డి. టి. ఏల్. సీ. – కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాల పై సమీక్ష

ఇరవైయవ శతాబ్దపు మొదటి రెండు దశకాలు సంధి కాలం వంటివి. ఆ కాలంలో ఎందరో మహానుభావులు భారతదేశంలో, ఆంధ్రదేశంలో పుట్టారు. వారికందరికీ ఈ దశకంలో శతజయంత్యుత్సవాలు జరుపుకుంటున్నాము. అలాంటి ముగ్గురు ప్రముఖుల శతజయంతి సమారంభాలను డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ (డీ. టీ. ఎల్. సీ) సెప్టెంబరు 26, 27 తేదులలో నిర్వహించింది. ఆ ముగ్గురిలో శ్రీశ్రీ కవి, కొడవటిగంటి కుటుంబరావు (కొ.కు) నవల, కథ, సినీ, సాహిత్య వ్యాస రచయిత. గోపీచంద్ నవలారచయిత, తాత్వికవేత్త, సినీ రచయిత కూడా. ఆ శతజయంతి సభల గురించి విపులంగా నేను రాసిన సమీక్షను మీముందు ఉంచుతున్నాను.

మొదటి సదస్సు: పరిచయాలు

సభారంభంలో డి.టి. ఎల్. సీ అధ్యక్షుడు మద్దిపాటి కృష్ణారావు సభికులను ఆహ్వానిస్తూ స్వాగత వాక్యాలు పలికారు. మొదటి సదస్సులో కుటుంబరావు కుమారుడు రోహిణీప్రసాద్‌, గోపీచంద్‌ కుమారుడు సాయిచంద్‌, వెల్చేరు నారాయణరావు మాట్లాడారు. అవాంతర కారణాల వలన శ్రీశ్రీ కుటుంబ సభ్యులెవ్వరూ ఈ సదస్సుకు రాలేకపోయారని తెలిసింది. ఈ సదస్సుకు వేములపల్లి రాఘవేంద్ర చౌదరి అధ్యక్షత వహించారు.

రోహిణీప్రసాద్‌ తన తండ్రిని గురించి మొట్టమొదట మాట్లాడుతూ వారి కుటుంబ నేపథ్యం గురించి ఎన్నో వివరాలు చెప్పారు. కొడవటిగంటి అనే ఇంటి పేరు కుటుంబరావుగారి తండ్రి దత్తత స్వీకారమువల్ల వచ్చిందని, వారి ముందటి ఇంటి పేరు శ్రీధర అని చెప్పారు. కుటుంబరావు ఐదేళ్ళప్పుడు తండ్రిని, పదకొండు సంవత్సరాల వయస్సులో తల్లిని కోల్పోయారు. వారి నాన్నమ్మ పెద్దక్కయ్య ఇంటిలో పెరిగారు. పదహారేళ్ళకు 1925లో పెళ్ళి చేసికొన్నారు. 1929లో డిప్రెషన్ కారణంగా పరీక్షకు రుసుము చెల్లించడానికి డబ్బులు లేక బెనారసు నుండి తిరిగి వచ్చారట. తండ్రి లేని కారణంవల్ల చిన్నప్పటినుండి స్వతంత్రంగా ఆలోచించే అవకాశం కలిగింది. కొకు అన్నగారు వేంకటసుబ్బయ్య సాహితీసమితి సభ్యులట. కొకు అన్నగారు ఆంతరంగిక కారణాలవల్ల గృహత్యాగం చేయగా తమ్ముడి, చెల్లెలి సంరక్షణాభారాన్ని కొకు అంత చిన్నవయస్సు లోనే తనపై వేసికొన్నారు. చిన్నప్పటినుండి గ్రామఫోను, ఫోటొగ్రఫీ, పుస్తకాలు, సాహిత్యం ఇత్యాదులపైన ఆసక్తి ఎక్కువ. బాలగంధర్వ, దీనానాథ్ మంగేష్కర్ పాడిన ఎన్నో పాటలను తరచు వినేవారట. నాటక సినీ రంగాలతో ఎంతో పరిచయము వారికి. సమాజానికీ వీటికి గల పరస్పర సంబంధాన్ని బాగుగా అర్థం చేసికొన్నారు. గిడుగు రామమూర్తి పైన వీరు రాసిన మొదటి వ్యాసం కృష్ణాపత్రికలో అచ్చయింది.

