షట్పదిని ఛందస్సు పుస్తకాలలో లక్షణాలు మాత్రము చెప్పి వదిలి వేస్తారు. ఎందుకంటే షట్పది తెలుగు భాషలో వాడుకలో లేదు. దానికి కొన్ని కారణాలు కూడ ఉన్నాయి. వాటిని త్వరలోనే షట్పదులపైన నేను తయారు చేస్తున్న ఒక దీర్ఘ వ్యాసములో చర్చిస్తాను. షట్పదులను కవులు కావ్యములలో వాడక పోయినను, వాటి మూసలు కొన్ని పాటలలో ఉన్నాయి, ముఖ్యముగా జానపద సాహిత్యములో. ఈ వ్యాసములో నేను కనుగొన్న అట్టివాటినిగుఱించి తెలియబరుస్తాను. ఆంధ్ర సారస్వత పరిషత్తువారు, కృష్ణశ్రీ సంపాదకత్వములో దేశిసారస్వత శీర్షిక క్రింద స్త్రీల పౌరాణికపు పాటలు అనే ఒక పుస్తకమును 1963లో ప్రచురించినారు. ఇందులో సుమారు 60కి పైగా పాటలు ఉన్నవి. అందులో నాలుగు పాటలకు షట్పదుల లక్షణములు గలవు.
మొట్ట మొదట నాలుగు ముఖ్యమైన షట్పదుల లక్షణములను వివరిస్తాను. ఛందోగ్రంథములలో వివరించబడిన మూల షట్పది (ఆఱు ఇంద్ర గణములు, ఒక చంద్ర గణము) ఉపగణములతో (కన్నడములో అంశ గణములు) నిర్మితమయినప్పటికినీ గానయోగ్యమైన షట్పదులు మాత్రాబద్ధమైనవి. పేరుకు తగ్గట్లు షట్పదులకు ఆఱు పాదములు. మొదటి మూడు పాదములవలె చివరి మూడు పాదముల లక్షణములు. వీటి నడక లేక గతి మాత్రల సంఖ్యపైన ఆధారపడి ఉంటుంది. ముఖ్యముగా మూడు మాత్రల గతిని త్ర్యస్రగతి అని, నాలుగు మాత్రల గతిని చతురస్రగతి అని, ఐదు మాత్రల గతిని ఖండగతి అని, ఏడు మాత్రల గతిని (సామాన్యముగా వరుసగా మూడు, నాలుగు మాత్రలు) మిశ్రగతి అని పిలుస్తారు. ఉదాహరణమునకు వృత్తములలో ఉత్సాహ లయతో ఉండే సుగంధికి త్ర్యస్రగతి, తోటకమునకు చతురస్రగతి, స్రగ్విణికి ఖండగతి, మత్తకోకిలకు మిశ్రగతి. షట్పదులు ఎన్నో రకములు. ఇప్పుడు మనము భోగ (త్ర్యస్ర), శర (చతురస్ర), కుసుమ (ఖండ), భామినీ షట్పదులను గుఱించి తెలిసికొందాము. షట్పదులలో 1, 2, 4, 5 పాదముల అమరికలు ఒక విధముగా, 3, 6 పాదముల అమరికలు మఱొక విధముగా ఉంటాయి. ఛందస్సులోని షట్పదులకు ఆఱు పాదములకు ద్వితీయాక్షర ప్రాస నియమమును పాటించాలి. కాని పాటలలో, ముఖ్యముగా జానపద సాహిత్యములో, ఈ ప్రాస ఉండదు. మొదటి రెండు పాదములకంటె మూడవ పాదములో ఎక్కువగా గణములు ఉంటాయి. మూడవ, ఆఱవ పాదములలో మిగిలిన పాదముల గణములతోకూడ అదనముగా వాటిలోని అర్ధ గణములు, ఒక గురువు ఉంటాయి. క్రింది పట్టికలో వాటిని చూడ వీలగును. మొదటి మూడు పాదముల లక్షణములు మాత్రమే ఇవ్వబడినవి. పాదములకు మధ్య / గుర్తు చూపబడినది.
