పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    05/15/2014 8:50 pm

    ముందుగా, ఇంత విపులమైన పరిశోధనా పత్రాన్ని రాసిన శ్రీనివాస్, నారాయణరావు గార్లని మనసా అభినందించాలి. ఎంతో పరిశ్రమించారు, ఎన్నో ఆధారాల్ని పరిశీలించారు, మరెన్నో లోచూపుల్ని (insights) మనకందించారు. నాకు బాగా నచ్చిన విషయం – ఏయే ప్రశ్నలకి సమాధానాలు వెదికే ప్రయత్నం చేశారో స్పష్టంగా ముందస్తుగా చెప్పెయ్యటం. “ఇప్పుడు ఈ వ్యాసం ఉద్దేశం… బ్రౌన్‌ ఎవరు? ఏ పరిస్థితుల్లో తెలుగు దేశానికి వచ్చాడు? ఆయన చేసిన పని ఏమిటి? ఆయన దగ్గర పండితులు, అంత పండితులు కానివాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎలాంటి పని చేశారు? బ్రౌన్‌ చేసిన పని తెలుగుకి ఎంత వరకు ఉపయోగపడింది? దానివల్ల అన్నీ లాభాలేనా, నష్టాలేమయినా జరిగాయా? ఈ విషయాల్ని సవిమర్శకంగా పరిశీలించి సాధ్యమయినంత బాధ్యతాయుతంగా కొన్ని ఆలోచనలు ప్రతిపాదించడం ఈ వ్యాసంలో మేము తలపెట్టిన పని.”

    ఇప్పటి వరకు అభిప్రాయాలు చెప్పిన చాలామంది అసలు ఈ భాగాన్ని చదివినట్టు లేరు. ఒకవేళ చదివినా అదంత ముఖ్యమైన విషయం కాదని వదిలేసినట్టున్నారు. ఇక్కడ ఒక general statement ఇవ్వాలనిపిస్తున్నది – నేను చూసినంతవరకు సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ, రచనల గురించి కాక వాటి రచయిత/త్రుల గురించి, వారి motivations గురించి, వారికున్న hidden agendaల గురించి విమర్శకుల అభిప్రాయాలు, ఊహలు, ఆలోచనలతో నిండిపోతున్నది. అదివరకు సంయమనంతో లోతైన సాహిత్యావలోకనం చేసిన వాళ్లు కూడ ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూ సాహిత్యవిమర్శని నేతిబీరకాయగా మార్చెయ్యటం మన దౌర్భాగ్యం. ఇక అసలు విషయానికి వస్తాను.

