పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. అనువాద కళ నా అనుభవాలు గురించి ఉష అభిప్రాయం:

    05/28/2014 9:38 pm

    నమస్కారం, వ్యాసం చాలా బాగుంది. ధన్యవాదాలు. ముందు సిద్ధాంతం చెప్పి, ఆ తరువాత మీ అనుభవం నుండి అదే అంశాన్ని వివరించిన తీరు ప్రశంసార్హం. అనువాద విషయమే కాక అమరిక, పద్ధతి, వ్యాస నిర్మితి కూడా ఎన్నో విషయాలను బోధిస్తున్నాయి.

    ఈ వాక్యాలను ప్రతి అనువాదకుడూ మూలమంత్రాలుగా పఠించుకోవచ్చు. ఈ వ్యాసానికి సారాంశంగ వీటిని చెప్పుకోవచ్చు.

    “రచన కత్తి మీద సామైతే, అనువాదం రెండు కత్తుల మీద సాము. ఒక భాష వచ్చిన ప్రతీవాడూ రచయిత కాలేడు. అలాగే, రెండు భాషలు వచ్చిన ప్రతీవాడూ అనువాదకుడు కాలేడు. భాషను తెలుసుకోవటమంటే దాని నుడికారం యొక్క మూలాలను తెలుసుకోవటం.”

    “అనువాదంలో వాడదల్చుకున్న భాషాస్థాయిని గురించి ఒక ఖచ్ఛితమైన నిర్ణయానికి రావాలి.

    మూలరచయిత కంఠస్వరాన్ని పొరపాటు పడకుండా గుర్తించి దాన్ని లక్ష్య భాషలో వ్యక్తం చేయగలిగిన రంగు, రుచి,వాసన ఉన్న పదాలనూ, వాక్య విన్యాసాలనూ జాగర్తగా ఎన్నుకోవాలి. అనువాదానికి పరిశ్రమే ప్రాణం.”

    “మూలగ్రంధ పాఠకులూ, …అనువాద గ్రంధం పాఠకులూ ఒకేస్థాయికి చెందిన వారు కాకపోవటం.”

    “ఒక భాష వారిని ఆకర్షించిన పుస్తకం, మరొక భాషవారిని ఆకర్షించక పోవచ్చు. అందుకు ఒకే విషయానికి సంబంధించిందే అయినా వారి చైతన్య స్థాయిలోని తేడాలు కారణం కావచ్చు. అందుచేత అనువాదకుడు లక్ష్య భాషలను మాట్లాడే ప్రజల నాడిని పట్టుకోవటం చాలా అవసరం.”

    “రచయితకు కధా వస్తువుతో హృదయ సంవాదం కుదిరినట్టుగా అనువాదకునికి కూడా మూల గ్రంధంలోని విషయంతో హృదయ సంవాదం కుదరాలి.”

    “విశ్వకుటుంబీకుడు అనువాదకుడు.”

    ఇక చిన్న విమర్శ- “భాషకు సంభందించిన మరొక ఇబ్బంది కంఠస్వరం. సమర్ధుడైన రచయిత శైలికి ” కంఠస్వరం ” ( Tone ) ఉంటుంది.” — ఇక్కడ కంఠస్వరం అనేకంటే ఉత్తగ “స్వరం” అంటే బాగుంటుందేమో. ధన్యవాదాలు

  2. వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి ఉష అభిప్రాయం:

    05/28/2014 9:05 pm

    “మా చిన్నప్పుడు మేం ప్రిడ్జ్ కి “మంచుబీరువా” అనీను ఇంకా ఇలాంటి లిస్టుని బోలెడన్ని తయారు చేస్తిమి ఒక కాలంలో గానీ అంతా నవ్వి ఊరుకున్నారే గానీ ఎవరూ నిజంగా పట్టించుకుంటే కద? అంతే, తెలుగు వాళ్ళకి తెలుగు మీద ఖాతరీ లేదు.” జయప్రభగారి అభిప్రాయం–

    మరి మాకు ఖాతరుంది – మాతో పంచుకుంటారా ఆర్యా? నిజంగ ఇప్పుడు పిల్లలకు ఆ మాత్రం ఆసక్తి కూడా లేదు మీడియా, ఇంగ్లీషు మీడియాల పుణ్యమా అని. ముందు ఆ అవసరం లేకుండా పోయింది. తెలుగు రాకపోయినా ఫరవాలేదు. నాలుగు మార్కులతో పాసవ్వటానికి తప్ప తెలుగెందుకు? అదే ఆంగ్లం రాకపోతే ఉత్పాతాలు. జీవిక లేదు, మనుగడ లేదు, గౌరవం లేదు, అస్తిత్వమే లేదు. అక్కడ ఉందండి రహస్యం. ఇంగ్లీషు తెలుసుకుని ఏం చేయాలి అని చివరకు పనివాడు కూడా అనడు. కానీ తెలుగు నేర్చుకుని ఏం చేయాలి అని ప్రతీవాడు అంటాడు. ఉపయోగం ఏది ఎక్కడ దాన్ని కార్యక్షేత్రం అన్నట్టు ఎద్దేవా చేస్తారు. తెలుగు వార్తలలో, సినిమాలలో, వార్తపత్రికలలో, వాణిజ్యప్రకటనలలో, తెలుగువారిద్దరు పరస్పరం మాట్లాడుకునేవేళలో ఎక్కడా తెలుగుండదు. అందుకే వెలుగూ ఉండదు.

  3. వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి ఉష అభిప్రాయం:

    05/28/2014 8:53 pm

    నమస్కారం, వ్యాసం చాలా ఉపయోగకరంగ, ఆలోచింపచేసేదిగా, పద్ధతిగ, మంచి రసవంతంగ ఉంది. ధన్యవాదాలు. మీ ప్రతి మాటలో అనుభవం ఉంది. అవగాహన ఉంది. అన్నింటికీ మించి భావాత్మకత ఉంది.

