ఎలక్ట్రానిక్సు ఇంజనీరింగ్ చేసిన సరితకు, అమెరికాలో ఎం.ఎస్. చదివి, అక్కడే ఉద్యోగం చేస్తున్న విద్యాసాగర్‌తో పెళ్ళి జరిగింది. ఈడూ, జోడూ చక్కగా కుదిరిందని అంతా సంతోషించారు. త్వరలోనే సరిత అమెరికా వెళ్ళిపోయింది సాగర్ వెంట. కూతుర్ని అల్లుడి వెంట పంపిస్తూ సరిత తల్లి, “అమ్మలూ ! వయసు ముఫై ఐదుకి రాకముందే ఒకళ్ళో, ఇద్దరో పిల్లల్ని కని, ఫుల్‌స్టాప్ పెట్టేసి, ఆ తరవాత కరీర్ మీద దృష్టి ఉంచడం తెలివైన పని. అన్నివిధాలా మంచిది. లేటు చేస్తే ఎన్నెన్నో కాంప్లికేషన్లు వస్తాయి” అంటూ లాలనగా చెప్పబోయింది. వెంటనే సరిత ఖస్సుమంది.
“ఇంతోటి దాని కోసం నన్ను ఇంజనీరింగ్ చదివించారెందుకమ్మా? పగలూ రాత్రీ కష్టించి, ర్యాంకుతో పాసయ్యింది చివరకు సాయిల్డు డయాపర్లు మారుస్తూ కూర్చోడానికా! ఐనా, మేం చిన్న పిల్లలం కాము, మా సంగతి మేం చూసుకోగలం” అంది పరుషంగా. ఖంగు తింది తల్లి. ఆ తరువాత ఆమె మరెప్పుడూ సరితకు ఏ సలహాలూ ఇవ్వడానికి సాహసించ లేదు.
సరిత అమెరికా వెళ్ళిన కొద్ది రోజులకే వాళ్ళకి గ్రీన్ కార్డు వచ్చింది. త్వరలోనే సరిత కూడా ఉద్యోగంలో చేరిపోయింది. ఇద్దరికీ కలిపి ఏటా వచ్చే సంపాదనలో చాలా వరకు మిగిలిపోతూండేది. ఇద్దరూ ఖరీదైన కార్లు కొనుక్కునారు. కాలక్రమంలో వాళ్ళకి సిటిజన్‌షిప్ కూడా వచ్చేసింది. కొన్నాళ్ళు గడిచేసరికి, పెద్ద లాన్, స్విమ్మింగ్‌పూల్, టెన్నిస్‌కోర్టు వగైరా అన్ని హంగులతో ఉన్న ఒక అందమైన విల్లా కూడా కొనుక్కోగలిగారు. అంత పెద్ద ఇంట్లో భార్యాభర్త లిద్దరే మసులుతూంటే, అసలు మనుష్యులు ఉన్నట్లే అనిపించేది కాదు. వాళ్ళైనా పగలంతా ఆఫీసుల్లో గడిపి, రాత్రి మాత్రం పడుకోడానికి ఇల్లు చేరుకునీవారు.
సరితకి ముఫై నాలుగేళ్ళు వచ్చాయి. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుతూ సాగర్ అడిగాడు, “దిస్ ఈజ్ హై టైం! మనకి పిల్లలు కావాలంటావా? నీ మనసులో మాట చెప్పు.”
“డార్లింగ్! డోంట్ టాక్ రబ్బిష్! నాకు ప్రమోషన్ రాబోతోంది. ఇప్పుడు మనమున్న టైట్ స్కెడ్యూల్లో పిల్లలకి చోటుందంటావా” అనేసింది సరిత, అట్టే ఆలోచించకుండానే.
“ఓ. కె. మై లవ్! నా ఉద్దేశ్యం కూడా అదేలే” అనేసాడు సాగర్.