    వారు వేసుకున్న ప్రశ్నలకి ఈ వ్యాసంలో వ్యాసకర్తలు సమాధానాలు ఇచ్చారా? అని చూస్తే “బ్రౌన్‌ ఎవరు? ఏ పరిస్థితుల్లో తెలుగు దేశానికి వచ్చాడు? ఆయన చేసిన పని ఏమిటి? ఆయన దగ్గర పండితులు, అంత పండితులు కానివాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎలాంటి పని చేశారు?” అన్న ప్రశ్నలకి స్పష్టమైన సమాధానాలు సాధించారని నా అభిప్రాయం. “బ్రౌన్ చేసిన పని తెలుగుకి ఎంత వరకు ఉపయోగపడింది?” అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి చాలా విపులమైన సమాచారాన్ని క్రోడీకరించారు. ఐతే మరీ విపులం కావటంతో దీని సమాధానం విషయంలో నాకు కొంత గందరగోళం కనిపించింది. ఒక ఉదాహరణ: “ఫుస్తకాలు ఎలా పరిష్కరించాలో, దొరికిన తాళపత్ర ప్రతులన్నీ దగ్గర పెట్టుకుని ఏ రకంగా పాఠ నిర్ణయం చెయ్యాలో విశదంగా నిర్దేశించాడు బ్రౌన్‌. ఈ పద్ధతిలో అతను ఇంగ్లండు, ఇటలీ, జర్మనీలలో గ్రంథాల పరిష్కరణలో అనుసరించే విధానాన్నే తెలుగు పుస్తకాలకి వర్తింపచేశాడు. ఈ విధానంలో అతను కొన్ని సొంత అభిప్రాయాలు తెలుగు భాషలో ప్రవేశ పెట్టాడు…. కానీ ములుపాక బుచ్చయ్య వసుచరిత్రకి వ్యాఖ్యానం రాసినప్పుడు బ్రౌన్ నిర్దేశించిన పద్ధతుల్ని అనుసరించలేదు. ఆయన వ్యాఖ్యానం గ్రాంథికంలో ఉంది కాబట్టి ముద్రించలేదని బంగోరె మొదలుకొని ఆరుద్ర వరకు చాలా మంది అన్నప్పటికీ, ఆ వ్యాఖ్యానం కళ్లారా చూస్తే కానీ బుచ్చయ్యగారు అనుసరించిన పద్ధతులేమిటో మనకు స్పష్టంగా తెలియవు. ఈ కావ్యాలని తిరిగి అచ్చు వేసిన వాళ్ళు ఎవ్వరూ బ్రౌన్ నిర్ణయించిన పద్ధతుల్ని పాటించలేదు.” అని ఒక పక్క చెబుతూనే, మరొకచోట “ఇది ఇలా ఉండగా, అంతకన్నా ముఖ్యమైన విషయమేమిటంటే బ్రౌన్ తన పండితులచేత అనుసరింప జేసిన పరిష్కరణ విధానం — అరసున్నలు, బండి-రల విషయంలోనూ, అఖండయతి విషయంలోనూ, ఇతర వ్యాకరణ విషయాల లోనూ తప్ప — వావిళ్లవారు, ప్రభాకరశాస్త్రిగారు, ఇంకా ఇతర పండితులు, పరిశోధకులు దాదాపు పూర్తిగా అనుసరించారు.” అన్నారు. అదా ఇదా?

    ఈ వ్యాసచర్చ నుంచి నాకు అర్థమైనదేమంటే బ్రౌన్ చేసిన పన్లన్నిట్లో కొంత ఉపయోగకరమైనది నిఘంటువుని తయారుచెయ్యటం, అనేది. మిగిలినవన్నీ వ్యాసకర్తల దృష్టిలో తెలుగు సాహిత్యానికి నష్టం కలిగించినవే. నామట్టుకు నాకు, వ్యాసాన్ని వారు ముందు వేసిన ప్రశ్నలకి సమాధానాలుగా విభజించివుంటే follow కావటం ఇంకొంచెం తేలిగ్గా వుండేది.

    నాకు నచ్చని ఒక విషయం – వారు వేసుకున్న ప్రశ్నలకి సంబంధం లేని అనేక విషయాల్ని మధ్యలో తీసుకువచ్చి నారాయణరావు గారు ఇప్పటివరకు చేసిన చాలా పరిశోధనల సారాన్నంతటినీ ఈ వ్యాసంలో చొప్పించే ప్రయత్నం చెయ్యటం. ఒకవేళ ఇదంతా “బ్రౌన్‌ చేసిన పని తెలుగుకి ఎంత వరకు ఉపయోగపడింది? దానివల్ల అన్నీ లాభాలేనా, నష్టాలేమయినా జరిగాయా?” అన్న ప్రశ్నకి సమాధానం ఇచ్చే క్రమంలో జరిగిందనుకున్నా కందుకూరి, కట్టమంచి లాటి వాళ్లని ఈ కథనంలోకి లాక్కురావటం, colonialism గురించిన ఉపన్యాసాలు, పాండిత్యప్రదర్శనకి తప్ప చెప్పదలుచుకున్న విషయానికి అంతగా సహకరించాయనిపించవు. చివరగా, కేవలం ఒక bibliography కాకుండా, ఏ ఆధారాలు వ్యాసానికి ప్రత్యక్షంగా ఉపయోగపడ్డాయో ముందుగా ఇచ్చి, ఆ తర్వాత మిగిలిన ఉపయుక్త గ్రంథాల పట్టిక విడిగా ఇస్తే చూసేవారికి మరీ భయం కలక్కుండా ఉంటుందనుకుంటాను.