    ఇదిగో నా ప్రతిస్పందన-

    1. “‘లంగరమ్మలు, లంగరయ్యలు’” — హాస్యం కోసం వ్రాసినా బాగుంది. కానీ Anchor అనే మాటే చాలా పాక్షికంగ, స్వల్పపరిధిలోనే ఆ అర్థాన్ని ఇస్తుండటం గమనార్హం.

    2. “కైపొత్తాలు (handbooks)”– ఇవి ముఖ్యంగ యంత్రాదుల వాడుక గురించి పరిజ్ఞానం ఇచ్చే పుస్తకాలు కనక సహాయపుస్తకాలని అనవచ్చేమో.

    3. “ఇంగ్లీషులో నాలుగింట ఒక మాట ఫ్రెంచి భాష నుండి వచ్చి కలిసిందన్నది నమ్మశక్యం కాని నిజం”. — ఎనభైశాతం ఆంగ్ల పదాలు ఇతర దేశాల భాషలవే. జర్మన్, పోర్చుగీస్, గ్రీక్, లాటిన్, – ఇవే కాదు- చివరకు మన దేశంలో వివిధ భాషలన్నింటిలో నుంచి ఆ భాషలోకి పదాలు ఎగుమతి అయినవి. ఆ భాష అంత కలగాపులగమైన భాష వేరేది ఈ భూప్రపంచంలోనే ఉండదు.

    4. “వెనుక తియ్యను.”– వెనుదీయను అనేది కదా సరైన ప్రయోగం.?

    5. “‘క్రోమోజోము’ =‘వారసవాహికలు’” — అద్భుతంగ ఉంది. అయితే వారసత్వ వాహికలు అంటే బాగుంటుందా? ఇంక బణువుకన్నా బృహదణువు బాగానే ఉంది. లేదా గుర్వణువు/ మహాణువు అనవచ్చు.

    6. “అణు బాంబులని మరొకసారి పరామర్శిద్దాం.” — హాస్యానికే- ఒక తెలుగు సినిమాలో హాస్యానికి దీన్ని ఢమాల్ ఉండ అని వాడారు. భలే నవ్వుకున్నాము. ఢమాల్ కూడా హిందీలో ధమాకా నుండి అనుకరణగా వచ్చినదే అయినా ఢమఢమలు అనేది తెలుగు శబ్దానుకరణ పదమే.

    7. “దుర్నామాలే (మిస్‌నోమర్స్, misnomers).” — దీనినే తెలుగులోకి చేస్తే చెడ్డపేరు అవుతుంది. అంతకన్నా వేరే భావాన్ని అభివ్యక్తం చేయగలిగే స్థాయి తెలుగు భాషకు లేదు. కనక సంస్కృతపదమే బాగుంది. (చెడ్డపేరును సంస్కృతంలో చెప్పాల్సి వస్తే అపయశస్సు లేదా అపకీర్తి అంటారు. కనక భయం లేదు.)

    8. “ఏదో ఇంగ్లీషువాడు పప్పులో కాలేస్తే వేసేడు, ఆ కాలు పట్టుకుని మనం ఎందుకు వేల్లాడటం? ఆలోచించండి.” — నిజంగా ఇది నేను చాలా దీర్ఘంగ ఆలోచించాను. మనం తెలుగులో ఒక పదాన్ని కోరి ఆలోచించేముందు కనీసం ఆంగ్లంలో ఆ పదం ఆ వస్తువును సరిగ్గ సూచిస్తున్నదా అని చూసుకుంటే ఎన్నో ప్రమాదాలనుంచి భాషాఘాతుకాల నుంచి తప్పించుకోవచ్చు. అంధానుకరణం ఎక్కడైనా ఎప్పుడైనా హర్షించదగినది కాదు.

    9. “సభాపిరికితనం’ అనే పదాన్ని అవసరానికి అనువుగా మార్చి ప్రసంగభయం అనో, సభాభయం అనో వాడుకుంటాడు.” — పిరికి కన్నా బెరుకు, వెరుపు అంటే బాగుండేదేమో. కానీ తెలుగు పదం సంస్కృతపదం కలిపితే అంతగా రుచించదు కనక సభాభయం అనచ్చు. పోనీ రుచింపచేద్దామంటే వేదిక వెరుపు అనచ్చు. ఇప్పుడు సభాపిరికి అనే పదం వాడగా వడగా సామాన్యజనవాహినిలో కలిసిపోయి ఎంతో సహజంగ తెలుగువారు వాడుకోవటం లేదా. సామాన్య భాషలో భావం వ్యక్తమైతే చాలు- శాస్త్రీయ పదాల చిక్కు మాత్రం విప్పలేని ముడే.

