విన్నకోట రవిశంకర్ ‘రెండోపాత్ర’: ఒక పరిచయం

ఇది సంకలన ‘సమీక్ష’ కాదు, ‘విమర్శ’ కాదు. కేవలం ఒక పరిచయం. చిరు పరిచయం.

రవిశంకర్ ఈమాట పాఠకులకు చిరపరిచితులు. ఆయన కవితలూను. ఈ ‘రెండోపాత్ర’ సంకలనంలోని కవితలు కొన్ని ఇదివరకు ఈమాటలో వెలువడ్డాయి కూడ. కాని, ఇంతకు ముందు చూడనివి ఎన్నో, చూసిన కొన్నిటితో జట్టుకట్టి అవన్నీ ఒక ప్రత్యేక క్రమంలో ఇక్కడ కలగలిసి ఒక కొత్త ఉనికిని సంతరించుకున్నాయి.


రెండో పాత్ర – విన్నకోట రవిశంకర్
ముద్రణ 2010. వెల రూ. 15/- $5.
అన్ని బుక్‌షాపు‌లలో లేదా
రచయిత నుండి లభ్యం

భావుకుడిగా, తనదైన ముద్రతో తనకోసం తన అనుభవాలని, ఆలోచనలని తేలిక మాటల్తో తెల్లటి కవితల్లో ఆవిష్కరించే కవిగా రవిశంకర్ పరిణతి ఈ సంకలనంలో స్పష్టంగా కనిపిస్తుంది. ముందుచూపు, మంచితనమ్మీది మాయని నమ్మకంతో పాటు ప్రపంచాన్ని చూసి జీవితానుభవాల్ని కాచి నిరాడంబరంగా నిక్కచ్చిగా అక్షరీకరించే నిబ్బరం నిలువెత్తునా నిలబడుతుంది. ఇదివరకు కనిపించని రవిశంకర్ ‘రెండోపాత్ర’ కూడ ఈ సంకలనంలో యవనిక తెరుచుకుని ప్రవేశిస్తుంది.

ఇంతకు ముందు వచ్చిన సంకలనాలకీ దీనికీ మధ్య నాకు గోచరించే ఒక పెనుమార్పు, ఇప్పటికి కవి తన ఉనికిని హృదయస్థం చేసుకోవటం. అదివరకు ‘అక్కడా, ఇక్కడా’ మధ్య అస్పష్టంగా ఊగిసలాడిన ఉనికి తన స్థానం ‘ఇక్కడే’ అని గ్రహించటం.

నాకు అనిపించేదేమంటే – అమెరికా జీవనగమన లయకు ఇప్పడు ఈ కవిత్వంలో ప్రతిధ్వని వినిపిస్తోందని; ఇక్కడి పరిసరాలు దృశ్యాలు చిత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని; ఇన్నాళ్ళూ ఒక అనిష్ట ప్రేక్షకుడిగా తనచుట్టూ కదులుతున్న దృశ్యాల్ని అస్పష్టంగా చూసిన కవి ఇప్పుడు తనూ ఒక పాత్రధారి అయ్యాడని.

కవిని కదిలించే దృశ్యాలు మారాయి. చుట్టుకునే ప్రపంచం పెద్దదయింది. చుట్టూ ఉన్న భౌతిక పరిసరాలతో పరిచయాలు పెరుగుతున్నాయి. ఇలా చూడండి –

ఆటవిడుపు కోసం నడిచివద్దామని
బయటకి అడుగు పెట్టానో లేదో
బాట పక్కన పూలమొక్కలన్నీ
బిలబిలమంటూ పలకరిస్తాయి (నడక)

యజ్ఞం అనే కవితలో –

ఏ కొత్తవస్తువు తాకినా
అజ్ఞాత సృష్టికర్తల ఆనవాళ్ళు
తడితడిగా తగుల్తాయి
సుదూర ప్రాంతాల జీవనగాధలు
అంతరంగంలో వినబడతాయి

అనే గళం చాలా కొత్తది. అలాగే,

చల్లటి మధ్యాహ్నం వేళ
డౌన్ టౌన్ లో నడక
అంతగా జనసంచారం లేని వీధి

అని మొదలయ్యే ‘తేడా’ కూడా రవిశంకర్ కవిత్వంలో ఒక కొత్తదిశ, కొత్తదశ. మొత్తం మీద ఈ పరిణామం నాకు బాగా నచ్చింది.

