‘అపు సంసార్ ‘ – సత్యజిత్ రాయ్ సినిమా

(‘అపు చిత్రత్రయం’ లో ఆఖరి సినిమా 1959లో విడుదలైన ‘అపు సంసార్’. ఈ చిత్రత్రయం లోని మొదటి రెండు సినిమాలు ‘పథేర్ పాంచాలీ‘, ‘అపరాజితో‘ గత సంచికల్లో పరిచయం చేయబడ్డాయి. ఈ మూడు సినిమాలకి మూలం బెంగాలీలో వచ్చిన బిభూతి భూషన్ బందోపాధ్యాయ్ స్వీయ కథాత్మక నవల ‘పథేర్ పాంచాలీ’.)

అపు చిత్రత్రయంలో రెండవ సినిమా ‘అపరాజితొ’ తీస్తున్నప్పుడు, రాయ్ ‘అపు సంసార్’ తీద్దామని ముందు అనుకోలేదు. అపరాజితొ సినిమా వల్ల రాయ్‌ ఆర్ధికంగా నష్టపోయాడు. కథ మూలంలో లేని కొన్ని మార్పులు చెయ్యటంతో, అటు పట్టణాలలోని ప్రేక్షకులు, ఇటు పల్లెల్లోని ప్రేక్షకులు ఈ సినిమాని తిరస్కరించారు. ‘అపరాజితొ’ తరవాత ‘పరస్ పత్తర్’, ‘జల్సాఘర్’ సినిమాలు తీసి కొంచెం నిలదొక్కుకున్న తరవాత రాయ్ అపు సంసార్ మొదలు పెట్టాడు. అపు సంసార్ సినిమా తీసిన తరవాత ఒక బెంగాలీ ప్రేక్షకుడు రాసిన తీవ్రమైన విమర్శకు స్పందనగా, రాయ్ ఈ సినిమాను సమర్థిస్తూ, ఇంతకు ముందు ఎన్నడూ చెయ్యని విధంగా ఒక వ్యాసం కూడా రాసాడు. రాయ్‌కి ప్రియమైన చారులత సినిమా కూడా అప్పట్లో (1964 ప్రాంతాల్లో) చాలా తీవ్రమైన విమర్శలకి గురైంది. రాయ్ వాటికి కూడా దీటైన సమాధానం ఇచ్చాడు.


అపు, అపర్ణ

1959 సంవత్సరంలో విడుదలైన ‘అపు సంసార్’ పేరుకి తగ్గట్టు, పెద్దవాడైన అపు సంసార జీవితం చూపిస్తుంది. పెద్దవాడైన అపు తన స్నేహితుడి చెల్లెలు పెళ్ళికి వెళ్ళి, అనుకోని పరిస్థితుల్లో తన స్నేహితుడి చెల్లిని పెళ్ళి చేసుకోవడం, కలకత్తాలో వారి సంసార జీవితం, అపు భార్య గర్భవతిగా పుట్టింటికి వెళ్ళి కొడుకు ప్రసవంలో చనిపోటం, అపు ఒంటరితనం, విరక్తి, భార్య చావుకు కారణమైన కొడుకుపై విముఖత పెంచుకోవడం, చివరకి తండ్రీకొడుకులిద్దరూ దగ్గర కావటం ఈ సినిమాలో ముఖ్యంశాలు.

ఇద్దరు నూతన నటులు

ఈ సినిమాతో రాయ్ ఇద్దరు (తరవాత గొప్ప పేరు తెచ్చుకున్న) కొత్త నటులని తన నటవర్గంలో చేర్చాడు. అపుగా సౌమిత్ర ఛటర్జి, అపు భార్య అపర్ణగా పధ్నాలుగేళ్ళ వయసున్న షర్మిలా ఠాగోర్. ఇద్దరికీ అంతకు ముందు పెద్ద నటనానుభవం లేదు. సౌమిత్రకి కొంచెం నటనానుభవం ఉంది. (బొత్తిగా అనుభవం లేని షర్మిలాకి మాత్రం సెట్లపై ఎలా నటించాలో చెపుతున్నప్పుడు, రాయ్ అరుస్తూ చెప్పేవాడట. తరవాత షర్మిలా రాయ్‌ని గుర్తు చేసుకుంటూ, “మానిక్‌దా అతి గొప్ప నటుడు” అంది).