    10. “జపానీయులు తదుపరి ఇంగ్లిష్ నేర్చుకొటానికి ఎంత అవస్థ పడ్డారొ కూడా ఆయనకు తెలిసి ఊండదు. (వాసుదేవ రావు ఎరికలపూడి గారి అభిప్రాయం)” — వారు ఇంగ్లీషు నేర్చుకోవటానికి ఎంత అవస్థపడ్డారో అనేదానికన్నా సాంకేతికంగ, విజ్ఞానరంగంలో ఎంత పురోగతి సాధించారనేది ముఖ్యం. ఎందువల్ల అది సాధ్యపడింది.? మన పిల్లలు తెలుగులో విజ్ఞానాన్ని చదువుకుని, విషయాన్ని అవగాహన చేసుకుని కూడా విజ్ఞానంరంగంలో సాంకేతిక పరిశోధనలలో తెలుగును ఆశ్రయించి ఎందుకు వెనక ఉంటున్నారనేది ముఖ్యం. జపాను వారు తయారు చేసిన ఏ యంత్రమైనా దాని తాలూకు సమాచారమంతా తమ మాతృభాషలోనే పెట్టుకుంటారు. చివరకు అమెరికా వారు కూడా ఆ రహస్యఛేదన కోసం జపానీ భాష నేర్పించి తమ వైజ్ఞానికులను ఆ దేశం పంపి ఆ పరిజ్ఞానాన్ని పొందవలసిందే. వారు తమ వాడకాల కోసం తామే వస్తువును తయారు చేసుకుంటారు. అంత స్వాభిమానం మనకు ఉందా? మనం తయారు చేసే ఎన్ని మందులు, యంత్రాలు, పరికరాలు మన భారతీయ భాషలలో కనీస సూచనలు కలిగి ఉంటున్నాయో తరచి చూడండి. మనకు మనకన్నా ఆంగ్లేయులు లేదా ఆంగ్లం తెలిసినవారు దాన్ని అర్థం చేసుకోవటమే ముఖ్యం. ఇక్కడ శాస్త్రపదజాలం, వైజ్ఞానిక పారిభాషిక పదాల చర్చ వచ్చింది కనక చెప్తున్నాను- ఎంత సేపటికీ మన దృష్టి తరువాత ఆ పిల్లలు ఎదిగి దాన్ని ఆంగ్లంలో తెలుసుకుంటేనే కదా పురోగతి అనే భావనమీదే ఉంటుంది. నిజంగ ప్రతిభావంతులైన పిల్లలు ఉత్సాహంతో తెలుగు భాషతో విజ్ఞానాన్ని అర్థం చేసుకుని తెలుగులోనే విషయపరిజ్ఞానాన్ని వ్యక్తం చేస్తామని, తెలుగులోనే పరిశోధనలు చేస్తామని ముందుకు వస్తే దానికోసం కావాల్సిన ఏర్పాట్లు స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ళకైనా మన వద్ద సిద్ధంగ ఉన్నాయా..? పోనా మన పిల్లలు విషయం తెలుసుకోలేని పనికిమాలినవాళ్ళా అంటే విదేశాలలో చక్రాలు తిప్పుతున్నారు. వారు విద్యాలయస్థాయిలో నేర్చుకునే ఆ పదజాలం, దాని ఉపయోగం విద్యాలయం దాటాక ఎంత ఉంటోంది అనేదాన్ని బట్టి మనం ఆ పదాలను తెలుగులో పెట్టుకోవాలా, ఆంగ్లంలో పెట్టుకోవాలా అని చర్చ చేసుకోవచ్చు. ముందసలు అటువంటి ప్రయత్నం చేసే ముందే వృథా అని తేల్చేయటం (అది కూడా సంస్కృతాన్ని ఆశ్రయించవలసి వస్తోంది కనక ఆంగ్లాన్నే యథాతథం ఉంచాలనటం అయితే సుతారమూ) సమంజసం కాదు. నిజానికి ఏ పారిభాషిక పదమైనా ఆ భాషలో తయారైనప్పుడు మాత్రం వారికి అది అలవాటయ్యేవరకు కొత్త కావటం లేదా? మొదటిసారి ఒక ఊహ చేసేటప్పుడు వారు మాత్రం ఆయా భాషలలో కొత్త పదాల కోసం వెతుక్కోవటం లేదా..? వివిధ భాషలలో ఉండే శబ్ద-అర్థాలకు నిజంగ ఎన్నో పరిధులలో తేడా లేదా..? వాటర్, నీరు, తన్నీ, పానీ.. అన్నీ నీటిని సూచించటం లేదా.. అటువంటప్పుడు continuous function అవిచ్చిన్న ప్రమేయమంటే వచ్చిన నష్టమేంటి?

    11. “if ‘f ‘is a continuous function… తెలుగు మీడియం పుస్తకాల్లో దీని రూపం: f ఒక అవిచ్చిన్న ప్రమేయమైతే… ఇది- ఒక ‘ఒక’ మినహాగా – తెలుగా సంస్కృతమా అన్న సంగతి కాస్త పక్కనుంచితే ఇలా నేర్చుకున్న వారు ఎంత తెలివి గలవారయినా బయట ప్రపంచంలో చెల్లరు.” (వాసుదేవ రావు ఎరికలపూడి గారి అభిప్రాయం)– ప్రతివాడూ ప్రపంచంలో చెల్లాలనేది విదేశాలనో ఆంగ్లాన్నో దృష్టిలోనే పెట్టుకుని ఆలోచించవలసిన అవసరం మనకేంటి? ప్రపంచమంటే ఏంటి? మనం ప్రపంచంలో లేమా? మన దేశం మన పరిశోధన, మన పరిధి, మనకు ముఖ్యం కాదా? అటువంటప్పుడు continuous function ని అవిచ్చిన్న ప్రమేయమని విద్యార్థికి పరిచయం చేసి ఆ విషయావగాహనకు దోహద పడితే అది వాడికోసం అవిచ్చిన్న ప్రమేయంగానే మిగిలిపోతే మాత్రం తప్పేంటి? అందులో ఒక కొత్త క్షేత్రాన్నో, పరిధినో, లోతునో ఆ విద్యార్థి కనుగొనగలిగితే ఆ విజ్ఞానవిషయానికి (శాస్ర్తం ఏదైనా సరే) అతడు న్యాయం చేయటంలో ఏదైనా తక్కువ పడుతోందా?

    12. “సంస్కృతం నుండి తెలుగులోకి ఎన్నో మాటలు వచ్చేయి కదా. ఈ ప్రక్రియ శృతి మించటంతో గ్రాంథికానికి ఆదరణ తగ్గి శిష్టవ్యవహారికానికి ఆదరణ పెరిగింది.” — సంస్కృతం ఆంగ్లం తెలుగులోకి చాలా విభిన్న రీతులలో ప్రవేశించాయి. వాటికి పొంతనే లేదు.

