బలానికి పాలు
జేబులో బలపాలు
అలవాటైన బాల్యపు రోజుల్లో
అ – అనే అక్షరమే
అమ్మలా లాలించింది.
నూనూగు మీసాల తొలియౌవనంలో
తేనెలూరే కలల తీయని మత్తులో
అందమైన హిందీపాట
అందీఅందని ప్రేయసిలా ఊరించింది.
బ్రతుకు పోరాటంలో బయల్దేరినప్పుడు
అపరిచితమైన దూర తీరాలు చేరినప్పుడు
ఆప్త మిత్రునిలా ఆంగ్లభాష
భుజం మీద చెయ్యివేసి నడిపించింది.
ఇన్నాళ్ళు గడిచాక ఇప్పుడు
నేను కూడా మా అమ్మాయి పాఠాలు చదివి
స్పానిష్ నేర్వగలనేమోనన్న ఆశ
నడివయసు సంక్షోభం నుంచి దాటించే
నావలా కనిపించింది.
అలౌకిక ఆనందంలా
ఎప్పటికైనా అందుకోమని
సుదూర ఆకాశంలో సంస్కృతం
జీవితాంతం మెరుస్తూనే ఉంటుంది.