ఉపోద్ఘాతము
భాషాసిద్ధి లోకంలో జరిగితే, కవిత్వ భాషను కవులు తయారు చేసుకుంటారు. సాధారణభాష కవిత్వ భాషగా మారే క్రమం ఒకటుంటుంది. ఆ క్రమంలో జరిగే పరిణామాలను గుర్తిస్తే కవిత్వ భాషాస్వరూపం అర్థం అవుతుంది.
ఇవి చేరాగారు “కవిత్వభాష” అన్న వ్యాసంలో చెప్పిన మాటలు. వ్యవహారంలో ఉండే మామూలు మాటలనుంచి కవిత్వాన్ని సృష్టించవచ్చు కాని, ఆ మామూలు మాటలే కవిత్వం కాదన్న సంగతి కవిత్వాన్ని రుచిచూసిన ఎవరికైనా తెలిసిన విషయమే. సాధారణ వ్యవహారంలో ఉన్న భాషకీ కవిత్వంలో ఉన్న భాషకీ కొంతైనా వ్యత్యాసం ఉండడం సహజం.
కవిత్వంలో భాషకి స్థూలంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మామూలు విషయాన్నైనా చదివేవాళ్ళ (వినేవాళ్ళ) మనసులకి బాగా హత్తుకొనేట్టు చెప్పడం. మామూలు వ్యవహారంలో మనం వాడే భాషకి యీ ప్రయోజనం సాధారణంగా ఉండదు. మన భావాన్ని ఎదుటివాళ్ళకి వ్యక్తం చెయ్యడం వరకే సాధారణ భాష చేసే పని. ఒకవేళ నొక్కి చెప్పాల్సిన సందర్భం వచ్చినా, ఉచ్చరించే స్వరమూ, హావభావాలూ వంటి భాషేతరమైన ప్రక్రియల సహాయం తీసుకుంటాం (పిల్లల మీద కోపాన్ని ప్రదర్శించే సందర్భం దీనికి మంచి ఉదాహరణ!). కవిత్వంలో అది కుదరదు. చెప్పే విషయాన్ని హత్తుకొనేట్టు చెప్పడానికి కవికి ఉన్న పరికరం భాష ఒక్కటే. కాబట్టి భాషలోంచి కవిత్వాన్ని పుట్టించే ఆల్కెమీ కవికి తెలిసి ఉండాలి.
రెండవ ప్రయోజనం – ఒకోసారి కవి చెప్పాలనుకున్న విషయం మామూలు విషయం కాకపోవచ్చు. కవి ఊహలోంచి పుట్టిన ఒక విచిత్రమైన కల్పన కావొచ్చు. లేదా మాటలలో చెప్పలేని ఒక గాఢమైన అనుభూతి కావొచ్చు. ఇలాటి సందర్భాలలో సాధారణ భాష పనిచెయ్యకపోవచ్చు. అప్పుడు కవి తనదైన భాషని సృష్టించుకుంటాడు.
కవిత్వభాష వ్యవహార భాషకన్నా ఎందుకు భిన్నమైనదో చేరాగారి “కవిత్వభాష” అన్న వ్యాసం మరింత విస్తృతంగా చర్చిస్తుంది. ఈ రెంటికీ అసలు తేడా ఉంటుందా అన్న అనుమానం ఇంకా ఉంటే, ముందు ఆ వ్యాసం చదవమని నా విన్నపం. వ్యావహారిక కవిత్వ భాషలకి తేడా ఉంటుందన్న విషయాన్ని స్థాపించడమే ఆ వ్యాసంలో చేరాగారి ముఖ్యోద్దేశం. ఆ తేడా ఎలాటిదో విశ్లేషించడం, ఇప్పుడు యీ వ్యాసంలో నా ముఖ్యోద్దేశం. కవిత్వభాషకీ, వ్యావహారిక భాషకీ మధ్యనున్న తేడాలు, భాషలో ఉన్న వివిధ ప్రత్యేకాంశాలు కవిత్వంలో సాధించే ప్రయోజనము గూర్చి యీ వ్యాసంలో నాకు తెలిసినంతలో విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.
వెయ్యేళ్ళకు పైగా చరిత్రగల మన తెలుగు భాషలో, వస్తు రూపాలలో చాలా వైవిధ్యమున్న కవిత్వసంపదే సృష్టించబడింది. ఆ మొత్తాన్నీ ఈ చిన్న వ్యాసంలో పరిగణించడం అసాధ్యం. అందువల్ల యీ వ్యాసం సమగ్రమైనది కాదన్న సంగతి నొక్కి చెప్పక్కరలేదనుకుంటాను. “కవిత్వ భాష” వ్యాసంలో చేరాగారు ప్రస్తావించిన కవిత్వలక్షణాలు చాలా వరకూ చదువుకున్న వాళ్ళు రాసే/చదివే కవిత్వానికే వర్తిస్తాయి. జానపద కవిత్వానికి వర్తించవు. ఈ వ్యాసంలో కూడా నేను చర్చించేది ప్రథానంగా జానపదేతర కవిత్వాన్ని గురించే. జానపద కవిత్వంలోని భాష గురించి వేరే ప్రత్యేకమైన విశ్లేషణ జరగవలసిన అవసరం ఉంది.