చూస్తూండగానే చాప క్రింది నీరులా కాలం తెలియకుండా కదిలిపోయింది. సరితా సాగర్ల వయసు నలభైయ్యవ పడిలో పడింది. అంత వరకు శివమెత్తినట్లుగా పనిచేసి సంపాదించినదంతా క్రమంగా వాళ్ళకు మొహంమ్మొత్త సాగింది. “ఇంత డబ్బు సంపాదించాము, కాని ఏం లాభం! మన తరువాత ఇది ఏమైపోవాలి? తిన్నగా వెళ్ళి గవర్నమెంటుకి చెందవలసిందేనా” అన్న ఆలోచన మొదలయ్యింది వాళ్ళకి.
నిన్నటికీ, ఈ రోజుకీ తేడా ఏమీ లేదు. ప్రతి రోజూ ఒకే తీరు, ఒకే రకం టైంటేబుల్! ఆఫీసుకి వెళ్ళడం, రావడం, సెలవు వచ్చినప్పుడల్లా ఏవేవో తెచ్చిపెట్టుకున్న కాలక్షేపాలు, సరదాలు! చివరకు అవన్నీ కూడా వెగటుగానే ఉంటున్నాయి వాళ్ళకు. మొనోటోనీ పెరిగిపోడంతో, జీవితం విసుగెత్తడం మొదలైంది. దీనికి రెమెడీ ఏమిటి – వాళ్ళు చాలా ఆలోచించారు. ఫ్రెండ్సుని సంప్రదించారు. మొత్తానికి కారణం ఏమిటో వెతికి పట్టుకున్నారు – ఒక్క బిడ్డైనా తమకి లేకపోడమే ఈ డిప్రెషన్‌కంతకీ మూలమని నిర్ధారించారు.
తమ తప్పేమిటో గుర్తించిన సరితా సాగర్‌లు దానిని ఎలాగైనా దిద్దుకోవాలనుకున్నారు. కాని సమయం మించిపోయింది. సరిత గర్భవతి ఐనా, రెండు మూడు నెలలకు మించి గర్భం నిలువడం లేదు. ఎన్నిమాట్లు ప్రయత్నించినా గర్భస్రావమైపోతూ వచ్చింది. వైద్యాలేమీ పనిచెయ్యలేదు. ‘ఇన్విట్రో ఫెర్టిలిటీ’ సత్ఫలితాన్నిస్తుందేమోనని ప్రయత్నించి చూశారు. కాని, దాని వల్ల కూడా ప్రయోజనమేమీ లేకపోయింది. చివరకు డాక్టర్లు , “ఆమె గర్భానికి బిడ్డను మోసి, కనే త్రాణ లేదు” అని తేల్చి చెప్పేశారు. సరితకు తల్లి మాటలు గుర్తుకు రావడంతో మనసులో ఏదో గుచ్చుకున్నట్లయింది. కాని, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే మాత్రం ప్రయోజనం ఏముంటుంది!
నిరాశతో కృంగిపోయిన వాళ్ళకు మిత్రులు సలహా ఇచ్చారు, అనాధ శరణాలయం నుండి ఒక బిడ్డను తెచ్చి పెంచుకోమని. కాని అది వాళ్ళకు నచ్చ లేదు. తమ అందం, తెలివితేటలూ పుణికి పుచ్చుకున్న బిడ్డ ఐతే బాగుంటుంది. కాని, బిడ్డను దత్తు తీసుకున్నప్పుదు, అది ఎవరి బిడ్డో, జీన్సు ఎటువంటివో, ఏమీ టెలియవు కదా. అప్పుడు వాళ్ళకి అండగా కనిపించి ఊరటనిచ్చింది, వెల్లివిరిసిన ఆధునిక వైద్య విజ్ఞానం. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత అభివృద్ధిలోకి వచ్చిందంటే, తల్లితండ్రుల జీవకణాలను సేకరించి ‘క్లోనింగ్’ పద్ధతి ద్వారా బిడ్డలని పుట్టిస్తున్నారు. అంతకంటే కూడా, శోధన నాళికలో ఫలదీకరించబడిన పిండాన్ని వేరే స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టి, అక్కడే పది నెలలూ పెంచి, దానికి జన్మ నివ్వడం – ‘సరొగేట్ మదర్‌హుడ్’.
