సిలువ గుడి

“అమ్మా… తన పేరు పుల్లమ్మ అయితే మరి ఈవిడ పున్నావ్ అని పిలుస్తుందేమిటీ?!” 1965 ప్రాంతంలో విజయవాడ అరండల్‌పేటలో ఉన్నప్పటి నా కుతూహలమూ ఆశ్చర్యమూ కలగలసిన ప్రశ్న.

పుల్లమ్మగారి కుటుంబం మా అద్దె ఇంటికెదురుగా… బట్టలు ఉతకడం అన్న కులవృత్తిలోనే కొనసాగినా ఆ కుటుంబం బాగా స్థిరపడి మంచి ఇల్లు కూడా కట్టుకొన్నారు. ‘పున్నావ్’ అని పిలిచే ఆవిడ కుటుంబం ఘంటశాల నుంచి పట్నం వచ్చి లారీల వ్యాపారంలో స్థిరపడిన కుటుంబం. మా రైలుగదుల అద్దె ఇళ్ళలో పక్క పోర్షను వాళ్ళది.

“వీళ్ళది సామాజికంగా పెద్ద కుటుంబం. అంచేత రజకులని ‘అమ్మా’ అని పిలవరు. అందుకే పేరుమార్చి ‘పున్నావ్’ అంటున్నారు.”

“మరి వీళ్ళూ క్రిస్టియన్లు గదా…” ఆ మతం సామాజికంగా చిన్న కుటుంబాలవాళ్ళదని నా అప్పటి అవగాహన.

“కాదులే… వీళ్ళు క్రిస్టియన్లే అయినా పెద్ద కుటుంబాలవాళ్ళు.” విన్నానేగానీ నాకు పూర్తిగా అర్థంకాలేదు. అసంతృప్తి.

ఇది జరిగింది 1965లో.

దాదాపు అదే సమయంలో నరసారావుపేటకు పది కిలోమీటర్ల దూరంలో కనపర్తి అన్న గ్రామంలో సిలువగుడి నీడన పుట్టిపెరిగిన పూదోట శౌరీలు అన్న ‘అగ్రవర్ణ’ క్రిస్టియను ఆకతాయి బాలిక తన చిన్ననాటి అనుభవాలను సుమారు ఏభై ఏళ్ళ తర్వాత కతలుగా రాశారు.

ఒక్కటే తేడా–శౌరీలు కుటుంబం వాళ్ళ పెద్ద పాలేరు బాలయ్యను, అతని సహచరి తిప్పమ్మనూ బాలాయ్, తిప్పావ్ అని పిలవరు.


పూదోట వాళ్ళ మూలాలు కర్నూలు ప్రాంతపు గండికోటవట. అంతకుపూర్వం వాళ్ళది తమిళనాడట. కరవురోజుల్లో గుంటూరు ప్రాంతాలకు వలస, సుమారు నూట పాతికా నూట ఏభై ఏళ్ళ క్రితం.

1943లో నిజామ్‌గారు పత్రికా ప్రకటన చేశారట–మా ప్రాంతాలకు రండి. చవకలో మంచి పొలాలు కొని స్థిరపడండి–అని. శౌరీలుగారి అత్తింటివారి కుటుంబం అలా 40లలో వెళ్ళి బోధన్ ప్రాంతాలలో స్థిరపడ్డారట. పెళ్ళయ్యాక ఈమే వలస వెళ్ళి అక్కడ స్థిరపడ్డారట. ఆ రకంగా తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలతోనూ సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్న మనిషి పూదోట శౌరీలు.

ఒక చురుకైన పల్లె బాలిక పెరిగి పెద్దయ్యి చదువుకొని ఉద్యోగం చేసి అధ్యాపకురాలిగా స్థిరపడి ప్రపంచం మీద అనురాగం పెంచుకొని పరిసరాలగురించి అనుభూతిస్తూ ఆలోచిస్తూ స్పందిస్తూ, ఆ స్పందనను తన చిన్ననాటి రోజులలోకి తీసుకువెళ్ళి అక్షరరూపంలో పెట్టినపుడేమవుతుందీ?!

అపురూపమయిన సిలువగుడి కతల పుస్తకమవుతుంది.


నూటపాతిక పేజీల ఈ చిన్న పుస్తకంలో అంతా కలిపి ఇరవై ఏడు కతలున్నాయి. దాదాపు అన్ని కతలూ రచయిత బాల్యానికి చెందినవే.

