పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16458

  1. బలిసిన మేకను పట్టుకుంటాను గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    10/07/2018 12:20 pm

    అమెరికా/కెనడా లాంటి దేశంలో ఎక్కడ దిగినా మొదటిగా నేర్చుకునేది/నేర్పబడేది – చిన్నపిల్లలజోలికి పోగూడదనీ, మహిళల గురించి వళ్ళు జాగ్రత్తగా పెట్టుకోమనీ, జాత్యహంకారం తో కులం, జాతి, రేస్ అనేవాటి గురించి నోరు ఎత్తవద్దనీను. ఇవన్నీ ఇమ్మిగ్రేషన్ వారు కూడా పూస గుచ్చినట్టూ చెప్తారు అందరికీ – అందులోనూ కొత్తగా వచ్చే వలసదారులకి. ఉద్యోగస్తులకి వారు చేరబోయే కంపెనీ, చదువుకోసం వచ్చే కుర్రాళ్లకి ఆయా యూనివర్సిటీలు ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాముల్లో అవగాహన కల్పిస్తారు – మొదటి రోజునే – ఓరియంటేషన్ పేరుతో. ఎందుకంటే ఇతర దేశాల్లోంచి వచ్చేవారు ఏవో సినిమాల్లో కనిపించే దృశ్యాలు చూసి ఈ దేశాల్లో ఏం చేసినా చెల్లిపోతుంది అనుకునే మన:స్తత్వం తో వస్తారనీ, దానిని మార్చడానికో లేకపోతే వేరేగా ‘కల్చరల్ షాక్’ అనేది తెలపడానికీ ఎట్సెట్రా.

    ఒకానొకప్పుడు చిన్నపిల్లని ఎత్తుకుని ముద్దు పెట్టుకోవడం వేరూ, అదే పిల్లని పదేళ్ళు పోయాక ముద్దు చేయడం వేరూ. ఎప్పుడు ఫలానా బట్ట ఊడిపోయిందో నేను గమనించలేదు అనడం పరమ పనికిరాని అబద్ధం. జ్యూరీలోగానీ జడ్జ్ గారు గానీ ఎవరూ నమ్మరు ఇటువంటివి.

    ఈ విషయాల్లో చాలా మంది కటకటాల్లోకి తోయబడ్డా/డుతున్నా రని న్యూస్ లో చూడవచ్చు. తానా వారు దాదాపు ప్రతీరోజూ ఎలుగెత్తి చెప్తున్నారు – ఒరేయ్ ఒళ్ళు దగ్గిరపెట్టుకోండ్రా అంటూ. వీటికోసం ఒక కరపత్రం కూడా తయారు చేసారు. రోడ్డు మీద ప్రమాదాల్లో, ఈ విషయాల్లో, కల్పించుకుంటూ ముందు జాగ్రత్తలు చెప్తున్నా ఎంత గుణం కనిపించిందనేది తెలియదు నాకైతే. ఒకటి మాత్రం నిజం – ఈ విషయాల్లో సహాయం చేస్తున్న తానా వారి పాత్ర మాత్రం అర్ధరాత్రి అపరాత్రి వచ్చే ఫోనులతో ‘ఫ్యూనరల్ డైరక్టర్’ గా తయారైంది.

    ఈ కధలో కెనడా వచ్చినాయన తోడల్లుడి ఇంట్లో చాలాకాలం (అంటే ఒకటి కన్నా ఎక్కువ నెలలు) ఉన్నట్టు తోస్తుంది. అటువంటప్పుడు ఇలా నాకు తెలియదు అంటే ఎవరూ ఒప్పుకోరు. ఇటువంటి విషయాలు చాలా పెద్ద నేరాలుగా పరిగణిస్తారు. అంటే దాదాపు పదేళ్లనుంచి పైకి శిక్షపడే అవకాశం ఉంది. ఎటువంటి ఉత్తరాలు రాసినా అవి ఫైల్లో పెట్టవచ్చేమో కానీ జడ్జ్ గారి ఆఖరి తీర్పు వచ్చేదాకా ఎవరూ వీటిని పట్టించుకోరు – కనీసం నాకు తెలిసినంతలో.

    పై విషయాలు చూసాక కధ చాలా అసహజంగా ఉందండి. రచయిత (అనువాదకుడు కాదు) ఇలాంటి కధ రాసారంటే నమ్మకం కుదరటం లేదు. ఏమనుకోకండి ఇలా మొహమాటం లేకుండా చెప్పినందుకు.

  2. నాకు నచ్చిన పద్యం: సోమన తెలుగు జాతీయాల సొబగు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    10/07/2018 11:53 am

    నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్దామని కానీ రచయితని కించ పరచడానికి కాదని మనవి.