అపు, అపర్ణ

సౌమిత్ర ఛటర్జీ తరవాత ఎన్నో రాయ్ సినిమాల్లో (దాదాపు 15) నటించి, బెంగాలీ సినిమా పరిశ్రమలో అందరూ, “సౌమిత్ర మా సినిమాల్లో నటిస్తే బాగుండును!” అనుకునే స్థాయికి ఎదిగాడు. షర్మిలా తరవాత బాలీవుడ్ సినిమాల్లో తారగా వెలిగిన విషయం పాఠకులకు పరిచయమే! ఆమె తరవాత రాయ్ తీసిన దేవి, నాయక్, అరణ్యర్ దిన్ రాత్రి, సీమబద్ధ, సినిమాలకి పనిచేసింది.

సౌమిత్ర ఛటర్జి కొన్ని రాయ్ సినిమాల్లో పనిచేసిన తరవాత, తన అనుభవాలు కొన్ని మరీ సెటాన్ (Marie Seton) [1]పుస్తకంలో తెలియజేస్తాడు. రాయ్ సినిమాల ద్వారా సినిమాకి కావలసిన అసలైన నటన అంటే ఏమిటో తెలిసిందని సౌమిత్ర ఛటర్జి చెప్పుకున్నాడు. బెంగాలీ నటులు సాధారణంగా రంగస్థల అనుభవం ఉన్నవారు. రాయ్ సినిమాలకి ముందు సినిమా నటనకీ రంగస్థల నటనకి ఉన్న వ్యత్యాసాన్ని వీరెవ్వరూ అంతగా పట్టించుకోలేదు. అందువల్ల సినిమాలో నటన నాటకీయంగా కనిపించేది.

రాయ్ సినిమాలు ఒక గొప్ప మార్పుని తెచ్చాయనీ, నటులు సినిమా మాధ్యమానికి సరిపోయినట్టు నటనను మార్చుకున్నారనీ, ఇది కేవలం రాయ్ వల్లేననీ, సౌమిత్ర చెపుతాడు: “రాయ్ మొదటిసారి నన్నడిగనప్పుడు ఎలా నటించాలో నాకు తెలియలేదు. అతిగా నటిస్తానేమో, డైలాగు గట్టిగా చెబుతానేమో అన్న భయం వేసింది. నాటకంలోలా కాకుండా (సినిమాలో) మైకు దగ్గరగానే ఉంటుంది. మన హావభావాలు చాలా దగ్గరినుండే చూపబడతాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మితంగా నటించాల్సి వుంటుంది. ఇలా చిత్రించడంలో (తెర వెనుక ఉన్న) దర్శకుడే తెరమీది పాత్రకన్నా ముఖ్యమైన నటుడౌతాడు. రంగస్థల నటనానుభవం ఒక పాత్రను అర్ధం చేసుకోడానికి సహాయపడుతుంది. కానీ, ఆ అనుభవాన్ని సినిమా నటనకు తగినట్లుగా మార్చుకోగలగాలి. పథేర్ పాంచాలి చూసిన తరవాతే, సినిమా పై నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది”.

సౌమిత్ర అభిప్రాయాలు, రాయ్ తన సినిమాల ద్వారా, తన దర్శకత్వపు ప్రతిభ ద్వారా భారతీయ చలన చిత్ర రంగంలో తెచ్చిన ఒక గొప్ప మార్పును ఎత్తిచూపిస్తాయి. అలా ఈ ఇద్దరు కొత్త నటులూ రాయ్ నుంచి ఎంతో నేర్చుకుంటూ, అద్భుతమైన నటనను ప్రేక్షకులకు చూపించగలిగారు.