ఆత్మీయ మానవ సంబంధాలు, కుటుంబ సభ్యులతో అనుబంధాలు, స్థానిక చరిత్రా సంప్రదాయాలు, ‘ఇందుగులూ’ ‘క్రీస్తువుల’ అతి సహజ సహజీవనం, ప్రాంతీయ భాషా మాండలికాలు, ఏభై ఏళ్ళనాటి గ్రామ జీవితం, వ్యవసాయం, పంటలు, పెళ్ళిళ్ళు, మరణాలు, నాటక ప్రదర్శనలు, ఓ యువతి నన్‌గా మారిన ప్రక్రియ, సుదూర ప్రదేశాలకు తీర్థ-విహార యాత్రలు… ఈ ఇరవై ఏడు కతల్లో ఒకప్పటి, ఒకానొక, బయటవాళ్ళకు అంతగా తెలియని ప్రపంచానికి ఓ పసికోణంలోంచి పటంకట్టి పాఠకులముందు నిలబెట్టిన రచన సిలువగుడి కతలు.


భాష, పలుకుబడి, మాండలికం పరంగా ఈ కతలు తెలుగు సాహిత్యానికి ఒక ముఖ్యమైన చేర్పు.

గుంటూరు మాండలికం–ఇంకా చెప్పాలంటే పల్నాడు మాండలికం.

“నలభై ఏళ్ళబట్టీ బోధన్ ప్రాంతమంటున్నారు, ఇంకా గుంటూరు మాటలు మరచిపోలేదా?” అని అడిగితే, “అప్పటికీ ఇప్పటికీ 1943 నుంచీ మా వలస వచ్చిన కుటుంబాల వాళ్ళమంతా ఆ మాటతీరు వదల్లేదు. అలాగే మాట్లాడుకొంటాం. నిజానికి బోధన్ ప్రాంతపు భాషే మాకింకా అలవాటు కాలేదు…” అంటారు పూదోట శౌరీలు! అన్నట్టు ఈ మాండలికంలో రాసినవాళ్ళు అత్యంత అరుదు. నాకు తెలిసి మా గోఖలే ఒకరే రాశారు!

పుస్తకం మొదలయ్యీ అవగానే ఎనికలు, సాంబువ్వ, అనే మాటలు ఎదురవుతాయి. కొంచం ఆలోచించి ఆ మాట వచ్చిన సందర్భాన్ని అన్వయించి చూస్తే ఎనికలు అంటే ఎముకలు అని అర్థమవుతుంది. మరి సాంబువ్వ? ఆవిడ్నే అడిగాను. “అప్పట్లో మాకు జొన్నబువ్వే ఉండేది. డబ్బున్నవాళ్ళూ, చర్చి అధినేతలూ మాత్రమే వరి అన్నం తినేవాళ్ళు. అలా అది (ఆ)సాములు తినే బువ్వగాబట్టి సాంబువ్వ అయింది.”

విశాఖ ప్రాంతపు డాక్ కార్మికులు తవ్వోడ అన్న పదం సృష్టించడం గుర్తొచ్చింది నాకు.

ఆ ప్రాంతంలో వాడే లగెత్తడం, తేపతేపకు, అన్న మాటలు సరేసరి! హఠాత్తుగా జాలాది అన్న మాట తటస్థపడుతుంది. ఆలోచిస్తే అది స్నానాలగది అని బోధపడుతుంది. అలాగే పిల్లలంతా చీకటిపడ్డాక గట్టి గొంతులతో చదువులకు కూర్చుంటే ఊరు ఊరంతా దొని పలికేదట– అంటే ప్రతిధ్వనించడమన్నమాట. మాటిమాటికీ పుస్తకంలో బోఆశ అనే మాట వినపడితే ఆలోచించగా అది బహు/చాలా ఆశ అని తెలిసింది. వాళ్ళ నాయన పేనిన గోగునార తాళ్ళు నున్నగా, మట్టసంగా ఉంటాయట. ఇలా పుస్తకం నిండా ప్రాంతీయ పదాల గుబాళింపులే!

అన్నట్టు శౌరీలు వాళ్ళ కుటుంబాలు ఓ నూట ఏభై రెండు వందల ఏళ్ళ క్రితం క్రైస్తవం పుచ్చుకొన్నవి. పల్నాటి పలుకుబడి, దానికి మళ్ళీ గ్రామీణ క్రైస్తవ రంగూరుచీ కలగలసి ఒక కొత్త భాష–కనీసం మనలో చాలామందికి తెలియని భాష–పుస్తకంలో కనబడుతుంది. హిందువులు ఇందుగులవుతారు. కత్రీనా, ఆండ్రీస్‌లు కత్తిరేన, అండాస్ అవుతారు. సర్వేశ్వరుని స్తోత్రం సరేసోత్రం అవుతుంది. (దేవతా) విగ్రహాలు సొరూపాలు (స్వరూపాలు) అవుతాయి. జ్ఞానస్నానం గేనతానం అవుతుంది. సెయింట్ జీవియర్ ప్రాంతీయతను సంతరించుకొని శౌరీలు అవుతారు!


సిలువ గుడి కతలు చదువుతోంటే మనల్ని పదేపదే ఆకర్షించి ఆకట్టుకొనే అంశం – మానవీయ స్పందనలు, ఆత్మీయ అనుబంధాలు.