    సంతాన గోపాలం (అర్జునానుగ్రహము) లో విప్రుడికి పుట్టి చనిపోయిన పిల్లలు ఎనిమిది మంది. ఇది ఉషశ్రీగారి భాగవతంలోనూ (అంటే పోతన భాగవతంలోనూ), నారాయణీయంలోను (88 దశకం) ఉంది. వ్యాసంలో రాసినట్టు ముగ్గురు కాదు.

    విప్రుడొచ్చినప్పుడు కృష్ణుడు ఏదో దీక్షలో ఉన్నట్టు ఎక్కడా లేదీ పుస్తకాలలో. అర్జునుణ్ణి పరీక్షించడానికి కృష్ణుడు ఊరుకుంటాడు ఏమీ మాట్లాడకుండా. ఈ లోపునే ‘నేనున్నానుగా’ అంటూ అర్జునుడు మాట ఇచ్చేస్తాడు. ఆ తర్వాత కధ మామూలే – ఏమీ చేయలేక అగ్ని ప్రవేశం చేస్తాననడం, దాన్ని కృష్ణుడు వారించడం. దీనికి నారాయణీయం లో భట్టాత్తిరి గారి విశేష వివరణ ఏమిటంటే “పురుష ప్రయత్నానికీ, పౌరషానికీ దైవ బలం ఆక్కరలేదని అనుకున్నావు కదా అర్జునా, ఇప్పుడేమంటావు?” అని తెలపడానికి.

    మూడో విషయం – అర్జునుడు ఏమీచేయలేక వెనక్కి వచ్చినప్పుడు అతన్ని రధం మీద కూర్చోబెట్టుకుని పెంజీకటికవ్వల కి వీసుకు వెళ్ళినది పై లోకమైన వైకుంఠానికి – పాతాళం కింది లోకం కనక దాని ప్రసక్తి రాదు.

    ఆఖరి విషయం – విప్రుడి పిల్లలని తీసుకెళ్ళిపోయినది యమభటులు కాదు. వైకుంఠంలో ఉండే మునిగణం నా అంశ తో నిండిన నరనారాయణులని చూడాలని కోరితే నేనే విప్రబాలకులని మాయం చేసాను అని మహావిష్ణువు తన అంశ అయిన కృష్ణుడితో అంటాడు కధ సుఖాంతం అయ్యేముందు. యమ ప్రసక్తి ఇందులో రాదు. దేవకి కృష్ణుడికి ముందు పుట్టిన పిల్లలని చూడాలని ఉంది అంటే అప్పుడు కృష్ణుడు యమలోకానికి వెళ్తాడు. ఆ కధ వేరు. అది వ్యాసంలో ఉదహరించిన సంతానగోపాలం లోది కాదు.

    గ్రంధ సూచిక: (1) నారాయణీయము – – కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు (తి.తి.దే 2003)
    (2) ఉషశ్రీ భాగవతం – మహాలక్ష్మీ బుక్ ఎంటర్ ప్రైజెస్, సెప్టెంబర్ 1993.

  3. అహోరాత్రం గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    10/07/2018 11:51 am

    ఉదాహరణకి, ‘ఏకం చక్రం వర్తతే ద్వాదశారం’ – అన్న అశ్వినీసూక్తంలోని మాట. ఈ సూక్తం ఎంత ప్రాచీనమైనదో తెలియదు.

    చంద్రుని గమనంలో అమావాస్య నుండి అమావాస్య దాకా ఉండే 30 రోజులని మాసం అనుకుంటే, దాదాపు అటువంటి 12 మాసాల తరువాత ఋతువులు మళ్ళీ తిరిగి రావడం గురించి ఈజిప్టు నాగరికత కాలం నుంచి మెసోపొటమియా, సింధు నాగరికతల దాకా వ్యవసాయం మీద ఆధారపడిన నాగరికతల వారందరికీ తెలిసినట్టు భావించవచ్చు. 12 మాసాల ప్రస్తావన ఋగ్వేదంలో కూడా ఉంది. ఉదాహరణకు ఋగ్వేదంలోని 7వ మండలము, 103 సూక్తములోని తొమ్మిదవ శ్లోకం చూడండి:

    దేవహితిం జుగుపుర్ ద్వాదశస్య ఋతుం నరో న ప్ర మినంత్యేతే ।
    సంవత్సరే ప్రావృష్యాగతాయాం తప్తా ఘర్మా అశ్నువతే విసర్గం ॥
    (ఋగ్వేదం 7.103.9)

    సంవత్సరానికి 12 మాసాలన్నది దైవనిర్ణయమని, వాటిని చక్కగా నిర్వర్తించినందుకు బ్రాహ్మణులు జరుపుకొనే విజయోత్సవమే సోమ-అతిరాత్ర యజ్ఞమని ఈ శ్లోకాల ద్వారా మనకు తెలుస్తున్నది.

