నాకు నచ్చిన పద్యం: భీష్మస్తుతి

సీ. కుప్పించి ఎగసినఁ గుండలంబుల కాంతి
            గగన భాగంబెల్లఁ గప్పి కొనఁగ
    నుఱికిన నోర్వక యుదరంబులోనున్న
            జగముల వ్రేఁగున జగతి గదలఁ
    జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ
            బైనున్న పచ్చని పటము జాఱ
    నమ్మితి నాలావు నగుఁబాటు సేయక
            మన్నింపు మనిక్రీడి మఱల దిగువఁ

తే. గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి
    నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
    విడువు మర్జున! యనుచు మద్విశిఖ వృష్టిఁ
    దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.

చాలా ప్రసిద్ధమైన ఈ పద్యం భాగవతం లోనిది. కవి బమ్మెర పోతన. భీష్ముడు పలికిన పలుకులివి.

భారత యుద్ధంలో పదకొండు రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై పరుండి, ఉత్తరాయన పుణ్యకాలం కోసం ఎదురుచూస్తున్న భీష్ముణ్ణి చూడడానికి యుద్ధానంతరం కృష్ణుని తోడ్కొని పాండవులు వస్తారు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుని చూసి భీష్ముడు చేసిన స్తుతిలో భాగం ఈ పద్యం. శ్రీకృష్ణ పురస్సరులై పాండవులు భీష్ముని దగ్గరకు వచ్చిన సమయంలో అనేక రాజర్షులూ, దేవర్షులూ, బ్రహ్మర్షులూ శిష్యసమేతంగా వచ్చారట. ఆ సందర్భమే ఒక చిత్రమైన సన్నివేశం.

అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర. ఆయన “మహోగ్రశిఖర ఘన తాళతరువగు సిడము వాడు” – అంటే ఆయన ధ్వజం గుర్తు తాటిచెట్టు. దానిలాగా ఏ వందలాది భారత పాత్రలలో అందరికంటే ఎత్తుగా కనిపిస్తాడు భీష్ముడు. శీలంలోనేమి, శౌర్యంలోనేమి, నీతిలోనేమి, నిష్ఠలోనేమి భీష్మునికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచీ ఆయన త్యాగపురుషుడే. తండ్రి కొరకు స్వసుఖాన్నీ, రాజ్యాన్నీ అన్నీ వదులుకున్నవాడు భీష్ముడు తప్ప మరొకడు లేడు. యయాతి పుత్రుడైన పూరుడు తండ్రి చేత అడగబడి, కొంతకాలం పాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు. కాని, భీష్ముడు తనంతట తానే తండ్రి సుఖం కొరకు తన వారసత్వ హక్కయిన రాజ్యాన్ని త్యాగం చేయడమే కాక – భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారేమో అన్న అనుమానం వెలిబుచ్చబడినప్పుడు – వివాహాన్నే ఒద్దనుకున్నాడు. తన తమ్ములు చనిపోయిన తర్వాత గూడా, తన భీష్మ ప్రతిజ్ఞకు కారణం అయిన సత్యవతీ దేవి స్వయంగా ఆజ్ఞాపించినా తన ప్రతిజ్ఞను భంగం చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు.

శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాడని, ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడని – శ్రీకృష్ణుని సమకాలికులలో ఎరుక గల్గిన అతికొద్దిమందిలో భీష్ముడు ముఖ్యుడు. తన భక్తిని ఎక్కువగా ప్రదర్శించకపోయినా మహాభక్తుడు భీష్ముడు ముఖ్యుడు. అందుకే ఆయనను మహాభక్తుల కోవలో ప్రైగణించారు విజ్ఞులు, “ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీశ, శుక, శౌనక, భీష్మ దాల్భ్యాన్” అంటూ. అంతే కాదు, ఆయన మహా విజ్ఞాని. ఎన్ని ధర్మాలు తెలుసు ఆయనకు! రాచకార్యాల్లో తలమునకలు కాని సమయమంతా అధ్యయనంలోనే గడిపి ఉంటాడు. తనకు తెలిసిన ఆ విజ్ఞానాన్నంతా ధర్మజునకు బోధించాడు. భారతంలో శాంతిపర్వం, అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. ఇక పద్యంలోకి వద్దాం.