  2. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి కే.లక్ష్మీధర్ అభిప్రాయం:

    05/15/2014 2:00 pm

    గౌరవనీయులైన ఈ మాట పత్రిక సంపాదకులకు:

    మీ పత్రికలో ప్రచురింపబడిన మనకు తెలియని బ్రౌన్‌దొర వ్యాసం పై నా స్పందనను వ్రాస్తున్నాను ప్రచురించగలరు. పై వ్యాసాన్ని ప్రదాన వ్యాసంగా గుర్తించి ప్రచురించిన సంపాదకులకు జేజేలు.

    నా స్పందన రెండు భాగాలు:

    1) వ్యాసం ఎంతో సంయమనంతోను పరిశోధనతోను వ్రాయడం జరిగినది జంట రచయితలు సత్యం తెలపటానికి పడిన శ్రమకు ఇచ్చిన ఆధారాలకు అభినందిస్తున్నాను. (ఆ రకమైన పరిష్కరణకి ఇంకా అవకాశం వుంది. తాళపత్ర ప్రతులు దొరికే జాగాలు, వాటిని ఉపయోగించిన వ్యక్తుల యొక్క సమాచారం మనం చాలా చోట్ల పోగొట్టుకున్నా ఇంకా చాలా సమాచారం మిగిలే వుంది.) వ్యాసంలోని పై వాక్యాలకు సంబందించి మరింత వివరంగా తెలిపి ఉంటే బాగుండేది.

    2) వ్యాసం ఎంత బాగున్నా, సంపాదకులు ఎంత ప్రాదాన్యత ఇచ్చినా వ్యాసంపై స్పందనలు చూస్తే ఎంతో చింత కలుగుతున్నది. ఎంత వ్యంగ్యం, ఎంత వెక్కిరింపు. నాకు తెలిసి భారత సైనికుడ్ని భారతీయులు పొగడడం, పాకిస్తాన్ సైనికుడ్ని పాకిస్తానీలు పొగడడం ప్రకృతి అయితే భారత సైనికుడ్ని పాకిస్తానీలు పొగడడం, పాకిస్తాన్ సైనికుడ్ని భారతీయులు పొగడడం వికృతి. కానీ విశ్లేషకులు లేక విమర్శకుల తీరు నాకు అత్యంత బాధ కలిగించినది. ఏమో పాపం రచయితలను త్వరలో ఏర్పడే ఫాసిస్టు ప్రభుత్వ ప్రాపకాన్ని పొందడానికి వ్రాశారని, జర్మనీలో తిరుగు వారు కాబట్టి స్వయంగా ఫాసిస్టులని, అనలేదు. ఏ పాపం చేశారని రావణుడు సీతను చరబట్టాడు అంటే రావణుడు రోజుకు వెయ్య లింగాలకు అభిషేకం చేశాడన్నట్లు ఉంది వీరి తీరు. తెలుగు దేశంలో డప్పు వాదమని, కొప్పు వాదమని ఎన్ని వాదాలో లేక ఇజాలో ఉండవచ్చు కానీ పప్పు వాదం మాత్రం ఉండకూడదు లాగుంది (నిజంగా బ్రాహ్మణులే పండితులై ఉంటే వారి శ్రమను కష్టాలను బ్రాహ్మణుడు వ్రాయకూడదా ఇదేనా రాళ్ళెత్తిన కూలీల చరిత్ర వ్రాయడమంటే). రోగుల్ని, దొంగలని కూడా వాడుకున్నారు అంటే అందరు రాజులు అలాగే చేస్తారంటారు, మరి అందరి చరిత్రలాగే వీరి చరిత్ర కూడా వ్రాయాలిగా. ఎవరైనా స్వంతానికే చేసుకుంటారట అయితే దానినేగా చరిత్రగా వ్రాయాలి లేకపోతే లేనిది వ్రాయమనా విమర్శకుల అభిప్రాయం. హతవిథీ! ఎంత మొకాలే మినిట్ ఇచ్చినా అర్దంకాలేదా? లేక అడ్డగోలుగా వాదించాలనా? మొకాలే ప్రభావం అర్ద శతాబ్దం గడిచినా ఇంకా ఎంత బలంగా ఉన్నదో తెలుస్తున్నది.

    నేను మొదటిసారిగా నా స్పందన ఈమాటకు వ్రాస్తున్నాను. నా స్పందనలో సత్యముందనుకుంటే సంపాదకులు ప్రచురించగలరు. నాకు చరిత్ర మీద ప్రేమేకాని పాండిత్యం లేనివాడ్ని.