చెట్ల గురించి, ఎండావానల గురించి, పద్యసృష్టిలోని పరివేదన గురించి చాలామంది రాశారు, రాస్తున్నారు. అలాటి పాత విషయాల్ని కూడ కొత్తచూపుతో చూసే, చూపించే చక్కటి పద్యాలు కూడ ఉన్నాయిందులో. ఉదాహరణకి –

వాన ఒట్టి భోళా పిల్ల
ఆకాశం నుంచి మోసుకొచ్చిన కబుర్లన్నీ
వస్తూనే గలగలా చెప్పేస్తుంది

అంటూ ప్రారంభమయే ‘అక్క – చెల్లెలు’ కవిత మనకు చిరపరిచితాలైన వానా మంచుల తారతమ్యాల్ని అందమైన భావచిత్రాల్తో మనముందుంచుతుంది. ఈ కవిత చదివాక వాన వచ్చినా మంచు కురిసినా వాటిని మనం కొత్తకళ్ళతో చూడక తప్పదు. చూసి రవిశంకర్ కవితని తలుచుకుని అప్రయత్నంగానే ఒక చిరునవ్వుని పూయకా తప్పదు.

పురోగమిస్తున్న ఏ కవైనా అప్పుడప్పుడు వెనక్కుతిరిగి గడిచిన, తను నడిచిన దారికేసి చూపు సారించటం, దూరమైన వ్యక్తుల, సంఘటనల స్పష్టాస్పష్ట రూపురేఖల్ని మనోఫలకమ్మీద మళ్ళీమళ్ళీ చిత్రించుకోవటం సాధారణమే. వయసు గడిచేకొద్ది గీసుకోవలసిన దృశ్యాలు పెరుగుతాయి, వాటి రేఖల గాఢతా పెరుగుతుంది. సమర్థుడైన కవి భావక్షేత్రంలో ఆ రేఖలే రేకులు విచ్చుకుని మనోహర వర్ణాలతో వికసించి పరిమళిస్తాయి. ‘శివరాత్రి’, ‘గొడుగు’, ‘చేయూత’, ఇలా ఎన్నో !

మామూలుగా మనకు మరీ దగ్గరగా వుండే దృశ్యాలు మనకు మామూలై పోతాయి. జీవనయంత్రంలో భాగాలై పోతాయి. విడిగా కనిపించటం మానేస్తాయి. అలాటి దగ్గరి దృశ్యాల్ని సూక్ష్మంగా గమనించి సున్నితంగా కవిత్వీకరించి సుకుమారంగా చెప్పిన కవితలు రెండోపాత్ర, తొలి అడుగు, బంధుత్వం నాకు బాగా నచ్చాయి. ఇంతకన్న వాటి గురించి మాట్లాడటం బావుండదు. ఎవరికి వారు చదువుకుంటేనే బావుంటుంది.

“ఒక సంకలనంలో రెండు మూడు మంచి కవితలు ఉంటే ఆ సంకలనాన్ని మంచి సంకలనంగా లెక్క వెయ్యొచ్చు” అన్నారెవరో ఆ మధ్య. అలాటి దృష్టితో చూస్తే దీన్లో కనీసం నాలుగైదు మంచి సంకలనాలకి సరిపడా మంచి కవితలున్నాయి. ఆలోచింపజేసే చక్కటి అమెరికా తెలుగుకవిత్వాన్ని చదవదల్చుకున్నవారికి ఈ సంకలనం పూర్తి సంతృప్తిని ఇస్తుందని నేననుకుంటున్నాను.