పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. హాయిహాయిగా ఆమని సాగే గురించి mOhana అభిప్రాయం:

    07/05/2009 1:51 pm

    వ్యాసం బాగుంది. తిరుపతి మహావీర్ టాకీస్‌లో నేను ఇంటర్మీడియేట్ (పీయూసీకి ముందటి కాలం) చదివే రోజుల్లో ఈ చిత్రాన్ని ఈ పాటకోసం నాలుగుమార్లు
    చూచాను! ఈ పాట ఒక మధురాతిమధురమైన అనుభూతి. అప్పుడే సినీరంగంలో ప్రవేశించినారనో ఏమో ఈ పాటను సుశీలగారిచేత పాడించలేదు రావు గారు. ఇట్టి పాటలను జిక్కీగారు తరువాత తరువాత ఎందుకు పాడలేదో? హిందీ పాటను కింది లింకులో చూచి వినగలరు.
    http://www.youtube.com/watch?v=cQ6sTjW2-O8

    రఫీగారి గొంతు ANRగారికి బాగా సరిపోయింది! దీని తరువాతి హిందీ చిత్రం ఫూలోంకీసేజ్‌లో కూడా మంచి పాటలు ఉన్నా, ఆ చిత్రం బాగా దెబ్బ తిన్నది. ఆ నష్టాల ఎర్ర సిరాను నల్ల సిరా చేయడానికి అంజలీదేవి దంపతులకు దశాబ్దాలు పట్టింది.

    విధేయుడు – మోహన

  2. హాయిహాయిగా ఆమని సాగే గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    07/05/2009 10:51 am

    శ్రీకాంత్ గారూ:

    సంగీతంపై వ్యాసాల రాయటంలో ఉన్న చిక్కుల్లో ఇది ఒకటి.
    ని, నీ స్వరాల్లో మొదటిది కోమలం, రెండోది తీవ్రం అని కాదు. పాటలోని తాళం కోసం ఒక స్వరాన్ని సాగతీయాల్సి రావటమే తప్ప మరేమీ కాదు. యమన్ (కల్యాణి) రాగంలో కోమల స్వరాలు లేవు.

    చరణానికి, చరణానికి మధ్య ఉన్న స్వరాలను వ్యాసం మొదట్లో (నాల్గవ పేరా) లింక్‌లో ఇచ్చాను. అందులో యమన్ రాగంలో ఉన్న స్వరాలను చూడండి. అలాగే పాత సంచికల్లో కల్యాణి (యమన్ ) రాగంపై రెండు వ్యాసాలున్నాయి.

    నిరిగమ ధనిసా ధనిసా
    సనిసగరిగ సరినిసధని
    మధనిస నిరినిరి ధనిధని మధమధ గమగమ గమధనిసా గమధనిసా ధనిసా….

    అన్నీ తీవ్ర స్వరాలే!

    నేనూ సంగీతంలో ఒక పామరుడనే! ఈమాట పాఠకులకు రాగాలపై ఆసక్తి ఎక్కువగానే ఉన్నట్టు తోస్తోంది. వచ్చేసంచికల్లో మరికొన్ని రాగాలు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.

    ప్రసాద్ గారూ:

    ఉత్సాహం ఉన్న వారు తమంత తామే (కొంత శ్రమ పడక తప్పదు) ఈ రాగమాలికలో ఉన్న రాగాల్లో ఉన్న మరికొన్ని పాటలు తెలుసుకుంటారనే కావాలనే వాటి వివరాలు ఇవ్వలేదు. ఉదాహరణకి “సాగర సంగమం” సినిమాలో ఒక పాట హంసానంది (సోహిని) రాగంలో ఉంది. కనుక్కోండి.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  3. పడమట సంధ్యారాగం గురించి MJ Thatipamala అభిప్రాయం:

    07/05/2009 7:58 am

    మంచి కథ. అనుమానం పెనుభూతం అంటారు. ముగింపు బాగుంది, అక్కడ 30సార్లు ఫోను మోగడం, ఇక్కడ 30సార్లు డోరు బెల్లు కొట్టడం, సంధ్య ఇంట్లో లేకపోవటం…
    కథ పేరుకి, కథావస్తువుకి పొంతన కుదరలేదేమో?!