కుటుంబరావు చిన్నప్పుడు అభ్యాసము కోసం ఎన్నో వ్యాసాలను కథలను రాసి చింపివేసేవారట. వెల్స్, కానన్ డాయిల్ వంటి వారి రచనలను అప్పట్లో తెనాలిలో చదివారట. పాతతరం వారిది వెనుక చూపు, కొత్త తరం వారిది ముందు చూపని వారి భావన. మూఢ నమ్మకాలు, ఛాందసుల వర్తన కొకుకు అసహ్యం వేసేవి. అన్ని విషయాలలో శాస్త్రీయ పరిజ్ఞానము, దృష్టి ఎక్కువ. భావావేశం తక్కువ. పాటలలో అనవసరంగా స్వరాలను లాగడం, ఆడంగి ధోరణులు పట్టవు. రచనలో నిరంకుశుడైనా వ్యక్తిగతంగా ఎంతో సౌమ్యమూర్తి. నా కథలను ఎంత తొందరగా చదివి అంత తొందరగా అవతల పారేస్తే మంచిది అనేవారట కొకు. ఎస్పెరాంటోను, రష్యన్ భాషలను నేర్చుకొన్నారట కొకు. అభిమానులతో చక్కగా మాట్లాడేవారట కొకు. తన సాహిత్యపు విలువలు తన జీవితంలో ప్రతిఫలించేటట్టుగా నడుచుకున్న మనిషి మా తండ్రి కుటుంబరావు అంటూ రోహిణీప్రసాదు తన ప్రసంగం ముగించారు.

శ్రీశ్రీ పుస్తకాలు అచ్చు కాక మునుపు ఆయన రాసిన రచనలను జేబులో పెట్టుకొని వాటిని పదే పదే చదువుకునే వాళ్ళల్లో నేనూ ఒకణ్ణి అంటూ నారాయణరావు గర్వంగా చెప్పుకొన్నారు. మహాప్రస్థానంలోని పద్యాలు పుస్తకం అచ్చయ్యేటప్పటికి చాలామందికి కంఠతా వచ్చుననీ, అప్పటికే ఎంతో ప్రఖ్యాతి వున్న కవియైనా పది మంది ముందు చాల తక్కువగా శ్రీశ్రీ మాట్లాడేవారనీ అన్నారు. ‘ఏలూరులో జరిగిన అభ్యుదయవాదుల సభలో మొట్టమొదట శ్రీశ్రీని కలిశాను. శ్రీశ్రీ ఆడంబరాలు లేని మనిషి. వ్యక్తిగతంగా అతని జీవితం చాల నిబద్ధమైనది. సమావేశాలకు వేళకు తప్పకుండా వెళ్ళేవారు. పాత కవులపైన పండితులపైన చాలా గౌరవము ఉండేది శ్రీశ్రీకి, ముఖ్యంగా గిడుగు రామమూర్తిపైన’ అని చెపుతూ తానా మహాసభలకు శ్రీశ్రీని ఆహ్వానించడములో తన పాత్రను తెలిపారు. అలా అమెరికా వచ్చినపుడు శ్రీశ్రీ షికాగో, విస్కాన్సిన్, మిషిగన్ విశ్వవిద్యాలయాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీశ్రీ పాటలూ పద్యాలూ అపుడు నేషనల్ పబ్లిక్ రేడియోలో కూడా ప్రసారం చేశారు. తన భాషను తన మాటను అర్థం చేసికోలేనివారిని కూడా శ్రీశ్రీ ప్రభావితం చేశారు. వ్యక్తిగతంగా శ్రీశ్రీ ఒక పసి పిల్లవాడిలా అమాయకుడు. షష్ఠిపూర్తి సన్మాన సభలో విశాఖపట్టణములో 5వేలకు పైగా ప్రజలు హాజరయ్యారు. శ్రీశ్రీ అంత గొప్ప వక్త కాకపోయినా ఆయన ఉపన్యాసాలు అచ్చులో ఎంతో అద్భుతముగా ఉండేవి. శ్రీశ్రీని యథాతథంగా చిత్రించే ఒక జీవిత చరిత్ర ప్రచురించబడాలని, తనవంటివారిని ఎందరినో ప్రభావితం చేసిన వ్యక్తి శ్రీశ్రీ అని వెల్చేరు ప్రసంగాన్ని ముగించారు.