- భోగ షట్పది – 3,3, 3,3 / 3,3, 3,3 / 3,3, 3,3 – 3,3,2
- శర షట్పది – 4,4 / 4,4 / 4,4 – 4,2
- కుసుమ షట్పది – 5,5 / 5,5 / 5,5 – 5,2
- భామినీ షట్పది – 3,4, 3,4 / 3,4, 3,4 / 3,4, 3,4 – 3,4,2
పై నాలుగు షట్పదులకు నేను వ్రాసిన ఉదాహరణములను క్రింద ఇచ్చినాను. వాటిని చదివితే ఇవి చక్కగా అర్థమవుతాయి.
భోగ షట్పది – 3,3, 3,3 / 3,3, 3,3 / 3,3, 3,3 – 3,3,2
తావి లేని పూవువోలె
నీవు లేక నేను లేను
నీవె నాకు సర్వ జగము – నీవె స్వర్గము
భావమందు నీవె నాకు –
రావమందు నీవె నాకు
జీవమందు నీవె నాదు – జీవితేశ్వరీ(రా)
శర షట్పది – 4,4 /4,4 / 4,4 – 4,2
నిను గను క్షణమున
మనమున నలజడి
యనిశము నిజముగ – హరిణముఖీ
కనుగవ విరియఁగ
తను విట మురియఁగ
నను గను రయముగ – నగుచు సఖీ
కుసుమ షట్పది – 5,5 / 5,5 /5,5 – 5,2
మనసులో నీవెరా
తనువు నీకేనురా
కనుల జూడంగ రా – కమలనేత్ర
వినతులన్ వినఁగ రా
ప్రణతులన్ గొనఁగ రా
నిను గనంగా నిటన్ – నిలిచియుంటి
భామినీ షట్పది – 3,4, 3,4 / 3,4, 3,4 / 3,4, 3,4 – 3,4,2
కామలతలో పుష్పలత లీ
యామనిన్ నవ నూత నాశల
నా మనస్సున లేపె గూర్మిగ – నాదముల నింప
భామినీ, షట్పదిని గనుమా
యా మహోజ్జ్వల వర్ణములతో
భూమిజమ్ముల కుసుమములపై – మూఁగి మ్రోఁగె సుమా
స్త్రీల పాటలలో షట్పదులలోని నియతమైన ప్రాస సామాన్యముగా మృగ్యము. లయ కోసము కొన్ని పదములను కూడ పొడిగించుకోవాలి. కొన్ని చోటులలో లఘువు ఉండకపోతే దానికి ముందున్న అక్షరమును సాగించి పాడాలి. కాని మొత్తము మీద ఛందస్సులోని లయ సుస్పష్టముగా విదితము. మూడవ, ఆఱవ పాదములలోని చివరి అక్షరము గురువైనా, సామాన్యముగా అది లఘువుగ ఉంటుంది. పాదాంత విరామమువలన, పొడిగింపువలన అది గురుతుల్యము. నేను గమనించినంతవఱకు చతురస్రగతిలోని శరషట్పది నాకు ఈ పాటలలో కనబడలేదు. భోగ, కుసుమ, భామినీ షట్పదులకు మాత్రమే ఉదాహరణములు దొఱికినవి. తులసీ దళము, వరదరాజు పెండ్లి పాట భోగ షట్పది మూసలో; గజేంద్రమోక్షము కుసుమ షట్పది మూసలో; గుమ్మడు పాట భామినీ షట్పది మూసలో ఉన్నాయి. భామినీషట్పదిని కొందఱు ముత్యాలసరముల క్రింద కేటాయిస్తారు. అది సరి కాదు. ముత్యాలసరములో చివరి పాదములోని మాత్రల సంఖ్య ఒక స్థిర సంఖ్య కాదు. కాని భామినీషట్పదిలో అది ముత్యాలసరముల రీత్యా ఏడు మాత్రలు. ఈ పాటలు ఏనాటివో అనే విషయము నాకు తెలియదు. పుస్తకములో పీఠిక గాని, ముందుమాట గాని లేదు. నా ఉద్దేశములో ఇప్పటివి కొన్ని మార్పులతో శతాబ్దములుగా ఉండి ఉండాలి, ఆడవాళ్ళ నోటిలో వారి దైనందిన కార్యక్రమములలో ఒక భాగముగా ఉండి ఉండాలి. భోగషట్పది రూపములో ముద్దు పళని వ్రాసిన పది సప్తపదులు నేటికి ఉన్నాయి. వాటిని నేను ఛందస్సు, రచ్చబండ కూటములలో డిసెంబరు 2006 – జనవరి 2007 కాలపరిధిలో ప్రచురించియున్నాను. వాటిని ఇక్కడ జత చేస్తున్నాను.
