సీ.
తీర్థమాడె నఖండ దీపకళిక
అగరు, గుగ్గుళు, మహిషాక్ష ధూమమ్ముతో
గాజువారినది నీరాజనమ్ము
చందనచర్చా మచర్చికా కలనతో
జేయి కల్పిన దభిషేక ధార
షడ్రసీగ్రాస సంసద్భుగభుగలతో
జిగురువట్టిన దాజ్య జీవనమ్ము
తే.
వివిధ తోరణకాంతు లావిష్కరించు
పసని నిగ్గులు తమ పటాభరణములకు
నభినవావేశనేపథ్య మలవరించె.
కాకతీయ చక్రవర్తిని రుద్రమదేవి ఏకశిలా నగరంలోని విఘ్నేశ్వరాలయానికి పూజ నిర్వర్తించడానికి ప్రవేశించింది. ఆ సందర్భంలో ఆలయం అంతర్భాగంలో పూజాసమయ దీపనీరాజనాదికాలను వర్ణించే పద్యం ఇది. దీపాన్నీ, ధూపాన్నీ, హారతినీ, అభిషేకాన్నీ, కాంతి తోరణాలనూ- ఆఖరుకు ప్రమిదలోని నూనెనూ రూపించిన తీరూ, ఆ దేవాలయ నేపథ్యం రాజకుటుంబ సభ్యుల పటాభరణాదులకు పసని నిగ్గులు కూర్చే నవ్యాలేపనంగా అమరిపోయిన చందమూ, ఎంతో సహజ సుందరంగా కన్నులముందు ఆవిష్కరిస్తోన్న పద్యం. ఇది రుద్రమదేవి అనే ఒక చిన్న కావ్యంలోనిది. ఏతత్కావ్య కర్తకు కవిబ్రహ్మ అనే సార్థకమైన ఉపనామం కూడా ఉన్నది.
అవును. కావ్యం పేరు చెప్పినా, కవి బిరుదు చెప్పినా తటాలున ఆ కవి పేరు ఎంతమంది పద్యప్రియులకు స్ఫురిస్తుందో అనుమానమే. చాలా సకృత్తుగా మాత్రమే తలచబడే ఆ సత్కవి ఏటుకూరి వేంకట నరసయ్యగారు.
ఏటుకూరి వేంకట నరసయ్యగారు పద్యవిద్యలో సిద్ధహస్తులు. ఆంధ్ర సాహిత్య మాగాణంలో అనర్ఘమైన కావ్య సస్యాలను పండించి, ఆంధ్రికి ఆమెతలు వెట్టిన మధుర కృషీవలులు. క్షేత్రలక్ష్మి సిద్ధాశ్రమము, ప్రేమాలోకము, నాయకురాలు, వీరభారతము, బాలచంద్రుడు, మగువ మాంచాల, రుద్రమదేవి, మొదలైన పెక్కు కావ్యాలను రచించి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన కవితల్లజులు. వారు బ్రతికినది కేవలం 38 సంవత్సరాలే. ఆ పసివయసులోనే అంత విశాలమైన సాహిత్య సృష్టి కావించడం వారి అకుంఠిత సారస్వత దీక్షకూ ప్రజ్ఞకూ నిదర్శనం.
కవి జీవనకాలం భారతదేశ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టానికి సాక్షిప్రాయమైనట్టుంది. పరప్రభుత్వ ఆధిపత్యం క్రింద అణగిపోతున్న జాతి స్వేచ్ఛకోసం ఉద్యమిస్తున్న రోజులవి. కవులూ గాయకులూ ఇతర కళాకారులూ తమ కళా రూపాలతో ఉధృతంగా జన హృదయాలను ఉద్బుద్ధంగావిస్తున్న కాలం. కేవలం రాజకీయాధిపత్యమే కాక పద సంస్కృతి కూడా–ఇక్కడి సంస్కృతిని అణచివేస్తున్న పరిస్థితిని చూస్తూ–తమ మూలాలను, తమ పూర్వౌన్నత్యాన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ తమ జాతీయతను కేతనంగా ఎగురవేస్తున్న రోజులు. మన వీరులను, మన జాతి గరిమనూ ఉగ్గడించే రచనలు జాతీయ మహోద్యమంలో భాగంగా అమరిపోయిన వేళ అది. శివభారతము, రాణా ప్రతాప చరిత్ర లాంటి మహాకావ్యాలు వెలువడ్డాయి. ఆంధ్ర జాతీయత కూడా విశాల భారతీయతలో భాగంగా కీర్తించబడుతూ ఆంధ్రావళి, ఆంధ్ర ప్రశస్తి, ఆంధ్ర పురాణము లాంటి కావ్యాలు కూడా ‘నాదు భాష, నాదు దేశమన్న ఒక మహావేశ దర్శనమ్ము’ను అందించిన గ్రంథాలే. అటువంటి సమయంలో కలం పట్టిన వేంకట నరసయ్యగారి కవి హృదయం ఆ మహావేశాన్ని అందిపుచ్చుకోకుండా ఎలా ఉండగలదు? ఆంధ్ర రాజకీయ చరిత్రకు మకుటాయమానమైన రుద్రమదేవి గాథ, స్థానిక వీరగాథాంతర్భాగాలైన నాయకురాలు, మగువ మాంచాల, బాలచంద్రుడు లాంటి వారి కథలూ, వేంకట నరసయ్యగారి చేతిలో పునః ప్రాణప్రతిష్ఠ కావించబడ్డాయి. అలా వారు సృష్టించిన విస్తృత సాహిత్యం, జాతీయోద్యమంతో పెనవేసుకుని సందర్భ శుద్ధినీ, సంకల్ప సిద్ధినీ కూడా సాధించింది.