త్రిపురనేని సాయిచంద్‌ తరువాతి వ్యక్త. కాకతీయవంశములో శంభుకుడు అనే ఒక సేనాని త్రిపురాలకు అధికారి కాబట్టి త్రిపురనేని అనే ఇంటి పేరు వచ్చిందట. గోపీచంద్ నాన్నగారు త్రిపురనేని రామస్వామి చౌదరి. వారు ఐదుగురు అన్నదమ్ములు, అందరూ కవులే. గోపీచంద్‌ 1910లో వినాయకచవితి రోజు పుట్టారట. తన తల్లి చనిపోయిన తరువాత నాన్నమ్మ దగ్గర పెరిగారట. వారి సవితి తల్లి చాలా ఉత్తమురాలట. చీకటిగదులు అనే నవలలో ఆమె పాత్రను ఉదాత్తంగా తీర్చి దిద్దారు గోపీచంద్. గుంటూరులో విద్యాభ్యాసము చేసేటప్పుడే రచనావ్యాసంగాన్ని ప్రారంబించారు. 1928లో ‘శంభుకవధ’ వ్యాసం అతని ప్రథమ రచన. 1933లో రాసిన ‘ఒలింపియస్’ మొదటి కథ. ఆస్తికులైన ఉన్నవ లక్ష్మీనారాయణ, నాస్తికులైన రామస్వామి చౌదరి పరమ మిత్రులు. రామస్వామిగారి ప్రభావం ప్రారంభదశలో గోపీచంద్‌పైన ఎక్కువగా ఉండేది. ఎం. ఎన్. రాయ్ రాడికల్ హ్యూమనిజంచే ప్రభావితమయ్యారు.

గూడవల్లి రామబ్రహ్మంగారి ‘ప్రజామిత్ర’లో రాస్తూ వారు తీసిన ‘రైతు బిడ్డ’లో అసోసిఏట్‌గా పని చేశారు. తరువాతి చిత్రం మాయాలోకం. ‘పల్నాటివీర చరిత్ర’ తీయలేకపోయినా దానికై చేసిన పరిశోధన ఫలితాలను ప్రజామిత్రలో వ్యాసరూపంగా ప్రచురించారు. గోపీచంద్ పనిచేసిన ‘గృహప్రవేశం’ వాడుక భాషలో తీయబడిన మొదటి తెలుగు చిత్రం. ‘లక్ష్మమ్మ’ ఘన విజయం సాధించినా ‘ప్రియురాలు’, ‘పేరంటాలు’ అంతగా రాణించలేదు. దీనితో సినిమారంగంనుండి నిష్క్రమించి రచనారంగంలో దిగారు. గృహప్రవేశం చిత్రం తరువాత అసమర్థుని జీవితయాత్ర రాశారు. ఈ రచనతో తన తండ్రి రామస్వామిగారి ప్రభావంనుండి బయటపడ్డారని కొందరు అంటారు. కర్నూలులో ఇన్ఫర్మేషన్ డైరెక్టరుగా ప్రకాశం ప్రభుత్వంలో మూడు సంవత్సరాలు పని చేశారు. సాయిచంద్ పుట్టినప్పుడు అరవిందుల జ్ఞానయోగంనుండి సాయిబాబా భక్తియోగానికి వచ్చారు. హైదరాబాదు ఆల్ ఇండియా రేడియోలో పనిచేసే కాలంలో చీకటి గదులు నవల రాశారు. తత్త్వవేత్తలపై వ్యాసాలు రాసేవారు. సాయిచంద్‌కి ఆరేళ్ళప్పుడు గోపీచంద్ 1962లో చనిపోయరు. వారి జ్ఞాపకాలు చాలా తక్కువ. నాన్నగారి ప్రభావం తను చేసే ప్రతి పనిలో సాంఘిక సేవ ఒక భాగంగా ఉండాలనేదే అని సాయిచంద్ చెప్పారు.