లయప్రధానమైన ఈ పాటలలో కొన్ని పదములను సాగదీసే తీరును క్రింది పంక్తులలో గమనించవచ్చును. మాత్రాగణముల విఱుపును నిలువు గీతలతో చూపినాను –
కోట|లోను | వున్న|వన్ని |
వర(వార లేక వరా)|హాలు | మొహ(మోహ లేక మొహా)|రీలు |
అన్ని | వేసి | తూచి|నాను | మొగ్గ|దాయె|ను(నూ)
యింట|నున్న | పలక|సర్లు |
పతక|ము(మూ)లు | తెచ్చి|నాను |
తూగ|డాయె | కృష్ణ|మూర్తి | చోద్య|మంద|గా – తులసీదళము (భోగషట్పది)
ఈ కొలను।లోనుంచి
ఈ కనక । కోనలలో(లొ)
వుండగల । భూతములు । అణచుకొఱ।కు(కూ)
బ్రహ్మాండ|మును కాచు |
పరమాత్ము|ని(నీ) దలచి |
అందందు | మొఱపెట్టి | కుయ్యసా|గె(గే) – గజేంద్రమోక్షము (కుసుమషట్పది)
సంత|సమ్ముగ | రామ|కృష్ణులు |
సదయు|లై రే|పల్లె | వాడలో(లొ) |
యింతు|లకు పది|యారు | వేలకు | ఇష్ట | మొనరిం|చి(చీ)
కుంతి | సుతునకు | సార|థైతిని |
కురు బ|లమ్ముల | నణచు | చోటను |
మంత|నమ్ముగ | గుమ్మ|డనియెడు | మాట | నేనెఱు|గ(గా) – గుమ్మడు పాట (భామినీషట్పది)
ఈ పాటలను ఎలా పాడాలి, ఎవరైనా పాడియున్నారా అనే విషయము నాకు తెలియదు. కాని ఇట్టి పాటలను అందఱు పాడే విధముగా ఒక స్థాయి (octave) కన్న తక్కువగా ఉండే అంతరములో పాడుకొంటారు. సామాన్యముగా ఇట్టివి ఒక half octaveలో ఇమిడేటట్లు పాడుకొంటారు. అందువలన సంగీతములో తరిఫీదు ఉన్నవారు, మంచి శారీరము ఉన్నవారు మాత్రమే వీటిని పాడుటకు అర్హులు అని భావించరాదు. తమ కాలమును ఆనందముగా గడుపుకొనుటకోసము ఎవ్వరైనా వారి వారి గొంతుకు తగినట్లు పాడుకొన వచ్చును. నాకు వృద్ధాప్యమువలన మంచి గళము లేదు. కాని ఇట్టి పాటలు ఇతర గాయకులను ఆకర్షిస్తాయి అనే ఆశతో నాకు తోచినట్లు కొన్ని పంక్తులను (మొత్తము పాటలను కాదు) పాడి వీటితో జతపఱచినాను. భోగషట్పది మెట్టు కన్నడములో విజయవిఠలదాసు వ్రాసిన సుధామచరిత్రెను పోలినది.
- ముద్దుపళని ఎనిమిదవ సప్తపది – ధ్వని ముద్రిక 1
- తులసీ దళము – ధ్వని ముద్రిక 2
- గజేంద్రమోక్షము – ధ్వని ముద్రిక 3
- గుమ్మడు పాట – ధ్వని ముద్రిక 4