ఆ సంగతి తెలియగానే సరితా సాగర్‌లు చాలా సంతోషించారు. తమ సంతానం వేరే అమ్మ కడుపులో పెరిగి తమ వొడిలోకి చేరుతుంది – అన్నది వాళ్ళకు గొప్ప ఆనందాన్నిచ్చింది. వెంటనే వాళ్ళు, సమగ్ర సమాచార సేకరణ కోసం ఇంటర్‌నెట్ బ్రౌజింగ్ మొదలు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్నాయి సంతాన సాఫల్య కేంద్రాలు. అమెరికాలో కూడా ఉన్నాయి. కాని, ఖర్చు ఎక్కువ. అదే మరే వర్ధమాన దేశంలోనో ఐతే, అమెరికాలో అయ్యే ఖర్చులో సగం కూడా అక్కర లేదు. అత్యాశతో, అవసరాలతో కొట్టుమిట్టాడుతున్న దేశాల్లో ఐతే, అద్దెకు అమ్మ కడుపు కూడా చాలా చవగ్గా దొరుకుతుంది – అని తెలుసుకున్నారు వాళ్ళు. వెంటనే ఇండియా వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. ఆపాటి ఖర్చుపెట్టే స్తోమత ఉన్నప్పటికీ, అదే పని ఇండియాలో చాలా తక్కువలో జరుగుతున్నప్పుడు తాము అక్కడకే వెళ్ళి తమ అక్కర ఎందుకు తీర్చుకో కూడదు?
“సరితా, డార్లింగ్! సాధ్యమైనంత త్వరలో మనం మన ఊరికి వెడదాం” అన్నాడు సాగర్. మొహం చిరాగ్గా పెట్టింది సరిత.
“అక్కడ కెందుకు ? ముందే మన విషయం బంధువు లందరికీ తెలియ నక్కర లేదు. బిడ్డని ఎత్తుకుని వెడితే, అందరూ మనకు వాడు సహజంగా ఇక్కడే పుట్టాడు – అనుకుంటారు. అసలు సంగతి ఎవరికీ తెలియనక్కర లేదు. మరో దారి ఆలోచించు ” అంది.
కాయకష్టంతో రాటు తేలిన శరీరం కావడంతో రత్తాలు, ఇద్దరు బిడ్డల తల్లి ఐనా కూడా పొందికగా, ఆరోగ్యంగా జీవకళ ఉట్టిపడుతూ చక్కగా ఉంటుంది. పిల్లలిద్దరూ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటున్నారు. భర్త రాములు, షిప్‌యార్డులో కామాటీగా పనిచేస్తాడు. నాలుగేళ్ళ క్రితం వాళ్ళు ఆంధ్రా నుండి వచ్చారు, పని వెతుక్కుంటూ ముంబాయికి. రత్తాలు కూడా ఊరికే కూర్చోదు. పిల్లల్ని బడికి పంపేసి, ఆ తరువాత వెళ్ళి, చక చకా నాలుగిళ్ళలో ఇంటి పని, వంట పని చేసి, పిల్లలు తిరిగి వచ్చే వేళకి తానూ ఇల్లు చేరుకుంటుంది. వేడి నీళ్ళకు చన్నీళ్ళు సాయం – అన్నట్లుగా తన సంపాదన కూడా చేర్చి సంసారం చక్కగా నడుపుతుంది ఆమె. మొదట్లో భాష కొత్త కావడంతో కొంత ఇబ్బంది ఉన్నా, ఇప్పుడు ఆది లేదు. భాష బాగా తెలియడతో, వాళ్ళకి రోజులు సుఖంగా గడిచిపోతున్నయి.
పచ్చని ఆ సంసారాన్ని చూసి ఏ దేవుడి కళ్ళు కుట్టాయోగాని, షిప్‌యార్డులో పని చేస్తూండగా కాలు బెసికి, నిచ్చేనమీద నుండి పడ్డాడు రాములు. కాలు విరిగింది. రాములుకి వైద్యం చేయించి తీసుకువచ్చి ఇంటి దగ్గర దిగవిడిచి వెళ్ళారు యజమాని పంపిన మనుష్యులు. అకస్మాత్తుగా వచ్చిన ఉత్పాతానికి రత్తాలుకి దిక్కు తోచలేదు. రాములుకి యాజమాన్యం ఖర్చుల కిచ్చిన డబ్బు అతని వైద్యానికీ, ఇతర అవసరాలకీ, అతనికి మాత్రమే సరిపోతుంది. ఇకపోతే ఇంటద్దె, ముప్పొద్దులా నలుగురికీ భోజనాలూ వగైరా ఇంటి ఖర్చులు గడిచేది ఎల్లాగ అన్నది పెద్ద ప్రశ్నయి కూర్చుంది. ఇప్పుడున్న స్థితిలో, ఆమె సంపాదన ఇంటి ఖర్చులకు ఏ మూలకీ రాదు. గుండెల్లో బండ పడ్డట్లయ్యింది రత్తాలుకి. ఇబ్బందుల్లో పడ్డారు వాళ్ళు!