    ఇట్లు
    కేతిరెడ్డి లక్ష్మీధర్‌రెడ్డి

  3. విముక్తం గురించి మణి వడ్లమాని అభిప్రాయం:

    05/15/2014 11:31 am

    రాధ గారు, యెంత పెద్ద మేధావి అయినా ఆమె కూడా ఒక స్త్రీ ఆడవారి అంతరంగపు లోతులు ఎవరికి అంతుపట్టదు కదా! అందులో ఆమెది ప్రేమతో కూడిన ఒక అభద్రత అతను వ్యక్తిత్వం తెలిసినా ఎక్కడో మనసులో పాము పిల్లలా చిన్న అనుమానం. తరువాత అది పటాపంచలయింది. మీరు ఆ సంఘర్షణని ఒక కొత్త కోణంలో చూపించారు అది నాకు బాగా అనిపించింది.

  4. భాగవతావతరణము గురించి దేశికాచారి అభిప్రాయం:

    05/15/2014 10:45 am

    అభిప్రాయములు వెలిబుచ్చిన సహృదయులందఱికి వందనములు.

    1. ‘విధు స్సుధాంశు శ్శుభ్రాంశు రోషధీశో నిశాపతిః’ అని చంద్రునికి, ‘నిశా నిశీథినీ రాత్రి స్త్రియామా క్షణదా క్షపా, విభావరీ తమస్విన్యౌ రజనీ యామినీ తమీ’ అని రాత్రికి, ‘స్వామీ త్వీశ్వరః పతి రీశితా’ అని పతిశబ్దమునకు అమరకోశము సమానార్థకములను చెప్పుచున్నది. వీటిద్వారా సంస్కృతాంధ్రాదిభారతీయభాషలలో గల సమాసనిర్మాణసౌకర్యంవల్ల చంద్రునికి అనేకమైన పదాలను సృష్టించవచ్చు. ఇట్లు సృజింపబడిందే యామినీశ్వరశబ్దము.

    2. ‘పరభృతగానముల్’ అనే పద్యంలో, పద్యధారలో కొట్టుకొనిపోయి, నేనెన్నిసార్లు చదివినా నాకుఁ దట్టని ద్వ్యక్షరలోపాన్ని సూచించినందులకు రామారావుగారికి కృతజ్ఞతలు. ఆపద్యము నీక్రిందివిధంగా సవరించినాను (సంపాదకులకు మనవి: వీలున్న ఈసవరణను చేర్చగలరు)

    పరభృతరమ్యగానములు బంభరబృందమనోజ్ఞనాదముల్
    హరిణసమూహగాత్రరుతు లన్యమృగావళిరావము ల్గడుం
    దఱచుగ మ్రోఁగుచు న్వనికి నవ్యమనోజ్ఞతఁ గూర్చినట్టి య
    వ్విరితఱిఱేనికై పొనరు విశ్రుతిగీతము లయ్యె నయ్యెడన్.

  5. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి indrakanti pinakapani అభిప్రాయం:

    05/15/2014 4:51 am

    ఎవ్వరూ కేవలం ప్రజలకు ఏదో ఒరగబెట్టాలనే చేయ నక్కర లేదు. ఏ కొంచెం ఒరిగినా ప్రజలు కృతజ్ఞతా పూర్వకంగా గుర్తుంచుకుంటారు. కాటన్ ను గుర్తుంచు కోవడానికి కారణం ఆయన కూలీలను ప్రేమగా చూసుకున్నాడని కాదు. అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ శ్రమ దోపిడీతో కూడి కూడా ప్రయోజనం లేని ప్రస్తుత జలయజ్ఞాలతో పోల్చి చూసుకునే.

    థామస్ అల్వా ఎడిసన్ ఫిలమేంటు బల్బును ప్రజల కోసం కనిపెట్ట లేదట. న్యూటను గురుత్వాకర్షణ శక్తీ డిటొ డిటొ… అయినా ఆయా ప్రస్తావనలు వచ్చినప్పుడల్లా వాళ్ళను తలుచుకోవడం భావదాస్యమై పోదు.