    “ఈ అభిప్రాయంలొ నేను సరి గానో తప్పు గానో వాడిన సంస్కృత పదాలు నాకు ఇష్టమై మాత్రం కాదు. వాటికి తెలుగు తెలీక.” (వాసుదేవ రావు ఎరికలపూడి గారి అభిప్రాయం)– తెలియక కాదండీ.. లేక. సంస్కృతం తెలుగును ఏదో అన్యాయం చేసిందనే సిద్ధాంతం ఈ మధ్యకాలంలో ప్రబలమైంది. అదీ ఆర్యులదండయాత్ర సిద్ధాంతం–దాని పర్యవసానాన ఆర్య-ద్రావిడ-వేర్పాటు సిద్ధాంతం వల్ల ఆ ఘోరం జరిగింది. ఆర్యులూ లేరు, వారి దండయాత్రా లేదని ఎన్నడో సాక్ష్యాధారాలతో సహా నిరూపణమైనాక కూడా సంస్కృతాన్ని పరాయి భాష అనుకుని మనం ఆ భాషను ఆంగ్లంతో పోల్చటం సరికాదు. కావాలంటే ఈ వీడియో చూడగలరు. కల్యాణరామన్, ఎన్ ఎస్ రాజారామ్- ఈ పరిశోధనలో నాకు తెలిసిన ముఖ్యుల పేర్లు. వారి రచనలు చదవండి. దయచేసి ఆ బూజుపట్టిన సిద్ధాంతాన్ని రాధ్ధాంతం చేయకుండా పూర్వపక్షం చేసి వదిలించేసుకోండి. [https://www.youtube.com/watch?v=fu9Co8b-G1c]

    “నా దృష్టిలో ఈ రెంటినీ పక్కపక్కన పెట్టడం సమంజసం కాదు. ఎందుకంటే, సంస్కృతం తెలుగుపై చూసిన ప్రభావం – విధానంలోనూ, స్వరూపంలోనూ కూడా ఇంగ్లీషు చూపిన/చూపుతున్న ప్రభావం కంటే చాలా వేరయినది.” (కామేశ్వరరావు గారి అభిప్రాయం)– ఇది సరైన మాట. ఆయన చూపిన కారణాలే కాక ఇంకా సంస్కృతం మన దేశంలోది, మన సంస్కృతి నుండి వచ్చినది- వంటి ఎన్నెన్నో ఇతర కారణాలూ చెప్పవచ్చు. సంస్కృతం లేకుండా ఒక్క తెలుగు వాక్యాన్ని ప్రాథమికస్థాయి అవసరం దాటి మనం చెప్పలేమనేది అంగీకరించవలసిన వాస్తవం. అంతే కాదు- భాష అనే మాటకు తెలుగు పదమే లేదు అని ఒక ప్రముఖులు శెలవీయంగా వినటం తటస్థించింది. అట్ల ఎన్నో పదాలు తెలుగులో లేవు. రావు కూడా. సంస్కృతంలో అన్ని భాషలనూ పరిపుష్టం చేయగల శక్తి ఉంది. సంస్కృతాన్ని కాదనుకుని తెలుగువారు తమ భాషాపరమైన అస్తిత్వానికే మూలకుఠారం వేసుకుంటున్నారు. సంస్కృత ధాతువులను, నామపదాలను మనం తెలియకుండానే ఎంతో వాడేస్తున్నాము. అది అవమానజనకం ఏమీ కాదు. కనక కొత్త పదాల సృష్టి సంస్కృతంలో జరిగినా పిల్లలకు, పెద్దలకు ఆంగ్లం కంటే కూడా సులువుగా చక్కగ అర్థమైపోతాయి. భయమే లేదు. సంస్కృతాన్ని కాదనుకుంటే మనకు మిగిలేది పరదేశీయల భాషాపదాలే, దెబ్బతిని చితికిపోయే ఆత్మాభిమానమే.

    13. “చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్న “బొగ్గుపులుసు వాయువు” లాంటి అనువాదాలు తెలుగుకి సహజం కావు కదా.” (జయప్రభ గారి అభిప్రాయం) సహజం కాకపోయినా మనం దాన్ని అంగీకరించి ఇవాళ కార్బన్ డయాక్సైడ్ అనే మాటకు సమానార్థకంగా హాయిగా వాడేసుకుంటున్నాము. సంగణకం (కంప్యూటరు) పరికరంగా వాడుక లోకి రాక ముందు ఆంగ్లంలో కూడా “మౌస్” అంటే ఎలుక మాత్రమే. వాళ్ళు చెప్పారు- దీన్ని మౌస్ అందామని.. మనం అంటున్నాము. వాడకంలోకి వచ్చాక ఎవ్వరూ దాన్ని తిరస్కరించరనే మాట మన తెలుగు మాష్టర్లు కాస్త నేర్పుతో ఉపయోగించుకుంటే బాగుండేది.

    14. “విమర్శని భరించలేని స్థితికి సమాజం చేరుకోవడం కన్నా వెనకబాటుతనం ఇంకొకటి లేదు.” (జయప్రభగారి అభిప్రాయం)- ఇది అద్భుతమైన మాట. జోహార్లు. ఇందులో చాలా వాస్తవం ఉంది.

    15. “ఇంగ్లీషుని తెలుగులోకి మార్చి రాయవలసిన అవసరం నోకియా వాడికీ, ఎమిరేట్స్ వాడికీ కనబడింది.” — అన్నింటికన్నా నాకు నచ్చిన విషయం ఇది మహాశయా. ఒకడిది వ్యాపారావసరం. మరొకడిది పరిశుభ్రతా అవసరం. మన భాష పట్ల మనకు రెండిటిలో ఏ అవసరం కలిగినా తప్పక మనమూ ఆ పంథాలో పోగలము. స్వాభిమానమనేది ముఖ్యం. అది ఉంటే దారులు వాటికవే దొరుకుతాయి.

    మంచి వ్యాసం అందించిన రచయితకు, అభిప్రాయాలు వ్యక్తం చేసి నా అవగాహనకు దోహదపడిన వారందరికీ నా కృతజ్ఞతలు. హార్దికాభినందనలు. ఏవైనా తప్పులుంటే మన్నించవలసింది.