అపు, అపర్ణల వైవాహిక జీవిత చిత్రీకరణ

‘అపు చిత్రత్రయం’ లోని మూడు సినిమాల్లో, పథేర్ పాంచాలీలో అక్కాతమ్ముళ్ళ అనుబంధం, అపరాజితొలో తల్లీకొడుకుల అనుబంధం, అపు సంసార్‌లో భార్యాభర్తల సంబంధాలను తెరపై చూపించటంలో ఒక విశిష్టత కనపడుతుంది. చాలా తెలుగు సినిమాల్లో పేలవంగా చిత్రీకరించబడే కుటుంబ సంబంధాలకు పూర్తిగా భిన్నంగా రాయ్ సినిమాల్లో ఈ అనుబంధాలు ఎంతో సహజంగా ఉండి మనసుకు హత్తుకు పోతాయి. ఉదాహరణకి, పెళ్ళైన తరవాత కలకత్తాలోని బ్రహ్మచారి అపు ఇంటిలోనే అపు, అపర్ణ తమ కొత్త కాపురం మొదలెడతారు. బ్రహ్మచారి ఇంటి వాతావరణం పూర్తిగా అప్పుడు మారిపోతుంది. పక్క మీద రెండు దిండ్లు, కిటికీలకి కర్టెన్లు, కిటికీ గోడ మీద చిన్న కుండీలో ఒక మొక్క. స్త్రీ ఇంటిలో ప్రవేశించగానే ఇంటి శోభ మారుతుంది కదా!


అపు, అపర్ణ

ఒక రోజు, అపు నిద్ర లేచిన వెంటనే దిళ్ళ మధ్య తల పిన్ను పడి ఉండటం గమనిస్తూ, అంతలో, ఇంట్లో పనులు చేస్తున్న అపర్ణను తదేకంగా చూస్తూ ఉంటాడు. ఆ చూపులకి సమాధానంగా అపర్ణ, “నువ్వెప్పుడూ నీ భార్యను ఇంతకు ముందు చూడలేదా?” అంటుంది. అపు నవ్వుతూ తలపిన్నుతో ఆడుతూ, తలగడ కింద ఉన్న సిగరెట్ పెట్టె కేసి చెయ్యి సాచి, పెట్టె అందుకుంటాడు. పెట్టె తెరవగానే, అపర్ణ రాసిన ఒక చీటీ పెట్టెలో చూస్తాడు అపు. “భోజనం తరవాత మాత్రమే ఒక్క సిగరెట్టు కాలుస్తానని మాట ఇచ్చావు కదా!” అదీ చీటీ సారాంశం. నవ్వుతూ, అపు పెట్టెని మూసేస్తాడు.

ఇటువంటి అతి సామాన్యమైన విషయాల ద్వారా, భార్యా భర్తల మధ్య ఉన్న అపురూపమైన అనురాగాన్ని నిర్ధారిస్తాడు రాయ్. ఈ సినిమా చూసిన తరవాత ప్రముఖ ప్రెంచి సినిమా దర్శకుడు జాఁ రెన్వార్, “ఒక్క కౌగిలింత కూడా లేకుండా, ఆలూమగల మధ్య ప్రేమను, ఆప్యాయతను అతి శక్తివంతంగా చూపించాడు” అన్నాట్ట! తరవాత ఒక దృశ్యంలో, కానుపు కోసం పుట్టింటికి వెళ్ళే ముందు, అపు నోట్లో సిగరెట్‌ని లైటర్‌తో వెలిగిస్తుంది అపర్ణ. ఆ వెలుగులో వెలిగి పోతున్న అపర్ణని చూస్తూ:

అపు: “నీ కళ్ళల్లో ఏమిటది?”
అపర్ణ: (కొంటెగా) “కాటుక”

అపర్ణ ప్రసవం తరవాత పుట్టిన కొడుక్కి ‘కాజల్’ (కాటుక) అని పేరు పెట్టటం గమనించ తగ్గది. భార్య భర్తల మధ్య ఉన్న బంధాన్ని అతి సున్నితంగా చిత్రీకరించిన సన్నివేశాల్లో ఇది ఒకటి.