మన్మధుని బాణాలు

[హాలుని గాథా సప్తశతి ఆధారంగా వ్రాసిన ఈ శృంగార ఖండిక పల్లకి సచిత్ర వార పత్రిక (01 ఆగస్ట్ 1985) లో చదివి మా సంపాదకులొకరు తీసి దాచిపెట్టుకున్నారు. ఆ పత్రికలో ప్రచురించని కారణంగా ఈ వ్యాస రచయిత ఎవరో తెలియలేదు. మీకేమైనా తెలుసా? – సం.]

అన్నీ పరస్పర విరోధాలే ఈ మన్మధునివి. సున్నితమైన వాటితోటే కొడతాడు. వీడి బాణాలేమో మరీ విడ్డూరం! ఏం చెప్పను? ఎవరితో చెప్పను? మహా బాధ పెడతాయి ఆ బాణాలు. కాని హాయిగా వుంటుంది ఆ బాధ. అనురాగం కలిగిస్తాయి ఇతరుల పైన. ఆ ఇతరులు ఏడిపించుకొని తింటారు. అయినా ఏదో ఆనందం. ఆ మన్మధుడు ఎలాంటి బాణాలు వేస్తాడో, ఎలా వేస్తాడో, ఎప్పుడు వేస్తాడో చెప్పలేం. ఆ బాణాలు తగిలి మనసులో ఏదో గుబులు పుట్టినప్పుడు కానీ అవి తగిలాయని తెలీదు. ప్రియుడు దగ్గరుంటే సంతోషం కలిగిస్తాయి. దూరంగా వున్నాడా మరి చెప్పలేం! దగ్గరున్నా ఒకొకప్పుడు కష్టం కలిగించడమూ కద్దు. అబ్బో! ఈ మన్మధుని బాణాలకు దండాలు! వేయి దండాలు!!

ఏమిటీ వింత! ఇంత మెత్తనివి, అన్నీ పూవులే. పూవులు మెత్తనివి కాక మరేమవుతాయి. సుకుమారమైనవి అంటారు. కానీ, వాటి దెబ్బ చూస్తే మహా తీక్షణంగా వుంటాయి. అవి ఎక్కడ తగులుతాయో, ఎలా తగులుతాయో తెలీదు. తగిలినట్టే కనిపించదు. కానీ బలే దెబ్బలు కొడుతాయి. తగిలిన తర్వాత కాని వాటి ప్రభావం తెలీదు. గుండెలో లోతుకు దిగిపోతాయి. మెదడును కప్పేస్తాయి. తలను తిప్పేస్తాయి. అంగాలను పరవశింపజేస్తాయి. హృదయాన్ని పీలికలు పీలికలుగా చీలుస్తాయి. కాని ఏమిటో ఉల్లాసం పెల్లుబుకుతుంది.

అమ్మయ్యో! వీటి ప్రభావం అంతా ఇంతా అనలేం. అసూయతో ఒళ్ళు మండేట్టు చేస్తాయి. మనిషిని చూస్తేనేగాదు తలుచుకుంటేనే ఒళ్ళు మండేట్టు చేస్తాయి. అంతలోనే ప్రేమ పుట్టుకొచ్చేట్టు, పొంగేట్టు, పొంగిపొర్లేట్టు చేస్తాయి. ప్రియుడు ఏమి తప్పు చేసినా, ఎంతటి చెడ్డపని చేసినా, ఎంత మనస్సును కష్టపెట్టినా, మనస్సునూ, శరీరాన్ని నలిపివేసినా సహించేట్టు చేస్తాయి. వీటి గొప్పదనం ఎన్ని విధాలో!

