టుగా వెనక్కి చేయి చూపించి బయటికి వెళ్ళిపోయింది. అతడు తల ఊపుతూ నడుమును సర్దుకున్నాడు. ‘ఉ ఊఊఊ’. ‘ఉ ఊఊఊ’. ఒక మగాయన కఫపు గొంతు (ఆఫీసర్‌దే అయివుండాలి). వాష్‌బేసిన్లో ఉమ్మి, నీళ్ళు విప్పిన చప్పుడు. ‘ఉ ఊఊఊ ఉ ఊఊఊఊ’. అది పూర్తిగా క్లియర్‌ కావట్లేదు. మొత్తం శరీరాన్ని కూడదీసుకుని గట్టిగా కాండ్రిస్తున్నాడు. తెలియకుండానే ఇతడు గొంతు సవరించుకున్నాడు. ఉఊ ఉఊ. ‘ఊఊఊఊఊఊ’. ఆ మొత్తం శరీరాన్ని ఆ చిన్నపాటి జారుడుపదార్థం అతలాకుతలం చేస్తున్న బీభత్సం. తర్వాత అది దగ్గులోకి మారి, ఒక బలమైన కాండ్రింపు తర్వాత శరీరం నెమ్మదించింది.

‘తుమ్ము, దగ్గు, ఆకలి, నిద్ర ఏ మనిషికైనా సహజంరా.’ చిన్నప్పుడు రాజమౌళి సర్‌ పాఠం చెబుతున్నాడు. ‘ఇంకొకటి కూడ సార్‌.’ కృష్ణహరి చేసిన సంజ్ఞకు అందరూ కిల్లుమన్నారు. ‘హెచ్చెమ్‌ సార్‌ కూడనారా?’ శీనుగాడి కొనసాగింపు. మళ్ళీ అందరూ పడీపడీ నవ్వారు. ‘కడుపుబ్బరంగా ఉన్నప్పుడు ఎవరికైనా తప్పదురా’ అంటూ ముందు శీనుగాడి, తర్వాత కృష్ణహరి చెవుల్ని రెండు చేతులతో నులిమాడు సర్‌. అందరూ అని తెలియడం వేరు, మన హెడ్మాస్టర్‌ కూడా అని తెలియడం వేరు. మనుషులందరూ ముందు మామూలు మనుషులే అన్న పాఠం ఈ సామాజిక అంతరాల్లో, ఈ హోదాల గోదాల్లో ఎట్లాగో మరపున పడిపోతుంది! వాష్‌బేసిన్లో మళ్ళీ నీళ్ళ చప్పుడు. తెల్లారి ప్రార్థన సమయంలో ఆ పెద్ద మీసాల హెడ్మాస్టర్‌ను చూడగానే మొట్టమొదటిసారి అతడికి భయం పోయి నవ్వొచ్చింది. ఆ తలంపు తెచ్చిన నవ్వును చెంపల్లోనే అణుచుకున్నాడు. ఇంట్లోకి వచ్చినప్పుడు ఒంట్లోకి ప్రవేశించిన భయం సద్దుమణిగింది. స్వీట్‌ప్యాకెట్‌ను టీపాయ్‌ మీద పెట్టి, కాళ్ళు కొంచెం ఎడం చేసుకుని, సోఫాకు ఒరిగి కూర్చున్నాడు.