నీ మెత్తటి తియ్యటి గొంతుతో చెప్తావు ‘నీ జ్ఞాపకాల్తో బతికేయగలను’, ‘నువు సుఖంగా, సంతోషంగా ఉంటే చాలు’, ‘నువ్వెప్పటికీ నా గుండెలో ఉండిపోతావు’, లేదా వేరే భాషల్లో ‘ఐ విల్ ఆల్వేస్ లవ్ యు’, ‘డాంకే షేన్’, ‘వియ్ విల్ ఆల్వేస్ హావ్ పారిస్’. నవ్వుతూనే కావాలనో తెలీకుండానేనో కాస్త విషాదపు జీర జాలువారుస్తూ. కొద్దో గొప్పో నమ్ముతూనే, నీకు నువ్వు నచ్చచెప్పుకుంటూనే.
కానీ నీకు తెలీదు నీ జ్ఞాపకశక్తిని ఎక్కువగానూ, కాలమహిమని తక్కువగానూ అంచనా వేస్తున్నావని. ‘ఎప్పటికీ ఇలాగే ఉండిపోదామా’ అన్నది నువ్వో తనో. అనాలనుకున్నది మాత్రమేనో. అన్నది వేరెవరితోనో. ఆ వాక్యాన్ని అతికించడానికి సరిపడిన సందర్భం కోసం వెతుకులాడతావు. ‘నన్నెప్పుడూ వదిలి వెళ్ళకు’ నువ్వన్నదో, ఏ సినిమాలో విన్నదో. నిన్ను చుట్టుకున్న చేయి కలలోంచో, పగటికలలోంచో. అన్నీ కలగలిసిపోతాయి. ఆ వాక్యాల్లోకి కొంత అర్థాన్నీ భావోద్రేకాన్నీ నింపాలని చూసినా అవి బోలుగా వేలాడుతుంటాయి. ఎంత తడిమినా రంగూ రుచీ వాసనా తడీ మిగిలిన క్షణాలు దొరకవు. ఇదంతా పొరబాటున దారి తప్పి నువ్వు వెళ్ళి తిరిగొచ్చిన కథలోదో. ఏడ్చీ ఏడ్చీ ఎందుకేడుస్తున్నట్టో మర్చిపోయినట్టు ఉంటుంది.
దిక్కుతోచక దాచుకున్నవన్నీ బయటికి తీసి చూస్తావు. చాకొలేట్ రేపర్, సినిమా టికెట్, రుమాలు, ఎండిన మల్లెపువ్వొకటి, రెండు గవ్వలు, నాలుగు మబ్బులు మూసిన సాయంత్రాలు, కొన్ని పాత పాటలు. చెదలు తినేస్తూ. దేన్నీ రేకెత్తించని, దేన్నీ సూచించని ఈ చెత్తంతా ఎందుకు ఏరిపెట్టుకున్నట్టో అర్థంకాదు. బరువు దించుకుని అవన్నీ గాలికి కొట్టుకుపోతాయి.
అప్పుడు తను ఈ భూమ్మీద ఇదే కాలంలో జీవించే తోటి మనిషి. అంతకు మించి మరేమీ అనిపించదు నీకు.
అని ఆశైనా పడతావు. కోపమూ ప్రేమా ద్వేషమూ జాలీ ఏమీ లేకుండానే ‘ఫ్రాంక్లీ మై డియర్, ఐ డోంట్ గివ్ ఎ డామ్!’ అనేసి సూర్యాస్తమయంలోకి కాకుండా ఉదయంలోకీ, దిగంతాలకేసి కాకుండా జనావాసాల వైపూ స్వేచ్చగా వడిగా నడుద్దామనీ…