ముందుకి పోయేముందు, నా ఆలోచనలని స్పష్టం చెయ్యడానికి, కొన్ని పదాలకి నాకున్న నిర్వచనాలని ఇవ్వడం అవసరం. ఇవి చాలామందికి తెలిసిన పదాలే అయినా, వీటిని చాలామంది చాలా అర్థాల్లో (సరైన నిర్వచనం ఇవ్వకుండా) ప్రయోగించారు. కాబట్టి వీటిని అర్థంచేసుకోడంలో కొంత గందరగోళం ఏర్పడింది. భాషలోని రకాలని సూచించే పదాలివి – గ్రాంధికభాష, వ్యావహారిక/వాడుక భాష, రాసే భాష, మాట్లాడే భాష, కావ్యభాష, కవిత్వభాష.
ముందు అన్నిటికన్నా సులువైన మాట్లాడే భాష – ఇది సాధారణమైన వ్యవహారంలో, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఉపయోగించే భాష.
రాసే భాష – దీన్ని సరిగ్గా చెప్పాలంటే, “రచనా భాష” అనాలి.మనకి సారస్వతంలో అనేక రచనా ప్రక్రియలు ఉన్నాయి కదా – వ్యాసం, ఉపన్యాసం, కథ, కవిత్వం, వార్త… ఇలా. ఇవన్నీ రచనలే. వీటికి ఉపయోగించే భాష రచనా భాష. ఇది మాట్లాడే భాషకన్నా ఎందుకు ఎలా భిన్నంగా ఉండగలదో చేరాగారు తన “మాట్లాడే భాషా, రాసేభాషా ఒకటేనా? అవును/కాదు” అన్న వ్యాసంలో విపులంగా చర్చించారు.
గ్రాంధిక భాష – గ్రంధాలలో ఉపయోగించే భాష అన్నది యీ పదానికి వ్యుత్పత్తి అయినా, ఇక్కడ గ్రంథాలంటే, ప్రాచీన గ్రంథాలే (పందొమ్మిదవ శతాబ్దానికి పూర్వం వచ్చిన గ్రంథాలు). మరో విధంగా చెప్పాలంటే, ప్రౌఢ బాల వ్యాకరణాలకి నిబద్ధమైన భాష.
కావ్య భాష – వ్యావహారిక భాషోద్యమ కాలంలో దీన్ని గ్రాంధిక భాషకి పర్యాయపదంగా వాడారు. ప్రాచీన గ్రంధాలన్నీ ప్రథానంగా కావ్యాలే అయినందువలనా, అప్పటికి ఆథునిక భాషలో కావ్యాలు రానందువలనా, యీ పదాన్ని గ్రాంధికభాషకి పర్యాయపదంగా ఉపయోగించడం వల్ల ప్రమాదమేమీ జరగలేదు. కాని యిప్పుడు మనకి ఆధునికభాషలో వచన కావ్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి యీ పదాన్ని గ్రాంధికభాషకి పర్యాయపదంగా ఉపయోగించడం సమంజసం కాదు. అసలీ పదాన్ని ఉపయోగించడమే యిప్పుడు అనవసరం.
వ్యావహారిక/వాడుక భాష – ఇది కూడా వ్యావహారిక భాషోద్యమ కాలంలో సృష్టించబడిన పదమే. అయితే ఆ కాలంలోనే దీనికి సరైన నిర్వచనం లేక కొంత గందరగోళాన్ని సృష్టించింది. ఇది మాట్లాడే భాషా? రాసే భాషా? ఎవరు మాట్లాడేది, ఎవరు రాసేది? దీనికీ గ్రామ్యభాషకీ ఉన్న తేడా ఏమిటి? ఇలా చాలా ప్రశ్నలు వచ్చాయి. చాలా రకాలైన సమాధానాలూ వచ్చాయి. ప్రస్తుతం యీ వ్యాస పరిధిలో వాటన్నిటి గురించీ చెప్పే అవసరం లేదు. నేనీ వ్యాసంలో వ్యావహారిక/వాడుక/సాధారణ భాష అంటే “కవిత్వ భాష” కాని భాష అనే అర్థంలో ఉపయోగించాను. ఇది మాట్లాడే భాష కావచ్చు, కవిత్వేతరమైన రచనా భాషా కావచ్చు.
కవిత్వ భాష – కవిత్వంలో కనిపించే భాష. ఈ కవిత్వం పద్య కవిత్వం కావచ్చు, వచన కవిత్వం కావచ్చు, ప్రాచీన కవిత్వం కావచ్చు, ఆధునిక కవిత్వం కావచ్చు. జానపద కవిత్వమూ కావచ్చు కానీ, నేను పైన చెప్పినట్టుగా యీ వ్యాసంలో నేను ప్రస్తావించిన విషయాలు జానపద కవిత్వానికి వర్తించకపోవచ్చు.
మరొక్క విషయం. కవి నిరంకుశుడు కాబట్టి, కవిత్వంలో మనకి కనిపించే భాషని సూత్రీకరించడం అసంభవం. అంచేత యీ వ్యాసంలో నేను చెయ్యదలచుకున్న పని అది కాదు. కవిత్వ భాషలో కనిపించే కొన్ని సామాన్య ప్రయోగరీతులని (common patterns of usage) కనిపెట్టే ప్రయత్నం మాత్రమే యిది. భాషలోని కొన్ని విశేష అంశాలని తీసుకొని, కవిత్వ భాషలో వాటికున్న ప్రయోజనాన్ని పరిశీలించి, అవి వాడుకభాష కన్నా ఏలా భిన్నమో గమనించి, తద్వారా కవిత్వ భాష ప్రత్యేకతలని గుర్తించే ప్రయత్నమే యీ వ్యాసం.