    -ఉష

  4. కోనసీమ కథలు: సంస్కృతం మాస్టారు ఇస్మాయిల్ గురించి ఉష అభిప్రాయం:

    05/28/2014 6:21 pm

    మనిషి వైపు నుంచి సమాజాన్ని చూడకుండ, సమాజం వ్యవస్థ వైపు నుంచి మనిషిని చూసి – తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. వ్యక్తి చిన్నవాడు. సమాజం పెద్దది. ఎవరు మారటం సులువో తెలిసి మెలిగిన తీరు బాగుంది. కృతజ్ఞత, భావాలు- వాటి స్థాయి, పరిధి వేరు. వివాహ సంబంధాలు, బంధువుల బాంధవ్యాలు వాటి ప్రభావం, గతి వేరు. అటువంటి విపత్కర పరిస్థితి వద్దు అనే నిర్ణయమేమీ పిరికితనమో, ఆ వివాహానికి ఆమోదించలేకపోవటం బూజుపట్టటమో కానక్కరలేదు. వివాహాది సంబంధాలు లేకపోయినా మనసులలో ఉండే సద్భావాలు ఉండవచ్చని మనిషి ఎరిగిననాడు ఏ ఇబ్బందులూ ఉండవు.

  5. ఎండని ఏడో చేప కథ గురించి ఉష అభిప్రాయం:

    05/28/2014 6:00 pm

    నమస్కారం,

    కథ అద్భుతంగ ఉంది మహోదయా. వస్తుపరంగనే కాదు. భాషాపరంగ కూడా. అభినందనలు. ఇంత ఆధునిక కథావస్తువులో అతి తక్కువ ఆంగ్ల పదజాలాన్ని వాడకం, చక్కటి తెలుగులో కథను చదవటం మంచి అనుభూతిని, ధైర్యాన్ని ఇచ్చాయి. సాధారణంగ విదేశీ పేర్లు కనిపించంగనే తెలుగు కథను (విషయవస్తువు పై ఆసక్తి కన్నా భాషమీది మక్కువ వల్ల ఏం చదవాల్సి వస్తుందో అనే భయంతో)పక్కన పెట్టేసే నాలాంటి వారికి ఇది ఊరట.

    బాగా తెలిసి, వాడుకలో ఉన్న తెలుగు పదాలకు సైతం ఆంగ్లపదజాలాన్ని వాడే రచయితల భాషాదారిద్య్రాన్ని చూసి(లేదా చూడలేక) బాధాసంద్రంలో మునిగిపోతున్నవారికి ఈ కథ ఒక దీపస్తంభంలా ఉందని చెప్పవచ్చు. ఒక సలహా. ఇమిగ్రేషన్ వంటి పదాలు ఆంగ్లంలో వాడినా, మీరు కనక ఏదైనా తెలుగు పదం ఆలోచించి ఉంటే తప్పక పక్కన కోష్టకంలో ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.

    ఇదే మాధ్యమంగ, సంపాదకులకు కూడా ఒక మనవి. విమర్శలు చదివినందువల్ల కానీ రచయిత వాడిన తెలుగుపదాలు సంపాదనంలో హత్యచేయబడ్డ సంగతి తెలియలేదు. రచయితలు ఎంతో కష్టపడి ఒక చక్కని పదాన్ని కనిపెట్టి కథలో ఆవిష్కరించినప్పుడు దయచేసి దాన్ని పాదటిప్పణిగానో, లేక కోష్టకంలోనో ఇస్తే ఎందరికో ఉపయోగపడుతుంది. మీ పత్రికలో ఆంగ్లవాక్యాలను కనీసం అనువాదం లేకుండా వేసేస్తారు. అదీ ఆంగ్ల లిపిలో. ఇది తెలుగు పత్రిక కదా. ఆంగ్లం రాని తెలుగు వారెందరో ఉంటారు. ఇంటర్నెట్ ద్వారా కథ చదివినంత మాత్రాన ఆంగ్లం అంతగా ఉండనక్కరలేదేమో, అదీ అనువాదం లేకుండా.

    మన భారతీయ భాషలు, ముఖ్యంగా తెలుగు- ఆంగ్లపదజాలాన్ని యథాతథంగ దిగుమతి చేసుకోవటం తప్ప స్వయంప్రతిపత్తిని కలిగిలేదనే ఆక్షేపణనైనా కొంత వరకు దూరం చేయగల ఇటువంటి రచయితల శ్రమను దయచేసి వృథాచేయకండి. జోహార్లు రచయితగారు. హార్దిక అభినందనలు.

    ఇక వస్తువు మాటకు వస్తే – తిరుగు లేని ఇతివృత్తం. తెరవెనుక కథలంటే నాకు చాలా ఇష్టం. అమెరికా రచయితలు ఆ కథను మనకు తెలియచేసినందువల్ల వారి కష్టం, కర్తవ్యనిష్ఠ మనకు తెలిసివచ్చాయి. అట్లగే మనదేశంలో ఉండే కార్య-సునిర్వాహకులు, కర్తవ్యదీక్షాసంపన్నుల ఇతివృత్తాలు కూడా బయటకు రావలసి ఉంది. ఇప్పటి వరకు సక్రమంగా మన స్వతంత్రవీరుల కథలే మనకు కరువైనాయి. వారే కాక ఎందరో ఎన్నో క్షేత్రాలలో కనీస గుర్తింపు అయినా లేకుండా నిమ్మళంగ, నిశ్శబ్దంగ పని చేస్తూ పోతుంటారు.(ఋషిపీఠం వంటి పత్రికలలో చిన్నభాగంలో అరపుటలో కొందరు మహానుభావుల గురించి- వలె) ఎక్కడో ఎప్పుడో ఎవరో వారి గురించి చెప్తే విని గర్వంతో పొంగిపోతుంటాము. మన భారతవీరకుమారుల గాథలు కూడా ఇటువంటి, ఇంతకన్నా ఎక్కువ ప్రేరణను ఇవ్వగలిగే స్థాయిని కలిగి ఉన్నాయి. వాటిని కూడా మనం ఇతివృత్తాలుగా చేసుకుందాం. నవతరానికి అందిద్దాం.