రుద్రమదేవి కావ్యము 335 పద్యాలతో, 13 ద్విపదలతో నివ్వటిల్లే చిరు కావ్యము. పరిమాణములో చిన్నదైనా కవితా సౌందర్యములోనూ, సన్నివేశ కల్పనలోనూ, కథా నిర్మితిలోనూ మిన్నయైన కావ్యం.
కవి వృత్తిరీత్యా కృషీవలులు. జానపద సౌందర్యాన్నీ, సంప్రదాయాల కమనీయతనూ గుండెల్లో నింపుకున్నవారు. ఆ నేపథ్యం వలన కమ్మటి తెలుగు జాతీయాలూ, పలుకుబడులూ వారి పద్యాల్లో బహుళంగా మెరుస్తుంటాయి. పై పద్యమే చూడండి: తీర్థమాడుట, గాజువారుట, చేయికల్పుట, చిగురుపట్టుట, పసని నిగ్గులు లాంటి పలుకుబడులు ఎంత సొగసుగా ఉన్నాయో! ‘చేజిడ్డు నొరయని’ అనేది ఎంత నిసర్గంగా ఉంది! జనం నోళ్ళల్లో నానివున్న ఇలాంటి పదబంధాలనలా వుంచితే, రుద్రమదేవి కావ్యంలో ఎడనెడా కవిగారు చెప్పే నిత్యసత్యాలైన సూక్తులు కూడా అభివ్యక్తి వైచిత్రితో కలిసి ఎంతో మధురంగా కుదిరిపోయాయి.
మచ్చుకు రెండుమూడు మనవి చేస్తాను. చిత్తగించాలి.
‘నీళులన్ నమలుట పాడిగాదు నరనాయక’
‘వేళకు గ్రుక్కెడు ద్రావ నోచిరే’
‘ఏ నిప్పుల పాదులందివి జనించెనో’
‘మడమ ద్రిప్పక నిప్పైన పిడికిలింతురు’
‘అతనిపై గాలినైన జిట్టాడనీక’
‘ప్రక్కలోని త్రాచుబాముల జోకొట్టి ఎంతకాలమాతడేలగలడు’
‘కాల కిరాతుడే కుదుటికే బాణమ్ము సంధించునో’
‘మాన హాని కంటె మరణముత్తమమండ్రు చీము నెత్తురున్న జీవికెల్ల’
వేంకట నరసయ్యగారి పద్యాల ధార అబ్బురం కలిగిస్తుంది. వారిది అపారమైన శబ్ద సంపద. ఛందస్సును ఆయన విధేయం కావించుకున్న తీరు కూడా ‘ఆహా’ అనిపిస్తుంది. సంస్కృత సమాస కల్పనకూ, ధారకూ ఈ పద్యం తిలకించండి:
వారల దేవిడీ వెలువరించిన దేవగిరి ప్రభుండు, కి
మ్మీర మణి ప్రభాపటల మిశ్రిత విస్తృత చంద్రశాలికా
గార సుగంధ పుష్ప పరికల్పిత తల్పముసేరి, నిద్రకే
గూరడు – కాకతీయ నృప గోత్ర విమర్దనకేళి లోలుడై
మరొక్కటి…
అరుగో భూపతి పుత్రులిర్వురు ప్రభాతాయాత మందానిలాం
కుర సంస్పర్శకు నుల్లసిల్లు చుదయద్గోధూమవర్ణ ప్రభా
కిరణ స్నానములాడుచున్, విహగ సంగీతమ్ము లాలించుచున్
తురగోత్తంసములెక్కి దేవగిరి తెన్నుల్ పట్ట రాపన్నులై
ఆ సోదరులెక్కిన గుర్రాలధాటి పద్యంలో కూడ కనిపిస్తున్నది కదా!