రచయిత శౌరీలుకు తొమ్మిదీ పదేళ్ళ వయసపుడు గుంటూర్లో ఉండే ‘నల్లగా పొట్టిగా గారపళ్ళతో సింపిరి జుట్టుతో’ ఉన్న ఓ ఎంకమ్మ పలకరించడానికి వస్తుంది. అప్పటికే ఆమె అవతారం చూసి చీదరతో ఉన్న శౌరీలుకు ఆమే తనకు చిన్నప్పుడు పాలిచ్చి పెంచిన మాదిగ మనిషని, అందుచేతనే తనను తోటివాళ్ళంతా ‘మాదిగముండా’ అని పదేపదే హేళన చేస్తున్నారనీ అర్థమై, “ఇదిగో, ఇంకోసారి మా ఇంటికొత్తే ఊరుకోను. పాలిత్తే ఇచ్చావుగానీ ఇంకోసారి రాబోక” అని ఎంకమ్మను విదిలించికొడుతుంది. అదే శౌరీలు “నాకు బిడ్డలు కలిగి, నేనమ్మనయిన తర్వాత ఎంకమ్మ విలువ తెలిసింది. వెతుక్కుంటూ గుంటూరు వెళితే ఆమె ఉన్న తావే దొరకలేదు. ఇపుడాతల్లి ఎక్కడుందో, అసలుందో లేదోగూడా నాకు తెలవదు,” అని తల్లడిల్లుతుంది.

పొలం వెళ్ళి వస్తోంటే శౌరీలు వాళ్ళ నాయనకు తుమ్మముల్లు గుచ్చుకుంటుంది. ఆమె లాఘవంగా పిన్నీసుతో ముల్లు తీస్తుంది. అలా ముల్లు తీస్తోన్న శౌరీలును చూసి ఆయన బొటబొటా కన్నీళ్ళు కార్చాడట. “నేను ముల్లు తీత్తుంటే సచ్చిపోయిన వాళ్ళ అమ్మో, మా అమ్మో గురుతువచ్చినట్టుంది!” అంటారు శౌరీలు. అలాగే ఈనలేక ఒకటే ఆపసోపాలు పడుతోన్న బర్రెను చూసీ నాయన కన్నీళ్ళు కార్చాడట. ‘కానుపు తట్టుకోలేక సచ్చిపోయిన మా అమ్మ, పురిట్లోనే పోయిన నా తమ్ముడు గేపకం వచ్చారేమో…’

నూరేళ్ళకు పైగా హుషారుగా బతికి చివరికి కాలు విరిగి మంచాన పడి శౌరీలు వాళ్ళ తాత–పెద్ద జెయన్న పోయినపుడు, ‘నా మొగుడియి బారడు కురులమ్మా, వాటికి నూనెరాసి సిక్కుదీసి ముడేసేది ఎవరమ్మా’ అంటూ అవ్వ శొకాలు బెడతాంటే “నాకూ మా ఇంటోళ్ళకేగాదు, రేత్రికే దుక్కంబుట్టి ఎక్కిళ్ళుబెట్టింది…” అంటారు.

చిన్ననాటి సావాసగత్తె కత్తిరేనా దగ్గర ఏదో పందెంలో వానగుంతల చెక్క గెలుచుకొన్న శౌరీలు పెద్దయాక ఆ కత్తిరేన వాళ్ళ అమ్మ సచ్చిపోయినపుడు ఓదార్చడానికి వెళ్ళి “మన చిన్నప్పటి ఆటలకు గుర్తుగా మా అటకమీద వానగుంతల చెక్క ఎప్పటికీ ఉంటదే!” అనగానే ఆ కత్తిరేనా శౌరీలును కౌగలించుకొని ఒకటే ఏడుపు.

కేశవరెడ్డి నవలల్లోంచి నడిచివచ్చినట్టుండే మట్టిమనిషి శౌరీలవాళ్ళ నాయన. తొంభై అయిదేళ్ళు బతికి 2003లో కనుమరుగయిన మనిషి. “ఊహ తెలియక ముందే తల్లిని పోగొట్టుకొన్న నన్ను తల్లయి సాకిన తండ్రి ఆయన. ఆయనకు నేను ఏమీ ఇయ్యలేదు. ఇయ్యలేను కూడా. ఇచ్చేందుకు ఏముంది–మూడు పిడికెళ్ళ మట్టి తప్ప! అదే ఆ ఆకరిరోజు ఇచ్చివచ్చాను.” అని శౌరీలు అంటోంటే ఆ మాట, ఆ ఆవేదన చదివేవాళ్ళ అందరి మనసుల్లోనూ సుళ్ళుతిరుగుతుంది.