  6. విముక్తం గురించి ఉష అభిప్రాయం:

    05/28/2014 5:20 pm

    నమస్కారం.

    కథ చాలా బాగుంది. కానీ కథ కాబట్టి సుఖాంతమైందేమో. ఈనాటి పరిస్థితులలోనే కాదు, మైథిలిలో కదిలిన ఇటువంటి భావాలకు తావు ఇచ్చిన పరిస్థితులు ఏనాటి కాలంలో అయినా చాలా పెద్ద పెద్ద ఉత్పాతాలకు దారి తీసేవే. ఇప్పుడు కాబట్టి “భావాలు కలిస్తే పంచుకునే వ్యక్తి” అవసరమని ఖచ్చితంగ తేల్చి చెప్తున్నాం. అవతలివారు అర్థం చేసుకోవాలని, ఆ మేరకు ఎదగాలని, ఆ స్నేహాలను ఆమోదించాలని కూడా తీర్మానిస్తున్నాం. అయితే ఈ ఆధునిక సంస్కృతి లేని పాతరోజులలో మరి వారికి అటువంటి అవసరాలు లేవా? భావాలు పంచుకోవటానికి వారికి అవతలివారి సామీప్యం అవసరం పడలేదా? అప్పుడు వారు దానిని ఎట్ల పరిష్కరించుకున్నారు? సామాజిక కట్టుబాట్ల వెరుపు కన్నా, జీవనసహచరుల గురించిన భయంకన్నా ఏదో ఒక మూగ నిబంధన వారిని కట్టిపెట్టేది కాదా? ఆ నిగ్రహం, ఆ “ఎదటి వారి నుంచి పంచుకోవటాలు, పెంచుకోవడాలు ఆశించకుండా తనలో తాను సమాధానం పొందగలిగే” రహస్యమేదో ఈనాడు లోపించింది అనిపించటంలేదా?

    అందరూ మనుషులు ఎదగలేరు కదా. అందరికి విశాల హృదయం ఉండదు కదా. రాధిక, మైథిలి-భర్త– ఇద్దరూ నిజాయితీగ ఉన్నారు కనక సరిపోయింది. లేకపోతే కొన్ని సందర్భాలలో ఆ ఇరువరి మధ్యనే ఒకరి ప్రవర్తన దారి తప్పి రెండవ వ్యక్తిలో సంఘర్షణను, భ్రమనూ తలెత్తింపచేసే అవకాశమూ లేకపోలేదు. అప్పుడు సమస్య మరింత జటిలం అవుతుంది. కొందరి భావాలు పంచుకునే అవసరాలకోసం అందరిలో మార్పు రావాలని ఆశించటం ఒక అత్యాశేనేమో. ఏదైనా, హద్దు మించక ఉండటమే అన్ని విధాలా శ్రేయస్కరం. ఎన్నో వాస్తవపు గాథలు ఈ కథలా సుఖాంతాలు కాక దుఃఖాంతాలే కావటం చూస్తూ కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించటం ఆరోగ్యకరం కాదు. భావాలు పంచుకోవటం పంచుకునే వ్యక్తికి ఎంత ఆనందాన్ని తృప్తినీ కలిగిస్తాయో అంతే బాధను మైథిలి వంటి వారిలో కలగచేస్తాయి. చాలాసార్లు అవి అగాధాలే అవుతాయి. తీరవు. మైథిలి మాటిమాటికీ “అది నా అనుమానమే.. నాలోనే ఏదో తప్పు ఉంది” అని అవగాహనతో, ఒక మూల తన మీద తను అనుమానంతో ప్రవర్తించటం వల్ల, అవకాశం వచ్చినప్పుడు, మానసిక పరిపక్వత వల్లైనా మార్పు తెచ్చుకోగలిగింది. తనలో అటువంటి సంఘర్షణ అనుమానం వచ్చినందుకు సిగ్గు పడింది. అంత సంస్కారం, అవగాహన, పరిపక్వత అందరికీ ఉండకపోవచ్చు. భార్యాభర్తలనే కాదు, స్నేహితులు, ఇతర స్ననిహిత సంబంధాలమధ్య కూడా విచ్ఛిన్నం కలగచేసేవి ఇటువంటి సన్నివేశాలే కనక వాటిని మొదటిలోనే తుంచేస్తే మంచిదేమో. అసలు అటువంటి పంచుకోవడాలకు మనసును అలవాటు చేయకపోతేనే మంచిది. ఒక దారి చూపిస్తే మనసు ఆ దారిలో ఎంత దూరం పోవాలో ఎక్కడ ఆగాలో తెలియక ఎన్నో సమస్యలను కొనితెచ్చుకోగలదు. ఏమో- అంత ఉత్పాతాలకు దారి ఇచ్చే బదులు మైథిలి భర్త, రాధిక వంటి వ్యక్తులే కాస్త అనవసర సామీప్యాలకు దారి తీసే వ్యవహారాలలో పడకుండా ఉంటే మంచిది.