రెండవ సదస్సు: కొ.కు. సాహిత్యం

కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యంపైన చర్చలు మధ్యాహ్నం ఆరంభమయినాయి. ఈ సదస్సుకు సమన్వయకర్త శ్రీమతి గోపరాజు లక్ష్మి తమ ఉపోద్ఘాతములో కొకు సుమారు 10 నుండి 12 వేల పుటలు తన జీవితకాలంలో రాశారనీ, వారు సుమారు 500 కథలు, 1500 వ్యాసాలు రాశారనీ అన్నారు. సాహిత్యంలో కొకు ముఖ్యోద్దేశము సామాజిక ప్రయోజనమనీ, జీవితమే తన ప్రమాణమనీ అన్నారు. జీవితంలోని కుళ్ళును కడగడానికి కళలకు కూడా బాధ్యత ఉన్నదన్నారు. ఎక్కువగా మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలపై రాసినా నిమ్నవర్గాలపై సానుభూతి ఉన్న రచయిత కొకు అని అంటూ తెలుగు సామాజిక చరిత్రను బోధించిన బడులలో కొకు సాహిత్యాన్ని కూడా బోధించాలి అని అభిప్రాయపడ్డారు.

ఆస్టిన్ వాస్తవ్యులు శ్రీ విష్ణుభొట్ల లక్ష్మన్న “కొకు సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా?” అనే విషయంపైన మాట్లాడారు. కొకు రచనలలో ముఖ్యంగా కనిపించేది అభ్యుదయ దృక్పథం, 50 ఏళ్ళ తరువాత ఇప్పటికీ దాని రిలవెన్స్ అంతరించిపోలేదు. ఆయన లేకపోతే చందమామ పత్రిక లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చందమామలో ఒక వైణికుని కథను గురించి వివరిస్తూ స్వయంకృషితో సాధించినందువలన లభించే తృప్తి, ఆనందం ఎంతో గొప్పది అనే సందేశం 12 ఏళ్ళ కుఱ్ఱవాడైన తనపైన ఎంతో ప్రభావం కలిగించింది అన్నారు. 1954లో కొ.కు రాసిన ‘దేవుడింకా ఉన్నాడు’ కథలో ముక్యంగా నిరానందం, నిర్విచారం ఎలా నిర్లిప్తతకు దారి తీస్తాయో చూపిస్తూ లక్ష్మన్న అమెరికాలో ఎలా నమ్మకానికి మూఢ నమ్మకానికి మధ్య అంతరం మారుతుందో అనే విషయాన్ని సభ ముందు ఉంచారు. తరువాత చదువు, వారసత్వం నవలలనూ, నిజ సంఘటనలపైన ఆధారపడిన కొత్తజీవితం కథల ఆధారంగా కొకు రచనలు ప్రస్తుత సమాజానికి కూడా ఎలా పనికొస్తాయో వివరించారు.

తరువాత గోపరాజు లక్ష్మి “కొకు రచనల్లో స్త్రీల సాధికారత” అనే అంశాన్ని గురించి ప్రసంగించారు. కొకు సాహిత్యం వ్యక్తి సంస్కారం, కుటుంబ సంస్కారం, సామాజిక సంస్కారం పెరగడానికి దారి తీస్తుంది. వ్యక్తుల నిజాయితీ చాలా ముఖ్యం అంటారు కొకు. భూస్వామ్య వ్యవస్థలో, ఆర్థిక వ్యవస్థలో స్త్రీల పాత్రను ఇప్పటి ఫెమినిస్ట్ ఉద్యమాలకు ముందే కొకు గుర్తించారు. అతని భావాలు బాల్య వివాహాలు, బాల వితంతువులనుండి స్త్రీ విద్య, పునర్వివాహాలు, భర్తను ఎదిరించి పిల్లలను విద్యావంతులు చేయడం వరకు ఎదిగాయి. సరోజ, చంద్రావతి, పంచకల్యాణి, సీత మొదలైన పాత్రలను లక్ష్మి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈనాడు పురుషస్వామ్యం అమలులో ఉన్నది, ఈ సమాజంలో స్త్రీకి పురుషునితో సమానత్వం అసాధ్యం అన్న కొకు వాక్యాలను గుర్తుకు తెప్పించి సంఘంలో మార్పులు వస్తే గాని స్త్రీల స్థితి మారదు అన్న కొకు సిద్ధాంతాన్ని తెలిపారు. ఆడజన్మ, సవితి తల్లి కథలు శరీర రాజకీయాలకు సంబంధించినది. చిన్నతనపు పెళ్ళి, పచ్చకాయితం, సాహసి కథలలో గోచరించే లైంగిక సమస్యలను గురించి లక్ష్మి తన ప్రసంగంలో విశ్లేషించారు.