అటువంటి పరిపూర్ణ పురుషుడైన భీష్ముడు తన ఆఖరు క్షణాలలో పాండవులతో కలిసి తనను పరామర్శించడానికి వచ్చినపుడు, ఎంతో పారవశ్యంతో కృష్ణుని స్తుతిస్తూ యుద్ధంలో జరిగిన ఒక సన్నివేశాన్ని నెమరు వేసుకుంటాడు. మామూలు సన్నివేశమా అది! కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైన మొదటి రోజు ఏమీ విశేషం లేకుండానే గడిచిపోయింది. రెండో రోజు కొంచెం సేపు భీష్మార్జునులు తలపడ్డారు. మూడోరోజు భీష్ముని యుద్ధపరాక్రమం భయంకరంగా ఉంది. అర్జునుడు ఎదుర్కొన్నాడు కానీ భీష్ముడు విజృంభిస్తున్నాడు. సారధి అయిన కృష్ణుడిని కూడా ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అర్జునుడు అలసిపోవడం కృష్ణుడు గమనించాడు. కేవలం అర్జునుని ఉత్సాహపరచడానికే కాక, భీష్ముడూ తనకూ ఊపిరాడకుండా చేస్తున్నందున కృష్ణునికి నిజంగానే కోపం వచ్చింది. భీష్మద్రోణాదులనండర్నీ చంపి పారేస్తానని లేచాడు. రథం పగ్గాలు నొగలకు కట్టాడు. స్మరించగానే చక్రం చేతిలోకి వచ్చింది. రథం మీద నుంచి చెంగున దూకాడు. భీష్ముని చంపడానికి ముందుకు కాలు సారించాడు. మామూలు సైనికులందరూ దూకబోయే పులిని చూసిన లేళ్ళలాగా చెల్లా చెదరైనారు. కౌరవులందరూ నిలుగు గుడ్లేసుకుని చూస్తున్నారు. భీష్ముడు ఏమాత్రమూ తొట్రుపాటు లేకుండా, మిక్కిలి ప్రియంగా, రావయ్యా, వేగంగా వచ్చి నన్ను కృతార్ధుణ్ణి చెయ్యవయ్యా అని వేడుకున్నాడట (ఇది తిక్కన వర్ణన). పోతనగారి భీష్ముడు ఆ దృశ్యాన్ని ఒక్కసారి కనుల ముందుకు తెచ్చుకున్నాడు పైపద్యంలో.


(ఇంటర్నెట్ ఆర్కైవులనుండి)

నొగల మీదనుంచి కుప్పించి ఎగసి నేల మీదకి దూకేటప్పుడు కృష్ణుని చెవుల రత్నకుండలాలు కిందికీ పైకీ ఊగి వాటి కాంతి ఆకాశమండలాన్నంతటినీ కప్పుకున్నదట. ఒక్కసారిగా ఎగిరి దూకేసరికి ఆయన కుక్షిలో ఉన్న భువనాల బరువుతో భూమి అదిరిపోయిందట. ఆయన భుజాల మీద వున్న పీతాంబరం ఒకవైపు ఆ ఒడుపుకు జారిపోతున్నదట. కృష్ణుని యొక్క ఈ ఊహింపని చర్యను చూసి అర్జునుడికి గొప్ప రోషం వచ్చింది. తనూ దిగి కృష్ణుని ఒక కాలును (పాదాన్ని కాదు) పట్టుకుని నిలిపే ప్రయత్నం చేశాడు. కానీ కాలుక్కరుచుకున్న అర్జునుణ్ణి పది అడుగుల దూరం లాక్కునిపోయాడు కృష్ణుడు. అర్జునుడు రోషంతోనూ, తన చాలిమిని ఎత్తిచూపినందువల్ల కలిగిన అవమానంతోనూ, నా యోగ్యతను నగుబాటు చెయ్యకని వేడుకుంటున్నాడు. ఏనుగు మీదకి లంఘీంచే సింహంలా ఉరకలు వేస్తూ – ‘ఇవాళ భీష్ముణ్ణి చంపి నీ మార్గాన్ని నిష్కంటకం చేస్తాను, నన్ను ఒదిలిపెట్టు అర్జునా అని అంటూ’ – ముందుకొస్తున్న ఆ మహానుభావుడు – నా బాణాల దెబ్బకు వడలి, ఉత్తేజితుడైన ఆ పరమేశ్వరుడు – నాకు దిక్కగు గాక! అని స్తుతించిన సందర్భంలోనిది ఈ పద్యం. ఒక గొప్ప సన్నివేశానికి ఎంతో చక్కని రూపకల్పన ఈ పద్యం. పద్యం చదివిన, తలచుకున్న ప్రతివారికీ ఆ కుండలాల కాంతీ, ఆ చేలాంచలం జారడంలోని సొగసూ, ఆ చక్రమూ, కాలుక్కరచుకున్న అర్జునుడూ, అతన్ని లాగుతూ ముందుకు వస్తున్న కృష్ణుడు, ఈ గొప్ప సందర్భాన్ని చిరునవ్వుతో, పారవశ్యంతో చూస్తూ కృష్ణుణ్ణి ఆహ్వానిస్తున్న భీష్ముడు – ఇవన్ని కండ్లలో మెదలక మానవు. అంత గొప్ప పద్యమిది, ఎవరికి నచ్చదు!