    రాధిక లేకపోతే మైథిలి భర్త ఏం చేసేవాడు? లేదా, అంతదాకా అతనెవరితో సమీపంగ అటువంటి భావాలు పంచుకున్నాడు? భావాలు పంచుకోవడాలకన్నా కుటుంబాలు, ఆలుమగల అనుబంధాలు ముఖ్యం కదా. కనీసం మైథిలి స్థానంలో ఉండేవారికి ఆ దృష్టి కలిగినప్పుడైనా ఆమె భర్త స్థానంలో ఉండేవారు జాగ్రత్త పడి అటువంటి పంచుకోవడాలకు స్వస్తి చెప్పి దూరం పాటిస్తే మంచిదేమో. అందరు మైథిలిలకీ కళ్లు తిరిగి పడిపోతే రాధికలు వచ్చి లేపరు కదా. కథ వరకైతే అంతా బానే ఉంది. అది జీవితానికి, ప్రపంచానికి వర్తింపచేయాలని చూడటం అనారోగ్యకరం. కనీసం విచ్ఛిన్నమవుతున్న అనుబంధాల దృష్ట్యా అయినా సరే. ఏది విలువైనదో ఏది శాశ్వతమైందో దాని వెంట మనిషి పోవాలి. మనసు, భావాలు ఇవాళ ఉన్నట్టు రేపు ఉండవు. కొంత పాత చింతకాయపచ్చడి నియమాలే సరైనవేమో అనిపిస్తుంది. ఏ గొడవా ఉండదు. అనుమానాలు లేవు. అర్థం చేసుకోలేదనే బాధలూ లేవు. కొన్ని విషయాలలో పరిధి దాటవద్దు అంటే వద్దు అంతే. ఎందుకంటే చాలా వాస్తవ కథలు ఈ కథలాగే ప్రారంభమవుతాయి. కానీ ఈ కథలా ముగియవు.

  7. ఏనాడూ విడిపోని ముడి వేసెనె గురించి ఉష అభిప్రాయం:

    05/28/2014 4:32 pm

    నమస్కారం,

    క్షమించాలి. ఇది కథలో అంశం గురించి కాదు. భాషాంశం గురించిన విమర్శ.

    ఇంగ్లీషు కథలలో ఒక్కనాడు ఒక్క తెలుగు వాక్యం చదివిన గుర్తు లేదు. మరి తెలుగు కథలలో కనీసం అనువాదం అయినా లేకుండా ఇంతింత సంక్లిష్టమైన ఆంగ్లవాక్యాలు ఎందుకు ఉంటాయి? అదీ కీలకమైన అంశాలను వ్యక్తపరుస్తూ? ఆంగ్ల కథలలో లేదా వ్యాసాలలో ఏదైనా ఇతర భాషావాక్యం ప్రయోగించినా వెంటనే కోష్టకంలో దాని అర్థం ఉంటుంది. ఆ మర్యాద మనం ఆ భాషనుంచి అరువు తెచ్చుకున్న ఇంత అంశాలతో పాటుగా తెచ్చుకుంటే బాగుండేదేమో. అనుకరిస్తే మొత్తంగ అనుకరించాలి కదా. ఆంగ్లవాక్యాలు తప్ప తెలుగు కథలకు పట్టు ఇవ్వగలిగేవేవీ తెలుగువాఙ్మయంలో లేవా? ఆంగ్లకథలకో, ఇతర వాఙ్మయాలకో స్పందించి తప్ప తెలుగు కథలు వ్రాయలేరా? మంచి అచ్చతెలుగు (మాటలు కాకపోయినా) కనీసం భావాలు, సన్నివేశాలు ఉన్న తెలుగు కథ కోసం ఈ యుగం తల్లడిల్లాల్సిందేనా?

  8. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావు అభిప్రాయం:

    05/27/2014 5:20 pm

    మా వ్యాసం మీద ఇంతమంది ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఇన్ని ఉత్తరాలు రాసినందుకు వారందరికీ కృతజ్ఞతలు.

    మొట్ట మొదటగా: ఈ వ్యాసం బ్రౌన్‌ని వ్యక్తిగా విమర్శించడానికి రాసింది కాదు. ఆయన చేసిన పని తన స్వార్ధం కోసమే చేశాడని నిందించడానికీ కాదు. బ్రౌన్ ఒక వ్యక్తి కాడు. వలసవాద భావ ప్రపంచానికి ప్రతినిధి. భారతదేశం క్షీణదశలో ఉందని, తాము వచ్చి దానిని ఉద్ధరించామని తెల్లవాళ్లు ఒక ప్రగాఢ విశ్వాసంతో దేశంలో సగర్వంగా ప్రవేశపెట్టిన వలసవాద విధానాలకి తెలుగులో బ్రౌన్ ప్రత్యక్ష నేత. ఆయన చేసిన పని తెలుగు సాహిత్యానికి పనికిరాదని, అసలు తెలుగు సాహిత్యపు స్వరూపాన్ని బోధపరుచుకోవాలనే అవగాహన ఆలోచన లేని బ్రౌన్ తనకున్న అధికారదర్పంతో తన ఉద్ధరింపులు చేశాడని చూపించి, ఇప్పటికీ అందరూ ఆయన్ని పొగిడే పనిలోనే పడటం మంచిది కాదని చెప్పటానికే ఈ వ్యాసం రాశాం. గత పాతికేళ్లలో తెలుగు విశ్వవిద్యాలయాల, తెలుగు పరిశోధకుల పని అంతా చూసినా ఈ విషయాన్ని గుర్తించిన వాళ్లెవ్వరూ మాకు కనిపించలేదు. ఒక మాటలో చెప్పాలంటే మనం ఇప్పటికీ వలసవాద సంస్కృతి ప్రభావంలోనే ఉన్నామనీ దాన్ని సవిమర్శకంగా పరీక్షించి మన సాహిత్య స్వరూపాన్ని బోధపరుచుకునే ఆలోచనలు కావాలని చెప్పడం ఈ వ్యాసంలో ఉద్దేశించిన పని.

    ఈ సంగతి గమనించడం మా వ్యాసం చదివిన వాళ్లకి కష్టం కాకూడదు. మరి ఉత్తరాలు రాసినవాళ్లలో ఒకరిద్దరు తప్ప మిగిలిన అందరూ వ్యాసం చెప్పే ప్రధాన విషయం వొదిలేసి చర్చకి ఉపకరించని అనావశ్యక విషయాలు ఎందుకు ప్రస్తావించారో మాకు బోధపడటం లేదు.