ఊరు వదిలి నైజాం రాజ్యం వెళ్ళిపోయిన చాలాకాలానికి కనపర్తి మీద కతలు రాద్దామనుకున్నాక మళ్ళా ఆ ఊరికి వెళ్తారు శౌరీలు. పల్లెకాస్తా పట్నమయిపొయి, ఇళ్ళల్లో మనుషులకు బదులుగా టీవీలే మాట్లాడుతున్న వైనం చూసి బిక్కచచ్చిపోతోన్న శౌరీలుకు వాళ్ళ పెద్ద జీతగాడు బాలయ్య ఇంట్లో మళ్ళీ అప్పటి కనపర్తి దొరుకుతుంది. మారిపోయిన ఊరిని చూస్తూ మనసును ఉగ్గబట్టుకొంటున్న శౌరీలు బాలయ్యను పట్టుకొని వెళ్ళిపోయినవాళ్ళను తలచుకొంటూ పొగిలిపొగిలి ఏడ్చారట. “ఆ కన్నీళ్ళే ఇలా కతలయి మీ ముందుకు వచ్చాయి.” అంటారామె.

అనుబంధాలు, ఆత్మీయ స్పందనల చుట్టూ అల్లబడిన ఈ కథల్లో కనీసం ఇరవై పాతిక పాత్రలు ప్రాణప్రతిష్ఠ చెంది మనముందు నిలబడతాయి. కొన్నిరోజులపాటయినా మన మనసుల్లో మెదలాడతాయి. పుస్తకం మళ్ళా తెరిస్తే పాత ఆల్బమ్‌లలోని ఫోటోల్లా ఆత్మీయంగా పలకరిస్తాయి.


ఇందులోని ఇరవై ఏడు కతల్లో తలచుకొని తలచుకొని మురిసిపోగలవి కనీసం పదిహేను ఉన్నాయి.

మొదట్లోనే ‘గంపకింద అంతయ్య పంతులు’ కనిపిస్తారు.

ఎవరో క్లవర్లకు తప్ప ఎంతోమంది చిన్నపిల్లలకున్నట్టుగానే శౌరీలుకు లెక్కలంటే భయం. ఆ లెక్కలు చెప్పేది అంతయ్య పంతులు.

శౌరీలు భయం త్వరలోనే కోపంగా పరిణమించింది. చిన్నచిన్న వీరకార్యాలతో తెలివిగా తన కోపాన్ని అంతయ్యగారిమీద ప్రదర్శించేది. కానీ ఆమెకు అది చాలదు.

ఒకరోజు వాళ్ళ ఊరికి పగటేసగాళ్ళు వచ్చారట. ఇంద్రజాలమహేంద్రజాల విద్యలు ప్రదర్శించారట. గంపకింద మడిసిని మంత్రమేసి మాయజేశారట. అదిగో, అక్కడ దొరికింది శౌరీలుకు ప్రతీకారమార్గం.

ఆ రాత్రి ఆమె కలకన్నది. రకరకాల విద్యలు ప్రదర్శించింది. అంతయ్య పంతులుగారిని గంపకింద బోర్లించి మాయంచేసింది. లెక్కలపీడ వదిలించుకొంది. ఆ ప్రక్రియనంతటినీ చిత్రకారుడు పినిశెట్టి ఒడిసి పట్టుకొని చక్కని చిత్రంలో బంధించారు!

అలాగే కన్ఫెషన్ బాక్స్ దగ్గర ‘అయిదు పాపాలన్నా చెప్పాల’ అని ఉబలాటపడి శౌరీలు తన పాపాల చిట్టాలు తిరగేస్తే అతికష్టం మీద నాలుగు పాపాలు దొరుకుతాయి. అయిదో పాపం చేయాల్సివచ్చి ఉట్టి పుణ్యానికి దారినపోతోన్న సెవిటి రామన్నను “ఒరే చెవిటి నాయాలా, పిర్రమీద పంచే సిరిగిందిరా ముండనాయాలా. ఇంటికి పోయి కుట్టుకొని కట్టుకోఫో!” అందట. అలా అయిదు పాపాల కోటాను పూర్తిచేసుకొందట!

1965లో కాబోలు కనపర్తికి కరెంటొచ్చిందట. ఆ సంబరాన్నీ ఆయా వివరాలనూ పిల్లలు మాత్రమే చెప్పగల అద్భుతరీతిలో చెప్తారు శౌరీలు: “పిల్లలందరం కరెంటోళ్ళను దేవుళ్ళను జూసినట్టు జూత్తున్నాం. గోతులు తవ్వి పెద్ద తంబాలను హైసాహైసా అంటూ తాళ్ళతో నిలబెట్టారు. ముందుగా ఫాదర్ పూదోట జోజయ్యగారింట్లో బలుపు యెలగాలని గబగబా పనిజేత్తన్నారు. కరెంటు పెద్దాయన చిన్నమ్మ (జోజయ్యగారి అమ్మ) చేతికి కొబ్బరికాయ ఇచ్చి ముందు అది కొట్టి చిచ్చి యేయమన్నాడు. ఆమె కళ్ళు మూసుకొని బయంబయంగా సిచ్చును ఒత్తగానే బారుబలుపు తెల్లగా యెన్నముద్దలాగా యెలిగింది”! ఒక చారిత్రక సంఘటనను కళ్ళకు కట్టిన కథనమిది! 1959లో మావూరు బంటుమిల్లికి కరెంటు వచ్చినపుడు మేమంతా పడిన సంబరం గుర్తొచ్చింది. నాకేకాదు, గ్రామీణ నేపథ్యమున్న నా వయసు వాళ్ళందరి జ్ఞాపకాల పరిమళాలకూ తలుపు తెరిచే కత ఇది.