    విగ్రహాలు కట్టి, బలవంతంగా గొంతుకలో పోసి మింగించే విగ్రహాలు వేరే ఉంటాయి. వారిని గూడా ప్రజలు గుర్తుంచుకుంటారు… వేరే విధంగా.

  6. మాటలు గురించి Seetha అభిప్రాయం:

    05/15/2014 3:47 am

    Super

  7. పలుకుబడి: దిక్కులు, పక్కలు గురించి తఃతః అభిప్రాయం:

    05/14/2014 8:38 pm

    దిక్కులే ( తూర్పు ,పడమర ,ఉత్తరం , దక్షిణం – కార్డినల్ డైరెక్షన్స్ ) తప్ప , పక్కలు ( కుడి,ఎడమ, ముందు,వెనుక – ఇగోసెంట్రిక్ డైరెక్షన్స్) లేని ఆస్ట్రే లియన్ ఆదివాసుల భాష Guugu Yimithirr -గురించి ఇప్పుడే చదివాను కాంగరూ ( జంతువు) అనే మాట ఈ భాష నుంచే వఛ్చిందని వికి పీడియా – తః తః

  8. భాగవతావతరణము గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    05/13/2014 6:57 pm

    కృష్ణదేశికుల వారు పద్యాలల్లటంలో ప్రజ్ఞావంతులు. ఎంతో చక్కగా వచ్చాయి. కాళిదాసు “జనకతనయా స్నానపుణ్యోదకేషు స్నిగ్ధచ్ఛాయా తరుషు” అని మెచ్చిన రామగిరి వర్ణన వారికి బాగా ఇష్టంలా వుంది. “సౌరభ్యసంపూర్ణచామ్పేయసుమగుచ్ఛకనకచ్ఛవీకృతకాననములు” లోని కొన్ని పంక్తులు రామరాజభూషణుడి “లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికాభంగ దోఃప్రసంగము” పద్యాన్ని స్మరింపజేస్తున్నది. “తేనియ కంటెఁ దియ్యనయి” పద్యం “లలితస్కంధము” గుర్తుకుతెచ్చింది. “అద్దెనొ గంట మాతఁడు మహామధురామ్రరసంబునందు” కరుణశ్రీ “ముద్దులుగార భాగవతమున్ రచియించుచు పంచదారలో/ నద్దితివేమొ గంటము మహాకవిశేఖర మధ్యమధ్య; అ/ట్లద్దక వట్టిగంటమును అట్టిటు గీచిన తాటియాకులో/ పద్దెములందు ఈ మధురభావన లెచ్చటినుండి వచ్చురా?” అనేదానికి మెరుగులు దిద్దినట్టనిపిస్తున్నది. పూర్వకవుల చక్కటి పద్యాల్ని గుర్తుకు తెస్తూ రసవత్తరంగా కదిలింది మీ కలం.

    ఒక చిన్న సందేహం – “పరభృతగానముల్ భ్రమరవారమనోహరఝంకృతుల్” పాదంలో రెండక్షరాలు లేఖనస్ఖలనం చెందాయా?

  9. ఇంటి మొగుడు గురించి sivalenka అభిప్రాయం:

    05/13/2014 9:50 am

    భలె బావుంది. ఇన్నాళ్ళు చూడలేదెమిటా అనుకున్నా. కోప పెళ్ళి, యధేచ్చ వంటవాడు.. కత్తి అసలు.

    శివలెంక

  10. ఇద్దరు మిత్రులు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    05/13/2014 7:45 am

    శివశంకర్ గారు: ఈ కధలో పైన కధ టైటిల్ కింద ఉన్న నా పేరు మీద నొక్కితే ఇంతకు ముందు రాసిన కొన్ని అనువాదాలు చూడవచ్చు. నేను అనువాదం చేసేస్తే చాలదు కదా, ఈమాట వారు ఒప్పుకోవాలి. వాళ్ళకి బోరు కొట్టి పొమ్మంటే చేసేదేమీ లేదు. ఎంతకాలం సాగుతాయో చూడాలి.

    అయ్యవారు గారు: మీకు కధ నచ్చినందుకు సంతోషం. టాల్ స్టాయ్ కధని అనేకమంది అనేక సార్లు అనువదించి ఉండొచ్చు.

    ధన్యవాదములు