    ఈ ఉత్తరాలు రాసినవారిలో ఎస్.వి. రామారావుగారికి, సౌమ్యగారికి సంజాయిషీ ఇచ్చుకోవాలసిన అవసరం ఉంది. మా వ్యాసంలో ప్రధాన ఉద్దేశాన్ని గమనించినందుకు వీరిద్దరికీ కృతజ్ఞతలు. అయితే మేము నారాయణరావు ఇంతకు ముందు చేసిన పరిశోధనల సారాన్ని మా వ్యాసంలో చొప్పించినందుకు రామారావుగారు మమ్మల్ని తప్పు పట్టారు. అలాగే కందుకూరి వీరేశలింగంగారిని, రామలింగారెడ్డిగారిని ఇందులోకి ఎందుకు లాక్కొచ్చారని మమ్మల్ని ప్రశ్నించారు. రామారావుగారు చూపించినది నిజమైన లోపమే. కందుకూరి వీరేశలింగంగారూ కట్టమంచి రామలింగారెడ్డిగారూ — ఇద్దరూ వలసవాద ప్రభావాన్ని చాలా తేలిగ్గా ఒప్పేసుకుని అది సాహిత్యానికి ఉపకారకమని నమ్మి ఆ మార్గంలో తెలుగు సాహిత్యాన్ని చూశారని బోధపరచడానికి మేము ఇంకా విస్తృతమైన ప్రయత్నం చేయాలి. ఆ సంగతి ఒక్క వాక్యంలో బోధపడిపోతుందని అనుకోవడం మా దురాశే. వీరిద్దరిని గురించి మేము వివరంగా వేరే వ్యాసాలు రాయాలి. ఇకపోతే నారాయణరావు చెప్పిన రెండు పరిశోధనలు — ఒకటి చాటుపద్యాల గురించి, రెండు సుమతీశతకం గురించి — బ్రౌన్ ఏర్పాటు చేసిన గ్రంథ పరిష్కరణ విధానం వల్ల తెలుగు సాహిత్యం ఎలా నష్టపోయిందో చూపించడానికి ఉదాహరణలుగా మాత్రమే ఉపయోగించుకున్నాం. ఈ సంగతి రామారావుగారు గుర్తించడానికి వీలులేనంత క్లిష్టమైనది కాదు. మా వ్యాసంలొ స్వవచన వ్యాఘాతంలా కనిపించే రెండు వాక్యాలు ఉదాహరించారు రామారావుగారు. వాటిలో ఒకదాన్ని సవరించమని సంపాదకులకి విజ్ఞప్తి చేస్తున్నాం.

    ఇది ఇలా ఉండగా, సౌమ్యగారు రాసిన ఉత్తరంలో బ్రౌన్ గ్రంథపరిష్కరణ విధానాలు మనకి ఎలా పనికిరావో ఇంకా వివరంగా చెప్పలేదేమని మమ్మల్ని అడిగారు. ఇక్కడ చమత్కారమేమంటే ఈ కాస్త వివరంగానైనా చెప్పడం రామారావుగారికి అభ్యంతరంగా తోస్తే ఇంకొంత వివరంగా చెప్పకపోవటం సౌమ్యగారికి అభ్యంతరంగా తోచింది. వీరిద్దరి ఉత్తరాల వల్ల మేము మా వ్యాసంలో ఉన్న ఒక లోపాన్ని గ్రహించాం. మన సాహిత్యానికి అనువైన గ్రంథపరిష్కరణ విధానాలు వివరించి, ఇప్పుడు మనం అనుసరిస్తున్న బ్రౌణ్య విధానాలను వదిలేయవలసిన అవసరం సూచనగా చెప్తే చాలదు అని. దీనికోసం పనిచేస్తున్న పరిశోధకులు తెలుగులో ఇంకా కొందరుంటే బావుండును. ఈ పని మేము సావకాశంగా చేయగలమనే నమ్మకం. కాకపోతే మరికొంత సమయం కావాలి.

    వలసవాద విధానాలని సమూలంగా విమర్శిస్తూ విశ్వనాధ సత్యనారాయణగారు చాలా పని చేశారని మాకు తెలుసు. కానీ ఆ ప్రపంచంలోకి వెళితే మా వ్యాసం ఇంకా పెద్దదైపోతుందని ఆ సంగతి ప్రస్తావించలేదు. అయినా ఆయన పేరు ప్రత్యేకంగా ప్రస్తావించిన హేలీగారికి మా కృతజ్ఞతలు.

    చివరగా, ‘భట్రాజులు’ అన్న మాట మా వ్యాసంలో తీసేయమని కథామురళి గారు సూచించారు. అందుకు మాకేమీ అభ్యంతరం లేదు. భట్రాజులు అనే కులం ఉందని, వాళ్లు బి.సి. లని మా గుర్తింపుకి తెచ్చిన ఆయనకు మా కృతజ్ఞతలు. ఆ మాట తీసేయడం మూలంగా మా వ్యాసానికి వచ్చిన నష్టం ఏమీ లేదు.
    — శ్రీనివాస్, నారా

  9. చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి Dakshinamurty Durvasula అభిప్రాయం:

    05/27/2014 4:07 am

    Dear Sir, You have done a great work. If the meaning of the poems are also given, it would have been really wonderful. There are so many other Chatu Padyamulu by several others like Adidam Soorakavi and others. If possible you may please try to pick them up for the benefit of readers like us. Espesially when people are agitated that telugu language is slowly losing its importance, publication of such poetry will definitely help.

  10. కోనసీమ కథలు: సంస్కృతం మాస్టారు ఇస్మాయిల్ గురించి Srinivas అభిప్రాయం:

    05/27/2014 12:55 am

    ఏక బిగిని చదివించిన కథ. చాలా బాగుంది. ఒక మంచి అనుభూతినిచ్చిన కథ.