వేంకట నరసయ్యగారు గొప్ప భావుకుడు. ప్రకృతి సౌందర్య వర్ణన పట్టుల పరవశించి అందమైన దృక్చిత్రాలను రూపుకట్టిస్తారు. ఈ క్రింది చరణాలు చిత్తగించండి.
ఒడయడరసి మరలె, నుదయ సంధ్యాదేవి
మొలక మంచులోన జలకమాడె,
తూర్పు కొండచరుల దోబూచులాడెడి
ప్రొద్దు పొగడబంతి పొలుపుగులికె.
కాకతీయ సౌధ కలధౌత శిఖరారు
ణాతప ప్రవాహమవని కురిసె
పసిడి గచ్చు చమిరి – పటికార్చిన విధాన
పొంగిపొరలిబారె ప్రాంగణమున
సామాన్య ప్రజా జీవనంతో ఎంతో మమేకమైనవారికే, మొలక మంచు, పసిడి గచ్చు, పటికార్చుట లాంటి జీవద్భాష అలవడుతుంది.
మరో సందర్భం మనవి చేస్తాను. హరిహర మురారిదేవులు రుద్రమదేవికి వ్యతిరేకంగా తాము సాగించే పోరాటంలో తమకు సాయపడే వీరుల గురించి దేవగిరి రాజుకు చెప్పే సన్నివేశంలోని పద్యం ఇది.
కొప్పెర జంగదేవు డుడుకుంఘట, మల్లడ పెమ్మయాధిపుం
డుప్పెన పెట్టు, పాండ్యపతులొట్టిన మంటలు, వల్లభాగ్రణిన్
చెప్పెడిదేమి – యిందరు విశేష మహాభుజులస్మదర్థమై
నిప్పులు గ్రక్కుచుండ గమనింపరె దేవగిరి ప్రభూత్తముల్
ఉడుకుఘటము, ఉప్పెనపెట్టు, ఒట్టినమంటలు, నిప్పులు గ్రక్కుటలాంటి మెరుపు పదాలనలా ఉండనీయండి; ఇలాంటి సొబగు నుడులు వీరి చాలా పద్యాల్లో కనబడతాయి. పై పద్యం చదువుతుంటే భారతోద్యోగ పర్వంలో తన రాయబార సమయంలో సంజయుడు ధర్మజునితో పాండవ, కౌరవ వీరుల గురించి వివరించే రెండు పద్యాలు తటాలున జ్ఞాపకం వస్తాయి. ఆ పద్యాలు ఇవి. చిత్తగించండి.
పెట్టని కోట నీకు హరి, భీముడు నర్జునుడున్ రణమ్మునన్
దొట్టిన మంట లా కొలది యోధులె సాత్యకియున్ విరాటుడున్
చుట్టపు మేరు వుగ్రరణ శోభితుడా ద్రుపదుండు, నిన్నుని
ట్టట్టనవచ్చునే సురలకైనను నొల్లవుగాక చివ్వకున్
ద్రోణుడు భీష్ముడున్ కృపుడు ద్రోణసుతుండును కర్ణశల్యులున్
ప్రాణములా సుయోధనుని పాలివయండ్రు, నిజానుజన్ముల
క్షీణపరాక్రముల్, సుతు లజేయులు, బాహ్లిక సోమదత్తు లా
స్థాణునికైన నోడరు, వశంబె జయింపగ వారి నేరికిన్
తిక్కన ప్రభావం చాల స్పష్టంగా కనిపిస్తుంది వేంకట నరసయ్యగారి పద్యాల్లో. బహుశా ఇలాంటి పట్టులను పట్టుకొనే వీరికి కవిబ్రహ్మ అనే బిరుదు వచ్చి వుంటుంది. (కవిబ్రహ్మ అనేది తిక్కనగారి బిరుదుకూడా కదా!)
వేంకట నరసయ్యగారు మధ్యాహ్న వేళ కూడా కాకుండానే అస్తమించిన మార్తాండుడు. తన క్లుప్త జీవనకాలంలో దీప్త కావ్యాలను వెలయించిన గొప్ప కవి. కానీ వారికీ వారి కృషికీ రావలసినంత గుర్తింపు రాలేదని తలచుకొంటే విషాదంగా ఉంటుంది. తమ వ్రాతలలో జాతిని ఉద్బుద్ధం కావించిన మహాత్ములను మరచిపోవడం ఏ జాతికీ శ్రేయస్కరం కాదు. వేంకట నరసయ్యగారు తెలుగువారు మరచిపోరాని కవి. కవి బ్రహ్మగా అన్వర్థ యశస్వి!