సఖీ! ఏమిటీ ధోరణి అని అనుకుంటున్నావు గదూ! మన్మధ బాణాలతో గుండె పుండయిపోయింది. ఆ పుండు ఈ వేళ ఫటాలున పగిలింది. కారణం ఏమనుకున్నావూ? ఎవరో విరహి దారినపోతూ మా తోట అరుగు మీద కూర్చున్నాడు. ఏం తలచుకున్నాడో, గీతం ఆలాపించాడు. అదీ తెలతెలవారగానే. ఆ గీతం విన్నాను. మనస్సు కకావికలైంది. గుండెలోని పుండు రేగింది. ఆ గీతం ఎలా వుందనుకున్నావో! ఎన్ని జన్మల విరహబాధో, ఎన్ని కష్టాల ప్రవాహాలో కుమ్మరించినట్లుంది. నా మనసులోని బాధను మేల్కొల్పినట్లయింది. పుండును రేపినట్లయింది. రేగిన పుండు ఎంత బాధ పెడుతుందో నీకు తెలీదూ? గీతాక్షరాలూ, గీతా రాగమూ, పాడిన పద్ధతీ అన్నీ మనసును పిండి ఎండించాయి. లేచీ లేవగానే ఈ విరహగీతం విన్నాను. మొదలే విచారంతో క్రుంగిపోతున్న నన్ను ఈ గీతం మరింత క్రుంగతీసింది. ఈ దినమంతా ఎలా గడుస్తుందో.

ఎందుకా గీతం నన్ను ఇంతగా దుఃఖితను చేసిందో తెలుసా? నా భావాలు, నా ఆశలు, నా ఆవేదనలు, నా అక్కసులు, నా మక్కువలు – అన్నీ వున్నాయి దాంట్లో. అందుకే దుఃఖం పొంగుకు వస్తూంది. సమాన దుఃఖం గలవారి మనసులే కదా స్పందిస్తాయి! కామబాణాల మహత్మ్యం ఇదే. ఒంటిని పింజ పింజగా కొడతాయి. బాధలోనూ తీయని ఊహలు కలిగిస్తాయి. ఒళ్ళు సన్నబడినా అందాన్నిస్తాయి. ఆ అందం ప్రియులను మరీ మరీ ఆకర్షిస్తుంది. మనకోసం మరొకరు చిక్కిపోతున్నారంటే, ఏదో ఆనందం! ఏదో తృప్తి! మనకోసం ఇంత త్యాగం చేసేవారున్నారుగదా అని ఆత్మ ప్రత్యయం.

ఈ బాణాల రూపాలు ఏమిటి? – అంటావు కదూ? పాతవాళ్ళు చెప్పారు అరవిందం, అశోకం, మామిడిపూత, విరజాజి, నల్లకలువ అని. అరవిందం – కమలమేమో విష్ణు చక్రం లాంటిది. విష్ణువు దుష్టులను శిక్షిస్తే మదనుడు ఈ చక్రంతో విరహి చక్రాన్నే మట్టుబెడతాడు. అశోకుడేమో పేరుకు శోకం లేనిది గానీ, అందరికీ శోకం కలిగిస్తుంది. మామిడి పూవుల గుత్తులు శతఘ్ని వంటివి. ఒకేమారు వందమందిని వంద వందల మందిని బాధిస్తుంది. విరజాజులు చూచావు గదా! సన్నగా వుంటుంది వాటి మొగ్గ, సరిగ్గా బాణం ములికి లాగ దాని చివర. విరహుల గుండెకు తగిలిందీ అంటే, వెంటనే పడిపోవడమే. నల్లకలువ గద లాంటిదనుకో – యముడి గద గురించి విన్నావు గదా!

ఈ ఐదింటినే చెప్పారు గాని ముఖ్యంగా ఇంకా చాలా బాణాలే వున్నాయి మన్మధుని అమ్ములపొదిలో. అవసరం వస్తే ఏ పూవుతోనన్నా కొడతాడు వాడు. తుమ్మిపూవుతోనూ కొట్టగలడు. ఆయా పూవులను బట్టి ఆయా బాణాలుగా తీర్చుకుంటాడు. పరిసర ప్రకృతిలోనూ ప్రవేశించి బాధ పెడతాడు.