ఇంకొక చిత్రం ఉన్నది ఈ సందర్భంలో. అంపశయ్య మీద ఉన్న భీష్ముని దగ్గరకు పాండవులూ, కృష్ణుడూ వచ్చినప్పుడు ఇతరులకు మామూలుగా కనిపించిన కృష్ణుడు భీష్మునికి మాత్రం, “సర్వేశ్వరుండఖిల దేవోత్తంసుడెవ్వేళ ప్రాణంబు లేను విడుతు నందాక నిదె మంధాసుడై, వికసిత వదనార విందుడై వచ్చి నేడు నాల్గు భుజములు కమలాభనయన యుగము నొప్ప కన్నుల ముందటనున్నవాడు, మానవేశ్వర నా భాగ్యమహిమ జూడు మేమి జేసితినొ పుణ్యమితని గూర్చి” అని అంటాడు. ఆ మహాత్ముని కంటే ధన్యులెవరుంటారు చెప్పండి.

భీష్ముని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, మరో అంశం కూడా చెప్పాలనిపిస్తున్నది. తన ఆఖరి శ్వాస వదలబోతూ, శ్రీకృష్ణునికి చేతులు జోడించి ఇలా అంటాడు భీష్ముడు:

“బలము నీవ నాకు భక్తుండ నీ యెడ! లాలుబిడ్డ లేని యట్టివాడ!
గావునన్ను నధిక కారుణ్యమున నిమ్మనుజ్ఞ కమల దళమనోజ్ఞ నయన!”

(భారతం – అనుశాసనిక పర్వం, పంచమాశ్వాసం.)

నా మట్టుకు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ పద్యం చదివి. స్వీయేచ్ఛతో కుటుంబ జీవనాన్ని త్రుటిలో వదిలేసిన భీష్ముడు తన సుదీర్ఘమైన జీవితంలో ఏనాడూ భార్యా పిల్లలు లేరని చింతించిన సందర్భం లేదు. చనిపోయే సమయంలో “ఆలుబిడ్డ లేని యట్టివాడ కావు నన్ను నధిక కారుణ్యమున..” అని అర్ధించడం నాకు చాలా చిత్రం అనిపిస్తుంది. ఒక పరమ పావనమైన గర్భం నుంచి ఉద్భవించి మహోజ్వలమైన జీవితం గడిపిన భీష్ముడు, ఆలుబిడ్డల్లేకపోవడం అనేదాన్ని కొరతగా భావిస్తూ బాధపడేవాడా? అది నిజంగా కొరతేనా? అది పరమ భాగవతోత్తముడైన భీష్ముని కంటే బాగా ఎవరికి తెలుస్తుంది!

భీష్మస్తుతి పద్యాల్లో ఈ ఒక్క పద్యమే కాదు, అన్ని పద్యాలూ అనర్ఘ రత్నాలే. త్రిజగన్మోహన, హయరింఖాముఖ, నరుమాటల్విని, ఒక సూర్యుడు – లాంటి పద్యాలన్నీ ప్రసిద్ధమైనవే. అవన్నీ నాకు బాగా నచ్చినవే. పైపద్యం మరీనూ.