షికాగోకు చెందిన కందాళ రమానాథ్‌ తరువాతి వక్త. కొకు రచనల్లో హాస్య వ్యంగ్యాల మేళవింపును గురించి వీరు మాట్లాడారు, ఒక మాటలో చెప్పాలంటే కొకు ఒక అసాధ్యుడు అన్నారు. జీవితాన్ని విమర్శించడం, అనుకరించడం సాహిత్యపు ముఖ్యోద్దేశము అని కొకు చెప్పారు. మనసు చివుక్కుమన్నా నిజాన్ని ఎత్తి చూపడమే వ్యంగ్యపు గురి. హోరీదాదాబాబా అనే కాల్పనిక సాధువును గురించిన వ్యాసాన్ని రమానాథ్ ప్రస్తావించారు. ‘ఔపదేశికంగా…’ అనే వ్యాసం కూడా హాస్య వ్యంగ్యాలతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో ప్రతి విషయంలో దేవుడిని ఇరికించవచ్చును అని చెబుతారు కొకు. గౌరవం లోపించిన ప్రేమ దాంపత్యములో మంచిది కాదు అంటారు. సన్నిహితులు, అమ్మాయి పెళ్ళి అనే కథలను ఇక్కడ ఉదహరించారు. సినిమాలో మనం చూచేది చచ్చు కళ. వాస్తవిక సమస్యలకు అవాస్తవిక కల్పన చేస్తారు సినిమాలో. ప్రగతిశీలమైన మార్పు వ్యక్తిలో వ్యవస్థలో రావాలి, మార్పుకి ఆలోచన పునాదిరాయి అని భావించే రచయిత కొకు అని ముగించారు.

శాన్ హోసే వాస్తవ్యులు చుక్కా శ్రీనివాస్ “కొకు సాహిత్యం – శాస్త్రీయ దృక్పథం” అనే విషయంపైన మాట్లాడారు. ఒక సమస్యను వ్యక్తిగతంగా చూడవచ్చు, సామాజికపరంగా పరిశీలించవచ్చు. చదువు నవల చదివి తాను వ్యక్తికి సంఘానికి గల సంబంధాన్ని నేర్చుకొన్నాననీ, తన ప్రతిబింబాన్ని కొకు సాహిత్యంలో చూడగలిగాననీ అన్నారు. అలాటి అవకాశాలు ఈ కాలంలో లేవని వాపోయారు. కొకు సాహిత్యంలో కనబడే హేతువాదం, తార్కిక పద్ధతి ఒక కొత్త దృక్పథాన్ని కలిగించాయి అన్నారు. సమాజం మారుతున్న కాలంలో తన సాహిత్యానికి అవసరం ఉంది, ఆ అవసరం తీరిన తరువాత దానికి ఆవశ్యకత లేదు అని కొకు భావించారు. ఈ నాటి మార్క్సిస్టులలో ఇలాటి లక్షణాలు తక్కువ. సాహిత్య రచన కొకుకు హాబీ కాదు, జీవనోపాధి కాదు, అది ఒక సామాజిక బాధ్యత, దాని ప్రయోజనం ఒక కొలమానం. ఆ నాటి మధ్య తరగతి కంటె ఈ నాటి మధ్య తరగతి విస్తృతమైనా కూడా, ఈ నాటి మధ్య తరగతి నిమ్న కులాలపైన నిరసన చూపుతున్నది అని శ్రీనివాస్‌ అన్నారు. కొకు ఆశయం విఫలమైనదా అని ప్రశ్నించారు.