ఇప్పుడు చూచావుగా, నాపైన కసి వుంది. నన్ను ఏడిపించాలనుకున్నాడు. కంటికి కనిపించని ఏ బాణం వేశాడో ఏమో. ఎప్పుడో తిరిగి రావలసిన నా ప్రియుడు ఇంతవరకూ రాలేదు. ఇష్టమైనవాళ్ళు దూరమయినా, చెప్పిన గడువుకు చేరుకోకపోయినా, ఇక చూస్కో ఏ బాణాలు వేస్తాడో! ఒళ్ళు మండిపోతుంది. పిచ్చెక్కినట్టవుతుంది. తిండి సహించదు. ఒళ్ళు తెల్లబడుతుంది. గొంతు పెగలదు. కళ్ళనీళ్ళు కళ్ళలోనే ఇంకిపోతాయి. ఏవేవో తలపులు పుట్టుకొస్తాయి. పాత కతలు మనసులో మెదలి మతిపోయి మూర్ఛ వస్తుంది. ఎవరికి చెప్పుకుంటాము! చెప్పుకున్నా వినేవాళ్ళెవరు? విన్నా వెక్కిరించే వాళ్ళే. ఇది మదపిచ్చోయ్! అంటారు. పాపం అనరు. మద పిచ్చట! మదమా ఇది. మదనం అంటే బాగుండును.

అందువల్ల ఒకే నిర్ణయానికి వచ్చాను. మన గోడు ఎవరికీ వద్దు. ఆ మన్మధుణ్ణే అడుక్కుందాం. ఇంత బాధ పెట్టినా, ఒక్క మారన్నా కరుణించాడూ? ఇంతకూ నేను కోరేది కరుణ కాదు. నా పైన దయ, అనుగ్రహం చూపమని కాదు. ఓ మదనా! నేను కోరేది ఇంతే. నీవు నన్ను ఎలాంటి బాణాలతో కొట్టి వేపుకు తింటున్నావో, ఆ బాణాలతో ఆ కృతఘ్నుడిని, ఆ నిర్దయుడిని కొట్టు. అతనికి నేను ఎంత విరహంతో వేగిపోతున్నానో తెలుస్తుంది. తనదాకా వస్తే గాని తెలీదుగా ఎవరికైనా?

ఈ ఉపకారం చేస్తే ఏమి ప్రత్యుపకారం చేస్తానంటావు గదూ? నేను నీ కనపడని రూపానికి ఏమి సేవ చేయగలను చెప్పండి? ఒక్కటి మాత్రం చేయగలను. ఈ జన్మలో ఎలాగూ నిన్ను తిట్టుకుంటూనైనా పూజిస్తూ వున్నాను. నీ ధ్యానం లేని క్షణం లేదు. నీ మంత్రజపం లేని ఒక లిప్తకాలమైనా లేదు. వచ్చే జన్మలోనూ, నా ప్రాణాలు ఒడ్డి అయినా, నీ పాదాలను పూజిస్తాను. ఎలాగూ నేను బతికే ఆశ లేదు. ఎన్ని గడువులకూ రాని వాడు ఎప్పుడు వస్తాడనుకోను? కనుక నా ప్రాణాలు వుండవు. ఎగిరిపోతాయి పక్షుల లాగ. పునర్జన్మ తప్పదు. ఆ జన్మ లోనూ నిన్ను పూజిస్తాను.

మరి చిన్న మనవి. మరు జన్మకైనా ఇలాటి కష్టాలు – విరహ బాధలు లేకుండా చేస్తావా? ఏమో! నీవు అలాటి వాగ్దానాలు చేసే మూర్ఖుడివా ఏమిటి? మా వాడంటే ఎలాటి వాగ్దానాలైనా చేస్తాడు నిర్భయంగా, నిస్సంకోచంగా. వాగ్దానాలే కదా! పోయేదేముంది? ఎన్నయినా చేయవచ్చు. ఎవడో దశరథుని వంటి మహారాజు వాగ్దాన భంగమని ప్రాణాలకు భంగం కలిగించుకున్నాడు గాని, అందరికీ మాట నిలబెట్టుకుందామనే వెర్రి ఉంటుందా?

సరే, మనసులో ఉంచుకో. వచ్చే జన్మలో కలుసుకుందాం. ఇప్పటికి సెలవు.

(హాలుని గాథా సప్తశతి: 4-25, 26, 27. 81, 5-41, 742, 994)