అప్పట్లో ఆ ప్రాంతాల్లో ఆ కుటుంబాల్లో సాగుచేసినది పొగాకు.

చురుకైన శౌరీలు ఆయా వ్యవహారాలు గమనించడమేగాదు, పొగాకు గ్రేడింగు లాంటి పనుల్లో ప్రత్యక్షంగా పాల్గొని తనదైన సంపాదన కూడా సాధించారు.

“నారు తెచ్చి మొక్క నాటింది మొదలు చెక్కులు తొక్కి కంపెనీకి తోలేదాకా ఊళ్ళోని అన్ని కులాలవాళ్ళూ కలిసి జేసేదే ఈ పొగాకు సేద్దెం.” ఆ ప్రక్రియ ఆద్యంతమూ ఎంతో ఆసక్తికరంగా మనకు పొగాకు మీద ప్రేమ కలిగేలా చెప్పుకొస్తారు శౌరీలు! పొగాకు ఒలవడానికి ఈరమ్మ ముటావాళ్ళు ఇరవైమంది రావడం, శౌరీలతో పొగతోటకు కొబ్బరికాయ కొట్టించి ఒలవడం మొదలుపెట్టడం, బేరన్‌ను ‘ఎంతో వైనంగా తల్లిలాగా చూసుకొనే’ డైవరు నానయ్య, ఆకును కాల్చడానికి బేరన్‌కు ఎక్కించడం, ఆయా బేరన్ పారిభాషిక పదాలు, బేరన్ నుంచి కాలిన ఆకును దించడం, పనిలో శ్రమ తెలియకుండా ‘దుకులుదుకులు దున్నిరీ’ అంటూ పాట ఎత్తుకొనే ముఠామేస్త్రీ ఈరమ్మ, పని అయ్యాక కూలోళ్ళ ముటాకు మాంసంకూర విందు, గ్రేడింగు సమయంలో సీనారేకు పెట్టెను నెత్తిమీద బెట్టుకుని అమ్మకాలకోసం ‘జిలేబి, పోసుమిటాయి’ అని అరుసుకుంటూ వచ్చే కోమటి బూషయ్య, గ్రేడింగు అయ్యాక పొగాకు ‘చెక్కులు తొక్కడం’, చిలకలూరిపేట పొగాకు కంపెనీ నుంచి వచ్చినోళ్ళు పంటను కొని లారీల్లో తీసుకుపోవడం–అదో మనకు తెలియని ప్రపంచం. జీవన విధానం.

ఈ పుస్తకంలో ‘అమ్మగారైన నిర్మలక్క’ కత ఒకటి ఉంది.

శౌరీలు వాళ్ళ బంధుగణానికి చెందిన నిర్మల అన్న యువతి నన్‌గా మారాలని నిశ్చయించుకొంటుంది. ఆ మారే ప్రక్రియను వివరంగా చెప్పిన కత ఇది.

శౌరీలు వాళ్ళ కనపర్తి నుంచి ‘ఊరు ఊరంతా’ ఎడ్లబళ్ళూ రైలు బండీ బస్సూ ఎక్కి గుంటూరులోని పునీత ఆగ్నేసమ్మ గుడికి వెళ్ళడం, అందంగా తీర్చిదిద్దబడిన నిర్మలక్క ‘పెళ్ళికూతురులా తళతళలాడుతూ’ అందరికీ దండం పెడుతూ పెతి ఒక్కరినీ పలకరించడం, పిల్లల దగ్గరికి వచ్చి పలకరించడం, దేవతలా హితవు చెప్పటం, గుళ్ళో సాములోర్ల పూజా ప్రక్రియ, నన్‌లు అవబోతోన్న ఇరవైమందీ తలిదండ్రుల్ని సెలవిప్పించమని అడగడం, వాళ్ళు ఏడుత్తూ సరేనని తలలూపడం, అలంకరణలన్నీ తీసేసి ముచ్చెనగుంతలవరకూ కత్తిరించిన జుట్టుతో తెల్లని పొడవైన అంగీలు యేసుకొని వాళ్ళంతా పాత పేర్లు వదిలి కొత్తపేర్లు అందుకోవడం, అప్పటిదాకా అందంగా మెరిసిపోయిన నిర్మలక్క తెల్ల అంగీలో ఎలానో అనిపించి శౌరీలుకు ఏడుపురావడం, ఆ రాత్రంతా కలలో నిర్మలక్క కాసేపు నవ్వుతా కాసేపు ఏడుత్తా కనిపించడం…