    అయితే, 12 మాసాల గురించి ప్రస్తావన ప్రాచీనంగానే కనిపిస్తున్నా, 12-రాశుల ప్రస్తావన మాత్రం యవనులతో సంపర్కం జరిగిన కాలం తరువాతే కనిపిస్తుంది. గ్రీకు zodiac గుర్తులు, మన రాశుల గుర్తులలో పోలికలే కాక ఈ సిద్ధాంతాల్లో మనకు ఎన్నో గ్రీకు నుంచి అరువు తెచ్చుకొన్న పదాలు మనకు కనిస్తాయి. మచ్చుకు కొన్ని: హోర (Greek: hora, ὥρα), కేంద్ర (kentron, κέντρον), హేలి (helio, ἧλιος) జ్యామితి (dimetron, διάμετρον) మొ॥

    కవిత మీద చర్చ పక్కదారి పట్టినట్టుంది. ఇంతటితో ఆపేస్తాను.

    సురేశ్.

  4. సమవుజ్జీ గురించి సాహిత్ అభిప్రాయం:

    10/07/2018 11:38 am

    గోదారోళ్ల బాష, గ్రామీణ యాసతో ఆద్యంతం ఆసక్తిగా సాగించిన కథనం, కొస మెరుపు బాగున్నాయి. రాచ వారి మర్యాదలు, సంప్రదాయాలు పరిచయం చేసారు రచయిత.

  5. బేతాళ కథలు: కథన కుతూహలం – 5 గురించి టి. చంద్రశేఖర రెడ్డి అభిప్రాయం:

    10/07/2018 7:34 am

    శర్మ గారి సూచనలకు ధన్యవాదాలు.

    నేను ఎన్నుకున్న సంవిధానం’చందమామ’ బేతాళ కథలనుంచి తీసుకున్నది. బేతాళుడు కథ చెప్తాడు. తర్వాత ప్రశ్నలు వేస్తాడు. విక్రమార్కుడు సమాధానాలు ఇస్తాడు. లక్ష్యం విక్రమార్కుడి మౌనభంగం. అది నెరవేరగానే బేతాళుడు అదృశ్యమవుతాడు. విక్రమార్కుడు మళ్లీ బేతాళుడిని మోసుకొస్తాడు. ఇది పునరుక్తమవుతూ ఉంటుంది. నేను రాసిన ఈ బేతాళకథల్లో జరిగింది కూడా ఇదే.

    గణాంకాలని కథలో కూడా ఇమిడ్చి ఉండవచ్చు. అప్పుడది పరిశోధనాపత్రంలా తయారవుతుందనిపించి గమనికగా కథ అడుగున ఇవ్వడం జరిగింది.

    కథలోని ఒక విసురు శర్మ గారికి నచ్చినందుకు సంతోషం.

    టి. చంద్రశేఖర రెడ్డి

  6. అహోరాత్రం గురించి నాగమురళి అభిప్రాయం:

    10/06/2018 10:50 pm

    సురేశ్ గారు,
    హోర అన్న పదం “అ’హోరా’త్రం” నుంచి పుట్టింది అని సాంప్రదాయికులు అంటారు. ఈ కవిత పేరు అహోరాత్రం కాబట్టి, పరాశరుణ్ణి ఉటంకించారు కాబట్టి ఆ మాట వ్రాశాను. అంతకు పైన శబ్ద వ్యుత్పత్తి గురించి ఆలోచించలేదు.

    యవనుల కంటే పూర్వం భారతదేశ ఖగోళశాస్త్రం ఎక్కువగా నక్షత్రాల మీద ఆధారపడిందే తప్ప, రాశుల గురించి చర్చ లేదు

    ఇది నేనూ విన్నదే. కానీ కొన్ని సందేహాలు ఉన్నాయి. ఉదాహరణకి, ‘ఏకం చక్రం వర్తతే ద్వాదశారం’ – అన్న అశ్వినీసూక్తంలోని మాట. ఈ సూక్తం ఎంత ప్రాచీనమైనదో తెలియదు.

    in geo-centric theories, sun takes one day to rotate around earth

    It is not only Sun, all planets (the entire zodiac for that matter) appear to rotate around the earth in just one day due to the diurnal motion of earth. This motion represents the Lagna (rising zodiacal degree in the east), which is the most important, and other houses in Astrology.

    అమూర్తుడు అన్న పేరు నేనూ ఎప్పుడూ వినలేదు. కానీ ఆ పదంద్వారా ముహూర్తం లేక లగ్నాన్ని సంకేతిస్తున్నారనే నా అనుకోలు.