రత్తాలు పనిచేసే ఇళ్ళలో ఒక్క కుటుంబం మాత్రం తెలుగువాళ్ళు. ఆ ఇంటి యజమాని పేరు రాజారాం. అతని భార్య సరళ, గృహిణి. ఏ ఉద్యోగం చెయ్యటం లేదు ఆమె. తక్కిన ఇళ్ళ పనంతా పూర్తి చేశాక, ఆఖర్ని సరళ ఇంటికి వస్తుంది రత్తాలు. అప్పటికే భర్త ఉద్యోగానికీ, పిల్లలు స్కూళ్ళకీ వెళ్ళిపోడంతో, తీరుబడిగా ఉంటుంది సరళ. తెలుగు మాటకి మొహంవాచి ఉందేమో, ఆమె రత్తాలుతో కబుర్లు చెపుతుంది. ఆమెతో కబుర్లు చెపుతూనే చక చకా పనులన్నీ చేసేస్తుంది రత్తాలు. ఆ చనువుతోనే రత్తాలు తనకు వచ్చిన కష్టాన్ని ఆమె దగ్గర చెప్పుకుని బాధపడింది. “రెండు వేలో, మూడు వేలో అడ్వాన్సుగా ఇవ్వండమ్మా, మీకు పుణ్యముంటుంది. నెల నెలా నా జీతంలో మూడు వందలో, నాల్గు వందలో పట్టుకుందురుగాని. మమ్మల్ని రక్షించండమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటా” అంటూ ఏడ్చింది.
ఎప్పటికప్పుడు వస్తూ పోతూ ఉండే పనివాళ్ళని నమ్మి ఎవరూ అంత డబ్బు అడ్వాన్సుగా ఇవ్వడానికి సాహసించ లేరు. కాని, సరళది జాలి గుండె. పైగా చేతిలో పని అందుకుంటూ, అట్టే నాగాలు పెట్టకుండా వచ్చే రత్తాలంటే ఆమెకు ఒక విధమైన అభిమానం కూడా ఉంది.
“ముందు అయ్యగారితో చెప్పి, ఆయన సరే నంటే ఇస్తాలే. రేపు నీకు ఏ మాటా చెపుతా, బాధపడకు” అంటూ అభయమిచ్చింది సరళ. రాములుకి దెబ్బతగిలిన రోజు భర్తనే అంటిపెట్టుకుని ఉండి సేవలు చేస్తూ, రెండు రోజులపాటు రత్తాలు పనికి వెళ్ళలేదు. ఆ రెండు రోజులూ సరళే ఇంటిపనంతా చేసుకోవలసి వచ్చింది. అలవాటు లేని పని కావడంతో ఆమెకు రాత్రయ్యేసరికి జ్వరం వచ్చినట్లుగా ఉండేది….. అది గుర్తు వచ్చింది సరళకి.
ఆ రాత్రి సరళ, రత్తాలుకి వచ్చిన కష్టాన్ని గురించి భర్తకు చెప్పింది. చాలా సేపటివరకు వాళ్ళు ఆ విషయాన్ని గురించే మాట్లాడుకున్నారు. చివరకి ఒక అభిప్రాయానికి వచ్చారు వాళ్ళు. మరునాడు రత్తాలు పనికి వచ్చేసరికి, సరళ సంతోషంగా ఆమెను పలుకరించింది. సరళ ఇచ్చిన వెయ్యి రూపాయలూ అందుకుని కొంగున కట్టుకుంది రత్తాలు.