1960లలో తెలుగు పట్నాలూ పల్లెటూళ్ళలో రాత్రి రాత్రంతా నడిచే పౌరాణిక నాటకాలు విరివిగా సాగేవి. కనపర్తి కుర్రోళ్ళు కూడా అలా ఎంతో ఉత్సాహంతో వేసి రక్తి కట్టించిన నాటకం ‘రక్తబలి’. యేసునాదుని సిలువమరణం, మూడోరోజున సమాదిలోంచి లేసి ఆయన సొగ్గారోహణం చెయ్యడం– అదీ ఆ నాటకం. గుంటుపల్లి ఇన్నయ్యగారు రాశారట ఆ నాటకాన్ని.

ఊరంతా పండగ. పక్క ఊళ్ళ నుంచీ బళ్ళు కట్టుకొని జనాలు దిగడం. అప్పటికప్పుడు బీడు చదును చేసి తయారుచేసిన రంగస్థల ప్రాంగణం, స్టేజి. అప్పటికప్పుడు వెలసిన దుకాణాలు. స్టేజికి పరదాలు, పక్క రెక్కలు. నటులకు మేకప్పులు. స్టేజిని రకరకాల రంగుల్లో మెరిపించే రంగుల చెక్రం. దుప్పట్లు పరుచుకొని కూర్చున్న ప్రేక్షకులు. మంచాలతో సహా తీసుకువచ్చి ఓ పక్కన పడుకోబెట్టిన ముసలాళ్ళు. నాటకం నేర్పిన గురువుగారి పటానికి దండవేసి, ఆరతిచ్చి, కొబ్బరికాయ కొట్టి, ‘మరియ కుమార రావో’ అంటూ ప్రార్థనా గీతం పాడటం. జెరూసలెం నగరపు రంగాలంకరణ. పద్యాలతో నిండిన నాటకం. స్టేజి మీద జరుగుతున్న ‘అకృత్యాలకు’ ప్రేక్షకుల్లోని ‘గయ్యాళి వర్ధనమ్మ’లు ఆయా పాత్రధారుల చరిత్ర చిట్టా విప్పి శాపనార్థాలు పెట్టడం. సిలువ. ముళ్ళ కిరీటం. ఆడవాళ్ళు ఎక్కెక్కి ఏడవడం. ‘అంతయు సమాప్తమైనది’ అంటూ యేసు తలవంచి మరణించగానే అందరూ గొల్లున ఏడవడం. చివరగా పాత్రధారులంతా మంగళారతి పాడి ముమ్మారు జేజేలు కొట్టడం. పిల్లలంతా ఉలిక్కిపడి లేచి జేజేల్లో పాల్గొనడం. అప్పటికి తెల్లగా తెల్లారిపోవడం.

మిగతా కతలకు భిన్నమయినది ‘పూలకోడి పిచ్చికోడి’.

పూలకోడి బహు(బో) సొగసైనదట. నాజూకైనదట. వయ్యారి అట. పదిగుడ్లు పొదగేసినా సుతారంగా నాలుగైదు పిల్లల్నే చేసేదట. ఎండకు తిరిగితే ఈకల అందం పోద్దని నీడపట్టునే తిరిగేదట. దాని సోయగానికి పుంజులన్నీ దాని చుట్టూనే తిరిగేవట…

పిచ్చికోడి చూపులకు వికారంగా ఉంటుంది. ఈకలమీద ధ్యాసే లేదు. దాని పిల్లలు పద్నాలుగుతోపాటు పూలకోడి పిల్లలు నాలుగిట్నీ కలిపి పెద్ద సంతానాన్నేసుకొని తిరుగుతా ఉంటుంది. గద్దలు కనబడితే సివంగిలా దూకుతుంది. ఇంట్లో మనుషులంటే మహా ఇదిగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకీ అదంటే మమకారం.

ఒక్కమాటలో చెప్పాలంటే పూలకోడి జమున. పిచ్చికోడి సావిత్రి.

రెండింటికీ అమ్మవారు పోస్తే బలంగా ఉండటంతో పూలకోడి తట్టుకొని లేచింది. పిచ్చికోడి పరలోకానికి చేరింది. అంతా కలసి దాన్ని ఇంటివెనక గుంత తీసి పూడ్చిపెట్టారు. అక్కడ సన్నజాజి అంటు నాటారు. ఆ పిచ్చికోడి బుద్ధులే సన్నజాజి మొక్కకూ వచ్చాయి. జాజులు పూసే కాలంలోనే గాకుండా ఏడాది పొడవునా పూలిస్తూ ఇల్లంతా సువాసనతో నింపుతా ఉంటది ఆ పిచ్చి సన్నజాజి చెట్టు…

కనపర్తి గ్రామం నుంచి శౌరీలూ, వాళ్ళ నాయన, మరో బస్సుడు జనం ఎకాఎకిన గోవా వెళ్ళివచ్చిన వైనం ‘శౌరివారిని చూసొచ్చాం’.