  4. హాయిహాయిగా ఆమని సాగే గురించి Sreekanth అభిప్రాయం:

    07/04/2009 9:39 am

    లక్ష్మన్న గారు,
    చక్కటి వ్యాసం. నాబోటి సంగీత పామరులకు చాలా ఉపయోగపడుతుంది.
    ఒక చిన్న సందేహం. మీరు యమన్ స్వరాలు అన్నీతీవ్ర స్వరాలుగా ప్రస్తావించారు. కానీ, చివరి చరణంలో కోమల మరియు తీవ్ర స్వరాలు వాడారు. ఉదాహరణకు (ని, నీ), (మ, మా). ఇలా ఎందుకు రాసారో దయయుంచి విశదీకరించరూ?
    శ్రీకాంత్

  5. పెట్టె బయట గురించి M.S.Prasad అభిప్రాయం:

    07/04/2009 3:07 am

    కధ చాలా బాగుంది. పాఠశాలలలోల బోధనావిధానాలు మారాలని అందరూ అంటారు గానీ ఎవ్వరు ఆ మార్పును స్వాగతించరు. అలవిమీరిన దురాశ వలన చదువుకొనడం పిల్లలకూ చదువు కొనడం తల్లిదండ్రులకూ దుర్భరమౌతోంది. మా బాల్యంతో పోల్చి చూస్తే నేటి పిల్లల బాల్య పరిస్థితులు జాలి కలిగిస్తున్నాయి.

    భవదీయుడు

  6. కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి? గురించి M.S.Prasad అభిప్రాయం:

    07/03/2009 11:13 pm

    ప్రభావం, అనుసరణ, అనుకరణ అనేవి ఏ మాత్రం తప్పు కాదు. మీ ఈ అభిప్రాయం సరైనదని నేను భావిస్తున్నాను. కవిత్వమే కాదు ఏ శాస్త్ర పురోగతి కైనా ఇవి అత్యంత ఆవశ్యకాలు. ముందు తరాల వారి విజయ రహస్యాలను ఆకళించుకొంటూ, వారి విజ్ఞానాన్ని మనది చేసుకొని దానిని మన తెలివితేటలతో ఇంకొంచెం ఉద్దీపనం చేయడమే పురోగమనం. మీ రిచ్చిన ఉదాహరణలోని రేవతీ దేవి గారు తిలక్ మహాశయుని కవితను చదివిన తరువాతనే తమ కవితను వ్రాసారనుకోండి. అప్పుడు ఆమె తన దైన శైలిలో దానిలోని భావ ప్రకటనా విధానాన్ని ఇంకా మెరుగు పరచారేమో ఆలోచించండి. మెరుగు కాదని కొందరనుకున్నా ఆమెకూ ఆమె లాంటి మరికొంతమందికి అది మెరుగైనదే అని అనిపించవచ్చుగా. అప్పుడు ఆమె తిలక్ మహాశయునితో సమానమైన లేదా మెరుగైన కవయిత్రి అని ఒప్పుకోవలసి వుంటుంది. కాలమొక్కటే ఇటువంటి సందిగ్ధతలను నివారిస్తుంది.

    భవదీయుడు

  7. హాయిహాయిగా ఆమని సాగే గురించి M.S.Prasad అభిప్రాయం:

    07/03/2009 10:12 pm

    శ్రీ లక్ష్మన్న గారికి అనంత కోటి ధన్యవాదాలు
    నేను ఎంతో ఇష్టంగా వినాలనుకొనే 5-6 పాటలలో శివశంకరి (జగదేక వీరుడు) తరువాత పాట హాయి హాయిగా ఆమని సాగే రాగ మాలిక. ఈ పాట పాడడం వాయించడం కొంచెం వచ్చినా పూర్తిగా స్వరాలతో మీరిచ్చిన సమాచారం ఇంకా కొంచెం క్షుణ్ణంగా నేర్చుకొనడానికి సహకరిస్తుంది. దానికి కృతజ్ఞుడిని. దీనితో పాటు ఇందులోని రాగాల పేర్లు వాటి ఆకృతులూ ఇచ్చారు. ఎలాగూ ఈ రాగాల పేర్లు ఇచ్చారు వాటితో పాటు ఆ రాగాలలోని ఇతర ప్రసిద్ధ పాటలు కూడా ఇస్తే ఈ రాగాలను కూడా పరిచయం చేసినట్లుండేది గదా. మీరు గానీ శ్రీ రోహిణీ ప్రసాద్ గురువుగారుగాని మరి కొన్ని రాగాలను పరిచయం చేస్తారని ఎదురుచూస్తుంటాము.

    మరొక్క సారి ధన్యవాదాలతో

    భవదీయుడు

  8. ఈ కానుకనివ్వలేను గురించి Kumara Swamy అభిప్రాయం:

    07/03/2009 8:56 pm

    ఈ కథలో feelings బావున్నాయి. కాని సంఘటన ఏది? మనసును గాయపెట్టే అనుభవం ఉంటే సరిపోతుందా. కథకి ఫార్ములా / ట్విస్ట్ / సర్కిల్ – పరిపూర్ణం కావించబడిన సంఘటన ముఖ్యం. ఈ సంవత్సరం అరుణ గారు రాసిన నాలుగు కథలూ చదివాను. చాలామంది అనుభవజ్ఞులైన మూసకొట్టుడు కథకులకంటే ఆమె బాగా రాస్తున్నారు. ఈ ఒక్క లోపాన్ని అధిగమిచగలిగితే ఆమె నుంచి మరిన్నిమంచికథలను ఆశించవచ్చునేమో.
    Anyway best of luck to Aruna.

    కుమారస్వామి

  9. కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి Subbarao Nanduri అభిప్రాయం:

    07/03/2009 6:46 am

    వాక్యం రసాత్మకం కావ్యం అని నాకు తెలుసు. నిజంగానే అలాంటి వాక్యాల కోసం జీవితకాలం ఎదురుచూడాల్సిరావడం, ఒక నూక గింజకోసం బుట్టెడు ఊకను తినాల్సిరావడం ఇబ్బంది కాదూ?
    కవి కష్టపడి కవిత్వం వ్రాయడం ఎందుకు? సరే కవులకూ , రచయితలకూ కూడా “ప్రసవ వేదన” ఉంటుందని ఒప్పుకుందాం. కానీ అంతవేదనా తన భావాలు పాఠకుడి హృదయానికి హత్తుకొనేలా చెప్పడానికే గానీ పాఠకుడి మేథస్సుకు ప్రహేళికలివ్వడానికి కాదు గదా? మనం కవిత్వం చదవాలంటే దానికి తగ్గ మానసిక నేపథ్యాన్ని సిద్ధం చేసుకొని ఉండాలా? ఇవన్నీ కవులకే ప్రయోజనం కలిగించే ప్రశ్నలు. వీటికి సహేతుకమైన సమాధానం వెతకగలితే కవిత్వం పూర్వవైభవము సంతరించుకుంటుంది. అలా కానప్పుడూ చివరకు నానీలే బదుకుతాయి. అసలు ఆ రకంగా చూస్తే సామెతలకన్నా మంచి కవితా వాక్యాలు దొరకవేమో.

    [ఈ అభిప్రాయంపై వచ్చిన సాటి పాఠకుల అభిప్రాయాలు చర్చావేదికలోకి మార్చాము – సం.]

  10. కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి? గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    07/03/2009 6:27 am

    ఈ వ్యాసంద్వారా కవిత్వాన్ని బహిరంగ, అంతరంగ కవిత్వాలు అని రెండు రకాలుగా విభజించవచ్చని తెలుసుకొన్నాను.
    కవిత్వంలోని టోన్ సన్నగా, బిగ్గరగా ఎలా ఉంటుందో చక్కటి ఉదాహరణనిచ్చారు.
    ధన్యవాదములు.
    బొల్లోజుబాబా