    మొత్తానికి కవితకన్నా నా వ్యాఖ్యానం పెద్దదైనట్టు ఉంది. 🙂

  7. అహోరాత్రం గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    10/06/2018 3:35 pm

    హోర = Hour. ఈ పదం “అ’హోరా’త్రం” నుంచి పుట్టింది.

    నాగమురళి గారు, ఇది సరైన వ్యుత్పత్తి కాదు. యవనుల కంటే పూర్వం భారతదేశ ఖగోళశాస్త్రం ఎక్కువగా నక్షత్రాల మీద ఆధారపడిందే తప్ప, రాశుల గురించి చర్చ లేదు. 12 రాశుల చర్చ అంతా తరువాత గ్రీకు (పారశీక-గ్రీకు), రోమన్ల ప్రభావంతో వచ్చిందే. యవనజాతక, రోమకసిద్ధాంత, హోరాశాస్త్ర మొదలైన గ్రంథాల్లో మనవాళ్ళు వారి వారి సిద్ధాంతాలకు యవన సిద్ధాంతాలు మూలమని కచ్చితంగా చెప్పారు కదా. గ్రీకు, లాటిన్లలో హోర- అన్న శబ్దం కాలసూచిక (సంవత్సరంలో భాగం, దినములో భాగం).

    ఈ కవితలో నెలరోజుల్లో వృత్తం చుట్టబెట్టేవాడు చంద్రుడు అయితే, ఒక్కరోజులో వృత్తం చుట్టబెట్టేవాడు సూర్యుడనుకొన్నాను. అయితే, అమూర్తుడని ఎందుకన్నారో నాగరాజుగారే వివరించాలి. (As you know, in geo-centric theories, sun takes one day to rotate around earth, while moon takes about 30 days).

    ఇవన్నీ మీకు తెలియనివి కాదనుకోండి. మీరు చెప్పిన వ్యుత్పత్తే ఆశ్చర్యం కలిగించి నాచేత ఈ వ్యాఖ్య రాయించింది.

  8. సమవుజ్జీ గురించి Lalitha TS అభిప్రాయం:

    10/06/2018 2:20 pm

    గోదారి యాసలో ఇంత పెద్ద పెద్ద మంచి కథలు…కుళ్ళేహేత్తోందండి మీ రాతల్ని చదూతుంటే!

  9. అహోరాత్రం గురించి నాగమురళి అభిప్రాయం:

    10/06/2018 9:55 am

    హోర = Hour. ఈ పదం “అ’హోరా’త్రం” నుంచి పుట్టింది.

    బృహత్ పరాశర హోరాశాస్త్రం అన్నది భారతీయ జ్యోతిషానికి పునాది. దీన్ని రచించినది పరాశర మహర్షి. వ్యాసుడు, వశిష్ఠుడు, పరాశరుడు మొదలైన పేర్లు ఒక వ్యక్తి పేర్లు కావు. అవి పరంపరాగతంగా వచ్చే ఋషి నామాలు (శంకరాచార్య నామం లాగా).


    ఇక్కడ వృత్తం రాశిచక్రం. అమూర్తుడంటే భూమి దైనందిన చలనంలో ప్రతీ క్షణం ఉదయిస్తున్న ‘లగ్న బిందువు’ లేక ముహూర్తం.

    జ్యోతిషసంకేతాలు మనలోని శక్తులకి సూచికలు.

    ప్రతిక్షణమూ అనేకానేక సంకల్పాలని విత్తులుగా ‘అమూర్తుడు’ వెదజల్లుతూ ఉంటే, మనస్సనే చంద్రుడు వాటిలో కొన్నిటిని ఏరుకుంటాడు. సూర్య, కుజ, బుధ, శుక్రులా విత్తనాలని నాటి, సంరక్షించి, పోషించి, పెంచుతారు.

    వివేకమనే గురుడు పన్నెండేళ్ళ కాలంలో రాశిచక్రాన్ని చుడుతూ, ఆ మొక్కలు ఫలించే మార్గాన్ని సూచిస్తూ ఉంటాడు. ముప్ఫై యేళ్ళ ప్రయాణంలో ఈ వ్యవసాయన్నంతా నిర్వహించుకునే నిబద్ధతే శని.

    ఈ ప్రయాణంలో అనుకోని మార్పులు, అవాంతరాలు, మొత్తంగా తిరగబడిపోవడాలు… తప్పవుగా.. అవే రాహుకేతువులు.

    ఇదీ నాకు అర్థమైనంతవరకు. చాలా బాగుందండీ. గొప్ప ‘దర్శనం’! వేదసూక్తాల్ని గుర్తు చేసింది.

  10. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-5 గురించి K.S.Hareesh Kumar అభిప్రాయం:

    10/05/2018 8:33 pm

    చాలా బాగుంది విశ్లేషణ