అయిదొందలేళ్ళ క్రితం చనిపోయిన సెయింట్ జేవియర్ –శౌరివారు– దివ్య శరీరాన్ని పదేళ్ళ తర్వాత బయటకు తీసి జనం చూడటానికి వీలుగా ఉంచిన సమయంలో చేసిన యాత్ర అది. ఏభై అయిదు మంది. డ్రైవరు ఈరయ్య. క్లీనరు సుబ్బయ్య.

నంద్యాల. ఆత్మకూరు. బళ్ళారి. హంపి. గోవా.

శౌరివారి శరీరం. పెట్టె తాకగానే ఝల్లుమన్న శౌరీలు ఒళ్ళు. పట్టరాని సంతోషం. అడగడానికి ఏభై వరాల వరకూ రాసుకొని కంటతా పట్టినా సమయానికి ఒక్కటీ గుర్తుకురాకపోవటం.

తిరుగు ప్రయాణంలో శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునుడు. బస్సు దిగీ దిగగానే, ‘పదిరోజులయింది… పొలాలు ఎట్టున్నయో ఏమో…’ అంటూ అటు వెళ్ళిన నాయన.

అన్నట్టు గమనించే ఉంటారు, రచయిత శౌరీలు పేరు సెయింట్ జేవియర్ నుంచి వచ్చినదే.


వేలాంగణిలో ముఖ్యమందిరానికి–బసీలికా ఎదురుగా అయిదువందల మీటర్ల దూరాన మరో ప్రముఖమైన పురాతనమైన చర్చి ఉంది. మార్నింగ్ స్టార్ చర్చి అంటారు దానిని.

ఈ రెండింటి మధ్యా ఓ హోలీ పాత్. ఇసుక నిండిన ఇరవై అడుగుల వెడల్పు ఉన్న మార్గమది. ఆ నాలుగువందల మీటర్లూ మోకాళ్ళ మీద పాకుతూ వెళ్ళడమన్నది అక్కడి భక్తులలో ఓ మొక్కులాంటి సంప్రదాయం. అలా వెళ్ళేవాళ్ళు అన్నివేళలా కనిపిస్తారు. ఆడా మగా, చిన్నా పెద్దా, హిందువులూ ముస్లిములూ కూడానూ…

అలాగే ముఖ్యమైన దర్గాలలో అన్ని కులాలవారూ వెళ్ళి ప్రార్థనలు చెయ్యడం, మొక్కులు తీర్చుకోవటం నాకు తెలిసి ఆంధ్రా తమిళనాడుల్లో బాగా కనిపిస్తుంది. అనంతపురం దగ్గర ఉన్న గూగూడు అన్న ఊళ్ళో ఇస్లాం చరిత్రనూ గుహుడి కథనూ కలిపి పీర్ల పండుగ జరుపుతారట. ఆరువందల సంవత్సరాల చరిత్ర ఉన్న కుళ్ళాయప్ప అన్న మహానుభావుడి పేరుతోనూ ఆ సంప్రదాయం ముడిపడి ఉండట…

ఆయా ప్రదేశాల్లో స్థానిక ముస్లిములూ క్రైస్తవులూ అనేకానేక చేర్పులూ మార్పులూ చేసుకొని, ఆయాప్రాంతాల ఆచారవ్యవహారాలను కలగలుపుకొని ఒక విలక్షణ పరిమళంతో విభిన్నమైన సంస్కృతిని సృష్టించుకోవడం పరిసరాలను కొంచం శ్రద్ధగా గమనించే ఏ మనిషికైనా బోధపడే విషయమే.

అదుగో ఆ పరిమళం, ఆ సంస్కృతి ఈ సిలువగుడి కతలనిండా పరచుకొని ఉంది. పైన చెప్పుకొన్న విలక్షణతలూ, విభిన్నతలూ, విశేషాల సూక్ష్మ ప్రతీక కనపర్తి క్రైస్తవ కుటుంబాల జీవనవిధానం.

సిలువగుడి అన్న మాటలోనే ఈ వివిధ స్రవంతుల సమ్మేళనం కనిపిస్తుంది.

కనపర్తి గుడిని 1898లో కట్టారట. క్రిస్టమస్, గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌లాంటి పండుగలే కాకుండా ప్రతి గుడికీ ఓ ప్రత్యేకమైన పండుగ ఉంటుందట. అది ఆ గుడి తెరచిన నాటి వార్షికోత్సవం కావచ్చు, ఆ గుడి ఏ సెయింట్ పేరుమీద ఉందో ఆ సాములారి పుట్టినరోజు కావచ్చు… ఆ రోజు ‘గుడి పండగ’.

ఆరోజు తలంటి పోసుకొని గుడికి వెళ్ళి పూజ చెయ్యడం, గారెలూ మాంసాలతో విందులు, బీదాసాదాకి భోజనాలూ, మాపిటేళ వత్తులు పెట్టే సమయంలో బేండు మేళాలు, కులాల ప్రకారం అంతా వరసగా వత్తులు వెలిగించడం, ఆ తర్వాత పెద్ద తేరు, చిన్న తేరుల్లో ఏసు తల్లిదండ్రుల ‘యిగ్రాలు’ పెట్టి బజార్లలో ఊరేగించడం, ఊరు పోరంబోకులో బాణాసంచాతో ‘లంక’ను తయారుచేసి కాల్చడం, తెల్లగా తెల్లారే సమయానికి ఆయా రథాలు తిరిగి గుడికి చేరడం–ఇదీ గుడి పండగ. అదే అక్కడి దసరా. అదే దీపావళి.

ఇహ పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ సంస్కృతుల సమ్మేళనం మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘పెజ్జెయ్యగారింట్లో పెళ్ళి’ కథలో ఆ వివరాలు అతి వివరంగా కనిపిస్తాయి.

తాటాకు పందిళ్ళు, మావిడాకు తోరణాలు, నలుగుపెట్టి పెళ్ళికూతుర్ని చెయ్యడం, పెళ్ళికొడుకు ఇంటినుంచి ‘పెతానం’ రావడం, అంతా ఆ పెతానం పెట్టెలోని చీరలూ సొమ్ములూ చూసి సంతోషం ప్రకటించడం, పెళ్ళిరోజు సన్నాయి మేళం, కుమ్మరింటికి వెళ్ళి కుమ్మరి పాట పాడుతూ అరివేణి పానకం కుండ తేవడం, పెళ్ళి కొడుకు గుర్రమెక్కి గుడికి చేరడం, సాములోరు ‘మీరు ఇష్టపూర్వకంగానే ఈ పెళ్ళి చేసుకోడానికి వచ్చారా?’ అని అడిగి, ఔనన్న తర్వాత తాళిని దీవించి పెళ్ళికొడుకు చేతికిచ్చి మూడుముళ్ళు వేయించడం, అందరూ అక్షింతలు చల్లడం…

…మళ్ళా ‘లోక పెళ్ళి’ కోసం వధూవరుల్ని పెళ్ళి పీటలమీద కూర్చోబెట్టి తెరపట్టి జీలకర్ర బెల్లం పెట్టించి నల్లపూసలు కట్టించడం, ‘ప్రమథ గణానాం వేదసాక్షిణాం పిత పుత్ర పవిత్రాత్మ స్వస్తి వచన పూర్వకం అశీషం భవతు’ అంటూ మంత్రాలు చదివి తలంబ్రాలు పోయించడం, బిందెలో బంగారు ఉంగరం వేయించి తీయించడం, మెట్టెలు తొడగడం, కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అప్పగింతల పాటలు పాడుతూ పెళ్ళికూతుర్ని సాగనంపడం.

ఇది మచ్చుకు మాత్రమే. ఆచార సంప్రదాయాలు కలగలసిపోవడం అన్నది పుస్తకం నిండుగా పూసల్లో దారంలా పరచుకొని కనిపిస్తుంది.


చిన్నపిల్లల దృక్కోణంలోంచి ప్రపంచాన్ని చూస్తూ ఆయా వివరాలను కథలుగా చెప్పడంలో ఆ మధ్యకాలంలో నామిని సినబ్బ కతలు తెలుగు సాహిత్యానికి ముఖ్యమైన చేర్పు. ఆ తర్వాత ఖదీర్ దర్గామిట్ట కథలు, సోమరాజు సుశీల ఇల్లేరమ్మ కథలు వచ్చాయి. ఆ ఒరవడిలో మరో ముఖ్యమైన రచన సిలువగుడి కతలు.

దర్గామిట్ట కథల్లో అంతర్లీనంగా బడుగు జీవుల సామాజిక వేదన కనిపిస్తుంది. ఇల్లేరమ్మ కథల్లో పెద్ద కుటుంబాల చురుకైన ఆడపిల్ల బాల్య జీవితం కనిపిస్తుంది. సిలువగుడి కతల్లో వేదనలూ ఆవేదనలూ సంతోషాలూ దుఃఖాలూ సంబరాలూ సంతాపాలూ–బాలుడినోట అనంత విశ్వంలా కనిపించి విస్మయపరుస్తాయి.

2014 చివర్లో వచ్చిన ఈ పుస్తకం పాఠకులను బాగా ఆకట్టుకొంది. సహజంగానే కాపీలన్నీ అయిపోయాయి. అయినా ఎవరికయినా కాపీ కావాలని గట్టిగా అనిపిస్తే తన దగ్గరున్న రిజర్వు స్టాకు నుంచి పంపిస్తానన్నారు రచయిత!

(పూదోట శౌరీలు, 90101 53505)